ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? 3 వ భాగం

Ekkadi(1)

( గత వారం తరువాయి)

3

third week fig-1

వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
చుట్టూ విపరీతమైన మీడియా వ్యక్తుల ఒత్తిడి. టి.వి. ఛానళ్ళవాళ్ళు, పత్రికలవాళ్ళు, ఒక మంత్రి హత్య జరిగింది కాబట్టి జాతీయస్థాయి టి.వి. వాళ్ళు..ఒకటే హడావుడి.. ఈ దేశంలో ఇంత స్వేచ్ఛ, యింత మీడియా కవరేజ్‌, యింత అతి ప్రవర్తన అవసరమా అని వేయవసారి విసుక్కున్నాడు ఎస్పీ విఠల్‌. గెస్ట్‌హౌజ్‌లో మంత్రిగారి హత్య జరిగిన బెడ్‌రూం ప్రక్కగదిలో కూర్చున్నాడు ఒంటరిగా బోనులో సింహంలా. బయటంతా పోలీసులు వాసన.. హడావుడి.. మంత్రిగారి శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నం..మంత్రి బంధువుల రాక..రాళ్ళవానలా..అంతా బీభత్సం.
విఠల్‌లోనుండి విస్కీ మత్తు పూర్తిగా దిగిపోయింది.
‘కథ’ను ఎంత పకడ్బందీగా అల్లినా..డిపార్ట్‌మెంట్‌లో తనకు విధేయులైన చెంచాగాళ్ళను ఎంత మందిని పురమాయించి ఉద్యుక్తుల్ని చేసినా..ఇటువంటివే ఎన్నో హత్యలను తను ఇదివరకు విజయవంతంగా చేసినా..ఎందుకో చిత్రంగా విఠల్‌కు భయం కల్గుతోంది. ఎన్నడూ లేంది.
ఎందుకు.. రాక్షసుడిలాంటి, రాయిలాంటి తనకు భయమెందుకు.
వర్షం బయట ఉధృతంగా కురుస్తున్నా విఠల్‌ ముఖం నిండా అతనికి తెలియకుండానే చెమటపట్టింది.. ఏదో సన్నని వణుకు.
సరిగ్గా అప్పుడు మ్రోగింది విఠల్‌ మొబైల్‌.
”హలో” అన్నాడు. అన్‌నోన్‌ నంబరది.
”విఠల్‌.. అనవసరంగా తొందరపడ్డావ్‌” అటు ప్రక్కనుండి గంభీరమైన నిశ్చలమైన ఓ స్త్రీ గొంతు.
మొదట షాకై..క్షణకాలం తత్తరపడి..తర్వాత అదిరిపడి. మరుక్షణం ఆ కంఠాన్ని లీల స్వరంగా గుర్తించి..కంపితుడై,
”మేడమ్‌..”అన్నాడు ఆందోళనగా.
”ఇలా చేయవలసింది కాదు” అదే స్థిరత్వం గొంతులో. సారీ మేడం..”
”ఇట్సాల్‌రైట్‌.. ఒక ఎంక్వయిరీ కమీషనొస్తుంది..బయట పడ్డానికి ముందు నిన్ను అక్కడ్నుండి ట్రాన్స్‌ఫర్‌ చేపిస్తా.. నీతో నాకు చాలా పనుంది. ధైర్యంగా ఉండు”
”థ్యాంక్యూ మేడం”
”నువ్వు అళ్లిన కథనే కొనసాగించు. కథ బాగానే ఉంది..ఊఁ. తాగడం బాగా తగ్గించి తక్కువగా మాట్లాడ్డ మంచిదేమో విఠల్‌ నీకు ఊఁ..”
”ఔను మేడం.”
ఫోన్‌ పెట్టేసింది లీల అటువైపునుండి.
నిజానికి విఠల్‌ అప్పుడాక్షణం లీల గొంతువిని అదిరిపడ్డ వణుకునుండి కోలుకోకుండానే..వెంటనే పోలీస్‌ బ్రెయిన్‌తో లీల చేసిన నంబర్‌ను డిస్‌ప్లే చేసి కోడ్‌ చూచుకున్నాడు. 0974.. అని ఉంది. నైన్‌ సెవెన్‌ ఫోర్‌..అంటే దోహా..కతార్‌.,
ఎక్కడో ఓ అరబ్‌దేశంలో ఉన్న లీలకు..తను చేసిన హత్య విషయం ఇంత వివరంగా..ఇంత తొందరగా.,
చటుక్కున విఠల్‌కు జ్ఞాపకమొచ్చింది..మంత్రికీ, తనకూ కలిపి ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ రెండువందలకోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను యిప్పించింది లీలేనని. తమ గొడవను సెటిల్‌ చేయమని తనే ఈ మధ్య లీలను సంప్రదించడంకూడా వెంటనే స్ఫురించింది.
విఠల్‌ ఖంగుతిని..’తనెరిగిన కొద్దమంది అద్భుతమైన అతి తెలివితేటలున్న వ్యక్తుల్లో ఈ లీల ఒకతి’ అని ఎందుకో అనుకున్నాడు లిప్తకాలం.. వెంటనే ముఖంమీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ.,
జ                జ        జ
విఠల్‌తో మాట్లాడి మొబైల్‌కాల్‌ కట్‌చేసిన లీల టైం చూచుకుంది. దోహాలో ఉదయం ఆరుగంటల పదినిముషాలు.. ఇండియాలో ఎనిమిది దాటింది.
క్షణకాలం చనిపోయిన మంత్రి విశ్వనాధరెడ్డితో ఉన్న లావాదేవీలను పునశ్చరణ చేసుకుంది.. ”పూర్‌ ఫెలో..నోటి దురుసున్న ఒట్టి ఆవేశపరుడు..”అని నిట్టూర్చి..నిర్మలను పిల్చుకుంది లైన్‌లోకి.
”నిర్మలా..ఏమైంది..”
”మీ ప్రోగ్రాం మొత్తం రీషెడ్యూల్‌ చేశాను మేడం. ముందనుకున్నట్టు మీరు ఢిల్లీకి రాకుండా..వాషింగ్టన్‌ వెళ్తారు. రెండు రోజుల స్టే అక్కడ..ఔనా.”
”ఎగ్జాట్లీ..ఫుట్‌ మీ టోటల్లీ ఫ్రీ నిర్మలా”
”ఎస్‌ మేం..యు ఆర్‌ కంప్లీట్లీ రిలీవ్డ్‌.. మీకెవరూ కాల్‌ చేయరు. అన్ని కాల్స్‌ను జామ్‌ చేస్తాను”
”దట్స్‌ గుడ్‌..”
”మీకు ఈ పూటే తొమ్మిదీ పదికి కతార్‌ ఎయిర్‌వేస్‌లో గష్ట్ర.51 ఫస్ట్‌క్లాస్‌లో వాషింగ్టన్‌ డి.సి.కి టికెట్‌ బుక్‌ చేశా మేడం. రిసిప్షన్‌లో ఇ-టికెట్‌ తీసుకోండి.. పదమూడు గంటలు ప్రయాణం. సాయంత్రం యుఎస్‌ టైం నాల్గున్నరకు అక్కడకు చేరుకుంటారు. మేరీల్యాండ్‌లో ఉంటారు మీరు కాబట్టి లోయిస్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ అన్నెపోలిస్‌ హోటల్‌లో డీలక్స్‌ కింగు సూట్‌ మీ పేర బుక్‌ చేయబడి ఉంది. మీకు మన ఏజంట్‌ ప్రకాశ్‌ రిచర్డ్స్‌ అనే డ్రైవర్‌ నిచ్చి ఏర్‌పోర్ట్‌కు కారును పంపుతాడు..”
”థాంక్యూ నిర్మలా..వెల్‌డన్‌”
”హాపీ స్టే మేం..”
”థాంక్యూ”
అటువేపునుండి నిర్మల నిష్క్రమించింది. ఎంత చురుకైన ఎగ్జిక్యూటివో అనుకుంది లీల.

