సంపన్న ‘దాసు’లు, ‘అసుర’ దేవతలు!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఇంతా చెప్పుకున్న తర్వాత కూడా, యయాతి కథ పశ్చిమాసియాలో జరిగిందనేది ఒక ఊహా లేక వాస్తవమా అన్న సందేహం అలాగే ఉండిపోతుంది. ఇందుకు కచ్చితమైన సమాధానాన్ని రాబట్టడం కష్టం. మహా అయితే మనం ఒకటి చేయగలం. అది: నిరంతర సంచారజీవితమూ, సమూహాల మధ్య ఘర్షణలు, వలసల నేపథ్యంలో పశ్చిమాసియా-భారతదేశాల మధ్య ఒక సంబంధాన్ని ఊహించడం. అప్పుడు వ్యక్తులు లేదా పాత్రల స్థానంలో పరిస్థితులు ప్రాధాన్యం వహిస్తాయి. ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ From Lineage to State అనే రచనలో క్రీ. వె. ప్రథమ సహస్రాబ్ది మధ్యలో గంగానదీ లోయలోని సమాజపు అమరికలను పురావస్తు ఆధారంగా చర్చించారు. నాటి పరిస్థితుల అవగాహనకు  ఆ చర్చ ఏమైనా తోడ్పడవచ్చేమో…

అంతకంటే ముందు, భిన్న వృత్తిదారుల మధ్య ఘర్షణలు ఎలా పురాణకథలకు ఎక్కాయో చెప్పుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

కొత్త వృత్తులు, లేదా ఆయా వృత్తులలో కొత్త పోకడలు పుంజుకున్న కొద్దీ పాత వృత్తులు, లేదా వాటి పద్ధతులు క్షీణముఖం పట్టడం ఇప్పటికీ మనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఉదాహరణకు, సాంప్రదాయిక వ్యవసాయం, చేతి వృత్తులు మనదేశం ఆధునికమయ్యే క్రమంలో కొత్త వృత్తులనుంచీ, కొత్త పోకడలనుంచీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ వచ్చాయి. ఆ పోటీలో అవి ఓటమి చెందడమూ చూస్తున్నాం. భిన్న వృత్తులవారు ఒకే సహజవనరును ఉపయోగించుకుంటున్నప్పుడు వారి మధ్య పోటీ అస్తిత్వ ఘర్షణగా మారుతుంది. అలాగే ఒక వృత్తి ప్రాబల్యం కలిగిన ప్రాంతాన్ని ఇంకో వృత్తి ప్రాబల్యం కలిగిన జనం ఆక్రమించుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వారి వృత్తికీ ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ రెండు రకాల సన్నివేశాలూ విడివిడిగానో, జమిలిగానో పురాణకథలకు ఎలా ఎక్కాయో జోసెఫ్ క్యాంప్ బెల్ Occidental Mythology లో చర్చించారు.

స్థూలంగా చెప్పుకుంటే పశుపాలన తొలి వృత్తిగానూ,  వ్యవస్థీకృత వ్యవసాయం మలివృత్తిగానూ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రారంభంలో పశుపాలకవృత్తి దారుల మధ్య, వ్యవసాయవృత్తిదారుల మధ్య ఆధిపత్యం కోసం ఘర్షణలు జరిగినా క్రమంగా అన్న పుష్కలత్వానికి ఎక్కువ దోహదం చేసే పురోగామి వృత్తిగా వ్యవసాయం వైపు పశుపాలకవృత్తిదారులు కూడా మళ్లడం కనిపిస్తుంది. ఈ పరిణామం భారతదేశం వెలుపలే కాక లోపల కూడా జరిగింది. ఒక కోణం నుంచి చూస్తే, మన పురాణ, ఇతిహాసాలు; పురాచరిత్ర ఈ వృత్తి పరివర్తన గురించే చెబుతున్నాయి. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఆ కోణంలోకి నేనిప్పుడు వెళ్ళను.

