వైవిధ్యానికి ప్రతిబింబం శారద ” నీలాంబరి ” కథలు !

Neelambari Cover

నాకు ముందుమాటలు రాసే అలవాటు లేదు. ఇదివరకోసారి రాసేను కానీ ప్రచురణకర్తలు అంగీకరించ లేదు  దాన్ని (చిత్రంగా ఉంది కానీ ఇలా కూడా జరగగలదని నాక్కూడా అప్పుడే తెలిసింది!). అంచేత, శారద నన్ను ముందుమాట రాయమని అడిగినప్పుడు నేను సంకోచించాల్సివచ్చింది. కానీ శారద తప్పకుండా రాయమని మరీ మరీ అడగడంతో ఒప్పుకోక తప్పలేదు.

శారదతో నాపరిచయం నాసైటు www.thulika.net ద్వారానే. గత ఐదారేళ్ళలో దాదాపు పదికథలవరకూ అనువాదం చేసి ఇచ్చేరు. ఆమె నా సైటుధ్యేయం శ్రద్ధగా పరిశీలించి తదనుగుణంగా కథలు ఎంపిక చేసి. అనువాదం చెయ్యడం, అవి కూడా అనువాదాలవిషయంలో నా అభిప్రాయాలకి సానుకూలంగా ఉండడంచేత నాకు శారదయందు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. అంచేత ఈ ముందుమాట రాయడానికి అంగీకరించేను.

ఆ తరవాత ఈ ముందుమాట రాయడానికి కూర్చుంటే, సంకలనాలపుట్టుక గురించిన ఆలోచనలు కలిగేయి. అసలు సంకలనాలు ఎందుకు వేస్తారు, అవి ప్రత్యేకంగా సాధించే ప్రయోజనం ఏమిటి అని.

మన దేశంలో ముద్రణాలయాలు 1675లో వచ్చినా, దక్షిణానికి ఆ యంత్రాలు 1711లో వచ్చేయి. మొదట్లో ప్రచురించినవి ఎక్కువగా క్రైస్తవ మతప్రచారానికే. రెండవదశలో తెలుగు సాహిత్యాభిలాషులు తెలుగుసాహిత్యానికి ప్రాధాన్యతని ఇస్తూ పత్రికలు ప్రచురించడం మొదలు పెట్టేరు. గోదావరి విద్యాప్రబోధిని (1800కి పూర్వం), మితవాది 1818లో వచ్చాయి. సుజనరంజని (1862-1867), పురుషార్థప్రదాయిని (1872-1878) లాటి పత్రికలతో పాటు  వీరేశలింగంగారి వివేకవర్ధిని (1874-1885), కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి ఆంధ్రభాషా సంజీవని (1871-1892; 1892-1900) లాటి పత్రికలు పుట్టేయి. (సమగ్రాంధ్ర సాహిత్యం. సం. 2. పు. 620-621, తెలుగు ఎకాడమీ ప్రచురణ). ఆరుద్ర సమకూర్చిన పట్టికలో 102 పత్రికలపేర్లు ఉన్నాయి. వాటిలో భారతి, గృహలక్ష్మి, ఆంధ్రపత్రికలాటి ఏ నాలుగయిదు పత్రికలో తప్పిస్తే, పైన ఇచ్చినతేదీలు కాక, మిగతాని పదేళ్ళపాటైనా మనలేదు. ఈ పత్రికలలో సమకాలీన సామాజికసమస్యలూ, సాహిత్యచర్చలూ విరివిగా జరిగేయి. వాటితోపాటు ప్రతి సంచికలోనూ ఒకటో రెండో కథలు కూడా ప్రచురించేరు. కానీ ఈ పత్రికలేవీ అట్టే కాలం నిలవకపోవడంతో, బహుశా ఆ యా రచయితలో సాహిత్య శ్రేయోభిలాషులో ఆ కథలని సంకలనాలుగా ప్రచురిస్తే, భావితరాలకి అందుబాటులో ఉంటాయన్న అభిప్రాయంతో సంకలనాలు ప్రచురించడం మొదలు పెట్టినట్టు నాకు తోస్తోంది. నేనిలా అనుకోడానికి ప్రమాణాలేమీ లేవు. నాకు చూడడానికి అట్టే పుస్తకాలు దొరికే అవకాశం లేదు కనక నేను ఈవిషయం ఇతర పరిశోధకులకి వదిలేస్తున్నాను.

