యయాతి కథావేదిక పశ్చిమాసియా!?

Rambatla Krishna Murthy
కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

మనం పొగమంచుకు దూరంగా ఉండి చూస్తున్నప్పుడు అది ఆవరించిన వస్తువులు స్పష్టంగా కనిపించవు. పొగమంచులోకే మనం వెళ్ళడం ప్రారంభించామనుకోండి…అప్పుడవి స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో మనం మన భౌతిక నేత్రాల సాయమే తీసుకుంటాం తప్ప అతీంద్రియదృష్టిని ఆశ్రయించం.

పురాణ, ఇతిహాసకథల్లోకి వెళ్ళడం కూడా అలాగే ఉంటుంది. వాటిని కాలమనే పొగమంచు కప్పుతుంది. అందువల్ల అవి అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ  అస్పష్టతను తొలగించే విషయంలో స్థూలంగా రెండు వైఖరులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది, ఆ కథలను కప్పిన పొగమంచుతో, అందువల్ల ఏర్పడిన అస్పష్టతతో సహా వాటిని ఉన్నవున్నట్టుగా తీసుకోవడం. వాటిని భౌతికవాస్తవికత అనే కొలమానంతో హేతుదృష్టినుంచి చూడవద్దని చెప్పడం. మరి అస్పష్టతను తొలగించడం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎంత పనికిరాదని శాసించినా హేతుదృష్టి చికాకు పెడుతూనే ఉంటుంది. దానినుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం…భౌతికనేత్రం స్థానంలో అతీంద్రియనేత్రం తీసుకువచ్చి ఆ కథలను భౌతికవాస్తవికతనుంచి వేరుచేసి అతీంద్రియ మార్గం పట్టించడం. మతమూ, విశ్వాసమూ, ఆ రెండూ ప్రాబల్యం వహించే సంప్రదాయమూ ఈ మార్గాన్ని నిర్మించి దానికి పెట్టని కోటలా కాపలా కాస్తుంటాయి.

అయితే, అవి మీ అన్వేషణను అడ్డుకోవు. కాకపోతే, మీ అన్వేషణ మీ ఇష్టానుసారం సాగడానికి వీల్లేదు; మేము  అనుమతించిన పరిధిలోనే సాగాలని శాసిస్తాయి. ఇంతకు ముందే ఒకసారి చెప్పినట్టు ఈ సంప్రదాయ శాసనానికి తలవంచడం శతాబ్దాల కాలగతిలో ఎంత అసంకల్పితచర్యగా మారిపోయిందంటే, పురాణ ఇతిహాసకథలను పరిశీలించేటప్పుడు మన భౌతికనేత్రం దానంతట అదే మూసుకుపోయి, అతీంద్రియనేత్రం అప్రయత్నంగా తెరచుకుంటుంది.

కవిత్రయభారత (టీటీడీ ప్రచురణ) వ్యాఖ్యాతలు పైచూపులకే స్పష్టంగా కనిపించే కొన్ని వైరుధ్యాలను ఎలా దాటవేశారో వెనకటి వ్యాసాలలో చెప్పుకున్నాం. అదే ఇందుకు  తార్కాణం.

రెండో మార్గం, పైన చెప్పినట్టు పొగమంచు ఆవరించిన వస్తువులను స్పష్టంగా పోల్చుకోడానికి మన మామూలు భౌతికనేత్రాన్ని ఉపయోగించుకోవడం. జాగ్రత్తగా గమనిస్తే, ఇది మార్గాలలో తేడాయే తప్ప చూసే వ్యక్తులలో తేడా కాదని మీకే అనిపిస్తుంది. నేనే కాదు, మీరైనా సరే, భౌతికనేత్రంతో పురాణ ఇతిహాసకథలను చూడదలచుకుంటే అవి మీకు భిన్నంగానూ, మన సాధారణబుద్ధికి అర్థమయ్యేవిలానూ కనిపిస్తాయి. వాటిలోని పాత్రలు మనలానే రక్తమాంసాలు, ఈతిబాధలు, రాగద్వేషాలు వగైరాలు కలిగిన మనుషుల్లానే కనిపిస్తాయి. ఒకానొక కాలంలో వాళ్ళు కూడా మనలానే జీవించారనిపిస్తుంది. అదే మీరు అతీంద్రియనేత్రంతో చూడదలచుకుంటే, ఆ పాత్రలు భూమికీ, ఆకాశానికీ మధ్య గాలిలో ఈదుతున్నట్టు కనిపిస్తాయి. మీరు ఏ నేత్రంతో  చూడదలచుకున్నారనేది మీ ఇష్టం.