Ekkadi(1)
‘రెండురోజులు..ఫ్రీ..స్వేచ్ఛ..వినీలాకాశంలో ఎగిరే పక్షి తను..’ఎందుకో ఆమె అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షికూనలా పులకిస్తూ సంబరపడిపోయింది.
‘ఒక అద్భుతమైన టీ తాగితే ఎలా ఉంటుంది.’ అని అనిపించి,
చటుక్కున లేచి.. కిచెన్‌ ఓవెన్‌లోనుండి కంపోజ్ట్‌ టీ..రెండు నిముషాల్లో తెచ్చుకుని..ఎంత గ్రాండ్‌ హోటల్స్‌ ఇవి.. అన్నీ చాచిన చేయికి అందేవిధంగా..లాంజ్‌లోకి వచ్చి..విశాలమైన గాజు కిటికీ సన్నని తెరలనుజరిపి ఎదురుగా గర్జిస్తున్న నీలి సముద్రం..దూరంగా లంగరు వేసిన నౌకలు..పైన ఎర్రగా ఆకాశం..పురిటినొప్పులు పడ్తున్న ప్రకృతి..ఒక సూర్యశిశువు జన్మించాలిప్పుడు..లెట్‌ మీ సీ ఇట్‌.
పసిపిల్లయిపోయింది లీల.
చాలా అనాలోచితంగా. ఆమె టకటకా తన బ్లాక్‌బెర్రీ ఫోన్‌తో ఎంపిఫోర్‌ ట్రాక్‌ చేసి బటన్‌ను ఆన్‌ చేసింది.
తనకెంతో యిష్టమైన ముఖేశ్‌ పాట..’లౌట్‌ కే ఆఁ..లౌట్‌ కే ఆఁ…’
పాట ఒక సముద్ర కెరటమై పురి విప్పుకుని విస్తరిస్తూండగా..టీని మృదువైన పెదవులలో కొద్దికొద్దిగా చప్పరించి.. కళ్ళుమూసుకుని..కుర్చీలో వెనక్కి ఒరిగి..
శరీరంలోనుండి.. ఆత్మ విడివడి వియుక్తమౌతున్నట్టు…ఏదో విభాజ్యమై..ఏదో సంయోగం చెంది..ఎక్కడో ఒక అనుస్పర్శతో పులకించి.. వివశయై.,
తంత్రి మీటబడి..ఒక రసధ్వని పుట్టి..విస్తరిస్తూ..వ్యాపిస్తూ..భాషకందని ఏదో తాదాత్మ్యతలో అన్నీ కోల్పోతూ.. అంతర్ధానమైపోతూ..లీనమైపోతూ..అదృశ్యమైపోతూ,
‘ఎక్‌ ఫల్‌హై హస్‌నా, ఏక్‌పల్‌ హై రోనా
ఏక్‌ పల్‌ హై మిల్నా ఏక్‌ పల్‌ బిచడ్‌నా
దునియాహై దోదిన్‌కా మేలా…’అంటున్నాడు ముఖేశ్‌.
ఎంత సత్యం.. స్థూలంగా జీవితమైవరిదైనా అంతిమంగా అంతా ఇంతేగదా.
మనిషి వెళ్ళిపోయి..పాడిన పాట మిగిలిపోయి..పాటతో ఒక జీవిత సారాంశం చిరస్మరణీయ సంపదగా మిగిలిపోయి.. ఏదోపోయి..ఏదో మిగిలి..అసలు పోయేదేమిటి..చివరికి మిగిలేదేమిటి..నిజానికి పోవడానికిగానీ మిగిలిపోవడానికిగానీ మనిషి దగ్గర ఏదైనా ఉందా. శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం ఎక్కడైనా వ్యవస్థీకృతమైన శక్తి ఎప్పుడూ స్థిరమేకదా..రూపాలు మారవచ్చుగానీ శక్తి పరిమాణం మారుతుందా..పరిణామక్రమాలు వేరుకావచ్చు కాని రూపాంతరస్థాయిలో నిక్షిప్తమై ఉండే శక్తి స్థిరమూ, శాశ్వతమూ, అనంతమూ ఐ..చివరికి మిగిలేది శూన్యమేగదా.,
పూర్ణమదః పూర్ణమిదః
పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావ శిష్యతే
శూన్యం నుండి శూన్యాన్ని తీసివేసినా, శూన్యానికి శూన్యాన్ని కలిపినా..శూన్యంతో శూన్యాన్ని హెచ్చవేసి, భాగించి.. భిన్న భిన్న సహస్రాంశ సూక్ష్మాలుగా విభజించినా..సత్యమై, నిత్యమై పరిఢవిల్లే పరమ పచ్చి నిజం శూన్యమేకదా-
కళ్ళు మూసుకున్న లీల మనసు సముద్రమై మథనం చెందుతోంది.
నిశ్చలత్వం. అనిశ్చితి..స్థిరత..డోలనం..మథనం..మళ్ళీ ఏకత..ఇదంతా ఏమిటి?
మూసిన కళ్ళవెనుక ఏదో గాఢమైన, లోతైన, సాంద్రమైన..స్పష్టంగా తెలియని ఏదో అవ్యక్తత.,
ఏమిటది..తెలియని ఆ ఏమిటో ఏమిటది.?
అన్వేషణ..లోపల..లోపల్నుండి యింకా లోపలివైపు..’ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు లీనమై..ఆ ‘లోపలివైపు’ ..నక్షత్రాలను చిమ్ముకుంటూ రసోద్విగ్నయానం చేస్తున్న ఆత్మ ఒక ఉల్కవలె విశ్వాంతరాల గర్భాల్లోకి చొచ్చుకొని చొచ్చుకునిపోతూ పతనమౌతున్న క్షణం..ఒక బిందువై జన్మించే అన్వేషణ, వివేచనై.. విశ్లేషణై, విస్తరించి విస్తరించి.. ఉహుఁ.. అర్థంకావడంలేదు..అంతు చిక్కడంలేదు..భౌతికం అభౌతిమై, మిథ్య ఒక వాస్తవమై..సత్యం పరమ సత్యంగా భాసిస్తూ ఋజువుగా అనుభవమౌతున్న మహోద్వేగ క్షణాలు..వ్యక్తీకరించేందుకు భాషకు లొంగుతాయా. అనేక సందర్భాల్లో మనిషి తట్టుకోలేని మహోగ్ర ఉద్విగ్నతలను బయటి ఏ భాషలోనైనా వ్యక్తీకరించలేక ఓడిపోయి..సుళ్ళు తిరుగిపోతూ బిగ్గరగా ఏడ్చి.. పిచ్చిగా నవ్వి.. పొంగి పొర్లి తుఫానులా తల్లడిల్లిపోయిన అనుభవాలు ఎందరికి లేవు.