ఈరోజుల్లో ఆధునికకథలు అనిపించుకుంటున్న కథలు సంకలనాలుగా 20వ శతాబ్దం ప్రథమపాదంలోనే వచ్చేయి. అప్పట్లో పత్రికలప్రచురణ బాగానే అభివృద్ధి చెందినా, చాలా పత్రికలు పుబ్బలో పుట్టి మఖలో మాడిపోడంతో రచయితలు తమ కథలని సంకలనాలుగా ప్రచురించడం మొదలెట్టి ఉండొచ్చు. ఆ తరవాత వేరు వేరు రచయితలకథలతో సంకలనాలు వచ్చేయి.

మనం స్మరించుకోవలసిన మరొక విభాగం జానపదసాహిత్యం. మనకి ఆనోటా ఆనోటా చెప్పుకుంటున్న జానపదసాహిత్యం చాలా ఉంది. అయితే ఈ చెప్పుకోడంలో పరిధి చాలా తక్కువ. ఇంట్లోవాళ్లూ, ఇరుగూ పొరుగూ, ఇంటికొచ్చినవాళ్ళూ – వీళ్లే ఆ చెప్పుకునే కథలకి శ్రోతలు. ఇది గమనించిన సాహిత్యాభిమానులు ముద్రణాలయాలొచ్చేక కథలని అచ్చొత్తించి భావితరాలకి అందించాలనే కోరికతో ఆ కథలని సేకరించి ప్రచురించడం ప్రారంభించేరు.  “కుంఫిణీయుగంలో పాతకథలకి కొత్త గిరాకీ వచ్చిందం”న్నారు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం 2. 47). 1819లో రావిపాటి గురుమూర్తి విక్రమార్కునికథలు సంకనలంగా ప్రచురించేరని ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యంలో రాసేరు. (2. 268). 1830 మేలో ఏనుగు వీరాస్వామి కాశీయాత్రకి బయల్దేరి, దారిలో తాను చూసిన వింతలూ, విశేషాలూ …కి ఉత్తరాలలో రాసేరుట. … గారు వాటిని ఆ తరవాత ప్రచురించేరు. ఇది కథ కాదు కానీ కేవలం పుస్తకాలు అచ్చేయడంలో మనవారికి గల ఆసక్తి తెలియజేయడానికి చెప్పేను. కథలమాటకొస్తే, పంచతంత్రం 1834లో, పాటూరి రామస్వామి శాస్త్రులుగారి శుకసప్తతికథలు 1840లో ప్రచురించేరు (కె.కె. రంగనాథాచార్యులు. తొలినాటి తెలుగు కథానికలు. 1840 చాలా ప్రాముఖ్యత గల సంవత్సరం అంటారు ఆరుద్ర (స.సా. 2. 55). తెలుగు సాహిత్యంలో విస్తృతంగా ప్రచురణ మొదలయిందప్పుడే కాబోలు. ఈ సంకలనాల్లో మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏకసూత్రత. అన్నీ జానపదసాహిత్యంలో అంటే నోటిమాటగా చెప్పుకుంటున్న కథలే అయినా, సంకలనాలుగా ప్రచురించినప్పుడు “మాకిష్టం అయినకథలు” అని గాక, ఒక నిబద్ధత పాటించేరు. భట్టి విక్రమార్కుడి కథలలో చిక్కు ప్రశ్నలు, శుకసప్తతికథల్లో శృంగారం, నీతి, తెనాలి రామలింగడికథల్లో హాస్యం, చమత్కారం, కాశీమజిలీకథల్లో దారిపొడునా ఊరూరా ఆ గురుశిష్యులు గమనించిన వింతలు, విశేషాలు – ఇలా ఏకసూత్రత కనిపిస్తుంది.

ఆతరవాత అంటే 1910 దాటేక, ఒక రచయిత తాను ఎంచుకున్న కథలు, కానీ ఒకే రచయిత కథలు గానీ ప్రచురించడం మొదలయింది. కె.కె. రంగనాథాచార్యులు గారి తొలినాటి తెలుగు కథానికలు పుస్తకంలో మొత్తం 15 సంకలనాలు 1917 నించి 1928మధ్య ప్రచురించినట్టు ఉంది. వీరిలో మనకి ఇప్పుడు తెలిసినవారు పానుగంటి లక్ష్మీనరసింహారావు – సువర్ణలేఖా కథావళి (తేదీ లేదు), మాడపాటి హనుమంతరావు – మల్లికాగుచ్ఛము (1915), పానుగంటి లక్ష్మీనరసింహారావు – కథాలహరి (1917), గుడిపాటి వెంకట చలం – కన్నీటికాలువ, మునిమాణిక్యం నరసింహారావు – కాంతం కథలు, గురజాడ అప్పారావు – ముత్యాలసరాలు చిన్నకథలు, వీటితోపాటు మరుగున పడిపోయిన రచయితలు – వెదురుమూడి శేషగిరిరావు – మదరాసు కథలు (1911?), రాయసం వెంకటశివుడు – చిత్రకథామంజరి (1924), పోదూరు రామచంద్రరావు – కథావళి (1928) లాటి పేర్లు కూడా కనిపించేయి. (పు. 28-29). ఈ సంకలనాలలో ఏవి ఒకే రచయిత కథలు, ఏవి వివిధరచయితలో కథలు అన్నది రచయిత స్పష్టం చేయలేదు. నామటుకు నాకు రెండు రకాలూ అయి ఉండవచ్చని తోస్తోంది.

