నువ్వు కట్టిన చీర…!

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

జలధి విలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ

తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ

ద్గళదురుఘర్మవారికణ కమ్ర కరాబ్జము వట్టి నూతిలో

వెలువడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్

                                               -నన్నయ

(శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

కీర్తిమంతుడైన యయాతి, మధురధ్వని చేస్తూ చలించే అలలనే  ప్రకాశించే వడ్డాణాన్ని ధరించిన భూమిని మోయడానికి సమర్థమైన తన కుడి చేతిని చాచాడు. విపరీతంగా చెమట బిందువులు జారుతున్న పద్మం లాంటి అందమైన చేతిని అందుకుని  ప్రేమతో ఆ కోమలిని నూతిలోంచి పైకి తీశాడు.  

***

మహాభారతాన్నేనా?!… కాదు; నన్నయ, తిక్కన, ఎర్రనల కథన శైలిని కూడా నేనిప్పుడు పునర్దర్శిస్తున్నాను. ఇంగ్లీష్ లో దీనిని re-invention అంటారనుకుంటాను.  ఈ మాటకు పునర్దర్శనం, పునరావిష్కారం అనే మాటలు సరైన తర్జుమా అవుతాయో కావో చెప్పలేను.  ఎర్రన రాసింది అరపర్వమే కావచ్చు కానీ, ఆయన అనువదించిన ధర్మవ్యాధోపాఖ్యానం చదువుతూ ఎంత ఆశ్చర్యానందాలు చెందానంటే, ఆ పుస్తకం మార్జిన్ లో అప్పటికప్పుడు ఆయనకు నా సాష్టాంగవందనాలు రాసుకున్నాను. ఆ ఘట్టాన్ని విశ్లేషిస్తూ ఆ తర్వాత ఒక పెద్ద వ్యాసం రాశాను.

ఇక, నన్నయ కథనంలో చక్కదనం ఎక్కువైతే, తిక్కన కథనంలో చిక్కదనం ఎక్కువని నాకు అనిపిస్తుంది. అలాగని, నన్నయ కథనంలో చిక్కదనం, తిక్కన కథనంలో చక్కదనం ఉండవని కాదు. ఒకటి మాత్రం అనకుండా ఉండలేను. నాలుక మీద నాట్యమాడే (quotable) పద్యాలు తిక్కనవి కంటే నన్నయవే ఎక్కువ. ఇప్పుడాలోచిస్తే నన్నయకు ఇవ్వవలసినంత ఘనత ఇచ్చామా అన్న సందేహం కలుగుతుంది. తెలుగులో ఆదికృతిని ఇవ్వడమేకాదు, వెయ్యేళ్లను మించి సరిపోయే పద్యం నమూనాను అందించినవాడు నన్నయ్యే. తెలుగుపద్యం సొగసులన్నీ నన్నయ ఉచ్చిష్టాలే నని  నేను అంటాను. అనంతరకవులందరూ నన్నయ పద్యంలోని మెళకువలనే కొల్లగొట్టారు. అయితే, ఎంత కొల్లగొట్టినా నన్నయవంటూ కొన్ని ప్రత్యేకతలు అలాగే మిగిలిపోవడం విశేషం. ఆ మధ్య నన్నయ విషయంలో ఒక ఘోరమైన వాదం ముందుకు వచ్చింది. తెలుగు భాషకు ప్రాచీనతా ప్రతిపత్తిని ఇవ్వాలంటే, నన్నయకు ముందే తెలుగులో కవిత్వం ఉందని నిరూపించాలి కనుక, అందుకు నన్నయకు ఉన్న ఆదికవి బిరుదు అడ్డువస్తోంది కనుక, ఆదికవి పీఠం నుంచి నన్నయను తొలగించి పారేయాలని కొంతమంది పెద్దలే ఉద్ఘాటించారు. కవి పట్ల ఒక జాతి కృతఘ్నతకు ఇంతకంటే పరాకాష్ట ఉండదు. ఏమైతేనేం, ఆ విపరీతవాదం మరింత పుంజుకుని మన మరుగుజ్జుతనం ప్రపంచానికి తెలిసేలోపల తెలుగు భాషకు ప్రాచీనతా పట్టం లభించి, నన్నయ ఆదికవిపీఠానికి ప్రమాదం తప్పింది!

