ఋతుకాలోచితం –స్త్రీ కి ప్రకృతి వరం !!

అసదృశయౌవనం బిది యనన్యధనం బగునొక్కొ! నాకు ని

క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గ వల్లరీ

కుసుమ సముద్గమం బగునొకో! పతిలాభము లేమి జేసి; యొ

ప్పెసగగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో!

                                                       -నన్నయ

   (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

సాటిలేనిది కదా ఈ యవ్వనం! ఈ సంపద అన్యధనం అవుతుందో కాదో! నాకు కలిగిన ఈ కుసుమ(రజో)దర్శనం, భర్త లేకపోవడం వల్ల, ఎవరూ ప్రవేశించలేని కోటలోని తీగకు పూసిన పూవు చందమైపోతుందేమో!  భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో!?

***

అమ్మలకు, అమ్మలగన్న అమ్మలకు, అక్క చెల్లెళ్లకు ముందుగా భక్తిపూర్వకంగా నమస్కరించి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని ఒక చరిత్రకారుని దృష్టితో పరిశీలించినప్పుడు, ఆ ప్రయత్నం నేటి విశ్వాసాలకు, మనోభావాలకు నొప్పి కలిగించవచ్చు. అశ్లీలంగానూ తోచవచ్చు. కనుక, ఇది తటస్థబుద్ధితో చేసే విశ్లేషణ మాత్రమే సుమా అని ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకుంటున్నాను.

ఇంతవరకు మౌననాయికగా పొడగట్టిన శర్మిష్ట,  పై  పద్యంలోని మాటలు అనుకుంటుంది.

[su_note]పురుషుడు స్త్రీకి సొంతభాష లేకుండా చేసి వంచించవచ్చు. తన ప్రతిధ్వనిగానే ఆమెను మలచి ఉండవచ్చు. కానీ ప్రకృతి కరుణామయి. తను స్త్రీని వంచించలేదు. స్త్రీకి తనదైన భాష నిచ్చింది. యవ్వనమనే వశీకరణ సాధనాన్నీ, పునరుత్పత్తి అనే హక్కునూ ప్రసాదించింది. స్త్రీకి తన శరీరంలో వచ్చే మార్పుల గురించిన భాష తెలుసు. స్త్రీకి తన శరీరంతో మాట్లాడడం తెలుసు. అది ప్రకృతి దత్తమైన వరం.

శర్మిష్ట ఇక్కడ తన శరీరంతో మాట్లాడుతోంది. ఇది ఎంత గొప్ప యవ్వనం అనుకుంటోంది. ఇతరులకు అనుభవయోగ్యమైన సంపద కాకుండా, ఎవరూ చొరలేని కోటలోని తీగకు పూసిన పూవులా ఇది వాడి పోతుందా అనుకుని బాధపడుతోంది. భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో అనుకుంటోంది.

శర్మిష్ట హృదయంలో గూడు కట్టుకున్న ఆ గుబులు శతాబ్దాలుగా, బహుశా సహస్రాబ్దాలుగా స్త్రీనుంచి స్త్రీకి ప్రవహిస్తోంది కాబోలు. ఈ సందర్భంలో, శారద అనే కలం పేరుతో ఒక పురుష రచయిత (నటరాజన్) రాసిన ‘మంచి-చెడు’ నవలలోని పద్మ పాత్ర గుర్తుకొస్తోంది. ఆ నవల గురించి ఎలాంటి విశ్లేషణలు వచ్చాయో నాకు గుర్తులేదు. ప్రకృతిధర్మం అనే కోణం నుంచి నేను ఆ నవలను విశ్లేషించాను(కాలికస్పృహ: మరికొన్ని సాహిత్యవ్యాసాలు). ప్రకృతిధర్మాన్ని పై కెత్తి చూపించిన ఆ నవల నాకు ఓ అద్భుతంగా, అసాధారణంగా తోస్తుంది. పద్మను వయసు మళ్లిన ఒక సంపన్న వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. యవ్వన సహజమైన కోరికలు తీరక పద్మ చిత్రవధ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె అనుకున్న మాటలు నాకు గొప్ప కవిత్వంలా తోస్తాయి:

వసంతకాలాలూ, చలిరాత్రులూ, వర్షపు రోజులూ ఏటేటా వస్తూనే ఉంటాయి. ప్రకృతిధర్మం ఒక్కలానే ఉంటోంది- దశాబ్దాల తరబడి. కానీ వ్యక్తి జీవితంలో అనుభవనీయమైన రాత్రులు కొన్నే! అవి ఇట్లా మానవకల్పితమైన నీతులకు, కట్టుబాట్లకు లోబడి వ్యర్థం కావలసిందేనా? [/su_note]