అయితే, ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మన పురాణాల్లో కశ్యపుడు, మొదలైన ప్రజాపతులు ఉన్నట్టే, బైబిల్ లోనూ ప్రజాపతులు ఉన్నారు. బైబిల్ పేర్కొన్న తొలి ప్రజాపతి పశుపాలక యూదుల అబ్రహాం అని ‘జనకథ’లో రాంభట్ల కృష్ణమూర్తి  అంటూ, (మధ్య ఆసియా, పశ్చిమాసియా పురాణకథలలో ఉన్నట్టుగా) మన పురాణాలలో పశుపాలన తొలినాళ్ళ సమాచారం లేదనీ, కనీసం పేర్లు అయినా మిగిలాయనీ అంటారు.

జోసెఫ్ క్యాంప్ బెల్ దగ్గరికి వద్దాం. సృష్టి ఎలా జరిగిందో చెప్పే పురాణకథలు ప్రపంచమంతటా ఉన్నాయి. యూదులకు సంబంధించిన పౌరాణిక, చారిత్రక ఆవృత్తు(cycles)లను నిర్మించిన మౌలిక పాఠాలు(basic texts) అయిదు ఉన్నాయనీ, ఈ అయిదూ క్రీ.వె. 9-4 శతాబ్దుల మధ్య కాలంలో అభివృద్ధి  చెందినవనీ క్యాంప్ బెల్ అంటారు. క్రీ.వె. 9వ శతాబ్దికి చెందిన సృష్టిగాథ(Genesis)ను యెహోవాయిస్ట్(జె) పాఠంగానూ, క్రీ.వె. 4వ శతాబ్దికి చెందిన సృష్టిగాథను పూజారుల పాఠంగానూ గుర్తించగా;  వీటి కంటే పురాతనమైన కథలో లేని  అంశాలు వీటిలోకి ఎలా ప్రవేశించాయో క్యాంప్ బెల్  వివరించారు. పురాణకథలను భౌతిక వాస్తవికతకు అనుగుణంగా ఎలా సవరిస్తారో, వాటిలో చారిత్రక అంశాలు ఎలా ప్రతిఫలిస్తాయో తెలుసుకోడానికి ఈ వివరాలు తోడ్పడతాయి.

 

యెహోవాయిస్ట్ పాఠంలో దేవుడైన యెహోవా ఒక రోజున భూమినీ, ఆకాశాన్నీ సృష్టించాడు. ఆ తర్వాత భూమినుంచి పొగమంచు పుట్టి భూమిని తడిపింది. అప్పుడు యెహోవా మట్టితో మనిషిని తయారు చేశాడు.  అతని ముక్కుపుటాలలోకి ఊపిరి ఊది ప్రాణం పోశాడు. తూర్పు దిక్కున గల ఈడెన్ లో ఒక తోటను కల్పించాడు. ఆ తోటలో మనిషిని ఉంచాడు. ఆ తోటలో ఆహ్లాదం గొలిపే అందమైన చెట్లను, మంచి ఆహారాన్ని అందించే మొక్కలను సృష్టించాడు. తోట మధ్యలో రెండు చెట్లను ప్రతిష్టించాడు. ఒకటి, జీవన వృక్షం; రెండోది, మంచి-చెడుల జ్ఞానవృక్షం. తోటను తడపడానికి ఒక నదిని సృష్టించాడు. ఆ నది ఆ తర్వాత నాలుగు పాయలు అయింది. యెహోవా ఆ మనిషిని తోటలో ఉంచి, దానిని సాగు చేస్తూ, సంరక్షిస్తూ ఉండమని చెప్పాడు. అయితే, ఏ చెట్టు ఫలాలనైనా నువ్వు స్వేచ్ఛగా తిను కానీ జ్ఞానవృక్షఫలాలను మాత్రం తినవద్దనీ, తింటే మరణిస్తావనీ హెచ్చరించాడు. ఆ తర్వాత యెహోవా అన్ని రకాల జంతువులను, పక్షులను సృష్టించాడు. నువ్వు వాటిని ఎలా పిలిస్తే అవే వాటి పేర్లు అవుతాయని మనిషికి చెప్పాడు. అంతలో, మనిషికి తోడు కావాలికదా అనుకున్నాడు. జంతువులు అతనికి తగిన తోడు అవుతాయని యెహోవాకు అనిపించలేదు. మనిషికి నిద్ర ఆవహిల్లేలా చేశాడు. ఆ తర్వాత అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి, ఆ ప్రదేశాన్ని తిరిగి మాంసంతో పూరించి, ఆ పక్కటెముకను స్త్రీగా మార్చాడు.  చివరికి వాళ్ళిద్దరూ వద్దన్న పని చేయడంతో వారిని తోటలోంచి బహిష్కరించాడు.

