“నేను”తో వొక కొత్త విమర్శ ప్రయోగం!

 

(ప్రతిష్టాత్మకమయిన లోక్ నాయక్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కి దక్కింది. ఈ సందర్భంగా ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో అఫ్సర్ రాసిన  వ్యాసం )

19BG_VOLGA_1336248e

నాకు చాలా ఇష్టమయిన పది పన్నెండు ప్రపంచ నవలల్లో వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” వొకటి. అది నేను నా తొలినాళ్లలో చదివిన నవల అవ్వడం వొక వ్యక్తిగత కారణం.   బీయ్యే ఇంగ్లీష్ చేసేటప్పుడు ఆధునిక ఇంగ్లీష్ నవల- సాహిత్య సిద్ధాంతాలు  స్పెషలైజేషన్ గా తీసుకుని, మొదట చదివి, విశ్లేషించిన పది ఆంగ్ల నవలల్లో ఇదీ వొకటి.  మిగిలిన ఆ తొమ్మిది నవలలు అంతగా మళ్ళీ మళ్ళీ చదివిందేమీ లేదు. కానీ  “టు ద లైట్ హౌస్”  నన్ను ఇప్పటికీ వెంటాడే నవల. నాలుగేళ్ళకోసారి నా చేతులు అప్రయత్నంగా ఆ నవలని తీసుకుంటాయి, ఆ చేతులు నొప్పెట్టినా సరే,  చివరి పేజీ దాకా చదవనిదే వదలనివ్వదు నవల .   

ఈ  నవలలో వొక స్త్రీ పాత్ర ఇంకో పురుష పాత్రని అడుగుతుంది,

“ఇంతకీ మీ నాన్నగారు రాసిన ఆ పుస్తకాలన్నీ దేన్ని గురించి?” అని-

అతను ఇంకే తడబాటూ లేక వెంటనే “subject, object and the nature of reality” అంటాడు.

“ఓర్నాయనో! ఏమిటదీ??” అని బిక్క మొహం వేస్తుంది ఆవిడ.

అప్పుడు పాపం, ఆమె  ఏ సాహిత్య కళా వాసనలూ లేని “వంటింటి కుందేలు” అన్న స్పృహ కలిగి,  ఆమెకి అర్థమయ్యే భాషలో చెప్పాలని అతను “ఈ కిచెన్ టేబులు గురించి ఆలోచించు, నువ్వు దాని దగ్గిర లేనప్పుడు!” అంటాడు, కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా, “ఆడముండల్తోనా ఆలోచనా?” లాంటి ఏదో వొక భావంతో!

ఆమెకి ఆ ముక్క  అర్ధమయ్యిందా కాలేదా అన్నది వేరే సంగతి. నాకు మాత్రం చాలా కాలం అర్థం కాలేదు, కానీ, చాలా సందిగ్ధంలో పడి, తరవాత తరవాత శోధిస్తే తేలిందేమిటంటే ఇది నా బాధ కాదు, ప్రపంచం బాధ అనీ!

పాశ్చాత్య సాహిత్య విమర్శలో తల పండిన సాహిత్య విమర్శకులూ, సామాజిక  సిద్ధాంతకర్తలూ  పదే పదే  ఈ సంభాషణని ప్రస్తావిస్తూ వచ్చారు.  వివిధ కాలాల్లో వచ్చిన వీళ్ళంతా  కూడా ఆయా కాలాల్లో ఆయా రకాలుగా దీన్ని అర్థమో, అపార్థమో చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ప్రతి నాలుగేళ్ళకి వొక సారి ఈ నవల నేను చదువుతూనే వున్నా, చదివిన ప్రతి సారీ ఈ సంభాషణ నాకు  వొక్కో కాలంలో వొక్కో  రకంగా అర్ధమయ్యింది. ఒక అర్ధానికీ ఇంకో అర్ధానికీ పొంతన లేదు. అలా పొంతన లేకపోవడానికి కారణం నేను ఆ సంభాషణ గురించి ఆలోచించే స్థితిలో, ధోరణిలో మార్పు రావడమే!

కాలానుగుణంగా మారుతున్న ఆలోచనలలో  మారుతూ వున్న ‘నేను” ముఖ్యమయిన పాత్ర తీసుకుంటోంది. ఆ “నేను” చుట్టూ మారే స్థల కాలాలు అంతకంటే గట్టి పాత్ర తీసుకుంటున్నాయి.  అటు నించి నరుక్కురావాలంటే, ఇప్పుడు  ఆ మగవాడి మాట అతనికే అప్పజెప్పాలి  స్త్రీత్వపు వైయక్తిక స్వరంతో – ‘విషయం, విషయి, వాస్తవికత స్వభావం’ ఎప్పటికప్పుడు మారిపోతాయి.  అంతే కాదు, ఆ మాటలు ఎవరు అంటున్నారు, ఎవరు వింటున్నారు అన్న ప్రశ్నని బట్టి కూడా వాటి అర్ధాలు మారిపోతాయి. అంటే, పఠనం అనేది కేవలం వొకే వైపు దూసుకెళ్లే ట్రాఫిక్ కాదనీ, అది చదువరి/ శ్రోత/ రచనలోని సాంస్కృతికత/ చదువరి, పఠిత సాంస్కృతికత మొదలయిన అంశాలు పఠనాన్ని ఒక performance గా మారుస్తున్నాయి. ఎవరు ఎవరికోసం చదువుతున్నారన్నది performativity కోణం నించి అడిగే ప్రశ్న. ఎవరు ఎవరి కోసం అన్న ప్రశ్నలో సమాధానాలు  “నేను” లోనే వున్నాయి.  వొక్కో సారి విషయం (subject) మారకపోయినా, విషయి మారకపోయినా, ఈ “నేను’ దాన్ని చూసే “subjective” దృష్టి వల్ల మొత్తం వాస్తవికత స్వభావమే మారిపోవచ్చు.

