గోవర్ణం

ravinder

Pasunoori Ravinder 1‘‘కట్టుబట్టల కోసమార నువ్‌ పట్నంలున్నది? సిగ్గుండాలె! నీకంటే చిన్నచిన్నోల్లు ఎంత ఎదిగిన్రు!  ఓ సర్కారీ నౌకర్‌ లేదాయే! ఇంత యిల్లుపొల్లు ఉన్నట్టన్న లేదాయే. మా బతుకేదో ఇట్లా బతుకుతున్నం. పదేండ్ల కిందట పట్నం పోతివి. ఏం సంపాదించనవ్‌ రా?! పెండ్లం పిల్లలతో కలిసి ఊరు మీద పడి తిరుగుడుకే సరిపోతున్నట్టున్నది నీ సంపాదన. థూ…నువ్‌ మారవురా!’’ తల్లి మాటలు మళ్లీ మళ్లీ యాదికొస్తున్నయి నగేష్‌కు.

తన తల్లి అలా ఫోన్‌లో గత మూడు నాలుగేండ్లుగా.. ఎప్పుడూ కాకపోయినా, అప్పుడప్పుడైనా తిడుతూనే ఉంది. నగేష్‌కు ఈ తిట్లన్ని తినీతినీ అలవాటైపోయినై.

కానీ, ఏం చేస్తడు? తిట్టినప్పుడల్లా తల్లికి ఎదురు చెప్పలేక, తల్లి చెప్పినట్టు నడుచుకోలేక తనలో తానే అంతర్మథనం చెందుతున్నాడు!

అయినా ఏ తల్లి అయినా బిడ్డల మేలుకోరే కదా తిడుతది! ఈ విషయం నగేష్‌కు కూడా తెలుసు! కానీ, పట్నంలో ఒక సొంతిల్లు ఉంటే తల్లికోపం చల్లారి శాంతిస్తదని తెలుసు తనకు. చూస్తుంటే భూముల రేట్లకు రెక్కలొస్తున్నయి! అందుకే ఇక ఆలస్యం చేయకుండా, అర్జంటుగా ఓ ఫ్లాటు కొనాలనుకున్నాడు. కొందాంలే, తీసుకుందాంలే అని ఇంతకాలం లైట్‌ తీసుకున్నాడు. కానీ, ఎప్పుడూ తిట్టే దానికన్నా ఇవాళ డోసు మరింత పెరిగిపోయే సరికి నగేష్‌కు పొద్దుపొద్దున్నే తిట్ల సుప్రభాతంతో నగేషుకు జ్ఞానోదయమైంది.  ఇక ఆగేదేలేదనుకున్నాడు. దాచుకున్న పైసలకు, కొంత బ్యాంక్‌ లోన్‌ తీసుకుంటే సరిపోతుందనుకున్నాడు. కానీ, ‘‘కట్టింది కొనడమా, లేక తన అభిరుచికి తగ్గట్టు సొంతంగా కట్టించుకోవడమా’’ అన్న మీమాంసతో ఇంతకాలంగా ఊగిసలాడుతున్నాడు. ఈ సంగతి తల్లికి చెప్పాలనుకున్నడు. కానీ, చెప్పే  టైమిస్తేనా…

అసలే ఇప్పుడు  హైదరాబాద్‌లో ఫ్లాటు కొనడమంటే మాటలా?! రియలెస్టేట్‌ బూమ్‌ పెరిగిన తర్వాత తనలాంటి మిడిల్‌ క్లాస్‌ సంసార జీవులకు, సొంతిల్లు కలలా కాదు, అరికాలులో ముల్లులా తయారైంది.

అందుకే చాలాసార్లు  ‘‘మనుషులకు  ఇల్లు అనే నాలుగుగోడల నరకం లేకుండా ఉంటే బాగుండు’’ అనుకున్నాడు నగేష్‌. ఇల్లు లేకుండా జీవించే సంచార జీవుల్లాగా మనుషులందరూ హాయిగా, ఊళ్లు తిరుగుతూ గడిపితే ఎంత బాగుండు. అయినా తిరగడంలోనే జ్ఞానమున్నదని ఎక్కడో చదివిన జ్ఞాపకం నగేష్‌కు. మనుషులందరూ అట్లా చెట్టు, పుట్టులు పట్టుకొని తిరుగుతుంటే ఈ రెంట్ల బాధలు, కరెంట్ల బాధలు ఎందుకుంటయి? ముఖ్యంగా తన తల్లితో ఇట్లా రోజూ తిట్లుపడే బాధ ఎందుకుంటది?!  సొంతింటి బాధ ఎక్కువైనప్పుడు ఓ పెగ్గుకొడితే గానీ నిద్రపట్టని పరిస్థితి నగేష్‌ది! తాగినప్పుడైతే ఇంటి గురించి నగేష్‌కు పూనకమే వస్తది! ‘‘అసలు భూముల రేటెందుకు పెరిగింది? రింగురోడ్డు ఎవడెయ్యమన్నడు? రియలెస్టేట్‌కు రెక్కలు ఎవడు తొడిగిండ్రా ఆఆఆఆఆఆ….’’అంటూ ఊగిపోతూ లోలోపల రగులుతున్న ఆవేదన్నంతా తన ‘గ్లాస్‌మేట్స్‌’తో పంచుకుంటాడు.

ఈ మధ్య తన ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్నాడు. నగేష్‌ ఉండే కాలనీలో  అపార్ట్‌మెంట్‌లు,  ఎండిపెండెంట్‌ హౌస్‌లు మొదలుకొని రోడ్డు పొడుగునా ఏ అందమైన బిల్డింగ్‌ కనపడినా ఇక తనకు మూడినట్టే!

‘‘అబ్బా ఈ బిల్డింగ్‌ చూడండి! ఎంత బాగుందో’’ అని భార్యంటే,

‘‘మనమూ ఇంత పెద్ద యిల్లు కట్టుకుందాం డాడీ’’ అని, పదంతస్థుల అపార్ట్‌మెంటును చూపిస్తూ తన కూతురు అనన్య అనే మాటలు విన్నప్పుడల్లా కారులోంచి దూకి పారిపోదామనుకుంటాడు నగేష్‌!.

భార్య, కూతురు గోల సరిపోనట్టు, ఇక తన ఆరేళ్ల ముద్దుల కొడుకు అన్వేష్‌ ఎక్కడ ఖాళీ ప్లేస్‌ కనిపిస్తే చాలు… ‘‘డాడీ ఈ ప్లేస్‌ సూపర్బ్‌ కదా, ఇక్కడే మనమొక ఇల్లు కట్టుకుంటే మస్తుంటది’’ అంటాడు. ఆ క్షణంలో నగేష్‌కు కొడుకులో ఒక కబ్జాకోరు కనిపిస్తాడు! ఎక్కడ ల్యాండ్‌ కనపడితే అక్కడ ఇండ్లు కట్టుకుంటూ పోవాలనే కోరిక చిన్నపిల్లలకు కూడా ఎలా అలవాటైందో తనకు ఎంతకూ అంతుపట్టదు. కాలమే అట్లున్నదని, లోలోపలే చిన్నగా నవ్వుకుంటాడు.

