ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ? – 5వ భాగం

ekkadi -5

Ekkadi(1)

(గత వారం తరువాయి )

5

మొబైల్‌ మ్రోగింది.
మనిషి తనను తాను ఎక్కడో పోగొట్టుకుని అవ్యవస్థితమై ఏదో ఒక ఆలోచనలో సమాధియైపోవడం, శవప్రాయమై అనిమిత్తమైపోవడం ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనుభవమయ్యే విషయమే. అప్పుడు ఏ కొద్ది అంతరాయమైనా మనిషిని ఉద్విగ్నుణ్ణి చేస్తుంది..ఉలిక్కిపడ్డాడు రామం.
మనసు సుడిగాలిలో కాగితపు ముక్కలా ఉంది.. ఒకరకంగా..యుద్ధంలో పాల్గొనబోయేముందు దీక్షాబద్ధుడైన సైనికునిలా ఉంది..యిక ప్రయాణం ప్రారంభించాలి.
‘హాలో..” అన్నాడు
”హై..” అటునుండి క్యాథీ.
”ఓ.”
”ఐయామ్‌ వెయిటింగు ఫర్యూ ఎట్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌..యుహావ్‌ గినెన్‌ టైం. హావ్యూ ఫర్గాట్‌”సారీ…ఐ ఫర్గాట్‌.. కమింగు నౌ..”
ఉన్నపళంగా లేచి..టకటకా బయటికి వచ్చి తన ఇన్ఫినిటీ, కారును స్టార్ట్‌ చేశాడు రామం.. వాటర్‌హాలో, డార్సీ స్ప్రింగు, అబ్జర్వేషన్‌ డ్రైవ్‌, కాంఫ్రీ, రాయల్‌ క్రౌన్‌.. కారు సర్రున జారిపోతోంది. బయట సన్నగా వర్షం.,
జ్ఞాపకాల వర్షం.. చినుకులు చినుకులుగా ఘటనలు,
జీవితంలోకి క్యాథీ అనే ఈ అమెరికన్‌ యువతి యొక్క ప్రవేశం యాదృచ్ఛికమే ఐనా..పోను పోను ఓ ప్రభావశీలమైన అనుబంధంగా మారడం..మనుషుల ప్రాంతాలు, మూలాలు, దేశాలు, నేపథ్యాలు..వీటితో ఏ సంబంధమూ లేకుండానే ఒక హృదయానుగతమైన అనురాగంతో చేరువై ఆత్మీయులుగా మారుతూండడం.. ఇదంతా ఓ చిత్రమైన ఏ నిరూపణకూ, తత్వానికీ, తత్వజ్ఞానానికీ అందని అంతరిక రహస్యమై.,
తను మొదట టిసిఎస్‌ స్టాఫ్‌గా రాక్‌విల్లీలో చేరిన తర్వాత రెండు నెలల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ఒక వారం రోజుల తేడాతో పరిచయమైన విశిష్టమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు ఇద్దరు. ఒకరు లీల. మరొకరు క్యాథీ. లీల తను చేరిన పదిరోజుల తర్వాత భారతదేశంనుండే టిసిఎస్‌స్టాఫ్‌గా మేనేజ్‌మెంట్‌ మాడ్యూల్‌లో హైద్రాబాద్‌ బ్రాంచ్‌నుండి వచ్చి చేరిన వ్యక్తి. ఆమె ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బెంగళూర్‌ నుండి బంగారు పతక గ్రహీత. క్యాంపస్‌ ఇంటర్వూలో తన వలెనే ఎంపిక చేయబడి చాలా మంచి జీతంతో ప్రవేశపెట్టబడ్డ వ్యక్తి. అప్పటికే ఆమెకు గొప్ప ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. విద్యార్థిగా ఉన్నపుడే ఎన్నో సంస్థలతో సంబంధాలు పెట్టుకుని అనేక విజయాలను సాధించి పెట్టిన మనిషి. ప్రధానంగా బిజినెస్‌ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగు కార్యకలాపాలను విస్తరించే ప్రత్యేక విధులకోసం ఆమెను రాక్‌విల్లీ ఆఫీస్‌కు పంపారు.
లీల..ఒక వ్యక్తే..కాని ఒక వ్యవస్థతో సమానం. మనిషి చేతలు, కదలికలు, నిర్ణయాలు, ఒక కేస్‌ను అధ్యయనం చేసే విధానం చాలా విలక్షణమైంది. ఆమె ఆలోచనలు పోలీస్‌లవి. చూపులు డేగవి. వ్యూహాలు సింహానివి. తెలివి చాణక్యునిది. వెరసి లీల అంటే విజయానికి ప్రతీక.
ఐతే.. లీల అందగత్తె.. లీల అహంకారి..లీల పొగరుబోతు.
అంటుంది..’నా అహంకారమే నాకు అలంకారం’ అని.

