పెళ్లి ఒకరితో…ప్రేమ ఒకరిపై…

శర్మిష్టను కోరి దేవయానికి తాళి

 

నన్ను వివాహమై నహుషనందన! యీ లలితాంగి దొట్టి యీ

కన్నియలందరున్ దివిజకన్యలతో నెన యైనవారు నీ

కున్నతి బ్రీతి సేయగ నృపోత్తమ! వాసవు బోలి లీలతో

ని న్నరలోకభోగము లనేకము లందుము నీవు, నావుడున్

                                                       -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

నహుషుని కుమారుడవైన ఓ యయాతీ! నన్ను వివాహం చేసుకుని, దేవకన్యలకు సాటివచ్చే ఈ సుందరి(శర్మిష్ట)తోపాటు ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా నరలోకంలో అనేక భోగాలు అనుభవించు…

   ***

  దేవయాని పరంగా చెప్పిన కథలా కనిపిస్తున్నా నిజానికిది శర్మిష్ట కథ అన్నాను. ఈ కోణం నుంచి ఈ కథను  ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారో లేదో నాకు తెలియదు. సంప్రదాయం అలాంటి పరిశీలనలకు సాధారణంగా అవకాశం ఇవ్వదు. అది పురాణ, ఇతిహాసాల చుట్టూ ఒక బలమైన ఊహా చట్రాన్ని నిర్మించి దానికి కాపలా కాస్తూ ఉంటుంది. తను అనుమతించిన మేరకే స్వతంత్ర పరిశీలనకు స్వేచ్ఛ నిస్తుంది. సంప్రదాయం నిర్మించే చట్రం ఎంత, బలంగా ఉంటుందంటే, ఆ చట్రం లోపలే ఆలోచించడం ఒక అసంకల్పిత చర్యగా మారిపోతుంది.  అనేక సందేహాలు, అసంబద్ధాలు ఆ చట్రం కింద అణిగిపోతాయి.  వాటిపై మౌనం ఒక ఉక్కు తెర వేలాడుతూ ఉంటుంది. మహాభారతం లోంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు. యయాతి-దేవయాని-శర్మిష్టల కథే ఒక గొప్ప ఉదాహరణ.  

అదే సమయంలో ప్రతికాలంలోనూ, ప్రతి తరమూ తన జ్ఞానవారసత్వాన్ని నూతన విజ్ఞానం వెలుగులో సరికొత్తగా దర్శిస్తూనే ఉంటుంది.  మానవ అనుభవానికీ, జ్ఞానానికీ నిత్య నవీనత్వాన్ని, తాజాదనాన్ని సంతరిస్తూనే ఉంటుంది.  దీనిని నేను అదనపు విలువను జోడించడం అంటాను. ఇలా అదనపు విలువను జోడించడం కూడా వాటి అస్తిత్వాన్ని పొడిగించే కారణాలలో ఒకటని నేను భావిస్తాను.  అలాగని సంప్రదాయపాఠాన్ని తక్కువ చేయకూడదు. శతాబ్దాలుగా సంప్రదాయ పఠన పాఠనాలు పురాణ, ఇతిహాసాలను కాపాడుకుంటూ వస్తున్నాయి కనుకే, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకు సంప్రదాయ కవి పండితులకు, పౌరాణికులకు కృతజ్ఞతా వందనాలు అర్పించుకోవలసిందే!

ఇక్కడే ఇంకొక వివరణ కూడా ఇచ్చుకోవాలి. అదనపు విలువ జోడించే ప్రయత్నంలో ప్రతిసారీ ప్రమాణాలూ, ఆధారాలూ, కచ్చితమైన అన్వయాలూ ఇవ్వలేకపోవచ్చు. గ్రంథస్థ విషయాలనుంచి పక్కకు జరగచ్చు. ఊహల మీద ఆధారపడవలసి రావచ్చు. పురాణ, ఇతిహాసాలలో వాస్తవాలను పట్టుకోవడం సాధారణంగా గడ్డిమేటలో సూదిని వెతకడంలా పరిణమిస్తుంది. అయినాసరే, ఊహకు ఉండే విలువ ఊహకూ ఉంటుంది. వాస్తవాల అన్వేషణలో  ఒక్కోసారి ఊహ తొలి అడుగు కావచ్చు.

