ఖాళీలలోనే ఉంది కథంతా…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

ఋతుమతి యై పుత్రార్థము

పతి గోరిన భార్యయందు బ్రతికూలుండై                                    

ఋతువిఫలత్వము సేసిన

యతనికి మరి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్

                                             -నన్నయ

 (శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

ఋతుమతి అయిన భార్య, పుత్రుని ఇవ్వమని భర్తను కోరినప్పుడు నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేసినవాడికి గర్భస్థ శిశువును చంపిన పాపం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతారు.

  ***

అదీ విషయం…ఋతుమతి అయిన భార్య పుత్రుని ఇమ్మని భర్తను కోరినప్పుడు, భర్త నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకోదా అని శుక్రుని యయాతి అడుగుతున్నాడు!

  ఋతుకాలాన్ని విఫలం చేయడం, భ్రూణహత్య అనే మాటలు చర్చను మరో ప్రాంగణంలోకి తీసుకెడుతున్నాయి. బహుశా అవి పురాదశకు చెందిన  స్త్రీ-పురుష సంబంధాలను ఇప్పటి మన అవగాహనకు భిన్నంగా నిర్వచిస్తున్నాయి. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన ఇక్కడ చాలా కీలకం. భ్రూణహత్యా పాపం అనేది ఒక విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఒక మతవిశ్వాసం అంత బలీయమైనది. అంతేకాదు, స్త్రీ-పురుష సంబంధాల గురించి నేటి మన విశ్వాసాలు, భావనల కంటే కూడా అది బలీయం. పురా మానవుడి దృష్టిలో విశ్వాసాన్ని మించిన బలవత్తర శక్తి ఇంకొకటి లేదు. పురామానవుడు నూటికి నూరుపాళ్లూ విశ్వాసజీవి.  స్త్రీ-పురుష సంబంధాల గురించిన ఊహలు, శీలం, ఏకపత్నీవ్రతం,లేదా ఏకపతీవ్రతం మొదలైనవి మానవ పరిధిలోకి చెందినవి. సామాజిక కల్పనలు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన వాటిని మించినది. అది మానవ పరిధినీ, సామాజిక పరిధినీ దాటేది. ఒక అతీతశక్తి పట్ల, లేదా ప్రకృతిపట్ల జరిగే దారుణ అపచారానికీ, ద్రోహానికీ అది సూచన. 

ఈ సందర్భంలో నాకు ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ’ నవల గుర్తుకొస్తోంది. ఆ నవల ప్రారంభమే ఋతుకాల భయాలతో జరుగుతుంది. మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ  భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ, స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.

books

భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది.

ఋతుకాల విఫలత్వం భ్రూణహత్యా పాపాన్ని చుట్టబెడుతుందన్న ఆదిమ విశ్వాసం ఆధునిక కాలంలోనూ మొన్న మొన్నటివరకూ శ్రోత్రియ కుటుంబాలలో కొనసాగింది. ‘రజస్వలాత్పూర్వ వివాహం’ గతంలో ఒక పెద్ద చర్చనీయాంశం.  పాటించి తీరవలసిన ఒక నియమం. దీనికి ఏవేవో సామాజిక కారణాలు చెబుతారు. వాటిలోనూ నిజం ఉంటే ఉండచ్చు కానీ, నా ఉద్దేశంలో భ్రూణ హత్యా పాపం గురించిన భయాలే ఆ నియమానికి అసలు కారణం. రజస్వలాత్పూర్వ వివాహాల పట్టింపు క్రమంగా కొంత సడలి, రజస్వల అయిన వెంటనే పెళ్లి చేసే తొందరకు దారి తీసింది. ఇప్పుడు ఆ పట్టింపు కూడా చాలావరకూ పోయింది. చట్టం కూడా బాల్యవివాహాలను నిషేధించింది.