ఇట్లా ఇంటిపోరు తనకు కంటిమీద కునుకే కాదు, ఒంటిమీద సోయిని కూడా తగ్గిస్తున్నది. ఏం తింటున్నాడో, ఎంత తింటున్నాడో తెలుస్త లేదు. ఎలాగైనా సరే ఓ యిల్లు కొనుక్కోవడమో, కట్టుకోవడమో చెయ్యాలని బలంగానే అనుకున్నాడు. ఇక ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్లని, ఫ్రెండ్స్‌ని, ఆఫీసులో తన బాసుల్ని అందరినీ వాకబు చేయడం మొదలుపెట్టాడు. తన ఫ్రెండ్స్‌, కొలిగ్స్‌ అయితే ‘‘పిల్ల పుట్టకముందే, కుల్లకుట్టినట్టు’’  ఫ్లాట్‌ కొనకముందే పార్టీలడుగుతున్నారు. నగేష్‌కు వాళ్ల గొంతెమ్మ కోర్కెలు వింటే, ఓవైపు ఒళ్లుమండినా చిరునవ్వుతోనే ‘‘సరే ష్యూర్‌’’ అంటూ సమాధానాలు చెప్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల నడుమ ఓ రోజు లంచ్‌టైమ్‌లో, ఆఫీసులున్న టీవీలో ఓ ప్రకటన కనిపించింది.

‘‘సులభ వాయిదా పద్దతిలో మీ సొంతింటి కలని నిజం చేసుకోండి. ఇవాళే మీ ఫ్లాట్‌ని బుక్‌ చేసుకోండి! గమనిక ముందుగా బుక్‌ చేసుకున్నవాళ్లకి ఒక గోల్డ్‌కాయిన్‌ కూడా ఫ్రీ, త్వరపడండి. మంచి అవకాశం మించినా దొరకద’’ని సినిమాస్టార్లు కూడా అందులో హొయలుపోతూ చెప్తున్నారు.

ఆ యాడ్‌ చూసి నగేష్‌, ఒక్కసారిగా బంపర్‌ ఆఫర్‌ దొరికిందనుకున్నాడు. పైగా తన భార్యకు  కూడా బంగారమంటే పీకల్లోతు పిచ్చి. ప్రతీనెల క్రమం తప్పకుండా బంగారం కొందామంటూ పోరుతూనే ఉంటది. సరే బంగారం ముచ్చట ఎలా ఉన్నా, ఒకసారి ఆ వెంచర్‌ చూసొద్దామనుకున్నాడు. వెంటనే తన ఫ్రెండ్‌ మురళికి కాల్‌ చేసి, ఇద్దరం వెళ్ళి రేపొకసారి వెళ్లి  ఆ వెంచర్‌ చూసొద్దామన్నాడు.

రాత్రి ఇంటికి చేరగానే కనీసం షూస్‌ కూడా విప్పక ముందే, సోఫాలో కూర్చొని తన భార్యకు టీవిలో కనిపించిన యాడ్‌కు సంబంధించిన వెంచర్‌ గురించి చెప్పాడు. నగేష్‌కు ఇది అలవాటే! ఆఫీసు నుండి వచ్చి రావడంతోటే ఆ రోజు జరిగిన సంగతులన్నీ భార్య సౌమ్యతో పంచుకుంటాడు. నవ్వుకునే విషయాలకు నవ్వుకొని, ఫీలయ్యే అంశాలకు ఫీలవుతూ షేరు చేసుకుంటారు! అసలే ఓ వైపు సౌమ్య కూడా అత్తపాటకు కోరస్‌ కలిపి ఇంటి గురించి పోరుతూనే ఉంది. అందుకే నగష్‌ ఫ్లాట్‌ కొనక ముందే కొన్నంత ఉత్సాహంతో సౌమ్యకు చెబుతున్నాడు! అన్నీ లైట్‌ తీసుకుంటారని తనపై నిందలేసే సౌమ్య ముందు తన శీలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డాడు.  ‘‘ఇన్‌స్టాల్‌మెంట్‌ వీలు కూడా ఉంది తెలుసా?’’ అని ఉత్సాహంగా చెప్పాడు.

‘‘హమ్మయ్య పోన్లేండి,  ఇదైనా కన్‌ఫార్మ్‌ అయితే అంతే చాలు’’ అంది. ఫ్రెష్‌ అయిన తర్వాత భోజనం చేస్తున్నా మనసంతా వెంచర్‌ చుట్టే తిరుగుతోంది నగేష్‌కు. అన్ని  ఇంటి గురించే ఆలోచనలు. ‘‘కొంచెం మెయిన్‌ రోడ్డుకు దగ్గర ఉండేలా చూసుకుంటే మంచిది. యిల్లు మాత్రం మన టేస్టుకి తగ్గట్టు కట్టించుకోవాలబ్బా! వెంటిలేషన్‌   బాగా ఉండేలా చూసుకోవాలి. ఇంటిముందు లాన్‌లో రకరకాల పూలమొక్కలు పెంచుకోవాలి. ఇన్ని రోజులు ఈ కిరాయి కొంపల్లో ఏ చెట్లు పెంచుకుందామన్నా వీలే కాలేదు’’ అనుకున్నారు.

ముఖ్యంగా తన కొడుక్కి మామిడి చెట్లంటే ఎక్కడలేని ప్రేమ! వాడికి ఎండాకాలమంటే మామిడిపండ్లు తప్ప మరొకటి కాదు. అందుకే వాడికోసం మంచి రసాలూరే పళ్లనిచ్చే మాంచి మామిడిచెట్లు తెచ్చి నాటుకోవాలనుకున్నాడు. ఇక హాల్‌ విషయానికొస్తే కొంచెం విశాలంగా ఉండాలి. కనీసం ఓ పదిమంది ఫ్రెండ్స్‌ వచ్చినా కంపోర్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. గదిలో పెద్దపెద్ద అందమైన పెయింటింగ్స్‌ పెట్టుకోవాలనుకున్నాడు నగేష్‌. అంతేకాదు హాల్‌లో  అల్ట్రా మాడ్రన్‌ సోఫాసెట్‌ ఉంటే ఆ హుందాయే వేరనుకున్నాడు.

అలా బెడ్‌ మీద నడుంవాల్చాడో లేదో, నగేష్‌ భార్య సౌమ్య నెమ్మదిగా నోరువిప్పి…

‘‘ఏమండీ నాదొక చిన్నకోరిక! మీరు కోప్పడొద్దు మరి..’’ అని వరమడుగుతున్నట్టే అంది.

ఏంటన్నట్టు చూశాడు నగేష్‌.

‘‘ఏం లేదు. ఎలాగు మనం ఓపెన్‌ ఫ్లాట్‌ తీసుకోబోతున్నం కదా, యిల్లు కట్టించేటపుడు పైన రూఫ్‌గార్డెన్‌ ఉండేలా ప్లాన్‌ చేయాలండీ’’  అని కొంచెం సిగ్గుపడుతూ గారంగా చెప్పింది.