ఐతే.. ఈ అంతర్‌లోకాంతరాల్లోకి తొంగి చూడగల సంస్కారం, తత్వం, అభిరుచి ఎందరికుంటుంది..దీన్నేుకృతమంటారా. కృతాలూ, దృష్టాలూ..ఇవన్నీ ఏమిటి..సుకృతాలూ, కనబడని అదృష్టాలూ ఏమిటి..అసలీ కనబడడం, కనబడకపోవడమేమిటి. చూపు, దృష్టి ఏమిటి.. ఉందీ అంటే కనబడడమా. లేదూ అంటే కనబడకపోవడమా. కనబడనివన్నీ లేనట్టా. సమస్త విశ్వాంతరాల చుట్టూ క్షేత్రమై వ్యాపించి ఉన్న ఏ శక్తితరంగాలూ కంటికి కనబడ్డం లేదు కదా. అంతమాత్రాన అవి లేవని నిర్ధారించలేముకదా. ఉన్నాయని మన రేడియో తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు, అనేక వర్గీకరణలకు చెందిన కాంతి తరంగాలు..ఇవన్నీ తమ అద్భుత చర్యలతో ప్రమేయాలై ఋజువు చేస్తున్నాయికదా. మనిషికి తెలిసిన ఈ కొద్ది అదృశ్య తరంగశక్తులు కాకుండా..మనిషి ఇంకా పసికట్టని అనేకానేక వింత శక్తి స్వరూపాలు ఈ సృష్టిలో ఇంకెన్నున్నాయో.
హృదయ తరంగాలుంటాయా..ఒక మనిషి తనకు చెందిన ఒక హృదయ పౌనఃపున్యంతో స్పందిస్తున్న మరో మనిషియొక్క హృదయ తరంగాలతో అనుసంధానమై ప్రతిచర్యించగలడా.
వ్చ్‌.. ఏమో,
చీకటే శాశ్వతం..వెలుగే అప్పుడప్పుడు మధ్య మధ్య అతిథిలా వచ్చి ‘దిన’మై మనను భ్రమింపజేస్తోందనే వాదన నిజమేనా. వెలుగును విశ్లేషిస్తే ఏడు రంగులుగా విడిపోయినట్టు చీకటిని విశ్లేషిస్తే.. వింతైన అద్భుతాలు బయటపడ్తాయా,
లీల ఒక శ్వాసిస్తున్న సముద్రంలా కళ్ళు మూసుకుని..సమాధియై పోయింది.
ఆకాశపర్యంతం విస్తరించిన ఒక మహావాయుస్తంభనలో తను చిన్న ధూళి కణమై తేలిపోతున్నట్టు..అంతా తేలిక, అగమ్యం. శూన్యోత్సర్గం-
నిశ్శబ్దం..గడ్డకట్టిన నిశ్శబ్దం..అభేద్యమైన నిశ్శబ్దం.
కాలం గడుస్తోంది..ఆమె పూర్తిగా అభౌతికమైపోయింది.
..అప్పుడు మ్రోగింది ఆమె మొబైల్‌ఫోన్‌.
ఉలిక్కిపడి..చటుక్కున ఎత్తి..
నిర్మల
నిర్మల కాల్‌ చేయవలసిన ప్రోగ్రాం ఏమీలేదు. ఐనా ఎందుకు చేస్తోంది.
”నిర్మలా..”అంది.
”….”జవాబు లేదు. ఏదో గర్ర్‌ర్‌ర్‌మని ధ్వని. లైన్‌ డిఫెక్టివ్‌.,
”నిర్మలా..”మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. కొద్దిసేపు ఏవేవో శబ్దాలు వినిపించి ఓ అర నిముషం తర్వాత లైన్‌ తెగిపోయిది. మనసులోనుండి ఏదో ఓ మహాపర్వత భారం తొలగిపోయినట్టయి..,
ఎదురుగా అదే దృశ్యం..నిరంతరంగా సంఘర్షించే సముద్రపు అలలు. నీలి గగనం..నీలి నీరు..మధ్య రగులుకోబోతున్న కొలిమిలా ఎర్రగా నిప్పుముద్ద..సూర్యోద్భవం.
సూర్యోదయం..నిత్యనూతనమైన..అతిసాధారణమైన.. అతి సహజమైన..ప్రాణప్రదమైన, జీవాధారమైన..సూర్యోదయం.
దేవుడున్నాడా.. లేడా.. ఉంటే ఎలా ఉన్నాడు,ఎక్కడున్నాడు, ఆ ఉన్నది ఆడదా, మగాడా, వాడు లేక ఆమె రూపమేమిటి.. వాడి వెనుక మర్మమేమిటి..ఈ మీమాంసను ప్రక్కనబెడ్తే..తన దృష్టిలో ప్రత్యక్షదైవం సూర్యుడే..కనబడేవాడు.. కనిపింపజేసేవాడు.. కనువిప్పుకలిగించేవాడు. సర్వశక్తులకూ శక్తికేంద్రకమై  సకల చరాచర సృష్టికి మూలమై భాసించేవాడు. ప్రధానంగా తనకూ, తన జీవిత రూపకల్పనకు స్ఫూర్తిప్రదాతయై ఒక ఊపిరిగా గుండెల్లో నిత్యమై జ్వలించేవాడు. తన వ్యక్తిత్వ వికాసానికి అజ్ఞాత నిత్యప్రేరకుడు.