సమవయస్కుడైన సవతి కొడుకుపై ఆమె దృష్టి పడుతుంది. సంఘభయంవల్ల వెనకడుగు వేస్తుంది. అంతలో వ్యాపారంలో భాగస్వామి వంచన వల్ల భర్త ఆస్తి హరించుకుపోతుంది. భర్త కూడా చనిపోతాడు. పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి ఉన్నంతకాలం శరీరసౌఖ్యం కోసం పరితపించినా, ఆమె నీతి తప్పే ధైర్యం చేయలేకపోతుంది. ఆస్తి కరిగిపోగానే అంతవరకూ తనను బంధించిన భయాలనుంచి ఆమెకు విముక్తి లభించినట్లవుతుంది. శారీరకవాంఛను ఎలాగో అణచుకున్నా, ఆకలి అనే ప్రాకృతికధర్మాన్ని అణచుకోవడం ఆమెకు అసాధ్యమవుతుంది. చివరికి అయిదు రూపాయిలకు శీలాన్ని అమ్ముకుని కడుపాకలినీ, శరీరపు ఆకలినీ కూడా తీర్చుకుంటుంది. అప్పుడామె శారీరక, మానసిక స్థితులను రచయిత ఇలా వర్ణిస్తాడు:

నునుపుగా, ఎన్నడూ లేనంత అందంగా కనబడుతోంది ఆమె మొహం. అది ఈ రెండురోజుల నుంచి కలిగిన సౌఖ్యప్రాప్తి వల్ల, ఇష్టం వచ్చిన తిండి తినడం వల్ల ఏర్పడ్డ నునుపేమో…పద్మ మనస్సు లేడిలా, పంజరం నుంచి విడిపించుకున్న చిలకలాగా ఎగురుతోంది. తన ప్లాను వీళ్ళకు తెలియడం అసంభవం. తెలిస్తే అది వ్యభిచారమని అంటారు. కానీ ఏవిధంగా తన క్షుద్బాధను తీర్చుకోగలదు? తన తృష్ణను న్యాయమైన విధాన చల్లబరచుకోవడానికి అవకాశం ఎక్కడ?…

సవతి కొడుకు పాత్ర మరో అపురూప సృష్టి. అతడు సంఘనీతికి బద్ధుడు. అయినాసరే, సాక్షి మాత్రుడుగా ఉంటూనే సంఘనీతికీ, ప్రకృతిధర్మానికీ మధ్య పద్మలానే అతను కూడా నలిగిపోతాడు. పద్మ నడవడిని అతను గమనిస్తూనే ఉంటాడు. తప్పుపట్టకపోగా ఆమెపై సానుభూతితో కరిగి నీరైపోతాడు. ఇలా అనుకుంటాడు:

నిజానికామె ఈ యవ్వనకాలాన్ని ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో హాయిగా గడపవలసింది. సహజవాంఛల్నీ, ఆకలినీ తీర్చుకోవడంలో కలిగే ఆనందాన్ని, ప్రకృతిదత్తమైనదిగా, సమాజ శుభాశీస్సులతో అనుభవించవలసింది. కానీ నేడామె ఆ ఆనందాన్ని రహస్యంగా, దొంగలాగా అనుభవించవలసివస్తోంది.

ప్రకృతిధర్మం అనే గీటురాయి మీద లైంగికవాంఛను పరిశీలిస్తున్న ఈ వాక్యాలు ప్రకృతి అంత సహజంగానూ, సూటిగానూ, స్వచ్ఛంగానూ  నా చెవులకు ధ్వనిస్తాయి. ఎంతో సాంద్రమైన ఆర్ద్రతా, అనుకంపల లోతులనుంచి ఇవి పలుకుతున్నట్టుంటాయి. లైంగికవాంఛను ఇలా వ్యాఖ్యానించిన రచయిత ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

ప్రస్తుతానికి వస్తే…

sarmishta

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది. ఏ ఆడదైనా కోరుకునేది భర్తనూ, కొడుకులనూ పొందాలనే, ఆ రెండూ దక్కిన దేవయాని అదృష్టమే అదృష్ట మనుకుంటోంది.

యయాతి తొలిసారి తనను చూసినప్పుడే ఆ చూపుల్లో తన మీద ఉట్టిపడుతున్న ఇష్టాన్ని శర్మిష్ట పోల్చుకుని ఉంటుంది. అప్పుడే నిశ్శబ్దంగా తన హృదయంలో అతనిని నిలుపుకుని ఉంటుంది.  అతనిమీదే నా హృదయం ఎప్పుడూ లగ్నమై ఉంటుందని ఇప్పుడు కూడా అనుకుంటున్న శర్మిష్ట, ‘నన్నీతడు గరము  కారుణ్యమున  బ్రీతి గలయట్ల జూచు…’ ననుకుంది.

