సంస్కృతీ విరాట్ స్వరూపాన్ని అద్దం లో చూపగలమా?

ఆట సంస్కృతిలో భాగం, వేట సంస్కృతిలో భాగం, మాట సంస్కృతిలో భాగం, పోట్లాట సంస్కృతిలో భాగం, వివాహం సంస్కృతిలో భాగం, వివాదమూ సంస్కృతిలో భాగమే. మడిగట్టుకోవడం సంస్కృతిలో భాగం. అమ్మవారికి వేట వెయ్యడమూ సంస్కృతిలోని భాగం. బొట్టు పెట్టుకోవడం, కత్తిపట్టుకోవడం, మట్టి కాల్చి కుండలు చెయ్యడం అన్నీ అన్నీ సంస్కృతిలో భాగాలే. ఒక జాతి చేయగల మంచి, చెడూ సంస్కృతిలో భాగాలే. తెలుగునాట ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా నోములు నోచుకుంటారు. ఎలా భిక్షాటన చేస్తారు. ఎలా పెళ్లి చేస్తారు. ఏ విధంగా విడాకులు తీసుకుంటారు. యుద్ధాల్లో ఎలా పాల్గొంటారు. ఓటమిని ఎలా ఎదుర్కొంటారు. వృద్ధాప్యంలో ఎలా ఉంటారు. యౌవనాన్ని ఎలా ఆస్వాదిస్తారు ఇలాంటివన్నీ సంస్కృతిలో భాగమే. దొంగలు, దొరలు, పూజారులు, వేశ్యలు, అధికారులు, సామాన్యులు, వీరులు, భిక్షకులు, విద్యావేత్తలు, నిరక్షరాస్యులు ఇలా ఎందరుండే వీలుందో అందరూ సంస్కృతిలోనే ఉండగలరు. ఏం చేసినా సంస్కృతిలోనే చెయ్యగలరు. తెలుగు దొంగలు ఎలా జేబులు కొడతారు, తెలుగు వేశ్యలు ఎలా విటులను ఆకర్షిస్తారు,  తెలుగు పిల్లలు ఎలాంటి ఆటలాడుకుంటూంటారు వగైరా అన్నీ ఆ పేద్ధ వృత్తంలొ భాగం. ఇది సంస్కృతి గురించి నా అనుకోలు, అవగాహనానూ. “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ”, “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” సంస్కృతిలో భాగమైతే అణాకాసంత బొట్టు పెట్టుకుని పేరంటాలిచ్చిన వాయినాలతో నోము నుంచి తిరిగొస్తున్న సోమిదేవమ్మా సంస్కృతిలోని భాగమే. “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతూ, ఇవాళ్టికేమైనా వస్తుందేమోనని చూసి చూసి ఇంటికి వెళ్లి భార్య ఇచ్చిన తులసి ఆకుల తాంబూలం తృప్తిగా తిని వెర్రినవ్వు నవ్వుకునే పూజారీ సంస్కృతిలోనివారే.
ఇక సాహిత్యం అంటే టీషర్టుల మీద రాసిన రాతలు మొదలుకొని జనుల నాల్కలు తాటియాకులుగా లిఖింపబడ్డ పద్యాల వరకూ అంతా సాహిత్యమే. దాని ప్రయోజనమూ వేర్వేరు పద్ధతుల్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక చక్కని ఊహ చదివితే ఒళ్లు పులకించింది అది సాహిత్య ప్రయోజనమే. ఒక చిన్న జోకు చదివితే పేద్ద నవ్వు కాకున్న చిరునవ్వు పొటమరించిందీ అదీ ప్రయోజనమే. ఒక రచన చదివి జీవితంపై మనకుండే అవగాహనే మారిపోయిందనుకోండి అదీ ప్రయోజనమే. ఐతే వాటి మధ్య చాలా అంతరువులున్నాయి. కానీ ఒక స్తరంలో చూస్తే లక్ష్యసిద్ధి ఉన్న సాహిత్యమే అవి మూడూను. ఆ సాహిత్యానికి ఎన్నో రూపాలుండవచ్చును. సామెతగా లోకరీతులు చెప్పినా, పేదరాశి పెద్దమ్మకథగా మరోలోకాల్లోకి తీసుకుపోయినా అవి చక్కని సాహితీప్రక్రియలే. సరే నాకు సాహిత్యం పట్ల ఉన్న అవగాహన ఇది.(అటు ఇటుగా మిగిలిన సృజనాత్మక ప్రక్రియలకు కూడా ఇంత పరిధీ ఉంటుంది)
