మిథునం గురించి మరో సారి

midhunam3

‘‘తెలుగు సినిమాకు మడికట్టిన మిథునం’’ పేరుతో ‘‘సారంగ’’ లో జి.ఎస్‌. రామ్మోహన్‌ రాసిన వ్యాసం చదివాక మిధునం గురించి మరోసారి రెండు ముక్కలు రాయాలనిపించింది.
‘‘పాలపిట్ట’’ పత్రికలో మిథునం సినిమాను సమీక్షించింది నేనే! స్త్రీ, పురుష సంబంధాలలో వుండే అద్వైత తత్వాన్ని, అర్థనారీశ్వరత్వాన్ని మిథునం కథా నెపంగా చెప్పడానికి తనికెళ్ళ భరణి ప్రయత్నం చేశాడని అందులో నేను చెప్పాను. ఆ పత్రిక సంపాదకులు ఒక పేజీ మొత్తం ఎడిట్‌ చేయడం వలన అది పూర్తిగా వ్యక్తం కాలేదు. ఆ వ్యాసం ఇలా ముగుస్తుంది.
‘‘మిథునం సినిమా చూశారా? ఎలా వుంది?’’ అని ఒక సాహితీ మిత్రుడుని అడిగాను. అందుకు ఆయన సినిమా బావుంది కానీ కాస్త బ్రాహ్మణ వాసన వేస్తుంది?’’ అన్నారు. ‘‘అయ్యా! యిదీ మన సంస్కారం’’ అంటూ వ్యాసం ముగించాను. ‘‘అయ్యా ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం చెపితే సంస్కారం లేదని అంటే ఎలా! అని ఫోన్‌ చేసి మరీ మందలింపు ధోరణిలో కూడా మాట్లాడారు.
ఏదయినా ఒక వాక్యం రాసి అచ్చయ్యేంత వరకే రచయిత స్వంతం. ఒక సారి అచ్చులో వచ్చాక అది ప్రపంచానిదై పోతుంది. ఎవరికి నచ్చిన రీతిలో వారు దానికి వ్యాఖ్యానం చేస్తారు. ప్రతి వ్యాఖ్య రచయిత ఉద్దేశించిన రీతిలోనే వుండాలని లేదు.
‘‘అయ్యా! ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం రాయడం వెనుక నేను ఆశించిన ధ్వని వేరు. సాహితీ మిత్రుడు, కవి, బుద్ధిజీవి ఏదయితేనేం… సమాజానికి కాస్త భిన్నంగా ఆలోచించి, దిశా నిర్దేశం చేయవలసిన బుద్దిజీవులం మనం కూడా ‘‘ఎబౌ ది క్యాస్ట్‌’’ ఆలోచించకపోతే ఎలా? అనే నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, నేనాశించిన ధ్వని.
జి.ఎస్‌. రామ్మోహన్‌కి కూడా అది ‘‘తిట్టి పోయడం’’గా అర్థం అయింది. మన సంస్కారం ఉండవలసిన రీతిలోలేదు అన్నది నా బాధ. వ్యక్తులనయినా, విషయాలనయినా పరుషంగా వ్యాఖ్యానించడం నా పద్థతి కాదు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ తన వ్యాసంలో మిథునం సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తంచేసిన విషయాలు ఇవి.
1) ఇది తెలుగు సంస్కృతికాదు ఇది కేవలం 5% మైనారిటీ వ్యవహారమే.
2) మిథునంలో జంటకి సామాజిక జీవనం లేదు.
3) బ్రాహ్మణులు ఏదో ఒక రకంగా కోల్పోయిన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి ప్రధానమయినవి.
తెలుగు సినిమా ‘‘కులం’’ను కౌగిలించుకుని చాలా కాలమే అయ్యింది. ఎప్పుడో 1950లలో వచ్చిన ‘‘గుండమ్మ కథ’’లోనే ఎస్వీరంగారావు ‘‘మేము పెద కాపులం’’ అంటాడు. పదేళ్ళ క్రితం వచ్చిన ఒక సినిమాలో ‘‘మేము నాయుళ్లం, మీరేమిటి? అని చక్రవర్తి. హీరో శ్రీకాంత్‌ను అడుగుతాడు. చాలా సినిమాలలోహీరోలు ఇంటి పేర్లతోసహా తమ, తమ వంశ, కుల చరిత్రలు చెప్పుకుంటున్నారు. సూర్యదేవర వీర రాఘవయ్య, పర్వతనేని తులసీరామ్‌ ప్రసాద్‌… ఇలా…