third week fig-2
రథస్యైకం చక్రం భుజగయమితా స్సప్తతురగాః
నిరాలంబో మార్గ శ్చరణవికల స్సారథి రవిపి|
రవి ర్యాత్యేవాస్తం ప్రతిదిన మపారస్య నభసః
క్రియాసిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే||
ఎంత గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయమిది..
ఒంటి చక్రమేగల రథాన్ని అధిరోహించి వచ్చేవాడు..అసలు ఒంటి చక్రం పడిపోకుండా నిలబడ్తుందా..ఒంటి చక్రం నిలబడాలన్నా, నిలబడి పయనించాలన్నా కొంత కనీస భ్రమణవేగాన్ని కలిగి ఉండాలి. లేకుంటే అది కూలిపోతుంది. అంటేకదలిక.. కనీస వేగంతో కూడిన కదలిక జీవిపురోగతికి అత్యంతావశ్యకమని చెప్పడం.. సప్తాశ్వరథమారూఢం.. ఏడు గుర్రాలు తెలుపురంగుకు మూలమైన సప్తవర్ణాలకు ప్రతీకలే ఐనా..ఏడు శక్తులు గుర్రాలవలె వివిధ దిశలలో రథాన్ని.. అంటే మనిషిని లాక్కుపోతున్నపుడు వాటన్నింటిని సమన్వయపరిచి ఏకశక్తిగా..సింగిల్‌ వెక్టార్‌గా రూపొందించుకోవాలి.. అంటే మనిషి తనలో నిబిడీకృతంగా ఉన్న వివిధ శక్తులను గుర్తెరిగి వాటిని సమీకృతపరచుకుని ఏకలక్ష్య గమనంతో గమ్యంవైపు సాగాలి. రథసారధి అనూరుడు. తొడలు లేనివాడు. కనీసవేగంతో ఒంటిచక్రపు రథాన్ని నడుపుతూ, ఏడు గుర్రాలను సమన్వయపరుస్తూ, అదుపులో ఉంచుకుంటూ క్రమశిక్షణతో నిండిన కాలస్పృహతో పయనం సాగించేవాడు. అంటే జీవితమనే గమనానికి సారధ్యం వహించేవానికి అంగవైకల్యం ఏవిధంగానూ ఒక అవరోధం కాదు- అని. గుర్రాలను నియంత్రించే పగ్గాలు.. పాములు. సజీవమైన పగ్గాలు సక్రమంగా పనిచేయాలంటే సమర్థవంతమైన పాలనతో కూడిన నిర్వహణ ముఖ్యం..అందుకు పాటవం కావాలి. అన్నింటినీ మించి ప్రతి దినమూ భూగోళానికంతటికీ సంబంధించి కాలధర్మానికీ, సృష్టి నియమాలకూ లోబడి నియమిత ప్రాంతంలో, నియమిత కాలంలో సూర్యుడక్కడకు చేరి, విధులను నిర్వర్తించి ఉదయాస్తమయ ధర్మాలను పాటించాలి.. ఒక నిర్దుష్ట మార్గాన్ని అతి ఖచ్చితంగా పాటించాలి. ఐతే.. ఏ దారీలేని ఆకాశమార్గంలో.. మేఘాల్లో..ఎప్పటికప్పుడు దారిని తెలుసుకుంటూ, పథభ్రష్టత చెందకుండా ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రయాణం కొనసాగించాలి. జీవితంలో లక్ష్యాలను చేరేందుకు ఎప్పటికప్పుడు ఎవరికివారు తమతమ దిశను తామే నిర్దేశించుకుంటూ జాగ్రత్తగా సాగాలి..అని లేకుంటే దారితప్పి ఆత్మధ్వంసంతో మనిషి పతనం కావడం ఖాయం.. ఇంత వ్యక్తిత్వవికాస పాఠం సూర్యునితో, సూర్యునివల్ల..సూర్యునిద్వారా.,
తను ఎం.బి.ఎ చేస్తున్నపుడు మౌళిసార్‌ చెప్పిన ‘ఆదిత్య హృదయ వివరణ’. ఇది ఎంత గొప్ప అన్వయం. జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా సూర్యుణ్ణి మించిన స్ఫూర్తి ప్రదాత ఇంకెవరుంటారు.,
ఆకాశంనుండి ఒక నక్షత్రం రాలిపడ్డ అనుభూతి కలిగి..చటుక్కున తెగిపోయి..ఉలిక్కిపడి,
టైం చూచుకుంది లీల. ఎనిమిదీ పది. తొమ్మిదీ నలభైకి యుఎస్‌ఎ ఫ్లైట్‌..తయారుకావాలి.,
ఇంతకూ నిర్మల ఎందుకు ఫోన్‌ చేసినట్టు,
