జ్ఞాపకాల నీడలో వసుంధర

bhuvanachandra (5)“తాగి తాగి చచ్చింది. చచ్చి బతికిపోయింది..!” నిట్టూర్చి అన్నాడు శీను. ‘శీను’ అనే పేరు సినిమా పరిశ్రమలో చాలామందికి ఉంది. ప్రొడక్షన్ వాళ్లలో ‘శీను’లే ఎక్కువ. అలాగే ప్రసాద్‌లు. ఈ ‘శీను’ మాత్రం కాస్ట్యూమర్. వయసు అరవైకి  పైమాటే.

“అదేంటి మావా అలా అంటావూ? ఆవిడకేం మూడిళ్ళు. లెక్కలేనంత ఆస్థి, మొగుడు, పిల్లలు. ఇంకేం కావాలి?” ఆశ్చర్యంగా అన్నాడు సూరిబాబు.

“అందుకే మరి జనాలు నిన్ను వెర్రివెలక్కాయనేది. ఒరే సూరి! ఏది ఎంతున్నా, మనశ్శాంతి లేని బతుకు బతుకవుతాదిట్రా? గంజినీళ్లు తాగినా మనశ్శాంతి వుంటే ఆరోగ్యం ఉంటాది. ఆరోగ్యం వుంటే ఆనందం వుంటాది. ఏవుందా అమ్మకి? ఒరే! గొప్ప గొప్ప హీరోయిన్ల దగ్గర్ పన్జేశా. అందరి ‘కొలత’లూ నాకు తెల్సురొరే! కొలతలంటే జాకెట్టు కొలతలూ, బాడీ కొలతలు కాదు. ఆళ్ల మనసు లోతులూ అన్నీ తెలుసు. కానీ వసుంధరమ్మంత పిచ్చి ముండ ఇంకోతి వుండదు” చెబుతూ చెబుతూ సైలెంటైపోయాడు శీను.

‘ఫ్లాష్‌బాక్, ఫ్లాష్ ఫార్వార్డ్ ల్ని సినిమాల్లో చూపిస్తారు. ‘అదెలా?’ అని అనుకుంటామేగానీ, ప్రతీ మనిషీ రోజుకి కనీసం వందసార్లయినా ‘గతం’లోకి వెళతాడని గ్రహించలేం. ఏం.. మీగురించే మీరు ఆలోచించుకోండీ. రోజుకి ఎన్నిసార్లు గతంలోకి పయనిస్తున్నామో మీకే తెలుస్తుంది.

శీను కూడా గతంలోకి పోయుండాలి. అతనికా హక్కూ, అవకాశం రెండూ వున్నాయి. ఎందుకంటే సగానికి పైగా అతని జీవితం వసుంధరకి పర్సనల్ కాస్ట్యూమర్‌గానే గడించింది. ఆ అమ్మాయి పదహారేళ్లప్పుడు మొదటిసారి బాబూరావు (ఈ మధ్యే చనిపోయారు.  ఓ రెండేళ్ళవుతుంది) దగ్గర పనిచేసేవాడు. బాబూరావు చాలా పనిమంతుడు. టాప్ హీరోయిన్లు అతన్ని పర్సనల్ కాస్ట్యూమర్‌గా కోరుకునేవారు. ఆయన కింద కనీసం ఓ ఇరవైమంది టైలర్లుండేవారు. పగలూ రాత్రి అదే పని. బాబూరావులో వుండే ఒకే ఒక డిఫెక్టు అతని చిరాకు. నిద్రలేవడం దగ్గర్నించీ, నిద్రపోయేదాకా పచ్చి బూతులే. సాయంత్రం కాగానే ‘మందు’ తప్పనిసరి. ఆ  టైంలో ఎవడ్నో ఓకడిని నానా తిట్లూ తిట్టి హేళన చేస్తే గానీ అతని మనసు శాంతించేది కాదు. అయితే అదృష్టవశాత్తు ఓ రోజున ఓ మహానుభావుడు అతని చేత ‘మందు’ మాన్పించాడు. దాంతో శాడిజమూ తగ్గింది.

సినిమా పరిశ్రమలో ‘గురువు’ ఎప్పుడూ గురువే. ఎంత తిట్టినా, కొట్టినా, నోటికి తొంభైమంది ‘గురువు’ని ఏనాడూ తప్పుబట్టరు. తూలనాడరు. శీనుకీ, బాబూరావంటే గౌరవం అందుకే మిగిలుంది. మనిషి ఎలాంటివాడైనా ‘పని’లో మాత్రం కింగ్. అందుకే బాబూరావు శిష్యులు సరదాగా ఇప్పటికీ అంటారు.. “మా గురువారికి ‘టేపు’ అక్కర్లేదండి.. చూపుల్తోనే కొలతలు తీస్తాడు!” అని.