మరికొంత వివరించుకుంటే, పైన చెప్పుకున్న ఋతుకాల భయాలనేవి స్త్రీ-పురుష సంబంధాలను వివాహం అనే సామాజిక రూపంలో వ్యవస్థీకరించడానికీ; స్త్రీకి ఒకే పురుషుడన్న నియమానికీ; స్త్రీ శీలం గురించిన నేటి భావనలకూ కూడా పూర్వదశకు చెందిన వనడానికి అవకాశం ఉంది. ఆవిధంగా ఋతుకాలభయాలకూ, వివాహానికీ ముడి అనంతర కాలంలో ఏర్పడిందనుకుంటే, బహుశా ఋతుకాలం ప్రాప్తించిన స్త్రీకి వివాహం వెలుపల సైతం దానిని సఫలం చేసుకునే హక్కూ, తద్వారా సంతానం పొందే హక్కూ ఉండి ఉండాలి. పురుషుడికి ఉన్నట్టే స్త్రీకి కూడా ఋతుకాల వైఫల్యం వల్ల కలిగే భ్రూణ హత్యాభయాలు ఉంటాయి కనుక, ప్రస్తుత సందర్భంలో కథకుడు చెప్పకపోయినా శర్మిష్ట ఆ భయాలను యయాతిపై ప్రయోగించే ఉంటుంది.

దీనిని విస్తరించుకుంటూ వెడితే ఈ చర్చ క్రమంగా మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల గురించిన చరిత్రలోకి తీసుకువెడుతుంది. మాతృస్వామ్యంపై పితృస్వామ్యానిది పై చేయి అయి, స్త్రీ క్రమంగా పురుషుడి ప్రైవేటు ఆస్తిగా మారి, వివాహ వ్యవస్థ బిగుసుకునే క్రమంలో దానికీ;  స్త్రీ ఋతుకాల హక్కుకూ, సంతాన హక్కుకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉండాలి.  భైరప్ప ప్రకారం శల్యుడి కాలానికే ఆ పరివర్తన జరిగిపోయి ఉండాలి. అయితే వ్యవస్థ మారినంత వేగంగా విశ్వాసం మారదు. దాని ఫలితమే శల్యుని భ్రూణహత్యా భయాలు.

పై వివరణ ఇప్పటి నమ్మకాలను, మనోభావాలను గాయపరిచేలా ఉండచ్చు కానీ, స్త్రీకి ఒకే పురుషుడన్న నీతిని మించి ఋతుకాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పే సాక్ష్యాలు మహాభారతంలోనే పుష్కలంగా ఉన్నాయి. ముందుగా మూడు ఉదాహరణలు చెప్పుకుంటే…

ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో కథకుడైన వైశంపాయనుడు వ్యాసుని పుట్టుక గురించి జనమేజయునికి చెప్పి, ఆ వెంటనే, దేవదానవుల అంశతో భీష్మాది వీరులు పుట్టి భారతయుద్ధం చేశారని అంటాడు. అలా పుట్టిన రాజులందరూ భారతయుద్ధంలో నశించడానికి కారణమేమిటని జనమేజయుడు అడుగుతాడు. వైశంపాయనుడు సమాధానం చెబుతూ, పరశురాముడు ఇరవయ్యొక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ సంహరించాడనీ, అప్పుడు ఆ రాజుల భార్యలు సంతానం కోరి ఋతుకాలంలో ధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారనీ, దాంతో రాజవంశాలు వర్ధిల్లాయనీ అంటాడు. ఎన్నో ఆసక్తికర విశేషాలున్న వైశంపాయనుని సమాధానం మొత్తాన్ని నేను ఇక్కడ ఇవ్వడం లేదు. వేరొక సందర్భంలో దాని గురించి చెప్పుకుందాం. ప్రస్తుతానికి వస్తే…

మృతులైన రాజుల భార్యలు ఋతుకాలంలో ధర్మం తప్పకుండా, అంటే ఋతుకాలధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారని పై సమాచారం వెల్లడిస్తోంది. ఇక్కడ ఋతుకాల ప్రస్తావన చేయకుండా, విప్రుల ఆశీస్సులతో సంతానం పొందారని చెప్పి ఉంటే, దానికి ఏదో మహిమను ఆపాదించి సమర్థించుకోవచ్చు. కానీ ఋతుకాలాన్ని ప్రస్తావించి మరీ కథకుడు ఈ సంగతి చెప్పాడుకనుక దీనిని వాస్తవికార్థంలోనే తీసుకోవలసి ఉంటుంది.

