వీలునామా – 24 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పారిపోయిన ప్రేమ 

“ఆఖరికి నా మేనేజరు దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. అయితే అక్కడి వార్తలంతగా బాగోలేవు,” మర్నాడు పొద్దున్నే ఫిలిప్స్ ఇంటికి వొచ్చిన బ్రాండన్ చిన్న బోయిన మొహంతో ఆన్నాడు.

“ఏం జరిగింది?” అన్నారంతా ఆతృతగా.

“నేను వెంటనే వెళ్ళాలి. లేకపోతే కొంప మునుగుతుంది. ఉత్తరం ఇంకొంచెం ముందు వొచ్చి వుంటే, కిందటి పడవలో వెళ్ళి వుండేవాడిని. వెళ్ళి ఇంకొంచెం భూమి కొనాల్సి వొస్తుందేమో. ఇప్పుడు అక్కడ భూమి ధరలేమో బాగా పెరిగిపోయాయి. అసలు నా మేనేజరు తెలివితక్కువతనంతో కొంత నష్టం జరిగింది. నేను వీలైనంత త్వరగా వెళ్ళి లెక్కలూ అవీ చూసి పరిస్థితి చక్కబరచి రావాలి. ఆరు నెలలు దేశం వదిలితే చాలు, నష్టాల్లో కూరుకుపోతున్నాను. స్టాన్లీ, నీ ఎస్టేటు లెక్కలేలా వున్నాయి?”

“ఫరవాలేదులే. ఎలాగూ నువ్వెళ్తున్నావు కదా? ఒకసారి విర్రావాల్టా వెళ్ళి నా పొలం వైపు తొంగి చూడరాదూ? అక్కడ నాకొరకు పని చేసే గ్రాంట్ ఉత్త పనికిమాలిన వాడు. అసలొక పని చేస్తాను. నీకు పవరాఫ్ ఆటార్నీ ఇచ్చేస్తాను. ఏమంటావ్?” ఫిలిప్స్ అడిగాడు.

“అలా చేస్తే గ్రాంట్ ఏమైనా అనుకుంటాడేమో!”

“ఏమీ అనుకోడు. అసలు తనపనే తలకు మించి వుందని సణూక్కుంటూ నా పనికొప్పుకున్నాడు.”

“సరేలే. ఒకసారి వెళ్ళి చూసొస్తా.”

“నాకయితే ఇప్పట్లో ఆస్ట్రేలియా రావాలని లేదు. అక్కడ పొలం మీద వచ్చే రాబడి ఈ మాత్రం వుంటే నేనిక్కడ కుటుంబంతో కాలక్షేపం చేయొచ్చు.వీళ్ళందరకీ ఇక్కడ ఎంత బాగుందో చూసి, మళ్ళీ వీళ్ళని అక్కడికి ఎలా తీసికెళ్ళను? పెరుగుతున్న పిల్లలకి కాస్త చదువూ సంధ్యా చెప్పించుకోవాలి కదా?”

“మంచి రాబడి వుంటే లండన్ లో వుండడమంత సుఖం లేదు. అయితే నీలా లండన్ కి కుటుంబాన్ని తీసుకురావడానికి నాకింకో పదేళ్ళు పట్టొచ్చు. ఈ పదేళ్ళూఊ ఆస్ట్రేలియాలో నా వ్యవహారాలు చక్కబరచుకోని నిలదొక్కుకోవాలి. అప్పుడు నేనూ నీలా కుటుంబాన్ని ఇక్కడకి తీసుకొచ్చేస్తాను. అందుకే నన్ను పెళ్ళాడబోయే అమ్మాయి కనీసం పది పన్నెండేళ్ళు ఆస్ట్రేలియాలో ఉండగలగాలి,” బ్రాండన్ అన్నాడు సాలోచనగా.

