వర్తమాన కథకి ఒక వరం!

         వరలక్ష్మి మంచి  కథకురాలు  ( story writer ) మాత్రమే కాదు.. ఆమె ఉత్తమశ్రేణికి చెందిన కథాకారిణి ( story teller )కూడా. కథను రూపవంతంగా,సౌందర్యవంతంగా ,ఆలోచనాత్మకంగా అందివ్వడమొక్కటే కాకుండా పఠిత హృదయంలోకి పూవులోనికి పరిమళాన్ని ప్రవేశపెట్టినట్టు కథయొక్క ప్రాణప్రదమైన కథనాన్నీ, ఆత్మనూ విభ్రమపూర్వకమైన సంలీనతతో గ్రాహ్యపర్చడం ఒక మంచి కథాకారుడు చేయగల పని. అలా చేయగల్గితే కథ శ్రోత/పాఠకుడి హృదయంలో ఒక ముద్రగా స్థిరపడి, జ్ఞాపకమై శాశ్వతమైపోతుంది చిరకాలం. కథను సరళంగా, ఆసక్తికరంగా చెప్పగల్గడం ఒక గొప్ప కళ. అది కొద్దిమందికిమాత్రమే సాధ్యమయ్యే రసవిద్య. శైలి,శిల్పం,యితరేతరమైన సాంకేతిక రూప విన్యాసాలను అక్షరాలకూ , వాక్యాలకూ, అలంకారాలుగా కూర్చి , ‘కథ ‘ను ఒక భారీ సాహిత్యభూషణంగా అందివ్వడంకూడా ఒకరకమైన విలక్షణతే కావచ్ఛు.

varalaxmi

కాని నిరలంకారమైన వచనం, నడక, ప్రస్తావనలతో,కథాంశంతో ఒట్టి కొబ్బరినీళ్ళ స్వచ్ఛతవలె కథను పఠితకందివ్వడం అంత సులభమైన పనికాదు. కాగా అది కేవలం కొద్దిమంది, కొంతకాలమే.. కొన్ని సందర్భాలలోమాత్రమే చేయగల మార్మిక నైపుణ్యం. ఒక పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఒక సి. రామచంద్రరావ్ (వేలు పిళ్ళై )కొంతకాలం మంచి కథాకారులుగా   పాఠకుల్లో  ‘ ఇంకిపోయే’రీతిలో కొన్నికథలను రాశారు. కాని వాళ్ళే అంత అందంగా,జీవవంతంగా యిప్పుడు  కథలను  చెప్పలేకపోతున్నారు.  కాబట్టి మంచి కథను సరియైన సరళ సౌందర్యంతో,జిగితో, బిగువుతో కొందరు మాత్రమే,కొంతకాలమే నిర్మించి అందిస్తారని భావించవచ్చనిపిస్తోంది. ఐతే  ఉత్తమ కథా నిర్మాతలైన కొందరు సఫల తెలుగు కథకుల రచనలను అనుశీలించినపుడు అత్యధిక పాఠకుల మన్ననలు పొందిన కథలన్నీకూడా సమాజంలోని అధిక సంఖ్యాకులైన పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు,వాళ్ళ నిశ్శబ్ద వేదనలు,పోరాటాలు,నిస్సహాయతలు, అనివార్యతల్లోనుండి మాత్రమే నీటిఊటవలె పుట్టుకొచ్ఛినట్టు  స్పష్టమౌతోంది. ఐతే రచయిత తన టార్గెట్ ( లక్ష్య ) పాత్రల జీవితాల్లోకి అధ్యయనాత్మక దృష్టితో స్వయంగా ప్రవేశించి తరచి తరచి పరిశీలించినపుడు మాత్రమే శరీరంలోకి జీవంవలె.. కథలో ప్రాణం ప్రేరితమౌతుంది.

