శివలీల

drushya drushyam-7...

చాలా సామాన్యమైనవే. మామూలు ముఖాలే. ఎక్కడ పడితే అక్కడ కానవచ్చే మనుషులే అయి ఉండవచ్చు.

రాలిపడ్డ ఆకులు, చితికిన టమాట పండు, తెగిపోయిన చెప్పు, వాకిట్లో కురిసిన పారిజాతాలు, చెట్ల కొమ్మల్లో చిక్కిన గాలిపటం, ఈల వేస్తున్న యువకుడు, చింగులు సర్దుకుంటున్న మగువ, చుట్టను చప్పరిస్తున్న ముదుసలి, బీడీలు చుడుతున్న నాయినమ్మ, ఈదురుగాలికి చెల్లాచెదురైన గుడిసెలు, ఏం కానున్నదో తెలియక నవ్వుతున్న పిల్లలూ…

ఇవన్నీ మామూలు విషయాలే కావచ్చును. కానీ, ఒక కుతూహలంతో చూడటం, ఒక అవ్యాజమైన అనురాగంతో చేయి చాచడం, అభిమానంతో ఆలింగనం చేసుకోవడం, ఒక అనురాగ చేష్ట, ఛాయా చిత్రలేఖనం. కానీ, నమ్ముతారో లేదో, ఒక్కోసారి అసంకల్పితం ఈ లేఖనం. ఒక్కోసారీ కాదు, అనేకసార్లూ మన అలక్ష్యమే లక్షణం. అపుడే దృశ్యం మనల్నిఆకట్టుకుంటుంది. ఇక ఆ లేఖనం మహత్త్తు అపూర్వం. అందులోనిదే ఈ తట్టా పారా…ఒక లిప్త.

+++

భాగ్యనగరంలో పార్సీగుట్ట నుంచి ముషీరాబాద్ చౌరస్తాకు వెళ్లే దారిలో, చౌరస్తాకు చేరుకోక మునుపే కుడివైపు, ఈ చిత్రం జీవం పోసుకుని కానవస్తుంది. అది ఇసుక అమ్మే స్థలం. ‘తట్టకు ఇంత’ అని అమ్ముతూ ఉంటారు. ఇండ్లళ్లో చిన్న చిన్న రిపేర్లు చేసుకోదలచిన వాళ్లు, లేదంటే వీథి మేస్త్రీలు ఆ ఇసుకను ఖరీదు చేసుకుని వెళుతుంటారు. అందుకు సౌకర్యం కల్పించే ఒక వీథి అమ్మకం స్థలం ఇది.

ఇక్కడ ఎప్పుడూ ఒక ఇద్దరు కూర్చుని ఉంటారు. ఒక మహిళ, ఒక పురుషుడు. వాళ్లు ఎప్పుడు అమ్ముతారో తెలీదుగానీ ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూచుని ఏవో ముచ్చటించుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడికి రాగానే, ఈ చిత్రం తీసిన స్థలానికి చేరుకోగానే, హాయిగా నవ్వుకునే ఆ జంట కూడా ఒక ముచ్చటైన చిత్రం. వారిద్దరినీ ఒక ఎండపొడ వాలున, ఒకే గొడుగు నీడన ముచ్చటిస్తూ ఉండగా మరో నాడు తీసిన చిత్రమూ ఒకటుంది నా వద్ద!  అయితే, వారిరువురి జీవన వ్యాపారంలోని అతి కీలకమైన విషయమూ, ఒకానొక decisive moment, దాని స్థల మహత్యమూ, అందలి పురాణ కాలక్షేపమే ఈ చిత్రం.

+++

చిత్రమేమిటంటే, ఇక్కడే నా భవిష్యత్తు కళా ప్రదర్శన తాలూకు ముఖచిత్రం నమోదైంది, మూడేళ్ల క్రితం.

