అంట్లు.. పాచి… కూసింత ఆత్మీయత!

amma and satavathi

పనిమనిషి, పనమ్మాయి మా ఇంట్లో వినిపించనేకూడని ఒకేఒక్క పదం.

                 ఐతే మా ఇంట్లో ఎవరూ పనిచేయరని కాదు. పనిచేస్తారు. సబ్బు లక్ష్మి, సముద్రం(మనిషి పేరు), సిరి, నాగవేణి, నాగమణి, సత్యవతి-ఇలా ఎందరు మా ఇంట్లో పనిచేసినా పేర్లతో పిలవడమే తప్ప “మా పనమ్మాయి” అని ఎప్పుడూ అమ్మ అన్నది లేదు. మేము “పనమ్మాయి వచ్చిందమ్మా” అని చెప్తే ఊరుకున్నదీ లేదు. స్వావలంబన, సమానత్వం, వ్యక్తి గౌరవం లాంటి పెద్ద పదాల గురించి మా అమ్మ చదివినట్టు లేదు కానీ నాకు తెలిసినంతలో వాటి స్పృహ, ఆచరణల్లో ఆమెని మించినవారిని నేనెన్నడూ చూడలేదు. ఇంకో విశేషమేంటంటే మా అమ్మ సహృదయత, సంస్కారం మా చుట్టపక్కాలకే కాదు మాకే స్పష్టంగా తెలిసేది కాదు. కొడుకును కాబట్టి అమ్మ ఆచరణను దగ్గరనుంచి చూస్తూండగా ఏళ్లకేళ్లలో నాకు అర్థమైంది మా ఇంట్లో పనులు చేసేవాళ్లను ఆమె చూసుకునే పద్ధతి. అమ్మా నువ్విలా చేస్తున్నావు తెలుసా అంటే ఆమె కూడా ఆశ్చర్యపోయిందంటే చూడండి.
                అమ్మ నాకు మా తాతముత్తాతల గురించీ,పెదనాన్నలు, అత్తయ్యల గురించి తెలుసుకున్న విశేషాలు(పుకార్లు చెప్పేది కాదు. కచ్చితంగా తెలిసినవే చెప్పేది), వాళ్ల జీవితంలో చీకటివెలుగులు చెప్తూంటుంది. అలాంటి వాటిలో ఒకటి మా పెదనాన్న-అతని నౌకరు కథ. మా తల్లిదండ్రులది మేనరికం. మా నాన్నారి అక్కకూతురు మా అమ్మ. ఇద్దరూ మేనమామ-మేనకోడళ్లు. పైగా ఆమె బాల్యం చాలావరకూ(దాదాపు ఆమె 10ఏళ్ల వయసు వరకూ) మా పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తయ్యలు, నాన్నమ్మలతో మా స్వగ్రామంలో ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. మా పెదనాన్న(అంటే అమ్మకి పెదమావయ్య) గ్రామ కరణం. బహుశా ఈ కథ 1975-80 కాలంలోనిది. ఓరోజు నౌకరు కొడుకు వెంకడు(పేరుమార్చాను) మా ఇంటికి వచ్చాడట. అతనిదీ చాలా చిన్న వయసే. మా అమ్మ బయటకి వచ్చి “పెదమావయ్య స్నానం చేస్తున్నాడు. అలా అరుగు మీద కూచో” అందట. మంచినీళ్లేమైనా కావాలా అనడిగి, పెద్దాయనకి చెప్పేందుకు వెళ్ళింది. స్వతహాగా మా పెదనాన్నది ప్రథమకోపం.
అరుగుమీడకి వచ్చీరాగానే పిచ్చగా తిడుతూ కొట్టినంత పని చేసాడు.  అతని మాటల్లోనే తేలిన విషయమేమిటంటే- కచేరీ చేసే అరుగు మీద నౌకరు కొడుకు కూర్చోవడమేంటి? ఊళ్ళో రాజులేవరైనా చూస్తే మళ్లీ మా అరుగెక్కుతారా? నిజానికి మా అమ్మ అప్పటికి చాలా చిన్నది. ఇలా కూడా ఉంటుందా లోకం అని కొత్తగా తెలిసింది ఆమెకి. ఐతే మా అమ్మ కథ ఇక్కడితో ఆపలేదు. ఓ పదేళ్లు తిరిగేసరికి వెంకడల్లా గ్రామనౌకరుగా ప్రభుత్వంచే నియమింపబడ్డాడు. మా