అంతిమంగా చెప్పాలంటే, ఇది ‘ఛాయిస్’ కు సంబంధించిన ప్రశ్న.

పురాణ ఇతిహాసకథలను కప్పింది కాలం అనే పొగమంచు కనుక, ఎంతో కాలంగా ఆ పొగమంచు అలాగే ఉండిపోయింది కనుక; అది కప్పిన కథలు, పాత్రలు అస్పష్టంగానే కాక మనకు అపరిచితాలుగా కూడా మారిపోతాయి. అప్పుడు వాటిని చూడడానికి భౌతికనేత్రంతోపాటు ఇతరేతర వనరులు కూడా అవసరమవుతాయి. అయితే, అన్వేషణే మన వంతు తప్ప ఆ అన్వేషణ రెండు రెళ్ళు నాలుగన్నంత కచ్చితమైన ఫలితాలను ఇస్తుందన్న హామీ ఏమీ ఉండదు. అయితే, ఒక్కొక్కసారి ఫలితం కన్నా అన్వేషణే ఉత్తేజకరంగానూ, ఉత్సాహవంతంగానూ ఉంటుంది. ఇంకో సంగతి ఏమిటంటే, ఈ అన్వేషకుని స్థానంలో ఇప్పుడు నేను ఉండచ్చు కానీ, ఒకవేళ మీరే ఉంటే నేను ఎదుర్కొనే ప్రశ్నలనే మీరు కూడా ఎదుర్కొంటారు.

కనుక,  అసలు విషయంలోకి వెడుతూ అన్వేషణలో ఉండే మజాను కలసి ఆస్వాదిద్దాం.

   ***

యయాతి-దేవయాని-శర్మిష్టల కథను ఒక స్పష్టమైన చారిత్రక సందర్భంలో ఇమడ్చగలమా అనే ప్రశ్న వేసుకుని, ముందుగా మహాభారతం ఆధారంగానే యయాతి ఎంత ప్రాచీనుడో అంచనా వేయడానికి ప్రయత్నించాను. అందులో ఇచ్చిన రాజుల పట్టికలో, యయాతినుంచి పాండవుల మునిమనవడైన జనమేజయుని వరకూ (జనమేజయుని వరకే ఎందుకంటే, అతడే మహాభారతప్రసిద్ధులైన రాజులలో చివరివాడు) లెక్కిస్తే 26 తరాలు లెక్కకు వచ్చాయి. ఈ పట్టిక ఎంతవరకూ ప్రామాణికం, ఈ మధ్యలో కొన్ని తరాలు ఎగిరిపోయి ఉండే అవకాశం లేదా అన్న అనుమానానికి కచ్చితంగా అవకాశముంది కనుక; మొత్తం మీద యయాతి అతి ప్రాచీనుడని గ్రహించే మేరకే దీనిని తీసుకుందాం.

యయాతి ప్రాచీనతను స్థాపించే అంతకంటే ముఖ్యమైన వివరం ఏమిటంటే, అతని తండ్రి నహుషుడు ఇంద్రపదవికి ఎన్నిక కావడం. ద్వీప, అరణ్యాలతో కూడిన భూమండలాన్ని అంతటినీ తన బాహుబలంతో పాలించిన నహుషుడు నూరు యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడని మహాభారతం చెబుతోంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ‘వేదభూమి’ అనే వ్యాససంపుటిలో ’వేదకాలపు ఆయగా’ర్ల గురించి రాస్తూ ఇంద్రపదవికి ఎన్నిక కావడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్పారు:  అతడు నూరు యాగాలు చేసినవాడై ఉండాలి. అందుకే ఇంద్రుడికి ‘శతక్రతు’ వనే బిరుదు ఉంది. అతడు బలిష్ఠుడై ఉండాలి. మంచి ధనవంతుడు, విద్వాంసుడు అయుండాలి. మూడేళ్లకు మించిన ఆహారపు నిల్వలు ఉన్నవాడై ఉండాలి. అలాంటివాడే సోమపానానికి కూడా అర్హుడు. ఒక కొడుకును కని ఉండాలి. జుట్టు నెరిసి ఉండకూడదు!