”ఐ లైక్‌ మెన్‌ ఆఫ్‌ మల్టిట్యూడ్స్‌.. బహుముఖ ప్రజ్ఞాశాలులంటే నాకిష్టం..”అంది మొదట తన్ను తాను పరిచయం చేసుకుంటూ. అంతకుముందు ఒక వారంరోజులు తనను ఆమె అతి వివరంగా పరిశీలించి అధ్యయనం చేసినట్టు తనకు తెలుసు. తను ఒక అసాధారణ ప్రతిభగల మెకానికల్‌ ఇంజనీరే కాకుండా, కాడ్‌కాం రంగంలో, ఫ్లెక్సిబుల్‌ మెషినింగు సిస్టమ్స్‌లో, స్పేస్‌ అప్లికేషన్‌ బేరింగ్సు రూపకల్పనలో సాప్‌ సాఫ్ట్‌వేర్‌ను సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వాడడం.. ఈ రంగాల్లో తన అసమాన ప్రతిభను లీల అద్భుతంగా పసిగట్టింది.
ఒకరోజు ‘స్టార్‌బక్‌ కాఫీ షాప్‌’ లో కలుసుకుందామని ప్రపోజ్‌ చేసి పర్సనల్‌గా ఒక గంటసేపు మాట్లాడింది. ఆ సంభాషణ తర్వాత కొంత చేరువైనట్టనిపించింది. మనిషి ఎంతో డైనమిక్‌ ఐనా చాలా లోతైన తాత్విక ఆలోచనలు గల సున్నితమైన దృఢసంకల్పంగల మనిషి..ఆమెకు తనదైన ఒక వ్యవహారశైలి ఉంది. చొరవ ఉంది. సింహంవలెనే పట్టువిడువకుండా వేటాడే గుణముంది. అన్నింటినీమించి అద్భుతమైన ధైర్యముంది.
ఐతే లీల గురించి అర్ధంగానిది ఆమె యొక్క ‘పాదరసం’ వంటి చంచల స్వభావం. దాన్ని అస్థిరత అనే వీలేలేదుగాని, అస్పష్టమైన సందిగ్ధతగా అర్థం చేసుకోవచ్చునేమో. మంచి ఇంగ్లీష్‌. మంచి వ్యక్తీకరణ..ఎదుటి మనిషిని రెండు నిముషాల్లో ఆకట్టుకునే దేహభాష.
ఎందుకో ఆమెతో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఏదో తెలియని ఆకర్షణకూడా పెరుగుతూ వచ్చింది తనలో. ఆమెను తరుచూ కలుసుకోవాలనీ, సాధ్యమైనంత ఎక్కువసేపు మాట్లాడాలనీ, ఎక్కవకాలం సాంగత్యాన్ని అనుభవించాలనీ అనిపించేది.
ఆమె అభిరుచులుకూడా తనను ఎంతో ఆకట్టుకున్నాయి. తనవలెనే ఆమెక్కూడా మధురమైన సంగీతాన్ని వినాలని కోరిక. ప్రకృతిని ఆరాధించే తత్వం..ముఖేశ్‌ పాటలను తను తదేకంగా వింటున్నపుడు ఓ చరణాన్ని అందుకుని హమ్మింగు చేసేది. ఒంటరితనాన్ని యిష్టపడ్తుంది. విపరీతంగా పుస్తకాలను చదువుతుంది. ఏ కారణంవల్లనైనా  డిస్టర్బ్‌ ఐనపుడు ఎటో ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది. ‘హిట్‌ అండ్‌ మిస్‌ కాకుండా..హిట్‌ అండ్‌ స్టే..అండ్‌ ఫేస్‌’ తత్వం ఆమెది.
‘జీవితం ఓ యుద్దం. పోరాడి గెలవాలి’ అనేది ఆమె సిద్ధాంతం. కారు మైల్‌స్టోన్‌ సెంటర్‌ మలుపు తిరిగింది..వర్షం ఉధృతమై చినుకులు చిక్కబడ్డాయి.
ekkadi -5

క్యాథీది లీలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. లీల జలపాతమైతే క్యాథీ మైదానథలో ప్రవహించే నది. నిండైన మనిషి. తొణకకుండా గంభీరంగా ఏ సమస్యనైనా తట్టుకుని శాంతంగా పరిష్కరించగల నేర్పరి. వెన్నెల ముద్దతో చేసిన మనిషిలా అతి సున్నితమైన, నాజూకైన సౌందర్యం ఆమెది. తేనెరంగు కళ్ళు, రాగిరంగు వెంట్రుకలు, గోధుమరంగు శరీరం. కళ్ళలో తొణికిసలాడే జీవకాంతి. అన్నింటినీ మించి క్రమశిక్షణతో కూడిన ప్రతిభ. చేస్తున్న పనిలో నిజాయితీ.
జన్మతః మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలోనుండి వచ్చింది క్యాథీ. తండ్రి జాన్సన్‌ మంచి ఇండస్ట్రియలిస్ట్‌. ఫోర్డ్‌, జియంసి, టయోటా కంపెనీలకు కొన్ని కారు విడిభాగాలను ‘జస్ట్‌-ఇన్‌-టైం’ పద్ధతిలో సరఫరా చేసే పరిశ్రమ ఉందతనికి. జీవితకాలమంతా ఆ పరిశ్రమను ఉన్నతీకరించడంలోనే గడిపిన వ్యక్తి. తల్లి మేరీ గృహిణి. ఒక్కతే కూతురు క్యాథీ. తన తర్వాత తన పరిశ్రమను నిర్వహించగల సమర్థను క్యాథీలో పాదుకొల్పేందుకు క్యాథీతో బి.ఎస్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ చేయించాడు. అందులో ఆమె యూనివర్సిటీ ఫస్ట్‌ వచ్చింది. అనెహర్బర్‌లో ఉండేవాళ్లు మొదట. తర్వాత డెట్రాయిట్‌కు మారి.,

పదేళ్ళక్రితం క్యాథీ పరిచయమైనపుడు తండ్రితో కలిసి తూర్పుతీరంలో, వాషింగ్టన్‌ డి.సి. మాంగోమెరీ, గేథర్‌ బర్గ్‌, మేరీల్యాండ్‌, వీటన్‌.. అటు వర్జీనియా ప్రాంతాల్లో ఔట్‌లెట్స్‌ తెరిచి వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌కోసం సాఫ్ట్‌వేర్‌ కావాలని తనదగ్గరికొచ్చారు. అప్పుడే మొదట ఆమెను చూడడం. తర్వాత్తర్వాత నాల్గయిదు సార్లు పనులకోసమే పదేపదే తనను కలిసింది. కలిసిన ప్రతిసారీ ఏదో తెలియని ఆకర్షణ ఆమె వైపు లాగేది. మనిషిలో ఏదో ప్రత్యేకత కనిపించేది. సహజమైన అమెరికన్‌ యువతుల్లో ఉండే ఫ్యాన్సీనెస్‌, శరీరాన్ని బహిరంగంగా ప్రదర్శించే లౌల్యం కొద్ది అతిగా అనిపించే ప్రవర్తనగానీ ఏవీ ఆమెలో లేవు. పద్ధతైన అణుకువతో నిండిన వినమ్రత, అవధుల్లోనే ఉంటూ ఎదుటిమనిషిపై జరిపే తెలివైన దాడి.. యివన్నీ తనను ఎంతో ఆకట్టుకునేవి.

