వీలునామా- 23వ భాగం

veelunama11
శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

హేరియట్ మనసు దోచిన ఫ్రాన్సిస్

హేరియట్ చుట్టూ చాలా మంది ఆడా మగా స్నేహితులున్నా, ఆమెని నిజంగా ఆరాధించి అభిమానించిన మగవాళ్ళు లేరు. అయితే దీనికి తన గొప్పతనమే కారణమన్నది ఆమె ప్రగాఢ అభిప్రాయం.  తమ కుటుబం గొప్పతనమూ, తన అందచందాలూ, తెలివి తేటలూ చూసి మగవాళ్ళు భయపడి పోతున్నారన్న ఆలోచన ఆమె అహంకారాన్నెంతో తృప్తి పరచింది.

స్వతహాగా ఆమె తెలివైనదే. అయితే ఆమె ఆలోచనల వైశాల్యం చాలా చిన్నది. తనకి తెలిసిన విషయాలూ, తనకి ఆసక్తికరమైన విషయాలు మాత్రమే ప్రపంచానికంతటికీ నచ్చాల్సిన విషయాలన్నది ఆమె నమ్మకం. ఇంకా చెప్పాలంటే తనకి తెలియని విషయాలకి ప్రపంచంలోనే ఏ విలువా ఉండదనుకుంటుంది ఆమె. ఆత్మ విశ్వాసం మంచిదే. అయితే ఆత్మ విశ్వాసానికీ, అహంకారానికీ మధ్య వుండే గీత చాలా సన్నది.

బ్రాండన్ హేరియట్ గురించి తన సొంత అభిప్రాయం కంటే ఆమె అభిప్రాయాన్నే నమ్మాడు. అందుకే తన కంటే ఆమె ఎంతో గొప్పదనీ, సాంఘికంగా, ఆర్థికంగా తన కంటే ఆమె ఎన్నో మెట్లు పైనుందని అనుకున్నాడు. హేరియట్ కి అతని పట్ల గొప్ప గౌరవమేమీ లేకున్నా, అతనికి తన పట్ల వున్న గౌరవమూ, పది మందిలో అతను తన మీద ప్రకటించే అభిమానమూ నచ్చాయి.

ఎలాగూ ఎవరో ఒకరిని పెళ్ళాడక తప్పదు. అతను ఎటూ ఇంగ్లండులోనే వుండబోతున్నాడు కాబట్టి అతన్ని పెళ్ళాడడంలో తనకేమీ నష్టం వుండదని భావించింది హేరియట్. అప్పుడప్పుడూ విక్టోరియాకి తిరిగి వెళ్తానని అంటూ వుంటాడు కానీ, అదంతా తను ఎటూ పడనివ్వదు. తన మాట సాగించుకోవడం ఎలాగో తనకి బాగా తెలుసు. కాబట్టి బ్రాండన్ తో పెళ్ళికి అన్ని విధాలా సిధ్ధమయింది హేరియట్.

అయినా సరే, ఈ హొగార్త్ గారినీ తన ఆరాధకులలో ఒకరిగా చేర్చుకోక తప్పదనుకుంది. బ్రాండన్ అతని గురించి మాట్లాడుతూ, “అచ్చం నీలాటి వాడే” అన్నాడు. నిజంగానా? అయితే తన గురించేమనుకుంటాడు? ఈ రోజు తన అలంకరణా, వాక్చాతుర్యాలతో అతన్ని మంత్రించి వేస్తాను, అనుకుంది. అది చూసి బ్రాండన్ కొంచెం ఉడుక్కుంటాడేమో! ఉడుక్కోనీ, అదీ కొంచెం సరదాగానే వుంటుంది, అని సరిపెట్టుకుంది. స్త్రీ సహజమైన సానుభూతీ, ఆలోచనా ఆమెకుండినట్టయితే అప్పటికే బ్రాండన్ తన ప్రవర్తన పట్ల కొంచెం చిరాగ్గా వున్నాడనీ,  కాబోయే  భర్తని కొంచెం శాంత పర్చాలనీ ఆమెకి తట్టి వుండేది. తనేసుకున్న కొత్త చెప్పులు ఎక్కడ కరుస్తున్నాయో చెప్పలేని మనిషిలా, ఆమె తన ప్రేమికుడు అప్పటికే దూరమవుతున్నాడని గ్రహించలేక అతన్ని ఇంకా  దూరం చేసుకుంది.