అయితే, ఇన్ని అర్హతలూ ఉన్న ఇంద్రుడు సమాజ సేవకుడే కానీ, నిరంకుశప్రభువు కాదు. ఇంద్రుడు కాక మరో అయిదుగురు సమాజసేవకులు ఉన్నారు. వారు: అగ్ని, యముడు, వరుణుడు, నాసత్యులు, అంటే అశ్వినీ దేవతలు. సేవకులలో ఇంద్రుడిది ప్రథమస్థానం.  గోగణాన్ని దొంగల బారినుంచి రక్షించడం, ఇతరుల గోగణాన్ని స్వాధీనం చేసుకోవడం, యుద్ధాలకు నాయకత్వం వహించడం ఇంద్రుడి బాధ్యతలు. అగ్ని యజ్ఞ నిర్వాహకుడు. యముడు గణధర్మ పరిరక్షకుడు. వరుణుడు జలవనరులను నిర్వహించేవాడు. ఇక అశ్వినీ దేవతలు ఇద్దరిలో అశ్విని నేత్రవైద్యుడు. అతనితోపాటు ఉండే అశ్విపుడు భూతవైద్యుడు. సమాజసేవకులనే అర్థంలో ఈ ‘ఆయగా’ర్ల సంప్రదాయం నిన్న మొన్నటి వరకూ కొనసాగింది. కాకపోతే వీరి సంఖ్య పన్నెండుకు పెరిగి ‘పన్నిద్దరు ఆయగార్లు’ అనే మాట ప్రసిద్ధిలోకి వచ్చింది. చర్మకారులు, కుంభకారులు(కుండలు చేసేవారు), వడ్రంగులు, కమ్మరులు, రజకులు వగైరాలు ఈ జాబితాలోకి వస్తారు. సంఖ్య పెరగచ్చు కానీ, ఏదో ఒక రూపంలో ఈ వ్యవస్థ ఇప్పుడూ ఉంది.

ప్రస్తుతానికి వస్తే; మహాభారతం, ఆదిపర్వంలో చెప్పిన రాజుల పరంపరలో ఇంద్రపదవిని నిర్వహించిన రాజుగా నహుషుడు ఒక్కడినే చెప్పారు. కనుక అతడు అతి ప్రాచీనుడయుండాలి. ఎందుకంటే, అప్పటికి రాజరికాన్ని ఇంద్రపదవితోనే సంకేతించేవారు. ఆ తర్వాత ఇంద్రుని ఒక దేవుడిగా మార్చి రాజును అతనినుంచి విడదీశారు. ఇంద్రుడే కొందరిని రాజుగా నియమించడం కూడా కొన్ని ప్రారంభకథలలో కనిపిస్తుంది. వసురాజు ఒక ఉదాహరణ.

నహుషుని నుంచి కొంచెం వెనక్కి వెడితే, అతని తాత పురూరవుడు! పురూరవునితోనే ఈ రాజుల పరంపర ప్రారంభమవుతుంది.  మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసంలోని కౌరవవంశ వివరణ ఘట్టాన్ని పరిశీలిస్తే, ఒక రాజుల పరంపర విచ్ఛిన్నమైన తర్వాత, మనువు పుత్రిక అయిన ఇలకు, చంద్రుడి కొడుకైన బుధుడికి పుట్టిన పురూరవునితో ప్రస్తుత రాజుల పరంపర ప్రారంభమైనట్టు అర్థమవుతుంది.  అంటే, మనువు పుత్రుడి వైపునుంచి కాకుండా పుత్రిక వైపునుంచి ఈ రాజుల పరంపర మొదలైందన్నమాట. అది కూడా చంద్రుడి కొడుకైన బుధుడి ద్వారా.  ఇక్కడ బుధుడికి కన్నా, ఇలకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది.  ఈ పరంపరకు చెందిన రాజులను ‘ఐలులు’ అని కూడా అనడం దానినే సూచిస్తుంది. ఇది మాతృస్వామ్యాన్ని సంకేతిస్తోందా అని నాకో అనుమానం. ఇక్కడ చంద్ర సంబంధంలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటే, చంద్రుడు పైరు పంటలకు రాజు. ఆ విధంగా చూసినప్పుడు ఈ రాజుల చంద్ర సంబంధం వీరి వ్యవసాయ సంబంధాన్ని సూచిస్తూ ఉండచ్చు. ఇవన్నీ ప్రత్యేకంగా మరింత వివరంగా చెప్పుకోవలసిన విషయాలు కనుక వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి వద్దాం.