రెండో ఉదాహరణ, ఉదంకుని ఉదంతం. ఉదంకుడు పైలుడనే ముని శిష్యుడు. ఫైలు డొకసారి దేశాంతరం వెడుతూ ఇంటి బాధ్యతలు ఉదంకునికి అప్పజెబుతాడు. అంతలో ఫైలుని భార్యకు ఋతుకాలం సంభవిస్తుంది. ఇతర స్త్రీలు ఉదంకునితో ఈ విషయం చెప్పి, గురువు దగ్గరలో లేరు కనుక ఆయన స్థానంలో నువ్వు ఆమెకు ఋతుకాలోచితాన్ని నిర్వర్తించాలని చెబుతారు. ఉదంకుడు అందుకు తిరస్కరిస్తాడు. గురువు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం ఆయనకు చెబుతాడు. అప్పుడు గురువు ఉదంకుని మెచ్చుకుంటాడు. ఉదంకునికి స్త్రీలు ఆ సూచన చేశారంటే, అప్పటికి అలాంటి ఆనవాయితీ ఉందనుకోవాలి. ఉదంకుడు తిరస్కరించాడంటే, ఆ ఆనవాయితీకి కాలం చెల్లుతూ ఉండాలి. ఈ సందర్భాన్ని కథకుడు ప్రధానంగా మరొకందుకు వాడుకున్నాడు. అది, ఉదంకుని గురుభక్తిని చెప్పడం.

నాకు ఈ ఉదంతంలో లీలగా ఇంకొకటి కూడా స్ఫురిస్తూ ఉంటుంది. యజమాని దేశాంతరం వెళ్ళడం, ఒక కట్టుగా ఉన్న స్త్రీలు మాతృస్వామ్యం తాలూకు ఒక ఆనవాయితీని అమలుచేయడానికి ప్రయత్నించడం, యజమాని ప్రతినిధి అయిన ఉదంకుడు అందుకు నిరాకరించడం -ఋతుకాలోచితం విషయంలో  స్త్రీ-పురుషుల మధ్య అప్పటికింకా కొనసాగుతున్న ఘర్షణను సూచిస్తూ ఉండచ్చు.  విశేషమేమిటంటే, సంస్కృత భారతంలో ఉన్న ఈ ఉదంతాన్ని అనువాదంలో నన్నయ పరిహరించాడు.

ఇక మూడో ఉదాహరణకోసం నేరుగా కథలోకి వెడదాం:

శర్మిష్టకు కొడుకు పుట్టాడు. పేరు, దృహ్యువు. దేవయాని ఆశ్చర్యపోయింది.  ‘చిన్నదానివైనా మంచి వినయశీలాలతోనూ, గౌరవంగానూ, మనోవికారాలకు దూరంగానూ ఉంటున్న ఈ పరిస్థితిలో నీకు కొడుకు ఎలా పుట్టాడు? చాలా ఆశ్చర్యంగా ఉందే!’ అంది.

శర్మిష్ట సిగ్గుపడుతూ తలవంచుకుని, ‘ఎక్కడినుంచో ఒక మహాముని, వేదవేదాంగపారగుడు వచ్చి ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకును ప్రసాదించాడు’ అంది.

దేవయాని (ఏమీ మాట్లాడకుండా) తన నివాసానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత శర్మిష్టకు వరసగా అనువు, పూరువు అనే మరో ఇద్దరు కొడుకులు కలిగారు.