చకచకా నిర్మలకు నంబర్‌ కలిపింది..రింగై..”నిర్మలా..”
”మేడం..పావుగంటనుండి మీకోసమే ప్రయత్నిస్తున్నా..లైన్‌ కలువడంలేదు”
”చెప్పు..”
”ఒక అలర్ట్‌ న్యూస్‌”
”మనం. ఇరాక్‌ యుద్ధం తర్వాత రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా విపరీతమైన ప్రాజెక్ట్స్‌ దొరుకుతాయని ఒక మూడునెలలకాలం కేవలం మిడిలీస్ట్‌ కార్యకలాపాలపైననే దృష్టి పెట్టాం జ్ఞాపకముందా. బస్రా పవర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌స్టలేషన్‌కు సంబంధించి అమెరికా కంపెనీ ఆల్టెక్‌ పవర్‌ ఇన్‌కార్పొరేషన్‌తో కలిసి ఇండియాకు చెందిన మన క్లెయింట్‌ రమేశ్‌ సహానీకి రెండు మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ ఇప్పించాం..జ్ఞాపకముందా..ఆ డీల్‌లో మెక్సికోకు చెందిన జెన్‌రోవర్‌ అండ్‌ కంపెనీతో గొడవపడ్డాం.. మీరు ఒకసారి మెక్సికోకూడా వెళ్ళొచ్చారు. రోజర్స్‌, మైకేల్‌, మిసెస్‌ బర్గర్‌,మిస్‌ హోస్టలర్‌..ఊఁ..ఐతే నిన్నరాత్రి ఎవరో గుర్తుతెలియని దుండగులు రమేశ్‌ సహానీని గుజరాత్‌ గాంధీనగర్‌లో కృష్ణ ఐమాక్స్‌ థియేటర్‌లో తన కీప్‌తో కలిసి సినిమా చూస్తూండగా కాల్చి చంపారు..ఎవరో ఆ పాతపగను పర్సూ చేస్తున్నారు..మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇపుడు మిసెస్‌ బర్గర్‌ గ్రూప్‌ మార్చి అలెక్స్‌ మైకేల్‌ గ్రూప్‌లో ఉందట. ఆమెకు మీరు..మీ గురించిన పూర్తి వివరాలు తెలుసు. చాలా పదునైన మనిషి – యంగు అండ్‌ బ్యూటిఫుల్‌. ఆమె ఫోటోను మీకు మెయిల్‌ చేస్తున్నా. మొన్ననే ఆమె ఇండియాకు వచ్చి వెళ్ళినట్టు తెలిసింది..”
చెప్పుకుపోతోంది నిర్మల..ఒక పోలీసాఫీసర్‌కంటే స్పష్టంగా,
యంగు అండ్‌ బ్యూటిఫుల్‌..నిర్మల కూడా. కార్పొరేట్‌ రంగాల్లోగానీ, దుర్మార్గమైన నీచరాజకీయాల్లోగానీ, మాఫియా గ్రూపుల్లోగానీ కీలకమైన వ్యక్తులు వ్యక్తిగతమైన ఆసక్తులతో ద్రోహపూరిత చర్యలతో ప్లాట్‌ఫాం మారడం ఎంతో సహజమే.. ఐతే, నాయకత్వం వహించేవాళ్లు ఎప్పుడూ ‘ఎదుటివాడు దొంగ..ద్రోహి’ అనే దృష్టితోనే అనుక్షణమూ వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఎక్కడైతే అత్యంత సుఖవంతమైన సౌకర్యాలూ, అధికారాలూ ఉంటాయో ప్రక్కనే తత్‌వ్యతిరేకమైనప్రాణభయంతో కూడిన ప్రమాదాలూ, రిస్కూ పొంచి ఉంటాయి. ఉన్నతస్థాయి నిర్వహణలన్నీ తాడుపై పరుగువంటివి. పరుగును మరచి నడకకొనసాగిస్తే లోయల్లోకి పత్తాలేకుండా కూలిపోతారు..ధ్వంసమైపోతారు.
”ఓకే నిర్మలా..”
”టేక్కేర్‌ మేం..” లైన్‌ కట్‌ చేసింది.
”… ” లేచి..అద్భుతమైన పరిమళం నిండిన బాత్‌రూంలోకి నడిచింది లీల. గోరువెచ్చని నీటి షవర్‌క్రింద స్నానం కానిస్తూ,
