” యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్” : ఆ పోరాట వీరుడి ఆఖరి వాక్యం!

పోరాటాల మల్లారెడ్డి
పోరాటాల  మల్లారెడ్డి

పోరాటాల మల్లారెడ్డి

ఆగస్టు 23 (2011) వుదయాన  ఫోన్, మిత్రుడు కుంబాల మల్లారెడ్డి యిక లేడని. . క్యాన్సర్ వ్యాధితో యేడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం యిక ముగిసింది. అంతకు రెండు రోజుల ముందే పరామర్శించడానికి వెళ్లి, దిగులు పడుతూనే ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే, ‘ఎప్పుడో పోవాల్సిన ప్రాణం కదా, యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్’ అని జవాబు చెప్పిన మనిషి.

ఏమని చెప్పుకోవాలి మల్లారెడ్డి గురించి? చీకటిలో కనిపించని నీడల గురించి, వెలుతురు మెరుపులలో విస్మృతమయే దీపాల గురించి, మాటల సవ్వడిలో వినిపించని మౌనం గురించి, సుదీర్ఘ పయనంలో గుర్తించని దురాల గురించి, వుత్సవంలో వెలుగు చూడని విషాదాల గురించి..ఎప్పుడో రాండాల్ స్వింగ్లర్ రాసాడు కదా..

వీధులన్నీ విద్యుత్తేజంతో వురకలేస్తూ

కరతాళ ధ్వనులతో మార్మోగుతున్నపుడు

కవాతు చేసే మన వూహల లయతోనే

భేరీలు మోగుతున్నపుడు

గొంతెత్తి పాడడం తేలిక ..

జనసమూహం జాగృతమై

మనం రుజువు చేయదల్చుకున్నదాన్నే కోరుకుంటున్నపుడు

కదంతొక్కేలా మాట్లాడడమూ తేలికే

కన్నుపొడిచినా కనిపించని కటిక చీకటిలో

నిప్పురవ్వని దావానలంగా విస్తరించే వొడుపుతో

వెలుగువైపు నడిపించడం అంత తేలిక కాదు

ఎవరు చూడనిదీ, గుర్తించనిదే అసలైన పని

మల్లారెడ్డి గురించి మాట్లాడటమంటే ఎవరు చూడని, గుర్తించని పనుల గురిచి చెప్పుకోవడమే.

ఎమర్జెన్సీ అనంతర కాలం కరీంనగర్ జిల్లాలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాల వెల్లువ పెల్లుబికిన కాలం. సిరిసిల్ల, జగిత్యాల జైత్రయాత్రల కాలం. ‘దొరల కాలికింది ధూళి ఎగిసి వాళ్ళ కళ్ళలో పడిన చోటు ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించిన కాలం. రైతాంగ పోరాటాలు అటు సామాజిక ఆచరణలో, ఇటు సైద్ధాంతిక రంగంలో కొతాచుపునీ, కోణాలని ఆవిష్కరించిన కాలం. దానితోపాటు ఆ ఉద్యమాల ముందు కొత్త సమస్యలూ ముందుకొచ్చాయి. విశాలమైన పునాదిపై ఐక్యతని నిలబెట్టుకోవడం, ఉద్యమాన్ని సంఘటిత పరచుకోవడం, విస్తృతం చేయడం, భూస్వామ్య వ్యతిరేక ప్రతిఘటనని అభివృద్ధి చేయడం, భూస్వాములకి అనుకూలంగా ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధాన్ని తట్టుకుని నిలబడటం – ఇవి ఆనాడు వుద్యమం ముందుకొచ్చిన సమస్యలు. 1982 లో సిరిసిల్ల, వేములవాడ రైతాంగ పోరాటాలపై ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రచురించిన వ్యాసం ఆనాటికి ప్రభుత్వ నిర్బంధమే కీలకమైన సమస్యగా మారిన విషయాన్ని గుర్తించింది. ఆరోజులలో (రోడ్డు)పదిర గ్రామ సర్పంచిగా, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యువకుడు మల్లారెడ్డి.