ఇప్పుడు ఒక సృజనాత్మక ప్రక్రియ సంస్కృతిని ప్రతిబింబించింది అన్నమాటకు అర్థమేమిటి చెప్పండి? నా అవగాహన వరకైతే సంస్కృతి అన్న పేద్ద కాంపౌండును ఒక రచనలో ప్రతిబింబించడం ఎలా సాధ్యపడుతుంది? సంస్కృతిలోని చాలా అంశాలను చక్కగా వివరించొచ్చు. పైగా ఎన్నో ప్రాంతాల, వృత్తుల సంస్కృతులని(పైన నేను చెప్పుకున్న వివరణనే సంస్కృతి విషయంలో గుర్తుతెచ్చుకోండి) కలగలిపితేనే ఒకనాటి తెలుగువారి సంస్కృతి ఏర్పడుతుంది. అందువల్ల ఆ విరాట్ స్వరూపాన్ని మనం ఎంతవరకూ దర్శించగలమో అంతవరకే కనిపిస్తుంది. బ్రాహ్మణుల జీవన విధానం రూపుకడితే సంస్కృతిలోని కొన్ని విశేషాల్ని ఎట్టేదుట పరిచినట్టే, ఐనంత మాత్రాన తెలుగు సంస్కృతినంతా ఆవిష్కరించంచినట్టు అవదు. అంత పని చేయాలంటే మహాభారతమంత లోతూ, విస్తృతీ కలిగిన ఉద్గ్రంథం అవసరమవుతుంది తప్ప చిన్న కథ, కవిత, నవలికలకు కుదరదు. విస్తృతీ, లోతూ ఒనగూడినా సంస్కృతి అంతటి మహా సాగరాన్ని మొత్తంగా ప్రతిబింబిస్తాయా అంటే కాదనే చెప్పాలి. ఆ పని ఎలాంటిదంటే ఆకాశమంతటినీ ఒక అద్దంలో చూపడం లాంటిది. ఆకాశాన్ని అద్దంలో చూపగలమా? చూపగలం. ఆకాశమంతటినీ ఒకే అద్దంలో చూపగలమా? ఏమో ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేసి విజయం సాధించినవారు ఉన్నట్టు నాకు తెలియదు. ఐతే సంస్కృతిని అనే ఆకాశాన్ని సాహిత్యమే సాగరం అత్యంత అరుదైన సందర్భాల్లో ప్రతిబింబించి ఉండొచ్చు. కాని మన చిన్న స్కేళ్లు దాన్ని నిరూపించలేవు.
మరి చేయగలిగింది ఏమిటంటే ఎవరి స్థాయిలో వారు సంస్కృతి విస్తృతిని అర్థం చేసుకుని తమ తమ స్థాయిల్లో ప్రతిబింబించగలగడమే. అలా చేస్తూన్నారు కూడా. అందుకే తెలుగు వారి సంస్కృతిని ప్రతింబింబించే సృజనగా దేన్నైనా చెప్తున్నారు అంటే వారు దాన్ని వాచ్యార్థంగా చెప్పలేదనో, సంస్కృతి అన్న పదానికి ఉన్న విస్తృతి వారికి తెలియదనో అర్థం చేసుకోవాలి.
ఇక మరో అంశం. ఎవరైనా సంస్కృతిని ప్రతిబింబించే సృజన అని అన్నప్పుడు సంస్కృతిలో భాగాన్ని ప్రతిబింబించి సారస్వతాన్ని సంపన్నం చేస్తోందన్న అర్థం స్వీకరించడం మాని ఇదే తెలుగు సంస్కృతా అని ప్రశ్నించి అంతటితో ఆగక ఇది జనాభాలో ఇంతశాతం మాత్రమే ఉన్నవారి అనుభూతులు, అనుభవాలు, ఆశలు, ఆశయాల సమాహారం మాత్రమే కనుక ఇది తెలుగు సంస్కృతి కాదని తిరస్కరిస్తున్నారు. ఐతే వారు కూడా తెలియకుండానే సంస్కృతి అనే విశాలమైన బంజరును కంచె వేసి సంకుచితం చేసేస్తున్నారు. ఫలానా వారి రుచులు, అభిరుచులు మాత్రమే సంస్కృతి కాదు అని చెప్పేప్పుడు అది ఫలానావారి సంస్కృతి అని దాన్ని సృజనాత్మకంగా చెప్పగలగడం వారి హక్కు అని మరచిపోతున్నారు.
నిజంగా సంస్కృతీ అన్వేషకులు చేయాల్సిన పని అది కాదు. ఏ అంశాలను తెలుగు సారస్వతం విస్మరించిందో పట్టుకోవాలి. సృజన గలవారైతే దాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించాలి. డబ్బున్నవారు అలాంటి విషయాన్ని సాహితీకరించడమో, తెరకెక్కించడమో చేసేవారికి దన్నుగా నిలవాలి. ఇవేవీ లేనివారు అలాంటివారిని కనీసం ప్రోత్సహించాలి. అప్పుడే సాహిత్యం సుసంపన్నమవుతుంది. ఆకాశం అరచేతిలో ఇముడుతుంది.
“జయంతి తే సుకృతినోః రససిద్ధా కవీశ్వరః
 నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం”
santhosh—సూరంపూడి పవన్ సంతోష్
Download PDF