నలభై, యాబై దశకాలలో సంకలనాలు విరివిగా వచ్చేయి. మొదట్లో ఏదో ఒక సంస్థ పూనుకుని ప్రచురించడం జరుగుతూ వచ్చింది. సంకలనకర్తని ఆ సంస్థే ఎంచుకోవచ్చు. లేదా ఎవరో ఒకరు సంకలించడానికి పూనుకుని సంకలనం తయారు చేసి ప్రచురణసంస్థలని ప్రచురించమని అర్థించవచ్చు. ఈ సంకలనాలకి ఆదరణ కూడా బాగానే లభించింది. అందుకు కారణం ప్రధానంగా రచయితలపేర్లు పత్రికలద్వారా ప్రచారం కావడం. ఆ తరవాతి దశలో ప్రచురణకర్తలు నవలలకి ప్రాధాన్యం ఇచ్చి చిన్నకథలని చిన్నచూపు చూడడంతో రచయితలు తమకథలు తామే సంకలనాలుగా వేసుకోడం ప్రారంభించేరు. కాలక్రమంలో ఇది 90వదశకంలో వచ్చిందనుకుంటున్నాను.

ఇప్పడు, అంటే గత 40 ఏళ్ళగా డయాస్పొరా కథలు రావడం మొదలయింది. సంకలనాలు ఇంకా ఆలస్యంగా అంటే గత ఇరవై ఏళ్ళలో వస్తున్నట్టుంది. ఈ సంకలనాలు ఎక్కువభాగం అమెరికాలో ఉన్న తెలుగువారికలంనుండి వస్తున్నవే. శారదలా ఆంధ్రదేశానికీ, అమెరికాకీ దూరంగా ఉండి రచనలు సాగిస్తున్నవారు తక్కువే నాకు తెలిసి. ఇంతకీ ఏ కథలు డయాస్ఫొరా కథలు అంటే నేను సమాధానం చెప్పలేను. ప్రధానంగా డయాస్ఫొరా కథలు ఎలా ఉంటాయి అన్నవిషయంలో నాకు అవగాహన లేదు. వేలూరి వెంకటేశ్వరరావు వ్యాసం(http://www.eemaata.com/em/issues/201003/1547.html) చూసేక నాకు అర్థమయిన విషయం – ఈనాడు డయాస్ఫొరా కథ అంటే అటు పుట్టినదేశానికి దూరమై అక్కడిజీవితాన్ని మళ్ళీ మళ్ళీ తలబోసుకోడమో (నోస్టాల్జియా), ఇటు మెట్టినదేశంలో సాంస్కృతికసంఘర్షణలలో ఈతిబాధలు కలబోసుకోడమో అనిపిస్తోంది. ఆవిధంగా ఆలోచిస్తే శారదగారి సంకలనాన్ని డయాస్ఫొరా అనడానికి నాకు మనసొప్పడం లేదు. ఈకథల్లో ఇతివృత్తాలు ఈ డయాస్ఫొరా నిర్వచనంలో ఇమడవు అనిపించింది నాకు. ఈవిషయానికి మళ్లీ వస్తాను.