సౌమ్య కోరిక విన్న నగేష్‌కు ఆ క్షణంలో భార్యను చూస్తే ఫ్లాట్‌ కొనకముందే, పార్టీ అడిగిన ఫ్రెండ్స్‌లాగే కనిపించింది.  అసలే ఓ వైపు తన పరెషాన్‌ తనకున్నది. ఎన్ని లక్షలంటారో, దానికి జీహెచ్‌ఎంసీ లే అవుట్‌ ఉందో లేదో, డౌన్‌లోడ్‌ పేమెంట్‌ కింద ఎంత కట్టమంటారో అని ఏవేవో ఆలోచిస్తుంటే…రూఫ్‌గార్డెనట, రూఫ్‌గార్డెన్‌ అని లోలోపలే అనుకున్నాడు. కానీ, ఆ ఫీలింగ్‌ బయటికి కనిపించకుండా కవర్‌ చేసుకున్నాడు.

పడుకునే ముందు పంచాయితీలెందుకని ‘‘సరేలే చూద్దామన్నాడు’’.

 story picture

 

* * * * *

 

 

ఈలోపు ఆఫీసులో నగేష్‌ పోస్ట్‌ కంటే పై పోస్టుకు ప్రమోషన్‌ ఆఫర్‌ ముందుకొచ్చింది! దీంతో నగేష్‌ ఫ్లాట్‌ కలను మరికొన్ని రోజులకు పోస్ట్‌పోన్‌ చేసుకోక తప్పలేదు! జీవితమంటే ఇంతే. దేని ప్రియారిటీ దానిదే! ఇది తప్ప మరేది ముఖ్యం కాదనిపిస్తది! కానీ, అంతలోనే మరేదో అత్యవసరం దూసుకొని వస్తది. మనముందే నిలబడి తేల్చుకొమ్మని సవాల్‌ విసురుతయి పరిస్థితులు. ఇప్పుడు నగేష్‌కు కూడా ఈ పరిస్థితే ఎదురైంది.  కానీ, కార్పోరేట్‌ కంపెనీలో ప్రమోషన్‌ అంటే మాటలా?! సాలరీకి సాలరీ, హోదాకి హోదా కలిసిసొస్తయి కదా అనుకున్నాడేమో నగేష్‌. అందుకే ప్రమోషన్‌కు కావాల్సిన ఎక్సిపీరియెన్స్‌ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకున్నాడు. అసలే ఆ పోస్ట్‌కు తనతో పాటు ఓ పదిమంది వరకు కాంపిటేషన్‌లో ఉన్నారు! పైగా తన బ్యాక్‌గ్రౌండ్‌ వేరు! మిగిలిన సోషల్‌ స్టేటస్‌ వేరు! అందుకే లోపలెంత టెన్షన్‌ ఉన్నా  కాన్ఫిడెంట్‌గా  ఇంటర్వ్యూకి అటెండయ్యాడు నగేష్‌! ఇంటర్వ్యూస్‌ అయిపోయాయి, రిజల్ట్స్‌ రాకముందే కొలిగ్స్‌ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

‘‘ఖచ్చితంగా ప్రమోషన్‌ నీదే బాస్‌’’అంటున్నారు కొలిగ్స్‌.

కానీ, నగేష్‌కు అన్ని అర్హతలు ఉన్నా, ఉండాల్సిన మరో అదనపు అర్హతొకటి లేదు!  కొలిగ్స్‌ మాటలు ఎలా ఉన్నా, నగేష్‌కు మాత్రం ఏదో ఓ మూలన అనుమానం కలుగుతూనే ఉంది. పైగా ఇంటర్వ్యూ పానెల్‌ హెడ్‌ సుబ్రహ్మణ్యంకు తనపట్ల పెద్దగా సాఫ్ట్‌ కార్నర్‌ ఏమీలేదు! ఎంత డెడికేషన్‌తో పనిచేసినా నగేష్‌ను ఏనాడు పట్టించుకోలేదు!

అయినా కొలిగ్స్‌ ఊదరగొడుతున్న తీరుకు నగేష్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

తరతరాల నుండి పుట్టెడు పేదరికం అనుభవించిన చీకటి గతం! లైఫ్‌లో కొత్త పొద్దుకోసం వెయ్యికళ్లతో ఎదురుచూపు. ఈ ప్రమోషన్‌ వస్తే ఇంటికల కూడా తీరిపోతుందనుకున్నాడు.

సరే రిజల్ట్స్‌ తెలిసేలోపు ఫ్లాట్‌ సంగతి పట్టించుకోవాలనుకున్నాడు! వెంచర్‌కు వెళ్ళొచ్చాడు!

వెహికిల్‌ స్టార్ట్‌ చేశాడు. ప్రపంచం ఇవాళ వింతగా కనిపిస్తోంది. వదిలిపోయిందనుకున్న చీకటినీడ తనను తరుముతూనే ఉంది. అయినా దాని ఉనికి నుండి తప్పించుకొని, రోజులు దాటిస్తున్నాడు నగేష్‌!

కానీ, ఈ రోజు అనుభవం తన గతాన్ని మరోసారి కళ్లముందుకు తెచ్చింది.

ఇందులో తన తప్పేంటి?

సాటి మనిషిలాగే తాను జీవించాలనుకోవడం తప్పా?!

కానీ, తనకే ఈ ప్రత్యేకమైన వలయాలు ఎందుకు అడ్డమొస్తున్నయో అర్థం కావడం లేదు!

ఆ వలయాన్ని దాటే కదా ఈ పట్నానికి వచ్చింది. కానీ, ఇంత పెద్ద సిటీలో కూడా మరోసారి తనని ఆ ముళ్ళకంచె గాయపరిచింది. కుదుట పడుతున్న జీవితంలో కొత్త అలజడి రేపింది.

మనసులో లక్షల ఆలోచనలు సుడులు తిరుగుతున్నయి. మనసంతా ఏదోలా ఉంది. అవమానభారంతో హృదయం అల్లాడుతోంది. ఔను ఆఫీసులో ఎన్ని లెక్చర్లు! సైన్స్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌ అంటూ ప్రజెంటేషన్‌లు. అయినా తనకు ఎదురైన ఈ పరిస్థితి ఏ టెక్నాలజి దూరం చేయగలదు. ఏ  శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు ఏ పరిష్కారం చూపగలవు. కాలం మారుతోంది. టెక్నాలజి కొత్తపుంతలు తొక్కుతోంది.

కానీ, మళ్లీ ఎక్కడికి పరుగులు తీస్తున్నట్టు?

ఇక తమకు విముక్తే లేదా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆలోచనలు గింగిర్లు కొడుతున్నాయి.

నగేష్‌ మనసు ఆత్మీయుల అంత్యక్రియలకు వెళ్ళొచ్చినట్టయ్యింది! ఏడ్చి ఏడ్చి నీరసించిన మనిషిలా ఇంటికి చేరుకున్నాడు నగేష్‌.

ఏ రూట్లోకెళ్లి వచ్చింది? ఎంత ట్రాఫిక్‌ని ఫేస్‌ చేసింది మరిచేపోయాడు.

మదినిండా ఆ అనుభవం తాలూకూ ఆలోచనలు అంతగా నిలిచిపోయాయి.

అప్పటికే సౌమ్య పిల్లల్ని పడుకోపెట్టి నగేష్‌ కోసం ఎదురుచూస్తోంది.