వసుంధరకి పదహారూ, శీనుకి  ఇరవై రెండూ. వసుంధర తల్లి  బ్రాహ్మణ స్త్రీ. తండ్రి అరవచెట్టియార్. వసుంధరకాక ఇంకో మగపిల్లాడు. సెయింట్ జాన్స్‌లో చదువుతుండగా వసుంధరకి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

“నేను స్కూల్ డ్రామాలో యాక్ట్ చేస్తుండగా డైరెక్టర్ బాలకిషన్ అంకుల్ చూసి ‘హీరోయిన్’గా చేస్తావా అమ్మా అనడిగారు” అని వసుంధర తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేది. నిజం మాత్రం అది కాదు. వసుంధర తల్లి ‘బాలకిషన్’ని చాలా నెలలు ‘అలరించాకే’ వసుంధరకి హీరోయిన్ చాన్స్ వచ్చిందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

“నీకు సినిమాల్లో ‘కేరక్టర్’ కావాలా? అయితే నీ ‘కేరెక్టర్’ నా దగ్గర వొదిలేసెయ్!” అని పరిశ్రమ అంటుందిట. ఇదో జోక్ గాని జోక్.

వసుంధర నిజంగా అందగత్తె. పాలల్లో మంచి పసుపూ, గులాబి రంగూ కలిసిన దేహచ్చాయ. ముత్యాల్లాంటి పలువరుస. అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తు. చక్కని బిగువైన ఒళ్ళు. చూడగానే పిచ్చెక్కించే చిరునవ్వు. ఇంకేం కావాలి? ‘గ్లామర్ డాల్’ అన్నారు.

“ఏంది మావా ఆలోచనా?” అడిగాడు సూరిబాబు.

“నావల్ల కావటంలేదురా…!” కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు శీను.

“పోనీ వెళ్ళి చూసొద్దాం పద!” లేచాడు సూరిబాబు.

“ఊహూ! చూళ్ళేను. చూస్తే గుండె పగిలి పోతుంది…!”

రెండు చేతుల్తో మొహం కప్పుకున్నాడు శీను. మళ్లీ ఏవో జ్ఞాపకాలు.

 

***********

 

కొత్తగా వచ్చిన హీరోయిన్ ‘కొలత’ ఎంత ‘సినిమాటిక్‌’గా కొలవాలో అంత ఘోరంగానూ తీశాడు బాబూరావు.. చూస్తూ ‘గురువు’గారు చెప్పిన కొలతల్ని నోట్ చేస్తున్న శీనుకే కంపరం పుట్టింది. వసుంధర సిగ్గుతో చచ్చిపోతోంది.

“అదేంటమ్మాయ్! సిగ్గుపడితే ఎలా? కెమెరామన్ దగ్గరా, కాస్ట్యూమర్ దగ్గరా ‘వొళ్ళు’ దాచుకోకూడదు. దాచుకుంటే తెరమీద ‘గ్లామర్’ కనిపించదు. ఇంకో రెండు సినిమాలయ్యాక నువ్వే చెబుతావు మాకు. ఎక్కడ ఎత్తులూ, ఎక్కడ వొంపులూ పెట్టి కుట్టాలో…!” ఫకాల్న నవ్వి వసుంధర ‘సీటు’ మీద చరిచి అన్నాడు బాబూరావు.

కళ్ళనీళ్ల పర్యంతమైన  వసుంధరని చూడగానే తన చిన్న చెల్లెలు జ్ఞాపకం వచ్చింది శీనుకి. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్టు. అయితే వసుంధర ‘బిడియాన్ని’ చిదిమేసి ‘కసి’ని పెంచింది మాత్రం బాబూరావులాంటి ధీరులే. రెండో సినిమాని వెంటనే వొప్పుకోలేదు వసుంధర తల్లి. టాప్ రెమ్యూనరేషన్ ఆఫరయ్యేదాకా ఆగింది. సినిమా సంతకం చెయ్యగానే వసుంధర  డైరెక్టుగా ప్రొడ్యూసర్‌తో అన్నది. “సార్.. నాకు కాస్ట్యూమర్‌గా బాబూరావు వొద్దు. అతని అసిస్టెంట్ శీను కావాలి. యీ సినిమా నించి అతనే నా పర్సనల్ కాస్ట్యూమర్” అని .. అంతే శీను దశ తిరిగింది.

వసుంధర  బాబూరావుని వొద్దన్న సంగతి జనాలకు తెలిసింది. ఒక్కొక్క సినిమాలో వసుంధర  పైకి వెళ్తున్న కొద్దీ, బాబూరావు కిందకి దిగిపోవాల్సి వచ్చింది. టాప్ హీరోయిన్  ‘వద్దన్న’వాడిని పనిలో  పెట్టుకోవడానికి గుండా చెరువా?