ఎందుకోగానీ తనపట్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకుని..”ఐయామ్‌ ఫీలింగు టు బి ఎ ఫ్రెండాఫ్‌ యు” అంది క్యాథీ అకస్మాత్తుగా..ఓసారి..
ఆమె కళ్ళలోకి చూశాడాక్షణం తను. ఏదో అనిర్వచనీయమైన లాలస.
తనక్కూడా అలాగే అనిపించింది. ఐతే క్యాథీతో అనిపించిన ఈ ఉద్విగ్నానుభవం లీల విషయంగా అనిపించలేదు.
లీలలో ఒట్టి ఆకర్షణ ఉంది. కాని క్యాథీలో దాన్ని మించిన ఇంకేదో భాషకందని నిజాయితీకి, నిర్మలత్వానికి సంబంధించిన బలమైన ఉన్మీలన శక్తి ఉంది.
క్రమక్రమంగా క్యాథీ ఇంకా ఇంకా చేరువై..ఒకరి వ్యక్తిత్వంలోకి మరొకరు తొంగి చూచుకుని, ఒకరిగురించి మరొకరు ఇంకా వివరంగా, లోతుగా తెలుసుకుని ఒకర్నొకరు చదువుకుని,
”దీన్నేమంటారు” అని అడిగాడు తను ఒకరోజు పార్క్‌లో కూర్చున్నపుడు.
క్యాథీ అంది ”మె బి లవ్‌” అని.
”ఈజిట్‌”
స్పష్టాస్పష్టంగా, ద్వైదీభావంగా, ఒక్కోసారి డోలాయమానంగా..మనిషికి ఏది కావాలో ఏది వద్దో..ఆ కావలసింది ఏమిటో, వద్దనేది కూడా ఏమిటో..మోహానికీ, కామానికీ, ప్రేమకూ తేడా తెలియకుండా గాలిలో దూదిపింజవలె తేలిపోతున్నట్టనిపించే వయసులో.,
ఎక్కడో విన్నాడు తను..’జవానీమే సువ్వర్‌ భీ సుందర్‌ లగుతా హై’ అని
వయసువల్ల వస్తున్న పరితపనా ఇది. శారీరకంగా ఉధృతమౌతున్న భౌతిక వాంఛనా ఇది. మౌనంగా యుక్తతవల్ల అంతరాంతరాల్లో రగులుతున్న యవ్వనాగ్నా ఇది.
..ఐతే..ఈ పరితపన లీలపై ఎందుక్కలగట్లేదు.
లీల కూడా..స్పష్టంగా సంకేతాలిచ్చింది తనకు చేరువకావాలని..స్నేహం కావాలని..సాంగత్యం కావాలని..కాని.. అది ప్రేమా?..వ్చ్‌..ఏమో. ఆమె కూడా దాన్ని ప్రేమ అనిగానీ మనం ప్రేమించుకుందామనిగానీ..అంతకుమించి ఇంకేదైనా అనిగానీ అనలేదు తనతో.
కాని ఏదో ఉంది లీలకు తనపట్ల..ఆ ఏదో ఏమిటి..పోనీ తనక్కూడా లీలపట్ల ఆ ఏదో ఉందా..?
అప్పుడు తనకు ఇరవై తొమ్మిదేండ్లు..అమెరికాకు వచ్చి మూడవ సంవత్సరం.
టిసిఎస్‌నుండి రాజీనామా చేసి..కొన్నేళ్ళ తర్వాత భారతదేశం తిరిగివెళ్ళి ప్రజాజీవితంలోకి వెళ్లవలసిన లక్ష్యాలనుస్పష్టంగా నిర్వచించుకుని ఒక ఎంటర్‌ప్రునర్‌గా మారాలనీ, సర్వశక్తులనూ ఒడ్డి యిక సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలనీ, తనవంటి ఆలోచనా ధోరణే కలిగిన వ్యక్తులను ఇక్కడ అమెరికాలో, అక్కడ భారతదేశంలో గుర్తించి సమీకరించాలనీ నిర్ణయించుకుని ఒక్కసారే ఒక నెలరోజుల్లోనే మూడు స్వతంత్ర వ్యాపారసంస్థలను ప్రారంభించిన సందర్భంలో,
ఒకసారి.. చాలా సూటిగా తను లీలతో ఒకనాడు, క్యాథీతో మర్నాడు జీవితంగురించి చర్చించాడు.
లీల స్పష్టంగా చెప్పింది..’మన అభిరుచులు ఒక్కటే..కాని మన గమ్యాలు వేరు’ అని. తనకు పరిచయమై రెండున్నర మూడేళ్ళు గడిచేసరికి లీల ఆలోచనల్లో, ఎత్తుగడల్లో జీవితాన్ని వ్యూహాత్మకంగా జీవించాలని సరికొత్తగా నిర్వచించుకోవడంలో ఎంతో మార్పు కనిపించింది. ఉద్యోగరీత్యాగానీ, స్వంత ఆసక్తులవల్లగానీ లీల ఆ కాలంలో ఎన్నో దేశాలను, ముఖ్యంగా భారతదేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడ్డ, ఉద్యోగరీత్యా సంభవించిన సంబంధాల వల్ల చాలా విస్తృతంగా పర్యటించింది. అనేకమంది ప్రముఖులతో కాంటాక్ట్‌ ఏర్పడింది. సంపన్న వర్గాల్లో  బయటికి కనిపించని అనేక అంతర్గత రహస్యాలనూ, వ్యాపార మూలాలనూ, లావాదేవీలనూ, మనుషులను లోబర్చుకునే అనేకానేక మార్గాలనూ చాలా లోతుగా అధ్యయనం చేసింది. ఎవరిని ఎలా టాకిల్‌ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎలా లోబరచుకుని పనిచేయడానికి ఒప్పించాలి.. ఎవరిని ఎక్కడ భయపెట్టి ఎలా బ్లాక్‌మెయిల్‌ చేయాలి వంటి రాజకీయ, కార్పొరేట్‌ విధానాలన్నింటినీ సుళువుగా అలవర్చుకుంది. ఈ చీకటి వ్యాపారాత్మక ప్రపంచంలో లోలోతులకు దిగుతున్నకొద్దీ లీల వ్యక్తిత్వంలో ఎంతో గుణాత్మకమైన మార్పులు కొట్టొచ్చినట్టు కనబడేవి. ఒక్కోసారి తనను అతిక్రమించి నియంతలా మాట్లాడేది. ప్రవర్తించేది.
”వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి రామం.. మనందరం బురదలో కూరుకుపోయి ఉన్నాం. యిక స్వచ్ఛత గురించి ఆలోచించి లాభంలేదు. బస్‌.. వర్రీ ఎబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌.. అంతే. ఇదే జీవితం.. విజయం సాధించినవాడే గౌరవింపబడ్తాడు. విజయం ఎలా సంభవించిందన్నది ముఖ్యం కాదు. సాధించింది విజయమా కాదా అన్నదే ప్రధానం.”
”అంటే..”
”అంటే..ఎర్న్‌..సంపాదించు..ఇంకా సంపాదించు..ఎదుగు.. ఎదుగు..అంతే..”
”ఎంత సంపాదించు..ఎంత ఎదుగు..”
షాకై చూచింది..తుపాకీ గుండు తాకిన జంతువులా.
”ఉహు..రామం..నువ్వు మారవు. నీకు సిద్ధాంతాలు కావాలి”
”నేనదే అంటున్నాను. నువ్వు మారవు. నీకు కేవలం డబ్బే కావాలి..నీకు డబ్బు పిచ్చిపట్టింది.”
”కాదు..నాకు ఈ కార్పొరేట్‌, కరెప్టివ్‌ పొలిటికల్‌ బాస్టర్డ్స్‌, బ్రూరోక్రటిక్‌ ప్రభుత్వ అధికారులు. వీళ్లందరి మీద కసి ఉంది..రామం నువ్వు నన్ను స్టడీ చేయలేకపోతున్నావు..విశ్వనాథన్‌ ఆనంద్‌ అద్భుతంగా చెస్‌గేమ్‌ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపిస్తాడు. అలా ఎదుటిమనిషిని ఓడించడంలో ఒకరకమైన అద్భుతానందముంటుంది. నాకు ఆ ఆనందం కావాలి. ఆనందం నేను గెలుస్తున్నందుకు కాదు.. ఎదుటివాన్ని ఓడిస్తున్నందుకు..”
”నీ దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉంది లీలా..ఐతే దాన్ని పరిమితమైన నీ వ్యష్టి అభివృద్ధి గురించీ, నీ స్వంత వికాసం గురించి మాత్రమే వెచ్చించాలనుకుంటున్నావు. అంతకంటే ఇంకాస్త విశాలంగా సమిష్టివృద్ధి గురించి ఆలోచించగలిగితే..”
”స్టాపిట్‌..సమిష్టి ఎక్కడుంది రామం..ఒకప్పటి భారతీయ జీవన వ్యవస్థలో ‘ఒక్కరికోసం అందరు..అందరికోసం ఒక్కడు ‘ విధానం ఉండేది. కాలం గడుస్తున్నకొద్దీ మనుషుల్లో నైతిక పతనం సంభవిస్తూ సంభవిస్తూ ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే తరహాలో దిగజారిపోయి అసలు మానవతా విలువల స్పృహే లేక ఒక సంకక్షుభిత వాతావారణంలో కూరుకుపోయి..నువ్వు ఏ రంగమైనా తీసుకో..రాజకీయాలు..పచ్చి వ్యభిచారంకంటే హీనం. అత్యున్నత స్థాయిలో ఉన్న ఏ పార్టీ అధినేతనైనా తీసుకో. వేల, లక్షల కోట్లను గోడౌన్లలో నగదురూపంలో కట్టలకట్టలను గోనెసంచులో నింపుకు పెట్టుకుని కదూ రాజకీయాలు చేస్తున్నది. కార్పొరేట్‌ సెక్టార్‌లో సిఇవో అన్నా, ఎమ్డీ అన్నా, వైస్‌ ప్రెసిడెంట్‌ అన్నా ఏమిటి.. ఏ జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్ట్‌నైనా కిక్‌బ్యాక్‌లతో స్వంతం చేసుకోవాలని ప్రయత్నించే వెధవకదా. శివుని శిరసుపైనుండి గంగ ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి మున్సిపల్‌ మురుక్కాలువలోకి ప్రవహించినట్టు ఈ దిక్కుమాలిన అవినీతి సమాజంలో మున్సిఫల్‌కార్పొరేటరంటే వీధిస్తాయి కాంట్రాక్టరై, ఎమ్మెల్యే అంటే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కాంట్రాక్టరై, ఎంపీ అంటే జాతీయస్థాయి కాంట్రాక్టరై, మంత్రులందరూ అంతర్జాతీయ స్థాయి బ్రోకర్లయి, దళారులై, ముఖ్యమంత్రులు మధుకోడాలుగా నేరచరితులై.. ప్రభుత్వ యంత్రాంగమంతా చిలుంపట్టి, భ్రష్టుపట్టి, ఒక కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్ష్టర్‌పై ఎసిబి దాడిచేస్తే కనీసం ఇరవై కోట్లు బయటపడే స్థితి, జాయింట్‌ కలెక్టరైతే కనీసం వందకోట్లు, ఐఏఎస్‌ అయితే వందలకోట్లు.. ఏమిటి.. ఏమిటదిది.. ప్రజలైతే ఇంకా నీచంగా పతనమై తమను తాము అమ్ముకునే స్థితిలో చచ్చిపోతున్నారు. ఉచితంగా యిస్తే పేడను కూడా తినే తత్వాన్ని అలవర్చుకుంటున్నారు. ఓట్లకోసం ఈ దిక్కుమాలిన రాజకీయనాయకులు ఉచితంగా కలర్‌ టి.