ప్రస్తుతానికి వస్తే…

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న ’అతిశయ రూప లావణ్య సుందరిఅయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ‘ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు’ అంది.

ఆ వెంటనే, ‘నన్ను నూతిలోంచి  పైకి తీసినప్పుడే ఆ సూర్యుని సాక్షిగా నీ కుడి చేతితో నా చేయిపట్టుకున్నావు. అది నన్ను పెళ్లాడడమే. ఆ సంగతి విస్మరించడం నీకు న్యాయం కాదు’ అని హెచ్చరించింది. ఆపైన, ‘నహుషుని కొడుకువైన  యయాతీ, నన్ను పెళ్లి చేసుకుని ఈ సుందరాంగితోపాటు, దేవకన్యలకు సాటి వచ్చే ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా దేవేంద్రుడిలా ఈ నరలోకంలో అన్ని భోగాలూ అనుభవించు’ అంది. దేవేంద్ర భోగాలు అనుభవించమనడంలో తెలివిగా ‘ఓ నహుషనందనా’ అని సంబోధించింది. నహుషుడు కొంతకాలం ఇంద్రపదవిలో ఉన్నాడు.

01Kach

దేవయాని ప్రతిపాదనకు యయాతి అభ్యంతరం చెప్పాడు. క్షత్రియకన్యలను బ్రాహ్మణులు వివాహం చేసుకోవచ్చు కానీ, బ్రాహ్మణకన్యలను క్షత్రియులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఉందా, వర్ణాశ్రమధర్మాలను కాపాడవలసిన రాజునైన నేనే ధర్మం తప్పితే ప్రపంచం నడక అస్తవ్యస్తమైపోదా అన్నాడు. అప్పుడు దేవయాని, ‘గొప్ప బాహుబలం కలవాడా’ అని అతన్ని సంబోధించి, ‘ధర్మాధర్మాలు నిర్ణయించే లోకపూజ్యుడైన శుక్రుడు ఆదేశిస్తే నన్ను పెళ్లిచేసుకుంటావా?’ అని అడిగింది. ‘బాహుబలం కలవాడా’ అనడంలో, రాజ్యపాలనే నీ బాధ్యత తప్ప ధర్మాధర్మనిర్ణయం కాదు, అది శుక్రుడు చేయవలసిన పని అనే మెత్తని చురక ఉంది. అంతేకాదు, తండ్రిని తను ఒప్పించగలనన్న ధీమా కూడా ఆ మాటల్లో ఉంది.

ఆ మహాముని ధర్మవిరుద్ధం కాదంటే నిన్ను వివాహమాడతానంటూ యయాతి ఆ సంభాషణకు అంతటితో తెర దించాడు. దానిని పొడిగించడం వల్ల అతనికి నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే, అప్పటికే అతను శర్మిష్టవైపు ఆకర్షితుడయ్యాడు. దేవయాని ఆమెను తన దాసిగా పరిచయం చేసింది కనుక, ఆమెను నేరుగా తను పొందగల అవకాశం లేదు. దేవయానిని తను పెళ్లిచేసుకుంటేనే శర్మిష్ట తన దవుతుంది. బహుశా నేరుగా ఆమెను తను స్వీకరించడానికి సామాజిక స్థాయికీ, హోదాకూ చెందిన అభ్యంతరాలు కూడా ఉండి ఉండచ్చు. దేవయాని మాట నేర్పు, స్వభావం అప్పటికే అతనికి అర్థమయ్యాయి. ఆమె తనతో పెళ్ళికి తండ్రిని ఒప్పించగలదన్న నమ్మకమూ అతనికి కలిగి ఉంటుంది. దేవయానితో పెళ్ళికి అంగీకరిస్తేనే శర్మిష్ట  తనకు దక్కుతుంది కనుక దేవయానితో తన పెళ్లి ధర్మమా, కాదా అన్న చర్చ తనకు అనవసరం. అది తేల్చే బాధ్యత దేవయాని తీసుకుంది.