దేవయానికి శర్మిష్టలో హఠాత్తుగా వినయశీలాలు, గౌరవనీయత కనిపించడం విశేషం. దానినలా ఉంచితే, శర్మిష్ట సమాధానం గమనించండి…ఎవరో మహాముని వచ్చి, ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకునిచ్చా’ డని చెబుతోంది. పైన రాజుల భార్యల విషయంలో చెప్పుకున్నదే ఇక్కడా వర్తిస్తుంది.  శర్మిష్ట ఋతుకాలం లో ఉన్నప్పుడే ఆ ‘మహాముని’ ఆమెకు కొడుకునిచ్చి వెళ్ళాడు. అది అబద్ధమైనా, అది వెల్లడిస్తున్న ఆనవాయితీ అబద్ధం కాదు. ఆ ఆనవాయితీ దేవయానికి కూడా తెలుసు. అందుకే శర్మిష్ట అలా చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్లిపోయింది. నిజానికి ‘నీకు కొడుకు ఎలా పుట్టా’ డన్నదే దేవయాని ప్రశ్న అయుంటుంది. యయాతి వల్ల కలిగాడా అన్నది తేల్చుకోవడమే ఆమెకు కావాలి.  యయాతి వల్ల కాకుండా, ఇంకెవరి వల్ల శర్మిష్టకు కొడుకు పుట్టినా దేవయానికి అభ్యంతరం లేదు, అందులో ఆశ్చర్యమూ లేదు.

ఇక, ఆమె ప్రశ్నలోని మిగతా భాగమంతా కథకుని కల్పన. ఎందుకంటే, ఋతుకాల ప్రాధాన్యాన్ని వెల్లడించే ఆ ఆనవాయితీ చర్చలోకి రాకూడదు. అందుకే, దేవయాని నోట తన మాటలు పలికిస్తూ ఆ ఆనవాయితీపై  కథకుడు ముసుగు కప్పుతున్నాడు. కారణం ఇంతకుముందు చెప్పుకున్నదే:  ఆ ఆనవాయితీ గురించి తెలియని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు అతడు కథ చెబుతున్నాడు. లేదా, తనే ఆ ఆనవాయితీని సరిగా పోల్చుకోలేకపోయీ ఉండచ్చు.

కథలోకి వెడితే…శర్మిష్ట కొడుకులు ముగ్గురూ, ఒంటి మీద ఆభరణాలు లేకపోయినా సహజకాంతితో మూడు అగ్నుల్లా ప్రకాశిస్తూ తన ముందు ఆడుకుంటుండగా వినోదిస్తున్న యయాతి దగ్గరికి; శర్మిష్టనూ, ఇతర దాసీ కన్యలనూ వెంటబెట్టుకుని వైభవం చాటుకుంటూ శచీదేవిలా దేవయాని వచ్చింది. తేజస్సు ఉట్టిపడుతుండగా, యయాతి ప్రతిబింబాల్లా ఉన్న ఆ ముగ్గురినీ చూసి ‘ఈ పిల్ల లెవ’ రని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పలేదు. ‘మీ తల్లిదండ్రు లెవ’ రని ఆ పిల్లలనే అడిగింది. వారు లేత చూపుడు వేళ్ళతో యయాతినీ, శర్మిష్టనూ చూపించారు.

తనకు తెలియకుండా యయాతి శర్మిష్టవల్ల సంతానం పొందాడని దేవయానికి తెలిసిపోయింది. కోపమూ, దుఃఖమూ ఆమెను ముంచెత్తాయి. ఈ ‘దానవి’తో సంబంధం పెట్టుకుని యయాతి తనను నిలువునా వంచించాడనుకుంది. తక్షణమే పుట్టింటికి వెళ్ళి, తండ్రి పాదాలమీద పడి దీర్ఘనేత్రాలనుంచి ఉబికివచ్చే జలధారలతో వాటిని కడిగింది.

యయాతి కూడా బతిమాలుతూ దేవయాని వెంటే వెళ్ళి శుక్రుని దర్శించి నమస్కరించాడు.  ‘ధర్మం తప్పి ఈ రాజు రాక్షస పద్ధతిలో ఆ రాక్షసిమీద అనురక్తుడై ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. నన్ను అవమానించాడు’ అని దేవయాని గద్గదస్వరంతో అంది. శుక్రునికి కోపం వచ్చింది. ‘యవ్వన గర్వంతో కళ్ళు మూసుకుపోయి నా కూతురికి అప్రియం చేశావు కనుక నువ్వు వృద్ధాప్యభారంతో కుంగిపోతావు’ అని యయాతికి శాపమిచ్చాడు.