పెదనాన్న ఉద్యోగం సక్రమంగా చేయాలంటే నౌకరు చక్కగా సహకరించాలి కదా. పైగా నాటికి సాంఘికమైన కొన్ని కట్టుబాట్లు, మూర్ఖపు పట్లు పలచబడ్డాయి. వెంకడితో మండల కేంద్రానికి వెళ్ళే పని పడింది. పాత విషయాలేవీ గుర్తులేని ఆయన “రా ఎక్కు” అని (మోటారు)బండి ఎక్కమని పిలిచాడు. అతను గతం మర్చిపోలేదు. “మీ బండి ఎక్కితే పెద్దమనుసులు ఎవురైనా మళ్లీ ఎక్కుతారాండీ” అని గతం గుర్తుచేసుకుని బాధపడ్డాడు. మా పెదనాన్న అయ్యో ఏదో అప్పుడు అలా జరిగిపోయింది లే బాధపడొద్దని సముదాయించాడు. ఆ తర్వాత అతను రెవెన్యూ ఉద్యోగి కూడా అయ్యాడు. అప్పుడు కూడా “మీ అరుగు మీదకి నేనెక్కితే పెద్దమనుషులు ఎవరైనా మీ అరుగు తొక్కుతారాండీ” అని వేళాకోళంగా అనేవాడు. గతం తిరగదోడాడు. అప్పటికి మా అమ్మకి పెళ్లయింది, దీనికీ అమ్మ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇలాంటివి ఎన్నో ఆమె దృక్పథం వెనుక ఉండి ఉంటుంది. “పనివాళ్లయితే మనుషులు కాదా. జరుగుబాటు లేని ఇళ్ళలో వాళ్ళు పుట్టారు. ఎంతో కొంత జరుగుబాటున్న ఇంట్లో మనం పుట్టాం. అంతే కదమ్మా తేడా” అంటుంది అమ్మ. అందుకే మా ఇంట్లో పనిమనుషులన్న మాట చాలా తప్పు మాట.
                           అమ్మ పెళ్ళవగానే “ఎంప్లాయర్” అయ్యింది; మా అమ్మ దగ్గర పని చేసిన మొదటి పనిమనిషి పేరు సబ్బు లక్ష్మి. పల్లెటూళ్ళో కాపురం. 2 పెద్ద అరుగులు, కాఫీ వసారా, ఉత్తరంపు వసారా, విశాలమైన చావిడి, వంట గది, పూజగది, తూర్పువైపు గది, పెద్ద మెట్టు(వీధి వైపుంటే అరుగంటారు అది మగాళ్ల సామ్రాజ్యం, మరి ఏ వైపున్నా మెట్టంటారు. అక్కడ అమ్మలక్కల కబుర్లు సాగుతూంటాయి).బయట దస్త్రాల గదితో సహా 500గజాల్లో ఉండే పేద్ద ఇల్లు అంతా మా అమ్మ చక్కబరుచుకోవాల్సి వచ్చేది. మిగిలిన పెద్దనాన్నలు ఇల్లు వాటా వేసుకున్నా ఊళ్ళో ఒకరు, పక్కూరిలో మరొకరు, హైదరాబాదులో ఇంకొకరు అద్దెకుండేవారు. దాంతో మా అమ్మ వాళ్ళ వాటాలతోపాటు ఇల్లంతా తుడిచి,అలికి,బాగుచేసుకోవాల్సి వచ్చింది. మాకు పనిచేసే లక్ష్మి ఈ భారమంతా తన మీద వేసుకునేదిట. మొత్తం ఇల్లంతా ప్రతీ నెల రెండుసార్లు అలికి, రోజూ తుడిచి, పండగ వచ్చినపుడల్లా బూజు దులిపేది. మిగతా అంట్లు, చుట్టూ ఉన్న మరో 500గజాల స్థలం ఊడ్పులు సరేసరి. అలికినప్పుడు మా అమ్మే లక్ష్మి వాళ్ల ఇంటిలో పొయ్యి వెలిగే పనిలేకుండా వంట చేసేది.