1985 తర్వాత, ‘ఆట, పాట, మాట’ అన్నీ బంద్ అయిన కర్కశ, నిరంకుశ పాలన రాజ్యమేలింది. కరీంనగర్ జిల్లా రైతాంగ పోరాటంలో ముందుకొచ్చిన వ్యక్తులు, నాయకులు వుద్యమ విస్తరణ అవసరాల రీత్యా యితర ప్రాంతాలకి తరలడమో, బూటకపు ఎదురుకాల్పుల్లో బలికావడమో జరిగింది. ఆ రోజుల్లో మల్లారెడ్డి యేమయ్యాడో చాలామందికి తెలియదు. ఉవ్వెత్తున వుద్యమాలు యెగిసినప్పుడు మెరిసిన మనుషులు తర్వాతి కాలంలో వొడుదుడుకులు  యెదురైనప్పుడు తెరమరుగు కావడం సహజమే. మల్లారెడ్డి ఆచూకి మాత్రం చాలా మందికి తెలియలేదు. మిత్రులకీ, బంధువులకీ, శత్రువులకీ.

పార్టి రహస్య నిర్మాణంలో అనుసంధానకర్తగా మల్లారెడ్డి నిర్వహించిన బాధ్యతల గురించి యెవరు చెప్పగలరు? అవి అజ్ఞాత జీవితపు అజ్ఞాత వివరాలే కదా. ఒక వ్యక్తి బహు ముఖాలుగా, అనేక పేర్లు వొకే ముఖంగా, పరిచిత ముఖాల మధ్య వొక అపరిచితునిగా, అనామకునిగా నిలిచిన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించగలిగేదెవరు? చిరుద్యోగిగా, చిరువ్యాపారిగా, చిరపరిచిత మిత్రునిగా, చుట్టపుచూపుగా అప్పుడప్పుడూ వచ్చిపోయే బంధువుగా తారసపడే వ్యక్తి రూపాన్ని బట్టి అతను నిర్వహించే బాధ్యతలని యెవరూ వూహించలేరు. కలుసుకోబోయే మనిషిని బట్టి, స్థలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వొక వ్యక్తి యెన్నెన్ని పేర్లు, యెన్నెన్ని రూపాలలో యెదురవుతాడో లెక్కపెట్టిందెవ్వరు? ఎప్పుడు పొంచివుండే ప్రమాదాన్ని అలవోకగా ధిక్కరించిన  నిర్లక్ష్యంతో, అవసరానికి మించి యేమీ మాట్లాడని జాగ్రత్తని మేళవించి అనామకంగా మిగిలిపోవడానికి తాను చూపిన శ్రద్ధ విలక్షణమైనది.

ఉద్యమాలు సమూహపు స్వప్నాల లాంటివి. కొన్ని సార్లు కలలు చెదిరిపోవచ్చు. శత్రువులు చిదిమివేయవచ్చు. లాంగ్ స్టన్ హ్యూస్ వాయిడా పడిన కల గురించి చెబుతాడుకదా,

వాయిదా పడిన కలకి యేమవుతుంది?

ఎండిన ద్రాక్ష పండులా ముడుచుకు పోతుందా?

గాయంలా సలుపుతూ

 స్రవిస్తుందా?

కుళ్ళిన మాంసంలా

గౌలుకంపు కొడుతుందా?

తీయటి పొరలా

పేరుకపోతుందా?

బహుశా వొక దింపుకోలేని బరువులా

వేలాడుతుందా?

లేక పెఠీల్లుమంటూ

పేలిపోతుందా?