ఊర్వశీ-పురూరవుల కథ పురాణప్రసిద్ధంగా కన్నా కావ్యప్రసిద్ధంగా మనకు బాగా తెలుసు. కవులు ఆ పాత్రల చుట్టూ గొప్ప కాల్పనిక ప్రణయ వలయాన్ని సృష్టించడం తెలుసు. కాళిదాసు విక్రమోర్వశీయం ఊర్వశీ-పురూరవుల కథే. ఈ కథకు కోశాంబీ అన్వయం అద్భుతంగానే కాక,  ‘షాకింగ్’ గా కూడా ఉంటుంది. దాని గురించి చెప్పుకునే సందర్భం ముందు ముందు తప్పకుండా వస్తుంది. అయితే,  మహాభారతంలో చెప్పిన పురూరవుడు మునుల దృష్టిలో రాజుగా ఒక పెద్ద వైఫల్యం, ఒక తప్పుడు ఎంపిక. ధనాశతో బ్రాహ్మణోత్తముల ధనాలను అపహరించాడని అతనిపై ఆరోపణ. ఆ ఆరోపణను విచారించడానికి వచ్చిన మునులను కలసుకోడానికి కూడా అతను నిరాకరిస్తాడు. పైగా వారిని ఎగతాళి చేస్తాడు. దాంతో వారు అతనిని ఉన్మత్తుడివి కమ్మని శపిస్తారు. అప్పడతను పదవీచ్యుతుడై ఊర్వశితోపాటు గంధర్వలోకంలో ఉండిపోతాడు. వారిద్దరికీ కలిగిన ఆరుగురు కొడుకులలో పెద్ద అయిన ఆయువుకు పుట్టినవాడే నహుషుడు.

01Kach

ఆయువు గురించి వివరాలు చెప్పలేదు కానీ, తాత పురూరవుడితో పోల్చితే నహుషుడు రాజుగా కొంత ఆమోదాన్ని పొందినట్టు కనిపిస్తాడు. కానీ  విచిత్రంగా అతడు కూడా మునులను అవమానించినందుకు పదవీచ్యుతుడై, వారిచ్చిన శాపఫలితంగా కొండచిలువ అవుతాడు. పురూరవుడూ, నహుషుడూ కూడా ఇలా ఇంచుమించు ఒకే విధంగా పదవీచ్యుతులు కావడం ఎందుకు సంభవించిందని ప్రశ్నించుకుంటే రెండు సంభావ్యాలు(probabilities) కనిపిస్తాయి.  వీరిద్దరూ రాచరికం ఒక వ్యవస్థగా పూర్తిగా కుదురుకోని కాలానికి చెందినవారు అయుండచ్చు. అది కూడా వీరి ప్రాచీనతకు సాక్ష్యం కావచ్చు. రాజుపై ఒక అంకుశంగా వ్యవహరించే ప్రజాప్రాతినిథ్యవ్యవస్థను ఇక్కడ మునులు సంకేతిస్తూ ఉండచ్చు. మొత్తం మీద అప్పటికి ఇంకా రాచరికం ప్రయోగాత్మకదశలో ఉండి ఉండవచ్చు. రెండో సంభావ్యత- అప్పటికే రాచరికవ్యవస్థ కుదురుకునీ ఉండచ్చు. ఆ వ్యవస్థను ఉల్లంఘిస్తూ స్వతంత్రతను చాటుకుని శిక్షపొందినవారు కనుక వీరి గురించి ప్రత్యేకంగా చెప్పి ఉండవచ్చు.

అదలా ఉంచితే, రాంభట్ల వారి పరిశీలన యయాతి కథను మరింత ఆసక్తికరమైన సన్నివేశంలోకి తీసుకువెడుతోంది. ఆయన అనుమానం ప్రకారం,  యయాతి కథ జరిగింది అసలు భారతదేశంలోనే కాదు, పశ్చిమాసియాలో!