ఈ కథ పురుష ప్రాధాన్యాన్ని స్థాపిస్తున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆవిధంగా ఇది మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్య స్థాపనకు సంకేతం కూడా. ఈ పరివర్తనను సూచించే కథలు మన పురాణ, ఇతిహాసాలలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు, పురుషుడైన బ్రహ్మ మన పురాణాలలో సృష్టికర్త. ఆయనకు పుట్టిన సరస్వతే ఆయనకు అర్థాంగి అయిందని మన పురాణాలు చెబుతాయి. అయితే, మన పురాణ, ఇతిహాసకథల ప్రత్యేకత ఏమిటంటే, స్త్రీప్రాధాన్యాన్ని చెప్పే కథలూ వాటిలో ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ మళ్ళీ జగన్మాత సృష్టిగా ఈ కథలు చెబుతాయి. ఈ అంశంలోకి ఇప్పుడు మరీ లోతుగా వెళ్లలేం కనుక, యెహోవా కథ దగ్గరికి మళ్ళీవద్దాం.

Cain_and_abel_painting_a_Dennis_Van_Alsloot_paintings

యెహోవా సృష్టించిన ఆది దంపతులకు కెయిన్, ఎబెల్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కెయిన్ వ్యవసాయదారుడుకాగా, ఎబెల్ గొర్రెల కాపరి. కెయిన్ తన వ్యవసాయంలో ప్రథమ ఫలాన్ని, ఎబెల్ తన గొర్రెల మందలో ప్రథమఫలాన్ని తెచ్చి యెహోవాకు సమర్పించారు. కెయిన్ ప్రథమఫలాన్ని యెహోవా నిరాకరించి, ఎబెల్ ప్రథమఫలాన్ని  ఆమోదించాడు. దాంతో కెయిన్ కోపం పట్టలేకపోయాడు. తమ్ముణ్ణి చంపేశాడు. యెహోవా దానిని సహించలేకపోయాడు. ‘నువ్వు సాగుచేసుకునే భూమి క్రమంగా నిస్సారమైపోతుంది, తగినంత పంట నివ్వదు, నువ్వు ఈ భూమిమీద ఒక పలాయిత నేరస్థునిలా దేశదిమ్మరి జీవితం గడుపు’ అని కెయిన్ ను శపించాడు. కెయిన్ యెహోవాకు దూరమై సంచారజీవనులు ఉండే ఈడెన్ తూర్పు ప్రాంతానికి వెళ్లిపోయాడు.

విశేషమేమిటంటే, యూదులకు చెందిన ఈ తొలి పురాణగాథకు ప్రతిరూపాలు ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా, మెలెనేసియా, పొలినేసియా, మెక్సికో, పెరు, బ్రాజిల్ సహా వ్యవసాయ సంస్కృతి నెలకొన్న ప్రతిచోటా ఉన్నాయని క్యాంప్ బెల్ అంటారు. వాటన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్న అంశాలనూ, ప్రతీకలనూ ఆయన ప్రస్తావిస్తారు. వాటిలోకి లోతుగా వెళ్లలేం కానీ, యూదుల కథకు భిన్నంగా ఈ కథల్లో ఆది దంపతుల పతనం, లేదా పాపం, బహిష్కరణ అనేవి లేవు.  లేకపోగా ఈ కథలు భౌతికజీవితాన్ని వ్యతిరేకదృష్టితో కాక, సానుకూల దృష్టినుంచి నొక్కి చెబుతాయి. ఈవిధంగా వ్యవసాయసంస్కృతికి చెందిన కథ కాస్తా, ఎడారి జీవితానుభవం ఉన్న యూదుల దగ్గరికి వచ్చేసరికి మారిపోయింది. వ్యవసాయదారుడైన కెయిన్, గొర్రెల కాపరి అయిన ఎబెల్ ను హత్య చేసినట్టు చెప్పుకున్నాం. ఈ ‘హత్య’ అనేది వ్యవసాయసంస్కృతికి చెందిన కథలో కూడా ఉంది కానీ, అది మరణం నుంచి(విత్తనాలను పూడ్చి పెట్టడం, లేదా బలి ఇవ్వడం) పునరుత్పత్తి జరుగుతుందని చెప్పే క్రతు(ritual) సంబంధమైన హత్య.  వ్యవసాయ సంస్కృతి కథలో ఈ ‘హత్య’ ముందే జరిగితే, యూదుల కథలో తర్వాత జరిగింది.