అయితే, నన్నయ భారతానువాదంలో కొరతగా అనిపించేవి లేకపోలేదు. ముఖ్యంగా మూలంలోని గణసమాజ అవశేషాలను ఆయన అనువాదం కొన్ని చోట్ల గమనించుకోలేదు. కథను సంక్షేపించడంలో కావచ్చు, మరో కారణంతో కావచ్చు, మూలంలోని కొన్ని ముఖ్యమైన వివరాలను ఆయన పరిహరించాడు. అదలా ఉంచి, తిక్కనను తక్కువ చేశానని ఎవరూ అనుకోవద్దు. అంతకన్నా అపచారం ఉండదు. యుద్ధపర్వాలలో ఆయన విశ్వరూపాన్ని చూడగలం. తిక్కనలో నాటకీయత గురించి అందరూ మాట్లాడుతుంటారు. నిజానికి తిక్కన అనువాదం సినిమేటిక్ అంటాను. ఆయనది గొప్ప స్క్రీన్ ప్లే! ఎవరైనా తిక్కన రాసిన మహాభారత ఘట్టాలను సినిమా తీయదలచుకుంటే ఆయన రచననే యథాతథంగా స్క్రీన్ ప్లే గా వాడుకోవచ్చు. అయితే, ఒక షరతు… స్క్రీన్ ప్లే రచయితగా ఆయన పేరు వేసి తీరాలి!

రాస్తున్నది మహాభారతం గురించి కనుక మనసారా ఇలా మహాకవి స్మరణ చేసుకుని ప్రస్తుతానికి వస్తే…

కచుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట అనేకమంది కన్యలను వెంటబెట్టుకుని దేవయానితో కలసి వనవిహారానికి వెళ్లింది. అంతా తమ చీరలు గట్టున పెట్టి ఓ సరస్సులో జలక్రీడలాడారు. అంతలో పెద్ద సుడిగాలి వీచింది. చీరలన్నీ కలసిపోయాయి, గట్టు మీదికి వచ్చి చీర కట్టుకునే తొందరలో శర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది. దాంతో దేవయాని మండిపడింది. ‘లోకోత్తర చరిత్ర కలిగిన శుక్రుని కూతురిని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన బ్రాహ్మణకులంలో పుట్టినదానిని, ఇప్పుడు నువ్వు కట్టి విడిచిన మైల చీర నేను కట్టుకోవాలా?’ అంది.

ఆ మాటకు శర్మిష్ట అహం దెబ్బతింది. ‘నీ తండ్రి మా అయ్య దగ్గర పని చేస్తూ, దీవిస్తూ, ప్రియమైన మాటలు చెబుతూ ఉంటాడు. నీ గొప్పలు నా దగ్గరా, సిగ్గులేకపోతే సరి, నేను కట్టిన చీర నువ్వెందుకు కట్ట కూడదట?!’ అని నిందించి, అంతటితో కోపం తీరక దేవయానిని ఒక నూతిలోకి తోసేసి, కన్యలతో కలసి ఇంటికి వెళ్లిపోయింది.

