“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

PalakaFinalFrontCoverBig
మంచి రచన ప్రథాన లక్షణం హాయిగా చదివించగలగడం; ఆ పై ఆలోచింపజేయడం. కాలానికి తట్టుకుని నిలిచేది ఉత్తమ రచన అని కొంతమంది అంటూంటారు. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని రికార్డు చేయడం, ఆయా అనుభూతులను, అనుభవాలను, స్మృతులను, ఆనందాల్ని, బాధల్ని అక్షరబద్ధం చేయడాన్ని డైరీఅనవచ్చు. మరి డైరీలూ, ఉత్తమ రచనలేనా అని కొందరు ప్రశ్నించవచ్చు. అన్ని డైరీలు కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖుల డైరీలు సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసాయని చెప్పక తప్పదు. పూడూరి రాజిరెడ్డి పలక - పెన్సిల్అనే పుస్తకం ఉప శీర్షిక ఒక మగవాడి డైరీమనకి ఇదే చెబుతుంది.
మనిషి జీవితంలోని ఒక్కోదశలో అతని ప్రవర్తన, భావాలూ, ఆలోచనలు, జ్ఞాపకాలు, సంశయాలు, సందిగ్ధాలు, సమస్యలు, విజయాల గురించి చెప్పింది. పుస్తకంలోని ఆర్టికల్స్ (ఇవన్నీ గతంలో సాక్షి ఫండేలోనూ, ఈనాడు ఆదివారం అనుబంధంలోనూ ప్రచురితమైనవే) మనిషి జీవితంలో ఒక క్రమంలో ఎదగడాన్ని సూచిస్తాయి. రచయిత ఉద్దేశానికి తగినట్టే ముఖచిత్రం మీద అన్వర్ వేసిన బొమ్మలు వ్యక్తి జీవితంలోని శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, ముదిమిలను ప్రతిబింబిస్తున్నాయి. పుస్తకంలోని ఆర్టికల్స్‌ని బలపం, పెన్సిల్, పెన్ను విభాగాలుగా విభజించడం బాల్యం, కౌమారం, యవ్వనాలకు ప్రతీకగా పరిగణించవచ్చు. సాధారణంగా డైరీ అంటే ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం అని భావిస్తాం. కానీ ఈ డైరీ వ్యక్తిగతం కాదు, ఓ వ్యక్తి గతాన్ని, వర్తమానాన్ని మిళితం చేస్తూ, ఆ వ్యక్తిలాంటి ఎందరో వ్యక్తుల అనుభవాలు, అనుభూతులను, భావాలను వెల్లడించింది. శిశువుగా ఓ కుటుంబంలో జన్మించి, ఎదుగుతూ బంధాలను కలుపుకుంటాడు మనిషి. యవ్వనంలోకి వచ్చేసరికి కుటుంబం పరిధి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతూంది కూడా. కొత్తబంధాలు ఏర్పడుతాయి. అయితే చాలామంది చేసే పొరపాటు పాతవాటిని వదిలేసుకోడం అని అవ్యక్తంగా చెబుతారు రచయిత. తన ఊరు, పొలం జ్ఞాపకాలు, తమ్ముడి స్మృతులు, తను చూసిన సినిమాలు, తన చదువు ముచ్చట్లు - “బలపంవిభాగంలోని ఆర్టికల్స్ చెబుతాయి. ఈ విభాగంలోని ఆర్టికల్స్ చదువుతుంటే ఎప్పుడో బాపుగారి దర్శకత్వంలో వచ్చిన స్నేహంసినిమాలోని ఓ పాట ఎగరేసిన గాలిపటాలు….” పాటలోని కొన్ని వాక్యాలు …. “చిన్ననాటి ఆనవాళ్ళుస్నేహంలో మైలురాళ్ళుచిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు….” మనసు పొరల్లో దోబూచులాడాయి. పెన్సిల్ విభాగం - కౌమారంతో ప్రారంభం అవుతుంది. కలం స్నేహం చేయాలనే అభిలాషతో గోవాలోని ఓ అమ్మాయికి మొదటి లేఖలోనే…. తన గురించిమొత్తం చెప్పేయడం…. కానీ ఆ లేఖకి జవాబు రాకపోవడం…. తను చేసిన తప్పేంటో తర్వాతర్వాత తెలుసుకుంటారు రాజిరెడ్డి.

చిన్నచిన్న పదాలతో కోనసీమ కొబ్బరిచెట్లని మనోజ్ఞంగా వర్ణించారు రచయిత. అదే భావ శబలతతో తన సొంతూరుని వర్ణించిన తీరు, ఎవరికైనా తమ స్వంత ఊరుని గుర్తు చేయకమానదు.