                            అలాంటి లక్ష్మికి ఓరోజు పెద్ద కష్టం వచ్చిపడింది. తాగుడికి డబ్బులివ్వడం లేదని, పుట్టింటివాళ్ళతో తనకెన్ని గొడవలున్నా లక్ష్మి పుట్టింటికి వెళ్తూనే ఉందని, ఇలా చిన్నా చితకా, పెద్దా పరకా గొడవలతో లక్ష్మి భర్త ఆమెతో పెద్ద దెబ్బలాట పెట్టుకున్నాడు. తిట్టుకున్నంత సేపు ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు గానీ అతను లక్ష్మిని రోకలిబండ పుచ్చుకుని కొట్టాకా ఆమె ధైర్యం సడలిపోయింది. దానికితోడు లక్ష్మిని చంపుతానంటూ కత్తి పట్టుకుని వెంటపడ్డాడు. పారిపోతూ రక్షణ కోసం ఊరంతా తిరిగింది. “ఆడు కత్తి పట్టుకుని తిరుగుతున్నాడంటే నిన్నేమీ నరికేస్తానికి కాదు. ఏదో భయపెడతన్నాడు అంతే”, అని కొందరు “మొగుడూ పెళ్ళాలు మళ్ళీ ఒకటవుతారు. మధ్యలో చేడేది మేమే” అని ఇంకొందరు.
ఆ స్థితిలో 19ఏళ్ల వయసున్న మా అమ్మ(చిన్నవయసు పెళ్లి లెండి తనది) ఆమెని దాచిపెట్టింది. ఊళ్ళో కావాల్సినవాళ్లు”వాడు పెద్ద పిచ్చెదవ. పసిపిల్లలు ఉన్నదానివి నీకెందుకీ గొడవ. దాన్ని వదిలెయ్” అన్నారు, ఇరుగుపొరుగు “మీకెందుకు సాయి గారో ఈ గోల. ఆళ్ళూ ఆళ్లు ఒకటైపోయి మీకు సెడ్డ పేరు మిగులుద్ది” అని సలహాలిచ్చారు.   లక్ష్మి భర్త రోజూ కత్తి పట్టుకుని,”లచ్చీ బైటికి రా. కరణం గారింటో ఉంటే ఏటీ సెయ్యలేనని అనుకుంటన్నావేమో. నీ సంగతేంటో సూత్తాన”ని బెదిరించేవాట్ట. కానీ మా అమ్మ లక్ష్మిని ఆమె మొగుడి చేతికి వదలలేదు.
                      మా నాన్నగారేమీ అడ్డు చెప్పలేదట కానీ నిర్ణయమూ, నిర్వహణా పూర్తిగా మా అమ్మదే. రోజుకో గదిలో దాచిపెట్టి, పొద్దుట కాఫీ నుంచి రాత్రి భోజనం వరకూ అమ్మ లక్ష్మికి గదిలోకే పట్టుకెళ్లేది. కాలకృత్యాలు, స్నానం లాంటివాటికైతే అదాటున పరుగెత్తి బాత్రూంలో దూరి, ముగించుకుని టకీమని మళ్లీ ఇంట్లోకొచ్చేసేదట. అమ్మ చీరలే మూడురోజులు కట్టేది. మూడు రోజులు అలా గడుస్తూండగా మా అమ్మ ముందు ఇంక రంకెలు చెల్లవని అర్థం చేసుకుని లక్ష్మి భర్త పెద్దమనుషులతో మా ఇంటికొచ్చాట్ట. తాగనని పోలేరమ్మ మీద, పెళ్లాన్ని కొట్టనని వాళ్ళ అమ్మ మీద, లక్ష్మి డబ్బు పాములా చూస్తానని ఒట్టు పెట్టుకుంటే తప్ప లక్ష్మిని పంపనని తెగేసి చెప్పింది అమ్మ. బెట్టు చేసి, బెట్టు చేసి చివరకు తలొగ్గి ఒట్లు పెట్టి, లక్ష్మిని తీసుకెళ్ళాడట. దేవతలకీ, ప్రమాణాలకి జడిసే రకం కాబట్టి ఇంకెపుడూ ఆ పనులు చెయ్యలేదు. అయితే “సాయి గారు ఊరుకుని ఉంటే నేను ఇలా అయిపోయేవోణ్ణి కాదు. ఇంకెప్పుడూ ఆరింట్లో పనికి ఎళ్లొద్దని”, భార్యపై ఆంక్ష పెట్టాడు. కళ్ల నీళ్ల పర్యంతమై ఆ మాట మా అమ్మకి చెప్పి మా ఇంట్లో కొలువుకి సెలవు పుచ్చుకుంది సబ్బు లక్ష్మి.  ఆ తర్వాత పల్లె నుంచి పట్నం వచ్చేవరకూ పదేళ్లకు పైగా అంతటి ఇల్లంతా మా అమ్మే అలికింది అక్కడ ఉన్నన్నాళ్లూ. విచిత్రం ఏంటంటే లక్ష్మి భర్తకి మా అమ్మ మీద ఉన్న కోపం కోపమే కానీ మళ్లీ “ఆరోజు సాయిగారు ఆపకపోతే మా లచ్చిని ఆ ఊపులో నరికేద్దునో ఏమో” అని కృతజ్ఞతగానూ మాట్లాడతాడు.