yayati1

ఆ సమయంలో వేటకు వచ్చిన రాజు యయాతి, ఆ అడవంతా తిరిగి అలసిపోయాడు.  మంచినీళ్లు తాగుదామని దేవయాని పడున్న నూతి దగ్గరకు వచ్చాడు.  లోపలికి తొంగి చూశాడు. కన్నీరు నింపుకుంటూ, ఒక పెద్ద తీగను పట్టుకుని ఉన్న దేవయాని కనిపించింది. ‘నువ్వు ఎవరిదానివి? ఈ నట్టడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?’ అని అడిగాడు. తాము ఎప్పుడూ విహారానికి వచ్చే ఆ అడవికి యయాతి వేటకు రావడం ఇంతకుముందు చూసింది కనుక దేవయాని అతన్ని గుర్తుపట్టింది.  ‘దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను తన సంజీవినీవిద్యతో బతికించే అమితశక్తిమంతుడైన శుక్రుని కూతుర్ని నేను. నా పేరు దేవయాని. పొరపాటున ఈ నూతిలో పడి బయటికి రాలేకపోతున్నాను. నన్ను పైకి లాగి రక్షించు’ అంది. అప్పుడు యయాతి తన కుడి చేతిని ఆమెకు అందించి పైకి తీశాడు. ఆ తర్వాత తన దారిన తను వెళ్లిపోయాడు.

అంతలో ఒక పరిచారిక దేవయానిని వెతుక్కుంటూ వచ్చింది.  దేవయాని ఆమెతో, ‘నేను వృషపర్వుని పురంలోకి  అడుగుపెట్టను. శర్మిష్ట నాకు చేసిన అవమానం గురించి వెళ్ళి నా తండ్రికి చెప్పు’ అని చెప్పి పంపేసింది. సంగతి తెలిసి శుక్రుడు పరుగుపరుగున వచ్చాడు. కోపంతో సుడులు తిరుగుతున్న కళ్ళలో నీరు కుక్కుకుంటున్న కూతుర్ని చూసి అన్నాడు.  ‘వేయి యజ్ఞాలు చేసినవాడి కన్నా కోపం లేనివాడే గొప్పవాడు. ఇతరులు కోపించినా కోపించకుండా, నిందించినా మారు మాట్లాడకుండా, అవమానించినా మన్సులో తలవకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు. బుద్ధిమంతులు కోపాన్ని గొప్ప చేయరు. శర్మిష్ట రాచకూతురు, చిన్నది, దానితో నీకేమిటి, ఇంటికిరా’ అన్నాడు.

‘ఎలాంటివారినీ లక్ష్యపెట్టకుండా హద్దు మీరి నిందించే బుద్ధిలేని వాళ్ళ దగ్గర ఉండడం కన్నా నీచమేముంటుంది, నేనా వృషపర్వుని పురంలోకి రాను, ఇంకెక్కడికైనా పోతాను’ అని దేవయాని భీష్మించింది. ‘సరే, నీ కంటే నాకింకెవరున్నారు, నేనూ నీతోనే వస్తాను, పద’ అని శుక్రుడు అన్నాడు. చారులద్వారా వృషపర్వునికి విషయం తెలిసింది. హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. ‘మీ విద్యాబలంతోనే రాక్షసులు దేవతలను జయించి స్థిరమైన సంపదనూ, ఉద్ధతినీ పొందగలుగుతున్నారు. లేకపోతే, దేవసేనాపతుల దెబ్బకు సముద్రం పాలయ్యేవారే. ఈ సంపదంతా మీది, ఈ రాక్షసులంతా మీ వాళ్ళు’ అని శుక్రునితో అని, దేవయానితో, ‘తల్లీ నీ కేది ఇష్టమో చెప్పు, అది ఇస్తాను’ అన్నాడు. దేవయాని సంతోషించి, ‘అయితే, శర్మిష్టను, ఆమె వెంట ఉండే కన్యలతో సహా నాకు దాసిని చెయ్యి’ అంది. వృషపర్వుడు అంగీకరించి అప్పటికప్పుడు కూతుర్ని అక్కడికి రప్పించి దేవయానికి దాసిగా ఇచ్చేశాడు. శర్మిష్ట మారు మాట్లాడకుండా తండ్రి ఆదేశాన్ని శిరసావహించి, తనతో ఉన్న కన్యలతోపాటు తను కూడా దేవయానికి దాసిగా సేవలు చేయడం ప్రారంభించింది.

