కోపం జ్వరానికి ‘టాబ్లెట్’ మందు!

yandmuri

చిన్నచిన్న కారణాలకి మీకు తరచూ కోపం వస్తుందంటే దానికి కారణం ఎదుటి మనిషి కానీ, సందర్భం కానీ అయి ఉండదు. అది ఆర్థికపరమైన ఇబ్బందో, లేదా దగ్గరవాళ్ళతో చెడిపోయిన బాంధవ్యమో కావచ్చు. కోపం ఒక జ్వరమైతే దానికి మందు కూడా ఉంది. ఇదే ‘ఫీవర్ అండ్ టాబ్లెట్’ కాన్సెప్టు. ఈ టెక్నిక్ అవలంబిస్తే సగం కోపం తగ్గిపోతుంది.

అతడు ఒక తెలివైన, అందమైన యంగ్ ఎగ్జిక్యూటివ్. పేరు రాకేష్. వయసు పాతిక. జీతం 75 వేలు. ఏ దురలవాట్లూ, వ్యసనాలూ లేవు. అందంగా, అంతకన్నామించి హుందాగా వుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అతడు పెళ్ళికి  ప్రపోజ్‌ చేస్తే ‘నో’ చెప్పే అభ్యంతరాలు సాధారణంగా ఏ అమ్మాయికీ వుండవు.!

అతడు తన వితంతు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళిద్దరూ తల్లీ కొడుకుల్లా వుండరు. స్నేహితుల్లా వుంటారు. దాదాపు ప్రతివిషయమూ అతడు తల్లితో చెప్తాడు. అటువంటిది క్రమక్రమంగా మారిపోయాడు. వారం రోజుల్లో విపరీతమయిన మార్పు వచ్చింది. తిండి తగ్గిపోయింది. చిరాకు ఎక్కువైంది. ప్లేటు తోసేస్తున్నాడు. తల్లిపై విసుక్కుoటున్నాడు.

అతడిని అంత కలవరపరిచే విషయం ఏమైవుంటుందా అని తల్లి అతడి స్నేహితుల దగ్గర ఎంక్వయిరీ చేసింది. అప్పుడొక సంగతి బయటపడింది. వాళ్ల ఆఫీసులో త్వరలో జరగబోయే రిట్రెంచ్‌మెంట్ గురించి అతని తోటి ఉద్యోగస్తుడు ఆమెతో చెప్పాడు. నష్టాల దృష్ట్యా ఆఫీసులో స్టాఫ్‌ని తగ్గించి వేస్తున్నారు. అందులో రాకేష్ కూడా వుండొచ్చు.

ఇలా విషయం నాన్చితే లాభంలేదని ఆమె ఒకరోజు అతడిని మందలించింది. మాట మీద మాట పెరిగింది. వారి వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. “….ఉంటుందో లేదో తెలియని ఉద్యోగం కోసం నిద్రా, భోజనం మానేయటం మంచిది కాదు బాబూ. ఉద్యోగం పోయినా పర్వాలేదులే…” అంటూ ఓదార్చడానికి ప్రయత్నించింది. కొడుకు నిర్ఘాంతపోయాడు. అంత కోపంలోనూ నవ్వొచ్చింది. ఎందుకంటే, ఈమాత్రం ఉద్యోగం తనకి ఎక్కడైనా దొరుకుతుందని అతడికి తెలుసు.

“నా దిగులుకి కారణం నా ఉద్యోగం అని నీకెవరు చెప్పారు?” అన్నాడు. ఈసారి విస్మయం చెందటం తల్లి వంతయింది. అసలు కారణం అతడు చెప్పటం ప్రారంభించాడు.