ఈ కుల వాసన మనకు అభ్యంతరకరం కానప్పుడు బ్రాహ్మణ కుల వాసన మాత్రం ఎందుకు అభ్యంతరకరం అవుతున్నది? ఒక యువ నటుడు మీసం మెలేసి, తొడ చరిచి వంశం పేరు చెప్పి, అదంతా తెలుగు వారి ఆత్మగౌరవం అని… పెడ బొబ్బలు పెడితే మనం ఎందుకు మౌనంగా వుండిపోయాం…
మిథునం కథరాసిన శ్రీరమణ కానీ, దర్శకత్వం వహించిన తనికెళ్ళ భరణి కానీ ‘‘ఇదే తెలుగు సంస్కృతి’’ అని ఎక్కడా ‘‘క్లెయిమ్‌’’ చేసుకోలేదు. ఇదీ తెలుగు సంస్కృతి అని ఎవరయినా క్లెయిమ్‌ చేసుకున్నా యివాళ్ళ తెలుగు సమాజం ఆమోదించే స్థితిలో వున్నదా…?
తెలుగు అంటే ఏ తెలుగు అని అడిగే అస్తిత్వ సందర్భంలో వున్నాం మనం. తెలంగాణా తెలుగా…? ఉత్తరాంధ్ర తెలుగా..? రాయలసీమ తెలుగా..? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలుగు సంస్కృతి అంటే ‘‘ఏ తెలుగు సంస్కృతి’’ అని ప్రశ్నించడంలో తప్పులేదు.
విశాలమయిన జన సమూహాన్ని కలిపి వుంచే, అందరికీ ఆమోదయోగ్యమయిన సంస్కృతి ఎక్కడ వుంటుంది! సమాజం మొత్తం చిన్న చిన్న సమూహాలుగా, వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడిపోయినప్పుడు అన్ని రకాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అస్తిత్వంలో వుంటాయి. అన్నీ కలగలసిపోవడమే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సంస్కృతికి మూలం అదే. ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఇతర అస్తిత్వాలతో ఘర్షణ లేకుండా, సామరస్యంగా, సౌభ్రాతృత్వ పూర్వకంగా కలసి జీవించడాన్ని ఆధునిక సమాజాలు కోరుకుంటున్నాయి.
ఒక విశాలమయిన వృత్తం మధ్య కేంధ్రం ఎంత బలంగా వుండాలో, ఆ వృత్తంలో వున్న యితరేతర కేంద్రాలూ అంతే బలంగా వుండాలి. అది సమాజం కూడా ఈ విశాల తెలుగు సమాజానికి, బ్రాహ్మణ సంస్కృతి కూడా ఒక పార్శ్వంగా నిలుస్తుంది. దానినే భరణి, శ్రీరమణ చూపించాలి అనుకుంటే ఎవరయినా ఎందుకు తప్పుపట్టాలి? సోమయాజి, సోమిదేవమ్మ, ‘‘లచ్చుమ్మమ్మ’’ని విమర్శిస్తేనో, తృణీకరిస్తేనో, అగౌరవపరిస్తేనో ఖచ్చితంగా అభ్యంతరం పెట్టవలసిందే. సోమిదేవమ్మ కథలోకి లచ్చుమమ్మ రానంతవరకూ, లచ్చుమమ్మ కథలోకి సోమిదేవమ్మ రానంతవరకూ… ఎవరికయినా ఎందుకు అభ్యతరం వుండాలి..? సూర్యదేవర వీరరాఘవయ్యను యాక్సెప్ట్‌ చేసినట్లే బుచ్చిలక్ష్మీనీ అప్పదాసునూ యాక్సెప్ట్‌ చేయాలికదా…?
ఆయన ఉయ్యాల బల్లమీద శ్రీ మహావిష్ణువులాగా ఊగుతుంటే గడప మీద తలపెట్టుకుని ఆవిడ పడుకోవడం గురించి మనకెందుకు? బ్రాహ్మణ సంస్కృతిలో అమానవీయ అంశాలు వుంటే వాళ్ళే పరిష్కరించుకోవాలి. అది వాళ్ళ సమస్య.
గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కందుకూరి వీరంతా బ్రాహ్మణేయ సంస్కృతిలోని లోలోపలి చీకటి అంశాలను తూర్పారా పట్టిన వారే? అది 5% మైనారిటీల సంస్కృతి అయినా సరే.. దానికొక అవిచ్ఛిన్నత వుంటుంది. కాలం గడుస్తున్న కొద్ది అది అవలక్షణాలు పరిహరించుకుంటూ సాఫ్టెన్‌ అవుతుంది.
మిథునం సినిమాలో జంటకి సామాజిక జీవనం లేదు? వాళ్ళు ఎవరితోనూ కలవరు? అన్నది మరో విమర్శ. నిజమే వాళ్ళు ఎవ్వరితోనూ కలవరు (సినిమాలో). నిజానికి ఒంటరితనం వేరు. సామాజిక జీవనం లేకపోవడం వేరు. రెండిరటికీ చాలా తేడా వుంది.