ఓల్గా గారి “సహిత” వ్యాసాలు చదువుతునప్పుడు ఆ మార్పు ఎట్లా వుంటుందో కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. “సహిత”లో వొక రచయిత తన పఠనానుభవంలోకి తీసుకువెళ్లడం వొక ప్రధాన ప్రక్రియ. అయితే, అదే సమయంలో ఆ పఠనానుభవంలో “తను” ఏమిటి? ఆ “తను” ఎవరికోసం గొంతు విప్పుతోంది? అన్న ప్రశ్నలు కూడా ముఖ్యమవుతున్నాయి.

స్త్రీ వాదం చర్చలోకి వచ్చేంతవరకూ చాలా మంది విమర్శకులు  ఆ సంభాషన్లో “అతను” చెప్పిన ఆ ముక్కకే పరిమితమయి మాట్లాడారు, స్త్రీ వాదులు ఆ విమర్శనంతా తుంగలో తొక్కి, అప్పటి వరకూ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన  ఆవిడ పక్షం తీసుకొని, అసలక్కడ “కిచెన్ టేబులు ఎందుకు ఉదాహరణ కావాలి?” అన్న కొత్త  సాంస్కృతిక వాస్తవిక ప్రశ్న లేవనెత్తారు. అది ఎలాంటి ప్రశ్న అంటే, ఆ నవల రాసిన కాలంలో అంటే 1927లో అలాంటి వొక ప్రశ్నని వర్జీనియా వుల్ఫ్ కూడా వూహించి వుండదు. అదే విధంగా, ఓల్గా “సహిత”లో వివిధ వ్యాసాలలో లేవనెత్తిన సాంస్కృతిక ప్రశ్నలన్నీ సమకాలీన/ దృక్పథ-కేంద్రిత స్పృహలోంచి మొలకెత్తినవి. వొక విధంగా ఈ ప్రశ్నలు ఇప్పుడు మొలకలయిన భావనల అప్పటి అంకురాల అన్వేషణ “సహిత.”

వర్జీనియా వుల్ఫ్ నవలానంతర  ప్రశ్నల  నేపధ్యంలో తలెత్తిన చర్చల్లో ఇంకా వేరే అంశాలు చాలా వున్నాయి, ఒక సామాజిక సిద్ధాంత చర్చే వుంది.  కానీ, నేను ఇప్పుడు ఓల్గా సాహిత్య వ్యాసాల సంపుటి “సహిత” విశ్లేషణలో ఆ చర్చలోని రెండు అంశాలని మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నాను -అందులో మొదటిది  స్త్రీవాద వైయక్తికత (subjectivity), రెండోది: స్త్రీవాద సాహిత్య/సాంస్కృతిక చరిత్ర నిర్మాణం (feminist historiography). ఈ రెండు మౌలిక భావనలకీ వొక దాంతో ఇంకో దానికి సంబంధం వుంది, అలాగే, ఈ రెండూ  ఓల్గా సాహిత్య వ్యాసాల ‘సహిత’ కీ పునాది అని నా అభిప్రాయం. వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” నవలకీ, ఓల్గా తెలుగు సాహిత్య రంగంలో చేస్తున్న పనికీ కూడా కొన్ని పోలికలు వున్నాయి. అది ఇంకా లోతయిన తులనాత్మక విశ్లేషణ జరగాల్సిన విషయం కాబట్టి, ఇప్పటికిప్పుడు  ఆ విషయం జోలికి నేను  పోవడం లేదు.

ఇక ఈ వ్యాసం ముగిసే లోగా నేను చాలా గట్టిగా  వాదించదలచుకున్న అతి ముఖ్యమయిన విషయం ఇంకోటి  వుంది – ఈ  ‘సహిత’ వ్యాస సంపుటి కేవలం సాహిత్య వ్యాసాల సంపుటి కాదనీ, ఇది  ఓల్గా మేధోజీవన ఆత్మ కథ (intellectual autobiography) అని. ఈ వాదన కొంచెం సంక్లిష్టమయింది అని నాకు తెలుసు. కానీ, అది ఈ సందర్భంలో ముఖ్యమయ్యిందని నాకు కచ్చితంగా తెలుసు, ఈ వ్యాసం చదివాక అది  మీకు కూడా తెలుస్తుంది.

1

      వైయక్తికత అనే మాటని కాస్త తేలిక పద్ధతిలో, ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న  వ్యక్తిగతం(పర్శనల్)   అందాం. కానీ, ఈ ‘వ్యక్తి’కేవలం  ‘నేను’ పరిధికి  కుంచించుకు పోయే వ్యక్తి కాదని చెప్పడం కోసం, దాన్ని వొక భావనగా చర్చించే వుద్దేశంతో ‘వైయక్తికత’ అని కొంచెం భిన్నమయిన పదాన్ని వాడుతున్నాం. కానీ, అన్నీ విధాలుగా వ్యక్తిగతం అనే మాట కింద వచ్చే విషయాలే ఇందులో చర్చకి వస్తాయన్నది వాస్తవం. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు అస్తిత్వం అనే భావనకి ఒక రూపాంతరం   వైయక్తికత.