 

అప్పుడే కథ సార్వత్రికతను పొంది స్ఫోరకమై పాఠకుల హృదయాలను జయించడం మొదలెట్టి శాశ్వతమౌతుంది . ఐతే ,కథయొక్క అతి గోప్యమైన ఈ నిర్మాణ రహస్యం వరలక్ష్మికి బాగా తెలుసు. ఇది ఆమెకు అత్యంత సహజసిద్దంగా సంక్రమించిన విద్య. ఈ విషయం వరలక్ష్మియొక్క ఏ కథను చదివినా ఇట్టే సులభంగా తెలుస్తుంది ఎవరికైనా. ఇంతవరకు కేవలం మూడు కథా సంపుటాలను మాత్రమే వెలువరించి రసజ్ఞులైన కథాప్రియులకందించిన వరలక్ష్మికథలు మంత్రసాని.,ప్రత్యామ్నాయం,చిన్నమామయ్య,బాంధవ్యం,గమనం,ఖాళీ సంచులు,మట్టి-బంగారం,గాజు పళ్ళెం ..ఇలా ఒకటా రెండా..ఎన్నో ఉత్తమ కథల పరంపరం. తొంభైల్లోనుండి .. రెండువేల ఏడువరకు వరలక్ష్మి తెలుగు కథా రంగంలో  ‘ స్టార్ రచయిత్రి’ . క్రికెట్లో సచిన్,కోహ్లీ వలె తెలుగు కథారచనా క్షేత్రంలో..బ్యాట్ పట్టుకుంటే సెంచరీలవలె..ఈమె ఏదైనా కథల పోటీకి కథ రాసిందంటే తప్పనిసరిగా ఏదో ఒక బహుమతే. తన మూడు కథా సంపుటాల్లోని నలభై ఏడు కథల్లో ముప్ఫై రెండు కథలు పోటీల్లో బహుమతులు సాధించినవేనని తెలుసుకుంటే ఆశ్చర్యంతో పాటు విభ్రమం కల్గుతుంది.

ఐతే..  ఈ విద్య వరలక్ష్మికి ఎలా అబ్బింది,ఈ కథా సృష్టి నైపుణ్యం ఎలా ఈమె హస్తగతమైందీ.. అంటే.. ఆమె మాటల్లోనే —

పుట్టినప్పట్నుంచీ ఇప్పటివరకూ కేవలం పల్లెటూరి జీవిత సౌందర్యాన్నిఅనుభవిస్తూ, సాధారణ మనిషియొక్క మూలాల్లోకి తొంగిచూస్తూ..పొలంలో ఉన్న నాన్నకు అన్నం పట్టుకెళ్ళి దారితప్పి గట్లన్నీ తిరిగి తిరిగి ఎక్కెక్కి ఏడ్చి, నాన్న గొంతెత్తి పాడిన పద్యం మార్గం చూపించగా గమ్యాన్ని చేరి నాన్న భుజంమీద వాలిపోయిన ఆనందాలు.. అమ్మ ఎప్పుడూ సన్నని గొంతుతో పాడే ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘పాటలు.. కన్పించిన ప్రతి చెట్టునూ,పుట్టనూ ప్రేమించి పరవశించి రాసుకున్న కవిత్వాలు, ఊరి మార్గాలన్నింటా విరిసి మురిసిన తురాయి చెట్ల ఎర్రని అటవీ సౌందర్యాలు. . అక్కడ్నుండి ఎదుగుతున్నకొద్దీ అవగాహనలోకొచ్చిన , రక్త సంబందీకుల్లోనే కొరవడిన ప్రేమలు,ఆ ప్రేమలకు దూరమై విలపించే స్త్రీలు, విలాపంలోనూ మానవత్వాన్నీ,క్షమనూ వదలలేని స్త్రీల బలహీనతలు..కూడు పెట్టని కులవృత్తులు,సామాన్యుని బతుకుతెరువుని లాక్కుంటున్న ఆర్ధిక విధానాలు,ప్రపంచీకరణ పెనుతుపానులో పల్లెలు నిర్వీర్యమౌతున్న విధ్వంసకర దృశ్యాలు.. హింసతో ప్రజ్వరిల్లుతున్న ప్రపంచ రాజకీయాలు కంటనీరు తెప్పిస్తూండగా … అని రచయిత్రి రాసుకున్న ‘ నా మాట’ లోని..ఈ సందర్భాలన్నీ.. వరలక్ష్మి కథలకు వస్తువులుగా , ప్రాణవాయువులుగా రూపొందాయి. అందుకే ఆమె కథలన్నీ.. దాదాపు విషాద జీవిత శకలాలను విడమర్చి చూపి కంటతడిపెట్టించేవీ,హృదయాన్ని విలవిల్లాడించేవీ.. అంతిమంగా  దుఃఖోద్విగ్న మహా దివ్యానుభూతిని సిద్దింపజేసేవీ.

