యూరపు వరకూ ఆర్యావర్తమే!

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

మళ్ళీ నేనిప్పుడు ఓ పెద్ద చిక్కులో పడిపోయాను…!!

తెలియకుండానే రాంభట్ల పురాచరిత్రాధ్యయనం అనే అఖాతంలోకి అడుగుపెట్టేశాను. దీనినుంచి ఎలా గట్టెక్కాలన్నది ఈ క్షణాన నా ముందు వేలాడుతున్న ప్రశ్న. ఎలాగూ మునిగాను కనుక ఇంకా లోపలికి వెళ్లిపోతే ఎప్పటికి ఒడ్డు చేరతానో నాకే తెలియదు. ఇందుకు బహుశా మరో ఇరవై వ్యాసాల వ్యవధి పడుతుందని నా అంచనా. అది కూడా ప్రాథమిక అంచనా మాత్రమే. కానీ నేను గత తొమ్మిది వ్యాసాలుగా యయాతి-దేవయాని-శర్మిష్టల కథ గురించి రాస్తున్నాను. ముందుగా ఆ కథను గట్టెక్కించవలసిన బాధ్యత నాకుంది.

విషయంలోకి వెడుతూనే  ఆ కథతో పాటు నన్ను నేను గట్టెక్కించుకునే ఉపాయాలను వెతుక్కోవడం తప్ప గత్యంతరం కనిపించడం లేదు…

అయితే, ఇంతటి చిక్కులోనూ నాకు అమితమైన సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించే అంశం ఒకటుంది. అది, రాంభట్ల కృష్ణమూర్తిగారి అధ్యయనం గురించి రాయడం! దశాబ్ద కాలం క్రితం కన్ను మూసిన ఆయన గురించి ఇప్పుడు ఎంతమంది తలచుకుంటున్నారో నాకు తెలియదు. పత్రికా రచయితగా, వ్యంగ్యచిత్రకారుడిగా ఆయన ప్రస్తావన ఎక్కడైనా వస్తూ ఉండచ్చు. కానీ ఆయనకు అత్యంత ఇష్టమైనదీ, ఆత్మీయమైనదీ అయిన పురాచరిత్ర లేదా పురామానవ చరిత్రాన్వేషణ గురించి ఎవరూ మాట్లాడుకుంటున్నట్టు లేదు. అదాయన ఒక తపస్సుగా సాగించిన ఓ కృతజ్ఞతారహిత (thankless) వ్యాసంగం. ‘నేను మాత్రమే’ దాని గురించి రాస్తుండడం నా సంతృప్తికీ, సంతోషానికీ కారణం.  ఇలా ‘నేను మాత్రమే’ ననుకోవడంలో కొంత అజ్ఞానమూ ఉంటే ఉండచ్చు. అందుకు మన్నించాలి. ఇప్పుడాలోచిస్తే, నాలాంటి ఒకరినో, పదిమందినో పాఠకులను సృష్టించుకున్న ఆయన తపస్సు వృథా కాలేదనీ అనిపిస్తుంది. ఒక గొప్ప తపః ఫలితమైన ఒక సృష్టి కాలం వెంబడి తన అస్తిత్వాన్ని పొడిగించుకోడానికి ఆయా కాలాలలో ఒక్క పాఠకుడు ఉంటే చాలదా అనిపిస్తుంది.

ప్రస్తుతానికి వస్తే…

పశ్చిమాసియా రంగస్థలమే భారతదేశానికి మారినట్టు రాంభట్ల గారి పరిశీలన వెల్లడిస్తుందని కిందటి వ్యాసంలో చెప్పుకున్నాం.  వైదికార్యులకూ, అసురులకూ మధ్య మొదలైన వైరం కూడా అందులో భాగం. ఇంతకీ ఆ వైరం ఎందుకు సంభవించింది అంటే, వారి ఆహారపు అలవాట్లలోనూ, ఆహారోత్పాదన పద్ధతుల్లోనూ ఉన్న తేడాల వల్ల. అది  మనుగడకు సంబంధించిన  పెనుగులాట.