జాగ్రత్తగా గమనించండి…యయాతి దేవయాని పట్ల ఆకర్షితుడు కాలేదు. ఇంతకుముందు ఆమెను నూతి లోంచి పైకి తీసిన తర్వాత అతను తన దారిన తను వెళ్లిపోయాడని చెప్పడం ద్వారా కథకుడు ఆ సూచన చేయనే చేశాడు. ప్రస్తుత సందర్భంలో, ‘అతిశయ రూపలావణ్యసుందరి’ అయిన శర్మిష్ట గురించి తెలుసుకో గోరాడని అనడం ద్వారా ఆమె వైపు అతను ఆకర్షితుడయ్యాడన్న సూచన అంతకంటే స్పష్టంగా ఇచ్చాడు.

దేవయాని, యయాతి ల మధ్య నడిచినది ఒకవిధమైన మైండ్ గేమ్. ఇద్దరిలోనూ లౌక్యమూ, గడుసుదనమూ ఉన్నాయి. ఇద్దరికీ తమవైన వ్యూహాలు ఉన్నాయి. దేవయానికి రాజును పెళ్లాడడం ముఖ్యం. తద్వారా లభించే రాచవైభవం ఆమెకు కావాలి. యయాతికి రూపలావణ్య సుందరి అయిన శర్మిష్ట కావాలి. శర్మిష్ట మనసులో ఆ క్షణంలో ఎటువంటి ఆలోచనలు చెలరేగాయో మనకు తెలియదు. అప్పటికామె ఎటు వంచితే అటు వంగవలసిన మైనపు బొమ్మ!

దేవయాని అప్పటికప్పుడు తండ్రిని రప్పించింది. ‘ఈ రాజు ఇప్పటికే నా పాణిగ్రహణం చేశాడు కనుక వివాహ సంబంధంగా ఇంకొకరు నా చేయి పట్టుకోవడం ఎలా ధర్మమవుతుంది? కనుక ఈ జన్మలో ఇతడే నా భర్త. నువ్వు ఒప్పుకుంటే నన్ను పెళ్లాడతానని ఇతడు కూడా మాట ఇచ్చాడు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడు’ అని తండ్రితో అంది. గమనించండి…దేవయాని ఈ పెళ్లి ధర్మబద్ధమో, కాదో చెప్పమని అడగలేదు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడమని మాత్రమే అడిగింది. అంటే తన terms and conditions ను స్పష్టంగా నిర్దేశించిందన్నమాట. శుక్రుడు వాటిని దాటి మాట్లాడే ప్రశ్నే లేదు. ఈ వివాహంలో ఎలాంటి ధర్మోల్లంఘనా లేదన్న ఒకే ఒక వాక్యంతో ఆమోదం తెలిపేశాడు. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.

ఆ తర్వాత శుక్రుడు శర్మిష్టను యయాతికి చూపించి, ’ఈమె వృషపర్వుని కూతురు. ప్రేమతో ఈమెకు అన్నపానాలు, వస్త్రాభరణాలు, సుగంధలేపనాలు వగైరాలు సమకూర్చి సంతోషపెట్టు. అయితే ఈమెతో నువ్వు పడక సుఖానికి మాత్రం దూరంగా ఉండాలి’ అన్నాడు. యయాతి శుక్రుని వద్ద సెలవు తీసుకుని దేవయానినీ, శర్మిష్టతో సహా దాసీకన్యలనూ  వెంటబెట్టుకుని రాజధానికి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఒక చక్కని మేడలో దేవయానిని ఉంచి; ఆమె అనుమతితో శర్మిష్టనూ మిగిలిన కన్యలనూ అశోకవనం సమీపంలోని ఒక గృహం లో ఉంచాడు.