ప్రస్తుతం ఆధునిక, సమకాలీన, సామాజిక కేంద్రంగల కథలు అంటే ఒక సందేశమో ఇతివృత్తమో ఏకసూత్రంగా ఉన్నవి అనుకోవాలి. అంటే స్త్రీలకథలు, దళితకథలు, ఆకలి కథలు, ఏదో ఒక ఊరి కథలు … ఇలా ఆ సంకనలకర్త అభిరుచులని బట్టి, ఇష్టాయిష్టాలని బట్టి సంకలనాలు వస్తున్నాయి. ఎనభై దశకంలో స్త్రీవాదం, దళితవాదంలాటి వాదాలు ప్రబలడంతో, ఏదో “వాద“ కథలనే అంటున్నా, వీటన్నిటికీ సాంఘికప్రయోజనం అన్న మరో ధర్మసూత్రం కూడా గొడుగు పట్టడంతో సంకలనాలలో వైవిధ్యం అదృశ్యమయిపోయే ప్రమాదం కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా ప్రచురిస్తున్న కథ ????(ఏదో సంవత్సరం) తీసుకోండి మనకి కొట్టొచ్చినట్టు కనిపించేది ఇదే.

ఒకే రచయిత రాసినకథల్లో వైవిధ్యం వస్తువులో, శైలిలో, శిల్పంలో, పాత్రచిత్రణలో, భాషలో, సందర్భాలలో, సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణలో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన విశేషాలూ, సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాం. ఈకథల్లో హాస్యం ఉంది, వ్యంగ్యం ఉంది. సమాజంలో జరిగే అకృత్యాలమీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వచిత్రణ ఉంది. ఈ సంకలనంలో ప్రతికథమీద నేను వ్యాఖ్యానించను కానీ ఉదాహరణకి కొన్ని కథలు పరిశీలిస్తాను.

మొదటి కథ రాగసుధారసపానము ఎత్తుగడలో హాస్యరసస్పోరకంగా ఆషామాషీగా ఉన్నా, ముగింపులో మన శాస్త్రీయసంగీతం భవిష్యత్తుగురించిన తపన కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఈరచయిత్రే రాసిన మాయింట్లో మర్డర్లు చదివినప్పుడు, రచయిత్రి ఒకే అంశానికి భిన్నకోణాలు ఆవిష్కరించడం కనిపిస్తుంది. (చూ. నీలంబరి బ్లాగు, http://sbmurali2007.wordpress.com/).

యుద్ధసమయంలో బతికుంటే బలుసాకు తినొచ్చు అనుకుని పడవెక్కి  మరో దేశానికి పారిపోతే, అక్కడ ఎదుర్కొనే దుస్థితిగురించి చెబుతుంది పడవ మునుగుతోంది కథ. ఇది దేశం వదిలి పోయినవారి కథ కనక ప్రవాసాంధ్రులకథ అనుకోవచ్చేమో కానీ రచయిత్రి కథ మలిచినతీరులో డయాస్ఫొరా ఎల్లలు దాటి, మానవీయకోణం ఆవిష్కరించడం చూస్తాం. ఒక మనిషి పరిచయమయిన తరవాత ఆ మనిషితత్వాన్నిగురించి, వ్యక్తిత్వాన్నిగురించి ఊహలు కలగడం సహజం. నిజానికి మనఊహలకీ ఆశలకీ ఒక అవినాభావసంబంధం ఉంది. ఆ రెంటినీ సమన్యపరుచుకుని సమాధానపడడం ఎలా అన్న ప్రశ్నకి సమాధానం ఊహాచిత్రం. ఇందులో వాచ్యం కాని మరొక అంశం ఎవరి ఊహలు ఎంతవరకూ నిజం అన్నది. అది పాఠకులఊహలకి వదిలిపెట్టడం రచయిత్రి నేర్పుకి ఉదాహరణ.

అతిథి కథలో విశేషం అతిథిసత్కారాలు మన జీవితంలో ఒక భాగం. ఆ ఆగంతుకుడు ఒక చిలుక అయినప్పుడు ఆ చిలుక పొందిన అతిథిసేవ హృద్యంగమంగా చిత్రించిన కథ. ఈ కథలో చిలుక ప్రసక్తి రాగానే నాకు గుర్తొచ్చిన రెండు కథలు భద్రాచల రామదాసుకథ, ఆచంట శారదాదేవిగారి పారిపోయిన చిలుక. ఈ రెండు కథలకీ భిన్నంగా శారద తనకథలో మానవుడికీ మానవేతర జీవులకీ మధ్య ఉండగల సౌమనస్యం, సౌజన్యం చిత్రించేరు. నాకు ఈ అభిప్రాయం ఏర్పడడానికి కారణం కథలో ప్రధానపాత్ర చిలుకే అయినా కథ కుక్కపిల్ల, పిల్లిపిల్లతో మొదలవడం. సాధారణంగా ఆధునికకథల్లో కథాంశం ఎత్తుగడలోనే చెప్పాలంటారు విజ్ఞులు. అలా అనుకుంటే ఈ కథ చిలుకతోనో, ప్రధానపాత్ర అయిన గృహిణితోనో మొదలవాలి. కానీ మరో రెండు జీవాలని పరిచయం చేయడంతో, కథకురాలు కథని విస్తృతం చేసేరు.