ఆ రోజు సాయంత్రం ఆమె హొగార్త్ తో చాలా చనువుగా మాట్లాడింది. మాట్లాడే ప్రతీ విషయంలోనూ బ్రాండన్ కేమాత్రం తెలియని విషయాలే ఎన్నుకుంది. అతన్ని ఉడికించి అతను ఈర్ష్య పడుతూంటే చూసి సరదాగా నవ్వుకోవచ్చనుకుంది. అయితే జరిగింది వేరొకటి.

బ్రాండన్ కెందుకో తనని చుట్టుకున్న సంకెళ్ళు- అవి ప్రేమ సంకెళ్ళు కావు, తను అలవాటు చొప్పున తగిలించుకున్న మొహమాటపు సంకెళ్ళు, వాటంతట అవే విడిపోతున్నట్టు భావించాడు. అతని మన్సులో యే మూలో హేరియట్ పట్ల వున్న అభిమానం తుడిచి పెట్టుకుపోయింది. ఆవేళ అతను తనకీ ఫ్రాన్సిస్ కీ మధ్య హేరియట్ కాకుండా ఎల్సీ కూర్చుని వుంటే ఇంకాస్త హాయిగా గడిచి వుండేదనుకున్నాడు.

ఎల్సీ ఎక్కడుందా అని వెతికాడు. ఆమె ఫ్రాన్సిస్ కటువైపు, ఇంకొక ఆస్ట్రేలియన్ అతనికీ మధ్య కూర్చుని వుంది. అతనేదో చెప్తున్నట్టున్నాడు, శ్రధ్ధగా వింటూ, మధ్య మధ్య  లోగొంతుకతో ఏదో అంటూంది.

అతనికి వున్నట్టుండి రెన్నీ గారింట్లో జరిగిన విందు గుర్తొచ్చింది. ఆ రోజు ఎంత సంతోషంగా గడిచింది! అతను నిట్టూర్చాడు. అతని చూపులు పదే పదే ఎల్సీ వైపు పరిగెత్తడం హేరియట్ పసిగట్టింది. వెంటనే తనూ ఆ సంభాషణలోకి దూకింది.

“మీరెన్నైనా చెప్పండి మిస్టర్ డెంస్టర్!  ఈ ఆత్మలూ వాటితో మాట్లాడడం వంటి విషయాలు నేను చచ్చినా నమ్మను. నేను ఈ కాలపు సైన్సు మనిషిని.”

“సైన్సు మాట నిజమే అయినా నేను నా కళ్ళతో చూసిందాన్ని అబధ్ధమంటే ఎలాగండీ? ఆ మాటకొస్తే సైన్సు వివరించలేని విషయాలూ చాలానే వున్నాయి. అందువల్ల మొత్తం సైన్సునే తప్పు పట్టలేం కదా?” అన్నాడు సదరు డెంస్టర్ అనునయంగా.

“నిజమో అబధ్ధమో మాట అటుంచండి. ఇలా ఆత్మలతో సంభాషణవల్ల మీకేం ప్రయోజనం?” కుతూహలంగా అడిగింది జేన్.

” చాలా ప్రయోజనాలున్నాయి మేడం! ముందుగా మన కళ్ళతో చూసి, మన అనుభవంలోకి వచ్చేది మాత్రమే కాక ఆ బయట కూడా పెద్ద ప్రపంచం వుందన్న నా నమ్మకం బల పడుతుంది. దాంతో సంకుచిత దృష్టి తగ్గుతుంది. నిజంగా మనల్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయిన ఆత్మీయుల బాగోగులు తెలుస్తాయి. మనిషి పోగానే మరిచి పోలేం కదా? భౌతికంగా శరీరం కృశించి నశించినా ఆ జీవ శక్తి మిగతా పదార్థాలలోనో, ప్రకృతిలోనో వచ్చి చేరుతుందన్నది నా విశ్వాసం. ఆ జీవ శక్తికి మరణం లేదు. నేను సంభాషించేది ఆ జీవ శక్తితోనే.”