7 Comments

  • ఆకాశాన్ని అరచేతిలో ఇముడ్చుకునే రోజుకోసం ఎదురుచూడకతప్పదు . వ్యాసం బాగా వ్రాశారు.
    రాయదుర్గం విజయలక్ష్మి

  • kv ramana says:

    మిథునం పై జి.ఎస్. రామ్మోహన్ గారి విమర్శను దృష్టిలో ఉంచుకుని మీరు ఇది రాశారని తెలుస్తూనే ఉంది. ఐతే ఒక విషయం. సంస్కృతి అనేది మీరన్నంత పాసివూ(passive) కాదు, అమాయకమైందీ కాదు. సంస్కృతి వెనుక రాజకీయాలున్నాయి, ఆధిపత్య భావాలు ఉన్నాయి. సంస్కృతుల మధ్య పెనుగులాట ఉంది. సంస్కృతిని రాజకీయ సాధనంగా వాడుకోవడం ఎప్పుడూ ఉంది. తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణ. కనుక సంస్కృతిని passive గా, అమాయకమైందిగా తీసుకోనక్కర్లేదు. రామ్మోహన్ గారు సంస్కృతుల మధ్య తేడాను చర్చించడం వరకూ సరే. కానీ విసుర్లు శ్రుతిమించి ఒక కులాన్ని నొప్పించేవిలా ఉన్నాయి. ఆ అవసరం లేదు.

    • pavan santhosh surampudi says:

      సంస్కృతిని పాసివ్ గా మాత్రమే చర్చిన్చాననే అనుమానం రావడానికి కారణం నేను ఎంచుకున్న పరిధి. ఈ వ్యాసంలో సంస్కృతి పరిధిని, వైశాల్యాన్ని గురించి మాత్రమే చర్చించాను. ఐతే అది ఎంత విస్తృతమో అంతకన్నా చలనశీలమనీ, నిత్య చైతన్య స్వరూపమనీ(పార్ట్ ఆఫ్ ఇట్ మాత్రమే చైతన్య శీలం) నాకు తెలుసు. అది చర్చించలేదు కనుక ఈ వ్యాసం అసమగ్రమనీ కాదు. ఎందుకంటే మీరన్నట్టుగా రామ్మోహన్ గారి వ్యాసం దానికి అనుకూలంగానూ, ప్రతికూలంగానూ వచ్చిన వ్యాఖ్యలో కూడా సంస్కృతి అనే పదం యొక్క విస్తృతిని గమనించకుండా ఉపయోగిస్తూ, దాన్ని సంకుచితం చేస్తూండడం గమనించి నేను ఈ వ్యాసాన్ని రాశాను. సంస్కృతి ఇంత అమాయకమైనది కాదన్నారు. దాని వ్యవహారం నాకు అర్థం కాలేదు. సంస్కృతి మొద్దావతారమనో, అమాయకమనో రాయలేదే నేను. బహుశా ఆ పదాల రాజకీయపర ప్రయోగం గురించి రాయకపోవడం మీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం కావచ్చు. నేను సంస్కృతి అనే అంశం వెనుక ఉన్న అర్థాన్ని కొంతమేరకు వివరించాను. అంతే తప్ప దానికీ సాహిత్యానికి ఉన్న సంబంధం, ఆ పదంపై రాజకీయపర ప్రయోగాలు వివరిస్తూ పోతే వ్యాసం చాలదు. కనుక వ్యాసంలోని అంశాలను మీకు సంస్కృతి అనే పదం ప్రయోగించబడ్డ సందర్భం చూసుకుని సరిచూడండి.
      నేడు ఆ పదం ప్రతి చోట తప్పుగానే ప్రయోగిస్తున్నారు. ఇది ఆంధ్రోల్ల సంస్కృతి, ఇది అగ్రవర్ణాల సంస్కృతీ, ఇది ఆంగ్ల సంస్కృతీ, ఇదేనా మన సంస్కృతీ అన్న ప్రతివారికీ సంస్కృతి అన్న పదం వైశాల్యం తెలియదు. దాని చలన శీలత తెలియదు. తమది మాత్రమే సంస్కృతి అని అందరూ అంటూనే ఆ పదం యొక్క విస్తృతిని తగ్గించి పారేస్తున్నారు. లేదా మీరు ఉన్నది ఇంతమంది ఐతే మీది కాదు తెలుగు సంస్కృతి అనేవారు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఇలా వాడితే కొన్నేళ్లకు సంస్కృతీ అనే ఉదాత్తమైన పదం అర్థం కోల్పోయి ఆ భావనకు దూరమవుతాము.(నీతి అనే విశిష్టమైన పదం ఎలా జీవించాలో చెప్పేది కాగా నేడు న్యాయబద్ధమైన వ్యవహారామన్న పదానికి ఆ అర్థం సంకుచితమైంది. కాగా నీతి అనే భావన తొలగిపోయి మనం ఇబ్బందిపడుతున్నాము) ఉదాత్తమైన ఒక భావన ఎందఱో వేత్తల కృషి ఫలంగా ఏర్పడుతుంది. రాజకీయ కారణాలతో ఆ పదం కోల్పోతే ఒక నిధి ఉన్న గదిలోకి తాళం చెవి పోయినట్టవుతుంది.
      ఐతే ఇది కేవలం రామ్మోహన్ గారి వ్యాసం వల్ల వచ్చిన వ్యాసం కాదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి నేను గమనిస్తున్నదే ఇప్పుడు ఈ వ్యాసం చదివాకా రూపం తీసుకుంది.
      //రామ్మోహన్ గారు సంస్కృతుల మధ్య తేడాను చర్చించడం వరకూ సరే. కానీ విసుర్లు శ్రుతిమించి ఒక కులాన్ని నొప్పించేవిలా ఉన్నాయి. ఆ అవసరం లేదు.//
      నిజానికి నా వ్యాసంలో చెప్పదలిచినది రామ్మోహన్ గారి వ్యాసం, వ్యాసంపై పలువురు సమర్థకులు, వ్యతిరేకులు చేసిన వ్యాఖ్యలు కలిపి సంస్కృతి అన్న పదాన్ని ప్రయోగించిన పధ్ధతి సరికాదనే. అందుకే మీరు వ్యాసంలో కొన్ని విషయాలు గమనించలేదనే సాహసం చేస్తున్నాను. క్షమించండి. నేను ఆయన్ని సమర్థిస్తూ రాసానన్న అనుమానం మీకు రావడంతో నాకలా అనిపించింది. దయ చేసి మరోమారు నా వ్యాసాన్ని చదివి చూడండి. మీరు మళ్ళీ చదివినా అదే అభిప్రాయం కలిగి ఉంటే నేను ఉద్దేశించిన అంశాన్ని సక్రమంగా వ్యక్తం చేయని వాణ్ణి అవుతాను.

