సంప్రదాయం విస్మరించిన మరికొన్ని ప్రశ్నలు!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అవిచారంబని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ! నీ యగ్రసం

భవు డత్యున్నతశక్తియుక్తుడు మహీభారప్రగల్భుండు భా

ర్గవదౌహిత్రుడు పాత్రు డీ యదుడు లోకఖ్యాతు డుండంగ నీ

భువనేశత్వభరంబు బూన్ప దగునే పూరున్ జఘన్యాత్మజున్

                                                         -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

ధర్మం తెలిసిన ఓ యయాతి మహారాజా! (నువ్వు చేసిన పని) అనుచితమని చెప్పడానికి జంకుతున్నాము. నీ పెద్దకొడుకు, శుక్రుని మనవడు, మంచి శక్తియుక్తులు కలిగినవాడు, భూభారాన్ని మోయగలవాడు, కీర్తిమంతుడు, యోగ్యుడు అయిన యదువు ఉండగా; నిమ్నస్త్రీకి పుట్టిన పూరునికి రాజ్యభారం అప్పగించడం సమంజసమేనా?

               ***

యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి నేటి సంప్రదాయ పండితులనుంచి సమాధానం దొరకదని   కిందటిసారి చెప్పుకున్నాం. అటువంటివే ఈ కథలో మరో మూడు ఉన్నాయి…

మొదటిది, యయాతికి శుక్రుడు ఇచ్చిన శాపం. శర్మిష్టతో సంబంధం పెట్టుకోవద్దన్న తన ఆదేశాన్ని యయాతి ఉల్లంఘించాడు కనుక, అతనికి అకాల వృద్ధాప్యం విధించి శుక్రుడు శిక్షించాడని అనుకుంటాం. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, శుక్రుని శాపం యయాతికి ఏవిధంగానూ శిక్ష కాలేదు. అతడు యవ్వన సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాతే సహజగతిలో వృద్ధుడయ్యాడు. శాపాలనే నమ్మవలసివస్తే, నిజంగా శిక్ష అనుభవించింది, అతని వృద్ధాప్యాన్ని మోసిన అతని కొడుకుల్లో ఒకడు. యయాతికి ఎలాంటి శిక్షా లేకపోగా మొదటినుంచి చివరివరకూ ప్రతీదీ అతనికి అనుకూలించాయి.  తను తొలిచూపులోనే శర్మిష్ట పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమెను కోరుకున్నాడు. ఆమెను పొందాడు. ఆమెతో సంతానం కన్నాడు. చివరికి ఆమెకు కలిగిన పూరునే తన రాజ్యానికి వారసుని చేశాడు. ఈవిధంగా అన్నీ అతని ప్రణాళిక ప్రకారం, లేదా అతనికి అనుకూలించే ప్రణాళిక ప్రకారమే జరిగాయి.

దేవయాని కథ ఇందుకు భిన్నం. ఆమెకు దాదాపు అన్నీ ప్రతికూలంగానే జరిగాయి. ప్రేమించిన కచుడు  దక్కలేదు. రాచగర్వంతో తనను అవమానించిన శర్మిష్టను దాసినైతే చేసుకోగలిగింది. కానీ, ఆ దాసియే ఆమె కాపురంలో చిచ్చు పెట్టింది. ఒక మహారాజును పెళ్లిచేసుకోగలిగింది. కానీ, అతనిని దాసితో కలసి పంచుకోవలసివచ్చింది. తను ఎంతో తెలివీ, గడుసుదనమూ, మాట నేర్పూ ఉన్నదే. కానీ యయాతి తెలివి ముందు చిత్తుగా ఓడిపోయింది! తండ్రికి ఆమె మీద విపరీతమైన మమకారం ఉంది. ఆమె కోరింది ఆయన కాదనే ప్రశ్నే లేదు. కానీ, విచిత్రం, తండ్రికి తన మీద ఉన్న అంత గొప్ప మమకారమూ ఆమెకు కలసిరాలేదు. అంతకంటే విచిత్రం, శుక్రుడు కూతురి ప్రణాళికకు పెద్దగా సహకరించకపోగా, యయాతి  ప్రణాళికకు సహకరించడం!