mithunam
శ్రీరమణ కథలో అప్పదాసు బావమరిది పాత్ర ఒకటి వుంటుంది. అది సినిమా రూపంలోకి వచ్చేసరికి భరణి ఎందుకో తీసివేసాడు.
2012 కేన్స్‌ ఫిలమ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన ‘అమోర్‌’’ అనే సినిమాకు, మన మిథునం సినిమాకు చాలా పోలికలున్నాయి. ఇది వృద్ధ దంపతుల కథ. అదీ వృద్ధ దంపతుల కథే. ఆ సినిమాలోను వృద్ధ జంట బయటివారిని ఎవరినీ తమ యిటికి రానివ్వరు. తాము ఎక్కడికీ వెళ్ళరు భార్యకు పక్షవాతం వస్తే చూదామని కూతురు వస్తే, కూతురును చూడటానికి కూడా వాళ్ళు యిష్టబడరు. వాళ్ళిద్దరే ఒక లోకంగా వుంటారు.
2010 అక్టోబర్‌లోవచ్చిన సుప్రసిద్ధ రచయిత వి. చంద్రశేఖర్‌రావుగారి ‘‘ఆదివారం’’ కథ గుర్తుందా? హైద్రాబాద్‌లాంటి మహానగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా వుండే ఇద్దరు వృద్ధ దంపతుల కథ అది. ఉదయం నుండి సాయంత్రం వరకూ వాళ్ళిద్దరూ తలుపులు మూసుకొనే వుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుండీ రాత్రి నిద్రపోయే వరకు. కాఫీ చేసుకుని తాగుతారు. వంట వండుకుంటారు. టి.వి. చూస్తారు. విశ్రాంతి తీసుకుంటారు. కబుర్లు చెప్పుకుంటారు. ప్రొద్దున్నే ఎవరో తలుపు తట్టిన చప్పుడయితే తలుపు తీద్దాము అనుకుని తీయరు. ఆ తలుపు అలా మధ్యాహ్నం దాకా మోగుతూనే వుంటుంది. అయినా వాళ్ళు తీయరు సాయంత్రం ఎవరిదో అంతిమ యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిసినా తలుపు తీయరు. కథ అయిపోతుంది.
మిధునం, అమోర్‌, ఆదివారం ఈ మూడు కథలలోనూ వృద్ధ జంటల ప్రవర్తన ఒకే రకంగా వుంటుంది. మిథునం తెలుగు సినిమా, అమోర్‌ ఫ్రెంచి సినిమా. భాషలు, ప్రాంతాలు సరిహద్దులు లేకుండా వృద్ధ జంటల ప్రవర్తన ఒకేలా ఎందుకు వుంది?
ఒంటరిగా వుండాలని కోరుకోవడం అంటే సామాజిక జీవనం లేకపోవడమా? ఈ మూడు జంటలూ సమాజంతో నిరంతరం సంభాషిస్తూనే వుంటారు. సమాజంలో జరుగుతున్న అల్లకల్లోలాలు అన్నింటినీ గమనిస్తూ వుంటారు. ఆ సామాజిక సంఘర్షణలు ఏవీ తమ జీవితాలను ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త పడుతూవుంటారు. మరో మాటలోచెప్పాలంటే సమాజంలో చురుకయిన పాత్ర పోషించడానికి (యాక్టివ్‌ పార్టిసిపేషన్‌) ఇష్టపడరు. వాళ్ళది పాసివ్‌ రోల్‌. వృద్ధులకు ఈ తరహా ప్రవర్తన ఎందుకు వస్తుంది? అందుకు కారణం ఎవరు?
ఈ సమస్యలోతులలోకి వెళితే తప్పు మనదే అని మనం గుర్తించాల్సివస్తుంది. మనమెప్పుడూ వృద్ధులని మనుషులుగా గుర్తించం. వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించం. వాళ్ళ సలహాలు పాటిస్తామా లేదా! అనే విషయం పక్కన పెడదాం? అసలు వాళ్ళ మాటలు కూడా వినడానికి యిష్టపడం. చొరవ తీసుకొని ఏదయినా చెప్పపోతే అంతా చాదస్తంగా కొట్టిపడవేస్తాం.