నేనెవర్ని కథలో వస్తువు సర్వసాధారణమే అనిపించినా, ఈకథకి నేనెవర్ని అని శీర్షిక ఇవ్వడం పెట్టడం రచయిత్రి సూక్ష్మదృష్టికి తార్కాణం. పాఠకులదృష్టిని ఆకట్టుకోగల శీర్షిక అది. ఎందుకంటే మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఆ ప్రశ్న, నేనెవర్ని, అనిపించకమానదు. కథమాటకి వస్తే, “స్త్రీ ఎవరు?” అంటే మనకి అనూచానంగా వస్తున్న నిర్వచనం “కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా, అని. కానీ ఈ శాస్త్రాలు పుట్టినకాలంలో పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఈనాటి స్త్రీ వ్యక్తిత్వం వేరు. ఈనాటి ధర్మపత్ని బయటికి వెళ్ళి బయటిపనులు కూడా చేస్తోంది. పైగా తన అస్తిత్వాన్ని గురించిన స్పృహ కొత్తగా వచ్చింది. ఆ దృష్టితో చూస్తే ఇది స్త్రీవాదకథ అనుకోవచ్చు. కానీ తరిచి చూసే పాఠకులకి మరికొన్ని ఆలోచనలు స్ఫురించగలవు. ఉదాహరణకి ఈకథలో ప్రధానపాత్ర మగవాడయితే, ఆఫీసులో అధికారికి సలాములు చేసినా, ఇంటికొచ్చేక, ఇంట్లో యజమాని, పిల్లలకి తండ్రి, భార్యకి భర్త, తల్లిదండ్రులకి సుపుత్రుడు – ఇలా అనేక పాత్రలు పోషిస్తాడు. మనిషి సంఘజీవి, కుటుంబజీవి కనక వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పాత్రలు నిర్వహించడం సహజమూ, అవసరమూను. ఈ రెండు కోణాలూ పక్క పక్కన పెట్టి చూసినప్పుడు, సమాజంలోనూ, కుటుంబంలోనూ వ్యక్తికి గల బాధ్యత ప్రస్ఫుటమవుతుంది. తద్వారా సాటి మనిషిని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం. రచయిత్రి ధ్యేయం ఇదీ అని నేను చెప్పడంలేదు. కానీ పాఠకుడు ఇలా కథని విస్తరించి చదువుకున్నప్పుడు కథకి మరింత బలం చేకూరగలదు అని నా నమ్మకం. కథకులకీ, పాఠకులకీ కూడా దీనివల్ల లాభమే.

అలాగే పడగనీడ కూడా పాఠకులని ఆలోచింపజేయగలకథ. లోకంలో హింస, దౌర్జన్యం, దుర్మార్గం విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లలకి రక్షణ లేకుండా పోతోంది. పాము పడగనీడ వసించు కప్పల్లా పిల్లలబతుకులు దినదినగండం అయిపోతున్నాయి. ఇది అందరికీ తెలిసినవిషయమే. అయితే, అలా జరగడానికి కారణం ఏమిటి? ఒక కారణమేనా, అనేక కారణాలున్నాయా? ఉంటే అవేమిటి? ఇలా ఆ దౌర్జన్యానికి వెనక కారణాలు వెతకడం ఒక దారి. మరి రేపటిమాట ఏమిటి? ఆ హింస, దౌర్జన్యం జరగకుండా చెయ్యాలంటే, ఎక్కడెక్కడ మనం ఏ ఏ మార్పులు చెయ్యాలి, చెయ్యడానికి పాటు పడాలి అని ఆలోచించుకోడం మరో దారి. ఇన్ని కోణాలు చిత్రించడంలో రచయిత్రి విజయం సాధించేరు. కథలు పాఠకులని ఆలోచింపజేయాలి. అనేక కోణాలు స్పశించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలి. ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కథకీ, ఒక కోణాన్ని ఆవిష్కరించే కథకీ అదే వ్యత్యాసం.