విలు యిస్తే తీసుకుంటారు. విస్కీ సీసాలు తీసుకుంటారు. నగదు బదిలీ ప్రలోభాలు కలిగిస్తే తలలూపుతారు. ఉచిత కరెంటు,  ఉచిత బియ్యం, ఉచిత విద్య, ఉచిత్య ఆరోగ్యం, ఉచిత బట్టలు, ఉచిత ఆహారం, ఉచిత మోటార్‌ సైకిల్‌. ఉచిత పెళ్లాం, ఉచిత మొగుడు..నీయమ్మ…ఈ ఉచితాలు ఎక్కడ్నుండిస్తావ్‌రా వెధవా అన్నీ నీస్వంత ఆస్తుల్లోంచి యివ్వరా చవటా అని ఏ ఒక్కడైనా ఎవెర్నైనా నిలదీసి ప్రశ్నిస్తున్నారా. నలభై రూపాయలకు కిలో బియ్యం అమ్ముతున్న మార్కెట్‌నుండి రెండ్రూపాయలకు కిలో బియ్యం అసలెలా పుడ్తాయి. ఇవి జన సంక్షేమ పథకాలా, జన సంక్షామ పథకాలా..ఎవరి డబ్బును దోచి ఎవరు ఎవరికి పెడ్తున్నారు. ఎవరు ఎవరిని మభ్యపెట్టి మాయచేసి నిద్రపుచ్చుతున్నారు. పౌరులను అత్యుత్తమ బాధ్యతలతో కూడిన సామాజిక కార్యకర్తలుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ప్రజాకర్షక పథకాలతో జనాన్ని సోమరిపోతులుగా, బిచ్చగాళ్లుగా, పరాన్నభుక్కులుగా మారుస్తూంటే ప్రశ్నించే ఒక్క మేధావైనా ఈ దేశంలో ఉన్నాడా. ఎన్నికల్లో సూటిగా ‘నగదు బదిలీ’ ..అంటే నేరుగా డబ్బునే లంచంగా యిస్తా ఓటర్లకు అని ఒక నాయకుడు ప్రణాళికగా ప్రకటిస్తే దాన్ని ఒక ఆర్థిక శాస్త్రవేత్త భలే భేషయిన ఆలోచనగా ప్రశంసించి పరమ కుచమర్థన స్థాయిలో  శ్లాఘిస్తే..అసలీ దేశం, ఈ వ్యవస్థ ఏమైపోతోంది. ఎక్కడికి పోతోంది. ఎట్నుండి ఏదిశలోకి ప్రయాణిస్తోంది.
దేశానికి వెన్నెముకవంటి యువత ఈ దేశంలో ఏ కార్యకలాపాల్లో మునిగి ఉందో చెప్పు రామం. ఏ స్థాయి యువతీ యువకుణ్ణయినా తీస్కో..చేతిలో సెల్‌ఫోన్‌, చేయిచాచితే బూతు వెబ్‌సైట్లతో విరాజిల్లే ఇంటర్నేెట్‌, టి.వి. ఆన్‌ చేయగానే ఒక సముద్ర కెరటంలా పైనబడే బూతురోత, దిక్కుమాలిన కుక్కలకొట్లాటవంటి ‘మేధావుల’ చర్చలు, అడ్డూ ఐపూలేని అవసరానికి మించి లెక్కకు మిక్కిలి ఆరువందల ఎనభై ఇంజినీరింగు కాలేజీలు, రెండున్నర లక్షలకు పైగా చెత్తవలె ప్రతి సంవత్సరమూ తయారై ఈ దేశపు రోడ్లమీద వ్యాపించే నాన్‌ ఎంప్లాయబుల్‌ ఫేక్‌ ఇంజనీర్ల కంపు. అసలు పాఠాలే చెప్పని ప్రొఫెషనల్‌ కాలేజీలు, ప్రమాణాలు, నాణ్యత అంటే ఏమిటో తెలియని విద్యాబోధనా పద్ధతులు, వ్యాపార కేంద్రాలుగా మారి విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలు..ఏ ఒక్క యువకునికైనా సమాజస్పృహ, దేశ స్పృహ ఉందా..ఈ దిక్కుమాలిన దుస్థితిని సరిచేద్దామన్న కనీస ఆలోచన ఉందా..”
”నేనూ అదే అంటున్న లీలా..కనీస ఆలోచనైనా ఉందా అని.. నీవంటి ప్రతిభాశీలియైన యువతికైనా దేశంగురించిన కనీస స్పృహ ఉండాలి గదా అని నేనంటున్నా..అందరూ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే..దీపాన్ని వెలిగించేదెవ్వరు.. నీవంటి జీనియస్‌ కనీసం సమాజం యింత బీభత్సంగా చెడిపోయిఉందని గ్రహించడమే విశేషం..ఐతే దానిని శుభ్రపర్చే మార్గం అన్వేషించి ఏదో ఒక పరిష్కారం కనుక్కొని అమలు చేయకుండా ఊర్కే ఎదుటివాళ్లను విమర్శిస్తూ కూర్చుంటే.. మిగతా వాళ్ళకూ మనకూ తేడా ఏమిటీ అని..”
లీల ఉలిక్కిపడి చూచింది రామంవైపు.
”నాకు ఈ వ్యవస్థమీద కసిగా ఉంది రామం”
”కాబట్టి..”
” ఈ అసమర్థ పాలకులు, అవ్యవస్థితమైన వర్తమానం, కొద్దిగా తెలివీ, నీతిహీనతా, ఎక్కువ ధైర్యం ఉన్న ఎవరైనా రాక్షసంగా ఎదిగి ఎదిగి విజృంభించగల ఈ ప్రస్తుతస్థితిలో ఒకసారి కసిగా ఈ వ్యవస్థలో ఆడుకుని నన్నునేను పరీక్షించుకోవాలనుకుంటున్నా..లైకె ఎ గేమ్‌ ఐ వుడ్‌ లైక్‌ టు మేక్‌ ది లైఫ్‌ ఎ ఛాలెంజింగు టాస్క్‌ అండ్‌ ఎంజాయ్‌”
”ఊఁ.. చివరికి ఏం సాధిస్తావ్‌..”