తత్వశాస్త్ర చరిత్ర చాలా కాలం పాటు అస్తిత్వం అనే భావనకి సామూహికత పునాది అంటూ వచ్చింది. అనేక మతాల దర్శనాల్లో కూడా సామూహిక అస్తిత్వానికే పెద్ద పీట వేశారు. దాని ప్రకారం, సామూహికంగా వొప్పుదల అయిన కొన్ని భావనల సమాహారమే వైయక్తికత లేదా అస్తిత్వం. ఆ అస్తిత్వ చర్చలో వ్యక్తికి విడిగా వొక స్థానం అంటూ లేదు. కానీ, ఆధునికత అనే భావనలో  వైయక్తికతని అస్తిత్వానికి వొకానొక ముఖ్యమయిన లక్షణంగా గుర్తించడం మొదలయ్యింది. ఆశ్చర్యంగా ఈ పదాన్ని వొక భావనగా వుపయోగించిన మొదటి  తాత్వికుడు వొక కాల్పనిక కవి కొల్రిడ్జ్. 1821 లో కొల్రిడ్జ్ చెప్పిన అర్ధం– consciousness of one’s perceived states- చాలా కాలం పాటు  అదే ప్రామాణికంగా వుంది.

కానీ, ఈ వైయక్తికత అనేది కేవలం వొక వ్యక్తి అవగాహనా, అనవగాహన మీద ఆధారపడిన స్థితి కాదనీ, ఈ వ్యక్తి అస్తిత్వ భావన అనేక అంతర్ బాహ్య పరిస్తితుల మీద కూడా ఆధారపడి వుంటుందని అత్యాధునిక  సామాజిక శాస్త్రవేత్తలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ కొత్త భావన ప్రకారం సమూహం ఎంత ముఖ్యమో, వ్యక్తీ అంతే ముఖ్యం. కానీ, ఆ వ్యక్తికి ఎన్ని కోణాలు వుంటాయన్నది ఇప్పుడు ముఖ్యమయిన ప్రశ్న.  2001 లో ఆంథోనీ ఎలియట్ ఏమంటున్నాడో చూడండి:

…..the self is also shaped and defined against the backdrop of…..political and public forces; yet the fabrication of the self, psychologically and emotionally, is rightly understood to involve something more subjectivity, particularly in the ways in which desire, emotion and feeling influence the conscious and unconscious experience of sexuality, gender, race and ethnicity.

కొల్రిడ్జ్ నుంచి ఇటీవలి ఎలియట్ దాకా వైయక్తిక అస్తిత్వం వొక భావనగా సాగించిన ప్రయాణంలో మనం చూడాల్సిన మార్పు ఏమిటంటే, వైయక్తిక అస్తిత్వం అనేది మనం అనుకుంటున్నంత వైయక్తికం కాదు. అందులో ఆ అస్తిత్వాన్ని సృష్టించే పబ్లిక్ శక్తుల ప్రమేయం తప్పక వుంటుంది. అత్యాధునిక వాదం పర్సనల్ కీ, పోలిటికల్ కీ మధ్య వుండే పరస్పర బంధాన్ని చెప్పే దాకా వెళ్తుంది ఆ పునాది మీదనే. విశ్వజనీనత అనే భ్రమ నుంచి బయట పడి, చాలా నిర్దిష్టంగా, స్థానికంగా  మాట్లాడడం మొదలెడితే తప్ప ఈ అస్తిత్వ కోణాల్ని సమగ్రంగా చూడలేమని నా వాదన.

గత పాతికేళ్లుగా తెలుగు సాహిత్య/సామాజిక చరిత్రని శాసించిన రెండు మౌలిక భావనలు – నిర్దిష్టత, స్థానికత. ఎన్ని వాదాలు వచ్చినా, ఎని వివాదాలు జరిగినా, ఈ రెండు మౌలిక భావనల్ని అవి తప్పించుకోలేవని నా అభిప్రాయం. తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అంటూ జరిగితే, అది ఈ భావనల పునాదిగా జరగాల్సిందే. కానీ, భిన్న వైయక్తికతలు వుండే కాలంలో సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం ఎలా జరుగుతుందీ, దానికి తగిన వనరులు, ఆధారాలూ, పరికరాలూ మనకి వున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వున్నాయని నా విశ్వాసం. అయితే, ఇప్పుడు వున్న సంకుచిత వైయక్తిక ధోరణుల నించి కాకుండా, వైయక్తికతని దాని నిజమయిన అర్ధంలో అర్ధం చేసుకుని, చర్చిస్తే, మన చుట్టూ వున్న రచయితలే సాంస్కృతిక చరిత్ర నిర్మాతలు అన్న విషయం కూడా మనకి అర్ధమవుతుంది. ఓల్గా సాహిత్య వ్యాసాల్ని ఆ దృష్టి కోణం నుంచి చదివినప్పుడు నేను ఇలాంటి కొన్ని సాంస్కృతిక తీగల్ని కలుపుకుంటూ వెళ్లగలిగాను. వాటన్నిటినీ కలిపి వొక చోటి నించి చూస్తే, సమకాలీన సాహిత్య సాంస్కృతిక చరిత్ర గురించి కొన్ని సాధారణ లక్షణాల్ని క్రోడీకరించే (classification), కోడీకరించే (codification)  అవకాశం కూడా వుంది. ఆ సాధారణ లక్షణాల సమ్మేళనమే కొత్త సాహిత్య చరిత్ర నిర్మాణానికి పునాది అని నేను వేరే చెప్పకర్లేదు కదా!

అంటే, ఈ వ్యాసాలలో చాలా బలమయిన అస్తిత్వ కోణాలు కనిపించినప్పటికీ, వాటి మూలాలు అన్నీ మొత్తం సాహిత్య చరిత్రలో వున్నాయి. అందుకే, ఈ వ్యాస సంపుటి గురజాడతో –  కాదు, కాదు, మధురవాణితో – మొదలవ్వడం కాకతాళీయం కాదనుకుంటా.  తెలుగు సాహిత్యంలో స్త్రీ చర్చకి మంచి ప్రారంభం వుంది కానీ, కొనసాగింపు లేదని నేను గతంలో ఒక సారి చెప్పాను. ఆ ప్రారంభం గురజాడతో జరిగింది. ఓల్గా సాహిత్య వ్యాసాలు ఇప్పుడు ఈ 2011 లో కూడా గురజాడతో ప్రారంభం అవ్వడం నాకు యాదృచ్ఛిక్కమూ అనిపించలేదు, ఆశ్చర్యమూ అనిపించలేదు, గురజాడ తీసుకువచ్చిన ఆధునికత లోతులు ఇంకా మనకు అంతు పట్టనే లేదు కనుక. వర్జీనియా వుల్ఫ్ నవలలో ఇటీవలి సాహిత్య సిద్ధాంత వేత్తలు ‘ఆమె’ పక్షం తీసుకోవడానికీ, ఓల్గా ఈ పుస్తకంలో మధురవాణి పక్షం తీసుకోవడానికీ ఆ సాహిత్య చరిత్రే కారణం. ఆ మాటకొస్తే, మధురవాణి గురించి ఇప్పటి వరకూ తెలుగు సాహిత్యకారులు మాట్లాడలేదా అంటే మాట్లాడారు.