అతన్ని మధ్యలోనే ఆపింది హేరియట్.

veelunama11

“ఆగండాగండి! ఇప్పుడు మనిషీ మరణించక్కర్లేదంటున్నది సైన్సు.మానవుని ఆయు ప్రమాణాలని ఎంత వరకైనా పొడిగించవచ్చంటున్నారు వైద్యులు. అందుకే నాకు భౌతిక ప్రపంచం గురించిన విషయాల్లో సైన్సుని నమ్మి, ఆధ్యాత్మిక విషయాలకి బైబిలు ని సంప్రదిస్తే సరిపోతుందనిపిస్తుంది. మీకది సరిపోక కుర్చీలూ టేబుళ్ళూ వుపయోగించి ఆత్మలతో మాట్లాడుతున్నాననుకుంటున్నారు.” హేళనగా అంది.

“బైబిలు మానవుని మరణాంతర జీవితం గురించి కొంచెం గజిబిజిగా వుందనిపిస్తోంది. అసలు నిజానికి, మానవుని కి ఎడతెగని ఆయు ప్రమాణం అవసరమంటారా? నాకా ఆలోచనే అంత గొప్పగా అనిపించదు. భూమ్మీదకి వచ్చి తగినంత కాలం జీవితాన్ననుభవించాక భగవంతుని చేరుకోవడంలో ఎంతటి హుందాతనమూ, నిరంతర ప్రవాహ ధర్మమూ వున్నాయి? ఎల్ల కాలం భూమ్మీదనే వుండి మనం మాత్రం బావుకునేదేముంది?”

“మానవుని మరణాంతర జీవితం గురించి బైబిలు కావాలనే కొంచెం సందిగ్దంగా వుంటుందేమో.  ప్రతీ మనిషీ తనదైన స్వర్గాన్ని ఊహించుకుంటాడు. అలాటప్పుడు అందరికీ కలిపి ఒకే రకమైన స్వర్గ నరకాల గురించీ చెప్పడం కష్టం కదా? అందువల్లనేమో. అయితే స్వర్గంలోనైనా మనిషికి ఙ్ఞాపకాలూ, తాను అన్న భావనా వుంటే బాగుంటుంది. అవి లేనప్పుడు ఏ స్వర్గమైనా మనిషికి ఒరగబెట్టేదేం వుండదు.” అన్నది ఎల్సీ తన అభిప్రాయం చెప్తూ.

“నాకూ ఈ విషయాల గురించి మొదట్లో ఏమీ తెలిసేది కాదు. ఆత్మలతో సంభాషించిన తర్వాతే నాకు మరణానంతర జీవితం గురించీ, స్వర్గ నరకాల గురించీ, దేవుని గురించీ, నిరంతరంగా ప్రవహంచే ప్రేమ గురించీ అవగాహన ఏర్పడింది,” అన్నాడు డెంస్టర్.

“కళ్ళతో చూస్తేనే నమ్ముతానంటే అది నమ్మకమే కాదు, అన్నాడు సెయింట్ పాల్. బహుశా స్వర్గ నరకాల గురించి ఆలోచనా, ఆత్మల గురించిన పరిఙ్ఞానమూ మనిషికి ఒక భద్రత కలిగిస్తాయి కాబోలు. అందరికీ ఆ భద్రత అవసరమనిపించదు. కొందరికి అవసరమనిపిస్తుంది. అంతే, ” అన్నాడు ఫ్రాన్సిస్ తేల్చేస్తూ.

” అసలు మీరందరూ ఒక సారి నాతో ఒక సియాన్స్ సెషన్ కు వస్తే బాగుంటుంది. మీరూ కళ్ళారా చూడొచ్చు,” అన్నాడు డెంస్టర్.

“నేను తప్పక వచ్చి చూస్తాను,” ఉత్సాహంగా అంది లిల్లీ ఫిలిప్స్.

“నేను చచ్చినా రాను,” ఖచ్చితంగా అంది హేరియట్.

“నాకెందుకో ఇలాటి వాటి మీద పెద్ద ఆసక్తి లేదు. నేను రాలేను,” అన్నాడు స్టాన్లీ ఫిలిప్స్.

“నేనూ రాలేను. ఎల్సీ చెప్పినట్టు ఎవరి స్వర్గం వారిది. ఎప్పుడో జరగబోయే దాని గురించీ, మన చేతిలో లేని దాని గురించీ ఆలోచనలతో ప్రయోజనం ఏముంది?” అన్నాడు బ్రాండన్.

సాధారణంగా ఏ విషయం గురించి ఎలాటి అభిప్రాయమూ చెప్పని బ్రాండన్ ఆ రోజు అభిప్రాయం చెప్పడమే కాక, ఎల్సీ అభిప్రాయాన్ని బలపర్చడం హేరియట్ కి చిర్రెత్తించింది.