”ఆ ప్రశ్నే అనవసరం..ఆనందించడమే జీవితం..అందరూ పైశాచికమైన చర్య ప్రతిచర్యలతోనే ఆనందిస్తున్నారీ ప్రపంచంలో. ఇరాక్‌పై దాడిచేయం బుష్‌కు ఆనందం..ప్రజలను వెధవలను చేసి కోట్లు కోట్లను సంపాదించి ప్రపంచంనిండా బ్రాంచీలతో ఎదగడం, పైగా నీతులను, బోధనలనూ కొనసాగించడం భారతదేశపు ఏమతానికి చెందిన స్వామికైనా ఆనందం, ప్రజలపై డబ్బును కుమ్మరించి.. బిచ్చగాళ్ళ గుంపుపైకి కరెన్సీ నోట్లను ఎగజల్లి ఏరుకుంటూ వాళ్ళు కొట్టుకుని చస్తూంటే సంతోషించడం ఈ రాజకీయ నాయకులకు ఆనందం. కార్పొరేట్‌ ప్రపచంలో అంతులేని డబ్బును ప్రోగుచేసుకుంటూ  ఫోర్బెస్‌ జాబితాలోకి దూసుకుపోవాలనుకోవడం ఇంకొందరికి ఆనందం..ఎవని ఆనందాన్ని ఎవడు నిర్వచించగలడు. ఎవని ఆనందాతిరేకాలు తప్పని ఎవరిని ఎవడు నిరోధించగలడు. నో థియరీ ఫిట్స్‌ టు ద సిస్టమ్‌..”
”కుళ్ళిపోయి, భ్రష్టుపట్టిపోయి..తెలివైన సామాజిక స్పృహ ఉన్న మనవంటి యువతనుండి ఏదో ఒక చికిత్సను కోరుతున్న వర్తమాన భారతదేశస్థితిని నువ్వు చూస్తున్న దిశ లోపభూయిష్టంగా ఉంది.లీలా”
”కావచ్చు..మూడువేలకోట్ల రూపాయల స్కామ్‌లో కోర్టులో సాక్ష్యంచెబ్తూ హర్షద్‌మెహతా ఏమన్నాడో తెలుసా రామం.. నేను అంతా భారతదేశ సెబీ నిర్దేశించిన రూల్స్‌ ప్రకారమే చేశాను..తప్పేదైనా ఉందీ అంటే అది లోపభూయిష్టమైన మీ దిక్కుమాలిన రూల్స్‌లో ఉన్నాయి. దమ్ముంటే మీ రూల్స్‌ను సరిచేసుకుని సవరించుకోండి. లేకుంటే ఆ కుళ్ళులోనే కుళ్లిచావండీ అన్నాడు.. మొన్న వేలకోట్ల రూపాయల స్టాంప్‌పేపర్ల కుంభకోణంలో తెల్గీ కూడా అదే అన్నాడు..ఎక్కడని ఈ వ్యవస్థను రిపేర్‌ చేస్తావు రామం. దిస్‌ సిస్టమ్‌ ఈజ్‌ ఇర్రిపేరబుల్‌. దీని సర్వాంగాలూ కుళ్లిపోయినై..”
”అందుకే. మరమ్మత్తుకు లొంగనపుడు, సాధ్యంకానపుడు మొత్తం వ్యవస్థనే మార్చాలి. ధ్వంసానంతర పునర్నిర్మాణం జరగాలి.”
”కదా.. అందుకే ఈ వ్యవస్థయొక్క సంపూర్ణ ధ్వంసానికి నేను ఉపక్రమిస్తున్నా..తదనంతర పునర్నిర్మాణం నువ్వు చెయ్‌” అంది లీల స్పష్టంగా..నిశ్చలం.
అప్పుడు..ఆ రోజు కూడా భీకరమైన వర్షమే..ఈ చర్చ..ఒక సాయంకాలం రిహోబోత్‌ బీచ్‌ స్టార్‌బక్‌ కాఫీ షాప్‌లో జరిగింది. ఎదురుగా..లోపలికి చొచ్చుకొచ్చిన అట్లాంటిక్‌ మహాసముద్రం..ఒక ఎడతెగని నిరంతర తరంగ ఘోష మధ్య.
మొత్తంమీద లీల గురించి తనకు తెలిసిన మూడేళ్ళలో అర్థమైందేమిటంటే, ఆమె అసాధారణ ప్రతిభాశీలి. మృదు హృదయిని. సున్నిత మనస్కురాలు..కాని కఠిన క్రమశిక్షణతో కఠోర పరిశ్రమ చేసే తత్వం గలది. కొన్ని నిర్ణయాలను నిర్దయగా తీసుకుంటుంది. ప్రేమ అనే పదం ఆమెలో లేదేమో అన్నంత అతి తక్కువ మోతాదులో ఉంది. సంగీతాన్ని  యిష్టపడ్తుంది. తాత్విక స్పందనలుంటాయి. ఐతే ఎందుకో అలెగ్జాండర్‌లో ఉన్నట్టు ఈ సమస్త ప్రపంచాన్ని జయించాలన్నంత బలమైన ఉత్తీర్ణతాకాంక్ష ఉందామెలో. ఆమెది సున్నితమైన మల్లెపరిమళంవంటి అందం. సంభాషణ అర్ధవంతమైన ఆకాశంలా గంభీరమైంది.
”నాకో సంశయముంది రామం” అందొక సందర్భంలో ఆరోజే..అట్లాంటిక్‌ సముద్రం ముందు.
ఇద్దరూ ఇసుకలో నడుస్తున్నారప్పుడు..అలల రొద నడుమ.
రామం మౌనంగానే ఆమెవైపు చూశాడు.
”నేను నాకు తెలియకుండానే నిన్ను ప్రేమిస్తున్నానేమోనని..”యథాలాపంగానే కాని లోలోతుల్నుండి వస్తోందామాట.
”…..”
”చాలా జాగ్రత్తగా నన్ను నేను విశ్లేషించి చూచుకుంటే.. నువ్వు కొంతవరకు నాలో విస్తరించి ఇప్పటికే అల్లుకుపోయావని కూడా అనిపిస్తోంది.”
”…..”
”నీకేమనిపిస్తోంది”
”నిజానికి నాలో ఏ భావమూ లేదు లీలా..నా మనసంతా ఈ సహజమైన శారీరక స్పందలనకతీతంగా ఒక యుద్ధం ఆవరించి ఉంది. వ్యక్తి కంటే వ్యవస్థ, వ్యవస్థ కంటే మానవ సమూహం, మానవ సమిష్టి కంటే దేశం, దేశంకంటే విలువలతో కూడుకున్న ఆత్మ ఉన్నతి.. యివే అతి ప్రధానమై నానిండా ఒక సముద్రమై గర్జిస్తున్నాయి. సముద్రమంటే ఒట్టి నీరు.. ఒక్కోసారి మౌనమై, ఒక్కోసారి ప్రళయమై, అగ్నిపర్వతాలనుకూడా తన గర్భంలో దాచుకుని నిర్మలంగానవ్వే నీరు.. నాలో ఏదో నిర్గుణాత్మకమైన రాహిత్యత ఉంది లీలా..”
