నా ఏకాంతక్షణాలు

PrasunaRavindran

బరువైన క్షణాల్ని మోసి అలసిన పగటిని జోల పాడి నిద్రపుచ్చాక, నా కోసం మాత్రమే ఓ రహస్య వసంతం మేల్కొంటుంది.

గుమ్మం దగ్గరే, కలలు కుట్టిన చీర కట్టి, నిద్ర వాకిలి తడుతున్నా, అక్షరాన్ని ఆప్యాయంగా తడుముకుని ఎన్నాళ్ళయిందోనని ఙ్ఞప్తికొచ్చాక, నా గది గవాక్షన్నే ముందుగా తెరుస్తాను.

వెన్నెల తివాచీలు పరుస్తూ చంద్రుడూ, పన్నీరు జల్లుతూ చల్ల గాలీ నా వెనుకే వస్తారు.

 

నా అడుగుల సవ్వడి వినపడగానే ఆ పూదోట మెల్లగా విచ్చుకుంటుంది.

ఎందుకో మరి, అలిగి విరిగి పడ్డ మబ్బు తునకలు, దారంతా కాళ్ళ కింద నలుగుతూ ఎదురుచూడని ఏ రాగాన్నో అస్పష్టంగా గుణుస్తున్నట్టున్నాయ్.

ఎప్పటి ఉద్వేగానికో ఇప్పుడు పదాల్ని సమకూర్చుకుంటూ ఇక్కడొక చలిమంట వెయ్యాలనుంది.  చీకటీ , నిశ్శబ్దం సంగమించే సమయం ఎంత అపురూపం?   కీచురాళ్ళ భాష తెలిస్తే రాయలేనన్ని పదాలు దొరికేవేమో.

182447_10152600304780363_1937093391_n

 

చంద్రుడినుంచి ఒకే ఒక్క కౌగిలి పుచ్చుకున్న స్ఫూర్తితో ఎక్కడున్నా వెలిపోయే మబ్బు తునకలాగో,

అడవి నుంచి ఒకే ఒక్క రంగుని తీసుకుని గాలిలో విలీనమవుతూ సాగిపోయే పాట లాగో

నువ్వన్న ఒకే ఒక్క మాట, కొన్ని వేల ప్రతిధ్వనులుగా విడిపోయి, వెచ్చటి ఊపిరి లోంచి బయటికొస్తూ అదో రకమైన మత్తులో నన్ను ఓలలాడించిన ఙ్ఞాపకమొకటి నా ముంగురులు సవరించి వెళ్ళిపోతుంది.

 

క్షణాలన్నీ నన్నే ఎత్తుకుని లాలించే ఈ అద్వితీయమైన ఏకాంతం కోసమే పగలంతా ఎదురు చూస్తాను.  కొన్ని అరుదైన పూరేకుల్ని దోసిట దొరకపుచ్చుకుని సంతృప్తిగా  నా గది గవాక్షం వైపు సాగిపోతాను.

     – ప్రసూన రవీంద్రన్

painting: Mandira Bhaduri

Download PDF

6 Comments

  • A. Tyagaraju says:

    కవిత చాలా బాగుంది..

    త్యాగరాజు

  • NS Murty says:

    ప్రసూన గారూ,

    “కలలు కుట్టిన చీర కట్టి” అన్నప్రాయోగం బాగుంది.

    “ఎప్పటి ఉద్వేగానికో ఇప్పుడు పదాల్ని సమకూర్చుకుంటూ ఇక్కడొక చలిమంట వెయ్యాలనుంది.” ఒక nostalgic memory ని బాగా అక్షరాల్లోకి కుదించేరు.

    కవిత చాలా బాగుంది.
    అభివాదములతో

  • Saikiran says:

    సూపర్ ప్రసూన గారు. చాలాకాలమయ్యింది మిమ్మల్ని చదివి. మరిన్ని వ్రాయాలని కోరుతో…

  • Thirupalu says:

    కవిత్వమొక తీరని దాహం! అందుకే అన్నారు. మీ కవిత చాలా బాగుందండి.

  • “కీచురాళ్ళ భాష తెలిస్తే రాయలేనన్ని పదాలు దొరికేవేమో.” – ఎంత చక్కని భావన! ఆస్వాదించే మనసుకు అందని పదాలు ఉండవేమో! ఎన్నో మధుర స్మృతులను మనోవీధిలోకి మళ్ళీ తెప్పించింది ఈ కవిత.

  • హేమంతంలో వెన్నెల వేళ పారిజాతాలేవో కథలు చెప్తున్నట్టు … నేను కలగన్నానా.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)