      • kv ramana says:

        నాకు అర్థమైనంతవరకు మీరు సంస్కృతిలోని వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు. అన్నీ ఒకే వృత్తంలోని భాగాలు అని అంటున్నారు. నేను చెప్పదలచుకున్నది, వైవిధ్యమే కాకుండా సంస్కృతుల మధ్య వైరుధ్యం, ఎక్కువా, తక్కువా అనే చూపూ, పోరాటమూ ఉంటాయని. సంస్కృతి వెనకాల రాజకీయాలు ఉంటాయని. ఆ కారణంగా సంస్కృతి అంత అమాయకమైంది కాదని అన్నాను. గోడకు తగిలించిన అందమైన, అమాయకమైన బొమ్మగా చాలామంది సంస్కృతిని భావిస్తారు. మీరన్నట్టు సంస్కృతి ఉదాత్తమైనదే, కానీ, సంస్కృతి అమాయకమైంది కానంత మాత్రాన దానిని ఉదాత్తత పోదు.
        రామ్మోహన్ గారు సంస్కృతుల మధ్య తేడాను చర్చించడం వరకూ సరే కానీ విసుర్లు శ్రుతిమించి ఒక కులాన్ని నొప్పించేవిలా ఉన్నాయి, ఆ అవసరం లేదు అన్నాను. ఇది ఆయన గురించి అన్నది. ఆయన్ని మీరు సమర్తిస్తున్నారని నేను అన్నట్టు మీరు ఎలా అర్థంచేసుకున్నారో?

      • pavan santhosh surampudi says:

        మీరు నా వ్యాసానికి వ్యాఖ్యలో ఆయన వ్యాసాన్ని గురించి రాస్తున్నారని గ్రహించకపోవడం వల్ల. నా వ్యాసానికి రాసిన వ్యాఖ్యకి నా వ్యాసానికి ప్రత్యక్ష సంబంధముంటుందని పొరబడ్డాను.

  • బాగా చెప్పారు

  • dvrao says:

    చాలా చక్కగా చెప్పారు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)