pho-3

‘ ప్రత్యామ్నాయం’ కథలో కోతినాడించి జీవించే సిద్దప్ప, ఒక అవిటి శిష్యుడు..శవప్రాయపు మనసున్న భార్య ఈరి,అంగవైకల్యంగల రెండు ఫీట్ల ఎత్తున్న అనాకారి కొడుకు..ఒక కోతి..ద్రిమ్మరి జీవితం..ఇదీ నేపథ్యం.

ఈ బడుగుజీవుల జీవవంతమైన పలుకుబడుల భాషను పట్టుకుంది వరలక్ష్మి. ఈ సంభాషణ చూడండి.

‘ థూ నీయమ్మ.. సూసి సూసి కోతి నా కొడుకుని కన్నావుకదే..ఈడికి పదారేళ్ళు ముడ్డికిందికొచ్చాయంటే ఎవడైనా నమ్ముతాడా అసలు.?’ అన్నాడు సిద్దయ్య.

‘ సాల్లే నీ తాగుబోతు మొకానికి ఇంతకన్నా అందమైన కొడుకు పుట్టేత్తాడేటి.? తెల్లారి లేత్తే నీ మొకం,నువ్వాడించే కోతి మొకమేకదా దర్సినాలు..ఇంకేటవుద్దిమరి !’ అని తిప్పికొట్టింది ఈరి.

ఐదు పేజీల ఈ చిన్న కథ ‘ ప్రత్యామ్నాయం’లో తాగుబోతు సిద్ధయ్య అనూహ్యంగా చచ్చిపోయి ,కోతిని ఎవరో దొంగిలించుకుపోతే..బతుకుతెరువు ఎలాగో అని దుఃఖంతో  విలవిల్లాడ్తున్న ఈరి  ముందు అంగవికలుడైన కొడుకు కోతి గొలుసును తన మెడలో ధరించి ఒక కొసను తల్లి చేతికిచ్చి ‘ నన్ను కోతిలా ఆడించి బతుకమ్మా’ అని సంజ్ఞ చేసినపుడు.. ముగింపు పాఠకుని గుండెను పిండేస్తుంది. దుఃఖం సముద్రమై పోటెత్తుతుంది

‘ బాంధవ్యం’ కథలో.. మరణంకు సమీపంలో ఉన్న తండ్రి .. కూతురు శ్యామల.. వృద్ధాప్యం..నిస్సహాయత,అనివార్యత. ..అంతిమంగా  ఒక దీర్ఘనిట్టూర్పును మిగిల్చే ముగింపు.