అలాంటప్పుడు వృద్థులు ఏం చేస్తారు? తమలోకి తాము ముడుచుకుంటారు. సాధ్యమయినంత వరకు మన కంటపడకుండా ఒంటరిగా దాక్కుంటారు. మన అమ్మా నాన్నాలతో కలసి మనం ఎప్పుడయినా భోజనం చేస్తామా? వాళ్లకోసం పదినిమిషాలు కేటాయిస్తామా? మన ఉరుకుల పరుగుల జీవితం మనది. సమాజం అంటే మనమేకదా? మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు మనల నుండి దూరం జరుగుతారు. వాళ్ళకి సమాజ జీవనం ఉన్నాట్టా? లేనట్టా?
సామాజికి జీవితం అంటే నిత్యం సమాజంలో సంభాషించడమే కదా! ఈ వృద్ద జంటలు నిత్యం సమాజంతో మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళ మాధ్యమం వేరు. మన మీడియం వేరు.
అమోర్‌లో భార్యకి పక్షవాతం వస్తే హాస్పిటల్‌కి తీసుకుని వెళతాడు భర్త. భార్య బట్టలు వుతికాడని ఆకతాయి పిల్లలు అల్లరి చేస్తే కర్ర పట్టుకుని అప్పదాసు వెంటపడతాడు. టి.వి. చూస్తూ రాజకీయాలు చర్చిస్తారు. ఆదివారం దంపతులు. ఇదంతా ప్రతి స్పందనే కదా… మరి సామాజికి జీవితం లేనిది ఎక్కడ.?
నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ప్రభావాలు, ఎదిగి వచ్చిన ఒక కొత్తతరం జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాలు, బ్రాహ్మణులలో కూడా ఒక నూతన చైతన్యం తీసుకుని వచ్చాయి. వాళ్ళని వాళ్ళు అసెర్ట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవ్వాళ బ్రాహ్మణులు ఎంత మాత్రమూ అగ్రవర్ణం కాదు. ఉగ్రవర్ణమూ కాదు. ఎప్పుడో జరిగిన తప్పులకి మేము ఎందుకు శిక్ష అనుభవించాలని అడుగుతున్నారు. ఇది వస్తున్న మార్పు.
1980 లలో వచ్చిన దేవత సినిమా సమయానికి 2012లో వచ్చిన దేనికైనా రెడీ సినిమా సమయానికి బ్రాహ్మణులలో వచ్చిన మార్పు గుణాత్మకమయినదే.
దేవత సినిమాలో ప్రాత: సంధ్యవేళ నదీతీరంలో సంధ్యావందనం చేసుకునే ఒక బ్రాహ్మణుడిని మోహన్‌బాబు కాలెత్తి నడుంమీద తంతే బ్రాహ్మణులు కూడా హాస్యంగా సరిపెట్టుకున్నారు. కానీ దేనికైనా రెడీ సినిమా సమయానికి వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. రాస్తారోకోలు చేశారు. బంద్‌లు చేశారు. 1980లలో మొలకు చుట్టిన యజ్ఞోపవీతాన్ని 2012లో మామూలుగా ధరించారు. ఇదంతా అస్తిత్వ ఉద్యమాల పుణ్యమే! ఇతర అస్తిత్వ ఉద్యమాలని చూసినట్లే దీనిని కూడా చూడాలి. తప్పదు.
ఇవ్వాళ సమాజంలో బ్రాహ్మణుల ఆధితప్యం లేదు. ఆర్ధికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళ చుట్టూ ఏ పరిభ్రమణనూ జరగడం లేదు. ఆధిపత్య వర్గాలు ఏవో అందరికీ తెలుసు. అటువంటప్పుడు బ్రాహ్మణులు మిధునం లాంటి సినిమాల ద్వారా కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారని అనుకోలేము. ఒక వేళ వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినా అది వ్యర్ధ ప్రయత్నమే అవుతుంది.
నాగప్పగారి సుందర రాజు కథను సినిమా తీసినా, వేముల ఎల్లయ్య కక్కను సినిమా తీసినా తెలుగు సమాజం మిథునం సినిమాను చూసినట్టే చూస్తారు. సాహిత్య రూపాలుగా వాటి పేరు ప్రఖ్యాతులను ఎవరయినా అడ్డుకున్నారా? వాటికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరయినా కబ్జా చేశారా… లేదే!