సామాజిక స్థాయీ భేదాలు మానవసంబంధాలలోనే కాక; వాటి వ్యక్తీకరణకు ఉపయోగించే మాటల్లో కూడా తేడా ఎలా తీసుకొస్తాయో పౌరాణికుడు ఇక్కడ అలవోకగా సూచిస్తున్నాడు. యజమాని ఒక దాసిపై  చూపించే అనురక్తిని ప్రేమ అనో, అనురాగమనో అనకూడదు; కారుణ్యం అనాలి. దాసి కూడా యజమాని నుంచి కారుణ్యాన్ని మాత్రమే ఆశిస్తుంది. పై వాక్యం శర్మిష్ట దాసిత్వాన్నే కాక ప్రస్తుత సందర్భంలో ఆమె దయనీయతను కూడా వెల్లడిస్తోంది.

దేవయానిలానే నేను కూడా ఇతనినే భర్తను చేసుకుంటానని శర్మిష్ట అనుకుంది. సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’ అంది.

‘పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు.

‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.

[su_note note_color=”#ff6696″] శర్మిష్టకు శరీరంతో మాట్లాడే భాషే కాదు, దానికి కావలసినవి సాధించుకునే తర్కమూ తెలుసు. అందుకు అవసరమైన పాండిత్యమూ ఆమెకు ఉంది. మగవాడి బలహీనతపై ఒడుపుగా గురిచూసి కొట్టి లొంగదీసుకునే నేర్పూ ఉంది. ప్రకృతి ప్రతి ప్రాణికీ ఆయాచితంగా ప్రసాదించిన నేర్పు అది. ప్రకృతి సిద్ధమైన ఆమె బలవత్తర వాంఛ ఆ క్షణంలో దేవయానిపట్ల భీతిని కూడా జయించింది.

శర్మిష్టను, యయాతిని కాసేపు పక్కన ఉంచి కథకుని దగ్గరకు వద్దాం. నిజానికి వాళ్ళ ఇద్దరి ముఖంగా కథకుడే శ్రోతలతో ఇక్కడ సంభాషిస్తున్నాడు. వారిద్దరి సంబంధానికి సమర్థన అందించే వ్యూహంతో ఈ ఘట్టాన్ని నిర్మిస్తున్నాడు. ఎలాగంటే, శర్మిష్టతో యయాతి సుఖించడానికి ఎలాంటి సమర్థనలూ అవసరం లేదు. దాసీతో సంబంధం ఆనాడు తప్పు కాదు. కాకపోతే, దేవయానికి ఇష్టం లేదు కనుక అది రహస్య సంబంధంగా పరిణమించి ఉండచ్చు. శుక్రునికి ఇచ్చిన మాట ఎలా తప్పనని  యయాతి అన్నప్పుడు, కొన్ని సందర్భాలలో మాట తప్పవచ్చునని శర్మిష్ట గుర్తుచేయడంలో అర్థముంది. కానీ, నా యజమానురాలికి భర్తవు కనుక నాకు కూడా భర్తవే ననీ; భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయరాని ధర్మాలనీ విడమరచి బోధించడంలో అర్థం లేదు. ఎందుకంటే, రాజూ, యజమానీ అయిన యయాతికి ఆ విషయం తెలియకుండా ఉండదు. కనుక, ఆ బోధ శర్మిష్ట యయాతికి చేస్తున్నది కాదు; కథకుడు శ్రోతలకు చేస్తున్నది! కారణం, ‘భార్య-దాసి-కొడుకు’ అనే విడదీయలేని ధర్మాలకు చెందని, భిన్న సామాజిక దశలోని శ్రోతలకు కథకుడు ఆ విషయం చెబుతున్నాడు!