అప్పుడు, ‘ఋతుమతియైన భార్య కొడుకునిమ్మని భర్తను కోరినప్పుడు అతడు నిరాకరించి ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యా పాపం సంభవిస్తుందని పెద్దలు చెప్పలేదా, దానికి భయపడే ఆ మానవతి కోరిక తీర్చాను, ఇందుకు ఆగ్రహించడం న్యాయమా’ అని యయాతి ప్రశ్నించాడు. ఆ వెంటనే గడుసుగా, కూతురిపై శుక్రునికి ఉన్న మమకారానికి గురి పెడుతూ, ‘ఈ దేవయానిపై నాకింకా కోరిక తీరలేదు. ఇప్పుడే వృద్ధాప్యాన్ని ఎలా భరించను?’ అన్నాడు. ఆ మాటకు శుక్రుడు మెత్తబడ్డాడు. ‘అలా అయితే నీ వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఒకరికిచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. విషయసుఖాలతో తృప్తి చెందిన తర్వాత తిరిగి వాడి యవ్వనాన్ని వాడికి ఇచ్చేసి, నీ వృద్ధాప్యాన్ని తిరిగి పుచ్చుకో. ఇంకో విషయం, నీ వృద్ధాప్యాన్ని తీసుకున్నవాడే నీ రాజ్యానికి అర్హుడు, వంశకర్త అవుతాడు’ అన్నాడు.

02Kach

దేవయానీ, శుక్రుల పరంగా ఇందులో విశ్లేషించుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రస్తుతానికి అలా ఉంచితే, ఋతుమతి అయిన భార్య కొడుకునిమ్మని అడిగితే భర్త ఎలా నిరాకరిస్తాడని యయాతి అనడాన్ని గమనించండి… ఇంతకీ శర్మిష్టకు యయాతి ‘భర్త’ ఎలా అయ్యాడు?! ఈ సందర్భం, భర్త అనే మాటకు నేడున్న అర్థాన్ని దాటిపోతోంది. ఇక్కడ భర్త అంటే ఒక స్త్రీకే పరిమితుడైన మొగుడు కాదు. తన పోషణలో ఉన్న దాసీలపై కూడా లైంగిక హక్కు ఉన్న యజమాని, నాథుడు, మాస్టర్. ‘భార్య-దాసి-కొడుకు వారించరాని ధర్మా’లన్న శర్మిష్ట మాట దానినే చెబుతోంది. ఇది ఒకనాటి గృహ ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది.

విశేషమేమిటంటే, శర్మిష్టకు తనను భర్తగా యయాతి చెప్పడంలోని మర్మం ఏమిటన్న సందేహం సంప్రదాయ పండితులెవరికీ వచ్చినట్టు లేదు. కనీసం, దివాకర్ల వేంకటావధాని, జీవీ సుబ్రహ్మణ్యం గార్ల వ్యాఖ్యానంతో టీటీడీ ప్రచురించిన కవిత్రయ భారతం, ఆదిపర్వంలో దీనిపై ఎలాంటి వివరణా లేదు. సంప్రదాయ పఠన పాఠనాలు విడిచిపెట్టిన ఇలాంటి సందేహాల ఖాళీలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఆ ఖాళీలలోనే ఉంది అసలు కథ అంతా!

