ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? – 2 వ భాగం

ekkadi-2( గత వారం తరువాయి )

2

రాత్రి పన్నెండుగంటల నలభై రెండు నిముషాలు.ఎస్పీ విఠల్‌ చాలా అసహనంగా, చికాగ్గా..ఎందుకో పొయ్యిమీది గిన్నెలో మరుగబోతున్న నీటిలా ఉడికిపోతున్నాడు.

ఎండాకాలం.. ఉంచుకున్న మూడవ ఆడదాని మూడవ అంతస్తులోని ఎ సి గదిలో ఒంటరిగా..రివాల్వింగు చైర్‌లో అటు ఇటూ కదుల్తూ..నిప్పుకణికలా కణకణలాడ్తున్నాడు.
అంత అసహనం ఎందుకో అతనికే అంతుపట్టడంలేదు. కాని ఎందుకో ఏదో చేయాలని మాత్రం చాలా కసిగా ఉందతనికి.

ఎదురుగా టేబుల్‌పై ఆరోజే కొత్తగా సీల్‌తీసి పొద్దట్నుండి తోలుకేస్‌లో పెట్టుకున్న యుఎస్‌ఎ బెరెట్టా సర్వీస్‌ రివాల్వర్‌ ఉంది. తళతళా మెరుస్తూ, నిగనిగలాడ్తూ కొత్త పిస్టల్‌ పొద్దట్నుండీ లాడ్జింగు గదిలో తనకోసం ఎదురుచూస్తున్న కొత్త ఆడదానిలా కవ్విస్తూనే ఉంది.

పిస్టల్‌ను ఎప్పుడు వాడుదామా అని తొందర.. ఎవర్నయినా కాల్చి చంపితే ఎంత బాగుండుననే అజ్ఞాత కాంక్ష.. గులగుల.. ఉవ్విళ్ళూరే హింసోన్మాదం. ముట్టుకోవాలనీ, ముద్దుపెట్టుకోవాలనీ ఏదో తెలియని మోహం..,

ప్రతి మనిషిలోనూ తనకు తెలియకుండానే హింసను బలంగా యిష్టపడే పశుప్రవృత్తి అజ్ఞాతంగా ఉంటుందా.. అందుకే సినిమాల్లో ఫైటింగు దృశ్యాలను ప్రతిమినిషీ ఆనందిస్తాడా..వీధుల్లో ఎవరైనా కొట్లాడుకుంటూంటే అందుకే అందరూ ఆసక్తిగా తిలకిస్తూ ఆనందిస్తారా. చిన్నపిల్లలు అందుకే తూనీగనిస్తే రెక్కలనూ, తోకనూ పీకేసి హింసిస్తారా..బొద్దింకనిస్తే చీపురుపుల్లతో గుచ్చి గుచ్చి అందుకే చంపుతారా. మనిషిలో గుప్తంగా జ్వలించే ఈ హింసాపిపాస ఏమిటి.?

ప్రక్కనే టేబుల్‌పై తనకిష్టమైన ఫ్రెంచి విస్కీ 25 సంవత్సరాల ఏజ్డ్‌ గిన్లేవిట్‌ విస్కీ సీసా ఉంది. అప్పటికే రెండు పెగ్గులు దాటింది.. మూడవ పెగు సగం ముగిసి సోడా, ఐస్‌ ముక్కలు..ఏదో వెలితి..ఏదో ఉద్వేగం..ఏదో,

ఆ ఏదో ఏమిటి.. ఏమిటి కావాలి తనకు.,

యింతకుముందే డైమండ్‌ నెక్లెస్‌ కొనివ్వలేదని ఈ నంబర్‌ త్రీ అలిగి తనతో పడుకోకపోవడం కారణమా..ఆ మంత్రి వెధవ తమ మద్యవ్యాపార, వ్యవహార లావాదేవీల లెక్కలను మాట్లాడుకుందామంటే తమ జిల్లాకు పర్యటనకని వచ్చి గెస్ట్‌హౌజ్‌లో ఉండికూడా తనకు అపాయింట్‌మెంటివ్వకపోవడం కారణమా..పొద్దట్నుండీ ఈ కొత్త పిస్టల్‌ కవ్విస్తూండడం కారణమా..వ్చ్‌..ఏమో