యయాతితో శుక్రుడు అన్న పై మాటలు అతని స్వభావాన్నీ, దేవయాని స్వభావాన్నీ కూడా మరోసారి వెల్లడిస్తున్నాయి. దేవయానిలో అహమూ, అసూయే కాక; అవకాశవాదమూ, స్వార్థమూ కూడా హెచ్చుపాళ్లలోనే ఉన్నాయి. యయాతిని తనతో పెళ్ళికి ఒప్పించే ముందు; శర్మిష్టనూ, మిగిలిన దాసీ కన్యలనూ చూపించి దేవతాస్త్రీలకు సాటివచ్చే ఈ సుందరాంగులందరూ నిన్ను సుఖపెడతారని ఆశపెట్టింది. తీరా యయాతి పెళ్ళికి ఒప్పుకున్నాక మాట మార్చింది. యయాతిని శర్మిష్టతో కలసి పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆ మాట యయాతితో తను నేరుగా చెప్పకుండా తండ్రితో చెప్పించింది. తండ్రి ఆదేశాన్ని ఉల్లంఘించే సాహసం యయాతి చేయడని ఆమె ధీమా.

శుక్రుడు కూతురి అభిమతాన్ని కాదనే ప్రసక్తే లేదు కనుక, శర్మిష్టను పడక సుఖానికి  మాత్రం దూరంగా ఉంచమని యయాతికి ప్రత్యేకించి చెప్పాడు. అయితే, వృషపర్వుని కూతురైన ఈమెకు అన్నీ సమకూర్చి సంతోషపెట్టు అని కూడా అంతే ప్రత్యేకంగా చెప్పాడు. అలా చెప్పడంలో శర్మిష్టపై అతనికున్న పుత్రికావాత్సల్యమూ, సుకుమారంగా సుఖాల మధ్య పెరిగిన ఆమెను కష్టపెట్టవద్దని చెప్పే ఔదార్యమూ, ధార్మికతా వ్యక్తమవుతూ ఉండచ్చు.

ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, శర్మిష్టకు అన్ని వసతులూ కల్పించి పడక సుఖానికి మాత్రం దూరంగా ఉంచమని శుక్రుడు చెప్పడంలో, ఆమెనుంచి పడక సుఖం కూడా పొందమన్న ధ్వని ఉండడానికీ అవకాశముంది. దాని గురించి వివరించుకోవడం ప్రారంభిస్తే, ఆ వివరణ ఇంతకుముందు చెప్పినట్టు, దేవయాని పరంగా చెప్పిన కథను శర్మిష్ట పరంగా మార్చివేస్తుంది. శర్మిష్టనే కథానాయికగా మనముందుకు తీసుకొస్తుంది.

ఎలాగంటే, యయాతికి శర్మిష్టను చేపట్టడమే ప్రధాన లక్ష్యం. అందులో వ్యక్తిగత ఆకాంక్షే కాక, రాజకీయ అవసరం కూడా ఉండచ్చు. తను రాజు కనుక రాచకన్యద్వారానే వారసుని కనవలసి ఉంటుంది.  అప్పుడే దానికి సమాజం నుంచి హర్షామోదాలు లభిస్తాయి. దేవయానికి కలిగే సంతానానికి సమాజం ఆ ప్రతిపత్తి ఇవ్వదు. వారసుని ఎంపికలో ఆనాటి రాజుకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదు. అది సమాజమూ, రాజూ కలసి తీసుకోవలసిన సమష్టి నిర్ణయం. యయాతికీ, శుక్రుడికీ కూడా ఆ అవగాహన ఉంది. అయితే, ఇక్కడ మధ్యలో దేవయాని ఉంది. ఇంతవరకు శుక్రుడికి నెత్తి మీద దేవతగా ఉన్న దేవయాని ఇకముందు యయాతికి చిక్కుముడిగా మారబోతోంది. బహుశా యయాతి-శర్మిష్టల మధ్య కలగబోయే సంబంధం శుక్రుని ఊహలో ముందే ఉండి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే, అందుకు సంబంధించిన రాజకీయ ప్రణాళికలో శుక్రుడు కూడా భాగస్వామి అయుండచ్చు.