ఈ కథంతా చెప్పాలా, మహాభారతంలో మేము చదువుకోలేమా అని పాఠకుల్లో కొందరైనా ఈపాటికి అనుకుంటూ ఉండచ్చు. అయితే, ప్రధానంగా రెండు కారణాలతో ఈ కథ చెబుతున్నాను. మొదటిది, కథనంలో నన్నయ చూపించిన మెళకువలు! పాత్రల స్వభావచిత్రణనే తీసుకోండి. నన్నయ కథ చెప్పుకుంటూ వెడతాడు తప్ప, ఫలానా పాత్ర స్వభావం ఇదీ అని చెప్పడు. కథాగమనంలోనే దానిని ధ్వనింపజేస్తాడు. శుక్రుడి స్వభావం గురించి కొంత ఇంతకుముందే చెప్పుకున్నాం. అతనికి దేవయాని ప్రవర్తన నచ్చడం లేదు. అయినా ఆమెపై మమకారం అతనిలోని వివేకం పీక నొక్కేస్తోంది. ఇంటికి రానని కూతురు కబురు చేసేసరికి కలవరపడుతూ పరుగు పరుగున ఆమె ఉన్న చోటికి వెళ్ళాడు. ‘కోపం పనికి రాదు, శర్మిష్ట రాచకూతురు, చిన్నపిల్ల, ఆమెతో నీకేమి’ టని చెప్పిచూశాడు. దేవయాని వినలేదు. ‘అయితే, సరే నీతోనే నేనూ’ అన్నాడు. శర్మిష్ట తన కూతురిని అవమానిస్తుందా అనుకుని కూతురిలా అతను  ఆవేశపడలేదు. ఆమె రాచకూతురు అనడంలో అతనిలో తారతమ్యాల స్పృహ ఉంది, చిన్నపిల్ల అనడంలో  పెద్దరికంతోపాటు, ఆమె కూడా తన కూతురిలాంటిదే నన్న వాత్సల్యభావన ఉంది. శర్మిష్టపై శుక్రునికి ఉన్న ఒక ప్రత్యేక ఆదరభావం ముందు ముందు కూడా వ్యక్తం కాబోతోంది.

ఇక్కడ శుక్రుడు-దేవయాని; వృషపర్వుడు-శర్మిష్ట అనే రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య ఉన్న తేడాను గమనించండి. దేవయానిది తండ్రిని శాసించే స్వభావం. శర్మిష్టది తండ్రి శాసనాన్ని మౌనంగా తలదాల్చే స్వభావం. దేవయానికి తండ్రి రాజకీయ అవసరాలమీదా, ఇబ్బందుల మీదా ఖాతరు లేదు. శర్మిష్టకు ఉంది. దేవయానిని నిందించి నూతిలో తోసే సమయంలో ఆ ఖాతరు లేకపోయినా,  ఆ తర్వాత తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో  ఆమెకు అర్థమయ్యుంటుంది.  వృషపర్వుని రాజకీయ అస్తిత్వంలో శుక్రుడు ఒక ముఖ్యమైన భాగం. వృషపర్వుని అస్తిత్వం, మొత్తం రాక్షసుల అస్తిత్వం. తను దూరం ఆలోచించకుండా క్షణికోద్రేకంతో తప్పు చేసింది. ఆ తప్పుకు తండ్రి విధించే శిక్షను కిమ్మనకుండా అనుభవించవలసిందే!