మళ్ళీ కొద్దిగా విస్కీని సిప్‌ చేశాడు విఠల్‌. కసివల్ల కావచ్చు ఇంకా ఇంకా తాగాలనే కోరిక పురులు విప్పుకుంటోంది. రాత్రి ఎనిమిది తర్వాత అపాయింట్‌మెంట్సన్నీ కాన్సిల్‌ చేసుకుని సలుపుతున్న మనసుతో ఈ నంబర్‌ త్రీ యింటికొచ్చాడు. నేరుగా.. గంటన్నరసేపు.. బాగానే గొడవ జరిగింది. అరేబియా గుర్రంలా కవ్వించే ఆడది రంజని.. ఉహు..అస్సలే పడుకోలేదు. మొండికేసింది. ఎంత బతిలాడినా వినలే..తలుపులేసుకుని కనుమరుగైంది. కుంపటిలా కోరిక. ఇదస్సలే పడుకోదు.. అటు ఆ మంత్రిగానిపై కోపం పాదరసం లెవెల్‌ వలె పెరిగి పెరిగి తారాస్థాయికి చేరుతోంది. తామిద్దరికీ చెంది బినామీ పేర్లతో గ్యాస్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంలో ఏడాదిగా నడుస్తున్న రెండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ లెక్క, జిల్లాలో వాడి బామ్మర్దిపేర, తన ఉంపుడుగత్తె రంజని పేర నడుస్తున్న ఏడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హైద్రాబాద్‌లో ఎనభై రెండు కోట్ల ఫ్లై ఓవర్‌ కాంట్రాక్ట్‌, దేవాదుల ప్రాజెక్టుకు మెటల్‌ పైపుల సప్లయ్‌, ఇరవై రెండు కోట్ల సబ్‌ కాంట్రాక్ట్‌, పద్దెనిమిది భూమి పంచాయితీల సెటిల్‌మెంట్లు, మంత్రి ఇన్‌స్ట్రక్షన్‌పై.. ఒక హత్య.. రెండు శాల్తీల గల్లంతు కేసులు.. అన్నీ కలిపి… కోట్లకు కోట్ల లెక్క తేలాల్సి ఉండగా.,

‘లంజాకొడ్కు నక్‌రాల్‌ చేస్తాండు’

మనిషిని అధికారం, నిర్భయం, ధీమా, అహం..ఇవి కళ్ళుండగానే గుడ్డివాణ్ణి చేసి ధైర్యం పేరుతో ఉన్మాదిగా మారుస్తాయి. విఠల్‌లోకి అహం కట్టలు తెంచుకుని ప్రవహించడం మొదలైంది.
అప్రయత్నంగానే విఠల్‌ టేబుల్‌పైన విస్కీ సీసా ప్రక్కనే ఉన్న కొత్త బెరెట్టా పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఒక బ్రహ్మస్తంలా చేతిలోకి ఆయుధం రాగానే ఒట్టి రాగి తీగలోకి విద్యుత్తు ప్రవేశించినట్టయింది. విఠల్‌.. విఠల్‌ ఐపిఎస్‌గా మారి.. ఒక జిల్లాకు ఎస్పీగా సర్వం సహాధికారిననే స్పృహ కలిగి.. ఎదురులేని నియంతకు గల శక్తి తెలిసి..,

ఏదో తెగింపు కట్టలు తెంచుకుంటూండగా.,

సెల్‌ఫోన్‌ను తీసి మినిస్టర్‌కు ఫోన్‌ చేయాలనుకుంటూండగా…, అట్నుండే కాల్‌..”విఠల్‌..రా..యిప్పుడ్రా..గెస్ట్‌హౌజ్‌లో ఉన్న..తెగ తొందరపడిపోతున్నావ్‌గదా..తేల్చుకుందాంరా.. లెక్కలను..”అంటున్నాడు మంత్రి.