సినిమా తీయడానికి అతి ముఖ్యమయిన నిర్మాత ఎవరయినా వుంటే వాటిని సినిమాలుగా తీయవచ్చు. అవార్డులు కూడా పొందవచ్చు. చోమనుడి డప్పును, కన్నడ ప్రేక్షకులు అదరించినట్లే కక్కనూ, అంటరాని వసంతాన్ని తెలుగు ప్రేక్షకులూ ఆదరిస్తారు.
ఈ వ్యాసంలో జి.ఎస్‌. రామ్మోహన్‌ ఒక మాట అన్నారు. తెలుగుదేశం నుండి అమెరికా లేదా మరే ఇతర దేశాలకయినా వలస వెళ్ళిన ప్రజలను నోస్టాల్జియా పట్టి పీడిస్తూ వుంటుంది. తెలుగు సంస్కృతికీ, సంప్రదాయానికి దూరం అయిపోయామనే బెంగ ఎక్కువగా వుంటుంది. ఆ బెంగలో నుండి సత్యనారాయణ వ్రతాలు, బతకమ్మా పండగలూ జరుపుకుంటారు. పూజలు, పున:స్కారాలు చేస్తారు. అంతవరకు మనం ఆమోదించవచ్చు. కానీ వాళ్ళు తెలుగు సంస్కృతి గురించి, చరిత్ర గురించీ ఉపన్యాసాలు, యివ్వడమో, పరిరక్షకులుగా ఫోజులెట్టడమో చేస్తేనే అసలు సమస్య.
అంటే ఏ విషయాన్ని అయిన ఆమోదించడానికి ఒక స్థాయి వుంటుందన్నమాట. ఆ స్థాయి దాటితే అది ఆమోదనీయం కాదు. యాక్సెప్టబుల్‌ స్టేజ్‌. ఆమోదనీయ స్థాయి, వ్యక్తులకీ సమాజాలకీ వేర్వేరు స్థాయిలలో వుంటుంది. స్త్రీ పురుషులు మధ్య ప్రేమ కూడా ఈ స్థాయి దాటితే బానిసత్వంగా మారుతుంది.
అప్పదాసు, బుచ్చిలక్ష్మీల మధ్య వున్న సంబంధాలను చేస్‌గా చేసుకుని స్త్రీ పురుషుల మధ్య వుండే అసమా సంబంధాలను ప్రస్తావిస్తూ ఈ సినిమా పాత విలువలని స్థిరీకరించడానికి ప్రయత్నం చేసిందంటారు రామ్మోహన్‌.
అప్పదాసు ఉయ్యాల బల్లమీద ఊగడమూ, బుచ్చిలక్ష్మీ గడప మీద తలపెట్టుకుని పడుకోవడమూ, అనే అసమం సబంధాలను అప్పదాసు బుచ్చిలక్ష్మీ బ్టటలు ఒక సారి ఉతకడం ద్వారా సరికావని, కానీ అలా చూఏపిండం ద్వారా భరణి షుగర్‌ కోటెడ్‌ ఫిల్‌ అందించి పాత విలువలను స్థిరీకరించడానికి ప్రయత్నం చేశాడు అని రామ్మోహన్‌ వ్యాఖ్య.
స్త్రీ పురుష సంబంధాలలో ఆమోదనీయ స్థాయి ఒక్కొక్కళ్లకి ఒక్కొక్క రకంగా వుంటుంది. బుచ్చిలక్ష్మీ ఆమోదనీయ స్థాయి మనకు తెలియదు. కనుక ఒక పెద్ద వ్యాఖ్య చేయడానికి ఒక చిన్న రిఫరెన్స్‌ చాలదేమో!
ప్రవాసాంధ్రులు సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడము. బతకమ్మలాడటం వరకు సంస్కృతి పరిరక్షకులుగా రామ్మోహన్‌కి పనికి వస్తారు. అది తన ఆమోదనీయ స్థాయి దాన్ని దాటితే రామ్మోహన్‌కి నచ్చదు. అలాగే తన ఆమోదనీయ స్థాయి దాటితే అప్పదాసుకూడా బుచ్చిలక్ష్మీకి నచ్చడు.
అందరూ ఆమోదించే స్థాయి స్త్రీ పురుష సంబంధాలలో వుండవు. కనుక ప్రేమ రూపంలో హింస కొనసాగుతూనే వుంటుంది. స్త్రీ పురుష సంబంధాలు స్టేటిక్‌ కాదు. డైనమిక్‌. కనుక మన యిష్టాయిష్టాలతో సంబంధం లేకండా మారుతూ వుంటాయి. వాటిని ఎవరూ పనికట్టుకుని స్థిరీకరించనవసరం లేదు. ఇది రామ్మోహన్‌కి కూడా తెలుసు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ వ్యాసాలంటే నా కిష్టం. మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘వై దిస్‌ కోల వెర్రి’’ అంటే మరీ ఇష్టం.
మిథునం లాంటి బలహీనమయిన సినిమా గురించి బలమయిన వ్యాసం రాసిన రామ్మోహన్‌కి అభినందనలు.