ఎలాగంటే…శర్మిష్టతో పడక సుఖం మాత్రం పంచుకోవద్దని పెళ్లి సమయంలో యయాతికి శుక్రుడు చెప్పడంలో బహుశా దానికి విరుద్ధమైన ధ్వని ఉండచ్చని ఇంతకుముందు అనుకున్నాం.  ఇప్పుడు యయాతికి శాపమిచ్చే సమయంలో శుక్రుడు అన్న మాటలు దానికి పొడిగింపుగానూ, ధృవీకరణగానూ అనిపిస్తాయి.  యవ్వనగర్వంతో నా కూతురిని నొప్పించావు కనుక నీపై వృద్ధాప్యభారం పడుగాక అని శపించిన శుక్రుడు; ఆ తర్వాత శాప సవరణ చేస్తూ, నీ కొడుకుల్లో ఒకరు నీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే నువ్వు మరికొంతకాలం యవ్వనసుఖాలు అనుభవించవచ్చు నన్నాడు. అంతవరకు అర్థవంతంగానే ఉంది. కానీ శుక్రుడు అంతటితో ఊరుకోకుండా, నీ వృద్ధాప్యాన్ని స్వీకరించినవాడే నీ రాజ్యానికి వారసుడవుతాడన్నాడు! సమయ, సందర్భాలను దృష్టిలో పెట్టుకుంటే శుక్రుడు ఆ మాట అనవలసిన అవసరం, ఔచిత్యం కనిపించవు. ఆ ఘట్టంలో, యయాతికి కాబోయే వారసునికి ఒక కఠినమైన అర్హతను నిర్దేశించడం చీకట్లో రాయి విసరడం లాంటిది. ఎలాగంటే, దేవయాని కొడుకులైన యదు, తుర్వసులు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తారో లేదో ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. కనుక శుక్రుని నిర్దేశం దేవయానికి ఉపకారం కన్నా అపకారం చేసే అవకాశమూ ఉంది. ఈ కథను మలచడం వెనుక ఒక ప్రణాళికా, ఆ ప్రణాళికలో శుక్రుని భాగస్వామ్యమూ లేవనుకుంటే; ఎంతో బుద్ధిశాలి అనుకునే శుక్రుడు ఇలాంటి అనాలోచిత నిర్దేశం చేస్తాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

కథ వెనుక ఒక ప్రణాళికా, అందులో శుక్రుని భాగస్వామ్యమూ ఉన్నాయనుకున్నప్పుడే ఆ ప్రశ్న తలెత్తదు.  శుక్రుని పాత్రను మొదటినుంచీ గమనించండి… అతనికి దేవయాని ప్రవర్తనతో ఏకీభావం ఎప్పుడూ లేదు. దానికితోడు శర్మిష్టపై అతనికి ఆదరభావం ఉంది. ఆమెకు అన్ని సౌఖ్యాలూ సమకూర్చి బాగా చూసుకోమని యయాతికి ప్రత్యేకంగా చెప్పాడు. పడక సుఖానికి మాత్రం ఆమెను దూరంగా ఉంచమన్నాడు. ఆమెతో పడక సుఖం పంచుకోమన్న ధ్వనీ అందులో ఉండచ్చని చెప్పుకున్నాం. అందుకే, శర్మిష్టతో సంబంధం పెట్టుకున్నందుకు యయాతిపై అతనికి నిజంగా కోపం లేదు. కూతురికోసం కోపం నటించాడు. శపించిన వెంటనే శాప సవరణ చేయడం దీనికి మరో సాక్ష్యం. పైగా, నీ వృద్ధాప్యాన్ని స్వీకరించిన వాడే నీ రాజ్యానికి వారసుడవుతా డన్నాడు. శర్మిష్ట కొడుకుల్లోనే ఒకడు ఆ అర్హతను సాధించుకోగలడన్న నమ్మకం అప్పటికే ఆయనకు ఉండి ఉండాలి. లేనప్పుడు చీకట్లో రాయి విసరడం లాంటి ఆ  శాపసవరణను ఆయన చేసి ఉండేవాడు కాదు. అంతకంటే ముఖ్యంగా, శర్మిష్ట కొడుకు రాజు కావడమే అతిక్రమించరాని ధర్మమన్న బలమైన భావనా ఆయనకు ఉండచ్చు. ఎందుకంటే, ఆమె రాచకూతురు కనుక.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. కథకుడు జరిగిపోయిన కథను చెబుతున్నాడు. తను చెప్పదలచుకున్న ఫలశ్రుతికి అనుగుణంగా కథను మలచుకుంటున్నాడు. ఆయా పాత్రలను ఆ ఫలశ్రుతికి కలసివచ్చేలా నిర్మించుకుంటున్నాడు. శర్మిష్ట చిన్న కొడుకు పూరుడు రాజు కావడమే ఈ కథలో ఫలశ్రుతి. అతడు భరతవంశ మూల పురుషులలో ఒకడు కాబోతున్నాడని చెప్పడం కథకుని దృష్టినుంచి చాలా ముఖ్యమైన అంశం. కథకుడు ఉద్దేశించిన ఈ ఫలశ్రుతికి కలసివచ్చే అతి ముఖ్య పాత్ర, ఇక్కడ శుక్రుడు. ఎలాగంటే, శర్మిష్ట రాచకూతురే కానీ, మధ్యలో దాసి అయింది. ఆమె కొడుకులపై దాసిపుత్రులన్న ఆక్షేపణ ఉంటుంది. అయినాసరే, ఆమె కొడుకు పూరుడు రాజయ్యాడు. దానికి సామాజిక ఆమోదం లభించాలి. ఆ ఆమోదాన్ని పొందడం వివిధ అంచెలలో సాగుతుంది. వాటిలో శుక్రుని ఆమోదం ఒకటి. అతడు పురోహితుడు, ధర్మాధర్మనిర్ణయవేత్త, నీతికోవిదుడు, గురుస్థానంలో ఉన్నవాడు. కనుక అతని ఆమోదం తప్పనిసరి.