వెధవ..మెట్రిక్యులేట్‌ ..నోరుతెరిస్తే..పశువుకు మాటొచ్చినట్టు..ఫైల్‌ చదువరాదు..ఎండార్స్‌మెంట్‌ రాయరాదు.. అధికారులు చెప్పేది విని..మళ్ళీ వాళ్ళకే ఉల్టా చెప్పి..నవ్వులాట..మంత్రి పదవి వెధవలకు ఓ నవ్వులాట థూ నీయమ్మ.. భారత రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ఎంతసేపూ ఎలా అధికారంలో కొనసాగాలా, ఎలా పార్టీఫండ్‌ పేరుతో దండుకోవాలా అని అన్ని రాజకీయపార్టీలు సంకీర్ణ సహకారాల పేరుతో ఒకన్నొకడు బ్లాక్‌మెయిలింగు, సిగ్గువిడిచి బహిరంగంగానే ప్రజాధనం దోపిడి.. పెచ్చుమీరిపోయిన విచ్చలవిడి అవినీతి. ఎవనిపైన ఎవనికీ అదుపులేని అసమర్థ పరిపాలన.. ఎక్కడా కనిపించకుండా శాశ్వతంగా కనుమరుగైపోయిన క్రమశిక్షణ.,

బెరెట్టా పిస్టల్‌పై మోడల్‌ నంబర్‌ ధగధగా మెరుస్తోంది జుఎఔ. 8085 డిస్టింక్టివ్‌ సీరియల్‌ నంబర్‌. 25-03-92 సీరిస్‌ మ్యాగజైన్‌. ధర తొంభై వేలు.. కొన్న కోటిరూపాయల పిస్టల్స్‌ ఖరీదులో నలభైశాతం కిక్‌ బ్యాక్స్‌.

కిక్‌.. బ్యాక్‌.. వెనక్కి తన్ను.. వెనుకనుండి తన్ను.. వెనుక వీపుపై తన్ను.

ఎవని వీపుపై ఎవరు తన్నుట?..ఎవరి వీపుపైనైనా ఎవరైనా తన్నుట.

విఠల్‌ కొత్త పిస్టల్‌ను ప్యాంట్‌ బెల్ట్‌వెనుక, ముడ్డి దగ్గర పదిలంగా గుచ్చుకుని చకచకా నడిచాడు కిందికి.. కిందికి రాగానే తన అక్యురా కార్‌ను స్టార్ట్‌ చేసి మంత్రి బసచేసి ఉన్న గెస్ట్‌హౌజ్‌ దిక్కు పోనిచ్చాడు. ఒక మర్డర్‌కేస్‌లో లిక్కర్‌ కాంట్రాక్టరొకణ్ణి సేవ్‌ చేసినందుకు ఈ అక్యురా కార్‌ను వారంక్రితం తన మూడవ ఆడదాని పేర రిజిస్ట్రేషన్‌ చేసి లంచమిచ్చిన సంగతి ఎందుకో స్ఫురించింది విఠల్‌కు.. తిరుగులేని అధికారాలు తనవి.. ఎదురులేని మగాడు తను.

గెస్ట్‌హౌజ్‌ చేరుకుని, కారును పార్క్‌చేసి సూటిగా మంత్రిగారి ఆంటీరూంలోకి నడిచాడు విఠల్‌ వడివడిగా. అక్కడ విజిటర్స్‌ ఎవరూ లేరు.. అర్ధరాత్రి దాటింది కదా.

ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్‌ మాత్రం కునికిపాట్లు పడ్తూ బెడ్‌రూం దగ్గర నిలబడి నిద్రలో జోగుతూ.. వాని దగ్గరా విస్కీ వాసన గుప్పుమంది.

‘నమ ..స్తే సర్‌” అన్నాడు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌. వాడి పేరేమిటో తెలియదు. డ్రెస్‌లో ఉన్నాడు. బెల్ట్‌కు పిస్టల్‌ ఉంది. కళ్ళు ఎర్రగా..మాట ముద్దముద్దగా ఉంది.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు.

గదిలోకి పోగానే మంత్రిగారి దగ్గర్నుండీ విస్కీవాసనే.

అంతా మత్తులో గమ్మత్తుగా జోగుతూ, తూగుతూ, ఊగుతున్న వేళ.,

ఒకడు భద్రతకోసం నియమించబడ్డవాడు.. మరొకడు ప్రజలందరి భద్రతకు హామీగా నిలబడవలసినవాడు, ఇంకొకడు మంత్రిగా రాజ్యాంగబద్దంగా ప్రజల భద్రతకూ, సంక్షేమానికీ బాధ్యత వహిస్తానని ప్రమాణం చేసినవాడు.. అందరూ విస్కీమత్తులో చిత్తయి ఉన్న వేళ.,

ఐనా తాగుబోతుల డబ్బులతో నడుపబడ్తున్న ఈ దిక్కుమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వాలు నీతి తప్పి, రీతి తప్పి విశృంఖలంగా, నిర్లజ్జగా ప్రవర్తిస్తున్న వర్తమాన సంకక్షుభిత సందర్భంలో..ఈ సన్నివేశం సమకాలీన భారత సమాజాన్ని ప్రతిబింబిస్తోందా..అనుకున్నాడు విఠల్‌.