శుక్రుడికి దేవయానిపై ఉన్నంత మమకారమే వృషపర్వునికి శర్మిష్టపై ఉంటుంది. అయినా సరే, రాక్షసుల విశాల అస్తిత్వం కోసం కూతురి సుఖాన్ని బలిచేయడానికి అతను మనసు రాయి చేసుకోక తప్పదు. కూతురి విషయంలో శుక్రుడు ఎక్కడైతే ఓడిపోయాడో  వృషపర్వుడు అక్కడే గెలిచాడు. ఈ  రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య తేడా ఇంకా ఎలాంటిదంటే; గణం నిర్బంధాలు, అవసరాలు ఏమీ లేని వైయక్తిక స్వతంత్ర వ్యవహారశైలి శుక్ర-దేవయానులది. గణ నిర్బంధాలు, ప్రయోజనాల పంజరంలో అస్వతంత్రను పాటించక తప్పని స్థితి వృషపర్వ-శర్మిష్టలది. ఒక్క మాటలో చెప్పాలంటే, గణం వెలుపల కూడా జీవించగలిగిన వెసులుబాటు శుక్ర-దేవయానులకు ఉంది. గణం వెలుపల వృషపర్వ-శర్మిష్టలకు జీవితం లేదు.

కథనంలో కవి ఇంకా ఎన్ని మెళకువలు చూపాడో చూడండి…దేవయాని-శర్మిష్టల వైరానికి తక్షణ కారణం, శర్మిష్ట కట్టి విడిచిన చీర దేవయాని కట్టుకోవలసి రావడం. నువ్వు కట్టిన మైల చీర నేను కట్టుకోవాలా అని శర్మిష్టను నిలదీసింది. ఆ సమయంలో కులాహంకారం ఆమెలో ఎంతగా పడగవిప్పి బుసకొట్టిందంటే, భవిష్యత్తులో దానికి ఆమె ప్రతిఫలం చెల్లించుకోవలసి వచ్చింది. నీ మైల చీర నేను కట్టుకోవాలా అని ప్రశ్నించిన దేవయానే ముందు ముందు తను కట్టుకున్న పురుషుని శర్మిష్టతో కలసి పంచుకోబోతోంది. అంటే, శర్మిష్ట ఎంగిలి చేసినదాన్నే తనూ అనుభవించబోతోందన్నమాట.

ప్రకృతి సమవర్తి. అతి ఎక్కడున్నా సహించదు. ఎక్కడో ఒకచోట సమతూకాన్ని స్థాపించి తీరుతుంది.

‘నువ్వెవరివి, ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నా’వని యయాతి అడిగిన సందర్భంలో, పొరపాటున తను నూతిలో పడ్డానని దేవయాని అబద్ధమాడిన సంగతి గమనించండి. దేవయాని గడుసుదనానికి అదొక నిదర్శనం. శర్మిష్ట అనే రాచకూతురు తనను నూతిలోకి తోసిందని చెబితే, యయాతి ఆలోచన ఆమె వైపుకి మళ్లిపోతుంది. బహుశా తనకంటే శర్మిష్ట అందగత్తె, పైగా రాచబిడ్డ.  ఆ సమయంలో ఆమె పేరు తను ఎత్తడమంటే, ఆమెను తనే తీసుకెళ్లి రాజు చేతుల్లో పెట్టడమే. శర్మిష్ట తనను నూతిలోకి తోసేసి వెళ్ళిన తర్వాత, అంతటి అవమానంలోనూ, దుఃఖంలోనూ కూడా దేవయాని బుద్ధి చురుగ్గా పనిచేస్తోందన్న మాట. శర్మిష్ట రాచవైభవాన్నే కాదు; అది తెచ్చిపెట్టే అతిశయాన్నీ, అహంకారాన్ని కూడా దేవయాని ఇప్పుడు దగ్గరగా చూసింది. శర్మిష్టపై ఆమెకు ఆక్షణంలో ఆగ్రహమే కాదు, అసూయ కూడా ఉంది. దానికి తోడు కచుడు తనను నిరాకరించి వెళ్ళిన నేపథ్యం ఉంది. నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడడన్న కచుని శాపం కూడా ఆమె ఆలోచనల్ని వెంటాడుతూ ఉండచ్చు. నూతిలో పడున్న ఆ క్షణాలలోనే శర్మిష్ట చేసిన అవమానమూ, కచుని శాపమూ కలసి రాజును పెళ్లాడాలన్న సంకల్పాన్ని ఆమె బుద్ధిలో బలంగా నాటి ఉండచ్చు. సరిగ్గా ఆ సమయంలోనే  యయాతి రంగప్రవేశం…