నగేష్‌ ముఖంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది!

కళ్లు ఎర్రగా మారాయి. ప్రశాంత మనసు సముద్రంలో అకాల సునామేదో చెలరేగినట్టున్నడు.

ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. కానీ, డోర్‌ దగ్గరే అడగడం ఎందుకనుకుంది.

డిన్నర్‌ కూడా చేయకుండానే బెడ్‌ మీద నడుంవాల్చి కళ్లు మూసుకున్నాడు నగేష్‌.

ఏమైందని మెల్లగా కదిలించింది సౌమ్య.

‘‘ఏం చెప్పాలబ్బా?! మనమంటే మారుమూల గ్రామం నుండి వచ్చినం.

అక్కడంటే ఏదోలా బతికనం. అవమానాల్ని  గుండెకిందే దాచుకున్నం. కానీ, ఇక్కడైనా తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవిద్దామంటే వీలైత లేదు.’’ అన్నాడు నగేష్‌

సౌమ్యకు అయోమయంగా ఉంది. నగేష్‌ ఏం మాట్లాడుతున్నాడో, దేని గురించి ఇంతలా బాధపడుతున్నాడో అర్థం కాలేదు.

‘‘ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా?!’’

‘‘గొడవేం లేదు’’

‘‘మరి ఏం జరిగింది’’

ఇద్ధరి మధ్య మాటలు కరువైతున్నయి. నగేష్‌కు అప్పటికే గొంతు పూడుకుపోయింది.

అయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతటి బాధనైనా, చిన్న చిన్న సంతోషాలనైనా తను ముందు చెప్పుకునేది సౌమ్యతోనే.

అలాంటిది ఇవాళ్టి ఆ అనుభవం సౌమ్యకు చెబితే బాధపడుతుందేమో అని కాసేపు మౌనంగా ఉండి పోయాడు. కానీ, భరించలేని బాధను మిత్రులతోటో, కుటుంబ సభ్యులతోటో పంచుకుంటేనే కదా, సగం బరువు దిగిపోయేది. పైగా ఇది మరెవ్వరికో చెప్పుకోలేడు! అయినా ఈ మహానగరంలో సౌమ్యకంటే ఆత్మీయులెవరు తనకు? అందుకే కష్టంగానైనా నోరువిప్పాడు.

‘‘మనం ఫ్లాట్‌ తీసుకుందామనుకున్న వెంచర్‌ ఆఫీసుకు వెళ్ళొచ్చాను సౌమ్య.

‘‘గోవర్ణధాత్రి’’ అని భారీ హోర్డింగ్‌లు పెట్టి ఉన్నాయి. చాలా పెద్ధ వెంచర్‌ కదా అని  లోలోపలే ఆనందపడ్డాను. వెహికల్‌ ఒక పక్కన పార్క్‌ చేసి, వెంచర్‌ లోపలికి వెళ్లాను.  ఆఫీసు అంతా సంప్రదాయబద్ధంగా ఉంది. ఆఫీసు బయట అన్నీ హిందూ దేవతల ఫోటోలే దర్శనమిచ్చాయి. ఏ ఫోటోలు ఉంటే, ఏముంది? మనకు కావాల్సింది ఫ్లాట్‌ అనుకొని ఆఫీసులో అడుగుపెట్టాను.

అగరొత్తుల ధూమం ఆలయానికి తక్కువ, ఆఫీసుకు ఎక్కువలా ఉంది!

నిలువుబొట్టు పెట్టుకున్న పెద్దాయన అద్ధాలు సవరించుకుంటూ కనిపించాడు. ఓ చిరునవ్వు చిందించి, ఆయన టేబుల్‌కి ముందున్న కుర్చీలో కూర్చున్నా. ఆఫీసులో ఎవరిపనిలో వారున్నారు.

పరిచయం చేసుకొని. ‘‘వెంచర్‌ డీటెయిల్స్‌ చెప్తారా ఒకసారి’’ అని అడిగాను.

నిలువుబొట్టు ఒక్కో విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించింది.

‘‘ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఫ్లాట్‌ కొనుక్కోవడం పూర్వజన్మ సుకృతం అనుకోండి!’’ అన్నాడు.

నిజంగా అంత బాగుంటుందా?! అయితే అమ్మ తిట్లకు ఇక తెరపడ్డట్టే అనుకున్న.

ముందు చెల్లించాల్సిన మొత్తంతో పాటు 18నెలల్లో చెల్లించాల్సిన మొత్తం అన్నీ లెక్కలేశాడు నిలువు బొట్టతను. నేను ఔనా అన్నట్టు చూస్తుండిపోయాను. వివరాలన్ని విని ‘‘హమ్మయ్య, ఇక ఇంటిబాధ తీరబోతుందని ఒక దీర్ఘశ్వాస తీసుకున్నా.

‘‘సరేనండీ రేపొకసారి మా ఆవిడతో పాటు వచ్చి స్పాట్‌ చూసి చేరుతామండీ’’ అని చెప్పిన.

‘ఓకే’ అన్నది నిలువుబొట్టు.

సరే అని ఇక రిటర్న్‌ అవుదామనుకున్న.

అంతలోనే నాకు వాళ్ల యాడ్‌లో ప్రకటించిన గోల్డ్‌ కాయిన్‌ విషయం గుర్తొంచింది.

‘‘మరిచేపోయాను గోల్డ్‌కాయిన్‌ విషయం చెప్పనే లేదు’’ అన్న ఓ చిరునవ్వుతో.

‘‘కాయినెక్కడికి పోతుందిగాని…మరో ముఖ్యమైన విషయం నగేష్‌ గారు..’’ అని సంశయిస్తున్నట్టే అన్నది నిలువుబొట్టు!

మళ్ళీ ఏం చెప్తాడోనని ‘చెప్పండి’ అని కుర్చీలోనుండి లేవబోయేవాణ్ణి ఆగిపోయాను!

‘‘ఏమీ లేదండీ. మీరు బ్రాహ్మలే కదా?’’ అని నిలువుబొట్టు అనుమానంగా అడిగింది.

అప్పటిదాకా నాలో ఉన్న ప్రశాంతత ఒక్కసారి చెరిగిపోయి, గాలిదుమారమేదో మొదలైనట్టనిపించింది.

నాకు కాసేపు మాటలు రాలేదు. ఆ ప్రశ్న అసందర్భంగా అనిపించింది.

అయినా నీకు తెలుసు కదా, కులం విషయంలో ఔట్‌రైట్‌గా మాట్లాడడమే యిష్టం నాకు.

కులాన్ని దాచిపెట్టి, దాని గుట్టును కాపాడడం నాకు ఎంతమాత్రం ఇష్టముండదు.

అందుకే వెంటనే ‘‘లేదండీ….మేం ఎస్సీలం’’ అని సమాధానం చెప్పిన.

ఆ సమాధానానికి నిలువుబొట్టు ముఖం చిట్లించుకున్నది!

‘‘సారీ అండీ… ఈ గోవర్ణధాత్రి వెంచర్‌లో ‘‘కేవలం బ్రాహ్మణులకు మాత్రమే’’ ఫ్లాట్లు అమ్ముతున్నాం. అదర్‌ కమ్యూనిటీస్‌ వాళ్లకు కాదండీ!’’ అన్నది నిలువుబొట్టు!