మనిషికి తోడు ఎందుకు కావాలో తెలుసా? అందరూ తమ దుఃఖాన్ని పంచుకోడానికి మరొకరు కావాలనుకుంటారు. కాని రాజిరెడ్డికి మాత్రం అలా అనిపించదు. హృదయంలో పొంగి పొరలుతున్న సంతోషాన్ని ఒక్కడే అనుభవించక, తోడు కావాలని కోరుకుంటారతను. అంతలోనే బంధం ఎన్నాళ్ళని ప్రశ్నిస్తూ, తనే సమాధనం చెబుతారు - జీవితకాలం అని. “రూపం లేని, ఇదీ అని చెప్పలేని ప్రేమకి రూపం వస్తేఅదిగోఅది మీ ఇంట్లో ఉండే మీ మనిషిగా ఉంటుంది…” అంటూ జీవితభాగస్వామి గురించి అద్భుతంగా చెప్పారు.

PalakaPencilFrontCover

భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయబేధాల గురించి ఇలా అంటారు - “నేను కాదంటాను. నువ్వు చేసే రాచకార్యమేమిటి? అని హోమ్ పాయింట్ ఎదురవుతుంది. నేను చెప్పబోయేవేవీ వాదనకు నిలబడవని నాకు తెలుసు. అందులో కొన్నింటిని చెప్పుకోలేమనీ తెలుసు. అందుకని అసహనాన్ని ఆశ్రయిస్తాను. వాళ్ళు నిరసనని ఆయుధంగా చేసుకుంటారు. ఆ నిరసనని నిరసిస్తూ నేను మౌనం పాటిస్తాను. ఆ మౌనాన్ని ఛేదించడానికి మాటల ఈటెలు విసరబడతాయి. వంద విసుగులు, వెయ్యి నిట్టూర్పులు శవాలుగా నేల కూలుతాయి. చేస్తున్నది ధర్మయుద్ధం కాబట్టి, చీకటి పడగానే దాన్ని అలా అక్కడికి ఆపేస్తాం“. ఈ వాక్యాలు చదివాక, ఇది తమకి సంబంధించినది కాదని పాఠకులు అనుకోగలరా? తమ గురించే రచయిత రాసేసినట్లు భావించరూ?

పిల్లల్ని ఎలా పెంచాలో మరో చోట చెబుతూ.. “బతకడం ఎలాగో మనమే నేర్చుకుంటున్నప్పుడు, పిల్లలకు జీవితం అంటే ఏం చెప్పగలం?” అని ప్రశ్నిస్తారు. బహుశా, ఇది ప్రతీ తల్లీ తండ్రీ తమకి తాము వేసుకోవాల్సిన ప్రశ్నేమో

“మనకి మనమే ఎందుకు ఇంతగా నచ్చకుండా పోతాం? మన అలవాట్లను ఎందుకు ఇంత తీవ్రంగా నిరసిస్తున్నాం? మనం ఉన్న స్థితే కరెక్టు అని తెలియాలంటే, దీనికంటే భిన్నస్థితిలోకి ఒకసారి వెళ్ళిరావాలి…” అంటారు. వ్యక్తిత్వ వికాస రచయితలు పెద్ద పెద్ద పదాలతో చెప్పే విషయాన్ని సూక్ష్మంగా, సునిశితంగా చెప్పేసారు రాజిరెడ్డి.

భోగిమంటల్లో ఏమేమి వెయ్యాలో హృద్యంగా చెప్పారు ఈ పుస్తకంలో. మోసం, కపటం, అసూయ, అపరాధ భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్వీటిని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలట. “రక్తప్రసరణ పెంచుకుని, జుట్టుని రాల్చుకుని, ముఖాన్ని మాడ్చుకుని…. వాటిల్లో మనం దహించుకుపోడమా, వాటినే మనం దగ్ధం చేయడమా?” అని అడగడంలో ఆనందంగా జీవించడమెలా అనే కళని చెప్పకనే చెప్పారు రచయిత.

ఎవరినో ఎందుకు మార్చాలి? ఇతరులలో తప్పులెందుకు పట్టాలి? జీవితాంతం జీవించడం నేర్చుకుంటూనే ఉండాలనే సెనెకా మాటలని ఉదహరిస్తూ ఈ ప్రపంచం పర్ఫెక్ట్ కాదంటారు. “నేనేమిటోఅన్న వ్యాసం పూర్తిగా రచయితకి సంబంధించినదే అయినా, ఇందులోని చాలా పాయింట్లతో చదువరులు తమని తాము ఐడింటిఫై చేసుకుంటారు.