ఇంతకుముందు ఒక వ్యాసంలో దీని గురించి క్లుప్తంగా ప్రస్తావించాను. ఒకింత వివరాలలోకి వెడితే, ‘నహుషుడు’ అనే మాట మ్లేచ్ఛభాషాపదమని , ‘వేదకాలపు ఆయగార్లు’ వ్యాసంలో ‘ రాంభట్ల గారు అంటారు. ఇంకా చెప్పాలంటే అది సుమేరు పదం. సుమేరు భాషలో  ఆ మాటకు ‘అజగరం’, అంటే కొండచిలువ అని అర్థం. నహుషుడు, యయాతి అనే పేర్లే కాక; యయాతి కొడుకుల పేర్లు కూడా (యదు,తుర్వసు, అను, దృహ్యు, పురు) వారు సుమేరులు కావచ్చునని సూచిస్తాయని రాంభట్ల అంటారు. ఆ రకంగా చూస్తే; యతి, సంయాతి, ఆయాతి, అయతి అనే యయాతి సోదరుల పేర్లే కాక; పురూరవుని పేరు కూడా అలాంటిదే అనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా గమనించాను. ఈ రాజుల పేర్లు కొత్తగా ధ్వనించినా, వారి భార్యల పేర్లు కొత్తగా కనిపించకపోవడం. ఉదాహరణకు, నహుషుని భార్య ప్రియంవద. యయాతి భార్యలు దేవయాని, శర్మిష్ట; పురూరవుని ప్రేయసి ఊర్వశి. ఇందులోని మర్మ మేమిటన్నది మరో ఆసక్తికరమైన ప్రశ్న.

దీనినిబట్టి తేలుతున్న దేమిటంటే, వేదభాషకు మ్లేచ్ఛభాష అయిన సుమేరుతో సంబంధం ఉండడమే కాక; వైదికార్యులకు సుమేరు ప్రాంతమైన పశ్చిమాసియాతో సంబంధం ఉంది. పశ్చిమాసియా ఉత్తర ప్రాంతంలో, అంటే నేటి టర్కీలో పురాణ ప్రసిద్ధులు, క్షత్రియులు అయిన కుశులు, మైతాణులు(మితానీలు), భృగులు రాజ్యాలను స్థాపించి పశుపాలనను, వ్యవసాయాన్ని సమన్వయపరిచారని రాంభట్ల అంటారు. ఎందుకంటే, ఆనాడు పశ్చిమాసియాలో వ్యవసాయం చాలా ఉచ్చదశలో ఉండేది. వేదాలకు మ్లేచ్ఛభాషతో ఉన్న సంబంధాలకు సాక్ష్యం, పూర్వమీమాంసా సూత్రకర్త జైమిని మాటల్లో దొరుకుతుంది. వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు ఏ మాటకైనా ఆర్యభాషార్థం దొరకనప్పుడు మ్లేచ్ఛభాషార్థాన్ని చూడమని జైమిని అంటాడు. నహుషుడంటే కొండచిలువ అనే అర్థం ఆర్యభాషలో లేదు, మ్లేచ్ఛభాషలో ఉంది. ఒక మాటకు రెండు అర్థాలు ఉన్నప్పుడు, ఒక అర్థానికి కథ కల్పించడం పౌరాణికులకు అలవాటు అన్న రాంభట్ల గారు, నహుషుడు అనే మాటకు కొండచిలువ అనే అర్థం ఉంది కనుక దానిని సమర్థించడానికి మునుల శాప రూపంలో పౌరాణికులు ఓ కథ సృష్టించారంటారు.

Rambatla Krishna Murthy

అదలా ఉండగా, రాంభట్ల గారి ప్రకారం యయాతి కొడుకుల్లో తుర్వసు, పురు పేర్లకు సుమేరులో అర్థాలు దొరుకుతున్నాయి. ‘తురు’ అంటే పల్లపు భూమి. దానికి భూమి అనే అర్థం కలిగిన  ‘వసువు’ అనే సంస్కృత పదం చేరి తుర్వసు అనే మాట ఏర్పడింది. సుమేరు భాషలో ‘కీ’ అంటే భూమి. సుమేరులు పల్లపు భూమి అనే అర్థంలో నేటి టర్కీని తుర్కీ అనేవారు. ఇంకా విశేషం ఏమిటంటే తెలుగు గ్రామనామమైన మొగలితుర్రులోని ‘తుర్రు’ ఈ ‘తురు’ నుంచే వచ్చింది. అలాగే, సుమేరు భాషలో ‘పురు’ అంటే గడ్డి. పూరిల్లు అనే మాటలో ‘పురు’ ఉంది. ఈవిధంగా సుమేరు, తెలుగుభాషలకు సంబంధం కలుస్తోందని రాంభట్ల ప్రతిపాదన…