ఎందుకో.. ఎదురుగా విశాలమైన డబుల్‌ కాట్‌ మంచంమీద విలాసంగా ఒరిగిఉన్న మంత్రి తలపై ఉన్న వాచ్‌దిక్కు దృష్టిపోయింది విఠల్‌కు. టైం ఒంటిగంట పది నిముషాలు.

”ఊఁ.. ఏందయ్యా.. తెగ గోల చేస్తున్నావ్‌ లెక్కలూ లెక్కలో అని..”

”…..” విఠల్‌ ఎదురుగా సోఫాలో కూర్చుని ఒట్టిగా, నిర్లిప్తంగా మంత్రివైపు చూశాడు.

”చెప్పు.. ఏం చేద్దాం..”

”ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ పనులకోసం ఫ్లై ఓవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కోసం.. నేనొక్కణ్ణే నా తరపున నూటా పదికోట్ల పెట్టుబడి పెట్టిన. మీరు వాటి సంగతే మాట్లాడ్డంలేదు. మీ బార్లు, సెటిల్‌మెంట్లు, భూముల లావాదేవీలు.. వీటన్నింటి కింద నాకు దాదాపు నా లెక్క ప్రకారం నలభై కోట్లు రావాలి. మొన్న మీ కీప్‌ రంజనికి సెటిల్‌మెంట్‌ కింద పద్దెనిమిదెకరాల భూమిని ఫ్రీగా ఇప్పించిన కేస్‌లో ఒక మర్డర్‌ కూడా చేయించవలసి వచ్చింది..”

”ఓకే.. ఓకే..ఐతే.. ఇప్పుడేంది”

” నాకు క్యాష్‌ కావాలి”
”ఎంత…”
”రెండు వందల కోట్లు”
”ఊఁ..”
”అక్కెరుంది నాకు”
”ఇప్పుడు లేవు..”
”అట్లంటెట్ల”

”ఇవ్వాళ ఉదయం చూచినౌగద..ముఖ్యమంత్రికే ఎసరుపెట్టిన..జంగు షురువైంది..పరేషాన్లున్న. అధిష్టానం నుంచి వార్నిగచ్చింది..మనుషుల్ని కొనాలె..”
”అందుకే చెబ్తున్న.. సెటిల్‌మెంట్‌ చేయమని”

”అరే.. రేపు కాబోయే ముఖ్యమంత్రిని నేనే..పొద్దుగాల్నుంచి మీడియా అంత చూచినౌకద. కోడై కూస్తాంది లోకం..”
”అని నువ్వనుకుంటానౌ. హై కమాండ్‌కు ఎదురు తిరిగినవని ఉన్న మంత్రి పదవి పోద్దని నా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ చెప్తానై..”
”అట్లనా..ఓరి కుక్కలకొడ్కా..నమక్‌ హరాం..శుభం పల్కురా పెండ్లికొడ్కా అంటే గిట్ల మాట్లాడ్తానౌర..అరేయ్‌..”
”మాటలు మంచిగా రానియ్‌..”
”ఏందిర నీతో మంచిగా మాట్లాడేది.. ఆఫ్టరాల్‌ ఒక ఎస్పీగానివి.. వెంట్రుక ముక్క లెక్క పీకేస్తే బంగాళాఖాతంల కొట్కపోవాలె నాకొడ్కా..”
”హోల్డ్‌ యువర్‌ టంగు మిస్టర్‌ మినిస్టర్‌” విఠల్‌కు తెలుసు ఎక్కడా తమ సంభాషణ రికార్డ్‌ కావడంలేదని.
”ఏందిరా హోల్డ్‌..బొచ్చు..ఇప్పుడు నాదగ్గర పైసల్లేవు.. పో.. పీకుతవా..”
”మీరు హద్దులు మీరి మీట్లాడ్తున్నారు. ప్లీజ్‌”