ఆమె మెదడు పాదరసంలా జ్ఞాపకాలను తవ్వుతోంది. మార్చి 20, 2003న ప్రారంభమైన ఇరాక్‌ యుద్ధంలో అమెరికా సేనలు ఇరాక్‌ సమాజాన్ని కకావికలు చేసిన విధ్వంసం తర్వాత, యుఎస్‌ 35 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని ఇరాక్‌ పునర్మిర్మాణం కోసం ప్రకటించిన తర్వాత, యిక అంతర్జాతీయ స్థాయి రాబందులన్నీ ఇరాక్‌ నేలపై వాలడం మొదలైంది. మల్టీనేషనల్‌ కంపెనీల ముసుగువేసుకున్న ఈ దిక్కుమాలిన కంపెనీలన్నీ దేశం ఏదైనా ఒకే ఒక అనైతిక మూలసిద్ధాంతాన్ని కలిగి ఉంటాయి. అదేంటంటే ‘పే అండ్‌ యూజ్‌’. నిజానికి ఇది ప్రైవేట్‌ టాయ్‌లెట్‌ ఆపరేటర్ల స్లోగన్‌. ఇదే నినాదం అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు కూడా ఖచ్చితంగా పాటిస్తాయి. దేశమేదైనా, వ్యక్తి ఎవరైనా డబ్బుకు లొంగని వాడెవడూ ఉండడు. గో ఎ హెడ్‌ అండ్‌ కాప్చర్‌. అంతే. ఆ క్రమంలో అమెరికాకు చెందిన ఫిలిప్‌ బ్లూమ్‌ కంపెనీతోకలిసి మెక్సికోకు చెందిన జెన్‌ రోవరో 1.2 బిలియన్‌ డాలర్ల పవర్‌ ప్రాజెక్ట్‌లను బస్రా, కుర్దిష్‌, రుమాలియాలలో చేజిక్కించుకున్నపుడు మెల్లగా తను ప్రవేశించి 0-2-బి. ఒకటి, 0.4 ఒకటి, 0.3 ఒకటి ఇలా మూడు సబ్‌ కాంట్రాక్ట్‌లను రమేశ్‌ సహానికి యిప్పించింది. అందువల్ల జెన్‌ రోవర్‌ కొన్ని ప్రాజెక్టులను కోల్పోవలసి వచ్చింది తన వల్ల. అదీ తనపై వాళ్ళ పగ.అప్పుడైతే..రెండు నెలల బాగ్దాద్‌లోనే మకాం వేసింది తను ”ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌” పథకం క్రింద బైజి, రుమాలీయాలలో మన బిహెచ్‌ఇఎల్‌ 8.7 బిలియన్‌ రూపాయలతో నాల్గు గ్యాస్‌ టర్బయిన్‌లను నెలకొల్పడంలో మాత్రం తక్కువ అవినీతి జరిగిందా. సైట్‌ ఇంజనీర్‌ నాయర్‌, వాసుదేవ్‌, అలెగ్జాండర్‌, షర్మిల సక్సేనా.. వీళ్ళందరు ఎన్ని లక్షలు..కోట్లు తిన్నారో.. చరిత్రలన్నీ అవినీతి కంపు..వ్యాపారాలన్నీ పుట్టకురుపుల్లాంటి కుళ్ళు.,
స్నానం ఐపోయింది..ఒక చెత్త జ్ఞాపకం తెగిపోయింది. బయటకొచ్చి చకచకా పదినిముషాల్లో తయారై..యిక యిప్పుడెవడూ రారు తనకోసం..ప్యూర్లీ పర్సనల్‌ మూవ్‌మెంట్స్‌..రూంలోని ఇంటర్‌కాంలోనే రిసిప్షనిస్‌కు దోహా ఏర్‌పోర్ట్‌కు టాక్సీకోసం చెప్పి,
అద్దంలో..తనను తాను తృప్తిగా చూచుకుని..పొంగిపోతూ.,
కిందికి..ట్యాక్సీలోకి..పావుగంట తర్వాత దోహా ఏర్‌పోర్ట్‌లోకి..మరో పది నిముషాల్లో కతార్‌ ఏర్‌ వేస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫస్ట్‌క్లాస్‌..ఎ- త్రీ టు కిటికీ దగ్గరి ఫ్లాట్‌బెడ్‌లాంటి సీట్లోకి.. మరో పదినిముషాల్లో విమానం గర్జిస్తూ టేకాఫై ..గగనతలంలోకి.,
మళ్ళీ..శృతిలా కొనసాగుతున్న విమాన గర్జన మధ్య గడ్డకట్టిన నిశ్శబ్దం.
పదమూడు గంటల ప్రయాణం..బాగ్దాద్‌, బస్రా, ఫ్రాంక్‌ఫర్ట్‌…అట్లాంటిక్‌ మహాసముద్రంపై నాల్గుగంటలు..డెట్రాయిట్‌, పెన్సెల్వీనియా, బూస్టన్‌, న్యూయార్క్‌.
మళ్ళీ…అంతర్లోకాల్లోకి ప్రయాణం.,
రామం జ్ఞాపకమొచ్చాడు లీలకు.
జ్ఞాపకమొచ్చాడు అనడం తప్పేమో..మరిచిపోతేగదా జ్ఞాపకం రావడానికి.. కొన్ని జ్ఞాపకాలు నిరంతరం ఒక అనునాదంలా హృదయంలో సజీవంగా కదుల్తూనే ఉంటాయి. మెలకువలోనైనా..నిద్రలోనైనా.
రామం ఒక ప్రత్యేకమైన అతీత వ్యక్తి.