చూడండి…ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చామో! తీగ కదిపితే డొంకంతా కదలడమంటే ఇదే. రాంభట్ల గారి పరిశీలనలలో ఈ అనుభవం మనకు అడుగడుగునా ఎదురవుతుంది. మనకు తెలియకుండానే ఒక అజ్ఞాత, ఆశ్చర్యకరప్రపంచంలోకి వెళ్లిపోతాం. అంతేకాదు, ఈ పెద్దమనిషి వాస్తవాల నేల విడిచి ఊహావిహారం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. దీనికితోడు ఆయనది ఒకవిధమైన హ్రస్వలిపి. తన ప్రతిపాదనలకు ఆధారాలు ఇచ్చే అలవాటు కూడా ఆయనకు అంతగా లేదు. ఆవిధంగా ఆయనది ఓ గుప్తలిపి కూడా. రాంభట్ల అధ్యయనాంశాలతో నాది పదిహేనేళ్ళ సాహచర్యం. అయినాసరే, ప్రతిసారీ అవి నాకు కొత్తగానే ఉంటాయి.

అయితే, రాంభట్ల గారు చెప్పీ, చెప్పకుండా సూచిస్తూ వచ్చిన కొన్ని ప్రామాణిక అధ్యయనాలతో నాకు పరిచయం కలిగినప్పటినుంచీ ఆయనవి మరీ నేల విడిచిన ఊహలు కావనే సంగతీ అర్థమవుతూ వచ్చింది. అది వేరే విషయం.

ఇప్పుడు అర్జెంటుగా అసలు విషయంలోకి వచ్చేస్తే, రాంభట్ల యయాతి కథకు పశ్చిమాసియాను రంగస్థలం చేసి, పశ్చిమాసియా-భారతదేశాల మధ్య పురావారధిని నిర్మిస్తున్నారు. పశ్చిమాసియా రంగస్థలమే క్రమంగా భారతదేశానికి మారినట్టు ఆయన పరిశీలనను బట్టి అర్థమవుతూ ఉంటుంది.

మరిన్ని విశేషాలు వచ్చే వారం…

 

 

 

 

 

 

 

 

Download PDF

13 Comments

 • బత్తుల వామీ అప్పారావు says:

  ఆర్యుల భాష సంస్కృతం కాదా? సంస్కృతం సంస్కరించబడిన ఒక ప్రాకృత భాష అని వినికిడి. ప్రాకృత భాషలు అంటే ఏమిటి? (ప్రజల వాడుక భాషాలా? సహజమైన భాషలేనా? సంస్కృతం, ప్రాకృత భాషలు ఇప్పుడు ఏమైయ్యాయి? ప్రాకృత భాషలంటే వివిధ ప్రాంతాల్లోని భాషాలా? ఇవి భారతీయ భాషాలా? వివిరించరూ?

  • anrd says:

   సుద్యుమ్నుడనే ఒక రాజు శాపవశాత్తు స్త్రీగా మారటం జరిగింది. అలా మారిన సుద్యుమ్నుడు శంకరుని ప్రార్ధించి ఒక నెల స్త్రీగానూ ఒక నెల పురుషునిగానూ ఉండే విధంగా శాపాన్ని సడలించుకోవటం జరిగిందట. ఇలాదేవికి బుధునికి జన్మించిన వారు పురూరవుడు.
   ఇదంతా చూస్తే ఇలాదేవి పూర్తిగా స్త్రీ కాదు కాబట్టి , మాతృస్వామ్యాన్ని సంకేతిస్తోందని చెప్పలేము.
   వీరు చంద్ర వంశానికి చెందిన వారు. చంద్ర వంశానికి ముందు ( శ్రీ రామునిడు …) సూర్య వంశము ఉంది.
   అగస్త్యుల వారు నహుషుని శపించినప్పుడు కొన్ని వేల సంవత్సరాల తరువాత యుధిష్ఠరుని దర్శనం తరువాత తిరిగి యధారూపానికి వస్తావని శాపవిమోచనాన్ని తెలియజేశారట. అలా నహుషునికి ధర్మరాజుకు మధ్య గల కాలాన్ని ఊహించుకోవచ్చు.