మంత్రి బోనులోపెట్టి కొట్టిన పులిలా మహోగ్రంగా ఉన్నాడు. అతను అంతకు ముందే ఒక రహస్య స్థావరంలో తను ప్రత్యేకంగా యిష్టపడి తెప్పించుకున్న ఓ పల్లెటూరి ఇరవై ఏళ్ళ యువతితో కుతిదీరా రమించి, అలసి.. తృప్తిగా పీకలదాకా తాగి, యిష్టమైన చికెన్‌ కబాబ్‌ తిని.. ఉదయం మీడియాతో రాజకీయంగా, ఎత్తుకు ఎత్తి కుదిపిన కుదుపుల చక్కిలగిలికి పొంగి.. అంతా మత్తు.. ఆనందం.. వెర్రి సంతోషం.. పరవశోన్మాదం..

తెరవెనుక మాస్టర్‌మైండ్‌ లీల ఆశీర్వాదం.,
”అరే ఎస్పీ.. ఏందిరా నీల్గుతానౌ”
”మాటలు.. మాటలు..”
”మాటలేందిరా..అట్లనే అంట..ఒక్క పెన్‌ స్ట్రోక్‌తో శంకరగిరిమాన్యాల్‌బడ్తవ్‌ బిడ్డా”

”అరే..దొంగవెధవా. నీ దిక్కుమాలిన చిట్టా విప్పిన్నంటే అదిరిపడి గుండెపగిలి చస్తవ్‌..జనం రేపు నీ నోట్లె ఊంచుతరు.. పొలిటికల్‌ బాస్టర్డ్‌.. నువ్వేందిరా నాయి పీకేది. ఇయ్యాల పవర్లుంటవ్‌ రేపు పోతవ్‌.. నీలాంటి బాస్టర్డ్స్‌ ఎందరు మారినా శాశ్వతంగా కుర్చీలల్ల ఉండి ఈ ప్రభుత్వాలను నడిపేది మేమేకాదురా గూట్లే.. షటప్‌”
”నన్నే షటప్‌ అంటవా..”
”ఔ అంట..మళ్ళీ మళ్ళీ వందసార్లంటు..నా పైసల్‌ పారేయ్‌బే”
”బే..”అవాక్కయిన స్తబ్దత.
”ఔ.. బేనే.. డబ్బుసంగతి చెప్పు ముందు. రెండు వందల కోట్లు”
”లెవ్‌.. ఏంజేస్తవ్‌”
”ఏంజేస్తనా..” ఆఁ.. ఏంజేస్తవ్‌రా”

”విఠల్‌ పిచ్చికుక్కయి పోయాడు. తలలో విజృంభిస్తున్న విస్కీ విస్ఫోటనం విచక్షణను చంపేసింది. ప్రక్కనున్న టీపాయ్‌మీది గాజుఫ్లవర్‌ వేజ్‌ను తీసి నేలకేసి కొట్టాడు బలంగా. అది భళ్ళున శబ్దంచేసి పగిలి ముక్కలుముక్కలైంది.

వెంటనే బయట నిద్రలో జోగుతున్న గన్‌మెన్‌ లోపలికి పరుగెత్తుకొచ్చి.. అప్రయత్నంగానే సర్వీస్‌ రివాల్వర్‌ను బయటికి తీసి.. ఎస్పీ విఠల్‌ దిక్కు, మంత్రి దిక్కు బిక్కుబిక్కున షాకై చూస్తూండగానే,

తృటికాలంలో.. విఠల్‌ మెదడులో తను ఆ రోజే సీల్‌ తీసిన తన బెరెట్టా పిస్టల్‌ జ్ఞాపకమొచ్చి.. తళ్ళుక్కున ఓ మెరుపు మెరిసినట్టయి.. హింసావాంఛ సముద్రంలా పొంగి, క్షణంలో వేయితలల సర్పమై పడగ విప్పి.. జస్ట్‌ ఫర్‌ ఫన్‌.