సామాజిక ఆమోదం సాధించే ఈ ప్రక్రియలో మరో అంచె, పౌరజానపదపరిషత్తు ఆమోదం. ఇది ఈ కథలో సంప్రదాయ  పండితుల మౌనముద్రను వెల్లడించే మరో సందర్భం కూడా. పౌరజానపదపరిషత్తు నేటి ప్రజాప్రతినిధుల సభ లాంటిది. యయాతి తనకు ‘విధేయులైన’ బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన అన్ని వర్ణాలలోని ముఖ్యులనూ రప్పించి; మంత్రి, పురోహిత, సామంత, పౌరజన సమక్షంలో పూరునికి పట్టాభిషేకం చేశా డని కథకుడు చెబుతున్నాడు. అంటే, పూరుని రాజుగా అభిషేకించే విషయంలో యయాతి ముందుగా వారిని సంప్రదించి, ఆమోదం పొందలేదనీ; స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాడనే అభిప్రాయానికి ఇక్కడ అవకాశమిస్తున్నాడు. పైగా వారందరికీ ‘నిజాజ్ఞా విధేయు’ లనే విశేషణం వాడాడు. ఆ మాట ద్వారా యయాతి సర్వస్వతంత్రాధికారాలు గల రాజు అనీ, అతని మాట శిలాశాసనమనే భావన కలిగిస్తున్నాడు.

విచిత్రం ఏమిటంటే, కథకుడు ఆ వెంటనే ‘సర్వ ప్రకృతి జనా’లకూ యయాతి చర్య నచ్చలేదనీ సూచిస్తున్నాడు. వారు తమ అభ్యంతరాలను సూటిగానే వెల్లడించారు. పై పద్యం అదే చెబుతోంది. ‘నీ పెద్దకొడుకు, అన్ని విధాలా సమర్థుడు, శుక్రుని మనవడు అయిన యదువు ఉండగా, ఒక నిమ్న స్త్రీకి జన్మించిన పూరునికి రాజ్యమెలా ఇస్తా’వని వారు అడిగారు.  దానికి యయాతి జవాబిస్తూ, ‘మీరన్నట్టు యదువు నా పెద్దకొడుకే, నా హృదయంలోంచి పుట్టినవాడే; కానీ, నా మాట పెడచెవిని పెట్టి నన్ను అవమానించాడు. తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించనివాడు కొడుకెలా అవుతాడు, తండ్రి ఆస్తికి వారసుడెలా అవుతాడు? పూరుడు అలా కాదు. చిన్నవాడైనా నా ఆదేశాన్ని పాటించాడు. గుణసంపదలో అతనే పెద్ద. పైగా భూభారం మోయగల సహనం అతనికి ఉంది’ అన్నాడు.  అంతటితో ఆగకుండా, శుక్రుని కూడా తనకు సమర్థనగా ముందుకు తెచ్చాడు. ‘నా వృద్ధాప్యభారాన్ని మోసిన కొడుకే నా రాజ్యానికి అర్హుడూ, వంశకర్తా అవుతాడు. ఇది శుక్రుని మాట’ అన్నాడు. ఆ విధంగా యయాతి ప్రకృతిజనాలను ఒప్పించి పూరుని భూభారదురంధరుని, అంటే పట్టాభిషిక్తుని చేశాడని అంటూ కథకుడు మరోసారి పట్టాభిషేక ప్రస్తావన చేస్తున్నాడు.