ఎలాగంటే,  అసురులు వ్యవసాయదారులు. అలాగని వారు పూర్తిగా శాకాహారులు కాదు, మాంసమూ తింటారు. ఆవిధంగా వారు మిశ్రాన్న భోక్తలు.  వైదికార్యులు సంచారజీవనులైన  పశుపాలకులు. వారి ప్రధానాహారం పశుమాంసం. పశుమాంస భక్షణం వల్ల, పాలు, వెన్నల వల్ల వారు నిజానికి రాక్షసుల కంటే బలిష్ఠులు. వ్యవసాయదారులకు ఆహారాన్ని పండించే పంట పొలాలు, వైదికార్యుల దృష్టిలో ప్రధానంగా తమ పశుగణాలకు ఆహారాన్ని అందించే పచ్చిక పొలాలు మాత్రమే. వారు తమ ఆలమందలను పంట పొలాల మీదికి తోలేసరికి అసురులు సహజంగానే వారిని ప్రతిఘటిస్తారు. ఆవిధంగా మొదలైంది వారి మధ్య శత్రుత్వం.

అయితే, వైదికార్యులు సంచారజీవులు కనుక వారికీ, అసురులకూ మధ్య యుద్ధాలలో కూడా కొంత విరామం ఉంటుంది. సంచారజీవనం వల్ల అసుర భూమి కన్నా ఆర్యభూమి చాలా విశాలంగా కూడా ఉంటుంది. మైదానాలలో గడ్డి పుష్కలంగా దొరకడం వల్ల మందలు త్వర త్వరగా పెరిగాయి. అప్పటికి ఆర్యులు యూరప్ లో ఉన్నారు. అక్కడ మూడే కాలాలు: శరత్, హేమంత, వసంత కాలాలు. ‘నూరు శరత్తులు, నూరు హేమంతాలు, నూరు వసంతాలు జీవించు’ అని నేటికీ వైదికాశీర్వచనం. శరత్కాలం చివరిలో భూహిమం ప్రారంభమవుతుంది. భూహిమాన్ని ‘ground frost’ అన్నారు. అప్పుడు పచ్చగడ్డి మాడినట్లు అయిపోతుంది. దాంతో ఆర్యులు ఆలమందలను తోలుకుని సమీపంలోని అరణ్యాలకు వలసపోతారు. అక్కడ చర్మంతో కుటీరాలు నిర్మించుకుని ఉంటారు. ఆలమందల రక్షణ కోసం ఒక వసతీకీ, ఇంకొక వసతికీ మధ్య కొంత నిర్జనారణ్యాన్ని విడిచిపెడతారు. ఆ దశలోనే త్రేతాగ్నులు అవతరించాయి. వాటి గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.

వసంతాగమనంతోనే వైదికార్యుల నిర్బంధ అరణ్యవాసం ముగుస్తుంది. వారు యధాప్రకారం ఆలమందలను తోలుకుని నదీ మైదానాలకు తిరిగివస్తారు. అప్పటికి మైదానాల రూపం మారిపోతుంది. వ్యవసాయం పెరటి నుంచి పొలాలకు పాకుతుంది. అక్కడక్కడ కూరాకులు, కూరగాయ పాదులు పచ్చపచ్చగా ఎదిగివస్తాయి. ఆ దృశ్యం వైదికార్యులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ మందలను పొలాల మీదికి తోలతారు. అలా వ్యవసాయదారులతో వారి ఘర్షణ ప్రారంభమవుతుంది.