‘ఈ మంత్రిగాన్నిప్పుడు చంపితే ఎలా ఉంటుంది..చంపితే ఏమౌతుంది. మజాగా ఉంటుందికదా’ అని అనిపించి,

విఠల్‌ లిప్తకాలంలో తన నవనవలాడే కొత్త బెరెట్టా పిస్టల్‌తో గన్‌మెన్‌ను కాల్చాడు. క్షణంలో వేయవవంతుకాలంలో కొత్త తూటా కానిస్టేబుల్‌ గుండెలో దిగబడి, ఫౌంటెన్‌లా రక్తం చింది..చావుకేక గెస్ట్‌హౌజ్‌  దద్దరిల్లేలా విస్ఫోటించి.. మరుక్షణమే నేలపైకి కూలిపోతున్న గన్‌మెన్‌ చేతిలోని రివాల్వర్‌ను నేలపై పడకుండా అందుకుని..మరుక్షణమే దాన్ని మంత్రిపైకి గురిచూచి.. ట్రిగ్గర్‌ను నొక్కి.,

బుల్లెట్‌ మెరుపులా దూసుకుపోయి..మంత్రి తలను వందముక్కలు చేసి..అరిచే సమయంకూడా లేక ”తప్‌” మని  మంత్రి శరీరం మంచంపైనుండి కిందపడి..అంతా రక్తం..ఎర్రగా..జయ్‌ఁమని చిమ్ముతూ విస్తరిస్తూ.,
‘అసలేం జరిగింది.’

వ్చ్‌.. ఏమో చుట్టూ ప్రపంచం గిరగిరా..కసిగా..పిచ్చిపిచ్చిగా..ఆనందంగా.

విఠల్‌ చేతిలో రివాల్వర్‌తో నిలబడి..పడగెత్తిన విస్కీమత్తు శరీరం నిండా గర్జిస్తుండగా ఏదో ఒక కుదుపు..షాక్‌.

ఐతే విఠల్‌ పోలీస్‌ బుర్ర మెరుపులా మెరిసింది. వెంటనే గన్‌మెన్‌ పిస్టల్‌పైనపడ్డ తన వేలిముద్రలను చకచకా దస్తీతో తుడిచి, మళ్ళీ భద్రంగా వాడి శవం చేతిలో ఉంచి..
పేరు తెలియని గన్‌మన్‌ శవం దిక్కూ,  క్షణం క్రితం తనను ఏం పీక్కుంటౌరా’ అని హూంకరించి మరుక్షణమే దిక్కులేని కుక్క చావుచచ్చి కింద నేలకు కరుచుకుని పడున్న మంత్రి మృతశరీరం దిక్కూ, గిర్రున తిరుగుతున్న బుర్రతో, కళ్ళతో చూచి.. దీర్ఘంగా, గంభీరంగా శ్వాస ఎగపీల్చుకుని, నిట్టూర్చి.,

‘ఇట్స్‌ ఓ.కే..’ అనుకుని,

తూగుతూ ఒక్కో అడుగువేసుకుంటూ గదినుండి బయటికొచ్చి..’ఇప్పుడెలా’ అనుకుంటూ,

పోలీస్‌ మెదడు దీర్ఘకాల శిక్షణలవల్ల అతిసహజంగానే నేరపూరితమై ఎప్పుడూ పాదరసంలా సంచలితంగా ఉంటుంది.
బయటికి.. వరండాలోకి వచ్చి నిలబడ్డ విఠల్‌..అప్పట్నుండీ ఉరుముతున్న ఆకాశం విషయం గమనించనేలేదు. ఉన్నట్టుండి కుండపోతగా వర్షం మొదలై గాలివానతో మెరుపులు ముసురుకుంటూండగా.ఉలిక్కిపడ్డట్టయి..,
చకచకా ఓ కథ రూపుదిద్దుకుంటోంది విఠల్‌ పోలీస్‌ మెదడులో,