కూతురిపై అపరిమిత మమకారం ఉన్న శుక్రుడు ఆమె కాపురంలో చిచ్చు పెట్టే పాత్ర నిర్వహించాడంటే వినడానికి విడ్డూరంగానూ, విపరీతంగానూ ఉండే మాట నిజమే. అయితే, కాసేపు దేవయాని పరంగా చెప్పిన కథ అన్న సంగతి మరచిపోయి శర్మిష్ట పరంగా చెప్పిన కథగా ఊహించుకోండి. యయాతి అసలు శర్మిష్టనే చేపట్టాలనుకున్నాడు. అయితే, ఆమె దేవయానికి అప్పటికే దాసిగా మారిపోయింది కనుక యజమానురాలిని పెళ్లాడితేనే శర్మిష్ట తనకు దక్కుతుంది. యయాతి వైపునుంచి ఈ మొత్తం వ్యూహానికి సంబంధించిన అవగాహన లోకజ్ఞుడైన శుక్రుడికి పూర్తిగా ఉంది. దేవయానికి లేదు. ఎందుకంటే, ఆమెది పూర్తిగా వైయక్తికమైన అజెండా. అందులో ఇతరేతర అంశాలకు చోటులేదు.

  అసలు శర్మిష్ట కథను దేవయాని వైపునుంచి కథకుడు ఎందుకు చెప్పినట్టు? రెండు కారణాలను ఊహించవచ్చు. మొదటిది, దాసిగా ఉన్న శర్మిష్టను రాజమార్గంలో చేపట్టడానికి యయాతికి అవకాశంలేదు. అందుకు సామాజిక నిర్బంధాలు అడ్డువస్తాయి. రెండవది, కథకుడికి దేవయానిని ప్రధానం చేసి కథ చెప్పడమే ఇష్టం. ఎందుకంటే, ఆమె భృగువంశీకురాలు. కోశాంబీ ప్రకారం మహాభారత పరిష్కరణలో భృగులు ప్రధాన భూమిక పోషించారు. భృగులను విశిష్టులుగా చిత్రించే ఘట్టాలు మహాభారతంలో చాలా ఉన్నాయి. పరశురాముడు ఇంకో ఉదాహరణ.  

కథలోకి వస్తే, ‘దేవయాని అనుమతి’తో శర్మిష్టను ఇతర దాసీ కన్యలతోపాటు యయాతి అశోకవన సమీపంలో ఒక గృహంలో ఉంచాడని కథకుడు చెబుతున్నాడు. ఆ సమాచారంతో యయాతి-శర్మిష్టల మధ్య జరగబోయే సమాగమాన్ని  సూచిస్తున్నాడు. అంటే, ఎంత దేవయాని వైపునుంచి కథ చెప్పినా కథకుడు శర్మిష్ట ప్రాధాన్యాన్ని కప్పిపుచ్చలేకపోతున్నాడన్నమాట!  అదలా ఉంచితే, ‘దేవయాని అనుమతితో’ శర్మిష్టను (తను తరచు విహరించే) అశోకవన సమీపంలో ఉంచాడని చెప్పడం  ద్వారా, అనేకమందితో రహస్య ప్రణయాలు సాగిస్తూ, భార్యపట్ల అతి విధేయతను ప్రదర్శించే దక్షిణనాయకుడిగా యయాతిని కథకుడు మన ముందుకు తెస్తున్నాడు.

అనంతర కథ తర్వాత…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 –కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

1 Comment

  • anrd says:

    శర్మిష్ఠ.. రాక్షస రాజు కూతురు.

    బ్రాహ్మణుని కూతురు అయిన దేవయాని ఒక క్షత్రియుని వివాహం చేసుకోవటం తప్పయినప్పుడు , ఒక రాక్షస రాజు కూతురు మానవుడైన యయాతిని వివాహం చేసుకోవటం తప్పు కాదా ? అనేది నాకు అర్ధం కాలేదు .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)