ఇలా ఒకే సందర్భంలో, అందులోనూ వెంట వెంటనే యయాతిని ఒకసారి సర్వస్వతంత్రుడైన రాజుగానూ; ఆ తర్వాత ‘ప్రకృతి జనాల’ అభ్యంతరాలకు సమాధానం చెప్పి, వారిని ఒప్పించవలసిన రాజుగానూ కథకుడు చిత్రించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ క్రమంలో పూరుని పట్టాభిషేక ప్రస్తావన రెండుసార్లు చేసి అనవసరంగా తన కథనానికి పునరుక్తి దోషాన్ని  ఆపాదించడమూ వింతగానే కనిపిస్తుంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే స్ఫురించే కారణాలు ఇవే:

నేటి ప్రజాప్రతిధుల సభలాంటి పౌరజానపదపరిషత్తు ప్రాముఖ్యం, పనితీరుల గురించి కథకునికి స్పష్టమైన అవగాహన లేకపోవచ్చు. రాజుకు సర్వస్వతంత్ర అధికారాలు ఉంటాయని మాత్రమే కథకుని అవగాహన కావచ్చు. అయితే, యయాతి నిర్ణయాన్ని మొదట (పౌరజానపదపరిషత్తు రూపంలోని) ‘ప్రకృతి జనాలు’ ప్రశ్నించారనీ, యయాతి వారిని సమాధానపరచిన తర్వాతే పూరునికి పట్టాభిషేకం చేశాడని మూల కథ చెబుతోంది కనుక, కథకుడు దానిని తప్పించుకోలేకపోయాడు. సందిగ్ధస్థితిలోనే దానినీ అనువదించి ఉంటాడు. లేదా, పౌరజానపదపరిషత్తు గురించి తనకు అవగాహన ఉన్నా, దాని గురించి తెలియవలసిన అవసరం లేని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు కథ చెబుతున్నాడు కనుక ఆ వివరాన్ని ఇలా స్పష్టాస్పష్టంగా తేల్చి వేసి ఉండచ్చు. లేదా, రాజుకు సర్వస్వతంత్ర అధికారాలు ఉంటాయని చెప్పడం మీదే తనకు ఎక్కువ ఆసక్తి ఉండి ఉండవచ్చు. మొత్తానికి కఃథలోని ఈ వివరాన్ని తప్పించుకోడానికి కథకుడు చేసిన విఫలయత్నం పైన చెప్పిన అస్పష్టతకు, పునరుక్తికి అవకాశమిచ్చింది. విశేషమేమిటంటే, నేను పరిశీలించిన టీటీడీ ప్రచురణలో వ్యాఖ్యాతలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు.

సంప్రదాయ పండితుల మౌనముద్రను పట్టి చూపే మూడో అంశాన్ని చూద్దాం…శర్మిష్ట కొడుకులు ముగ్గురినీ దేవయాని ఎప్పుడు చూసింది? వారు యయాతి దగ్గర ఆడుకుంటుండగా. అంటే, వారు బాల్యదశలో ఉండి ఉండాలి. కథకుడు కూడా వారిని బాలకులనే అన్నాడు. కనీసం వారు కౌమారదశలో కూడా లేరు. మీ తల్లిదండ్రులెవరని దేవయాని వారిని అడిగినప్పుడు వారు నోటితో కూడా సమాధానం చెప్పలేదు. తమ ‘లేత చూపుడివేలితో’ యయాతీ, శర్మిష్టలను చూపించారు. శర్మిష్టవల్ల యయాతి ఈ ముగ్గురినీ కన్నాడని అర్థమైన దేవయాని అప్పటికప్పుడు పుట్టింటికి బయలుదేరివెళ్లింది. తండ్రికి అంతా చెప్పింది. ఆమె వెనకే యయాతీ వెళ్ళాడు. అప్పుడు వృద్ధుడివి కమ్మని శుక్రుడు శాపమిచ్చి, శాప సవరణ కూడా చెప్పాడు. శాపం పని చేసి, ఆ వెంటనే యయాతిపై వృద్ధాప్యభారం పడిందని కథకుడు చెబుతూ ఆ అవస్థను కూడా వర్ణించాడు. అప్పుడు యయాతి అయిదుగురు కొడుకులనూ పిలిచి, ‘మీలో ఒకడు నా వృద్ధాప్యం తీసుకుని తన యవ్వనం నాకు ఇవ్వా’లని అడిగాడు. మొదటి నలుగురూ తిరస్కరించగా, ఆఖరి కొడుకు పూరుడు ఒప్పుకుని తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని వృద్ధాప్యం తను తీసుకున్నాడు.