వంశీకృష్ణ

Download PDF

12 Comments

  • CHITRA says:

    బావుంది . సరేకానీ మొగాడు స్త్రీని ముండా ముండా అని పిలవడం ద్వైతమా అద్వైతమా ? ఏమే ఒసే అని పిలవడం అర్థ నారీశ్వర తత్త్వం లో భాగమా? మంది తో సంబంధం లేకుండా బతుకుతూ సొంత పిల్లల్ని చూడకుండా బయటి పిల్లల్ని రానీయకుండా వండుకుని తిని అరిగించుకుని పడుకునే వాళ్ళ గురించి మనం ఎందుకు చూడాలి? ఎందుకు మాట్లాడుకోవాలి ? చనిపోయిన అప్పదాసుని కాల్చటానికి ఆమె ఒక్కతీ చాలు .

    • pavan santhosh surampudi says:

      ఆ సినిమా చూస్తె పాపం అప్పాదాసు ప్రైవసీకి భంగమేమో కూడాను. అనవసరంగా వాళ్ల జీవితాల్లోకి తొంగిచూసినట్టవుతున్దేమో..:)

    • SriRam says:

      “మంది తో సంబంధం లేకుండా బతుకుతూ … వండుకుని తిని అరిగించుకుని పడుకునే వాళ్ళ గురించి మనం ఎందుకు చూడాలి? ఎందుకు మాట్లాడుకోవాలి?”