మధురవాణిని తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా బలంగా కాపాడుకుంటూ వస్తున్న లక్షణాలేమిటో ఇక్కడ ఏకరవు పెట్టక్కర్లేదు. కానీ, ఆమెని వాళ్ళు రొమాంటిసైజ్ కూడా చేశారన్నది నిజం. చాలా మందికి ఆమె అనేకానేక కాల్పనిక కావ్యకన్యల్లో వొకటిగా మిగిలిపోయింది తప్ప, ఆమె మాటల కింద ప్రవహిస్తున్న మూల భావనల జాడ వాళ్ళకి అంతుపట్టిందని అనుకోడానికి ఇప్పటివరకూ వున్న పురుష కేంద్రిత విమర్శ సాంప్రదాయంలో తగిన ఆధారాల్లేవు.  ఓల్గా ఇన్నేళ్ల తరవాత ఆమెని ఎందుకు భిన్నంగా చూడగలిగారు అన్న విషయం అర్ధం కావాలంటే నేను పైన ప్రస్తావించిన వైయక్తిక భావన చరిత్ర అర్ధం కావాలి. ఓల్గా చూసిన మధుర వాణికీ, గురజాడ ‘పాత్ర’కీ సంబంధం వుందా అంటే, ఆ విషయం ఇప్పటికిప్పుడు అప్రస్తుతమే అంటాను. ‘ప్రస్తుతం’లోకి  ఆ పాత్ర ఎట్లా అనువదించబడుతోందో అదే ముఖ్యమనీ అంటాను. ప్రతి రచనకీ, ప్రతి పాత్రకీ అనేక జన్మలు వుంటాయి. వొక్కో జన్మ ఆ కాలధర్మాన్ని బట్టి వుంటుంది. ‘ఒక్క నేనే నీకు, పెక్కు నీవులు నాకు” అని ఎంకి నాయుడు బావలు  ఎందుకనుకున్నారో  కచ్చితంగా అదే, వొక రచన విషయంలో కూడా జరుగుతుంది. ఒక్క రచనే, కానీ ‘పెక్కు నీవు’లుగా మారుతుంది. సాహిత్య చరిత్ర మూల మలుపుల్లో వున్నప్పుడు ఈ ‘పెక్కు నీవుల’ బహుళత్వం కొంత సంక్లిష్టంగా కూడా వుండవచ్చు.

మధురవాణి పాత్రని ఓల్గా కుటుంబ కేంద్రిత భావజాలంపై వొక ధిక్కార ప్రకటనగా చూశారు, ఇంటి శ్రమని గుర్తించిన గాఢమయిన వైయక్తికత వున్న ఆధునికవాదిగా విశ్లేషించారు. ఈ విధమయిన దృష్టి అంతకు ముందు లేదు. ఇంకో కోణం నించి అసిరిని విశ్లేషించడంలో ఈ కొత్త విమర్శనా పద్ధతికి విస్తృతి పెరిగింది.  నిజానికి మధురవాణి వ్యక్తిత్వానికి వ్యాఖ్యానం ఇవ్వగల పాత్ర ఆసిరి విశ్లేషణలో ఈ మొత్తం కుటుంబ, బ్రాహ్మణ కేంద్రిత మార్మికీకరణ రహస్యాలు బట్టబయలు చేస్తారు ఓల్గా. ఈ రెండు వ్యాసాలని వొక దాని వెంట వొకటి చదివితే, ఈ రెండీటీ విశ్లేషణకి ఓల్గా ఉపయోగించిన  లెన్స్ వొక్కటే అని అర్ధమవుతుంది. ఆ లెన్స్ ని నేను subjectivity అంటున్నాను.

2

       ఒక వ్యక్తి మనసూ, శరీరం చేసే వ్యాయామాల చరిత్ర ఆత్మకథ అయితే, ఆ వ్యక్తి మెదడు చేసే వ్యాయామాల చరిత్ర మేధో ఆత్మ కథ. అట్లా అని, శరీరానికీ, మెదడుకీ వైరుద్ధ్యం వుందని నేను అనడం లేదు. వాటి మేలు కలయికే మేధో ఆత్మకథ. ఈ వ్యాసం ప్రారంభంలో వర్జీనియా వుల్ఫ్ నవలలో స్త్రీ పాత్ర గురించి పురుషుడికి వున్న ‘సాంప్రదాయిక’ వంటింటికి పరిమితమయిన ఆలోచన ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తరవాత ఆ ఆలోచనపై యుద్ధమే మిగతా నవల అంతా – ఒక వాస్తవికత ఎంత సంక్లిష్టంగా వుంటుందో, అది వొక వైయక్తిక కోణం (subjectivity)  వల్ల ఎంత భిన్నత్వాన్ని సంతరించుకుంటుందో చెప్పే ప్రయత్నమే నవల. నిజానికి, స్త్రీ ఆలోచనకి పురుషుడు ‘నిర్మించిన’ ఆ కిచెన్ టేబులు సాంస్కృతిక రాజకీయ వలయాన్ని ఛేదించడం అంతర్లీన ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే, ఈ నవలలో ఆత్మకథాత్మక లక్షణాలు కూడా అనేకం కనిపిస్తాయి.  ఏ రచయిత సృజనాత్మక రచనలో అయినా ఆత్మకథాత్మకత తప్పనిసరి లక్షణం. కానీ, సాహిత్య వ్యాసాలలోనో, సాహిత్యేతర వచనంలోనూ ఆత్మకథాత్మకత వుండే అవకాశం వుందా? అన్నది ప్రశ్న.