అయితే, భిన్న సామాజిక దశకు చెందిన శ్రోతలను ఉద్దేశించడంలో కథకుడు  తెలిసో, తెలియకో అంతకంటే కీలకమైన ఒక అంశాన్ని కలగా పులగం చేస్తున్నాడు. అది, తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని శర్మిష్ట అడిగిన సందర్భం.[/su_note]

ఋతుమతి అనే మాట ఉంది. దాని అర్థం మనకు తెలుసు. అది మొదటిసారి పెద్దమనిషి కావడాన్ని సూచిస్తుంది. ఋతుకాలం వేరు. అది నెల నెలా సంభవిస్తుంది. ఋతుకాలం సంతానం పొందడానికి యోగ్యమైన కాలం. శర్మిష్ట తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతోంది. అంటే, తనిప్పుడు ఋతుకాలంలో ఉన్నాననీ, సంతానం ఇవ్వమనీ అడుగుతోంది. ఇలా ఆయా స్త్రీలు ఋతుకాలోచితం ప్రసాదించమని అడగిన సందర్భాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. వాటి ప్రస్తావనను ప్రస్తుతానికి వాయిదా వేస్తే; కథకుడు తెలివిగానో, లేక అతి తెలివితోనో, నిజంగానే తెలియకో ఋతుమతి-ఋతుకాలోచితం అనే రెండు మాటలనూ ఒకే అర్థంలో ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించడంలో ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చి సందేహాలకు తావిస్తున్నాడు.

ఎలాగంటే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాత, శర్మిష్ట-యయాతుల మధ్య సమాగమం గురించి చెబుతూ,  ‘శర్మిష్ట సంప్రాప్తయవ్వనయు, ఋతుమతియు అయిం’ దని అంటున్నాడు! అంటే, కొత్తగా ఆమె ఋతుమతి అయిందనే భావన కలిగిస్తున్నాడు. అంతవరకు జరిగిన కథను గమనిస్తే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాతే శర్మిష్ట యవ్వనవతి, ఋతుమతి అయిందనడం నమ్మశక్యంగా ఉండదు. దేవయానికీ, శర్మిష్టకూ స్పర్థ ఉంది కనుక వారిద్దరూ ఇంచుమించు సమవయస్కులే అవుతారు. మహా అయితే, ఇద్దరి మధ్యా ఒకటి రెండేళ్ల అంతరం ఉండచ్చు. వయసులో తేడా ఎలా ఉన్నా; శర్మిష్ట దేవయాని పెళ్ళికి ముందే యవ్వనవతి అయుండాలి. ‘అతిశయ రూప లావణ్య సుందరి’ అయిన శర్మిష్టను దేవయాని పక్కన చూసి యయాతి ఆమె ఎవరో తెలుసుకోగోరాడని చెప్పడం ద్వారా అతడు ఆమెవైపు ఆకర్షితుడయ్యాడని కథకుడు అప్పుడే సూచించాడు. కనుక అప్పటికే ఆమె యవ్వనవతీ, ఋతుమతీ అయుండాలి.

మరి కథకుడు ఎందుకీ  కల్పన చేసినట్టు?! ఎందుకంటే,ఋతుమతి, ఋతుకాలోచితం అనే మాటల మధ్య ఉన్న అర్థభేదాన్ని అతడు గమనించి ఉండకపోవచ్చు. శర్మిష్ట ఋతుకాలోచితం ప్రసాదించమని అడుగుతోంది కనుక అప్పుడే ఆమె ఋతుమతి అయిందని పొరబడి ఉండచ్చు. ఇంకొకటి జరగడానికీ అవకాశముంది. కథకుడు ఉద్దేశపూర్వకంగానే ఋతుకాలోచితం అనే మాటకు ఉన్న భిన్నార్థాన్ని మరుగుపుచ్చే ప్రయత్నం చేసి ఉండచ్చు. ఎందుకంటే, ఋతుకాలోచితం ప్రసాదించమని అడగడం కూడా ఒకానొక సామాజిక దశకు చెందిన ప్రయోగం. కానీ, కథకుడు వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు కథ చెబుతున్నాడు…

మిగతా విశేషాలు తర్వాత….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

2 Comments

 • ఆ బోధ శర్మిష్ట యయాతికి చేస్తున్నది కాదు; కథకుడు శ్రోతలకు చేస్తున్నది! కారణం, ‘భార్య-దాసి-కొడుకు’ అనే విడదీయలేని ధర్మాలకు చెందని, భిన్న సామాజిక దశలోని శ్రోతలకు కథకుడు ఆ విషయం చెబుతున్నాడు!

  భలే. మీరు నన్నయను బాగానే వ్యాఖ్యానించారు. శర్మిష్ఠమాటలను ఆమెవి కావు కథకుడివే అనటానికి మీ ఊహాబలం తప్ప ప్రమాణం ఏమీ‌ లేదు. ఈ విషయంలో సంస్కృతభారతంలో ఏముందో చూడటం‌ బాగుంటుంది. ఇదేదో బాగానే ఉందీ ఘట్టం, యయాతియే శర్మిష్ఠను లోభపరిచాడూ అని మరొకరు వాదం లేవదీయవచ్చును రేపు!