   అయితే , పూర్వీకుల వయసుకు ఇప్పటి వారి జీవనకాలానికి చాలా తేడా ఉంది. పూర్వకాలంలోని వారు ఎన్నో వేల సంవత్సరాలు జీవించేవారట. అందుకని ఆ లెక్కలను ఇప్పటి లెక్కలతో పోల్చలేము.
   ఈ మధ్య కాలంలోనే గాంధారి పుట్టిన దేశం భారతప్రాంతము నుంచి విదేశాల్లోకి మారిపోయింది. ఇక ఎన్నో వేల సంవత్సరాల క్రిందట నుంచి చూస్తే దేశాల మధ్య ఎన్నో మార్పులు రావటం సహజం.
   ఒకప్పుడు ప్రపంచమంతటా సంస్కృతం భాషకు ప్రాధాన్యత ఉండేదని అంటారు. తాము ఆర్యులమని భావించే జర్మనీలో ఇప్పటికీ కొన్ని ఇళ్ళలో సంస్కృతాన్ని మాట్లాడుతారట.

   తెలుగువాళ్ళలోనే కొందరి పూర్వీకులు ఉత్తరభారతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

  • కల్లూరి భాస్కరం says:

   ఆర్యుల భాష సంస్కృతమే నని ప్రసిద్ధి. సంస్కరించబడిన ప్రాకృతమే సంస్కృతమనీ, మొదట సంస్కృతం ఉండి, తర్వాత దానినుంచి ప్రాకృతాలు పుట్టాయనీ…రెండు వాదాలూ ఉన్నాయి. ప్రాకృతాలు ఒకప్పుడు వాడుక భాషలే కావచ్చు. ఇప్పుడు ఉత్తర, పశ్చిమ భారతాలలో మాట్లాడే భాషలు వివిధ ప్రాకృతాలనుంచి పుట్టినవే నంటారు. సంస్కృత, ప్రాకృతాలు ఇప్పుడు జనం వాడుకలో లేకపోయినా పుస్తకాల్లో ఉన్నాయి.

 • chintalapudivenkateswarlu says:

  ఇల అంటే భూమి కదా! చంద్రుడంటే మనోకారకుడు జ్యోతిష రీత్యా. చంద్రుడి కొడుకు బుధుడు వ్యాపార కారకుడు. ఇల వ్యవసాయానికి ఆధారం కదా! వ్యాపార వ్యవసాయాలకు పుట్టినవాడు మానవుడు. మానవుడే ఈ జీవజాలానికి రాజు కదా! ఆ విధంగా పుట్టిన మానవుడు సమాజం ఏర్పడే నాటికి ఒక పాలకుడు కావలసి వచ్చాడు. పాలకులు రాజ్యాలు స్థాపించారు. రాజులకు మూల పురుషులు కావలసి వచ్చినప్పుడు ఎవరు మూల పురుషులు అంటే ఇల, బుధులను చూపించారు. ఇలా చూపించిన రాజులు మనకు అందిన వరకు ఈకాలానికి మనకు విదెశీయులె. ఆర్యులు ఇలావృతం నుండి అంటే మధ్యధరా ప్రాంతం నుండి వచ్చారనేది చారిత్రిక సత్యమే. ఇది నా అభిప్రాయం మాత్రమె సుమా!

  • కల్లూరి భాస్కరం says:

   మీ అన్వయం ఆసక్తికరంగా ఉంది వెంకటేశ్వర్లుగారూ…

 • anrd says:

  * చంద్ర వంశానికి ముందు సూర్య వంశము ఉంది. శ్రీ రాముడు సూర్యవంశములో జన్మించారు.

  * మనువుకు జ్యేష్ఠ పుత్రుడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడి కడగొట్టు బిడ్డ ఊర్జస్వతిని భృగువంశజుడైన ఉశనసుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈయన రాక్షసగురువై శుక్రాచార్యునిగా ( కావ్యుడు ) ప్రసిద్ధికెక్కాడు. వీరి కూతురే దేవయాని.

