నీకు తెలుసా?!

Padmapriya C V S

మేఘం గర్జించకుండానే వర్షిస్తుంది…

గుండెల్లో వేదన పెదవి దాటకుండా కంట ప్రవహించినట్టు..

ఘనీభవించిన సాంద్ర వేదన, కల్లోల మానసంలో…

ప్రళయ గర్జనై, తుఫానై, సముద్రాంతరాళంలో

మండే అగ్నిపర్వతమై లావాలు విరజిమ్ముతుంది….

సముద్రాలు కెరటాలై తీరాల్ని చీల్చకుంటూ పరిగెడుతాయి,

పారిపోతున్న కలల రహదారుల్ని చేజారకుండా పట్టుకోటానికి !!!

నీకు తెలుసా,

ఆకాశం ప్రతి రోజూ చీకట్లను తరుముతూ

నిరంతర ఆశా ప్రవాహమై ఉషస్సులోకి వికసిస్తుందని?

సముద్ర గర్భంలోకి  మనస్సుని విసిరేసి తొక్కిపెట్టటం సాధ్యమా?

పర్వత సానువులపై  సౌరభాల్ని విరజిమ్మే శక్తి దానికి ఉన్నప్పుడు?

కన్నీటికి జీవితాన్ని సమర్పించటం సాధ్యమా?

వెలుగు మతాబులు, చిర్నవ్వుల దివ్వెలు –

ఆనందపు చిరుజల్లులు  విరజిమ్మే శక్తి మన సొంతమైనప్పుడు?

1452516_10151954442429158_1641434253_n

నీకు తెలుసా…

మైదానంలో, వసంత తాపానికి సొమ్మసిల్లే పువ్వుకూడా,

రాలి భూమిని తాకి  పరవశిస్తుందని?

ప్రతి దుఃఖోద్వేగానికీ ఆవలి తీరం ఒకటి ఉంటుందని,

అది వెన్నెల జలతారై మనసును కమ్మేస్తుందని,

ఆత్మానందపు దరహాసమై ఎదను ప్రజ్వలిస్తుందని?

నాకు ఖచ్చితంగా తెలుసు –

మనిషి దుఃఖంలో రగిలినట్టే,

ఆనందంలోనూ  తల్లీనుడౌతాడనీ,

జీవించి గెలుస్తాడని – తన అస్తిత్వంతో

పునీతుడై  తరిస్తాడని!!!

సి వి యస్ పద్మప్రియ

ఛాయాచిత్రం: దండమూడి సీతారాం

***

Download PDF

6 Comments

  • వేదన విరజిమ్ముతూ కూడా,. ఆనందపు అస్థిత్వాన్ని అంటిపెట్టుకున్నారు,. బాగుందండి.

  • పద్మప్రియ says:

    థాంక్స్ ఆండీ భాస్కర్ గారూ.

  • Narayana says:

    సానుకూలం…ఆశావాదం అణువణువునా తొణికిసలాడిన మి కవిత చాలా బాగుంది పద్మప్రియ గారు.
    ఇలాంటి కవితలన్నీ సేకరించి…పుస్తకం వేసి….నిరాశామయులకి ఇచ్చి చదివిస్తే….?
    ఆత్మహత్యల లాంటి ధోరణులు తగ్గి బతుకు-వెలుగులు తప్పక చవి చూస్తారనిపిస్తోంది.
    అభినందనలు,
    నారాయణ గరిమెళ్ళ.

  • పద్మప్రియ says:

    థాంక్స్ అండీ నారాయణ గారు.

  • రెడ్డి రామకృష్ణ says:

    “మేఘం గర్జించకుండానే వర్షిస్తుంది…

    గుండెల్లో వేదన పెదవి దాటకుండా కంట ప్రవహించినట్టు,”

    చాలా బాగునండి పద్మప్రియగారూ ,
    కవిత్వం కూడా ఏరకమైన ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఒక్కోసారి అప్రయత్నంగా అలావచ్చేస్తున్ది మీ కవితలాగా .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)