Download PDF

17 Comments

 • laxmi johanson says:

  ‘ హృదయ తరంగాలుంటాయా ..ఒక మనిషి తనకు చెందిన ఒక హృదయ పునః పున్యంతో స్పందిస్తున్న మరో మనిషి యొక్క
  హృదయ తరంగాలతో అనుసంధానమై ప్రతిచర్యించగలడా ..’ ఈ వాక్యం..ఈ భావన ఎంతో లోతుగా, శాస్త్రీయంగా ఉంది.కార్పోరేట్
  కల్చర్ ను మౌళి గారు అద్భుతంగా రాశారు..అభినందనలు.

  లక్ష్మీ జాన్సన్ -న్యూయార్క్

 • ramanayya jaajula says:

  సూర్యుని గురించిన అన్వయం.. వివరణ ..మనిషిలో దాగిఉన్న అంతర్శక్తులను వెలికి తీసేవిగా ఉన్నాయి..చాలా బాగుంది.ఇది నిస్సందేహంగా ఒక గొప్ప నవల.రచయిత మౌళి గారికి ,సంపాదకులకు కృతఙ్ఞతలు.
  రమణయ్య.జె ,నల్గొండ

 • madhavi.k says:

  మూడు వారాలుగా చదువుతున్న ‘ ఎక్కడినుండి .?ఎక్కడిదాకా.? ‘ సీరియల్ ఊహించని మలుపులు తిరిగి అసలు రంగంలోకి ప్రవేశించింది..రాజకీయాలు,అధికారుల అవినీతి ,వ్యక్తిత్వ వికాస దృష్టి …అన్నీ కలిసి నవలకు నిండుదనాన్ని చేకూరుస్తున్నాయి.మౌళి గారికి అభినందనలు.
  మాధవి.కె ,కొచ్చిన్

 • karuna says:

  నమస్తే …3 వారాలుగా చదువుతున్న రామాచంద్ర మౌళీ గారి సీరియల్ ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? ఉత్కంట గా చదువుతూ పత్రిక కోసం ఎదురు చూస్తున్నాం …
  లీల అంతరంగం లోని అన్వేషణ అంతరలోకాల్లో తొంగి చూడగల సంస్కారం, అభిరుచి ,తత్వం మాకు ఎంతో బాగున్నది..ముఖ్యం గా హృదయ పౌనః పున్యం …తో …….స్పందిస్తున్న మరో మనిషి యొక్క హృదయ తరంగాలతో అనుసంధానమై ప్రతి చర్యించ గలదా ..? ఈ భావన చాల ఆలోచింప చేస్తునది ..ధన్యవాదములు .

 • raju.s says:

  ఒకప్పుడు విలువలే ప్రాణమైన భారతదేశంలో సమాజం ఇంత నీతిహీనంగా,అనైతికంగా, నీచంగా ఎలా రూపొందిందో ..తలుచుకుంటే కంపరమెత్తుతోన్ది .మౌళి గారు అతికీలకమైన అంశాన్ని డీల్ చేస్తున్నారు..ఇటువంటి రచనలు రావాలి ఇంకా.
  రచయితకు,సంపాదకులకు అభినందనలు.
  రాజు శరద్.వాషింగ్టన్.డి.సి.