నాకు ఒక్కసారిగా షాక్‌ అనిపించింది.

సిటీల్లో కూడా కులముంటదని ఇల్లు కిరాయికి వెతుకుతున్నప్పుడే అనుభవం అయ్యింది.

కానీ, అది ఇంత వెర్రిపోకడ పోతుందని ఇన్ని రోజులు తెలియలేదు.

ఇలా బిజినెస్‌లల్లో కూడా ఒక కులానికే ఫ్లాట్లమ్ముతున్నారని ఇవాళే తెలిసొచ్చింది. ఆ వెంచర్‌ మీదే కాదు, మొత్తం క్యాస్ట్‌ సిస్టమ్‌ మీద నాకు ఉమ్మేయాలనిపించింది. ఇట్లా సపరేటుగా ‘‘అగ్రహార అపార్ట్‌మెంట్‌లు’’ కట్టి, కులాన్ని మరింత పెంచి పోషించడం దారుణం అనిపించింది. మనం ఎటు పయనం చేస్తున్నం? 21వ శతాబ్దమేనా ఇది? సిటీ అంతా కులాల బేస్‌డ్‌గా కాలనీలు ఏర్పడితే, ఇంకేమైనా ఉందా?! అనిపించింది.

అంటే మనలాంటి కిందికులాలను మళ్లీ ఊరవతలో, సిటీ అవుట్‌ స్కట్స్‌కో పరిమితం చేయడానికి గోవర్ణధాత్రి  వెంచర్‌ల రూపంలో ‘‘మనువు మరోసారి పుట్టాడని’’ అర్థం అయ్యింది.

రక్తం సలసల ఉడికిపోయింది. ఊపిరి వేగం పెరిగింది…అందుకే నిలువుబొట్టును  నిలదీయకుండా ఉండలేకపోయిన.

‘‘బ్రాహ్మలకు కాకుండా వేరే కులాలకు ఫ్లాట్లు అమ్మం అని మీరు ముందే చెప్పాలి కదా!  మీ ప్రకటనలో ఉండాలి. లేకుంటే ఇక్కడికి వచ్చినవాళ్లనైనా మొదటే ఆ  ప్రశ్న అడగాలి. పూర్వజన్మ సుకృతమని. . తొక్కాతోలు అని పనికిరాని మాటలన్ని చెప్పి, ఇట్లా మోసంచేయడమెందుకు? అయినా ఒక్క కులం వాళ్లకే అమ్మడం ఏంటండీ దారుణం కాకపోతే..’’అని చెడామడా తిట్టిన.

నిలువుబొట్టు మాత్రం ఇదంతా రోజూ జరిగేదే అన్నట్టు, చప్పుడు చేయకుండా తేలుకుట్టిన దొంగలా  కూర్చుంది కాసేపు. ‘‘మమ్మల్నేం చెయ్యమంటారండీ మా మేనేజ్‌మెంట్‌ ఎట్లా చెప్పితే, అలాగే కదా చెప్పాలి మేం’’ అన్నది నిలువుబొట్టు. దాంతో నాకు మరింత కోపమొచ్చింది. ‘‘మీ మేనేజ్‌మెంట్‌కే చెప్పండి, కార్పోరేట్‌ కాలంలో కూడా కులాన్ని పట్టుకొని వేళాడాలనుకుంటే వేళాడమనండీ. కానీ, అనవసరంగా మిగిలిన కులాలవాళ్లు  ఇక్కడిదాకా వచ్చే విధంగా రాంగ్‌ డైరక్షన్‌ ఇవ్వకండి! ఛీ ఇంతకంటే అనాగరికం మరొకటి లేదు’’ అని బయటికొచ్చిన.

ఇలా నగేష్‌ తనలో రగులుతున్న బాధనంతా ఆవేదనతో చెబుతుంటే సౌమ్య కూడా విస్తుపోయింది.

ఇద్ధరూ కాసేపు సైలెంట్‌ అయిపోయారు.

సౌమ్య నిశ్చేష్టురాలైంది.

పిల్లల వైపు చూసి, రేపు వీళ్లు కూడా ఎన్నిసార్లు ఇలా కుల అవమానాలు పడాలో అని ఆలోచనలో పడ్డది. ఐదో క్లాస్‌ చదువుతున్న తన కూతురు మొన్న ఈ మధ్యే  ‘‘మన కాస్ట్‌ ఏంటిమమ్మి? అసలు కాస్ట్‌ అంటే ఏంటి మమ్మి’’ అని అడిగింది.

ఎందుకురా అంటే, స్కూళ్లో మా టీచర్‌ ఒకాయన అడిగారు , అలాగే క్లాస్‌మెట్స్‌ అడుగుతున్నారు మమ్మీ అంది!

మళ్ళీ నగేష్‌ చెప్తున్నాడు.

గోవర్ణధాత్రి వెంచర్‌లో జరిగిన ఈ అవమానం చాలనట్టు, ఆఫీసులో ప్రమోషన్‌ కూడా, పేరు చివర తోకలున్న వాడికే ఇచ్చారట! మురళి కాల్‌ చేసి చెప్పాడు’’ అని కళ్లు మూసుకున్నాడు నగేష్‌.

కాలం మారింది కదా అనుకుంటే పొరపాటే!

పరాయి గ్రహాలకు వెళ్లడం కాదు, మనుషులు మళ్లీ మధ్యయుగాలకు ప్రయానిస్తున్నట్టుగా అనిపించింది!!

కులం పోయిందని, కులం లేదని మూర్ఖంగా వాదించే వాళ్లను, ఈ ‘‘గోవర్ణధాత్రి వెంచర్‌’’కు తీసుకొచ్చి రుజువు చేయాలనుకున్నాడు నగేష్‌.

డా.పసునూరి రవీందర్‌

 చిత్రరచన: బంగారు బ్రహ్మం,అక్బర్ 

Download PDF

28 Comments

  • RAJAN MANCHALA says:

    మంచి కథను అందించిన రచయిత కు అభినందనలు
    కులం దేశంలో లేనేలేదు అని చెప్పడం వరకే కాని కనిపించని ముసుగులో అది సమాజాన్ని దహించివేస్తుంది .
    చుట్టూ చూపించి మొదటికి వచ్చినట్టుగా నీ ముక్కు ఏది అంటే తిప్పితిప్పి చూపించినట్టుగా ఉంటుంది . ‘‘గోవర్ణధాత్రి వెంచర్‌’’ లాంటి సంసతలకు నగేష్‌ చెంపపెట్టు వంటిది .