”…..” లీల మాట్లాడలేదు. కోటి ప్రశ్నలను, అర్ధింపులను నింపుకున్న చూపులతో చూచింది రామం వంక.
ఆ క్షణం అతనికి ఆమెపట్ల మమకారం నిండిన ‘ఈమె కావాలి’ అన్న భావం బలంగా కల్గింది.. వెంటనే ఆమె చేతినితన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు.
లీల పులకించిపోయింది.
కొద్దిసేపు అలాగే ఇద్దరూ నడచి..నడుస్తూనే..మౌనమై..కోటి సంభాషణలై..శతకోటి ఉద్వేగాలై.,
”నేను రేపు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను రామం..నన్ను నేను విజేతగా మల్చుకునేందుకు ప్రయోగాత్మకంగా ఈ లోపభూయిష్టమైన వ్యవస్థను నాకనుకూలంగా మలచుకునేందుకు యిక విజృంభించబోతున్నాను. చూస్తా..ఒక వ్యక్తి ఎలా ఒక బలీయమైనా శక్తిగా మారి శాసించగలదో సాధించి ఆత్మపరీక్ష జరుపుకుంటా.. అందుకే నీతో ఈ రోజు ప్రత్యేకంగా కలవాలని ఈ ప్రోగ్రాం..”
”మన యిద్దరి లక్ష్యాలు దాదాపు ఒకేరీతైనవి లీలా..ఐతే నీది దక్షిణ ధుృవమైతే నాది ఉత్తర ధుృవం..నువ్వు ఎన్నుకున్న దారీ, ఎంతో రిస్క్‌తో నిండిన సాహసోపేతమైన సాధన..అంతా గొప్పదే ఐనా లక్ష్యం ఋణాత్మకమైంది. నా దారీ నీ దారే ఐనా.. నా గమ్యం నిర్మాణాత్మకమైంది..”
”కావచ్చు..కాని..”లీల..ఒట్టిగానే నడిచింది వెంట..చాలాసేపు..ఏమీ మాట్లాడకుండా.
తర్వాత.. ఇసుకలోనుండి సముద్రంతో దూరమై..కార్లో పయనించి పయనించి డెలావర్‌..మేరీల్యాండ్‌.. పోర్‌ నైంటీఫైవ్‌ ఇంటర్‌స్టేట్‌..రాక్‌ విల్లీలో దిగిపోయింది.
చటుక్కున ఒక తార తెగిపోయింది..,
తర్వాత భారత కార్పొరేట్‌ వ్యవస్థలో, రాజకీయ, ఉన్నత సంపన్న వర్గాల వ్యూహాత్మక వ్యాపార లావాదేవీల్లో, కుతంత్ర రచనల్లో లీల ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం, విస్తరిల్లడం రామంకు తెలుస్తూనే ఉంది ఎప్పటికప్పుడు.
ఉండి ఉండి.. ఏ దేశంనుండో చటుక్కున ఏ రాత్రో, పగలో అకస్మాత్తుగా ఫోన్‌ చేస్తుంది లీల. నాల్గయిదు వాక్యాలు, లోలోపల గుప్తమైఉన్న ఆత్మ మాట్లాడ్తున్నట్టు వర్షమై కురుస్తుంది. అప్పుడప్పుడు అనూహ్యంగా అమెరికాలో కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది. ఒక మెరుపులా వచ్చి మరుక్షణం మాయమైనట్టు నిష్క్రమిస్తుంది.
మొత్తంమీద ఆమె మనసులో మాసిపోని ఓ ముద్రయి తనున్నాడు..ఉంటాడు..శాశ్వతంగా. ఆ విషయం తనకు తెలుసు.
ఐతే ఇటువంటి ఆత్మానుగత అంతస్సంబంధాన్ని ఏమంటారు.
వర్షం కురుస్తూనే ఉంది..చినుకులు ఎక్కువై, చిక్కనై..బయటా..అప్పట్నుండి లోపలా.,
కారును పార్కింగు ఏరియాలో ఆపి, పక్కనే ఉన్న గొడుగును తీసుకుని..దిగి..చీకటి అలుముకుంది అప్పటికే.. చుట్టూ అనేక దుకాణాలు..వందల కార్లు..వాల్‌మార్ట్‌, హోమ్‌ డిపో, రైట్‌ ఎయిడ్‌, పెట్‌మార్ట్‌, కోల్స్‌, బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌,
‘చాలా సేపే ఐంది – క్యాథీ ఎదురుచూస్తూంటుంది.’ అనుకుంటూ రామం వర్షంలో వడివడిగా అడుగులు వేసుకుంటూ.,
క్యాథీకి తనకూ నడుమ ఇప్పుడు జరుగబోయేది అతీ కీలక సమావేశం. రెండు జీవితాలకూ, రెండు అసమాన ప్రతిభా విశేషాలు ఒకటిగా సంధానమై ఒక నిర్ణయాత్మక శక్తిగా రూపొందడానికి ప్రాతిపదిక ఏర్పడే.. తమకు సంబంధించినంత వరకు ఓ అతి ప్రధాన సందర్భం..అందుకే క్యాథీని అవసరమైతే నాల్గయిదు గంటలసేపు విపులంగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా సిద్ధపడి రమ్మని చెప్పాడు రామం.
అతని మనసు నిజంగా వర్షం కురుస్తున్న రాత్రివలెనే చిత్రంగా, గంభీరంగా ఉంది.
చటుక్కున ఒక జ్ఞాపకం రామం హృదయంలో పిడుగై కురిసింది.