స్థూలంగా, కథ నడపడంలో మంచి నేర్పు ఉంది రచయిత్రికి. ఎక్కడా అధిక ప్రసంగాలూ, అర్థరహితమైన ఉపన్యాసాలూ లేని కథలివి. అలాగే కథలకి శీర్షికలు పెట్టడంలో, వస్తువు ఎంచుకోడంలో, ఆ అంశాల్లో తనకి గల అవగాహన స్పష్టం చేయడంలో, కథ నడపడంలో శారద కృతకృత్యులయేరని చెప్పడానికి నేను సందేహించను. అది మంచి రచయిత లక్షణం. ఎక్కడా విసుగు పుట్టకుండా చకచక చదువుకుంటూ పోవడానికి కావలిసిన పటుత్వం ఉంది శైలిలో.

భాషవిషయం నాకు ప్రత్యేకించి అభిమానవిషయం. అంచేత ప్రత్యేకించి ఈ సంకలనానికి ఇది వర్తించకపోయినా, ఈ విషయం కాస్త వివరంగా రాస్తున్నాను (అందుకు శారద, సురేష్ కొలిచాల అనుమతిస్తారని ఆశిస్తూ). గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి ప్రతిష్ఠాత్మకరచయితలు వందేళ్ళకి ముందే వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించేరు. ఇప్పుడు మనం అందరం వ్యావహారికభాషలోనే రాస్తున్నాం. అయితే, ఇది అప్పారావు గారూ, రామ్మూర్తిపంతులు గారూ చూసి ఆనందించి, అభినందించే వ్యావహారికమేనా? అంటే నాకు అనుమానమే. ఆనాడు మనతెలుగుకథలు సంస్కృతంలో రాస్తే, ఇప్పుడు ఇంగ్లీషులో రాస్తున్నట్టుంది. కొన్ని కథలు చూస్తే ఇది తెలుగుకథ అని నాకు అనిపించడం లేదు. ఇంగ్లీషుమాటలు కూడబలుక్కుని చదువుకుని, మనసులో మళ్ళీ నాతెలుగులోకి తర్జుమా చేసుకుని చదవాల్సివస్తోంది. ఈవిషయంలో బెంగాలీ రచయితలు కృషి చేస్తున్నట్టు గురజాడకి జ్ఞానేంద్రమోహన్ దాసు 1914లో రాసిన జాబువల్ల తెలుస్తోంది. (గురజాడ అప్పారావు. గురజాడ జాబులు, దినచర్యలు. సం. సెట్టి ఈశ్వరరావు. పిడియఫ్ లో పు. 58.). ఆయన ఇలా రాసేరుః

“విజయనగరం, విశాఖపట్టణాలలో నేను వున్న ఆ స్వల్పకాలంలో, నేనొక విషయాన్ని గ్రహించగలిగాను. అక్కడి పండితులు రెండు వర్గాలు. మొదటివర్గంవారి పద్ధతి అతి ప్రాచీనం. సాహిత్యరచనలో ఏ మాత్రపు ప్రాచీన పద్ధతులు సడలినా వారు సహించరు. మార్పుకు వారు విముఖులు. రెండవర్గంవారు సుముఖులు. కనక ఈ ఇరు తెగలవారికి అన్నిటా చుక్కెదురు.

ఒకొప్పుడు బెంగాలీభాష పరిస్థితి ఇలాగే వుండేది. పదాడంబరంతో పడికట్టు రాళ్ళవంటి శబ్దాలతో సమాసపు బిగింపులతో వచనరచన అధ్వాన్నంగా తయారయింది. విభక్తిప్రయ్యాలను మాత్రం మార్చి అనుస్వార విసర్గ క్రియారూపాలను సర్దుబాటు చేసుకుని, సంస్కృత శబ్దాలను ఠస్సాకు ఠస్సాయించి పండితులు భాషను కృతకం కావించారు. ఈ క్రియాపదాలు సైతం సంస్కృతవ్యాకరణసూత్రాలకు విరుద్ధంగా కటువుగా సృష్టి అయేవి. పండితులు వ్రాసే కృతకవచన శైలి ఇటు ప్రజలకు అటు విద్యావంతులకు అర్థం కాక కొరకరాని కొయ్యగా రూపొందింది. కాగా ఎవరి ఆదరణ లభించక, గ్రంథాలలో మేట వేసుకుపోయింది. ఇలాటి పరిస్థితులలో రాజా రామమోహన్‌రాయ్ చదవతగ్గ వచనాన్ని సృష్టించాడు. దానిని విద్యాసాగరుడు అనుసరించి, వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఈయన స్వతంత్రకల్పనలకు యోచనకు ఆస్కారం లేక అనువాదాలతోనే గడిచిపోయింది. … …

టేక్ చంద్ సర్వస్వతంత్రుడు, అత్యంత సాహసి. … ఆయన భాషాప్రవాహాన్ని తనకభిముఖంగా తిప్పుకుని, దానిని పండితులపై తిప్పికొట్టేడు. … ఈనాడు మీరు ఆంధ్రసాహిత్యంలో బహుశా ఏయే పరిణామాలను కోరుతున్నారో వాటిని ఆయన వంగసాహిత్యంలో సాధించాడు.