వింటున్న హేరియట్ ఉలిక్కిపడింది. ఆమెకీ ప్రతిపాదన ఎంత మాత్రమూ నచ్చలేదు. ఆస్ట్రేలియాలో భూస్వామి అంటే తన అన్నలా బోలెడంత డబ్బూ దస్కం వున్నవాడై వుంటాడనీ, తనూ తన వదినలా దర్పంగా వుండొచ్చని ఈ పెళ్ళికి ఒప్పుకుంది కానీ, ఆస్ట్రేలియా పొదల్లోకీ పాముల్లోకీ వెళ్ళి గొడ్డు చాకిరీ చేయడానికా?ఆమెకి తలచుకుంటేనే కంపరం పుట్టింది.

అలాటి కష్టనష్టాలకి ఓర్చుకునేందుకు తనకేమీ బ్రాండన్ పైన కొట్టుకుపోయేంత ప్రేమ ఏమీలేదు. ఐనా బ్రాండన్ ఇంత మోసం చేస్తాడా! తనేదొ పెద్ద ధన్వంతుణ్ణీ భూస్వామినీ అని నమ్మించి ఇప్పుడు తన పేదరికాన్ని బయటపెడతాడా? తనీ మోసాన్ని ఎంత మాత్రమూ సహించదు. ఈ మోసంలో అన్నా వదినా, అందరూ భాగం పంచుకున్నట్టనిపించింది ఆమెకి.

హేరియట్ చిరాగ్గా ఆ రోజు బయటికెళ్ళడానికి తయారయింది. ఇంతలో కొత్త బోనెట్ తో వదిన ముస్తాబు ముగించి వచ్చింది. తనకి పాత బోనెట్ తప్ప వేరే గతి లేదు. ఎల్సీ తన బోనెట్ ఇంకా పూర్తి చేయలేదు మరి. అద్దంలో తన నీడా, పక్కనే వదిన గారి నీడా చూసి ఆమె చిరాకు ఇంకా ఎక్కువయ్యింది.

తలుపు మీద చిన్నగా తట్టి ఎల్సీ లోపలికొచ్చింది. ఆమె చేతిలో తనకోసం చేసిన కొత్త అందమైన బోనెట్. అందంగా, ఖరీదైనదానిలాగా, ముద్దొస్తూ వున్న ఆ బోనెట్ చూసి హేరియట్ మొహం విప్పారింది.

“ఓ ఎల్సీ! నా టోపీ తయారు చేసేసావా? నేను చెప్పలే నువ్వు చేయగలవని? ఎంత బాగుందో బుజ్జి టోపీ! రా లోపలికి ఎల్సీ. ఎవరూ కొత్త వాళ్ళు లేరు. బ్రాండన్, ఫ్రాన్సిస్ అంతే. వదినా, ఫ్రాన్సిస్, ఈ టోపీ ఎంత బాగుందో చూడండి. ” ఎల్సీ సిగ్గూ మొహంటాల్తో చితికిపోతూ డ్రాయింగ్ రూం లోకొచ్చింది. అందరూ ఎల్సీ అభిరుచినీ, పనితనాన్ని అందరూ మెచ్చుకునేంతవరకూ ఆమె వదల్లేదు.

ఇంట్లో పనిమనిషికి అంత గుర్తింపు ఇవ్వడంతో తన విశాల హృదయాన్ని చాటుకున్నాననుకుంది హేరియట్. నిజానికి అక్కడున్న ఇద్దరు మగవాళ్ళకీ ఎల్సీ పట్ల చాలా స్నేహ భావమూ, ఆఫ్యాయతా వున్నాయనీ, పదే పదే ఆ అమ్మాయి పనిమనిషి హోదాని వాళ్ళకి గుర్తు చేయడం మొరటు తనమవుతుందనీ, ఆ మొరటు తనానికి వాళ్ళు తనని అసహ్యించుకోవచ్చనీ తట్టనుకూడాలేదామెకి. ఎల్సీ ఆ గదిలోంచి తప్పించుకోగానే,

“నేను చెప్పలే! ఎల్సీ తప్పకుండా ఈ పని చేయగలదని. పని వాళ్ళని కొంచెం దబాయిస్తే కానీ పని చేయరు. ఇంతకీ ఇది మా వదిన టోపీ అంత బాగుందా లేదా?” అద్దంలో తన నీడని చూసి మురిసిపోతూ అంది.