ఇదంతా మహా అయితే కొన్ని రోజుల వ్యవధిలో జరిగిపోయి ఉండాలి. అప్పటికి శర్మిష్ట కొడుకులే కాదు సరికదా, దేవయాని కొడుకులు కూడా యవ్వనవంతులు కావడానికి అవకాశం లేదు. కనీసం కౌమారదశలో ఉండే అవకాశమూ తక్కువే. అందులోనూ శర్మిష్ట చివరి కొడుకు పూరుడు మరింత శైశవదశలో ఉండి ఉంటాడు. అతడు యవ్వనవంతుడు ఎప్పుడయ్యాడు? తన యవ్వనాన్ని తండ్రికి ఎప్పుడు ఇచ్చాడు? అతడు పెరిగి పెద్దయ్యే దాకా యయాతి వృద్ధాప్యాన్ని అనుభవించాడా? అప్పుడు దేవయానితో అతడు సుఖించడం ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ, పూరుడు యవ్వనవంతుడయ్యాక యయాతి అతని యవ్వనం తీసుకున్నాడనుకున్నా; అప్పుడు యయాతి దేవయానితో సుఖించడం ఎలా సంభవం? దేవయాని యవ్వనం అప్పటికి తరిగిపోతుంది కదా? శుక్రుడు తన శాపసవరణ ద్వారా కూతురికి చేసిన మేలు ఏమిటి?

సంప్రదాయ పఠన పాఠనాలలో సమాధానం దొరకని ఇలాంటి అనేక ప్రశ్నలను అలా ఉంచి, మరో అంశాన్ని ఎత్తుకుంటే…

శర్మిష్టతో యయాతి సంబంధం పెట్టుకోవడమే కాక, ఆమెవల్ల కొడుకులను కూడా కన్న ఈ ఘట్టంలో కథకుడూ, దేవయానీ, ప్రకృతిజనులూ కూడా జాతిభేదాన్ని ముందుకు తెస్తున్నారు. ఇందులో అంతర్లీనంగా వారసత్వ వివాదం ఉన్న సంగతి స్పష్టమే. శర్మిష్టతో యయాతి కొడుకుల్ని కన్నట్టు తెలిసి దేవయాని దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసిందని చెబుతున్న సందర్భంలో కథకుడు శర్మిష్టను ‘దానవి’గా పేర్కొని ఈ వారసత్వ వివాదానికి సూచనప్రాయంగా తెరతీశాడు. ‘ఈ రాజు ధర్మం తప్పి రాక్షసపద్ధతిలో రాక్షసి వల్ల ముగ్గురు కొడుకుల్ని కని నన్ను అవమానించా’డని దేవయాని తండ్రితో అంది. ‘ఒక నిమ్న జాతి స్త్రీకి పుట్టినవాడికి రాజ్యభారం ఎలా అప్పగిస్తా’వని ప్రకృతిజనులు యయాతిని అడిగారు.

జాతిభేదం గురించిన ఈ ప్రస్తావనలు బహుశా ఒకనాటి జాతులు, తెగల సాంకర్యాన్ని సూచిస్తూ ఉండచ్చు. ఆధునిక చరిత్రకారుల రాతలు ఇందుకు సంబంధించిన పురాచారిత్రక పరిణామక్రమాన్ని పునర్నిర్మించుకోడానికి ఏ కొంచెమైనా సాయపడచ్చు. అలాగే, దేవయాని రాక్షస పద్ధతిలో అనడం వివాహచరిత్రనూ, వివాహభేదాలనూ స్పృశిస్తూ ఉండచ్చు.