… … వ్రాసే, మాటలాడే, గ్రంథములలో పత్రికలలో వాడే భాషలనుగురించి వివాదం జరుగుతూనే వుంది. వాదప్రతివాదాలు, ఖండనమండనలు సాగుతూనే వున్నాయి. వాడుకభాషను గ్రామ్యమని, నింద్యమను పండితులు నేటికీ అంటూనే ఉన్నారు. ఇంతవరకూ ఏ నిర్ణయమూ జరగలేదు.

మీరూ, నేనూ, మనమంతా జవమూ, జీవమూ గల భాషను కావాలని వాంఛిస్తున్నాము. అంటే ఆ భాష పరిపూర్ణమైనదిగా వుండాలని మన ఆశయం. (అ) ప్రజలకు సాధారణజ్ఞానాన్ని కలిగించే, (ఆ) పారిశ్రామిక, వైజ్ఞానిక, కళారంగాలలో కృషి చేస్కున్న విద్యార్థులకు సాంకేతికజ్ఞానాన్ని ప్రబోధించే, (ఇ) పండితులకు ఉదాత్తభావాలను, ఆదర్శాలను జ్ఞానాన్ని ప్రబోధించే, (ఈ) ప్రసన్న గంభీర మధుర కావ్యసృష్టికి దోహదపడే అన్నివిధాలా అర్హమైన భాషను, భాషాశైలిని సృష్టించుకోవాలని మనం కృషి చేస్తున్నాము. … … దైనందిన జీవితంలో నిత్యమూ చెవిని పడుతున్న మాటలను, సులభంగా అర్థమయే సరళపదాలను, నుడికారాన్ని సాహితీపరులు స్వీకరిస్తున్నారు. … ఇప్పుడు బెంగాలులో రచయితలు సరళ సుబోధకశైలిని అనుసరిస్తున్నారు. మామూలు మాటలలో అర్థగాంభీర్యాన్ని సాధిస్తున్నారు. … సొగసయిన పదాలను ఎంచుకోడంలో, వాటిని అర్థవంతంగా ప్రయోగించడంలో రచయితకున్న నేర్పునుబట్టి అతనిశైలికి అందం అమరుతుంది. ఆఖరికి నింద్యమని అపభ్రంశమని పండితులు ఈసడించే శబ్దాలను సైతం, అశ్లీలతాదోషం అంటనీయకుండా, సమర్థుడైన రచయిత ప్రయోగించవచ్చు.

భాష నాజూకుగా, ఠీవిగా వుండాలి. ఆడంబరం అందమీయదు. జటిలపద ప్రయోగంవల్ల భాషాసౌకుమార్యం కలగదు. తేటమాటలతో నాగరికమైన అనుభవాలను, ఉదాత్తభావాలను వ్యక్తపరచాలి. శైలి సహజప్రవాహంవలె ఉరకలెత్తుతూ, అనుభూతులను కలిగిస్తూ హృదయంపై చెరగని ముద్రలను వేయాలి. శైలి అందం ఇలా ఇలా వుండాలని సిద్ధాంతీకరించి చెప్పడం సులభమే. కానీ ఈ అందాన్ని అలరించడం కష్టం. అక్కడే వస్తుంది అడ్డు.

నిఘంటువుల, పండితుల, వైయాకరణులసహాయం, అవసరం లేకుండా, చదవగానే అందరికీ అర్థమయే విధంగా భాషను సంస్కరించవలెనని మీఆశయం. అదే నేటి సమస్య. మనమంతా భాషాసంస్కరణను కోరుతున్నాము. అంటే దాని అర్థం భాషాగాంభీర్యాన్ని, స్నిగ్ధసౌందర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామని కాదు. పైగా దాని సౌకుమార్యాన్ని ఇనుమారు తెచ్చుకుంటున్నాము (పు. 58-59).

