నదీమూలంలాంటి ఆ యిల్లు!

 

యాకూబ్

యాకూబ్

చాలాచోట్లకు చాలా సందర్భాల్లో , అసందర్భాల్లో వెళ్ళలేకపోయాను
వెళ్ళినందువలన ,వెళ్ళలేకపోయినందున
అంతే ;అంతేలేని ,చింతే వీడని జ్ఞాపకంఊళ్ళో ఇప్పుడెవరూ లేరు
వృద్ధాప్యంలో ఉన్న యిల్లు తప్పఇల్లంటే చిన్నప్పటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం;
చిన్నిచిన్ని కిటికీలు రెండు;
కొన్ని దూలాలు;
వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు
బెంగగా వుంటుంది దూరంగా వచ్చేసానని .
కలల్లోనూ అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూలేచి ,పక్కలో తడుముకుని దొరక్క
వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తానుఅప్పటికవి ప్రేమిస్తాయి
ఇంకా నాలో మిగిలిఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి.
1
ఇంతున్నప్పుడు

నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను; అవి నన్ను మోస్తున్నాయి
ఒళ్ళంతా పాకిన గజ్జికురుపులమీద చల్లుకుని పేడరొచ్చులో ఉపశమించాను
వేపాకు నూరి పూసుకుని కురుపుల్లా మాడి చేదెక్కాను
కాలిబొటనవేలి దెబ్బల్నిఒంటేలుతో కారుతున్న రక్తానికి అభిషేకం చేసాను
ఎర్రటి ఎండలో బొబ్బలెక్కిన కాళ్ళ మీద ఆవుమూత్రం రాసుకుని
ఆనందంతో గంతులేశానుఋణమేదో అంతుబట్టని రహాస్యమై కలల్ని ముట్టడిస్తుంది;
గాయాల సౌందర్య రహాస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది
picasso-paintings-17-575x402

2
అక్కడున్నది ఖాళీ ఖాళీ నేలే కావొచ్చు;
ఎవరూ సంచరించని ,నిద్రించని,
గంతులేయని ఉత్తి భూమిచెక్కే కావొచ్చు
అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి,
నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి ,
పెంచి పోషించిన కాలం వుంది
వెళ్ళలేక చింతిస్తున్న ,
దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది
చాలా చోట్లకు వెళ్ళలేక పోవడం క్షమించలేని నేరమే
మరీముఖ్యంగా నదీమూలంలాంటి ఆ యింటికి.
-యాకూబ్
Download PDF

21 Comments

  • జాన్ హైడ్ కనుమూరి says:

    చాలా చోట్లకు వెళ్ళలేక పోవడం క్షమించలేని నేరమే
    మరీముఖ్యంగా నదీమూలంలాంటి ఆ యింటికి.
    .
    .
    .
    .
    ఇప్పుడు
    నిద్రపట్టని రాత్రిని వదిలి
    నేరం చెయ్యలేదని రుజువుపర్చుకోవాలి

  • బాగుందండి,. మీరు చేయవలసిన పయనం,. నది మూలాలోకే,..

  • Rajasekhar Gudibandi says:

    …ఉత్తి భూమిచెక్కే కావొచ్చు
    అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి,
    …వెళ్ళలేక చింతిస్తున్న ,
    దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది

    పుట్టి పెరిగిన ఇల్లు , ఊరు వదిలి ఎక్కడో యాంత్రిక నగరాలలో పెరుగుతూ ఉంటాం ..కానీ మన ప్రాణం మాత్రం ఆ మట్టిలోనే , ఆ గాలిలోనే ఉంటుంది .. ఇలాంటి ఏంటో మంది మూగ వేదన మీ కవిత ..చాల గొప్పగా ఉంది యాకూబ్ జీ …

  • సి.వి.సురేష్ says:

    కవి తన కోణ౦ లో ను౦డి సమాజాన్ని దర్శి౦చి, తద్వారా రచనలు చేసి తిరిగి సమాజాన్ని గైడ్ చేయడానికో, సమాజ హితానికో తన రచనలను ఉపయోగపెట్టడ౦ జరుగుతు౦ది.. ! కవితావస్తువు ఈ కవిత లో చాలా చిన్నదే! బాల్యము, పెరిగిన పరిసరాలు, కొన్ని స౦దర్భాలు, దానితో ముడిపడి ఉన్న బ౦దాన్ని చిక్కగా , అ౦ద౦గా అల్లి ఒక పూమాలను చేశారు. తాను పెరిగిన ఆ ఇ౦టిని కవితాక్షరాలతో అభిషేకి౦చారు. ! కొన్ని౦టిని మరిచిపొలేమన్న విషయాన్ని అతి సునిశిత౦గా చెప్పారు. కవిత చిక్కగా సా౦ద్రతతో సాగి౦ది. కొన్ని కొ౦దరికే సాధ్య౦.
    “నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను; అవి నన్ను మోస్తున్నాయి” ……….కేవల౦ గొ౦తులోను౦డి వాహ్! అన్న శబ్ధ౦ వస్తు౦ది.! జీవన ప్రవృత్తిలొ మనిషి తన్ను తాను మర్చి పోవడ౦ అతి సహజ౦గా సాగుతో౦ది. ఈ మెటిరిలియస్టిక్ ప్రప౦చ౦లో తన ఇ౦టి లోని గదులెన్నో కూడా చెప్పలేని ఒక స్థితి ప్రస్తుత౦ నెలకొ౦ది. అలా౦టి పరిస్థితుల్లో ఇలా౦టి కవితలు గొప్ప రిలీఫ్. మానసిక ఏకా౦త౦లో తన్ను తాను దర్శి౦చట౦ కవి ప్రతిభ! బాహ్య ప్రవృత్తి లో జీవిస్తున్నప్పుడు అ౦త: ప్రప౦చ౦ యొక్క ప్రభావ౦ పూర్తిగా వదలకపోవట౦ మనిషి యొక్క అ౦తర్ బహిస్స౦ఘర్షణలకి నిదర్శన౦.! దాన్నే కవి అ౦ద౦గా అల౦కరి౦చారు.!!!! దిగ్విజయహో!!! కవి యాకూబ్ సార్!

  • rajani says:

    యాకూబ్ కవిత చాలా బాగుంది, నేను అమ్మకోసం రాసినప్పుడు కూడా అదే ఆలోచన, నువ్వు ఆ పుస్తకం చూసావా. నిజంగా మనం పుట్టి పెరిగిన పరిసరాలు మన మీద ఎంత ప్రభావం వేస్తాయి కదా
    . మా ఇల్లు మా అర్ర కిటికీ ఇవి మనం ఎంత పెద్దగైనా మన జీవితంలో విడదీయరాని భాగాలు అవుతాయి.

  • karimulla ghantasala says:

    Intense

  • Elanaaga says:

    యాకూబ్ గారూ!

    ప్రారంభ పంక్తుల ప్రస్తావనతోనే కవితను ముగించటం కొత్త విధానం కాకపోయినా మీరు దాన్ని
    పాటించటం బాగుంది. సరళమైన భాషలో సహజమైన కవిత్వాన్ని అందించినందుకు అభినందనలు.

  • erathi sathyanaarayana says:

    టైం అండ్ ప్లేస్ అఫ్ యువర్ సోర్స్ సీం టు
    హావ్ ఎ లైఫ్ ఇన్ యువర్ సోర్స్ అండ్ యు హావ్ మాగ్నిఫిశేంట్ లీ మాగ్నిఫయిడ్ ఇట్

  • NS Murty says:

    యాకూబ్ గారూ,
    ఒక జీవితకాలం పోగుచేసుకునే అనుభూతుల పుట్ట జీవితం. ప్రతి జీవితమూ ఒక మహాకావ్యం. కానీ అందరూ తమ జీవితంలోని అనుభూతుల్ని గుర్తుంచుకోనూ లేరు, భద్రపరుచుకోనూలేరు. వైయక్తికంగా ఉంటూనే, కొన్ని అనుభూతులు సార్వజనీనికంగా ఉంటాయి. కవి ఒక్కడే అలాంటివి ఒక మాలలా కూర్చగలడు. చిత్రంగా తన అనుభూతులు వల్లిస్తూ, పాఠకుడిని తన వ్యక్తిగత ప్రపంచంలోకి లాక్కుపోనూ గలడు. మీ కవిత అటువంటి కాలనాళిక (time capsule)లోకి ప్రతి పాఠకుడినీ తీసుకుపోతుందని నమ్ముతున్నాను. మంచికవితని పంచుకున్నందుకు అభివాదములు.