ఫ్రాన్సిస్ మాత్రం తనతో వెళ్ళడానికి ఒప్పుకునే వరకూ డెంస్టర్ వదల్లేదు.

జేన్ పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్ళిపోయింది. ఎల్సీ గదిలోకి వెళ్ళి లిల్లీ ఫిలిప్స్ కొరకు మొదలు పెట్ట్టిన టోపీ పుర్తి చేసింది. వాళ్ళిద్దరూ మళ్ళీ కిందికొచ్చేసరికి ఇంకా అంతా కబుర్లలోనే వున్నారు.  ఎల్సీ మర్నాడు తెల్ల వారు ఝామునే లేచి హేరియట్ టోపీ కూడా పూర్తి చేసేద్దామనుకొంది. నిజంగానే వదిన గారు అందమైన బోనెట్ పెట్టుకొని, తాను పాతది పెట్టుకొని మొహం చిన్న బుచ్చుకుంటే ఏం బాగుంటుంది!

ఆ నిశ్చయంతో ఎల్సీ వచ్చి సంతోషంగా అందరూ పాటలు పాడుతుంటే వింటూ కూర్చుంది. తన టోపీ పని చేయకుండా ఆట పాటలతో కాలం వెళ్ళ బుచ్చుతోందని హేరియట్ ఉడుక్కుంది.

ఆ రాత్రి హేరియట్ పొద్దు పోయేవరకూ అందరి ఆనందం కోసం పియానో వాయిస్తూ పాటలు పాడింది. హేరియట్ కి చక్కటి కంఠమూ, మంచి పరిఙ్ఞానమూ వుండడం వల్ల పాటలు చాలా రక్తి కట్టాయి. హేరియట్, జార్జియానా, ఇద్దరక్కచెల్లెళ్ళల్లోనూ, డాక్టరు గారికి హేరియట్ అంటేనే ప్రీతి ఎక్కువ, బహుశా సంగీతం వల్లనే కాబోలు. స్టాన్లీకి కూడా చెల్లెలి పాటంటే చాల ఇష్టం. ఇలా ఇంట్లో నలుగురూ భోంచేసింతరవాత ఆమె కూర్చుని అందరి మధ్యా పాడుతూంటే ఇంకా ఇష్టం. తన భార్యకి కూడా కొంచెం సంగీతం చెప్పించాలని ప్రయత్నించాడు కానీ, లిల్లీకి సంగీతం అబ్బలేదు. అయితే స్టాన్లీ పెద్ద కూతురు ఎమిలీ మాత్రం మళ్ళీ చక్కగా పాడగలదు. అందుకే ఇప్పుడు కూతురికి శ్రధ్ధగా సంగీతం చెప్పిస్తున్నాడు స్టాన్లీ.

అందుకే ఆ రాత్రి పిల్లలతో పాటు పడుకోకుండా ఎమిలీ పెద్దలతో కూర్చుని పాటలు పాడింది. అందరూ తెలిసిన వారి మధ్య రెండు మూడు సార్లు పాడితే గానీ ధైర్యం రాదు మరి, అంది లిల్లీ ఫిలిప్స్.

“ఎమిలికి ధైర్యం లేకపోవడమేమిటి, విచిత్రం కాకపోతే! కాలనీల్లో ప్రకృతి మధ్య పెరిగే పిల్లల్లో చాలా ధైర్య సాహసాలుంటాయి. ఇక్కడ ఇంగ్లండులో సురక్షితంగా ఎరిగే అమ్మకూచిల్లా కాదు! ” వేళాకోళంగా పక్కనే కూర్చున్న ఎల్సీతో మెల్లిగా అన్నాడు బ్రాండన్.

“నాకు ఎమిలీ అంటే చాలా ఇష్టం. ధైర్యమే కాకుండా విషయాలని చాలా త్వరగా గ్రహించగలదు. అన్నిటికంటే, నేనంటే తనకి చాలా ఇష్టం. నాకేమో నన్నిష్టపడే చిన్న పిల్లలంటే ఇష్టం,” నవ్వుతూ అంది ఎల్సీ.

“అలాగా? మరి నిన్నిష్టపడే పెద్ద వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి?” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు బ్రాండన్. సిగ్గుతో మొహం ఎర్రబడింది ఎల్సీకి.

