అక్షరాల పలకకి అర్ధాల పగుళ్ళు!

1swatikumari-226x300 

నువ్వు మనసులోపల కొన్ని పదాలతో ఏదో చెప్పుకుంటున్నట్టు ఏడ్చినపుడు, ఆ మాటల చుట్టూ అర్ధాలు తూనీగల్లా ముసురుకుంటాయి. బయటికి పలకబోతుంటే మాటలన్నీ ఆకుపచ్చ ముళ్ళై తడిగా గుచ్చుకుంటాయి.  లేతరావాకంతటి కేక పిట్టగొంతులోంచి  పెగిలినప్పుడు ఆ వినికిడిని ఇంద్రియానుభవంనుండి భాషానుభూతిలోకి మళ్ళించడానికి ఎంత ప్రయత్నించీ ఒక నమ్మదగిన వాక్యం రాయలేననే బాధ కనపడుతుంది ఎమ్మెస్ నాయుడు గారి “ఒక వెళ్ళిపోతాను” కవితాసంపుటిలో. గాలిలా ఎంత దూరం ప్రయాణించి చూసుకున్నా చివరికి కాలం గదిలోనే ఉండిపోయానని తెలుసుకుని తారీఖులు ఉండని తాళాల్ని వేసి ఒక వెళ్ళిపోతాం  అని కాలంతో పాటు భాషపైనా తిరగబడ్డాడు ఈ కవి.

naidu

సంభాషణలేని వాక్యాల కోసం అందరి పెదాల వంక చూసి  విసుగెత్తి  మంచి నిశ్శబ్ధం ఎవరిదగ్గరా లేదనిపిస్తుంది.  పిల్లిలా దుఃఖం మనసుని గీరుతున్నప్పుడు- ఈ రాత్రిని గోడకి తగిలించాను/రేపు బయట పారేస్తాను అనుకుని పడుకోక తప్పదు. నిద్రంటే నిర్విచార స్థితి కాదని, మెలకువలోని స్పృహలు కొన్ని అన్ని వేళలా లోలోపల మేలుకునే ఉంటాయనీ గమనిస్తాడు ఈ కవి. ఎదుటి మనిషి తనని బతికిలేనట్టుగా చూడటం తెలిసినప్పుడు కూడా శత్రుత్వం లేక ’విడిపోవడంలా విడిపోదాం నిష్ఫలితాల్ని ఆశించి’ అని ఒప్పందం చేసుకుంటాడు. ఆ మాటల్లోని పెద్దరికాన్ని తలచుకుని ఎప్పుడైనా అతను బాల్యాన్ని పోగొట్టుకున్నవాడిలా ఏడుస్తుంటాడు. ఏడవకు, అందరం ఉగ్గుగిన్నెంత నవ్వుతో బతకాల్సిన వాళ్లమే అని ఎవరైనా ఓదార్చబోతే ’ముట్టుకోకండి, నేనింకా తడిచిన కాగితాన్నే’ అని తన అంతరంగపు అస్పష్టలోకాల్లోకి అదృశ్యమౌతాడు.

అటువంటి స్పష్టాస్పష్టమైన అధివాస్తవిక కవిత్వంలోకి కాసేపు శబ్ధాల్ని అక్షరాల్లో చూడగల కళ్ళతో వెళదాం…

 

అస్థికలలు

 

అన్నీ గుర్తే

అయినాసరే మర్చిపోయినట్టు గుర్తుంటాయి

 

నీకు నాకు

కదలటానికి జ్ఞాపకాలే రహదార్లు

 

సీతాకోకచిలుక నీడ

ఎగిరిపోతుంది పట్టుకుంటుంటే

 

సముద్రం నీడలో నిద్రపోతున్నాను

తెగిన చెట్టునీడలా నా వాక్యం ఉండొచ్చు

విరమించుకున్న కెరటంలా నా వాక్యం ఉండకపోవచ్చు

 

అనుభవాల్నుంచి అధిగమించామనుకుంటాం

చివరికి వాటి అనువాదాల్లోకే లొంగిపోతాం

 

నాస్తికాస్తిక కలలు రావు

మన అస్థికలే కలలు

 

కొన్నే కన్నీళ్ళు మిగులుతున్నాయి

నీ కివ్వను

—-***——

వ్యాఖ్యానం

 

ఏమిటీ అనుకుంటున్నాను? ఇందాకేదో అనుకున్నానని కదూ! ఏమనుకున్నానో, అది మాత్రం గుర్తుండదు. కొన్నేళ్ల క్రితం ఇక్కడే ఎక్కడో ఎవర్నో వెదుతుకుతూ తిరిగినట్టు, చిన్నప్పుడు ఆ చెట్టు కింద ఏవో ఆటలాడినట్టు “అన్నీ గుర్తే అయినాసరే మర్చిపోయినట్టు గుర్తుంటాయి.”