  • balasudhakarmouli says:

    గురువు గారూ.. పల్లెటూళ్లు మనుసులను గొప్ప జీవాత్మతతో జీవింపచేస్తాయి. అక్కడ .. మన మూలాల్లో గొప్ప పరిమళం ఉంటుంది. తల్లి ఊరి నుంచి దూరమైన బాధ నిత్యం వుంటూనే ఉంటుంది. ఎక్కడకయినా వెళ్లినా రాత్రికి ఇంటికి చేరితే గానీ … ప్రశాంతత వుండదు మన పల్లెటూరి జనాలకు. అలాంటిది.. దూరం కావడం దుఃఖమే. మూలాల్ని గుర్తు చేసిన మీ కవితకు, మీకు వందనం.

    • ramakrishna says:

      బాల సుధాకర మౌళి గారూ!పల్లెటూళ్ళు
      గొప్పజీవాత్మతో జీవిమ్పజేస్తే,ప్రజలు పల్లెలను వదిలి పట్టణాలకు ఎందుకు వలసపోతున్నారంటారు.కొంచెం వివరిస్తారా

  • erathi sathyanaraayana says:

    టైం అండ్ ప్లేస్ అఫ్ యువర్ సోర్స్ సీం టు హావ్ ఎ లైఫ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యు హావ్ మాగిఫిశెంట్లి మాగ్నిఫయ్డ్ ఇట్

  • మూలాల్ని గుర్తు చేసే కవితాక్షరాలు యాకుబ్ సర్..

  • narayanaswamy says:

    బాగుంది పద్యం యాకూబ్ అన్నా!

  • akella raviprakash says:

    “ఋణమేదో అంతుబట్టని రహాస్యమై కలల్ని ముట్టడిస్తుంది
    గాయాల సౌందర్య రహాస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది
    అంతేలేని ,చింతే వీడని జ్ఞాపకంఊళ్ళో”
    great లైన్స్

    బహుత్ ఖూబ్ yaakuub

  • ramakrishna says:

    మంచి పోయం.అభినందనలు యాకూబ్ సార్

  • Thirupalu says:

    ఒక తరం మట్టివాసనను పట్టి పాఠకుల మీద వెదజల్లారు. మీ జ్ఞాపకాలను నెమరువేసుకొండీ అనీ!
    చాలా బావుంది కవిత.

  • buchi reddy gangula says:

    యిప్పుడు ఎలా ఉన్నా — అ జీవితం –అ ఇల్లు –అ గాలి –అ నెల –అ నీరు
    ఎక్కడ దొరుకదు —చాలా గొప్ప గా ఉంది సర్ —
    ——————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  • అక్కడున్నది ఖాళీ ఖాళీ నేలే కావొచ్చు;
    ఎవరూ సంచరించని ,నిద్రించని,
    గంతులేయని ఉత్తి భూమిచెక్కే కావొచ్చు
    అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి,
    నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి ,
    పెంచి పోషించిన కాలం వుంది
    వెళ్ళలేక చింతిస్తున్న ,
    దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది……………ప్రవహించే మీ జ్ఞాపకాల కన్నీటి జాడ ………అద్భుతం !!

  • నదీ మూలం లాంటి ఆ ఇల్లు! – కొత్త గా ధ్వనించే , ఆకట్టుకునే శీర్షిక .ఆఖరు పంక్తులు అన్నీ కలసి ఆకర్షణీయమైన ముగింపు.అభినందనలు.

  • Rajendra Prasad . Maheswaram says:

    యాఖూబ్ Saab,
    అక్కడున్నది ఖాళీ ఖాళీ నేలే కావొచ్చు;
    ఎవరూ సంచరించని ,నిద్రించని,
    గంతులేయని ఉత్తి భూమిచెక్కే కావొచ్చు
    అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి,
    నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి ,
    పెంచి పోషించిన కాలం వుంది
    వెళ్ళలేక చింతిస్తున్న ,
    దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది…

    ఇలాంటి కలలెన్నో mosuku తిరిగే వారెందరో.. మీ కవిత బహుత్ ఖూబ్.

Leave a Reply to erathi sathyanaarayana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)