రెండే రెండేళ్ళలో బాబూరావు దగ్గరి అసిస్టెంట్లందరూ శీను దగ్గర చేరిపోయారు. బాబూరావ్ ‘సినీ’ టైలర్స్ కాస్తా బోర్డు తిప్పి కోడంబాకంలో మామూలు టైలర్‌గా మిగిలిపోయాడు. బాబూరావే కాదు, మొదటి సినిమా కెమెరామాన్ వైద్యలింగాన్ని, నానా తాగుడూ తాగి చిత్రహింసలు పెట్టిన  డైరెక్టర్ బాలకిషన్‌ని కూడా నిర్ధాక్షిణ్యంగా ‘తొక్కేసింది’. వసుంధర. ప్రొడ్యూసర్ మంచివాడు గనక బతికిపోయాడు. మేకప్ సుబ్బరామన్ అప్పటికే వయసుమీరినవాడు. అయితే గొప్ప పనిమంతుడు. ఆ సుబ్బరామన్ రిటైరయ్యాక కూడా నెలకి కొంత డబ్బులు పంపి ఆదుకుంది వసుంధర. హాస్పిటల్ ఖర్చులూ ఆమే భరించేది. దాంతో వసుంధరకి ‘గొప్ప మానవతావాది’ అన్నపేరు వొచ్చింది. ‘కరోడా’ అన్న పేరు ఎలాగూ వచ్చిందనుకోండి..

***

 

“శీనూ… నువ్వూ మన మేకప్‌మేన్ నరసింహులూ నా తరఫున సాక్షి సంతకాలు పెట్టాలి” ఇరవై ఆరో ఏట శీనుని తనున్న హోటల్ రూంలోకి పీల్చి చెప్పింది వసుంధర. అప్పటికామె నందకుమార్ (హీరో) ప్రేమలో పూర్తిగా మునిగిపోయిందని పరిశ్రమలో అందరికీ తెల్సు.. “అదికాదమ్మా.. నందకుమార్‌గారికి ఆల్రెడీ పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూదా. ఇప్పుడు…”చెప్పబోయాడు శీను.

“నాకు తెలుసు శీను! ఇప్పటివరకూ సంపాదించింది మొత్తం మా అమ్మా, తమ్ముడు వాళ్ల పేరు మీద దాచేసుకున్నారు. ఇప్పటికైనా ఆ వూబిలోంచి బయటపడకపోతే జన్మలో ఎప్పటికీ బయటపడలేను. నందకుమార్ ఎలాంటివాడైనా నిజంగా నేనంటే ప్రేమ వున్నవాడు. ఇంకొకటి ఏమంటే అతను భార్యని ఒప్పించాడు. ఆమె అనుమతితోటే మా పెళ్ళి జరుగుతోంది. అతన్ని కాదనుకున్నా రేపు ఇంకొకడెవడో  వచ్చి ఏం వొరగబెడతాడూ?” మనసులోని మాట శీనుకి చెప్పింది వసుంధర. అప్పటితో ‘ఆపటం’తనకీ మంచిదని మౌనం వహించాడు శీను.

***

‘ఆరువళ్లూరు’ వీరరాఘవస్వామి గుళ్ళో గుట్టుగా  పెళ్లి జరిగింది. విషయం తెలిసిన వసుంధర తల్లి లబోదిబోమన్నది. శీనునీ, మేకప్‌మేన్ నరసింహుల్నీ నానాబూతులు తిట్టింది. పరిశ్రమలో పెద్దల దగ్గరకు వెళ్లి మొత్తుకుందిగానీ వాళ్ళేం చెయ్యగలరు?

నెలరోజులు ‘హనీమూన్’ ట్రిప్ కానిచ్చాక మళ్ళీ బిజీ అయింది వసుంధర. వసుంధర అదృష్టమేమోగానీ ‘మంచి’ సినిమాలు పడ్డాయి. అన్నీ ‘హీరోయిన్’ ఓరియంటెడ్ సినిమాలే. పెళ్ళయ్యాక గ్లామర్ డాల్ కాస్తా ‘అభినయ సరస్వతి’గా పేరు తెచ్చుకుంది. కుప్పతెప్పలుగా డబ్బు. నందకుమార్ ఎప్పుడూ ఏవరేజ్ హీరోనే. ఈ దెబ్బకి అతను వసుంధర పేరున మూడు బంగళాలూ, తన పేరున మూడు బంగళాలూ కొనడమేగాక చెన్నై చుట్టూపక్కల వందల ఎకరాలు స్థిరాస్థి కొనేశాడు. కాలక్రమేణా వసుంధరకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మొత్తం కుటుంబం అంతా కలిసే వుండేవారు. నందకుమార్ భార్యా వసుంధర అడుగులకి మడుగులొత్తేది. వసుంధరా అంతే ప్రేమగా ఆవిడ్ని చూసేది. తను ఏ నగలసెట్టు కొనుక్కున్నా ఆవిడకీ కొనాల్సిందే. తన పిల్లలకి ఏది కొన్నా ఆవిడ పిల్లలకీ కొనాల్సిందే.