                  పల్లెటూళ్ళో చంద్రమ్మ, పట్టణం వచ్చాకా సముద్రం, నాగవేణి, నాగమణి, సత్యవతి ఇలా చాలామంది పనిచేశారు కానీ  సబ్బు లక్ష్మిలా ఇంట్లో మనిషల్లే చేసిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటుంది మా అమ్మ.
                  మా అమ్మ నన్ను కడుపుతో ఉండగా ముమ్మరమైన చలికాలంలో “మామిడిపళ్ళ”డిగిందట. మా నాన్నగారు తణుకు, అత్తిలి, భీమవరం తెగతిరిగి చివరికి ఓ జ్యూస్ షాపులో మామిడిపళ్లు పట్టకున్నారట. జ్యూస్ షాపు వాడు జ్యూసులే తప్ప పళ్లు ఇవ్వం అని పట్టుపట్టాడు. నానా రకాల ప్రయత్నించి కళ్లుతిరిగే రేటుకు ఓ మూడు మావిడి పళ్లు కొని మా అమ్మకి ఇచ్చారట నాన్నారు. సంగతేమిటంటే మా అమ్మ నుంచి కడుపులో ఉన్ననాడే మా చెల్లెళ్లకి, నాకూ మావిడి పళ్లంటే పిచ్చి ఇష్టం పట్టుకుంది. ప్రతీ వేసవికీ అన్ని రకాల మావిడిపళ్లు కొనిపెడుతూ ఆ పిచ్చిని ఆనందంగా భరించిన మా నాన్నారు ఓ వేసవిలో మాత్రం కొనితేలేదు. మా నాన్నమ్మకు విపరీతమైన అనారోగ్యం చేస్తే మా అమ్మానాన్నలే ఆర్థికంగా, శారీరికంగా పనిచేయడం వల్ల, మేము చదువులకు ఎదిగి రావడం, అప్పుడే మా ఇల్లు కట్టుకోవడం వంటివి ఆర్థికంగానూ, మానసికంగానూ మా నాన్నారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ హడావుడి రోజుల్లో మావిడి పళ్ళు లాంటి చిన్న చిన్న సరదాల కోసం పర్సు తీయలేకపోయారు. పాపం ఏమనుకున్నారో వేసవి ముగుస్తుండగా ఓ పరక మంచి రసాలు కొని తీసుకువచ్చారు. “పోనీలే పిల్లలు ఒకటికి మూడు తిననీ” అనుకుని ఉంటారు. పెద్దవాళ్ళకి చెరో పండు, పిల్లలకు చెరి 3పళ్ళు వాటా పెట్టాల్సింది పోయి మా ముగ్గురికీ రెండేసి పళ్లే పంచింది. తనకి ఒక్కపండూ అక్కరలేదని మొత్తం నాలుగు పళ్ళూ ఇంట్లో పనిచేసే నాగవేణికి మా చేత్తోనే ఇప్పించింది. “ఇంటిల్లి పాదీ చెరో పండు తినండి”అని పంపింది నాగమణిని.
                     అలా ఇచ్చేందుకు మాకు ముందే చెప్పి ఒప్పించింది అమ్మ. “మీరు కొంచెం పెద్ద పిల్లలు కదా మీకే ఇంతగా తినాలనిపిస్తూ ఉంటే, పాపం నాగవేణి పిల్లలు చాలా చిన్నపిల్లలు కదా మరి వాళ్ళు ఎంత మొహం వాచి ఉంటారో కదా. మనలాంటి ఉద్యోగస్తులమే కొనలేకుండా ఉన్నామే, ఇళ్లల్లో పనిచేసే నాగవేణి ఏమి కొనిపెడ్తుంది. మన ఇంట్లో డస్ట్ బిన్ ఖాళీ చేసేప్పుడు మావిడి టెంకలు చూస్తె పిల్లల్ని తలుచుకుని ఎంత బాధపడుతుంది”అంటూ మాకు సర్ది చెప్పే చేసింది అమ్మ. ఇది ఓమారు మా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది కలిగిన సమయంలో జరిగిన కథ. ఐతే అంతకు ముందూ, ఆ తరువాతా కూడా ప్రతి వేసవి కాలంలోనూ మా అమ్మ రహస్యంగా నా చేత కనీసం రెండు పరకలు మామిడిపళ్లు తను కష్టపడి తేనెటీగలా కూడబెట్టిన డబ్బులు వాడి తెప్పించేది. అప్పుడు మా ఇంట్లో ఎవరు పనిచేస్తే వారికే ఇప్పించేది. రహస్యం ఎందుకూ అంటే ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇల్లు గుల్లవుతోంది అంటారేమోనని.