ఇంతకీ యూదుల కథ సూచించే చారిత్రకాంశం ఏమిటంటే, వ్యవసాయదారుల దేశమైన కనాన్ ను గొర్రెలకాపరులైన యూదులు ఆక్రమించుకున్నారు. కనుక  పెద్దవాడైన వ్యవసాయదారుని కాక, చిన్నవాడైన గొర్రెల కాపరినే యూదుల దేవుడు సహజంగా అభిమానిస్తాడు. ఇక్కడే కాదు, ఈ సృష్టిగాథ పొడవునా పెద్ద కొడుకును కాదని, చిన్నకొడుకుకు ప్రాధాన్యమివ్వడం కనిపిస్తుందని క్యాంప్ బెల్ అంటారు. మన యయాతి కథలో కూడా, పెద్ద కొడుకు యదువుకు బదులు చిన్న కొడుకు పూరునికి యయాతి పట్టం కట్టడంలో ఈ కథా ఛాయలు ఏమైనా ప్రతిఫలిస్తున్నాయా అన్నది ఆసక్తికరం. యదువు పేరు పసుల కాపరులైన యాదవులను సూచిస్తోందనుకుంటే, పురులు వ్యవసాయదారులని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం.

అదలా ఉంచితే, క్రీ. వె. 2050కి చెందిన ఒక సుమేరియా పాఠం, పై యూదుల కథను తలకిందులు చేస్తోంది. యూదుల కథలో యెహోవా అనే పురుష దేవుడు ఉండగా, ఈ సుమేరియా కథలో  ఇనన్న అనే స్త్రీదేవత ఉంటుంది.  పై కథలో లానే దేవత అనుగ్రహం కోసం వ్యవసాయదారుడు, గొర్రెల కాపరి పోటీ పడతారు. అయితే దేవత వ్యవసాయదారునివైపే మొగ్గు చూపుతుంది. అంతే కాదు, నేను అతన్నే వివాహమాడతానని కూడా అంటుంది. అప్పుడు గొర్రెల కాపరి,

రైతు నా కన్నా ఎందులో ఎక్కువ, అతడు నాకు ఖర్జూరపు మద్యాన్ని పోస్తే, నేను అతనికి నా పసుపు పాలను పోస్తాను, నాకు అతడు రొట్టె పెడితే, నేను అతనికి తేనెలోలికే జున్ను పెడతాను, రైతు నా కన్న ఎందులో ఎక్కువ, నా దగ్గర లేనివి అతని దగ్గర ఏమున్నాయి?’

అని దేవతతో అంటాడు. దానికి దేవత,

ఎన్ని ఉన్నా నేను గొర్రెల కాపరిని పెళ్లాడను; పుష్కలంగా మొక్కలను పెంచుతూ, రాశుల కొద్దీ ధాన్యాన్ని పండించే రైతునే నేను పెళ్లి చేసుకుంటాను’

అంటుంది. వెయ్యేళ్ళ తర్వాత, ఎడారికి చెందిన పితృస్వామిక, సంచారజీవులైన యూదులు వ్యవసాయదారుల దేశాన్ని ఆక్రమించుకుని ఈ కథను తలకిందులు చేశారని క్యాంప్ బెల్ అంటారు.

చెప్పొచ్చేదేమిటంటే, పశుపాలకులైన వైదికార్యులకు, వ్యవసాయదారులైన అసురులకు మధ్య సంభవించిన శత్రుత్వం కూడా ఇలాంటిదే. కాకపోతే, ఈ శత్రుత్వ కారణాలు పైన చెప్పుకున్న పశ్చిమాసియా కథలలో ఉన్నంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మన పురాణాలలో పశుపాలన తొలినాళ్ళ సమాచారం లభించడం లేదన్న రాంభట్ల వారి మాటలో ఈ అస్పష్టతకు కారణం దొరకచ్చు.