పెన్ను విభాగంలోని రచనలు క్లుప్తంగా ఉన్నా, వాటిలో విస్తృతమైన, విశాలమైన భావాలున్నాయి. తాత్త్వికత జోడించిన అంశాలివి. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం పిల్లలకి మాత్రమే ఎందుకు సాధ్యమవుతుందో, ఆటతో పోలుస్తూ చెప్పడం బాగుంది. ప్రేమ, బాధ, ఆప్యాయత, అసూయ…. ఏ గుంపుకైనా సహజ లక్షణాలు అనుకున్నప్పుడు సంసారానికి, సన్యాసానికి పెద్దగా తేడా ఉండదంటారు రాజిరెడ్డి. “చెట్టు కదలకుండానే పెరుగుతుంది చూడు; మనిషి కూడా అలా లోలోపల పెరగలేడంటావా?” అని అడిగిన మల్లయ్య ప్రశ్న మనల్నీ ఆలోచనల్లో పడేస్తుంది.

ఇదే పుస్తకంలో మరోచోట అంటారు - “ఆడవాళ్ళతో సమస్యలుంటాయేమో గాని అమ్మతో పేచీ ఎప్పుడూ ఉండదుఅని. అమ్మల గురించి చెప్పినా, అందం అంటే ఏమిటో వివరించినా, స్త్రీలు అంటే ఎవరో నిర్వచించినా - కుటుంబాన్ని, సమాజాన్ని దగ్గర్నించి చూసి, గ్రహించి, నిర్వచించినట్లు తెలుస్తుంది ఆయా వాక్యాలు చదువుతూంటే.

పుస్తకం కవర్ పేజి మీద ఉన్న పలక బొమ్మ మీద రాసిన అక్షరాలు - “: అతడు; : ఆమెమనకెన్నో సంగతులు చెబుతాయి. మనం మన గురించి కాక, ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. వాళ్ళిలా…. వీళ్ళిలా అంటూ వేరేవారి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఆపాదిస్తాం. కాని అసలు మనకి కావల్సింది ఎవరిని వారు తెలుసుకోడం అంటారు రాజిరెడ్డి.

ఈ పుస్తకం ఒక నాస్టాల్జియా! గతాన్ని నెమరువేసుకునే జ్ఞాపకం!! భవిష్యత్తులోకి భవ్యంగా నడిపే మార్గదర్శి!!! చదవడం పూర్తయ్యాక, ఈ పుస్తకం ఉపశీర్షిక ఒక మగవాడి డైరీఅనికాకుండా, “ఒక మనిషి డైరీఅని ఉండుంటే సరీగ్గా ఉండేదని అనిపిస్తుంది.

ఈ పుస్తకం గురించి అఫ్సర్ గారు తన ముందుమాటలో చెప్పిన వాక్యాలతో వ్యాసం ముగిస్తాను. “జీవితం ఒక వొత్తిడి. మనసుకీ, చేతకీ మధ్య, ఆలోచనకీ, సిరాకీ మధ్య – మనసు తీసే కూని రాగాలన్నీ వరుసబెట్టి కాయితమ్మీద తుమ్మెద బారులాగా చూసుకుంటే… అదిగో… అలాంటి పని రాజిరెడ్డి “పెన్ను” చేసింది. అనేక రకాల వొత్తిళ్ళ మధ్య మాట క్లుప్తం అవుతుంది. కానీ, మాటకి వొక పొందిక వస్తుంది. వొక జెన్ యోగి నిశ్శబ్దంలోంచి రాలిన హైకూలాంటి అరుదైన ఆకులాంటి భాష.”

సరళ వచనం, నమ్మశక్యంగాని సులభమైన శైలి ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివేలా చేస్తాయి. సారంగ బుక్స్ ప్రచురించి 113 పేజీల ఈ పుస్తకం వెల రూ. 75/- నవోదయ బుక్ హౌస్‌లో లభిస్తుంది. భారతదేశం బయట తెలుగువారికి అమెజాన్, సారంగ బుక్స్, ఎవికెఎఫ్ లోనూ లభిస్తుంది.

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

Download PDF

2 Comments

  • sasikala says:

    చక్కగా వ్రాసారు .మీరు కోట్ చేసినవి నేను కూడా కోట్ చేసి పెట్టుకున్న మంచి వాక్యాలలో ఉన్నాయి .
    ఒక మనిషి ప్రయాణం అతి సులభ శైలి లో ….. కొని చదువ వలసిన పుస్తకం

  • శశికళ గారు,
    ధన్యవాదాలు.

Leave a Reply to sasikala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)