      మంది తో సంబంధం పెట్టుకొని, యువనేత లాగా ఊరూరా ఓదార్పు యాత్రలు చేసి, వృద్దాప్యం లో కి జారుకొన్న వ్యక్తి కాడు అప్పదాసు. ఎంతో మంది మధ్యతరగతి వృద్దులలో ఒకడు. ఎవ్వరి మీదా ఆధరపడకుండా, వారి వంట వారు వండుకుని తిని అరిగించుకుని పడుకొంటే అభ్యంతరం ఎందుకు? ప్రతి సినేమావాడు వారి సినేమా గురించి డబ్బా కొట్టుకొంటారు.
      ఇక ఆ సినేమాను చూడటం, చూడకపోవటం మన ఇష్టం. ఆ సినేమాను చూడలి, దాని గురించి మాట్లాడాలి అని ఎవ్వరైనా బలవంత చేశారా?

    • SriRam says:

      వ్యాఖ్య పోస్ట్ చేసిన తరువాత ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ముసలి వారు ఎలా ఉన్నారా? అని పక్కిళ్ల వాళ్లు పట్టించుకోవలసిన అవసరం ఉందేమో! అలాచేయకపోతే కొన్ని ఇబ్బందులు ఇరుగు పొరుగుకు కలగవచ్చు. ఒక హింది సినీనటి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, ఒంటరిగా ఉంట్టూ అపార్ట్ మెంట్ లో చనిపోయింది. అది బయటి ప్రపంచానికి తెలియదు. ఆవిడ శవం నుంచి వచ్చే వాసన వలన ఇరుగు పొరుగు వారికి అసౌకర్యం కలిగి, అనుమానంవేసి, పోలిసుల కి తెలియజేసి తలుపులు తెరచి చూసారు. చనిపోయిందని తెలుసుకొన్నారు. ముసలి వారు మనలను పట్టించుకోకపోయినా,వారు ఎలా ఉన్నారో అని ఆరాతీస్తే మనకే మంచింది, అందులో తప్పులేదేమో?

  • మీ ప్రతి వ్యాసంలో చాలా విషయాలను లేవనెత్తారు. బ్రాహ్మణిజం… ఇది కేవలం ఆ సామాజిక వర్గానికే కాదని, సమాజంలోని అట్టడుగు సామాజిక వర్గానికి కూడా ఆ భావజాలం వుండవచ్చని తెలియటం వేరు… అంగీకరించటం వేరు. స్త్రీ, పురుష సంబంధాలు పట్ల మీ పరిశీలనాత్మక వ్యాఖ్యను చూడగానే ఆమోదయోగ్యమైనదిగా అనిపించింది. చివరిలో మీరు వ్రాసిన నాలుగు వాక్యాలు మొత్తం మీ ప్రతివ్యాస బలాన్ని గాలితీసిన ట్యూబులా చేశాయేమో?

  • Thirupalu says:

    <>
    రామ్మోహన్‌ గారి వ్యాసానికి ప్రతిస్పందనగా జరిగిన చర్చ లో రామ్మొహనతో పాటు ఎవరూ ఈ భావం తోటి అన్నట్లు కనిపించలేదు. ఇక్కడ బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ వాధం వేరు. రెండు ఒకటిగా అర్ధం చేసుకో గూడదు. ఈ నాడు ఎవరు అదిపత్యంలో ఉన్నా వారి భావజాలం మొత్తం బ్రాహ్మణ వాధం ఏర్పరిచిన భావజలమే. ధాన్నుండి వారు వీరు అనే భేధం లేకుండా అందరూ అందులో తలలోతు మునిగిన వారే! అందు లో ఏ విధమైన సందేహం లేదు. అందు వల్లనే ధాన్ని ఆదిపత్య భావజాలం అంటున్నాం. అయినప్పటికీ, ఈ నాటికి ఆధి పత్య వర్గాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నది వారే నంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోదన్నట్లు ఈనాటికీ ఆ భావ జాలం ఏర్పరిచిన పునాధులు ఒక్క గాను ఒక్క ఇంచి కూడా కదిలినట్లు లేదు. మన రాస్ట్రం గురించి అటు ఉంచితే పొరుగు రాస్త్రాలైన తమిళ నాడులో వన్నీయార్‌ సంఘం ఉపయోగించు కుంటున్నా కుల రాజకీయాలు దాని సారం కాధా? (దీన్ని నే ఉదాహరణకు మాత్రమే వాడాను.)