వాటి గురించి తర్వాత…

–కల్లూరి భాస్కరం

Download PDF

4 Comments

  • chintalapudivenkateswarlu says:

    భాస్కరం గారు!
    ఆంద్ర మహాభారతం మీద మీ పరిశీలన లోతుగా సాగుతోంది. ఎవ్వరూ తడమని కోణాలు ప్రగాఢంగా పాఠకుల్ని ప్రశ్నిస్తున్నాయి. మీ నిశిత పరిశీలనకు నమోవాకాలు.
    ముఖ్యంగా యయాతి, యయాతి కొడుకుల వయస్సుల విషయంలో మీరు లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం లేనివి. యవ్వనాలను చొక్కాలు మార్చుకున్నట్లు ఎలా మార్చుకున్నారా అనే మీమాంస నాకుండేది. దీనివెనుక ఏదైనా శాస్త్రీయమైన కారణమున్దా అనే ఆలోచన ఉండేది. కానీ వారి వయస్సుల విషయంలో నాకు అనుమానం రాలేదు. అది నా లోపమే. ఇప్పుడు వయస్సులు మార్చుకోవడం లేదుకదా!
    శర్మిష్ట దానవ రాజ కన్య. యయాతి మానవ రాజు. దానవులు మానవులు వివాహ సంబంధాల్లో ఒకటవ్వటమ్ పురాణ రాజ వంశాలలో కనిపించేదే. ఇక్కడ రాజకన్య దాసిగా రాజు దగ్గర ప్రవేశించ బట్టి శూద్ర అయిందా? అప్పటి కులాచారాలకు స్థిరత్వం లేదు. అన్నీ ప్రవాహ శీలాలు. కాబట్టి మన కవులు కూడా ఈవిషయంలో తడబడి ఉండొచ్చు. ఏమైనా అద్భుతమైన విమర్శలతొ పాఠకులను విశెషంగా ఆలోచింప చేస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు.

  • కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ…”అప్పటి కులాచారాలకు స్థిరత్వం లేదు. అన్నీ ప్రవాహశీలాలు” అన్న మీ వ్యాఖ్య చాలా బాగుంది. ఆ ప్రవాహశీలత కాలగతిలో అనేక అపోహలు, విశ్వాసాలుగా ఘనీభవించింది. అది అలా ఉంచితే ఆ ప్రవాహంలో కలగలిసి చరిత్ర కూడా ప్రవహించిందని చెప్పడమే నా ఉద్దేశం.

  • anrd says:

    శర్మిష్ఠ రాక్షసరాజు కూతురు కాబట్టి దేవయాని ఆమెను దానవి అని సంబోధించి ఉండవచ్చు. లేక తన భర్తను రహస్యంగా వివాహం చేసుకుని సంతానాన్ని పొందినదన్న కోపంతో కూడా దేవయాని ఆమెను దానవి అని సంబోధించి ఉండవచ్చు.

    ఇక శుక్రునికి కూతురుపట్ల గల మమకారం వల్ల ఆమెను గట్టిగా మందలించలేకపోయి ఉండవచ్చు. అయితే శర్మిష్ఠ పట్ల కూడా శుక్రునికి వాత్సల్యం ఉండిఉండవచ్చు. శర్మిష్ఠ రాజు కూతురు . సుకుమారంగా పెరిగిన అమ్మాయి కాబట్టి ఆమెకు చక్కటి సౌకర్యాలను ఏర్పరచాలని యయాతిని కోరి ఉంటాడు. అయితే ఆమెతో సానిహిత్యం వద్దని స్పష్ఠంగా చెప్పినదానిలో శుక్రుని అభిప్రాయం సూటిగానే తెలుస్తోంది.

    తన కూతురికి సవతి పోరు ఉండాలని ఏ తండ్రీ కోరుకోడు. కూతురంటే ఎంతో ప్రేమ ఉన్న శుక్రుని వంటి తండ్రి అసలే కోరుకోడు. శర్మిష్ఠ యయాతికి భార్య కావాలని శుక్రుని ఉద్దేశం కాకపోవచ్చు.

  • anrd says:

    ఇక శర్మిష్ఠ యొక్క సంతానం తండ్రి యొక్క వృద్ద్యాప్యాన్ని స్వీకరించే సమయంలో బాల్యానికి టీనేజికి మధ్య వయస్సు వారయి ఉండవచ్చు.

    బహుశా 10 సంవత్సరాలు అలా వయస్సు ఉంటే బహుశా అతని యవ్వనంలోని మధ్య వయస్సు భాగాన్ని యయాతి స్వీకరించి ఉండవచ్చు. కొంతకాలం గడిచిన తరువాత పురు తన యవ్వనాన్ని తాను స్వీకరించగా యయాతి తన వృద్దాప్యాన్ని తను స్వీకరించి ఉండవచ్చు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)