(సశేషం)

Download PDF

12 Comments

 • lalitha.R says:

  మనిషికి సమాజ చింతన,తపన,బాధ్యతోకూడిన పౌర స్పృహ …ఇవన్నీ క్రమంగా మేధో బలహీనతలుగా మారుతున్నాయా అని ఇప్పటి ఈ అరాచక తరం పదే పదే రుజువు చేస్తున్న వర్తమాన సందర్భంలో..ఈ రచయితకు ఎందుకో ఈ క్షోభ .
  లలిత.ఆర్. ( మిసెస్ మౌళి )

 • DrPBDVPrasad says:

  పూర్తిగ చదివిన తర్వాతనే అనుభూతిని పంచుకోవాలని అనుకొని కూడ..
  స్పృహ,చింతన.బాధ్యతలే పరిణామ క్రమంలో క్షోభగానూ,తరవాత్తర్వాత చైతన్యదీప్తిగానూ రగులుతాయి. .ఇదిచారిత్రక సత్యం
  ప్రతియుగం(సాహిత్య యుగం స్మ)లోనూ ఆ బాధ్యతలను అందిపుచ్చుకున్న వారు ఉండబట్టె మంచి సాహిత్యం ఇంకా ఈ రీతిగ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుంది.కొంచెం ఆలస్యమైనా చేరేవాళ్ళ దగ్గరికి చేరుతుంది (దగ్గర వుండి రచయితను చూసేవారికి ఉండే ఈ ఆవేదన అర్థం చేసుకోవాల్సినదే )

  • raamaa chandramouli says:

   డాక్టర్ గారూ.. ధన్యవాదాలు ..మీరన్నట్టు వ్యక్తి చైతన్యం, వ్యష్టి ఆత్మవికాసమే క్రమంగా సామూహిక పరివర్తనగా రూపొంది ప్రభంజనమౌతుంది.ఒక ఉద్దీప్తమైన జనప్రవాహాన్ని స్వప్నించి.. వాస్తవపర్చి ఒక నూతన తరాన్ని తయారుచేయాలని మే,2010 లో రాసిన నవల ఇది.కాని ఏ తెలుగు ప్రింట్ మీడియా పత్రికా దీన్ని ప్రచురించే సాహసం చేయలేదు.ఇన్నాళ్ళకు ప్రగతిశీల దృష్టితో ,ధైర్యంతో ఈ నవలను మన ‘ సారంగ’ సంపాదకవర్గం ప్రచురిస్తోంది.ఒక రచన వెలుగు చూడడం ఆలస్యమైతే ఏమౌతుందంటే..
   ఈ నవల అప్పుడే వస్తే..దీంట్లోనుండి ఒక అరవింద్ కేజ్రీవాల్ పుట్టుకొచ్చేవాడు..ఇప్పుడు అరవింద్ కేజ్రీవల్ ను చూసి నవల పుట్టినట్టనిపిస్తోంది..ఇంకా ఇలాగే ఇంకొన్ని పాత్రలు.
   రచన సరియైన సమయంలో రాకుంటే అది ‘ ఎక్ష్పైర్డ్ మెడిసిన్ ‘.
   సంపాదకులకు ధన్యవాదాలు..ఒక అంతర్జ్వలనను పాఠకులకు అందిస్తున్నందుకు.
   – మౌళి,వరంగల్

 • ramarao.v says:

  లీల ఒక వ్యవస్థ. రామం కూడా ఒక వ్యవస్థే. ఐతే ఇద్దరి దృక్పథాలు వేరు.వ్యక్తి వ్యవస్థగా మారడం ఒక దీర్ఘకాలిక కృషి ఐతే వాళ్ళ లక్ష్యాలు కీలకమై శాసిస్తాయి సమాజాన్ని.
  మౌళి గారు యువతలో వృద్ధి చెందవలసిన ఆలోచనలను ప్రతిపాదిస్తున్నారు.ఇది హర్షణీయం.అభినందనలు.
  రామారావు.వి.హైదరాబాద్

 • shamala.k says:

  సమాజ హితమే సాహిత్యమైతే.. మౌళి గారి ఈ నవల ప్రయోజనకరమైందే ..రచయితా స్వయంగా చెప్పుకున్నట్టు ..ప్రచురణ ఆలస్యం కావడం వల్ల రూపూ,ప్రభావం మారుతాయి.అయినా మంచి రచన ఆలస్యంగానైనాసరే రావడం ఆనందకరం.
  డా.శ్యామల.కె ,ఢిల్లీ

 • Ashish kontham says:

  Nice story..good depth.. :)

 • Dr. V. GANESH says:

  i have been going through this serial since beginning. The progressive attitude of the writer is very constructive. Thanks to my favorite writer sri Raamaa Chandramouli

  Dr. V.GANESH
  HYDERABAD

 • P.VINAY RAJ says:

  Nice story, the way of characterization of characters in the story is superb. Thanks for giving a such beautiful serial,,,,,

 • karuna says:

  రామం పాత్ర, లీల పాత్ర రెండూ విభిన్న తత్వాలతో సాగుతూ ఆసక్తిని కలిగిస్తున్నాయి . ఆలోచనలే కదా మనిషి జీవితాన్ని నిర్మించే మూల పదార్ధాలు . మంచి నవలను అందిస్తున్న మౌళి గారికి , సంపాదకులకు ధన్యవాదములు …..

 • amarajyothi says:

  ప్రతివారం ఆసక్తితో చదివించడమే కాక ఆలోచిమ్పచేస్తోంది చాల బావుంది రచయిత రామ చంద్ర మౌళిగారికి అభినందనలు సంపాదకవర్గానికి ధన్యవాదములు

 • rajaram.m says:

  ”వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి రామం.. మనందరం బురదలో కూరుకుపోయి ఉన్నాం. యిక స్వచ్ఛత గురించి ఆలోచించి లాభంలేదు. బస్‌.. వర్రీ ఎబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌.. అంతే. ఇదే జీవితం.. విజయం సాధించినవాడే గౌరవింపబడ్తాడు. విజయం ఎలా సంభవించిందన్నది ముఖ్యం కాదు. సాధించింది విజయమా కాదా అన్నదే ప్రధానం.”
  ”అంటే..”
  ”అంటే..ఎర్న్‌..సంపాదించు..ఇంకా సంపాదించు..ఎదుగు.. ఎదుగు..అంతే..”
  ”ఎంత సంపాదించు..ఎంత ఎదుగు..”
  షాకై చూచింది..తుపాకీ గుండు తాకిన జంతువులా.
  …….ఈ లొలోతుల అంశాలను తడుముతోందీ నవల.అందుకు ….
  రాజారం.ఎం.వరంగల్

 • Gyaneswar M says:

  నవల చాలా అద్భుతంగా ఉంది. బాగా నచ్చింది. కథలో లోతైన భావం ఉంది . వచ్చే కొత్త భాగం కొరకు ఆసక్తిగా వేచి చూస్తున్నాము.

  జ్ఞానేశ్వర్, ఫిలదేప్ల్హియా, USA

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)