 

 – కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

Download PDF

8 Comments

  • Lalitha P. says:

    మీరు భారతాన్ని సమకాలీన సాహిత్యంతో, పరిస్థితులతో పోలుస్తూ చేస్తున్న విమర్శ బాగుంది.
    వివాహం ఒక వ్యవస్థగా పాదుకోక ముందు కూడా సంతాన వృద్ధి అనే ఆదిమ కోరిక స్త్రీ పురుషులిద్దరి బాధ్యతగానూ రూపు తీసుకుని ఉండేదని ఈ భారత పద్యాలు రుజువు చేస్తున్నాయి. రుతుకాలాన్ని వృధా చెయ్యకూడదనే స్పృహ రాజుల్లో, బ్రాహ్మణులలో ఉన్నట్టు మిగతా కులాలలో ఎంత వరకూ ఉండేదో మరి! ఎంత ఎక్కువమంది పిల్లల్ని కంటే ఆడవాళ్ళకు సమాజంలో అంత గౌరవం ఉండే స్థితి ఒక వందేళ్ళ కిందట కూడా ఉండేది కదా! శర్మిష్ఠ పుట్టుకతో రాజు కూతురు కాబట్టి, దాసీ హోదాలో ఉన్నాసరే యయాతికి గాంధర్వ పద్ధతిన భార్య అయిఉండవచ్చంటారా? అందుకే భార్య అని చెప్పాడా?

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు లలిత గారూ…మీరన్నట్టు సంతాన వృద్ధి కూడా ఆనాడు ఒక ముఖ్య అవసరం. అందులోకి నేనింకా పూర్తిగా వెళ్లలేదు. కులవిభజనకు అదింకా ప్రారంభదశ కనుక, కులాల మధ్య దూరం పెరగలేదు కనుక ఋతుకాలాన్ని వృధా చేయరాదన్న స్పృహ బ్రాహ్మణ, క్షత్రియేతరులలో ఉందా లేదా అన్నది చెప్పడం కష్టం. ఇక శర్మిష్టను యయాతి గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు కనుక భార్య అన్నాడా అన్న మీ సందేహం వివాహవ్యవస్థ గురించిన చర్చలోకి తీసుకెడుతుంది. ముందు ముందు ఆ చర్చ రావచ్చు కనుక పూర్తి స్థాయిలో ఇప్పుడు అందులోకి వెళ్లలేకపోతున్నాను.

  • narayanaswamy says:

    బాగుంది భాస్కరం గారూ! మహా భారతాన్ని బాధితుల (సబల్టర్న్ ) తరఫున చదివితే విశ్లేషిస్తే చాలా విషయాలు అర్తమవుతాయి! మహా భారతం భారత సమాజపు బాల్యం !
    భైరప్ప రాసిన పర్వ గురించి విన్నా కానీ ఎక్కడ దొరుకుతుంది?

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు నారాయణస్వామి గారూ…మహాభారతం గురించి మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ‘పర్వ’ నవల నేను చాలాకాలం క్రితం చదివాను. ఇప్పుడు మార్కెట్లో ఉందో లేదో చెప్పలేను.

  • madhav says:

    శర్మిష్ట రాక్షస రాజైన వృషపర్వుని కూతరు. దేవయాని రాక్షస గురువైన సుక్రచారుని కూతురు. ఒక రోజు రాకుమార్తె ఐన శర్మిష్ట తన చెలికత్తెలతో మరియు రాజ గురువు కూతురు దేవయాని తో కలిసి సరోవరం లో స్నానం చేస్తూన్నారు ( వీరు ఇద్దరు మిత్రులు).ఆ సమయం లో ఇంద్రుడు గాలి రూపం లో వచ్చి వడ్డు మీద ఉన్న అందరి వస్త్రాలని ఒక కుప్పగా పడేసాడు. స్నానం చేసి కంగారుగ వడ్డుకు వచ్చిన శర్మిష్ట , దేవయాని, చెలికత్తెలు ఎవరి వస్త్రాలు వారు ధరించారు కాని శర్మిష్ట , దేవయాని ఒకరి వస్త్రాలు ఇంకొకరు వేసుకున్నారు. అక్కడ వచ్చిన గొడవ మూలంగ దేవయాని , శర్మిష్ట మీద కోపం తో ప్రేమించుకున్న జంట ఐన యయాతి మహారాజు ని , శర్మిష్ట ని వేరు చేసింది .తన తండ్రి ఐన సుక్రచారునికి చెప్పి. రాకుమార్తె ను దాశి గా ఉండేటట్లు చేసింది (వృషపర్వుడు రాజ గురువు ని మాట గౌరవించి తన కూతురిని చ్యాగం చేసాడు ).
    అన్ని తెలిసిన మీరు శర్మిష్ట గురించి మీరు చాల తప్పు దోవ ఎందుకు పట్టించారు తెలియటం లేదు.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు మాధవ్ గారూ…మీరు ఏం చెప్పదలచుకున్నారో నాకు అర్థం కాలేదు.