అతని చిరాకుకి కారణం అదికాదు.   అతడు పనిచేసే ఆఫీసు ఎదురు బిల్డింగ్‌లో స్వప్న అనే మల్లెతీగ స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. ఆమె గగనజఘన. నితంబిని. ‘చాలెంజ్’ అనే మా సినిమాలో సరస్వతీపుత్రుడు వేటురివారు ఒక పాట వ్రాశారు. మందగమన, మధుర వచన, గగన జఘన, సొగసు లలనవే… అని! గగనం అంటే ‘శూన్యము’ అనీ, గగనజఘన అంటే ‘నడుము లేనిది’ అనీ అర్ధం. నితంబిని అంటే ఎత్తైన పిరుదులు కలది. నితంబినులు సహజంగా మందగమనులు. కానీ కవి కల్పనలో, గగనజఘనలు కూడా మందగమనలు అవటం ఒక గొప్ప ప్రయోగం. తెలుగు మర్చిపోతున్న యువతకి మన భాషలో ఉన్న సొగసులు చెప్పటం కోసమే ఈ అప్రస్తుత ప్రసంగం.  తిరిగి సబ్జెక్ట్‌ లోకి వస్తే…

ఆమె తనకి అన్ని విధాలా సరిపోతుందనుకొన్నాడు. ఆ విషయమై ఆమెతో మాట్లాడాలని  లంచ్‌కి ఆహ్వానించాడు. పెళ్ళికి ముందు సినిమాలూ, పార్కులూలాంటి డేటింగ్ విధానాన్నిఅతను నమ్మడు. మర్యాదపూర్వకంగా లంచ్‌కి ఆహ్వానించి, తన ఇష్టం గురించి అక్కడ చెప్పాలనుకున్నాడు. “మీరు నాతో లంచ్‌కు వస్తారా?” అని అతడు అడుగుతుండగానే ఆమె కఠినమైన స్వరంతో “తరువాత మాట్లాడతాను” అంటూ ఫోన్ ‘టప్‌’మని పెట్టేసింది. ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేయలేదు.

అదీ సంగతి.

Picasso-rug-femme-au-chapeau-1-768x1024

అంతా విన్న అతడి తల్లి నమ్మలేనట్లు ‘ఇంత బలహీనమయిన మనసా నీది’ అన్నట్టుగా అతడి వైపు చూసి, “ప్రేమించిన అమ్మాయి  కాదంటే భోజనం మానేసి ఏడుస్తావా?” అని అడిగింది.

“నేనామెను ప్రేమించలేదు. పెళ్ళి జరుగుతుందో లేదో తెలియకుండా ప్రేమించేసేటంత బలహీనత నాలో లేదు. ఆమె కూడా ఇష్టపడితే, నా ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుందామనుకున్నాను. అంతే.”

“మరెందుకు బాధ?”

“నా అహం బాగా దెబ్బతిన్నదమ్మా! ఆమెని మర్యాదగా మధ్యాహ్నం లంచ్‌కి పిల్చానే తప్ప రాత్రి ‘పబ్’కి కాదు! కనీసం డిన్నర్‌కి కూడా కాదు. ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా. అంత విసురుగా మొహం మీద కొట్టినట్టు ఫోన్ పెట్టెయ్యటం ఎందుకు?” సున్నితమైన చోట దెబ్బతగిలినట్టు అన్నాడు. అదీ కథ.

మనసుకి దెబ్బ తగిలింది. నిజమే. కానీ దాన్ని తల్లి మీద కోపంగా చూపించటం ఎందుకు? దీన్నే  ఫీవర్ అంటారు. ఫీవర్ అంటే  జ్వరం. అందరూ అనుకొనే జ్వరం కాదు. మానసికశాస్త్రంలో దానికి మరో అర్థం వుంది. F అంటే ఫ్యాక్ట్  (నిజం), E – అఫెక్ట్  (ప్రభావం), V-వెంటిలేషన్  (బహిర్గతం) , A-ఎమోషన్ (భావోద్రేకం), R- రిజల్ట్ (ఫలితం).

పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనిషి మెదడుకి చేరుకునేది రియాలిటి (వాస్తవం). మెదడు దాన్ని ఎలా స్వీకరిస్తుంది అనేది ఎఫెక్టు (ప్రభావం). రోడ్డు పక్కన రాయి వుండటం వాస్తవం. దాన్ని ఒకరు కాలితో తన్నవచ్చు. మరొకరు భగవంతుడిగా పూజించి ప్రార్థించవచ్చు. చైనా దేశపు షాంగై నగరంలో క్యాడ్బరీస్ చాక్లెట్ మధ్యలో జీడిపప్పు అద్దినట్టూ తేలు పెట్టి అమ్ముతారు. అక్కడ దానికి చాలా డిమాండు. మనకి..?