కాలగర్భంలో ఓ దశాబ్దం కలిసిపోయింది. కొత్త నీరు వచ్చింది. పాతనీరు కొట్టుకుపోయింది. ఇవ్వాళ వచ్చిన హీరోయిన్ రేపు టాపు. ఎల్లుండి ఫ్లాపు. కేరళ నించీ, ముంబై నించీ, డిల్లీ, గుజరాత్‌ల నించీ హీరోయిన్ల దిగుమతి పెరిగింది. ఆల్ హేపీ. సినిమా రంగానికి కావాల్సిన ‘పట్లు’ పూర్తిగా నేర్చుకుని ముంబై నించి వస్తున్నారు గనక హీరో ఖుష్… డైరెక్టర్ ఖుష్.. ప్రొడ్యూసర్, మేకప్‌మేన్, డిస్ట్రిబ్యూటర్ అందరూ ఖుష్. బయ్యర్లతో సహా. ‘కేరక్టర్’ వదులుకోవడమంటే షేక్‌హాండ్ ఇచ్చినంత తేలిక. ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకో. కమర్షియల్స్ అయినా, అయిటం సాంగ్ అయినా ఏదైనా ఒకటే.. హార్డ్ కేష్.. అంతే!

చప్పట్లకీ, పచ్చనోటు రెపరెపలకీ అలవాటు పడ్డ హీరోయిన్లు రిటైరై ఇంట్లో కూర్చోలేరు. అలాగని తల్లి వేషాలు వెయ్యలేరు. కానీ వసుంధర అన్నింటికీ సిద్ధపడింది. కూతుళ్లు ‘వయసు’కి వచ్చారు. వాళ్లని కథానాయికలుగా చెయ్యాలంటే డబ్బు కావాలి. ఆ మాటే నందకుమార్‌తో అన్నది. నందకుమార్ తన స్వంత కూతురి పెళ్లి చేసేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో. వసుంధర డబ్బుతో కొడుకుని (స్వంత కొడుకుని) హీరోగా పెట్టి సినిమా తీశాడు. అది బిగ్గెస్టు ఫ్లాపు. సినిమాకి చూపినవన్నీ దొంగలెక్కలే. మూడొంతులు వసుంధర ఆస్థిని నందకుమార్ ‘నొక్కేశాడు’, ఆ విషయం మొదట గ్రహించింది శ్రీను.

“అమ్మా .. జాగ్రత్తపడండి. సినిమాని ‘చుట్టేసారు’ ఖర్చులు మాత్రం చూపించారంట. మీ మధ్య గొడవలు పెడదమన్న ఉద్ధేశ్యంతో కాదు. మీ  ఉప్పు తిన్న విశ్వాసంతో చెబుతున్నా.!” చాలా కష్టం మీద వసుంధరని వొంటరిగా కలిసి చెప్పాడు శీను.

నందకుమార్ హయాంలోనే శీనుకు ఉద్వాసన పలికాడు. శీనుకి అప్పటికే మంచి పేరుంది గనక త్వరలోనే వేరో ఒక అప్‌కమింగ్ హీరోయిన్‌కి పర్సనల్ కాస్ట్యూమర్‌గా వెళ్ళిపోయాడు. బాగా సంపాదించాడు కూడా. ఒక విషయం నిజం. వసుంధర శీనుని సొంతమనిషిలానే చూసింది. శీను పెళ్లికి కూడా బోలేడంత డబ్బు ఖర్చు పెట్టింది. “నాకు తెలుసు శీను.. ఇప్పుడు ఏమీ చెయ్యలేను. ఆస్థి ఆయన చేతుల్లో ఉంది. కానీసం ‘మల్లిక’ అయినా హీరోయిన్‌గా నిలదొక్కుకుంటే…” నిట్టూర్చింది వసుంధర. అప్పుడు సమయం ఉదయం పది. అప్పటికే వసుంధర ‘తీర్థం’ సేవించి మత్తులో ఉంది.

మాట్లాడకుండా బయటికొచ్చాడు సీను. “అన్నా.. ఆ అరవ ముండాకొడుకు వసుంధరమ్మని తాగుడికి అలవాటు చేశాడు. తెల్లార్లూ మందే…!”శీనుతో గుసగుసగా అన్నది ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి మొదట్నించీ వసుంధరకి ‘టచప్ వుమన్’ వసుంధరతోటే వుంటుంది. నిట్టూర్చాడు శీను.