aurora-borealis-by-ship-2-thomas-kolendra

అదలా ఉండగా, మధ్య ఆసియాలో రష్యా, అజర్బైజాన్, ఇరాన్, కజక్ స్తాన్, తుర్క్ మెనిస్తాన్ లను ఆనుకుని ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక జలాశయం ఉంది. అది ఎంత పెద్ద దంటే, దానిని సముద్రంగానే చెప్పుకున్నారు. అదే- కాస్పియన్ సీ. దీనిని మన పూర్వులు కాశ్యపీ సముద్రం అన్నారు. ఆ పేరునుబట్టి ఆ జలాశయం పరిసర ప్రాంతాన్ని కూడా కాశ్యపి అంటూ వచ్చారు. కాశ్యపి అన్నా భూమే. విశేషమేమిటంటే, కాశ్యపి ఒకప్పుడు  యూరోపియన్లు, నిగ్రాయిడ్లు, మంగోలాయిడ్లు వంటి అనేక జాతులవారికి, భాషల వారికి ఆవాసం. ఆనాడు జాతులంటే వర్ణాలే. యూరోపియన్లది తెలుపు రంగు, నిగ్రాయిడ్లది నలుపు రంగు, మంగోలాయిడ్లది పసుపు రంగు. సంస్కృతం తోబుట్టువులైన ఇండో-యూరోపియన్ భాషలు; మ్లేచ్ఛ భాషలైన హిబ్రూ, అరబ్బీ, అరమాయిక్, ఆగద, అసుర, ఈజిప్టు భాషలు; చీనా, జపాన్, మంగోలు, కాకస పర్వత భాషలు మాట్లాడేవారు కాశ్యపిలో ఉండేవారని రాంభట్ల ‘జనకథ’లో అంటారు. అందుకే ఈ మూడు రకాల భాషల్లోనూ కొన్ని సామాన్య పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, భూమిని అరబ్బులు ‘అర్దున్’ అంటారు. జెర్మన్లు ‘ఎర్దీ’ అంటారు. ఇంగ్లీష్ వారు ‘ఎర్త్’ అంటారు. వేదభాష ‘రజ’ అంది.

 

అదలా ఉంచితే, పశ్చిమ పండితుల ప్రకారం ‘కస్’ అనే ధాతువునుంచి కశ్యప శబ్దం పుట్టింది. ఆ ధాతువునుంచే ఇంకా మరికొన్ని మాటలు పుట్టాయి. వాటిలో ‘కుశ’ ఒకటి. వైదికార్యులకు కుశ చాలా పవిత్రమైనది. దానికే ‘దర్భ’అనీ, ‘బర్హిస్సు’ అనీ పేర్లు. ఇంకా విశేషంగా, కస్ ధాతువునుంచే తెలుగు మాట అయిన ‘కసవు’ పుట్టిందని రాంభట్ల అంటారు. గడ్డి అనే అర్థం కలిగిన ‘పులు’, ‘పూరి’  కసవుకు సమానార్థకాలు. ఇవి పుష్కలంగా ఉన్న కాశ్యపిలోనే పశుపాలన పెరిగి పెద్దదై ఉంటుందని రాంభట్ల  ఊహ.  క్రమంగా కాశ్యపిలో స్థిర నివాసం ఉండగల అవకాశం లోపించడంతో కాశ్యపీజనం కొత్త భూముల్ని వెతుక్కుంటూ వలసపోయారు. ఆ వలసల్లో కొన్ని పశ్చిమాసియాలో చరిత్రను సృష్టించాయి.

మనం ఇంతకుముందు ఒక వ్యాసంలో కశ్యప ప్రజాపతి గురించి చెప్పుకున్నాం. దేవతలు, దైత్యులు, దానవులు ఆయన సంతానమే నని కూడా చెప్పుకున్నాం. కశ్యపుని పేరు కాశ్యపిని తలపిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్వదేవులు అనే పేరు కూడా ఉన్న దైత్యదానవులే అసురులు. పశుపాలక దేవులైన వైదికార్యులకూ, ఈ అసురులకూ మధ్య యుద్ధాలు కాశ్యపిలోనే ప్రారంభమయ్యాయి. బలవంతులైన వైదికార్యులు యుద్ధాలలో పై చేయిని చాటుకుని అసురులను పశ్చిమాసియా ఆవలలోకి తరిమేసి ఉంటారని రాంభట్ల ఊహ.