నేను ఈ ఉత్తరంలో భాగాలను ఇంత విస్తృతంగా ఉదహరించడానికి కారణం – ఈ వ్యావహారికభాషావాదం ఎప్పటినించి ఎంత ప్రబలంగా ఉందో ఎత్తి చూపడానికి. ఈ అనువాదంలో సంస్కృతం బాగానే ఉండడం గమనార్హం. బహుశా జ్ఞానేంద్రమోహన్ దాసు ఇంగ్లీషులో అదే స్థాయి శైలిలో రాసేరేమో. అప్పారావుగారు వ్యావహారికంలో రాయాలని ఉద్యమం మొదలు పెట్టినా, ఆయన రాసిన భాష ఈనాడు మనకి వ్యావహారికంలా అనిపించదు. తిరగరాసిన దిద్దుబాటు కథలో కూడా నాకు పాతవాసనలే కనిపించేయి. కానీ ఇప్పుడు ఆస్థాయి అధిగమించి, నిజంగా మనం రోజూ మాటాడుకునే మాటల్లో కథలు రాయడం వచ్చింది. అయితే దానిలో తెలుగు తగ్గిపోతోంది. నేను కథలు రాయడం మొదలుపెట్టిన రోజుల్లో పేజీకి రెండో మూడో ఇంగ్లీషు మాటలు కనిపించేయి (నాకథల్లో కూడా). ఇప్పుడు వాక్యాలకి వాక్యాలే ఇంగ్లీషులో ఉంటున్నాయి. సరే అనడానికి ఓకే అంటున్నాం. ఆదివారం, సోమవారం అనడానికి బదులు సండే, మండే అంటున్నాం. నేను నాస్నేహితురాలితో మాటాడుతున్నప్పుడు, “ఆదివారం వస్తాను” అంటే “ఓకే, సండే రా,” అంటుంది. అంటే అలా తెలుగుమాటని ఇంగ్లీషులోకి మార్చుకుంటే తప్ప తలకెక్కని పరిస్థితికి వచ్చేం. ఇది దారుణం.

శారదగారి కథలలో చాలావరకు మంచి తెలుగు నుడికారం ఉంది. కానీ కొన్ని కథల్లో మాత్రం ఇంగ్లీషు కొంచెం ఎక్కువే అనిపించింది. ఈభాషకే అలవాటు పడినవారు “ఇప్పుడు ఇలాగే మాటాడుతున్నాం, ఆ వాక్యాలు వాస్తవంగా ఉన్నాయి” అని వాదించవచ్చు. కాదనను కానీ, సాంఘికప్రయోజనంలాగే తెలుగుభాషనీ, నుడికారాన్నీ నిలబెట్టి పటిష్టం చేసే బాధ్యత కూడాఈనాటి రచయితలకి ఉందనీ, లేదనుకుంటే, మనసు మార్చుకుని ఆ బాధ్యత చేపట్టాలనీ నేను గాఢంగా నమ్ముతున్నాను. నాకథలని అభిమానించేవారు నాకథలద్వారా మరచిపోతున్న మాటలు మళ్ళీ గుర్తుకి తెచ్చుకోడం, కొత్తగా తెలుసుకోడం కూడా జరుగుతోందన్నారు. అంటే మంచి తెలుగు నుడికారం గల కథలని పాఠకులు ఆదరిస్తున్నారు.

ఈ ముందుమాట రాయడానికి నాకు అవకాశం కల్పించిన శారదకీ, నేను రాసింది వంకలు పెట్టకుండా ప్రచురించుకుంటామంటూ ప్రోత్సహించిన సురేష్ కొలిచాలకీ ధన్యవాదాలు.

వర్ధమానరచయిత్రి శారద  ముందు ముందు ఇలాగే మంచి కథలు అందించగలరని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ,

నిడదవోలు మాలతినిడదవోలు మాలతి

సెప్టెంబరు 2, 2012.

Download PDF

2 Comments

  • శారద says:

    మాలతి గారూ,
    మీరు సహృదయంతో రాసిన ముందు మాటకూ, ఓపికగా వివరించిన ఆసక్తి కరమైన విషయాలకూ ధన్యవాదాలు .
    ఈ పుస్తకావిష్కరణ గురించిన విశేషాలూ, ఫోటోలూ ఇంకా ఒకటీ రెండూ వారాల్లో అందరితో పంచుకుంటాను.
    చాలా ఆలస్యమైందని తెలుసూ, అయితే వృత్తి పరంగా చాలా ఒత్తిడిలో వుండడం వల్లనే ఆ ఆలస్యం.
    శారద

  • శారదా, ముందు మాట రాయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నిజంగా మంచి సంకలనం. ముందు ముందు కూడా ఇతోధికంగా కృషి కొనసాగించగలరని ఆశిస్తూ, అభినందనలతో, – మాలతి

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)