  • buchireddy gangula says:

    యీ దోపిడీ వ్యవస్థ లో — మనిషి బతుకాలంటే
    కులం– మతం– దేవుడు — ఉండే తీరాలి —–నేటికి మన దేశం లో
    ముస్లిమ్స్ అనగానే పరాయి వాళ్ళ గా — చూడటం- —-మాట్లాడటం
    చూస్తున్నాం —నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది —
    కులం లేనిది ఎక్కడ డాక్టర్ గారు — అమెరికా లో కూడా — నేటికి
    రంగు బేధం లేకపోలేదు — యిక మన ప్రవాసుల్లో — ఆదాయం ను బట్టి
    కులాలు — తేడాలు ఉన్నాయి — డాక్టర్ ల ధీ ఒక కులం — ఇంజనీర
    ల ధీ ఒక కులం– కంప్యూటర్ వాళ్ళది ఒక కులం లా గ — అన్నింటికీ మూలం డబ్బు — డబ్బు
    సీమంధ్ర వొళ్ళు — తెలంగాణా జనాన్ని చూసినట్లు— అమెరికా లో కూడా –ఉన్నోళ్ళు– లేనోళ్ళ ను
    చూసే తీరు అలాగే ఉంది —
    మాలో కుల బేధం లేదు అని చెప్పడం వరకే —అన్ని రాజకీయ నినాదాల లాగ —
    కథ బాగుంది సర్
    —————-బుచ్చి రెడ్డి గంగుల

  • కాలం మారింది కదా అనుకుంటే పొరపాటే!…
    కాలం మారుతూనే వుంటుంది.. మనమే మారం.. మారం
    తోకల్ని వదలం..

  • Dinesh says:

    సిటి లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు నీ కథ ద్వారా చెప్పావు. ఈ కథ ద్వారానైనా సమాజంలో మార్పు వస్తే బాగుండు.

  • buchireddy gangula says:

    నాయుడు గారు
    కాలం మారుతేనే ఉంటుంది — జగమెరిగిన సత్యం
    తోకలు ఉండటం — కారణం డబ్బు డబ్బు
    ఆర్థిక వత్యాసాలు ఉన్నంత కాలం– — తేడాలు
    బేధాలు—నా కులం– నా మతం– నా దేవుడు — ఉంటాయని
    నా ఒపీనియన్ —
    అమెరికా లో వై .ఎస్. ర ను గాంధిజీ ని చేస్తున్నారు– డబ్బు మాట్లాడుతుంది
    శాసిస్తుంది — నడిపిస్తుంది — కాదా నాయుడు గారు
    ——————బుచ్చి రెడ్డి గంగుల

  • మహానగరంలో ప్రతి అపార్టుమెంటు బిల్డింగూ ఒక అగ్రహారంగానే వెలసిల్లుతున్నాయి. అది కన్వీనియంటుగా ఉన్నోళ్ళు కళ్ళుమూసుకుని మన సంస్కృతి గొప్ప అనుకుంటున్నారు, వివక్ష కనిపించి అనుభవించినవాళ్ళు కనీసం కథగానైనా రాసుకుంటున్నారు.

  • krishna kumar says:

    ఈ కాలంలోకూడా కులం ఎలా వేళ్ళూనుకుంటుందో ర‌చ‌యిత బాగా చెప్పారు.
    ఇది ఆధునిక ద‌ళిత క‌థ‌, వ్యథ‌!
    మంచిక‌థ‌. కానీ, బుచ్చిరెడ్డి, జ‌య‌శ్రీ‌నాయుడు లాంటి వాళ్లు వాళ్ల తోక‌ల్ని వ‌దులుకోనంతకాలం కులం పోదు.
    మాన‌సిక ప‌రివ‌ర్తన మ‌న నుంచే మొద‌లు కావాలి క‌దా…

  • gade venkatesh says:

    కథా చాల గొప్పగా ఉన్నది. dr పసునూరిది
    ఇలాంటి సున్నితమైన విసయలను రాయడంలో, దానిని మనసుల్లోకి తీసుకొనిపోయి ఆలోచింపచేయడం పసునురికే చెల్లుతుంది

    .

  • Nagesh says:

    రవీందర్ బాగుంది ….. నేను చూసాను… కేవలం ఈ కులం వారికే అని….. అలా సిటీ లలో కూడా ఎలాంటివి జరుగుతూనే ఉన్నవి … దానికి బాధపడటం వేస్ట్.. ఏది ఏమైనా మంచి సబ్జెక్టు .. బాగుంది ….. కీప్ ఇత్ అప్.. అండ్ అభినందనలు…..

  • Thirupalu says:

    సమాజ వాస్తవికతను బయట పెట్టారు. తోకల వాళ్ళు ఆ తోకలే లేకుంటే మరి ఏ తోక నీడ కింద బ్రతుకుతారు. రానున్నడి బహు గడ్డు కాలం. నిన్న మొన్న ప్రభుత్వ కళా శాలల్లో చదువుకొని ఉద్యోగ్గర్దులైన తరం మల్లి వెనక్కి పోవలిసిమ్దే ! తప్పదు. సామ్రాజ్య వాద ఫాసిజం దేశీయ ఫ్యుడలిజమ్ చెట్ట పట్టలేసుక తిరుగుతున్నాయి. ఇవాళ ప్లాట్లును మాత్రమే కులంతో వ్యాపారం చేస్తున్నారు. రేపు ?

  • mythili abbaraju says:

    కులం పోయిందని ఎవరన్నారు ? దరఖాస్తు పత్రం లో రాయనక్కరలేని రోజు కోసం ఇంకా ఎదురుచూపులు మాత్రమే ఉన్నాయి. ఈ కథలో ఇది చెప్పి గీసుకునే పరిధి, చెప్పకుండా గీసేవి చాలా చోట్ల చాలా విధాలుగా ఉన్నాయి. ఆహారపు అలవాట్లు ఒకటే అయి ఉన్న కులాల మధ్య కూడా వివక్ష ఉండటం ఎవరికీ కనపడదా? అస్తమానమూ ఒకే కులానికి ఎందుకు గురిపెడుతున్నారు? అదే విధమయిన కాంట్రాస్ట్ మళ్లీ మళ్లీ , ఎప్పటికీ !

  • somaraju says:

    “కులం కులం అని కొట్టుకు సచ్చే మనుషులు నీ కథ చదివైన మనుషులుగా మరాలని కోరుకొంటున్న” అన్న
    కథ చాల బాగుంది.

  • somaraju says:

    “కులం కులం అని కొట్టుకు సచ్చే మనుషులు నీ కథ లాంటి నిజాన్ని చదివైన మనుషులుగా మరాలని కోరుకొంటున్న” అన్న
    కథ చాల బాగుంది.

