పేరు తెలియని పిల్లవాడు

the three dancers-picaso

యవ్వనం పొద్దుతిరుగుడు పువ్వులా విచ్చుకొని తలవాల్చింది
ముసలితనమేలేని మనసు విహరిస్తోంది ఆకాశంలో
అందని ఇంద్రధనుస్సు అందుకునేందుకు

తొలియవ్వన కాంతి మేనిపై తళతళలాడేవేళ
ఎందుకు సెలఏరులా తుళ్ళిపడతావో
పురివిప్పిన నెమలిలా పరవశంతో నర్తిస్తావో
మనసును గాలిపటంచేసి ఆకాశంలోకి ఎగురవేస్తావో
నువ్వెందుకు కిలకిలా నవ్వుతావో,
నీక్కూడాతెలియదు

ఒకానొక రాత్రి
సరుగుడు చెట్లపై కురిసి జారే ముత్యాల వానని
కిటికీలోంచి తొంగి చూసే వేళ
నీ చందమామ మోముకోసం
వీధిలైట్ల క్రీనీడకింద వానలో తడుస్తూ
పేరుతెలియని పడుచువాడు నిలబడతాడు
నీకోసం మాత్రమే  నిరీక్షించే
అతడికేసి నువు విసిరేసే జలతారు నవ్వుల్ని
అతడు వొడిసి పట్టుకుంటాడు

ఎన్నో ఏళ్ళు గడిచిపోయాక, వాన వెలిసిపోయాక కూడా
అతడావేళ నీలో రేపిన అలజడి
తొలకరివాన కురిసిన
ప్రతి వానాకాలంగుర్తుకొస్తుంది

ఎవరూలేని ఓ మునిమాపువేళ
అతడిచ్చిన సంపెంగెపూలను అందుకునేందుకు
చాచిన నీ చేతివేళ్ళకు తాకిన
అతడి తడబడిన స్పర్శ తాలూకు వెచ్చదనం
చలి రాత్రులలో కప్పుకున్న రజాయిలా ఇంకా హాయిగొలుపుతుంది

దాచుకున్న పూలువాడిపోయి
జీవితపు పుటల నుండి ఎక్కడో జారిపోతాయి
ఆ పూల కస్తూర పరిమళం మాత్రం
ఏకాంత వేళల్లో
ఏకతారను మీటుతూ మనసువాకిట నిలిచి నిన్ను దిగులుగా పలకరిస్తుంది

ముసలితనమేలేని మనసును కమ్ముకుంటుంది
అతడి ఙ్నాపకం ఆకాశంలా

ఆ పడుచువాడు మళ్ళీ ఎన్నడూ తారసపడకపోవచ్చు
లేదూ తారసపడ్డా, బహుషా అతడు నిన్ను,
నువ్వు అతడ్ని గుర్తించనట్లు వెళ్ళిపొయివుంటారు
అతడి కోసం ఎదురుచూడటం మరిచిపోయినందుకే కాబోలు
ఆ పడుచువాడు ఇంకా తాజా జ్నాపకంలా నీలో మిగిలివున్నాడు.

vimala1విమల
నవంబర్‌, 2013

Download PDF

11 Comments

 • gsrammohan says:

  ఎంత బాగుందో!

 • Thirupalu says:

  ప్రేమ ఒక మెరుపు!
  ప్రేమ ఒక స్వప్నం!
  క్షణంలో మెరిసి క్షణంలో మాయమౌతుంది తరాలుగా!
  అద్బుతం!

 • NS Murty says:

  విమల గారూ,

  This is just beautiful.

  అభివాదములతో.

 • చలి రాత్రులలో కప్పుకున్న రజాయిలా ఇంకా హాయిగొలుపుతుంది

 • balasudhakarmouli says:

  కవిత్వం యుద్ధమే కాదు. పోరాటమే కాదు. జీవితంలో ప్రతి చలనాన్నీ కవిత్వం చేయాలి. సర్వ అంశాలను కవిత్వంలోకి ప్రవహింపజేయాలి. అని నెరూడా అంటారు. మీ కవితకు వో ప్రత్యేకత ఉంది. కవిత్వం ఎప్పుడో సంకెళ్లను తెంపుకుని వచ్చేసింది. వ్యక్తం చేసిన గొంతుని పట్టించుకోవాల్సిన కవిత్వం. ఆ గొంతు అందరు స్త్రీలది. నిజంగా ప్రేమలో వో కోణాన్ని అద్భుతంగా కవిత్వం చేసారు. చాలా సున్నితంగా.

  పోరాట కవిత్వాన్ని ప్రేమించే నేను … మీ కవిత్వంనూ ప్రేమగా ప్రేమిస్తున్నాను.

 • Mohanatulasi says:

  వావ్…తెలిసిన మాటనే సరికొత్తగా ఆవిష్కరించారు…అద్భుతంగా ఉంది మొదటి నుండి చివరి వరకూ….!

 • prasuna says:

  చాలా బావుందండి. ఆసాంతం సుందరంగా ఉంది.

 • E sambukudu says:

  విమలగారు రాయవలసిన పోయమ్ కానప్పటికి ,పోయంగా బాగుంది.

 • gsrammohan says:

  శంబూకుడుగారూ, విమల గారు రాయాల్సిన పోయెమ్‌ ఎందుకు కాదో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)