కథనంలో ఇలా నన్నయ చూపించిన మెళకువలను చర్చించడం ఈ మొత్తం కథను ఏకరవు పెట్టడానికి మొదటి కారణమైతే, ఇక రెండో కారణానికి వస్తాను. ఈ కారణం మొదటిదానికంటే కీలకమే కాక, అత్యంత ఆసక్తికరం కూడా. పైన వివరించుకున్న కథలోనే కథకుడు పాత్రల స్వభావాలను, కథ తిరగబోయే మలపులను నేరుగా చెప్పకుండా అక్కడక్కడ ధ్వనింపజేశాడనుకున్నాం. విచిత్రమేమిటంటే, ఇంకో కోణం నుంచి చూసినప్పుడు, ఈ మొత్తం కథానిర్మాణమే ఇంకో కథను ధ్వనింపజేస్తోంది! ఆ కథలో నాయిక దేవయాని కాదు, శర్మిష్ట! పై కథను ఓసారి గమనించండి…అది దేవయాని పరంగా చెబుతున్నట్టు మనకు అనిపిస్తుంది. దేవయానే కథానాయికగానూ అనిపిస్తుంది. కానీ కథలో అంతర్లీనంగా ధ్వనించే అసలు కథ వైపు చెవి యొగ్గి జాగ్రత్తగా వినండి. అది శర్మిష్ట పరంగా చెబుతున్న కథ అని మీకు అర్థమవుతుంది.

అవును, నిజం. అతిగా మాట్లాడే దేవయాని ఈ కథలో నాయిక కాదు…మితంగా మాట్లాడే శర్మిష్టే నాయిక!

ఈ కథ ఫలశ్రుతిని గమనించినా శర్మిష్టే ఈ కథకు నాయిక అని అర్థమవుతుంది.

మిగతా కథ తర్వాత…

 –కల్లూరి భాస్కరం

 

 

Download PDF

4 Comments

  • chintalapudivenkateswarlu says:

    భాస్కరం గారు!
    మీ కథలో ఒక విషయం అర్థం కాలేదు. శర్మిష్థ ఎంగిలి చేసిన చీర(మొగుణ్ణి) దేవయాని కట్టిందా లేక దేవయాని ఎంగిలి చేసిన చీర శర్మిష్ఠ కట్టిందా? దుష్యంతుని చేసుకుంది దేవయానే కదా! దేవయాని చాలా కాలం అనుభవించి పిల్లలను కన్నతరువాత కదా శర్మిష్ఠ అనుభవించింది!

    • కల్లూరి భాస్కరం says:

      వెంకటేశ్వర్లుగారూ, దుష్యంతుడు కాదు; యయాతి. ఇక మీ సందేహానికి వస్తే, శర్మిష్టతో యయాతి కాపురం చేసిన తర్వాత కూడా దేవయాని కాపురం చేసింది కదా! దాని అర్థం ఏమిటి?

  • రఘురాములు తుమ్మలపల్లి says:

    భాస్కరంగారూ,
    తిక్కన స్క్రీన్ ప్లే తో సినిమా తీసే మాటేమోగానీ నర్తనశాల సినిమాలో బోలెడు పద్యాలు వాడుకున్నా టైటిల్స్ పాపం తిక్కన పేరు వేయనే లేదు.

    • కల్లూరి భాస్కరం says:

      అవును, రఘురాములు గారూ, బాగా గుర్తుచేశారు. పాండవ వనవాసంలో అనుకుంటాను, నన్నయ పద్యాలను వాడుకున్నారు. నన్నయ పేరు వేసినట్టు జ్ఞాపకం లేదు. కవుల మీద మనవాళ్ళకు ఖాతరు తక్కువ. ఇంతకీ మీరు మా పాత్రికేయసహచరులు కాదు కదా?!. అయితే, ఈ తాజా పలకరింపు మరింత సంతోషకరం

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)