  భార్యాబిడ్డలూ, పరివారజనమూ యజమానికి అన్ని సమాజాల్లోనూ పోష్యవర్గమే. ఇందులో మార్పు ఎప్పుడు వచ్చింది? పోష్యవర్గం అన్నంత మాత్రాన న్యూనతాభావాన్ని వెదకి పట్టుకుని వ్యాఖ్యానించుకో నవుసరం లేదేమో!

  ఋతుమతి అనే మాట ఉంది. దాని అర్థం మనకు తెలుసు. అది మొదటిసారి పెద్దమనిషి కావడాన్ని సూచిస్తుంది. ఋతుకాలం వేరు. అది నెల నెలా సంభవిస్తుంది. ఋతుకాలం సంతానం పొందడానికి యోగ్యమైన కాలం.

  భాస్కరంగారూ ఋతుమతి అన్న పదానికి నెలసరిలో ఉన్న స్త్రీ అని అర్థం. అమ్మాయి పెద్దమనిషి కావటం అనేది సూచించే పదం పుష్పవతి అన్నది. ఇకపోతే, నెలసరికి పెద్దమనిషికావటం అన్న అర్థం లేదు కాబట్టి మొదటిసారి పెద్దమనిషి కావటం అన్న ప్రయోగమే అసంగతం.

  కథకుడు తెలివిగానో, లేక అతి తెలివితోనో, నిజంగానే తెలియకో ఋతుమతి-ఋతుకాలోచితం అనే రెండు మాటలనూ ఒకే అర్థంలో ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించడంలో ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చి సందేహాలకు తావిస్తున్నాడు.

  అలాగే ఋతుకాలం అన్న పదం అర్థాన్ని సరిగా అవగాహన చేసుకోకపోవటం వలన మీరు నన్నయగారిపైనే అపవాదు వేసారు. ఈ పదాలకు కల అర్థబేధం చూడండి. ఋతుమతి అంటే నెలసరిలో ఉన్న స్త్రీ అనీ, ఋతుకాలం అంటే నెలసరి దాటి సంతానసముపార్జనకు ప్రయత్నించటానికి యోగ్యమైన సమయం అనీ అర్థాలు. సాంప్రదాయికంగా ఋతుమతి స్పర్శనయోగ్య కాదు. తదుపరి కొద్దిరోజులపాటు అట్టి స్త్రీ సంగమయోగ్య. ఆ కొద్ది రోజులే ఆమెకు ఋతుకాలం – గర్భధారణకు యోగ్యమైన కాలం.

  ఈ పదాల విషయంలో మీరే గందరగోళ పడటం కనిపిస్తోంది.

  ఇకపోతే యయాతి మహారాజు శుక్రనీతిని తలక్రిందుగా అర్థం చేసుకున్నాడా? వారిజాక్షులందు… అన్న శుక్రవచనం వారిజాక్షులను కష్టం నుండి రక్షించటానికి అని మాత్రమే అన్వయం చేసుకోవాలి. వారిని ఆశించి అబధ్ధం ఆడటమో అధర్మం చేయటమో శాస్త్రబధ్ధం చేయటం శుక్రుడి ఉద్దేశం అనుకోవటం తప్పు. ఇక్కడ యయాతి శుక్రనీతిని తలచనూ లేదు, తప్పుగా అన్వయం చేసుకోనూ‌ లేదు. కేవలం మోహవశాత్ముడై చరించాడంతే. అందుకే శుక్రశాపం కలిగింది. శుక్రుడు శర్మిష్ఠను శపించలేదన్నది గమనార్హం!

  విషయంలో కొంత కలగాపులగం వ్యవహారం మీకు గోచరించిందీ అంటే అందులో నన్నయగారి తప్పు కన్నా మన అవగాహనాలోప మేమన్నా కారణమేమో ఆలోచించుకుంటే మంచిది.

 • కల్లూరి భాస్కరం says:

  ధన్యవాదాలు శ్యామలరావు గారూ…ఇదే కథ మీద నేను రాసిన అయిదో వ్యాసం ఇది. దీని తర్వాత ఆరోది కూడా వచ్చింది. అన్నీ సావధానంగా చదవండి. ఋతుమతి, ఋతుకాలోచితం అనే మాటల విషయంలోనే కాక, దాసీ వగైరాల విషయంలో కూడా నేను గంద్రగోళపడలేదని, అన్నీ స్పష్టంగానే రాశాననీ మీకు బోధపడచ్చు ననుకుంటున్నాను. అయినాసరే, దృష్టిభేదం ఒకటి మిగిలిపోతుంది. దాని విషయంలో నేను ఏమీ చేయలేను. మీ దృష్టి మీది, నా దృష్టి నాది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)