ఉదయం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంత్రిగారు నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన తర్వాత..అనేకమంది ముఖ్యమంత్రి అభిమానులనుండి, శిబిరాలనుండి మంత్రిగారికి పుంఖానుపుంఖాల బెదిరింపు కాల్స్‌ వచ్చాయి పొద్దంతా. అందుకు ఆయనెంతో ఆవేదనచెంది భయపడ్డారు. ప్రాణభయంకూడా ఉందని చర్చిండానికి అసాధారణ వేళే ఐనా అర్ధరాత్రి ఏకాంతంగా మాట్లాడ్డానికి ఎస్పీగా తనను రమ్మని కబురుచేస్తే తను వచ్చాడు. సీరియస్‌గా మాట్లాడ్తున్న మంత్రి తన సహజధోరణిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తూ ముచ్చటిస్తున్న సందర్భంలో.. తాము అప్పటినుండీ గమనించని ముఖ్యమంత్రి వీరాభిమానియైన గన్‌మెన్‌ అనూహ్యంగా తన రివాల్వర్‌ను తీసి మంత్రిగారికి గురిపెట్టి బండబూతులు తిట్టడం మొదలెట్టాడు. అవాక్కయిన తను గన్‌మెన్‌ను వారించి సర్దిచెప్పే ప్రయత్నం చేసే లోపలే.. బాగా తాగిన మత్తులో ఉన్న గన్‌మన్‌ టకటకా పిస్టల్‌ను మంత్రిగారిపైకి కాల్చాడు. వెన్వెంటనే కుప్పకూలిన మంత్రి.. పెనుగులాటలో ఆత్మరక్షణార్థం, మంత్రిని రక్షించే ప్రయత్నంలో భాగంగా తను అనివార్యమై గన్‌మన్‌ కాల్చడం.. అంతా క్షణాల్లో జరిగి.,

మంత్రిగారి మరణం.. వెన్వెంటనే గన్‌మన్‌ మరణం కూడా,     కావలిస్తే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మంత్రీ, గన్‌మన్‌ ఇద్దరూ తాగినట్టు ఎలాగూ రిపోర్ట్‌ వస్తుంది. మంత్రి శరీరంలో కానిస్టేబుల్‌ బుల్లెట్‌, కానిస్టేబుల్‌ శరీరంలో తన రివాల్వర్‌ బుల్లెట్‌ ‘ఈ కథ బాగుంది. సరిగ్గా అతికింది’ అనుకున్నాడు విఠల్‌.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు. అనుకున్నాడు విఠల్‌. శవాలూ ఉన్న బెడ్‌రూంలోకి వెళ్ళి, చేతికి దస్తీ చుట్టుకుని ప్రక్క వార్ట్‌రోబ్‌లో ఉన్నమంత్రిగారి బ్రీఫ్‌కేస్‌ను తెరిచాడు. ఆశ్చర్యం..నిండా బంగారు బిస్కెట్‌ బిళ్ళలు. మరుక్షణమే బ్రీఫ్‌కేస్‌ను మూసి.. టకటకా బయటికొచ్చి..వర్షంలో తన కారు డిక్కీ తెరిచి … క్రింద టూల్‌ బాక్స్‌దగ్గర బ్రీఫ్‌కేస్‌ను భద్రంగా సర్ది..ప్రశాంతంగానే డిక్కీని లాక్‌ చేసి..మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ వరండాలోకి వచ్చి నిలబడి..దీర్ఘంగా ఊపిరిపీల్చుకుని నిట్టూర్చి,
లోపల విస్కీ మత్తు విచ్చుకుపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది విఠల్‌కు.

ఆ క్షణం అతని మెదడులో..మంత్రి మరణంవల్ల తమ మధ్య లావాదేవీల్లో ఎంత నష్టమొస్తుంది..ఈ బంగారు బిస్కెట్ల విలువెంతుంటుంది.. మిగతాది ఎలా రాబట్టాలి..వంటి ఆలోచనలు చినుకుల్లా కురుస్తూండగా..,

ఈ గన్‌మన్‌ మరణం ఏమిటి..ఎందుకు..జస్ట్‌ఫర్‌ ఫన్‌ కదా..తన కొత్త పిస్టల్‌ను ఉపయోగించి పైశాచికంగా ఆనందించాలనే అంతర్గత రాక్షసవాంఛేనా,
ఐనా.. బూటు కింద ఒక చీమ ఎందుకు పడిచస్తుంది..పండిన టమాటాపై బూటుకాలు పడి చితికితే..వాటి
వెనుక హేతువేమిటి..అందుకు కారణమేమిటి..వంటి ఆలోచనలు..మీమాసం ఎందుకు..అనవసర పిచ్చిగానీ,
వ్చ్‌.. అంతా ట్రాష్‌.
విఠల్‌ చకచకా తన సెల్‌ఫోన్‌ను డయల్‌చేసి డిఎస్పీ ప్రకాశ్‌ను తన మందీ మార్బలంతో గెస్ట్‌హౌజ్‌కు రమ్మని  ఆదేశిస్తూ..,
అప్పుడు..ఆక్షణం..అంతా ప్రశాంతంగా..గంభీరంగానే ఉంది.