  • సుధ says:

    భాస్కరంగారు,
    చాలా చక్కగా వివరణాత్మకంగా సమాజ స్వరూపాన్ని విశ్లేషిస్తున్నారు. శర్మిష్ఠ యయాతి కథలో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను.
    మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి సమాజ స్వరూపం మారుతూ ఉన్న స్థితిని ఆది పర్వం ప్రథమాశ్వాసము లో రేఖామాత్రంగా స్పృశించారు కదా…..పాండురాజు తనకు సంతానం కలిగే అవకాశం లేనందుకు కుంతీదేవిని సంతానం కోరినప్పుడు ఈ ప్రసక్తి వస్తుంది. ఆంధ్ర మహా భారతం ఆ.ప. ప్ర.ఆ. వచనం 84)కుంతికి ధర్మసంబంధమైన కథ చెబుతానంటూ పాండురాజు శ్వేతకేతుడి కథ చెప్పాడు.
    పూర్వం స్త్రీలు భర్తలచేత కట్టడిలేక సర్వప్రాణులకు సమానమైన ధర్మంతో నియత, అనియతులైన పురుషులతో చరిస్తూ ఉండేవారని,ఉద్దాలకుడి భార్యను సంతానం కోసం ఒక వృద్ధ బ్రాహ్మణుడి కామించాడని, అందుకు ఆమె కుమారుడు శ్వేతకేతుడు కోపించి లోకంలో ఒక కొత్త ధర్మాన్ని విధించాడని పాండురాజు కుంతికి చెప్పాడు.

    ” ఇది మొదలు స్త్రీలెప్పుడూ పరపురుషులను కోరకూడదు. వివాహిత స్త్రీలకు పరపురుష సంగమం వలన సర్వ పాపాలు కలుగుతాయి. ఈ కట్టుబాటు లోక ప్రసిద్ధంగా మానవులందరికీ చేసాను “అంటాడు శ్వేతకేతుడు.అతను ఏర్పాటుచేసిన నియమాన్నే అప్పటినుంచి అందరూ పాటిస్తున్నట్టు, పశుపక్ష్యాదులులోను, ఉత్తర కురు భూములలో మాత్రం ఈ నియమాన్ని పాటించడం లేదని అంతేకాక భరత్ ఆజ్ఞాపించిన దానిని కాదనకూడదని, అంటే దోషమనీ మనువు చెప్పాడని అంటాడు పాండురాజు. భారతకాలం నాటికే పురుషస్వామ్యం బాగా వేళ్లూనుకుందన్నమాటేగా….
    భాస్కరంగారు, మీరు శ్వేతకేతుడి కథను ప్రస్తావించలేదనిపించి ఇది రాసాను. మీరు ప్రస్తావించి ఉంటే మన్నించాలి.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు సుధగారూ…అసలు కథకు మరీ దూరమైపోతామనే ఉద్దేశంతో పాండురాజు-కుంతి, శ్వేతకేతు వగైరా ఉదంతాలలోకి నేను వెళ్లలేదు. మహాభారతంలోనే అనేక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి మూడింటినే ప్రస్తావించాను. మీరన్నట్టు మహాభారతం కాలం నాటికే పురుషస్వామ్యం వేళ్లూనుకుంది. అయితే అందులో మాతృస్వామ్య అవశేషాలు కూడా ఉన్నాయి. మాతృస్వామ్యం అప్పటికి మరీ సుదూరగతం కాదు.

Leave a Reply to narayanaswamy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)