ఇప్పుడిక రోమిలా థాపర్ పరిశీలనకు వెడదాం:  సింధు-గంగానదుల మధ్యప్రాంతంలో, గంగకు పశ్చిమంగా ఉన్న లోయలో కొన్ని పురావస్తు ఆధారాలు దొరికాయి. ఆ ప్రాంతాలలో క్రీ.వె. 2000 నాటికి జనావాసాలు ఉన్నట్టు అవి సూచించాయి. ముఖ్యంగా సింధు-గంగా నదుల ఎగువభాగంలో హరప్పా సంస్కృతి మలిదశకు చెందిన ఆనవాళ్ళు కనిపించాయి. అవి కాషాయ మృణ్మయపాత్రల (Ochre-Colour Pottery) సంస్కృతికి చెంది, పరస్పర సంబంధం లేని జనాలు ఆ ప్రాంతంలో ఉండేవారని వెల్లడించాయి. ఇదే ప్రాంతంలో క్రమంగా చిత్రిత మృణ్మయపాత్ర(Painted Grey Ware)ల సంస్కృతి పుంజుకుంది. దానికి సంబంధించిన జనావాసాలు పెద్ద సంఖ్యలో అవతరించాయి. బియాస్-సట్లెజ్ నదుల మధ్య జరిగిన తవ్వకాలు మలి హరప్పా, చిత్రిత మృణ్మయ పాత్రల సంస్కృతుల మధ్య కలయికను సూచించాయి. అంతేకాదు, పరోక్షంగానో, పలచబడో అప్పటికి ఇంకా హరప్పా సంప్రదాయాలు కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. సింధు, పంజాబ్, సరస్వతీనదీ ప్రాంతాలలో వివిధ తెగలవారు ఉన్నట్టు ఋగ్వేదం కూడా చెబుతోంది. ‘సప్తసింధవః’ అనే మాటతో ఋగ్వేదం ఈ ప్రాంతాలను సూచించింది.

ఈ చిత్రితమృణ్మయ పాత్రల సంస్కృతికి చెందినవారే వైదికార్యులు. ఋగ్వేదసమాజం ప్రధానంగా పశుపాలక సమాజమే అయినా పరిమితస్థాయిలో వ్యవసాయం కూడా ఉండేది. ఋగ్వేదం మలి భాగాలలో వ్యవసాయ చర్యల వర్ణన తరచుగా వస్తుంది. అయితే, ఋగ్వేదకాలానికి ముందునుంచే సింధు-గంగా ప్రాంతంలో వ్యవసాయదారులు స్థిరజీవితం గడుపుతున్నట్టు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి.  హరప్పా మలి దశకు చెందిన కాషాయమృణ్మయపాత్రల సంస్కృతికి చెందినవారు వీరే కావచ్చు. వీరిని అసురులుగా భావించారనడానికి శతపథ బ్రాహ్మణం అవకాశమిస్తోంది. అసురులు దేవతలకంటే నాగరికులనీ, వ్యవసాయపు మెళకువలు తెలిసినవారనీ, వారు ఇళ్ళు కట్టుకుని స్థిర నివాసానికి అలవాటుపడితే; దేవతలు రథాల మీద తిరుగుతూ సంచారజీవితం గడుపుతూ ఉంటారనీ శతపథ బ్రాహ్మణం(vi.8.1. 1-2) చెబుతోంది. ఏయే ఋతువులలో ఎలాంటి వ్యవసాయచర్యలు చేపట్టాలో అసురులకు కచ్చితమైన అవగాహన ఉండేదని చెబుతారు.

అయితే, వీరు వ్యవసాయదారులు కనుక వ్యవసాయదారులను శత్రువులుగా చూసే ఆర్యులు తమ మధ్య, పశ్చిమాసియాల అనుభవంతో వీరిని కూడా అసురులు అన్నారా; లేక ఆర్యులకంటే ముందే పశ్చిమాసియా అసురులు సింధు-గంగా మధ్యప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. పశ్చిమాసియా వ్యవసాయసంస్కృతికి పుట్టిల్లు అన్న సంగతి ప్రసిద్ధమే.