ఆవలు అంటే చిత్తడి నేలలు. ఆ నేలల్లో దోమలు, తేళ్ళ బాధ ఎక్కువ. ఒకప్పుడు నైలు, యూఫ్రటిస్, టైగ్రిస్(ఈ రెండు నదులనూ సంస్కృతంలో వరుణ, తిగృథ అన్నారు) నదీ ముఖద్వారాలు ఆవలుగా ఉండేవి. అసురులు కాందిశీకులుగా ఈ ఆవలకు వలసవచ్చారు. అక్కడి దోమలు, తేళ్ళ బాధను సహిస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. ఆ ఆవల్లో రకరకాల తుంగ మొలిచేది. ఆ తుంగ ముస్తల కోసం వరాహాలు వచ్చి నీటిని ఓడ్చి పొడి భూమిని పైకి తేల్చేవి. ఆవిధంగా, నేల దున్ని సాగించే వ్యవసాయానికి వరాహాలు ఆదిగురువులయ్యాయి. ఆవల్లో చేపలు కూడా పుష్కలంగా దొరికేవి. అడవి పందులు, జలపక్షుల మాంసం దొరికేది. ఈ అన్న పుష్కలత్వం వల్ల, అది కలిగించిన స్థిరతవల్ల ఇక్కడికి వలస వచ్చిన జనం గొప్ప సంస్కృతిని నిర్మించారు.  నైలు నది ఆవలలోని జనం ఈజిప్టు(ఐగుప్త) సంస్కృతినీ, మేరువులనూ సృష్టిస్తే; మెసపొటేమియాగా పిలవబడిన యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల ఆవల్లోని జనం సుమేరు సంస్కృతిని సృష్టించారు. మన పురాణాలలోని వరాహావతార, మత్స్యావతార కథలకు ఈ ఆవలే ఆధారమని రాంభట్ల అంటారు. ఇనుము కరిగించడం నేర్చింది కూడా ఈ పశ్చిమాసియా లంక జనమే నని ఆయన అంటారు. పశ్చిమాసియా ఆవలలో పదివేల ఏళ్లక్రితం ‘సుబరు’ లనే గొప్ప సంస్కారులు ఉండేవారని, వారే ‘శంబరు’లు అయుంటారనీ ఆయన అభిప్రాయం. పశ్చిమాసియాలో శంబరుల చారిత్రక పాత్ర చాలా ఉంది. అక్కడ వారు మారి, అస్సూరు, నినవే అనే నగరాలను నిర్మించి రాజ్యాలు చేశారు. మన పురాణాలలో శంబరుడు ఒక అసురుడు, మన్మథుడికి శంబరారి అనే బిరుదు ఉంది. పశ్చిమాసియా నుంచి  శంబరులు భారతదేశానికి వచ్చినట్లు దాఖలాలు ఉన్నాయి.

 