    వ0శీ కృష్ణ గారు విష గులికలకు ఎంత తేనే రాసిన అది తీపిగా ఉండదు.

    • Siddarth says:

      # రామ్మొహనతో పాటు ఎవరూ ఈ భావం తోటి అన్నట్లు కనిపించలేదు#
      వంశీకృష్ణ అర్థవంతంగా రాసిన వ్యాసాన్ని బ్రాహ్మణ వాధం ఏర్పరిచిన భావజలమే అంట్టు తేల్చి పారేసేపనైతే, ఇక రామోహన్ రావుగారు అదేపనిగా బ్రాహ్మణ వాదం గురించి కొత్తగా వ్యాసాన్ని రాయనవసరంలేదు కదా! మరి ఆయన ఎందుకు రాసినట్లు? అక్కడ మీరెందుకు అద్బుత విశ్లేషనండి! అదరగొట్టేసారు అని చప్పట్లు ఎందుకు కొట్టినట్లు?

      #ఈ నాటికి ఆధి పత్య వర్గాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నది వారే నంటే అతిశయోక్తి ఏమీ లేదు#

      అధిష్ట్టానం వర్గం చెప్పినట్లే వింటాను అనే పనబాక లక్ష్మి, దామోదర్ రాజనరసింహా ఎవరికి చేదోడు వాదోడుగా ఉంట్టున్నారో?

  • Thirupalu says:

    <>
    పై వ్యాక్యలో ఈ వ్యాఖ్యం పోయిమ్ద్ గమనించ galaru.
    .

  • Thirupalu says:

    <>

  • pavan santhosh surampudi says:

    వ్యాసం చాలా అర్థవంతంగా ఉంది. కానీ ముగింపు పేలవంగా మిగిలింది. మిథునం బలహీనమైన సినిమా అని, రామ్మోహన్ గారి వ్యాసం చాలా బలవత్తరమైనది అనుకుంటే ఈ వ్యాసం అనవసరం కదా. వ్యాసం మొత్తం మిథునం సినిమాను గురించిన విమర్శలు ఖండించి. చివర్లో ఆ వ్యాఖ్య చేయడం ఎందుకో అర్థం కాలేదు. పోనీ అది వ్యంగ్యం అనుకుని సరిపెట్టుకుందాం అంటే టోన్ అలా లేదు.
    మిథునమే బలహీనమైన సినిమా అయ్యుంటే ఇందరు విమర్శిస్తూనో, సమర్థిస్తోనో ప్రస్తావించరు. పట్టించుకోకుండా వదిలేస్తారు. అది ఉత్తమమైన సినిమా కనుకనే దర్శకుడికి కూడా కనిపించని కోణాలు పలువురు ప్రేక్షకులకు కనిపిస్తున్నాయి. ఉత్తమ కవిత్వం కవి ఊహించని భావాలు కూడా శ్రోతలకు అందజేసినట్టుగా.

  • BUCHIREDDY GANGULA says:

    పవన్ గారి ఒపీనియన్ తో నే ను ఏకీభవిస్తాను — వంశీ గారు
    నాలుగు –అయిదు ఏళ్ళ నుండి వస్తున్న సినిమా ల లో
    యిది మంచి సినిమా ఏదో చెప్పండి సర్ — వస్తున్నా –చూస్తున్న వాటి
    కన్నా మిథునం —-పరవా లేదు అని చెప్పవచ్చు — కదా సర్
    ————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

Leave a Reply to CHITRA Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)