“అంతేకాదు శీనయ్యా.. హీరో అయ్యుండీ అమ్మాయిల్ని తెచ్చి వ్యాపారం చేయిస్తున్నాడు. నేనూ రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను.”చెప్పింది ముత్తులక్ష్మి. ఆ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసిందే. ‘మాజీలు’ కొందరు  యీ వ్యాపారం మీదే జీవనం సాగిస్తుంటారు. అదే తప్పుగా అనిపించకపోవటమే విచిత్రం. కుటుంబంలో మగపిల్లలకి కూడా ఇదంతా మామూలుగా అనిపించడం మరో విచిత్రం. అక్కో, చెల్లెలో వ్యభిచారం నేరం మీద పట్టుబడ్డా ఆ మగధీరులు మాత్రం మామూలుగానే తిరగేస్తుంటారు. అక్కచెల్లెళ్ల మీదే బతికేస్తూ వుంటారు.

వసుంధరకీ, నందకుమార్‌కీ జరిగిన ‘డిస్కషన్స్’ చెప్పాలంటే ఓ పెద్ద నవల అవుతంది. ఎందుకంటే నందకుమార్ గోతికాడ నక్క. అతని మొదటి పెళ్ళాం ‘బాగా’ తెలివైంది. ‘కాదు’ అని బయటపడకుండా ‘అవును’ అని అన్నీ దక్కించుకుంది.

ఏ రేంజికంటే తరవాత్తరవాత వసుంధర ‘కూతుళ్ల’ మీద సంపాదించేంత. తన కూతురు, కొడుకూ మాత్రం సేఫ్. సవతి కూతుళ్లనీ బిజినెస్’లోకి దించి, సవతి కొడుకుని ‘వెధవ’ని చేసింది. తనకి పుట్టినవాళ్లనే ‘బిజినెస్’లోకి దించిన ఘనత ది గ్రేట్ కేరక్టర్ ఆర్టిస్ట్ నందకుమార్‌ది.

నేలమీదనించి ఓ కొండ శిఖరానికి ఓ ‘రాయి’ని చేర్చాలంటే చాలా కష్టం. అక్కడ్నించి ఆ రాయిని కిందకి తోసెయ్యాలంటే క్షణం పట్టదు.

వసుంధర పతనమూ అలాగే అయింది. సంస్కారం వున్న వసుంధర జరుగుతున్న దాన్ని చూస్తూ సహించలేకపోయింది. అలాగని పిల్లల్ని తండ్రికి దూరమూ చెయ్యలేకపోయింది. అందరూ చేసే పనే తనూ చేసింది. అన్నీ మర్చిపోవడానికి అది దగ్గరి మార్గం ‘తాగుడు’. ఆ తాగుడికి బానిసైంది. లేవగానే మందు.. ఇంకా ‘కిక్కు’ కోసం మందుతోపాటు గుట్కా. ముత్యాల్లాంటి పలువరస పుచ్చిపోయింది. వొళ్లు ఏభయేళ్ళకే బండగా తయారైంది. కూతుళ్లు సినిమాల్లో  రాణీంచలేకపోయారు. ఒకతి మాత్రం ఓ మళయాళం వాడిని దొంగతనంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండోది ఎప్పుడు ఎవరితో ఉంటుందో దానికే తెలీదు. కొడుక్కి చదువబ్బలా. తండ్రి కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తాగి తాగి చివరకు చచ్చిపోయిన వసుంధర. మంచం మీదనించి కిందపడి చనిపోయిందని ఒకరంటే, గుండె ఆగి చచ్చిపోయిందని మరొకరు అన్నారు. ఏమైతేనేం మరో దుఃఖజీవికి ‘విముక్తి’ లభించింది. సర్వాంతర్యామి వున్నది అందుకేగా..

 

***

 

వసుంధర ‘పెద్ద కర్మ’ చాలా అట్టహాసంగా జరిగింది. నిలువెత్తు ఫ్లెక్సీలు, అన్ని పేపర్లలోనూ శ్రద్ధాంజలి. అన్ని చానల్సులోనూ ఆవిడ గురించిన వార్తలూ, కటింగ్సే. నందకుమార్ నటనకి జోహార్లు..  గ్లిజరిన్ లేకుండా టీవీ కెమెరాల ముందు ‘భార్యపోయిన దుఃఖాన్ని’ రక్తి కట్టించాడు. చూస్తున్న ప్రేక్షకులు అతని ప్రేమకి చలించిపోయారు. నందకుమార్ భార్య ఇంకా అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ‘వసుంధర నాకు దేముడిచ్చిన చెల్లి, నా ప్రాణంలో ప్రాణం” అంటూ వలవలా ఏడ్చింది. వసుంధర కూతుళ్లూ, కొడుకు మాత్రం నిర్వికారంగా నిలబడ్డారు.