పశుపాలకులకు, వ్యవసాయదారులకు మధ్య యుద్ధాలు కాశ్యపి పరిసరాలలోనే కాక ఆఫ్రికా ఖండంలో కూడా జరిగాయి. ఆ వివరాలు అన్నిటిలోకీ వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం.  అదలా ఉంచితే, రాంభట్ల గారి పరిశీలనలు పశుపాలన, వ్యవసాయాల మధ్య శత్రుత్వాన్నే కాక; పశుపాలననుంచి వ్యవసాయానికి  జనం పెద్ద ఎత్తున మళ్లిన క్రమాన్నీ; వ్యవసాయం వల్ల ఏర్పడిన స్థిరజీవనాన్నీ, స్థిరజీవనం నుంచి రాజ్యమూ, సంస్కృతీ పుట్టిన విధానాన్నీ చర్చలోకి తీసుకొస్తున్నాయి. ఈ పరిణామక్రమం మన పురాణ ఇతిహాసాలలోనే కాక ప్రపంచ పురాణ ఇతిహాసాలలో కూడా ప్రతిఫలించింది.  అంతేకాదు, ఈ క్రమంలోనే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి; గణదశనుంచి జనదశకు మళ్ళడంవంటి అనేకానేక పరిణామాలు  సంభవించాయి. రాంభట్లతో పాటు, లూయీ హెన్రీ మోర్గాన్, జార్జి థామ్సన్, జోసఫ్ క్యాంప్ బెల్ తదితర దిగ్దంతుల పరిశీలనలను కూడా కలుపుకుని చెప్పుకోవలసిన మహత్తర విషయాలు ఇవన్నీ. అవకాశాన్ని బట్టి ముందు ముందు వాటి లోతుల్లోకి వెళ్లచ్చు.

Rambatla Krishna Murthyఅంతకంటే విశేషంగా రాంభట్ల పరిశీలనలు, ఆర్యావర్తం గురించిన మన భావనలను మనదేశం నుంచి సుదూర పశ్చిమానికి పొడిగిస్తున్నాయి. యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియాలను కూడా ఆర్యావర్తంలోకి తీసుకొస్తున్నాయి. వేదాలలో ఉన్న పురా చరిత్రను, పురా మానవ పరిణామ చరిత్రను పుష్కలంగా తవ్విపోస్తున్నాయి. రాంభట్ల ప్రకారం, మన పురాణాలలోని కొన్ని కథలు, పాత్రల మూలాలు భారతదేశం వెలుపల ఉన్నాయి. యయాతి కథ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. సుకన్య-చ్యవనుల కథ, అశ్వనీ దేవతల ఉదంతం మరో రెండు ఉదాహరణలు. తెలుగువారమైన మనకు ప్రత్యేకించి ఆసక్తి గొలిపే విషయం ఏమిటంటే,  రాంభట్ల పరిశీలనలు మన సంబంధాలను మెసపొటేమియాలోని సుమేరుకు తీసుకువెడుతున్నాయి.

భారతదేశంలోని సప్తసింధు ప్రాంతానికి రావడానికి ముందు వైదికార్యులు ఉత్తర ధ్రువాన్ని, యూరప్ ఖండాన్ని, కాశ్యపిని, పశ్చిమాసియాను చుట్టబెట్టి వచ్చారని రాంభట్ల గారు మాత్రమే అనడంలేదు. ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ కూడా వేదరుషులకు ఉత్తరధ్రువం తెలుసుననీ, దీర్ఘ హేమంత నిశాంతంలో ఆరోరా బొరియాలిస్ ను చూసినవారు తప్ప ఎంతటి భావుకులైనా వేదాలలోని ఉషోసూక్తులను చెప్పడం కష్టమనీ అన్నట్టు రాంభట్ల ఉటంకిస్తారు. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే, తూరుపు దిక్కున కొన్ని రోజులపాటు రంగులు నాట్యమాడతాయి. ఆ తర్వాత కాంతిమంతమైన ఆకుపచ్చరంగు ఆకాశమంతా అలముకుంటుంది. ఈ ఆకుపచ్చరంగు క్రమంగా తగ్గిన తర్వాత ఎర్రని బింబం వస్తుంది. ఈ ఆకుపచ్చని రంగును సూర్యుని గుర్రాలు అన్నారు వేదరుషులు. ఆ గుర్రాలకు హరిదశ్వాలని పేరు. ఆ తర్వాత కనిపించే ఎర్రని బింబం సూర్యసారథి అరుణుడు. ఆ తర్వాత అసలు సూర్యబింబం దర్శనమిస్తుంది. ఈ అందమైన వర్ణన ప్రత్యక్షంగా చూసినవారు, వారి నోట విన్నవారు తప్ప మరొకరు చేయలేరని తిలక్ పండితుడు అంటాడు. అరుణుడు అనే మాట వర్ణవ్యత్యయం వల్ల పౌరాణికుల నోట అనూరుడు అయింది. దాంతో దానికో కథ పుట్టింది. అనూరుడు అంటే తొడలు లేనివాడు అనే అర్థం చెప్పారు.