  * ఆర్యుల జన్మస్థానము భారతదేశమేననీ, అందుకే భారతదేశానికి ఆర్యావర్తమనే పేరు వచ్చిందని అంటారు. ఆర్యులు ఇక్కడ నుంచీ భూమిపై ఇతర ప్రాంతాలకు వెళ్ళిఉండవచ్చని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

  • కల్లూరి భాస్కరం says:

   మీరు చూపుతున్న ఆసక్తికి అభినందనలు anrd గారూ…

 • anrd says:

  మీకు కృతజ్ఞతలండి.

 • “చరిత్రను కమ్మేసే పొగమంచు” అన్వయం చాలా బాగుంది. మీరు చెప్పినట్లు జనమేజేయుడికి 26 తరాల ముందు వాడు అంటే యయాతి కనీసం 2000 క్రీ.పూ. కి చెందినవాడై వుండాలి (కురుక్షేత్రం 10 బీ.సీ. అన్న సిద్ధాంతం ప్రకారం). సరిగ్గా ఆ కాల రేఖకి ఇటు వైపు 2000 సంవత్సరాల తరువాత వున్నాం మనం. అంటే నాలుగువేల ఏళ్ళ వెనకటి చరిత్రని చూసే ప్రయత్నం. ఇన్ని వేల సంవత్సరాలలో సమాజంలో వచ్చిన మార్పులు చూస్తే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం, సంచార గణాలనుంచి స్థిత ఆవాసాలు, ఎన్నో మతాలు కులాలు (పుట్టి గతించినవి కూడా వుండే వుంటాయి), మారుతూ వచ్చిన విలువలు, సంప్రదాయాలు ఇవన్నీ కలిసి స్పష్టాస్పష్టమైన పొగమంచుని కాకుండా దట్టమైన తెరలను కట్టేసి వుంటాయి. పైగా ఆ చరిత్రలు మౌకికంగా ఇన్ని రకాల సంప్రదాయ విశ్వాసాల మీదుగా ప్రయాణించాయి కాబట్టి ఒకో తెర ఒకొ రంగుని కలిగి వాస్తవాలను గుర్తించలేని స్థితికి నెట్టేసి వుంటాయి. అందువల్ల మీరు చేస్తున్న పరిశీలన ఎంతో క్లిష్టమైనదీ, చూసే దృక్కోణాన్ని బట్టి ఒకోసారి వివాదస్పదమైందీ అవుతుంది. అయినా అన్వేషణ కొనసాగాలి… ఇది మూలాలను వెతుక్కునే ప్రయత్నం. అభినందనలు భాస్కరంగారూ…

  • కల్లూరి భాస్కరం says:

   అభిరుచిగల మీవంటి పాఠకుల స్పందన అమూల్యం. ధన్యవాదాలు సత్యప్రసాద్ గారూ…

 • Lp says:

  Nenu ee vyasam chadivenu.ee madhye vaalmiki ramayananiki vachana roopam chadivenu.indulo dasarathudu tama Vamsa kramamu cheptu ambarishudi kooduku nahushudu, nahushud kooduku yayathi.yayathiki nabhagudu,nabhagudu ki ajudu ajudu ki dasarathudu putteru ani chepperu.Meeru rasina yayathi kokdukulalo ee nabhagudi Peru ledu.ramayanam bharatam rendu vere vere yugalu Kada?E vidham ga manam justify cheskovali?vela samvatsarala aayushhu undanukunna Koooda Edomite miss ainattu anipinchindi.dayachesi vivarinchagalaru

  • కల్లూరి భాస్కరం says:

   నిజమే, రామాయణంలో, బాలకాండలో 70వ సర్గలో వశిష్టుడు జనకుడికి చెప్పిన దశరథుని వంశక్రమం మీరు చెప్పినట్టే ఉంది. ఇందులోకి నహుషుడు, యయాతి ఎలా వచ్చారో నాకూ తెలియదు. భారత, రామాయణాలు ఏనాటి నుంచో ప్రచారంలో ఉన్నవి. కనుక కొన్ని పేర్లు రెండింటిలోనూ కనిపించడానికి అవకాశం ఉంది. ఇక యుగాల తేడాలు, వేల సంవత్సరాల ఆయుర్దాయం మొదలైనవి విశ్వాసానికి సంబంధించినవి. అక్కడ మన రీజనింగ్ పని చేయదు.

 • Umamaheswararao says:

  గురువు గారు , అంబరీషుడు కొడుకు నాభాగుడు అంటారు కదా ఈ కథను వివరించండి .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)