“నేను బ్రతికుండీ ఆమెకి ఏమీ చెయ్యలేకపోయాను గురువుగారూ.. చెయ్యగలిగిందింతే!” కళ్లనీళ్లతో అన్నాడు శీను. డాబా హోటల్లో ఓ చిన్న సంతాప సభ జరిగింది. మేం మొత్తం పదిమందిమి. ఏర్పాటు చేసింది కాస్ట్యూమర్ శీను. (DATA UDIPI HOTEL). ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాం. (దానివల్ల ఎవరికి ఉపయోగం? అడక్కంది. అదో వెర్రి సంప్రదాయం).

“వసుంధర పిల్లల పరిస్థితి ఏమిటి?” ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. స్వంత తండ్రి వున్నాడు. కానీ ఆ తండ్రే కూతుళ్లని (అంటే వసుంధర కూతుళ్లని మాత్రమే) బిజినెస్‌లోకి దించి ‘కొడుకు’ని డ్రైవరుగా వాడుకుంటున్నాడు. ఆయన అసలు కొడుకూ, కూతురూ చాలా చాలా గొప్ప స్థితిలో వున్నాడు. మరి వీళ్లు పిల్లలు కారా? ఇంత పక్షపాతం ఎందుకూ? అదీ వసుంధర సర్వస్వాన్నీ కొల్లగొట్టాక కూడా”

జావాబు దొరకని ప్రశ్నల్లో ఇదొకటి. వసుంధరని తల్చుకుంటే నాకో పాట గుర్తొస్తుంది.. “తేరి దునియాసే దూర్ చలేఁ హోకె మజ్‌బూర్ హమే యాద్ రఖ్‌నా…” అన్నది

జ్ఞాపకాలు తప్ప వసుంధర గురించి ఇంకేం మిగిలాయి..

 

భువనచంద్ర..

 

 

Download PDF

15 Comments

  • - గొరుసు జగదీశ్వర్ రెడ్డి says:

    భువనచంద్ర గారూ … ఏమి రాయమంటారు? చర్విత చరణంగా ఈ సినిమా తారల జీవితాలు చదివి చదివి మనసు మూగబోయింది . మీ వసుంధర లో ఎవరిని ప్రతిక్షేపించుకునేదీ ? మంజులనా, సావిత్రినా … ఒక్కరా ఇద్దారా … గతంలో ఎన్.ఆర్ . నంది గారి సినీజనారణ్యం నవల చదివి, శారద శ్రీనివాసన్ గారి పతితవ్రత నాటకం విని … తెరవెనక జీవితాలు ఇలా ఉంటాయా .. అని విస్తూ పోయా. తర్వాత చదివి చదివి, విని విని అలవాటయిపోయింది .
    మీ శైలి లో ఏదో మిరకిల్ ఉంది చంద్ర గారూ . అది నన్ను కిల్ చేస్తోంది. మీరు రచయితగా, సినిమా జనారణ్యంలో ఉండటం మా అదృష్టం. మీరు ఒక జీవితాన్ని ఆవిష్కరించే తీరు అద్భతం. ఇది పొగడ్త అనుకుంటే పొరపాటు. ఎలా చెప్పాలో తెలియక … ఇలా రాసాను.
    – గొరుసు జగదీశ్వర్ రెడ్డి

    • Bhuvanachandra says:

      రెడ్డి గారూ కధ రాశాక ప్రింట్ అవగానే మీ అందరి అభిప్రాయాల కోసం ఎదురుచూస్తాను…..మీ కామెంట్స్ చదివి పొంగిపోతాను …. మీ చక్కని రివ్యూస్ నాకు ఆక్సిజన్ లాంటివి ……ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తాయి ….ఊహలతో కధ రాయడం తేలిక …నిజాన్ని రాయడం నిజంగా మనసుకి బాధ కలిగిస్తుంది …. కానీ మీ ఉత్తరాలు ఉత్సాహాన్ని ఇచ్చి మరో కధ రాయమని ప్రేరేపిస్తాయి ….. థాంక్స్ … హృదయపూర్వక ధన్యవాదాలు …..నమస్సులతో భువనచంద్ర

  • “నేలమీదనించి ఓ కొండ శిఖరానికి ఓ ‘రాయి’ని చేర్చాలంటే చాలా కష్టం. అక్కడ్నించి ఆ రాయిని కిందకి తోసెయ్యాలంటే క్షణం పట్టదు.” – అద్భుతమైన వాక్యం. ఎన్నో సినిమా జీవితాలని నిర్వచించే వాక్యం. మీ కలానికి సలాం..