రాంభట్ల ‘వేదభూమి’లో రాసిన వాక్యాలనే ఉటంకించుకుంటే; వైదికార్యులు గుర్రాలు, రథాలు ఎక్కి ఆలమందలను తోలుకుంటూ కైబర్, బొలాన్ కనుమల గుండా సప్తసింధు ప్రాంతానికి చేరారు. కైబర్, బొలాన్ కనుమల గుండా వచ్చినప్పుడు ఆ ప్రాంత జనం అయిన ఫక్తులు, బొలాన్ లు కూడా వారి వెంట సప్తసింధు ప్రాంతానికి వచ్చారని రాహుల్ సాంకృత్యాయన్ అంటాడు. ఋగ్వేద మంత్రాల్లో ఫక్తులు, బొలాన్ ల ప్రస్తావన ఉంది. పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ లలోని ఫక్తులు లేక పఠాన్ల గురించి ఇంతకుముందు ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. ఇక్కడికి రాకముందునుంచీ వైదికార్యులు  యజ్ఞాలు చేసేవారు కనుక బళ్ళమీద అగ్నిహోత్రాలను కూడా పెట్టుకుని వచ్చారని మార్క్సిస్టు పండితుడు శ్రీపాద అమృత డాంగే అంటాడు…

ఈ చిన్న వ్యాసంతో  రాంభట్లగారికి న్యాయం చేయలేకపోయాయని నాకు తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు ఆయన  పురాచారిత్రాధ్యయనం అనే అఖాతంలో నేనిక ఆట్టే లోతుకు వెళ్లలేను. ఇక అత్యవసరంగా పైకి వచ్చేయాలి. యయాతి కథ దగ్గరికి వెళ్ళాలి. వైదికార్యులకు, అసురులకు పశ్చిమాసియాలోనే మొదలైన యుద్ధాలు లేదా సంబంధాలు  భారతదేశానికి బదిలీ అయాయని చెప్పడమే ఈ పరిశీలన అసలు లక్ష్యం. దీని గురించి చరిత్రకారులు ఏమంటున్నారో…తర్వాత…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

6 Comments

  • chintalapudivenkateswarlu says:

    భాస్కరం గారూ!
    మీరు ఆవ గురించి మాట్లాడితే నాకు తుమ్మలావ గుర్తుకొచ్చింది. తుమ్మలావ ఒకప్పుడు చెరువట. ఆ చెరువు నెమ్మదిగా పూడిపొయి ఆ చిత్తడిలో తుమ్మలావ వెలిసింది. ఇలాంటి ఊర్ల పేర్లు వెతకాలి. అరుణుడు అనూరుడు కావడం ఒక కొత్త కథకు అవకాశం ఇచ్చింది. దేవతల కాలమానం ప్రకారం మనకు ఆరు నెలలు వారికి ఒక పగలనే మాటకు మీ రచన ఊతమ్ ఇస్తోంది. ఇలా కొనసాగించండి.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ….

  • Jawahar Guttikonda says:

    భాస్కరం గారు,

    ఈ విషయం ఫై ఒక related ఆర్టికల్: http://srisainathunisarathbabuji.com/tel/articles/nija-tatvanveshana/mana-pandugalu-dandugala.html

    –జవహర్ గుత్తికొండ

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు జవహర్ గారూ… మంచి ఆర్టికల్ సూచించారు. చదివాను.

  • కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ…

  • బత్తుల వీ వీ అప్పారావు says:

    అయ్యా, ఆర్యుల ప్రస్థానం రూట్ మ్యాప్ జత చేస్తే బాగుంటుంది.

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)