అలాంటి అవకాశం వుందనే “సహిత” నేపధ్యంగా మనకి అర్ధమవుతుంది. ఎందుకంటే, ఈ మొత్తం “సహిత” వ్యాసాలన్నీ ఆయా సాహిత్య సందర్భాలలోని ఆయా స్త్రీ పాత్రల వైయక్తిక అన్వేషణే కనుక. ఈ వైయక్తిక అన్వేషణ ముఖ్యంగా మూడు మార్గాలలో జరుగుతుంది. ఒకటి, ఆ రచయిత అధ్యయనం; రెండు, రచయితకి ఇతర రచయితలతో వుండే వ్యక్తిగత/ సైద్ధాంతిక అనుబంధం; మూడు, రచయిత వివిధ సాహిత్య సిద్ధాంతాల ద్వారానో, ఉద్యమాల ద్వారానో చేసే వ్యక్తిగత/ సైద్ధాంతిక ప్రయాణం. నిజానికి ఈ మూడు అంశాలు వొకదానితో వొకటి ముడిపడి వున్నవే. కానీ, వీటి పరిధుల్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి వీలుగా వాటిని విడివిడిగా చూడడమూ అవసరమే. ఈ మూడింటి కలగలుపు  ప్రయాణమే ఒక రచయిత మేధోజీవన ఆత్మకథ అవుతుంది.

రచయిత అనుభవమూ అధ్యయనమూ ఎప్పుడూ కలగలిసి వుంటాయి. అనుభవాల్లో వైరుద్ధ్యమో,  సంఘర్షణో లేని రచయిత అధ్యయన పరిధి విస్తరించే అవకాశం తక్కువ. అయితే, అనుభవమనే కొలమానం తీసుకుంటే వైయక్తికతలో కొన్ని రాగద్వేషాలు కూడా బలంగానే వుండవచ్చు. అధ్యయనం వల్ల ఆ రాగద్వేషాల మధ్య కొంత సమతూకం సాధ్యపడవచ్చు. ఒక రచన చదువుతున్నప్పుడు రచయితకి  సామరస్యాల్ని బాగా చూసే అలవాటు అవుతుందని అందరం అనుకుంటాం. కానీ, సామరస్యం కంటే కూడా భిన్నత్వాన్ని చూసే అలవాటు బాగా పెరుగుతుంది. అలాంటి భిన్నత్వ దృష్టి ఆ రచయిత వైయక్తికతని బలంగా కుదుపుతుంది. ఓల్గా ఈ వ్యాసాలలో అలాంటి భిన్నత్వపు కుదుపులను చర్చకి తీసుకువస్తారు. అనుభవానికి వుండే  “తను” “ఇతర” అనే రెండు కోణాల నించి సాగే ఈ అధ్యయన ప్రయాణం ఈ వ్యాసాల్లో ప్రతి వాక్యంలోనూ కనిపించడం మొత్తంగా ఆమె ప్రతిపాదిస్తున్న/ సమర్ధిస్తున్న అస్తిత్వవాద రాజకీయాలకూ, వాటిని శరీర రాజకీయాల నించి చూసే తనదయిన ప్రత్యేకతకి సంకేతాలు. ఈ  అనుభవాన్ని చెప్పెటప్పుడు ఓల్గాలో మారుతున్న స్వరాన్ని గమనించినప్పుడు ఆ స్వరంలో ఉద్వేగం ఎంత వుందో, ఆ ఉద్వేగాన్ని ఆలోచనల భాషలోకి కుదించాలన్న తపన కూడా అంతే వుంది. తన వైయక్తికతని చెరుపుకోకుండా, తన స్వరాన్ని అణచుకోకుండా, తన తను ఇతరలోకి వొంపే సునిశితమయిన వొక సాంప్రదాయ విముక్త భాషని ఓల్గా ప్రతి వ్యాసంలోనూ ఉపయోగిస్తారు.

ఈ “ఇతర” ప్రపంచంలోకి ప్రయాణం ఆమెకి వున్న అనుభవ వైవిధ్యం వల్ల, బతుకు సంఘర్షణ వల్ల, వాటిని నడిపించే తాత్విక స్పష్టత వల్లా వివిధ రూపాలు తీసుకుంటుంది. ఒక రచనతో, ఆయా రచయితలతో తనకి ప్రత్యక్షంగా అనుబంధం వున్నప్పుడు – ఉదాహరణకి శ్రీశ్రీ, కొ.కు, చలం- లాంటి రచయితలని గురించి రాసిన వ్యాసాల్ని పఠిత రెండు సార్లు చదవాలి. మొదటి సారి  కేవలం ఆ రచయిత గురించి ఓల్గా ఏం అంటున్నారో వినడానికి చదవాలి. రెండోసారి, ఆ రచయిత లేదా రచనల వెలుగులో తన గురించి ఆమె ఏం అంటున్నారో వినడానికి చదవాలి. ఈ రెండు ప్రక్రియలూ వొకే మాదిరిగా అనిపిస్తాయి కానీ, నిజానికి కాదు. ముఖ్యంగా, శ్రీశ్రీ గురించి వ్యాసం చూడండి. మొదటి సారి చదివినప్పుడు శ్రీశ్రీ గురించి ఓల్గా కొత్తగా ఏం చెప్పారో నాకు అర్ధం కాలేదు. రెండో సారి చదువుతున్నప్పుడు శ్రీశ్రీ అనే కేంద్రాన్ని తొలగించుకొని, అక్కడ కాసేపు ఓల్గానో, నన్ను నేనో కేంద్రంగా తీసుకునో ఆ వ్యాసం చదివాను. అప్పుడు శ్రీశ్రీ గురించీ, అదే సమయంలో తన గురించీ, అదే అదే సమయంలో నా (నా అంటే నాలోని పఠిత) గురించీ ఓల్గా మాట్లాడుతున్నట్టు నాకు అర్ధమయ్యింది.