అంటే గతంలోనే నా భవిష్యత్తు నమోదై, అది సరిగ్గా ఆ నిర్ణయాత్మక క్షణంలో వర్తమానమూ అయి మళ్లీ ఇప్పుడు గతమూ అయి, ఎప్పటికీ చెదరని ఛాయా చరిత్రా అయింది. ఇదంతా తెలియకుండానే…అదొక విచిత్రం.
అయితే, ఛాయాచిత్రలేఖనం అన్న ప్రక్రియలో చిత్రకారుడు లేదా రచయితా ప్రేక్షకుడే అవడం మరో చిత్రం!

+++

మళ్లీ మూడేళ్ల క్రితానికి వస్తే, ఆ రోజు సన్నగా వర్షం కురుస్తూ ఉన్నది.
కొంచెం తెరపి ఇచ్చాక బయలుదేరాను. ఇక్కడకు చేరుకున్నానో లేదో అకస్మాత్తుగా నా దృష్టి పామరశాస్త్రంపై…ఈ తట్టా పారలపై పడింది. ఒక “కనికట్టు’ అనే అనిపిస్తుంది.  విస్మయమే! ఎందుకు ఏ దృశ్యం మనల్ని లోబర్చుకుంటుందో ఏమో తెలీని స్థితి! నేను ఆగిపోయాను. ఆ దృశ్యంలోకి చూశాను. చూడగా వర్షం వెలిసినాక ఆ తడి తడి ఇసుక, పైనా…కిందా… కొంచెం గాఢ గోధుమ వర్ణంలో ఆ ఇసుక …రేణువులూ…అవన్నీ ఎంత సౌందర్యాత్మకం అంటే ‘పిండారబోసిన వెన్నెల’ అన్న సమాసం కూడా బహుశా తక్కువే. లేదా ‘ఇష్టమైన పిండి పదార్థం నైవేద్యం’గా పెట్టడం అన్నా వృథాయే!
ఆ దృశ్య సమాసం నన్ను సుతారంగా లోబర్చుకున్నది.

బండి ఆపేశాను. దిగలేదు. భూమిపై కాళ్లు ఆనించుతూ ఉన్నానో లేదో…ఒడుపుగా నేను కెమెరాకోసం చేయి చాచానో లేదో…కెమెరా అన్నది బ్యాగులోంచి ఎప్పుడు ఎలా బయటకు వచ్చిందో, అది నా కెమెరా కంటికి ఎప్పుడు ఆనిందో, వ్యూ ఫైండర్ నుంచి ఎప్పుడు చూశానో ఏమీ తెలియదు. ‘క్లిక్’ మన్న సవ్వడీ లేదు. కానీ, ఒకే ఒక షాట్ ఎక్స్ పోజ్ చేశాను.
ఆ తర్వాత చూశాను, కెమెరా స్కీన్లో…అప్పుడు కనిపించాయి. నిగనినగలాడుతున్న పనిముట్లు..వాటి బలిమి… ఇసుకలో దాచుకున్న వాటి లావణ్యం,…అంతకు మించి ఒక పారపై అమర్చినట్టున్న తట్ట. దానిపైన ఎరుపు పూవు….అంతా అలౌకికం…

పైనా కిందా కన్ను తడుముతూ ఉంటే, చెట్టుపై నుంచి వర్షంతో జాలువారిన లేత ఆకుపచ్చ ఆకులూ, ఎర్రెర్రెని పువ్వులు రెమ్మలు అంతా దళాలూ…రేణువులూ…