మా నాన్నమ్మ జీవించి ఉన్నన్నాళ్ళూ ఇంట్లో పనిచేసే అమ్మాయికి కాఫీ, నీళ్లు ఇచ్చేందుకు వేరే గ్లాసులు, టిఫిన్ పెట్టేందుకు వేరే ప్లేట్ పెట్టాలనే పధ్ధతి ఉండేది. మా అమ్మకి అలా వాళ్లని అవమానించడం ఇష్టం ఉండేది కాదు. ఎవరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక తాను ఆ గ్లాసుని, ప్లేటునీ వాళ్లకే ఇచ్చి కాఫీకి వచ్చినప్పుడల్లా తెచ్చుకోండి అనకుండా మా అమ్మే రహస్యంగా మెయింటైన్ చేసేది. మా అమ్మ చేతికి పూర్తిగా ఇంటి వ్యవహారం వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఆ గ్లాసుల పధ్ధతి మానెయ్యడమే. ఇప్పుడు మా ఇంట్లో వేరే గ్లాసుల పధ్ధతి లేదు.
                మరోమాటు మా అమ్మ వీధిలోకి వచ్చి “బాబూ! చేపలూ ఇటు రా” అని పిలిచింది. వీధి వీధంతా బిత్తరపోయింది శుద్ధ శాకాహారులమైన మా ఇంటి నుంచి ఆ పిలుపు విని. ఆ చేపల బుట్ట ముంగిట్లోకి వచ్చాకా మా వంటింట్లో పనిచేస్తున్న నాగమణిని పిలిచి “ఎలాంటి చేపలు కావాలో ఏరుకో. డబ్బులు గురించి ఆలోచించకు. ఇవన్నీ నీ జీతంలో కొయ్యను. బహుమతి అనుకుని తీసుకో” అంది. జీవితంలో ఎప్పుడూ అలాంటివి ఎరగదో ఏమో ఆమె చాలా కరిగిపోయింది. అసలేం జరిగిందంటే-మేము మూడంతస్తుల బిల్డింగులో మొదటి అంతస్తులో ఉండేవాళ్లం. మా ఇంటి వాకిట్లో నిలబడ్డ మా అమ్మ నాగవేణి కిందకి తొంగి చూడడం చూసింది. మళ్లీ తలతిప్పేసుకుని లోపలికి వచ్చేస్తున్న ఆమెని ఆపి అలా ఏం తొంగి చూసి వస్తున్నావని అడిగింది చాలా మామూలుగా మా అమ్మ.
ఆమె ఇబ్బందిగా, సిగ్గుగా, అవమానభారంతో “ఏం లేదమ్మా” అనేస్తుంటే ఏదో ఉందనుకుని కిందికి వంగి చూసింది అమ్మ. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు చేపల బేరం చేసి ముగించుకుని చేపలతో కింది ఫ్లోర్ వాళ్లూ, పక్కింటివాళ్లూ ఇళ్లలోకి వెళ్తున్నారు చేపలబుట్టతో అమ్మే అతను వీధిదాటి వెళ్లిపోతున్నాడు. “ఏమ్మా చేపలు చూసి ఎందుకలా వచ్చేస్తున్నావు?” అంది అమ్మ. “ఏమీ లేదమ్మా ఊరికే కొందామని…” అంటూ అర్థోక్తితో ఆగిందామె. “అదే ఎందుకు కొనలేదు?” “డబ్బులెక్కడివమ్మా..” అంటూ నవ్వులో బాధని కలిపేసే ప్రయత్నం చేస్తూ చెప్పిందామె.