ఒక రచన గురించో, ఒక రచయిత గురించో మాట్లాడుతున్నప్పుడు – అది వ్యక్తిగత స్మృతి సందర్భం అయినప్పటికీ- మనం “తన” “ఇతర” మధ్య వొక వంతెన కట్టుకుంటాం. ఆ వంతెన మీద ఆ రచయితతో కలిసి కాసేపు జీవన “సంధ్యల” లోకి చూస్తాం (చలానికి కృతజ్నతలతో ఈ వాక్యం). అలా మనతో కలిసి ఎంతో సేపు సంభాషించలేని /వుండలేని రచయిత గానీ, రచన గానీ మన వైయక్తికతలో నించి అతి తేలికగా మనకి చెప్పా పెట్టకుండానే నిష్క్రమిస్తారు. ఆ తరవాత ఇక ఆ రచయిత గురించీ, ఆ రచన గురించీ మాట్లాడాల్సిందేమీ లేదనే అనుకుంటాను. (ఈ విధమయిన వైయక్తికతని reinforce చెయ్యడానికే చలం మ్యూజింగ్స్ రాసారేమో అనిపిస్తుంది ఈ మధ్య నాకు.) తన సంఘర్షణలో తనతో పాటు నిలిచిన రచయితలూ, రచనల ప్రస్తావన ద్వారా మనం నిజానికి మన లోపలి సంభాషణే వినిపిస్తాం. ఆ పని చలం గురించీ, కొ-కు గురించీ, శ్రీశ్రీ గురించీ రాసిన వ్యాసాలలో నైపుణ్యంతో చేశారు ఓల్గా.

ఈ లోపలి సంభాషణ ఏదయినా వొక విస్పష్టమయిన రూపం తీసుకోవాలంటే, తన బయటి లోకంతో  యుద్ధం కూడా వొక కొలిక్కి రావాలి రచయితకి- అది బయట వున్న ఉద్యమాల్ని ఆ రచయిత ఎంతగా internalize చేసుకోగలరన్న విషయం మీద ఆధారపడి వుంటుంది. ఈ దశలో రచయితలు  ఏ ఉద్యమాలతో, ఏ అస్తిత్వవాద చైతన్యంతో ఏ స్థాయిలో మమేకం అవుతున్నారన్న విషయం వాళ్ళ రచనల్లో బాహాటంగానే తెలుస్తుంది. అయితే, ఇదే సమయంలో ఆ రచయితలు ఆయా ఉద్యమాలతో, అస్తిత్వవాద చైతన్యాలతో ఎంత విమర్శ పెట్టగలరన్న విషయం కూడా ముఖ్యమే. ఓల్గా తన గురించి నేరుగా చెప్పుకున్న విషయాల్లోనూ, ఇతరులు వాహికగా తన గురించి పరోక్షంగా చెప్పిన విషయాల్లోనూ ఈ విమర్శనాత్మక ఆత్మశీలన (critical reflexivity) ని కొన్ని సార్లు ఎంత సున్నితంగా వ్యక్తం చేశారో, ఇంకా కొన్ని సార్లు అంతే ముక్కుసూటిగా నిక్కచ్చిగా critical distance గురించి కూడా  చెప్పారు. అంటే, వొక సైద్ధాంతిక క్రమశిక్షణ వున్న రచయితలు  తమ చుట్టూ వున్న ఉద్యమాల వాడినీ, వేడినీ ఎంత వేగంగా స్వీకరించగలరో, అంతే విమర్శనాత్మకంగా వొక ఆత్మీయమయిన “దూరాన్ని” కూడా స్వీకరించగలరు. అలా చెయ్యలేకపోతే, ఆ రచయితకి వున్న వైయక్తికత గాయపడుతుంది. అలా తన వైయక్తికత గాయపడిన సందర్భాల నించి ఓల్గా నేర్చుకున్న కొన్ని పాఠాలు “సహిత”లో వున్నాయి. ఆ పాఠాలు నిజానికి ఎవరికి వాళ్ళు తిరిగి అనుభవిస్తే తప్ప వాటి తీవ్రత తెలియదు, నిజమే, కానీ, ఆ పాఠాల నించి ఓల్గా తన ప్రయాణం నించి స్త్రీవాద చరిత్ర నిర్మాణ సాధనాల అన్వేషణకి బయలుదేరుతున్నారు, అడవిలో చిక్కుబడిన వొంటరి సీత తనలాంటి ఇతర సీతలతో కలిసి  ఇంకో కొత్త రామాయణం – కాదు సీతాయణం – తిరగరాస్తున్నట్టుగా.

3

       ఏక నలుపు అనే పదాన్ని “సహిత”లో ఓల్గా కొన్ని సందర్భాల్లో వాడడం చూస్తాం. అది ఇష్టంతో కాదు, అయిష్టంతో!