+++

అన్నీ ఆశ్చర్య పర్చినవే.
they are in the world but not worldly…అనిపిస్తుంటే …
ఒక physical… metaphysical…అంతా ఒక సంయోగం…లీనం…ధ్యానం…
పువ్వులూ రెమ్మలూ పనిముట్లూ…తడితడి పూజా ద్రవ్యమూ…అంతా ఒక గర్భగుడిలోని దివ్య మంత్ర పుష్ఫ సంచయం.ఆ దృశ్యంలో అవన్నీ కెమెరా స్ర్కీన్ పై ఎంత భావ గర్భితంగా లాస్యమాడుతున్నాయి అంటే తెలియక రాసిన కవితలా ఏదో ఒక కవితాన్యాయం…”అబ్బ! దర్శనం’ అనుకున్నాను. మానవుడి అవిశ్రాంత యానంలో ఒక శాంతి ఉంటుందే అదే ఇది అని తృప్తిల్లాను. ఒకానొక రుతువులో ప్రకృతి శోభ ఉంటుందే అదే ఇదేమో అని కూడా అనిపించింది.
ధ్యానం చేయడానికి యోగ్యం లేని పామరులుంటారే, వారికి ఇదే శివాలయం…గర్భగుడి…లింగధారణా అనిపించింది.
ఆ చిత్రానికి లోబడి ఇక మళ్లీ మరొక చిత్రం ప్రయత్నించలేదు. దొరికింది చాలనుకుని మళ్లీ నా లౌకిక జీవనంలోకి పయణమయ్యాను.+++ఈ చిత్రాన్ని తర్వాత చక్కటి ప్రింటు తీసుకున్నాను. ఎంతదనుకున్నారు! పే…ద్దది. ముప్పయ్ ఇంటూ నలభై అంగుళాల చిత్రం అచ్చువేయించాను. దానికి మరింత అందం పెరిగేలా చుట్టూ జాగా వదిలి మరింత మంచిగా ఫ్రేం చేయించాను. నా తొలి చిత్ర కళా ప్రదర్శనలో మకుటామయమైన చిత్రంగా దీనిని ప్రదర్శించాను. అంతేకాదు, నా బ్రోచర్ పైనా ముఖచిత్రంగా దీనినే అచ్చు వేయించాను. ‘ఎందుకో తెలుసా’ అని అడిగితే చెప్పలేను.
+++

చాలా మంది అడిగారు కూడా, ‘ఇదేమిటీ?’ అని.
నవ్వి ఊరుకున్నాను.
ఇంకా చాలామంది అడగలేదు కూడా, ‘ఏమిటేమిటీ’ అని!
అందుకూ చాలా సంతోషించాను.
అయితే, ఇదొక్కటే కాదు, ప్రదర్శించే ప్రతి చిత్రానికీ ఒక ప్రాధాన్యం ఉంటుంది. అప్రయత్నమూ ఉంటుంది.
బహుశా దీనికి కారణం ఆ చిత్రం ‘మనం తీయనిది’ అయి వుండటం!
ఆ రచన మనం వాంచితంగా “చేయనిది’ అవడం!

 

+++

 

నిజమే మరి.
చిత్రాలు రెండు రకాలు. ఒకటి, మనం తీసుకునేవి. రెండు, మన చేత తీయించుకునేవి.
నా చిత్ర కళా ప్రదర్శనలో నేను ఎంచుకున్న రచనా పద్ధతి కూడా ఇదే. నేను తీయని చిత్రాల ప్రదర్శనే అది!
అందులో ఎన్నో…

ఒక రాలి పడిన ఆకు. బెలూను ఊదుతున్న మనిషి. అఖండదీపం ముందు ఒక భక్తురాలు.
ఇంకా…ముందు చెప్పిన చిత్రాలెన్నొ. అందులో ఈ దేవాలయం కూడా ఒక అప్రయత్నం.

 

+++

 

చిత్రమేమిటీ అంటే, దీన్ని ఎందరో దర్శించుకున్నారు…
ఒకరికి తెలిసి, మరొకరికి తెలియక. తెలిసీ తెలియక, సేమ్, నాలాగే ~ ఒకానొక కనికట్టుకు లోబడి.

అంతిమంగా అంతా ఒక ప్రేక్షకపాత్ర. మానవుడి నిమిత్తం లేని నిర్ణయానిదే తొలిపాత్ర.
తట్టా పారలకు వందనం అభివందనం.

~కందుకూరి రమేష్ బాబు

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)