వాస్తవం ఒకటే. ప్రతిస్పందన వేరు. ‘ఫీవర్’ లో రెండో అక్షరం E కి అంత ప్రాముఖ్యత  వుంది.

దాని తరువాత అక్షరం V. వెంటిలేషన్. తన మీద పడిన వాస్తవపు ప్రభావాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క  విధంగా బహిర్గత పరుస్తారు. కొందరు కోపంతో అరుస్తారు. కొందరు ఏడుస్తారు. మరి కొందరు తమ చీకటిగుహల్లోకి  నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. దాన్నే ఎమోషన్ అంటారు. కొందరు వ్యక్తుల్లో దీని తీవ్రత ఎక్కువ వుంటుంది. ఎమోషన్స్(E) ని (భావోద్వేగాలు) కంట్రోలులో పెట్టుకొకపోతే రిలేషన్స్(R) దెబ్బ తింటాయి. రాకేష్‌కీ అతడి తల్లికీ ఆ విధంగానే కలిగింది. ‘మూలం’ అమ్మాయి తిరస్కారం. దాని ప్రభావం ‘తల్లిపై అసహనం’. మరి దీనికి పరిష్కారం?

టాబ్లెట్. ఈ జ్వరానికి విరుగుడే TABLET. ఫీవర్‌ని తగ్గించే టాబ్లెట్ కాదు. దీని అర్థం వేరే. T అంటే టేబిలింగ్ (అమర్చు), A- ఆక్సెస్ (విశ్లేషించు), B- బ్రౌజ్ (వెతుకు), L- లొకేట్ (పట్టుకో ), A- ఎన్‌కౌంటర్  (చంపు), T- టెర్మినేట్ (శాశ్వతంగా నాశనం చెయ్యి).

బుద్దుడి యోగము కూడా ఇదే! రోగము- కారణము- ఔషధము- నాశనము! మన భావోద్రేకాలకీ, మూడ్ బావోలేకపోవటానికి, దుఃఖానికీ, కోపానికీ, అసహనానికీ కారణం వేరే ఎక్కడో వుండవచ్చు. ముందు దాని మూలాన్ని వెతికి పట్టుకోవాలి. దానికోసం తన సమస్యలన్నిటినీ టేబిల్‌పై పరచి చూడాలి. రాకేష్ బాధకి కారణం అతడి తల్లి అనుకొన్నట్టు ఉద్యోగభయం కాదు. ప్రేమ విఫలం. టేబ్లింగ్ చేయటం అంటే అదే. ఒక్కొక్క కారణాన్నీ ఆవిధంగా విశ్లేషించి, అసలు దాన్ని పట్టుకోవాలి.

కారణం అమ్మాయే! సందేహం లేదు. కానీ ప్రేమ తిరస్కరించటం కాదు. అమర్యాదగా ఫోన్ ‘టప్’ మని పెట్టెయ్యటం! అతడి అహం అక్కడ దెబ్బతిన్నది. అంతవరకూ అతడితో అంత అమర్యాదగా ఎవరూ ప్రవర్తించలేదు. అతడి సంస్కారానికి అదొక దెబ్బ, అందుకే అది తలచుకొని అతడెంతో కుమిలి పోయాడు. అతడికి అంత కోపం రావటానికిగల పరిస్థితులన్నిటినీ సమీకరించి చూడాలి (Table). ఆ విధంగా మూలకారణపు అసలు అంశాన్ని బ్రౌస్  చేయాలి. లొకేట్ చేసి ఎన్‌కౌంటర్ చేసెయ్యాలి! విషయం తెలియకుండా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపినా ఏం లాభం? సమస్య అలాగే ఉంటుంది. బాధ  మిగిలిపోతుంది. దానికన్నా అటోఇటో తేల్చేసుకోవటమే మంచిది కదా! చాలా మంది సమస్యని తేల్చరు. పరిష్కారం అంటే భయం! సమస్యకి దూరంగా నిలబడి బాధపడుతూనే వుంటారు. దీన్నే ‘ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ‘ అంటారు. ఆ అమ్మాయి ఆఫీసుకి ఫోన్ చేసి విషయం ఏమిటో కనుక్కోమని కొడుకుని తల్లి వత్తిడి చేసింది (Access). అతడా అమ్మాయి ఆఫీసుకి వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయి ఆఫీసులో లేదు. పది రోజులు సెలవు పెట్టింది. బహుశా పెళ్ళికోసం అయివుంటుంది అనుకొన్నాడు.