  • buchireddy gangula says:

    Krishna కుమార్ గారు —
    తోకలు ఎక్కడ కనిపించాయో —-రాసిన యి మెయిల్ ను
    మరిఒక్కసారి చదవండి — సర్
    —————-బుచ్చి రెడ్డి గంగుల

    • Thirupalu says:

      బుచ్చి రెడ్డి గారు ,
      మిమ్మల్ని బుచ్చి అంటే బాగుంటుంది రెడ్డిని వదిలేసి! ఇది తోక కాదటమ్డీ

  • swatee Sripada says:

    కుల వివక్ష ఒక కులానికే పరిమితం కాదు . మర్చిపోదామన్నా మరువనివ్వని వ్యవస్థ మనది. అందరూ సమానమే నని కులం ప్రసక్తి లేని జీవితం ఎంచుకున్నా ప్రతి పనిలో మాటలో లేని కుల దర్పాన్ని అంటగట్టి , నీ కులం వేరంటూ పెళ్ళైన నలభై ఏళ్ళ తరువాత కూడా వేలివేసినట్టు చూసే కుటుంబాన్ని , జీవితాన్ని చూశాను. ఇహ మార్పు ఎక్కడ ఈ విష చక్రం మరో ప్రళయంలో మునిగి పోయి కొత్త లోకం ఆవిర్భవించే వరకూ ఇంతే. కధలు కధలుగానే చెప్పుకోవాలి

  • rajesh khanna says:

    చాల బాగుంది . రోజు రోజుకి తన స్వరూపాన్ని మార్చుకుంటున్న కులవ్యవస్తను , కింది కులాలపై తమ పెత్తనాన్ని దోపిడిని కొనసాగించడం కోసం కుల వ్యవస్తను పెంచి పోషిస్తున్న ఆధిపత్య కులాల కుట్రలను కథలో చాల బాగా చెప్పారు రచయిత గ్రేట్ స్టొరి.

  • buchireddy gangula says:

    తిరుపాల్ గారు

    నన్ను ఎలా పిలిచినా ఓకే సర్
    ఒక రెడ్డి గా — నా ఒపీనియన్ చెప్పడం లే దు — ఒక వ్యక్తి గా
    మాత్రమే —
    నాకు నేను గా యి పేరు పెట్టుకోలేదు మిత్రమా —సబ్జెక్టు గురించి
    రాయండి దయతో —
    ————————-బుచ్చి

    • Thirupalu says:

      క్రష్ణ కుమార్ గారికి తోకలు ఇక్కడే కనిపించాయి . వాటిని ఎత్తి చూపటమే ఆయన చేసింది. ఆ సంగతి మీకు తెలియటానికే నేను అలా అనాల్సి వచ్చింది. మిగతా విషయాలతో మీతో ఏకీబవిస్తున్నాను. కొన్ని కఠిన వాస్తవాలు చెప్పాల్సి వచ్చినపుడు తప్పదు.

  • nenu says:

    అవును లెండి సర్. పూట కు గతి లేని పూజారి గారి కూతురూ, వంటలు చేసుకుని పొట్ట పోసుకునే బ్రాహ్మణ వితంతువు గారి కొడుకూ, నెలాఖరికి పక్కింటికి అరువు కోసం వెళ్లే గుమస్తా గారి అమ్మాయిలూ, అందరూ చచ్చి చెడి ర్యాంక్లు తెచ్చుకుని, సర్కార్ వారి దయ మీద వచ్చే సౌకర్యాలూ సౌలభ్యాలూ లేకుండా వచ్చిన థర్డ్ రేట్ సెకెండ్ రేట్ కాలేజ్ ల్లో , సెమెస్టర్ సెమెస్టర్ కి పుస్తకాలు అమ్మి, కమ్మలు తాకట్టు పెట్టి, దేవుడిచ్చిన తెలివి తో , ప్రపంచీకరణ పుణ్యామాని ఇన్ఫోసిస్ లో విప్రో లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు కదా.. (కలెక్టర్ ఉద్యోగాలు కల లే మరి) నెలకు వచ్చే ఇరవై ముప్ఫై వేల కి ఏదో హోమ్ లోన్ తెచ్చుకుని కొనుక్కుంటున్నారు కదా.. వేరే వాళ్ల జోలి లేకుండా ఇక్కడైనా ప్రశాంతం గా బతికి ఏడుద్దాం కనీసం అని అనుకోరా మరి? వాళ్ళు కూడా సోషియల్ ఔట్ “కాస్ట్” లే మరి ఇప్పుడు.

  • nenu says:

    మీ కథ మాత్రం చాలా బావుందండీ. ఇదే కథ కి కొన్ని సీక్వల్స్ ఎందుకు రాయ కూడదు మీరు? ఎలాగంటే ఓసారి కమ్మ వారి కాలొనీ లో భంగపడతాడు మన నగేష్, మరోసారి కాపు కాలొనీ లో, ఇంకోసారి వెలమదొరల కాలొనీ లో.. చివరికి తానే ఒక దళిత్ కాలొనీ ని స్థాపించి తన లాగా వివక్ష ఎదుర్కొనే వారందరికై తనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఆరంభిస్తాడు. కోట్లకి పడగలెత్తి తన ని గేలి చేసిన అన్ని కులాల వాళ్ళని ఓపెన్ గా ప్రెస్ మీట్ లో ఉతికి ఆరేస్తాడు, వారి పై కేసులు బనాయించి బొక్క లో తొయిస్తాడు. ఎలా ఉంది కథ? ఈ కథ మరీ ఇన్‌కంప్లీట్ గా అనిపించి నా అభిప్రాయాలు జత చేర్చాను.. ఏమీ అనుకోకండే.. ఎన్ని సార్లు వింటాము ఒకటే కథ ఒకటే విలేన్ తో??? హీరొ ఎలాగూ మారడు కదా నిజం గా ఉన్న విలేన్ లు అందరినీ ఒక్కో సారి హర్క్యులెస్ మాదిరి గా ఎదుర్కొంటే ఇంకా బావుంటుందేమో ఆలోచించండి.!!

  • nenu says:

    మీ కథ మాత్రం చాలా బావుందండీ. ఇదే కథ కి కొన్ని సీక్వల్స్ ఎందుకు రాయ కూడదు మీరు? ఎలాగంటే ఓసారి కమ్మ వారి కాలొనీ లో భంగపడతాడు మన నగేష్, మరోసారి కాపు కాలొనీ లో, ఇంకోసారి వెలమదొరల కాలొనీ లో.. చివరికి తానే ఒక దళిత్ కాలొనీ ని స్థాపించి తన లాగా వివక్ష ఎదుర్కొనే వారందరికై తనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఆరంభిస్తాడు. కోట్లకి పడగలెత్తి తన ని గేలి చేసిన అన్ని కులాల వాళ్ళని ఓపెన్ గా ప్రెస్ మీట్ లో ఉతికి ఆరేస్తాడు, ఎలా ఉంది కథ? ఈ కథ మరీ ఇన్‌కంప్లీట్ గా అనిపించి నా అభిప్రాయాలు జత చేర్చాను.. ఏమీ అనుకోకండే.. ఎన్ని సార్లు వింటాము ఒకటే కథ ఒకటే విలేన్ తో??? హీరొ ఎలాగూ మారడు కదా నిజం గా ఉన్న విలేన్ లు అందరినీ ఒక్కో సారి హర్క్యులెస్ మాదిరి గా ఎదుర్కొంటే ఇంకా బావుంటుందేమో ఆలోచించండి.!!