చరిత్ర అంటే ఏక నలుపో ఏక తెలుపో లేదా కేవలం తెలుపూ నలుపుల మిశ్రమం మాత్రమో కాదు. “ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది” అన్న వాక్యం ఇటీవల చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ, ఈ పునర్లేఖన ప్రక్రియ ఎలా వుంటుందన్న అవగాహన కలగడానికీ, ఆ ప్రక్రియకి అవసరమయిన పనిముట్లని సాధించడానికి కొన్ని దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది తెలుగు సాహిత్యం.  చరిత్రని వొక మూసలోంచి కాకుండా అనేకత్వంలోంచి చూడాలన్న స్పృహ ప్రధానంగా జాతీయవాద అనంతర/ మార్క్సిస్టు అనంతర ధోరణి. ఒకే ఒక్క ప్రధాన ఆధిపత్య చరిత్ర అంటూ ఏదీ వుండదనీ, ఏక సమయంలో అనేక చరిత్రలు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా, జమిలిగా  పనిచేస్తుంటాయన్న విమర్శనాత్మక చైతన్యం మార్క్సిస్టు, జాతీయవాద చరిత్రల మహా కథనాలని ప్రశ్నించడంతో మొదలయ్యింది. కానీ, ఈ ప్రశ్నించడం అనే ప్రక్రియ సఫలమవ్వడానికి కొన్ని సాధనాలు కావాలి, కొంత సాధనా కావాలి. అలాంటి సాధనాల సాధన మన:కార్మికశాల  “సహిత.”

స్త్రీవాద విమర్శ సాధనాలను ఇంకా సమర్ధంగా వాడుకోలేకపోయామన్న విమర్శ చాలా మటుకు నిజమే. కానీ, ఆ సాధనాలు ఏమిటన్న అవగాహన లేకపోవడం, దానికి సంబంధించిన వచనం తెలుగులో తగినంతగా రూపొందకపోవడం దీనికి  ఒక కారణం.  ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి అన్నట్టుగా, “సహిత”లో ఓల్గా అలాంటి కొన్ని సాధనాలను అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అలా అందుబాటులోకి తీసుకువచ్చే ముందు ఆమెకి స్వయంగా వాటి వాటి అలభ్యత గురించి స్పష్టత వుంది. 1986లో ఓల్గా “మనకి తెలియని మన చరిత్ర” ని సమీక్షిస్తూ అంటారు, “ తెలుగులో స్త్రీవాద దృక్పథం నుంచి రాసిన చరిత్రలు లేవు. చరిత్ర పుస్తకాలే కాదు, మిగిలిన సాహిత్యంలో కూడా స్త్రీ దృక్పథంతో మాత్రమే వచ్చినవి లేవు” ఈ వాక్యం ఇప్పటికీ నిజమే. “మనకి తెలియని మన చరిత్ర” “మహిళావరణం” లాంటి రచనలు ఎన్నో  వచ్చే అవకాశాలూ, భిన్న సందర్భాలూ  తెలుగు సాహిత్య/ సాంస్కృతిక చరిత్ర నిండా వున్నాయి. వాటి పునర్నిర్మాణం అనేక సందర్భాల్లో అనేక వినిర్మాణాలతో ముడిపడి వున్న విషయం కాబట్టి, ఆ వినిర్మాణ/పునర్నిర్మాణ ప్రక్రియలో వుండే వేదనా, శ్రమా రెండీటీని ఎదుర్కొనే శక్తి మన రచయితలకీ, ముఖ్యంగా విమర్శకులకి చాలా తక్కువ. అప్పుడప్పుడూ అరకొరగా సాగుతున్న కృషి వున్నా, అది సరిపోదు.   చరిత్ర నిర్మాణం పట్ల మనలో వున్న అలాంటి అంధత్వాన్ని గుర్తించి, కనువిప్పు కలిగించే సాధనాలు కొన్ని అయినా అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నం “సహిత” లో కనిపిస్తుంది.

అలా ఓల్గా అందుబాటులోకి తీసుకువచ్చిన , మొదటి సాధనం – ఒక వాచకాన్ని దగ్గిరగా, విమర్శనాత్మకంగా, అంతర్దృష్టితో చదవడం (close, critical and reflexive reading). “సహిత”లో మొదటి  నాలుగు వ్యాసాలు గురజాడ కన్యాశుల్కం ని నాలుగు భిన్నమయిన సాధనలతో విశ్లేషిస్తాయి. మొదటి వ్యాసం మధురవాణిని కుటుంబ-కేంద్రిత కోణం నించి చూస్తుంది. రెండో వ్యాసం ఒక పురుష పాత్ర నించి మధురవాణిని ఆవిష్కరించడం, అదే సమయంలో ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే సాధనాన్ని (de-heirarchization) ఉపయోగించారు. ఈ సాధనాల వాడకం దృష్టి నించి చూస్తే, మూడో వ్యాసం చాలా చర్చించదగింది. ఈ వ్యాసం ఫెమినిస్టులు చట్టాన్ని ఎట్లాచూడాలో, దాన్ని తిరిగి సాహిత్య దర్పణంలోంచి ఎట్లా వీక్షించాలో ఓల్గా తగిన ఆధారాలతో చూపిస్తారు. ఇదే వ్యాసంలో ఇంకో ముఖ్యమయిన సాధనాన్ని కూడా ఆమె బాగా వాడుకున్నారు. అది వలసవాదానంతర ధోరణి నించి రచనని చూడడం. బ్రిటిష్ వలస పాలన అనుసరించిన వ్యూహాల వినిర్మాణ ధోరణి  కనిపిస్తుంది.  ఇక నాలుగో వ్యాసం – domestic labor కోణం నుంచి కన్యాశుల్కం విశ్లేషణ. ఈ వ్యాసం ఒక social postmodernist కోణం నించి కూడా అర్ధం చేసుకోవచ్చు.  స్త్రీవాద విమర్శకోణం నించి వొక రచనని ఎట్లా దగ్గిరగా, విమర్శనాత్మకంగా చదవవచ్చో కొన్ని నమూనాల్ని ఓల్గా ఈ వ్యాసాల్లో చూపిస్తారు.