“నాతో లంచ్‌కి  రావటం ఇష్టం లేకపోయినా, ఇప్పటికే వివాహం నిశ్చయమై పోయినా, ఆ విషయం మామూలుగానే చెప్పొచ్చుకదా ! నేనొక విలన్‌ని  అయినట్టు అలా మొహంమీద విసురుగా ఫోన్ పెట్టెయ్యటం దేనికి?” అని అడగాలని అతడి ఉద్దేశం.

ఇంటి దగ్గర వివరాలు కనుక్కుంటే ఆమె హాస్పిటల్‌లో ఉందని తెలిసింది (Browse). ఆలస్యం చేసే కొద్దీ దిగులే మిగుల్తుందనీ, నిరంతరం దుఃఖం కన్నా- అటోఇటో తేల్చుకొని, ఆ  దుఃఖకారణాన్ని నిర్మూలించటం మంచిది కదా (Locate), వెంటనే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడదామని (Encounter) అతని తల్లి ప్రోత్సహించింది. వాళ్ళు హాస్పిటల్‌కు వెళ్ళారు(Terminate).

అతడిని చూడగానే ఆమె మొహం విప్పారింది. అతను ఫోన్ చేసినప్పుడే, అతని మనసులో ఆలోచన ఆమెకి తెలిసిపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈలోపు బాస్ ఇంటర్‌కమ్‌లో అర్జెంటుగా డిక్టేషన్ తీసుకోవటానికి పిలవడంవల్ల కంగారుపడి “తర్వాత మాట్లాడతాను” అని ఫోన్ పెట్టేసింది. ఆమె గొంతులో ఆ రోజు కనపడిన తొందరని అతడు తిరస్కారంగా అపార్ధం చేసుకున్నాడు. ఫోన్ పెట్టేసిన అమ్మాయి ఆకాశంలో పక్షిలా ఎగురుతూ క్రిoదమెట్లు చూసుకోలేదు. జారిపడడంతో కాలు విరిగి ఆస్పత్రిలో జాయిన్ అయింది. తల్లీకొడుకులు వెతుక్కుంటూ వెళ్ళినందుకు సినిమా లెవెల్లో కధ సుఖాంతమయింది.

ఇతరుల్ని మనం అపార్థం చేసుకుంటే వారిపై మనకి వచ్చేది కోపం. మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే కలిగేది ‘దుఃఖం’. కోపమూ, దుఃఖమూ మనిషికి వచ్చే మానసిక రోగాలు.

దేవుళ్ళు సైతం కోపానికి అతీతులు కారు. శివుడు ఆగ్రహిస్తే ఎదుట ఉన్నది ఎంతటి వారైనా శాపం తప్పదు. మహా విష్ణువు సైతం భావావేశానికి లోనయి మొసలి బారి నుండి ఏనుగును కాపాడే తొందరలో సిరికిన్ చెప్పడు… శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు. ఆయుధాలను సైతం తీసుకువెళ్ళడం మర్చిపోయాడు.

భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటే బీ.పీ. వస్తుంది. అలా అని వాటిల్ని అధికంగా ప్రదర్శిస్తే హార్ట్ ఎటాక్ వస్తుంది. కోపాన్ని ప్రదర్శించకపోతే కొన్నికొన్ని సందర్భాల్లో అవతలివారు మనల్ని అసమర్ధులుగా జమకట్టే ప్రమాదం ఉంది. కానీ ప్రదర్శించటంవేరు, అనుభవించటంవేరు. ఐదు ప్రశ్నలు వేసుకుంటే భావోద్వేగ నియంత్రణ సాధ్యమే.