  • Veldandi Sridhar says:

    ఒక సిరా చుక్క వేయి మెదళ్ళను కదిలించినట్టు ఈ ఒక్క “గోవర్ణం” కథ ఇప్పుడు అనేక మంది సాహిత్య కళా జీవులను నాగరికులు నివసించే నగరాలలో కులం యెట్లా అదృశ్యంగా తలెత్తుకుని వికటాట్ట హాసం చేస్తోందో చర్చించేలా చేస్తోంది. అగ్ర వర్ణులు ఎక్కడున్నా తమదైన ఒక చట్రం గీసుకొని బతుకుతారని మరోసారి నిరూపించింది. పైకి సాదా సీదా కథలా కనిపించే ఈ కథ సమాజం పైకి ఎన్నో ప్రశ్నల్ని సంధిస్తోంది. మానవ సమాజం ఏర్పడిన ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా కులమనే వేయి ఊడల మర్రి మనిషి అంతరాంతరాల్లో ఎలా పాతుకు పోయిందో దృశ్యమానం చేసే కథ. రచయితా డా. పసునూరి రవీందర్ ఒక సున్నితమైన విషయాన్ని కథగా మలిచి అంతే నేర్పుతో పాఠకుడి హృదయంలోకి చొచ్చుకుపొయేలా రాయడంలో కృతకృత్యులయ్యారు. శిల్ప పరంగా కూడా నిలిచిపోయే కథ. పరిమిత పాత్రలతో అపరిమితమైన అంశాన్ని చర్చకు పెట్టిన కథ. నగేష్ పాత్ర వ్యవస్థను ఒక కుదుపు కుదిపి కాలర్ పట్టుకొని నిలదీసే పాత్ర. ఒకప్పుడు ఊర్లో చివరి వాడల్లో నివసించే వాళ్ళు రెండు దశాబ్దాలుగా ఊళ్ళో కలిసి పోయారని అనుకుంటున్నాము. ఐతే ఊళ్ళో కూడా అనేక వృత్తాలు కొంత మందిని ఏ వృత్తంలో ఇమడకుండా చేసి వేలివేస్తున్నాయని ఈ కథ చాలా బలంగా చెప్పింది. సమాజ వృక్షానికి కాసిన విష ఫలాలలో కులం అత్యంత విషాన్ని చిమ్మే కారకమని మరోసారి రుజువు చేసిన కథ. ఒక నిమ్న కులస్థుడు నగరంలో ఇల్లు కట్టుకోవాలని కలగనడం యెంత చేదు ప్రయత్నమో కళ్ళకు కట్టిన కథ. తుమ్మేటి రఘోత్తం రెడ్డి గారి “పనిపిల్ల ” కథలాగా , పి. సత్యవతి గారి “ఇల్లలకగానే” కథ లాగా, మనం నిర్మించుకున్న పేక మేడల్లాంటి నాగరిక సమాజ పునాదుల్ని కూకటి వేళ్ళతో సహా కదిలించే కథ. కులం సగటు నిమ్న వర్గపు మనిషి గుండెలో కలిగించే జ్వాలల్ని, అగ్ని పర్వత లావా వేడి సెగల్ని పాఠకుడి మనసుకు తగిలేలా చేసిన కథ. నిజంగా కంప్యుటర్ ను కట్టేసిన తరువాత కూడా ఇన్ని యుగాల ప్రయాణంలో మనిషి సాధించిన అభివృద్ధి, నాగరికత, టెక్నాలజీలతో మనమెటు వైపు అడుగులు వేస్తున్నాం? అని మెదడును తొలిచే కథ. మళ్ళీ కులాల వారిగా కాలనీలు ఎర్పడుతాయేమోననే ఒక భయాన్ని మనసు మూలలో నాటే కథ. కులం తుప్పు పట్టి భవిష్యత్తులో సమాజం, మనిషి ఎలా శిథిలం కానున్నారో హెచ్చరించే కథ. సమాజం కులం వైపు యెట్లా మలుపు తీసుకోనున్నదో ఒక చెంప పెట్టు పెట్టి మరీ చెప్పే కథ ఇది. హృదయమంతా ముసురు పట్టినట్టు, కుల సర్పం నోట్లో చిక్కుకొన్న కప్పలా మనిషి గింజుకున్నట్టు, దేహమంతా ఒక బలమైన షాక్ తగిలినట్టు అనిపించే కథ. డా. పసునూరి గతంలో రాసిన “మీసాలోడు”, “అవుటాఫ్ కవరేజి ఏరియా ” కథల కన్నా ఈ కథ శక్తి వంతమైన కథ. సమాజపు వెర్రి పోకడను ముందే గుర్తించి ఒక గొప్ప అంశాన్ని సాహిత్యలోకం ముందుంచిన పసునూరి గారికి అభినందనలు. – వెల్దండి శ్రీధర్

  • Thirupalu says:

    ఈ కధను ‘కధ 2013’చేర్చడానికి పరిశీలిమ్చాలని, కదా ఎడిటర్ల కు ( వాసిరెడ్డి నవీన్ గారికి, పాపినేని శివశంకర్ గారికి) విజ్ఞప్తి .

  • skybaaba says:

    కథ బాగుంది. మంచి సబ్జెక్ట్. మరొక్కసారి రిరైట్ చేసుకుంటే బాగుండు, కొన్ని చోట్ల వచ్చిన భావాలే మళ్ళీ వొచ్చాయి.
    చాలా చోట్లా కాలనీల్లో ఫలానా గుడి కడతాం అని కూడా ముందే చెబుతున్నారు. ఇలాంటి కాలనీల్లో ముస్లింలకు ఇవ్వం అని మొఖం మీదే చెప్పేస్తున్నారు. మనుషులంతా ఇలా కుల కాలనీలు, మత కాలనీలు, కుల అపార్ట్మెంట్లు, మత అపార్ట్మెంట్లు కట్టుకునేలా తయారు కావడానికి ప్రేరేపిస్తున్న శక్తులెవరు? ఈ పరిస్తితి మారాలంటే ఏం చేయాలి? అని అందరం ఆలోచించాల్సిన అవసరముంది…

  • Laxman says:

    మంచి క‌థ.

  • geethanjali says:

    రవీందర్ గారు..రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా VACHINA కులపు గజ్జిని బాగా చిత్రీకరించారు.ఈ మధ్య brahmanothamulaku మాత్రమే..అని ఒక బ్రాహ్మణా అగ్రహారం 100 VAAYIDAALLOO లో ప్లాట్స్ ఆఫర్ చేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.మిగతా జనాభా అంత నీచులన్నమాట వాళ్ళ దృష్టిలో ఇలా బహిరంగంగా ఇతర కులస్తులని అవమానించే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఎవరూ చర్య తీసుకోరు…ఆవేదనతో బాగా రాసారు..మీ నిశిత పరిశీలనా బాగుంది..మీరింకా మంచి కథలు ఇలాంటివి రాయాలని కోరుకుంటున్న..అలాగే కథలో..సంభాషణల్లో తెలంగాణా మాండలికం లోపించినట్లుగా అన్పించింది.ఈ Konchem జాగ్రత్త తీసుకుంటే చాలు…అభినందనలు.geethaanjali

  • KONDAPALLI WILSON says:

    ఃఎఅర్త్య్ఫీ తక్న్స్ ఫర్ యువర్ కింద ఎ-మెయిల్ అండ్ ఐ ఫీల్ వేరి హ్యాపీ ఆన్ రీడింగ్ యువర్ పోయెట్రీ అండ్ వే విల్ ట్రై తో కండక్ట్ ఆ మీటింగ్ ఇన్ గుంటూరు

    తనక్ యు

Leave a Reply to nenu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)