veelunama11

అలంకరణ ముగించి,

“పదండి, పదండి, గాలరీకెళ్ళి చిత్రపటాలు చూద్దామనుకున్నాం కదా? బ్రాండన్! నేను ఫ్రాన్సిస్ గారితో వొస్తా, ఏమనుకోకు. నీకెటూ చిత్ర లేఖనం పెద్దగా అర్థం కాదు, ” అంటూ ఫ్రాన్సిస్ హొగార్త్ చేయి పట్టుకొని చిత్రకళా ప్రదర్శన చూడడానికి వెళ్ళిపోయిది హేరియట్. (పాశ్చాత్య నాగరికతలో ముఖ్యమైన కార్యక్రమాలకు మగవారి చేయి పట్టుకొని ఆడవారు నడవడం ఆనవాయితీ. )

అందమైన నాజూకు టోపీతో తను విజయాన్ని సాధించాననుకుంది కానీ, తనకెంతో ముఖ్యమైన వ్యక్తి మనసులో తన స్థానం పూర్తిగా పోయినట్టు తెలుసుకోలేకపోయింది.  అహంకారమూ, మితిమీరిన ఆత్మ విశ్వాసమూ కళ్ళని మాయ పొరల్లా కప్పేస్తాయి. తమ చుట్టూ వున్నవారందరూ తమని ఆరాధిస్తున్నారనే భ్రాంతిలో ముంచేస్తాయి. నిజంగా చుట్టూ వున్నవారికి తమ పట్ల అంత గౌరవమేమీ లేకపోగా, కొండొకచో కొంచెం చులకన భావం వుందనీ తెలిస్తే అహంకారి ఎలా తట్టుకుంటాడో.

తన పట్ల ఫ్రాన్సీ, బ్రాండన్ ఇద్దరూ భయంకరమైన ఆకర్షణాలో మునిగి పోయారన్న నమ్మకంలో వుంది హేరియట్. నిజం తెలిస్తే తట్టుకోగలదో లేదో.

తన చేయి పట్టుకోని నడవకుండా హేరియట్ ఫ్రాన్సిస్ చేయి పట్తుకున్నందుకు బ్రాండన్ ఏ మాత్రం బాధపడలేదు సరికదా, తమతో పాటు జేన్ కానీ, ఎల్సీ కానీ వచ్చి వుంటే బాగుండేదనిపించింది. ఈ మధ్య అతనికి జేన్ మాటలు వింటూంటే భయం పోయింది. ఆమె తెలివితేటల వెనక వున్న సౌజన్యమూ, కఠోర పరిశ్రమ వెనక వున్న ఆత్మ గౌరవమూ అతనికి అర్థం కాసాగాయి. ఎల్సీ అమాయకత్వమూ, సున్నితమైన మనసూ, పని తనమూ పట్ల అతనికున్న ఇష్టం సరే సరి. వాళ్ళిద్దరూ ఈ ప్రదర్శనకి వచ్చి వుంటే తనకెంత హాయిగా వుండేదో అనుకున్నాడు బ్రాండన్. వాళ్ళిద్దరూ రాకపోవడంతో అతను లిల్లీ ఫిలిప్స్ తో ప్రదర్శన తిలకించాడు.

ఫ్రాన్సిస్ కి హేరియట్ పట్ల ఎటువంటి భావమూ లేదు. కేవలం మర్యాద కోసం అతను ఆమెతో మాట్లాడుతున్నాడు. అంతే కాదు, అతనికెంతో ప్రీతి పాత్రురాలైన జేన్ వాళ్ళ ఇంట్లో ఉద్యోగంలో వుంది. అటువంటప్పుడు తాను వారితో మర్యాదగా ప్రవర్తించకపోతే ఆమె కేదైనా సంస్యలు రావొచ్చన్న భయమూ వుందతనకి.  అంతే తప్ప అతనికి హేరియట్ పట్ల ఎటువంటి ఆసక్తీ లేదు. ఆమె మీద ఎంతో కొంత ఆసక్తి వున్న బ్రాండన్ మనసులోంచి ఆమె ఎప్పుడో రాలిపోయింది.

***

(సశేషం)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)