                 ఇక మా అమ్మ ఆగలేదు స్వయంగా పిలుచుకొచ్చి ఇంటిముందు తొలిసారి చేపలబుట్ట దింపించింది. ఆమె మొత్తానికామె ఓ చేప తీసుకుంది. మా అమ్మకు అంచనా తెలియదు కానీ ఒకటి ఇంట్లోవాళ్లకి సరిపోతుందా అని అనుమానమొచ్చి చేపలతన్నే అడిగితే ఇద్దరికైతే సరిపోద్దండీ నలుగురైతే సరిపెట్టుకోవాలని చెప్పాడు. “మీ పిల్లలు ఇంకాస్త కూర వెయ్యి అని అడిగితే ఏం చేయ్యగలవు? అసలు పెట్టకపోయినా పర్లేదుగానీ పసివెధవల్ని అర్థాకలితో లేపి ఏడిపించకూడదు. ఇంకో చేప తీసుకో” అని బలవంతాన ఒప్పించింది. వీటితో కూర ఐపోదు కదాని ఉల్లిపాయలు, బియ్యం, ఇతర దినుసులు కూడా మా ఇంటి నుంచే ఇచ్చింది ఏమేమి అవసరమౌతాయో పక్కింట్లో మా అమ్మ ఫ్రెండ్ ఒకావిణ్ణి అడిగి తెలుసుకుని. మా ఇంట్లో లేని కొన్ని మసాలా దినుసుల్ని వాళ్ళింట్లో అరువడిగి ఇప్పించింది.
నాగవేణి భర్త ఇదంతా తెలుసుకుని “ఏదో ఆరు కొనిపెట్టారే అనుకో ఇదే అదునని ఒకటికి రెండు తీసేసుకుంటావా?” అని తిట్టాట్ట.
               కొసమెరుపేమిటంటే- “సాయిగారు చేపల బుట్టని పిలిచేరేంటి. ఆళ్లు బ్రేమ్మలు కదా” అని చాలామంది అడిగారట నాగవేణిని. ఇలా నాకోసం అని చెప్తే ముక్కున వేలేసుకుని, మా అమ్మ దగ్గరకి వచ్చినప్పుడు “పనోళ్లని మరీ అంత ఇదిగా చూడకూదదండీ. లోకువకట్టేత్తార”ని బోధించే ప్రయత్నం చేశారు. “జరుగుబాటు లేక కానీ వాళ్లకీ కొనుక్కోవాలనే ఉంటుంది కదండీ. నేనేం వాళ్ల జీవితాలు బాగు చేసెయ్యలేను. ఏవో చిన్న సరదాలు తీర్చాను. మీ ఇంట్లో చేపలు రుద్దేప్పుడు మాకు లేవే అని బాధపడితే మంచిదా ఏంటి?” అని చెప్పుకొచ్చింది. వాళ్ల గొడవ అమ్మకి పట్టదు. అమ్మ లెక్క వాళ్లకి రాదు. అయినా మా అమ్మకి పనిచేసే వాళ్ల మనసులు చివుక్కుమన్న చప్పుడు కూడా వినిపిస్తుంది.
                       సత్యవతి మా ఇంట్లో పనిచేసేప్పుడు “సత్య.. సత్య” అని పిలిచేది ఆమెని. అలా కాలేజి పిల్లలా సత్య అని పిలిపించుకోవాలని ఆమె ఆశట. నీకు ఎలా పిలిస్తే ఇష్టం అని తెలుసుకుని మరీ అలా పిలిచేది అమ్మ. అప్పుడే మాటలు వస్తున్న మా మేనకోడలి చేత కూడా “సత్య”(సచ్చ అని పిలవడమే వచ్చేది తనకి) అని పిలిపిస్తే సత్యవతి “మాయమ్మే ఎంత ముచ్చటగా పిలుస్తున్నావమ్మా” అని మురిసిపోయేది. చాన్నాళ్ళు మా ఇంట్లో పనిచేశాకా  మేము ఇల్లు మారిపోతే రెండు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నడిచి వచ్చేది. చివరకి “మిమ్మల్ని వదల్లేక పోతున్నానండీ సాయి గారూ” అనంటూనే మానేసింది సత్య.
              నాగలక్ష్మి పిల్లలు కాన్వెంట్లో పనిచేస్తోంటే మా నాన్నారి పరిచయాలు ఉపయోగించి ఫీజులు బాగా తగ్గించడం లాంటివి మొదలు చిన్నవీ చితకవీ ఇంకా చాలానే ఉన్నాయి గానీ విషయం మాత్రం ఒకటే. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు కదా.
santhosh-సూరంపూడి పవన్ సంతోష్
Download PDF