రెండో సాధనం ప్రతిఘటన  రాజకీయాలకి సంబంధించింది.  వొక స్త్రీవాదిగా ఏ రచనని స్వీకరించాలి, ఏ రచనని నిరాకరించాలి అన్నది ఎట్లా తేల్చుకోవడం?! సాధారణ  రచయితల కంటే భిన్నంగా  స్త్రీవాద రచయిత గానీ, అస్తిత్వవాద రచయిత గానీ  మూడు  రకాల అణచివేతల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఒకటి: నిజంగా సంప్రదాయ సాహిత్యం నించి, రెండు: ఆధునికంగా కనిపించే అంతర్గత సంప్రదాయం నించి, మూడు: అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత నించి. వీటన్నిటినీ దాటుకొని వచ్చి స్త్రీ తన స్వరాన్ని ఎట్లా వినిపించాలన్నది తీవ్ర అన్వేషణ. ఇదే క్రమంలో ఇంకొక ముఖ్యమయిన వెతుకులాట కూడా వుంటుంది. అది తనదయిన స్మృతిని/ అనుభవాన్ని తిరిగి రాబట్టుకోవడం(retrieval of the personal memory).  ఇతర అనేక అంశాల మాదిరిగానే ఈ మూడు కూడా పరస్పరాధారిత కోణాలు. ఇక్కడ ఈ “వ్యక్తిగతం” రాజకీయాలకీ, పబ్లిక్ కి అతీతం కాదు. వాటన్నిటి కలయికలోంచి పుట్టిన subjectivity.

“సహిత” వ్యాసాల సారాంశాన్ని వొక వాక్యంలో చెప్పాలంటే, అదంతా ఈ నిరాకరణ-స్వీకరణ రాజకీయాల నుంచి ఓల్గా తనదయిన అనుభవ స్వరాన్ని వెతుక్కునే దారి. కాల పరిమితుల దృష్ట్యా ఓల్గా ఈ వ్యాసాలలో సంప్రదాయ సాహిత్యం జోలికి పోలేదు కానీ, గురజాడ కన్యాశుల్కం విశ్లేషణలో కొంత మేరకు ఆ సాంప్రదాయ అణచివేత ని విమర్శిస్తారు. అది కాక, మిగిలిన రెండు కోణాలు – ఆధునికంగా కనిపించే అంతర్గత సాంప్రదాయం, అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత- ‘సహిత”లో ప్రధానమయిన ఇతివృత్తాలు. వాటి చుట్టూ జరిగే చర్చ కొంత మేరకు సంప్రదాయాన్ని కూడా ప్రశ్నించినా, వాటి యుద్ధ భూమి మాత్రం తక్షణ వర్తమాన  కురుక్షేత్రమే. ఆ కారణంగానే “సహిత” ఈ కాలపు స్త్రీవాదుల ఆత్మచరిత్ర కూడా!

-అఫ్సర్

2012

 

Download PDF

7 Comments

  • Great to read such an extensive, intense and detailed analysis

  • Elanaaga says:

    అఫ్సర్ గారూ!

    Depth తో కూడుకున్న ఒక అవగాహనను higher plane లో explain చేసినట్టైంది. అయితే ఈ విషయంలో మీరు నిస్సహాయులనీ, మీ అసహాయతకు legitimacy వున్నదనీ తెలుసు నాకు. ఎందుకంటే ప్రారంభంలో మీరు తూనికరాళ్లుగా ఎంచుకుని వినియోగించిన precepts మీ వ్యాసపు track నూ , దిశనూ ముందే నిర్దేశించాయి. ఇక వ్యాసం అదే groove లో సాగక తప్పని పరిస్థితి ఏర్పడింది. అవగాహనలో మీ స్థాయికి చేరితే తప్ప అంత సులభంగా పూర్తిగా అర్థం కాని విధంగా ఉంది మీ వ్యాసం. మీ intellectual flair స్పష్టంగా ద్యోతకమైంది. Congrats.

  • Manasa says:

    అఫ్సర్ గారూ, చాలా విపులంగా, సునిశితంగా పరిశీలించి వ్రాసిన ఈ వ్యాసం ఇట్టే ఆకట్టుకుంది. అన్వేషణ ఏ వైయక్తిక మార్గాల్లో సాగినా, ఒక సంకలనంలో తన గొంతు బలంగా వినపడేందుకు రచయిత ఏ మార్గాన్ని ఎంచుకోవాలో ఆ మూడు మార్గాలనూ ఓల్గా గారు ఎంచుకునట్టు వ్రాశారు మీరు. అన్ని వ్యాసాలనూ క్లుప్తంగా పరిచయం చేయడం ఆసక్తి కలిగించింది.

    లోక్నాయక్ పురస్కారాన్ని అందుకున్న ఓల్గా గారికి అభినందనలు. సరైన సమయంలో ఈ వ్యాసాన్ని పునః ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు.

  • rajaram.thumucharla says:

    విమర్శ ఇంత లోతుతో ఆలోచించి రాయాలని మీ వ్యాసం తెలియజేసింది .థాంక్స్ అఫ్సర్ గారు

  • balasudhakarmouli says:

    Great analysis

  • Thirupalu says:

    చాలా బావుంది మీ వ్యాసం.
    ఒక తరానికి ఉన్న సాహిత్య సైద్దాంతిక దృష్టి ఈ తరానికి లేకపోవటం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది- ఎలనాగ గారు అన్నట్లుగా.

  • sri says:

    ఈ వ్యాసం నేను The writer`s perception on Olaga ఎలా ఉందో చూడాలని చదవడం మొదలు పెట్టా . Even though some times writer tried to manipulate the reader to keep in a specific way . But for sure I can say, writer captured Olaga`s voice (The real) . Best wishes to you Afsar ji …

Leave a Reply to Jayashree Naidu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)