( సశేషం)

Download PDF

10 Comments

  • c.narasimha rao says:

    భారతదేశంలో వ్యాపించి రోగగ్రస్తమ్ చేస్తున్న రాజకీయ అవినీతి ఎలా వ్యవస్తీక్రుతం అయిందో ఈవారం చెబుతోంది..మంచి నవల ఇది.సంపాదకులకు,మౌళి గారికి అభినందనలు.
    సి.నరసింహారావు ,హైదరాబాద్

  • srinivas gaajula says:

    నవల మలుపు తిరగడం మొదలైంది. ప్రయోజనకరమైన సాహిత్య సృజనకారునిగా సుపరిచితులైన రామా చంద్రమౌళి గారి కాలంనుండి వెలువడుతున్న ఈ సేరియల్ కోసం వారం వారం ఎదురుచూస్తాం.
    శ్రీనివాస్ గాజుల

  • raadha .r says:

    రాజకీయ వ్యవస్థ ,అధికార వ్యవస్త్ర్హ కుమ్మక్కై ఎలా ఈ భారతీయ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయో ఈ నవలలో శక్తివంతంగా రచయిత చర్చించడం బాగుంది.ఆధునికమైన చూపుతో ప్రారంభమైన ఈ నవల ప్రయోజనకరమైంది.రామా చంద్రమౌళి గారికి అభినందనలు .ఎదురుచూస్తాం.
    రాధ.ఆర్ ,బెంగళూరు

  • jyothimouli says:

    ఎందరో విఠల్ లు,ఎందరో మంత్రులు …నిరంతర దోపిడీ …ఈ దేశం అవినీతి బురదలో కూరుకు పోయింది…ఊబి..ఊబి ఇది.
    భారతదేశం ఒక ఊబి గుండం.రామా చంద్రమౌళి గారికి ఎందుకో ఈ క్షోభ..హాయిగా ప్రేమ కథలు రాసుకోక. తవ్విన్నాకొద్దీ
    దు~ఖమే ఈ దేశంలో.
    జ్యోతి.ఆర్

  • maadhavi.k says:

    చాలా యేండ్ల క్రింద …అంటే 18 సంవత్స రాల క్రితం …చంద్రమౌళి సార్ నవల ‘ చదరంగంలో మనుషులు ‘చదివాను ‘ జ్యోతి’ మాస పత్రికలో.అది ఒక వెంటాడే జ్ఞాపకం. ఇప్పుడు ఈ సీరియల్ …ఆసక్తిగా ఉంది .వెయిట్ చేస్తానం.

    మాధవి.కె .వరంగల్

  • saarangapani.y says:

    దేశం నిండా విటల్ లు …మంత్రులే ..బడే సీన్ ను రాశారు మౌళి గారు.ఈ సమాజం భ్రష్టు పట్టిపోయింది.చూద్దాం యేమి
    జరుగుతుందో .
    సారంగపాణి.వై

  • laxmi.E says:

    నౌకా జలప్రవేశం లా ఈ నవల కథ మెల్లమెల్లగా అసలు రంగంలోకి ప్రవేశిస్తోంది .రాజకీయాలు,అధికారుల అవినీతి ఒక్కటై
    ఈ దేశాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నాయో …మౌళి గారికి థాంక్స్ .
    లక్ష్మి.ఇ- జోహాన్సబుర్గ్

  • ramarao.raacharla says:

    వీక్లీ సేరియల్ ను ఆసక్తిగా చదువుతున్నాను. చాలా బాగుంది.
    రామారావు రాచర్ల

  • ramanarao.y says:

    సామాజిక స్పృహతో నవలలు రావడమే కరువైన ప్రస్తుత సందర్భంలో రామా చంద్రమౌళి గారు ఈ నవలను అందివ్వడం
    ఎంతో ఉపయోగంగా ,అవసరంగా అనిపిస్తోంది..సంతోషంగా ఉంది.
    రమణారావు.వై ,పాట్నా

  • sayanna.B says:

    పోలీస్ ఆఫీసర్ల ప్రవర్తన కళ్ళకు కట్టినట్టు,నీతిహీనులైన మంత్రుల తత్త్వం..ఇవన్నీ ఈవారంలో మౌళి గారు చక్కగా
    రాశారు.అభినందనలు.
    సాయన్న.బి

Leave a Reply to srinivas gaajula Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)