కల చెదిరినా లొంగిపో నిరాకరించేమనిషి యేమౌతాడు? మల్లారెడ్డి యేమయ్యాడు? ఏకాకి కాకున్నా మల్లారెడ్డి వొక వొంటరి మనిషి. తనదొక వొంటరి యుద్ధం. తానెంచుకున్న పోరాట రంగంలో పదిమందిని కూడగట్టి న్యాయం కోసం పోరాడాడు. నాయకత్వం కోసం, పేరు కోసం, ప్రాపకం కోసం అర్రులు చాచే కాలంలో తాను ముందుకి రాకుండా, తెరవెనుకే నిలబడి బస్తీ ప్రజలని సంఘటితం చేశాడు. మనసుని వెంటాడే కల చెదిరిన దు:ఖానికి మనిషిని నిలువెల్లా కుంగదీసే క్యాన్సర్ వ్యాధి తోడైతే యెలా వుంటుంది? ఇక్కడ కూడా మల్లారెడ్డి ద్రుడంగా నిలబడ్డాడు. తనవలెనే క్యాన్సర్ వ్యాధి పాలైన మరొక మితృనికి ఆసరాగా నిలబడ్డాడు. ఊరటనిచ్చేందుకు శాయశక్తులా కృషి చేశాడు. జీవితమొక యుద్ధరంగం.. కల చెదిరిన మనిషి వొక అనామక సైనికుడు.. మల్లారెడ్డిని తలచుకోవడమంటే కలల్ని నిలబెట్టుకోవడానికి మనిషి వొంటరిగానూ, సాముహికంగానూ చేయాల్సిన కృషిని బేరీజు వేసుకోవడమే.

ఎక్కడినుంచి వెలుగుతుందో తెలియదు

బయలుదేరి వెళ్లిపోయాక గానీ

గుర్తించని చిరునవ్వు వెలుతురు

మేఘాల చాటున కనిపించని నక్షత్రం

ఎందరికి ఆసరాగా నిలిచిందీ తెలియదు

ఒంటరి యుద్ధంలో గాయపడ్డాకగానీ

వెలుగులోకి రాని రహస్య జీవితం

మౌనంలో ప్రతిధ్వనించే నిశ్సబ్ద నినాదం

ఎప్పుడు ఎవరు నాటారో తెలియదు

తొలకరి జల్లు కురిశాక గానీ

కనిపించని రైతు పాదముద్ర

నాగేటి చాళ్లలో మొలిచిన రహస్యోద్యమ సందేశం

ఎటునుంచి ఎటు వీచిందో తెలియదు

కరచాలనం చేసి మాట్లాడాక గానీ

అనుభవంలోకి రాని సహజ స్నేహ పరిమళం

పంటపొలాల్ని మోసుకొచ్చిన సిరిసిల్ల పైరగాలి

మల్లారెడ్డికి జోహార్లు..

  సుధా కిరణ్

Download PDF

2 Comments

  • gsrammohan says:

    ఎమోషనల్‌గా ఉంది కిరణ్‌. ‘ముఖ్యంగా ఎవరూ చూడని, గుర్తించని మనుషుల గురించి’ మాట్లాడుకోవాల్సిన అవసరం ఇవాళ చాలా ఉంది. గుర్తింపు యావ లేకుండా పనిచేయగలిగిన అరుదైన మనుషులను భుజానెత్తుకుని ఊరేగిస్తూ గానం చేయాల్సిన అవసరం ఉంది. మహా నాయకుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఇవాళ లేదు. వారి గురించి మాట్లాడేవాళ్లు చాలామందే ఉన్నారు. అంతటా తానై కూడా ఎక్కడా కనిపించకుండా ఇలా మాయమైపోయే మనుషుల గురించి ఎంత వీలైతే అంత ఎక్కువగా మాట్లాడుకోవాలి.

  • P. Suresh Kumar says:

    కిరణ్! గుర్తు చేయటం అనాలో, కబురు పెట్టటం అనాలో తెలియటం లేదు. మనిషిని పంపినట్టు వుంది. మనసును పిండినట్టుంది. ఆ నవ్వుల పలకరింపును ఆవిష్కరించినట్లుంది. అప్పుడప్పుడు మాత్రమే కనిపించే ‘ పిటి’ ని పిలిచినట్టు వుంది. కంటి రెప్పలు నిలిచిపోయి కన్నీళ్లు కనిపించటం లేదు. కళ్ళనిండా పిటి అన్నయ్య కనిపిస్తుండు. కన్నీళ్ళలా… తీపి గుర్తులా … థాంక్స్ కిరణ్!! – సురేష్

Leave a Reply to gsrammohan Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)