    • Bhuvanachandra says:

      అరిపిరాల గారూ …. ఈ చిత్రసీమలో చెప్పలేనన్ని విచిత్రాలు ……ప్రతినవ్వు వెనకా …ప్రతి కన్నీటి చుక్కవెనకా…ఒక కధవుంది ……అంతేగాదు ….ఇక్కడ ఉన్నంత సున్నితమైన మనసులు మరెక్కడా మీకు కనిపించవు ….అందుకే రాజ్ కపూర్ పాట””జీనా యహాన్ మరణా యహా ””సరిగ్గా ఈ చిత్ర సీమకి సరిపోతుంది ….సున్నితత్వం వల్లనే కస్టాలు …..గాలికి వూగేది చివురాకే గానీ రాతిబండ కాదుగా ……….నమస్సులతో భువనచంద్ర

      • Bhuvanachandra says:

        అన్నట్టు ఖదీర్ బాబు పుస్తకం అర్జెంటు గా కొనేయ్యాలనిపించింది… మీ రు రాసిన రివ్యూ చదివాక (ఇప్పుడే చదివా )

  • యాజి says:

    “Truth is stranger than fiction” అంటే ఇదేనేమో! అందం, డబ్బూ ఉన్నా కూడా, తమ జీవితాల్ని ఇంత ఘోరంగా మలచుకొనే జీవితాల్ని చుస్తే కొంత జాలి వేసినా, మరి కొంత ఆవేశం, అసహ్యం కూడా కలుగుతోంది. ఎందుకు వేరే వాళ్ళ మీద అంతగా ఆధారపడటం అని!

    ఈ సినీ జనారణ్యం లోని ఇలాంటి చీకటి కథలతో పాటు, ఆప్పుడప్పుడూ, కొంత, వెలుగు, స్ఫూర్తి నిచ్చే కథలని కూడా, ఆవిష్కరించమని, ఒక విన్నపం.

    • Bhuvanachandra says:

      తప్పకుండా యాజీ గారూ …” చీకటి… వెలుగుల ”సంగమమే కదా ఇదీ …..దయచేసి” అసహ్యం” మాత్రం వొద్దు ఎందుకంటే …. నిజంగా ఆ జీవితాలని తరచి చూస్తె కలిగేది బాధ …..వాళ్ళంతా ”బోళా”మనసులు మరెక్కడా మనకి కనిపించవు ….. ”దోచు ”కునేవాళ్ళూ లెక్కకు మించి వున్నారనుకొండీ ….మీకు నా ధన్యవాదాలు ….మీ కామెంట్స్ నన్నెంతో ఉత్సాహ పరిచి మరో కదా రాసే ప్రేరణని ఇస్తాయి థాంక్స్ ఒన్స్ అగైన్ ……

  • kv ramana says:

    జీవితమనే సాగరంలో పుడుతూనే ఈత నేర్చుకుంటాం. ఓ ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికి సగటు మనిషిగా, సాధారణ పరిసరాలలో ఎలా జీవించాలో కనీస అనుభవాన్ని సంపాదించుకుంటాం. మిగిలిన జీవితం పొడవునా దానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాం. సినిమా అనే సాగరం భిన్నమైనది. అందులోనూ మొసళ్ళు, తిమింగలాలూ ఉంటాయి. కానీ ఏ ఇరవై ఏళ్ల లోపు వయసులోనో అమ్మాయిలు, ఈతలో ఎలాంటి అనుభవమూ లేకుండా నేరుగా సాగరంలోకి ప్రవేశిస్తారు. అందులో డబ్బు, కీర్తి అనే రత్నాలు సుదూరంగా ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిని వేటాడడంలో మొసళ్ళు, తిమింగలాల బారిన పడుతుంటారు. డబ్బు అనే ఆకర్షణకు అన్నదమ్ములు, చివరికి తల్లిదండ్రులు కూడా తిమింగలాలు, మొసళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఇందులో ఆ అమ్మాయిల ఐచ్ఛిక పాత్ర కూడా ఉంటుంది. వాళ్ళ పతనానికి, విషాదానికి, దుఃఖానికి మరెవరినో బాధ్యులనూ, విలన్లనూ చేసి ఆ అమ్మాయిల మీద సానుభూతి చూపించదమేనా మన బాధ్యత? అందులో స్వయం కృతం ఏమీ లేనట్టు వాళ్ళను నిర్దోషులుగా విడిచిపెట్టడం సరైనదేనా? తారల గురించి ఇలాంటి కథనాలు చాలా వచ్చాయి. ఇదొక రచనా ప్రక్రియగా మారింది. భువనచంద్ర గారిది మంచి కలం. సినీ జీవితాలనుంచే మంచినీ, ఇతరులకు ఒక మంచి ఒరవడినీ చూపించిన నటుల గురించి ఎందుకు రాయకూడదు?