 • lalithadevi.m says:

  ఇది నిస్సందేహంగా ఒక విభిన్నమైన నవల.వర్తమాన సమాజాన్ని వినూత్న కోణంలో విప్పి చెబుతున్న తీరు బాగుంది.
  సామాజిక సమస్యలపై కథలనూ,కవిత్వాన్నీ అందించే సాహిత్యకారునిగా పాఠకులకు తెలిసిన మౌళి గారు కవితాత్మకంగా అందిస్తున్న ఈ నవల ఆసక్తికరంగా ఉంది.’ సారంగ’ ఒక మంచి కృతిని అందిస్తున్నందుకు కృతఙ్ఞతలు.
  లలితాదేవి.ఎం , హైదరాబాద్

 • srinivas.r says:

  సూర్యునిగురించి రచయిత అన్వయించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.శైలి ,కవిత్వ పరిమళంతో కూడిన వచనం
  చదువరిని గడగడా చదివిస్తోంది.ఈ నవల బాగుంది.
  శ్రీనివాస్.ఆర్ ,ముంబాయ్

 • shalaja raacharla says:

  గత మూడు వారాలుగా పరిశీలనగా ఈ సీరియల్ ను చదువుతున్నాను.ప్రారంభం,విస్తరణ …కొనసాగింపు..నవల ఒక్కో పాత్ర ప్రవేశంతో పూర్తి రూపాన్ని సంతరించుకుంటోంది.మంత్రి,ఎస్పీ పాత్రలు ఇప్పటి భారత అవినీతి సమాజరూపానికి ప్రతిబింబాలు.
  మౌళి గారికి అభినందనలు.మంచి నవలను అందిస్తున్నందుకు సంపాదకులకు కృతఙ్ఞతలు.
  శైలజ రాచర్ల.సిడ్నీ

 • bhagyalakshmi.m says:

  రచయిత అంతరంగ లోలోతులకు చేరి విషయాన్ని చేబుతూండడం ఆసక్తికరంగా ఉంది.అభినందనలు.మిగతా భాగాలకొరకు ఎదురు చూస్తాం.
  భాగ్యలక్ష్మి.ఎం. కెనడా.

 • shekhar .m says:

  ‘శూన్యం నుండి శూన్యాన్ని తీసివేసినా…’ భారతీయ తాత్విక నేపథ్యాన్ని అక్కడక్కడ ప్రస్తావిస్తూ సాగుతున్న ఈ నవల
  చాలా బాగుంది.ఎక్కడో స్విచ్ …ఎక్కడో లైట్ వెలుగడం..అని చెప్పడం బాగుంది..కథ కూడా వేగాన్నందుకుని సాగుతోంది .
  మౌళి గారికి అభినందనలు.
  శేఖర్.ఎం.కడప

 • aruna.k says:

  మౌళి గారి వచనం లో ఒక వేగం,ప్రవాహకత,మెరుపువంటి నడక ఉన్నాయి.గత మూడు వారాలుగా సునిశితంగా చదవడంవల్ల
  ఒక కొత్త విలక్షణమైన నవలను అనుభూతిస్తున్నట్టనిపిస్తోంది.మున్ముందు ఇంకా ఆసక్తికరంగా కథ సాగుతుందని ఆకాంక్షిస్తూ..,
  అరుణ.కె,శాండియాగొ

 • ramarao.m says:

  ప్రయాణం ఎక్కడినుండో అర్థమౌతోంది..ఒక లీల,ఒక విఠల్,ఒక మంత్రి.వీళ్ళతో నిండిన దేశం …దౌర్భాగ్యంగా విలవిలలాడుతోంది .దృశ్యం విదారకంగా ఉంది.చూద్దాం .
  రామారావు.ఎం.అబుదాబి

 • lakhmi damera says:

  మౌళి గారు నవల అనే సాహిత్య విన్యాసాన్ని నిర్వహించేందుకు ఒక విశాలమైన కథా కాన్వాస్ ను తయారుచేసుకున్నారు.
  చదరంగంలో కాయల్లా పాత్రలను ప్రవేశపెట్టి పేర్చారు.ఇక అవి విజ్రుమ్భిస్తాయి.ఆసక్తిగా ఉంది.చూద్దాం. రచయితకూ,సంపాదకులకూ అభినందనలు.
  లక్ష్మి.డి .ఢిల్లీ

 • anjaiah tummidi says:

  రచయిత సూర్యుని గురించి చేసిన ఇంటర్ ప్రిటేషన్ బాగుంది.రచనలోని వేగం,వచనం బాగున్నాయి.మౌళిగారికి,మంచి నవలను అందిస్తున్న సంపాదక వర్గానికి కృతజ్ఞతలు .
  అంజయ్య తుమ్మిడి ,విజయవాడ

 • janaki.d says:

  చాలా కాలం తర్వాత ఒక మంచి నవలను చదువుతున్న అనుభూతి.బాగుంది.రచయితకు అభినందనలు.
  జానకి.డి,విశాఖపట్నం.

 • akbar.Md says:

  లీల,విట్టల్ ,మంత్రి..ఇవన్నీ ప్రస్తుత భారత సమాజాన్ని ప్రతిబింబించే పాత్రలు…వీళ్ళ నడక,కదలికలు ,ప్రవర్తన ఎలా ఉండి,.నవలను ఎలా మలుపులు తిప్పుతుందో చూడాలి.మౌళి గారికి థాంక్స్.

  అక్బర్ మొహమ్మద్, చెన్నై

 • lakshmi.u says:

  మౌళి గారి ఈ వీక్లీ సీరియల్ చాలా బాగుంది.సాధారణ నవలలకంటే భిన్నమైన రీతిలో సాగుతోందీ నవల.సూర్యుని గురించిన అన్వయం బాగా నచ్చింది నాకు.
  లక్ష్మి.యు ,కాకినాడ

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)