8 Comments

  • mythili abbaraju says:

    కలిగిన ఆ కొంతలోంచి పిడికెడంత మెత్తదనం

  • బ్రిలియంట్.

  • చిన్న విషయాల్లోనే పెద్దమనసు చూపించిన మంచి మనిషి గురించి తెలుసుకున్నాను. తృప్తిగా ఉంది.

  • బావుందండీ. మీ మాటల్లో లోపించినదేవిటంటే.. డాంబికం. :) అభినందనలు!.

  • Narayana G. says:

    వాత్సల్యం, సమానత్వం,ప్రేమ, సాటి మనుషుల బాగోగులు, అవసరాలు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఇవన్నీ సహజంగా జీర్ణించుకుపోయిన మీ తల్లిగారికి వందనాలు. ఆ విషయాన్ని తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

    ఇన్నాళ్ళూ, మా అమ్మగారి గురించే ఆశ్చర్యపోయే మాకు మరో అమ్మగారి పరిచయం మీ మూలంగా దొరికింది. డొక్కా సీతమ్మగారి గురించి పాఠాలలో చదువుకున్నాము. పాఠాలకు ఎక్కకుండా ఇలా సామాన్యంగా పనిచేసుకుపోతున్న గొప్ప తల్లుల సంగతి మీ బోటి వారు చెబితే తప్ప తెలియదు.

    నారాయణ.

  • Usharani Nutulapati says:

    చాలాబావుందండీ పవన్ సంతోష్ గారూ.మీ అమ్మగారిలాంటి దయామయులు కొద్ది మందే వుంటారు. పనివారిని స్వంతవారిగా ఆదరించి ఆదుకొనే మనస్తత్వం కొద్దిమందికే వుంటుంది.బాగా రాశారు.అభినందనలు.

  • pavan santhosh surampudi says:

    వ్యాఖ్యానించిన వారందరికీ కృతఙ్ఞతలు. ఉషారాణి నూతులపాటి గారి వ్యాఖ్య చదివాకా ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆరునెలల నాటి వ్యాసానికి ఇంకా పాఠకులు స్పందించడం చాలా ఆనందం కలిగిస్తోంది. ధన్యవాదాలు.

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)