    • Bhuvanachandra says:

      రమణ గారూ మీ విశ్లేషణ అద్భుతం ….సినీ జీవి తాలలొ మంచి ఒరవడి చూపిన ”నటుల”గురించి ఎంతో సాహిత్యం వొచ్చింది ….నా ఉద్దేశం చెడును ”హై లైట్ ”చెయ్యడం కాదు ….”నిర్దోషులు”గా వారిని విడిచిపెట్టడమూకాదు ….స్వయంక్రుతాపరాధమే వారి బాధకి కారణం కావొచ్చేమో కానీ ”పరిస్థితుల ప్రభావం కూడా చాలా వుంది ….నిజంగా చెబితే ఒక్కొక్కరిదీ ఒక నవల రాయాల్సినంత ”జీవితం”….జాలిపడాలా..వొద్దా …అనేకంటే ..దానిలోనించి ఎంత నేర్చుకోగలమా అనేదే నా ఆలోచన …….”మంచి”వారి గురించీ రాస్తాను …సరేనా ….నమస్తే.

  • appanna says:

    భువన చంద్ర గారు ఏమి వ్రాసినా బాగుంటుంది .

    • Bhuvanachandra says:

      మీ అభిమానానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ ……….

  • Kavitha says:

    భువనచంద్రగారు,
    మీ శైలి లో ఒక వైవిధ్యం ఉంది. దాని లో ఒక తపన ఉంది. బైటికి కనిపించని ఒక ఆర్తి ఉంది. ఆర్తుల జీవేతల్లోని ఆక్రందనని సేని మా (య) జీవేతం గురించి సామనుడికి చెప్పాలనే తపన ఉంది. శేష్మం లో పడ్డ ఈగల్లాంటి జీవితాల ని చూస్తుంటే బాధ వేస్తోంది. ఎ కదా ఎలా ముగిసినా- ఇంచు మించు గా ఒకే లాంటి బతుకులు — బైటి కి ఓ వెలుగు వెలిగే తారలు – వారి జీవితం లోని దౌర్భాగ్యం, కడుపునా పుట్టిన పిల్ల లు అని చూడకుండా ఇంతటి నికృష్టని కి పాలు పడే జీవులు కూడా ఉంటారా అని నాలాటి సామన్యలు నివ్వెర పడే లాంటి నిజాలు వెలికి తెస్తున్న మీ ధైర్యానికి జోహార్లు. ఎంతైనా ఆర్మీ వాళ్ళు కదా. సెహబాష్. కీప్ అప్ ది గుడ్ వర్క్.
    నమస్తే.
    కవిత.

    • Bhuvanachandra says:

      థాంక్స్ కవితగారూ ..”..చప్పట్లు ..డబ్బు ….ప్రజల్లో గుర్తింపూ” ఇవే తారలకు స్ఫూర్తి .కనిపించేదంతా రంగుల ప్రపంచం ..మైమరచి పోయి …..లో లోతుకి కూరుకు పోవడం ….బయటికి రాలేని నిస్సహాయ స్తితి ….ఇవి మనిషిని ఎంతకైనా ”తెగించేలా ”చేస్తాయి ఈవెన్ టుది వరస్ట్ ………మీ అభిమానానికి మరోసారి ధన్యవాదాలు …..నమస్తే

  • భువన చంద్ర గారూ,గొరుసు గారు అన్నట్లు వసుంధరలో ఎవరిని దర్శించాలో అర్థం కాని డైలమా! దీపం చుట్టూ శలభాలల్లే మంటలో పడి మాడి పోయి తమ మీద తామే కసి తో జీవితాన్ని బుగ్గి చేసుకున్న జీవితాలెన్నో!

    కానీ ఇప్పటి హీరోయిన్స్ కొంత స్వేచ్ఛతో ప్రవర్తిస్తారేమో, తమని తాము కాపాడుకుంటారేమో అన్న ఆలోచన ఇటీవల పిన్ని మీద పోలిసులకు ఫిర్యాదు చేసిన అంజలిని చూస్తే కల్గింది.

    అందరూ చెప్పిన మాటే ….మీ శైలి అద్భుతంగా ఒక వొరవడిలోకి లాగి, ఊపిరి తీసుకోనివ్వకుండా కుటుంబరావు మల్లే లాక్కు పోతోంది.

    • Bhuvanachandra says:

      సుజాతగారూ ధైర్యస్తులు అప్పుడూ వున్నారు … ఆనాడూ పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు ….కానీ ఒక విషయం గమనిస్తే విస్మయం కలుగుతుంది …..ఏమిటో తెలుసా …”..ఒక దోపిడీ నించి బయటపడి ..మరో ఘోరమైన దోపిడీ కి ” గురి కావడం…అదే విచిత్రం ఓపిగ్గా చదివి అభిప్రాయం రాసిన మీ ..అభిమానానికి థాంక్స్

Leave a Reply to యాజి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)