అదలా ఉంచితే, ఇరానియన్ పురాణ కథలు మన పురాణ కథలను తలకిందులు చేస్తాయి. ఎలాగంటే, ఇరానియన్ పురాణకథలలో దేవతలది అసురుల స్థానమైతే, అసురులది దేవతల స్థానం. ఇరానియన్ పురాణాలలో అసుర శబ్దం ‘అహుర’ అయింది. అలాగే, మన ‘దాస’ శబ్దం ‘దాహ’ అయింది. ఇరానియన్ భాషలో ఆ మాటకు మగవాడు, నాయకుడు అని అర్థం. అసురులు అనే మాట ఒకప్పుడు లేదా ఒక ప్రాంతంలో గౌరవవాచకమే కానీ నిందార్థకం కాదు. అలాగే దాస శబ్దం కూడా.  ఋగ్వేదం ఆర్య, దాస అనే రెండు వర్ణాలను పేర్కొంది. ఆర్యులకు భిన్నమైన రంగు(కృష్ణ వర్ణం) కలిగినవారిని సూచించడమే ఆ విభజనలో ఉద్దేశం. ఎందుకంటే, దాసులలో సంపన్నులు, దృఢమైన ఇళ్ళు కట్టుకుని ఉంటున్నవారు ఉన్నారని చెప్పి ఋగ్వేదం కొందరి సంపన్నుల పేర్లు కూడా ఇచ్చింది. సంపన్న దాసులైన బల్బూత, తారుక్ష, అంబస్త్య అనేవారిని బ్రాహ్మణులు స్తుతించడమూ కనిపిస్తుంది. బలవత్తరులైన కొందరు దాసులతో ఇంద్రుడు యుద్ధం చేసినట్టు కూడా ఋగ్వేదం చెబుతోంది. వారిలో శంబరుడు ఒకడు. విశేషమేమిటంటే, శంబరుని అసురునిగానూ పురాణాలు పేర్కొన్నాయి.  సింధు నది వెంబడి ‘అరియో’లు(ఆర్యులు), దాహలు(దాసులు) స్థిరపడ్డారని టాసిటస్ అనే చరిత్రకారుడు రాశాడు. దీనినిబట్టి  హరప్పా మలి సంస్కృతికి చెందిన వ్యవసాయ తెగలవారు ఈ దాసులు కావడానికీ అవకాశముంది.

సారాంశమేమిటంటే, అసుర, దాస శబ్దాలు మొదట్లో నిందార్థకాలు కావు. ఆ తర్వాతే క్రమంగా నిందార్థకాలుగా మారాయి.

మిగతా అంశాలు తర్వాత….

–కల్లూరి భాస్కరం

Download PDF

4 Comments

  • SriRam says:

    భాస్కరం గారు,
    నేను రాసే ఈ వ్యాఖ్య మీరు రాసిన టపాకి సంబంధంలేకపోయినా, భారత దేశ సంస్కృతి కి సంబందించిన పురాతన చరిత్రను ప్రస్తావిస్తున్నారు గనుక నాకు తెలిసిన సమాచారం మీతో పంచుకోవాలనుకొంట్టున్నాను.

    The Shape of Ancient Thought: Comparative Studies in Greek and Indian Philosophies
    the Early Days, Ideas Traveled Freely Between India and Greece

    A revolutionary study by the classical philologist and art historian Thomas McEvilley is about to challenge much of academia. In THE SHAPE OF ANCIENT THOUGHT, an empirical study of the roots of Western culture, the author argues that Eastern and Western civilizations have not always had separate, autonomous metaphysical schemes, but have mutually influenced each other over a long period of time. Examining ancient trade routes, imperialist movements, and migration currents, he shows how some of today’s key philosophical ideas circulated and intermingled freely in the triangle between Greece, India, and Persia, leading to an intense metaphysical interchange between Greek and Indian cultures.

    http://www.amazon.com/The-Shape-Ancient-Thought-Philosophies/dp/1581152035

    http://www.youtube.com/watch?v=OXBygl-ox5Q

  • కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు శ్రీ రామ్ గారూ…ఇదే విషయాన్ని ఇప్పటికే నేను అనేక వ్యాసాలలో చెప్పాను. ఇకముందు కూడా చెప్పబోతున్నాను. నా అధ్యయనంలో నాకు స్థూలంగా అనిపించింది ఏమిటంటే ‘భారతీయ సంస్కృతి’ అనేది ఒక పెద్ద myth అని! ఈ అభిప్రాయాన్ని ఎంతమంది అంగీకరిస్తారనేది వేరే ప్రశ్న.

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)