 

జ్ఞాపకాలన్నీ నీడలే. రంగూ రూపమూ ఉన్న నీడలు. కొన్ని నీడలు దొరక్కుండా సీతాకోకలై ఎగురుతుంటాయి. మరికొన్ని సముద్రపు ఒడ్డులా తేమగాలిని వీచి నిద్రపుచ్చుతాయి. అసలు జ్ఞాపకాలేగా బాటలో అణిగిఉన్న ధూళిలా, రాలిపడ్ద నిన్నటి ఆకుల్లా, కురిసి వెలిసిన వానతడిలా దారి పొడవునా వాతావరణమై, నేపథ్య సంగీతమై, బాటసారి పాటల మధ్య విరామమై నీ నడకకి రహదార్లుగా మారుతుంటాయి.

 

మరి వాక్యాలు, వ్యాఖ్యానాలు? బహుశా కొన్ని వాక్యాలు నిజంగానే బావుండకపోవచ్చు. భావం అనే కుదురునుండి విడిగా తెగిపడి మూలానికి బొత్తిగా అతకని చెట్టులా నిర్జీవంగా ఉండొచ్చు. వాటి అర్ధాల్ని వివరించబోయి పైకెగసి అర్ధాంతరంగా విరమించుకున్న కెరటాల్లా, మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నాన్ని చెయ్యబోయే అలల నురగలా వాటి వ్యాఖ్యానాలు ఉండవచ్చు.

 

ఒక సంఘటన- పరిమళాన్ని పూస్తుందో, గాయాన్ని చేస్తుందో! సుఖమో, వేదనో ఆ సమయానికి అనుభవించాక మిగిలేది అత్తరు మరకలూ, గాయపు మచ్చలేనా? అనుభూతి క్షణికం, దాని తాలూకూ గుర్తులు భౌతికం అనే అనుకుంటాము. ఇగిరిపోయేవీ, మాసిపోవేయీ, మానిపోయేవి కాక ప్రతీ అనుభవం తర్వాత శాశ్వతంగా మిగిలిపోయేది ఒకటుంటుంది. ఈరోజు కనపడే నువ్వు- ఇన్నేళ్ళ నీ అనుభవాల్లోంచి లోపలికి ఇంకిపోయిన అనంతమైన వ్యక్తిత్వ శకలాల సముదాయం. అందుకే “అనుభవాల్నుంచి అధిగమించామనుకుంటాం చివరికి వాటి అనువాదాల్లోకే లొంగిపోతాం”.

 

చుట్టూ అంతా ఉన్నప్పుడు “లేకపోవడమెలా ఉంటుందో” అని ఊహించవచ్చేమో. కానీ ఏమీలేనితనంలో, లేదన్న నమ్మకంలో ఏదైనా ఎప్పుడైనా ఉండటాన్ని ఊహించడం. అసలా ఊహించడమన్న భావనే ఊహాతీతం. అందుకే నాస్తికాస్తిక కలలు రావు.

 

అస్తమానం అవసరపడతాయి. పెద్దరికం తెచ్చుకున్న కొద్దీ పిడికెడైనా దొరక్క ఇంకిపోతాయి. నిస్సహాయతలో, ఒంటరితనంలో ఒకటో అరో సాయమొచ్చి ఆదుకుంటాయి. ఇన్నేళ్ళ నడకలో రాళ్లలో, ముళ్లలో ఎంతో ఖర్చయిపోయాయి. అందుకే “కొన్నే కన్నీళ్ళు మిగులుతున్నాయి నీ కివ్వను.”

—***—-

 

Download PDF

4 Comments

  • కోడూరి విజయకుమార్ says:

    మంచి కవత ను పట్టుకుని రాసారు స్వాతి గారూ … అభినందనలు …మా నాయుడు ‘ఒక వెళ్లి పోతాను’ సంకలనం లో నాకు బాగా నచ్చిన కవితలలో యిది ఒకటి … “అనుభవాల్నుంచి అధిగమించామనుకుంటాం చివరికి వాటి అనువాదాల్లోకే లొంగిపోతాం” … ఎంత బాగా చెప్పాడండీ !

  • రమాసుందరి says:

    లోతైన కవిత్వం. అందమైన వ్యాఖ్యానం.

  • Anil says:

    గుడ్ రివ్యూ…నాయుడు ఒక మంచి కవి….

  • వంశీ says:

    నైస్ వర్క్ స్వాతి గారు.,. ఒక వెళ్ళిపోయాగ్గానీ అర్ధం కావు కొన్ని ..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)