“ఎల్సీ! అత్త పాట  ఆపింతరవాత నువ్వొక పాట పాడాలి. నీ పాటలో చక్కగా అన్ని పదాలూ వినిపిస్తాయి నాకు,” అంది ఎమిలీ ఎల్సీ తో.

“నాకసలు కొంచెం కూడా పాట రాదు. దానికి తోడు నేనొక్కసారి కూడా సంగీతం క్లాసులకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను పాటెత్తుకుంటే..”

“అంతా వుత్తదే బ్రాండన్. ఎల్సీ చక్కగా పాడుతుంది. అందులోనూ ఊరికే క్లాసులో చెప్పే పాటలు కాకుండా, కొన్నిసార్లు కవితలూ కథలూ కూడా పాటల్లా పాడి వినిపిస్తుంది.” ఎమిలీ చెప్పింది.

“ఆహా! ఎమిలీ ఇవాళ ఎల్సీ రహస్యం బయట పెట్టేసింది. ఇహ పాడేయి ఎల్సీ!” బ్రాండన్ ఉత్సాహంగా అన్నాడు.

“ఇది మరీ చోద్యంగా ఉంది. నా పాట నేనూ, లేదా చిన్న పిల్లలు తప్ప ఇంకెవరూ వినలేరు. అర్థం చేసుకోండి.”

“అరెరే! నువ్వు నన్ను సరిగ్గా అర్ర్థం చేసుకోలేదు ఎల్సీ. నేను చిన్న పిల్లలల్లోకే చిన్న పిల్లాణ్ణి. ఇంతవరకూ నేను ఒక్కరి పాటను కూడా విమర్శించలేదంటే నమ్ము.”

“ఏం వాగుడు కాయవే నువ్వు! పాట శ్రధ్ధగా వింటూ కుదురుగా కూర్చోలేవు. అయినా ఇంత రాత్రి పడుకోకుండా పెద్దవాళ్ళతో నీకేం మాటలు?” పాట ముగించి కోపంగా మేనకోడలితో అంది హేరియట్.

“ఇవాళా నాన్న గారు నన్ను రాత్రి పది వరకూ మేలుకోవచ్చని అన్నారు. అయినా మేమిద్దరం ఏదో పాత ఆస్ట్రేలియా రోజుల గురించి మాట్లాడుకుంటూన్నాం, నీకెందుకు?”

“వేలెడు లేవు, నీకు పాత రోజుల ఙ్ఞాపకాలా?”

“అవును! మా ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది తెలుసా. అప్పుడు ఈ బ్రాండన్, ఇంకా పెగ్గీ మమ్మల్ని కాపాడారు. కదూ బ్రాండన్?”

“చాల్లే వూరుకో! ఇంటి పక్కనే వున్నా కాబట్టి పరిగెత్తుకొచ్చా. ఇప్పుడా సంగతులెండుకు, పోనీలే!” బ్రాండన్ కొట్టిపారేసాడు.

“కాదు కాదు! చేయంతా బాగా కాలి పెద్ద మచ్చ కూడా పడింది. చూపించు బ్రాండన్,” ఎమిలీ గోల చేసింది. షర్టు చేతులు పైకి మడిచి పెద్ద మచ్చని చూపించే వరకూ వదల్లేదు.

ఇంగ్లండు మర్యాదస్తుల ఇంట్లో అడవాళ్ళముందు షర్టు చేతులు పైకి మడవడం ఏమిటి! ఈ ఆస్ట్రేలియన్లకి మంచీ మర్యాదా తెలియదు, విసుక్కుంది హేరియట్. అదే ఫ్రాన్సిస్ గారు, ఎంత మర్యాదా, హుందా తనమూ, నెమ్మదీ! ఎంతైనా ఇంగ్లండులో వుండేవాళ్ళ నాజూకు ఆస్ట్రేలియాలో పొదల మధ్య తిరిగే మొరటు మనుషులకుంటుందా! తన పాటని మర్యాదగా విన్నాడు, పక్కవాళ్ళతో కబుర్లేసుకోకుండా. పాటని మెచ్చుకున్నాడు కూడా.. మర్నాడు తనని ఒక చిత్ర కళా ప్రదర్శనకి తీసికెళ్తానన్నాడు కూడా! ఆ ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి తన టోపీ ఎల్సీ పూర్తి చేస్తుందోలేదో నన్న ఆందోళన ఒక్కటే మిగిలిపోయింది ఆమెకి ఆ రాత్రి.

***

(సశేషం)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)