1. ఎందుకు నాకీ కోపం?

2. నాది కోపమా లేక నిస్సహాయతా?

3. నాకు తరచూ ఈ మధ్య ఇటువంటి స్థితి కలుగుతోందా?

4. ఇలా కాకుండా నేను ఇంకో రకంగా ప్రతిస్పందించే అవకాశం ఉందా?

5. నేనిప్పుడు ప్రవర్తిస్తున్న విధానాన్ని రేపు నా అంతరాత్మ ఒప్పుకుంటుందా?

ఈ ఐదు సూత్రాలు అమలు జరిపి చూడండి. క్రమక్రమంగా మీ ప్రవర్తనలో ఒక అద్భుతమైన మార్పు మీకే తెలుస్తుంది.

– యండమూరి వీరేంద్రనాథ్

 

Download PDF

4 Comments

  • sujala says:

    యండమూరిగారూ ‘చిన్నచిన్న కారణాలకి మీకు తరచూ కోపం వస్తుందంటే దానికి కారణం ఎదుటి మనిషి కానీ, సందర్భం కానీ అయి ఉండదు. అది ఆర్థికపరమైన ఇబ్బందో, లేదా దగ్గరవాళ్ళతో చెడిపోయిన బాంధవ్యమో కావచ్చు’ టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్…
    ఫీవర్ కి మీరు చెప్పిన టాబ్లెట్ బాగుంది అది చదువుతుంటే….
    కానీ ఇంత ప్రాక్టికల్ గా మనుషులు ఉండగలరా?
    ఇది ప్రాక్టికల్ గా ఉండడమా? పాజిటివ్ గా ఆలోచించడమా?
    ఇలాంటి సందర్భాల్లో బాధను..బాధకు రిలేట్ అయ్యే కోపం, చిరాకు, అసహనం, అసహాయతలాంటి విషయాలను తప్ప మనసు వేరే ఏ ఫీలింగ్ నీ అంగీకరించదు…
    మరి అలాంటప్పుడు బాధావలయం నుండి బయటపడి ఆలోచించగలమా…అదీ నేడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో…
    రాకేష్ తల్లి లాంటివాళ్లు ఎంత మంది ఉంటారు…
    ఇన్ని సందేహాలు కలిగాయి…మీ విశ్లేషణ చాలా బాగుంది…ఇలా చేస్తే అసలు సమస్యే ఉండదు…కానీ చేయలేకపోవడమే అసలు సమస్య…
    మీ ఆర్టికల్ చదవగానే కలిగిన ఫీలింగ్…ఇలా…

  • మణి వడ్లమాని says:

    వీరేంద్రనాథ్ గారు! wishing you a very happy new year

    మీరు వేసుకోమన్న ఐదు ప్రశ్నల లో ముఖ్యంగా నాలుగో ప్రశ్న నిని బాగా రిలేట్ని చేసుకొన్నాను. నిజమే చిన్నగా అయినా చాల సందర్భాలలో నా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.. భావోద్వేగ నియంత్రణ సాధ్యమే అన్న విశ్లేషణ తో కూడిన ఈ ఆర్టికల్ చాల బావుంది.

  • jwalitha says:

    యండమూరిగారు ఫీవర్ టాబ్లెట్ వివరణ అద్బుతం

    అయితే గగన జఘన , నితంబిని వివరణ శ్రుతి మించినట్టుంది

    ఇంకా ఎన్నాళ్ళు ఆడవాళ్ళ శరీరాలను వర్ణిస్తారు ఈ polished porn ప్రభావం సమాజం లో కనిపించడం లేదా

  • rajaram.thumucharla says:

    యండమూరిగారు,నమస్కారం.మీ రచన చాల బావుంది.మీ విశ్లీషణ నచ్చింది.మానసికాంశాలు మనిషిని ఎలా కృంగదీస్తాయో చెబుతూ పరిష్కారానికి సూచనలిచ్చారు.ఇలాంటి రచనలు మీ నుండి మర్రిన్ని కూరుకోతున్నా.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)