‘ చిన్న మామయ్య’ కథలో.. చిన్నప్పట్నుండీ తనను ఆడించి, స్నేహించి,తోడుగా పెరిగి.. పెళ్ళి చేసుకోవాలని తలచి గాఢంగా.. అజ్ఞాతంగా ప్రేమించి..బీదరికంవల్ల  పెళ్ళి సాధ్యం కాక..వనజను కోల్పోయిన చిన్నమామయ్య జీవితమంతా పేదరికంలో,దరిద్రంలో,బతుకు పోరాటంలో ఓడి ఓడి..కడకు మురికివాడలోని కాలువప్రక్క దీనాతిదీనంగా చచ్చిపోతే..కేవలం మానవత్వంతో.. ఎక్కడో ఓ  మూల దాగిఉన్న రవ్వంత తడితో శవాన్ని చూడ్డానికి వెళ్ళిన వనజ..దుఃఖంతో  తిరిగొస్తూంటే..ఎవరో బిచ్చగానివంటి పిల్లవాడు ఒకడు పరుగెత్తుకొచ్చి చిన్నమామయ్య బాపతు చిన్న కాంపస్ బాక్స్ అంతటి పాత ప్లాస్టిక్ పెట్టెనందిస్తే.. దాంట్లో..ఎప్పుడో.. ఎవర్నో అడిగి తెచ్చిన డబ్బా కెమెరాతో తీసి..   ఫోటో రాలేదని తనతో చెప్పి.. జీవితాంతం పదిలంగా దాచుకున్న తన పాత    ఫోటో.. అప్పుడప్పుడు తనను కలిసినప్పుడు దారిఖర్చులకని యిచ్చిన చిల్లర డబ్బులు..పాత నోట్లు ..నాణేలు..

ఎందుకో హృదయం కరిగి..  మనసు  పగిలి  దుఃఖంతో నిండిపోతుంది.

‘ ఈ జీవితాలు ఇలా ఎందుకున్నాయి’ అని నిశ్శబ్ద రోదన ఆవహిస్తుంది.

matti bangaaram

అలాగే..’ మల్లెపువ్వు’ కథలో..  మల్లెపువ్వువంటి మణిరత్నం.. విధికృతంగా ప్రాప్తించిన మొగుడు యాకూబ్.. ఇద్దరు పిల్లలు డేవిడ్,రోజీ.. దిక్కుమాలిన మొగుడితో వేగలేక వదిలేసి   నర్స్ గా   ఒంటరి జీవితం.. పిల్లలను పెంచుతూ.. డేవిడ్ ను ఇంజనీర్ , రోజీని డాక్టర్ చేసి.. చివరికి యిద్దరిచేతా ఈసడింపబడి,గాయపడి..  దుఃఖితగా   మిగిలి.. రచయిత్రి మణిరత్నంను.. వాడి నలిగినా మల్లెపువ్వుతో పోల్చి చెబుతూ.. ముగింపు గాఢ దుఖంతో తల్లడిల్లజేస్తుంది.

‘ ఖాళీ సంచులు’ కథలోకూడా అంతే..దుర్గ,తమ్ముడు వెంకటేష్, మరదలు శారద,జీవితంలో కలిసి విడిపోయిన కుప్పుసామి..  అన్నీ మనముందు కదలాడే,మనకు బాగా తెలిసిన మనుషులే పాత్రలై.. చివరికి.. ‘ ఈ జీవితాలు ఇలా కాకుండా.. ఇంకోలా ఉంటే ఎంత బాగుండు..’ అన్న ఏదో ఒక భాషకందని  మౌనక్షోభ.. గాఢ విషాదం.

అలా అని .. వరలక్ష్మి ఏ కథలోనూ పలాయనాన్నీ, ఓటమినీ, నిస్సహాయమైన లొంగుబాటునూ సమర్థించి చెప్పలేదు.  అన్ని కథల్లోనూ ‘ మన జీవితం మన చేతుల్లోనే ఉంది.. సరిగ్గా గుర్తించి నిన్ను నువ్వు పునర్నిర్మించుకో ‘ అనే ఉదాత్తమైన సందేశాన్నే అందించింది బాధ్యతతో. ఈమె కథల్లో చాలావరకు తన ముగింపు తామే వెదుక్కుని గమ్యాన్ని చేరుతాయి పాత్రలు.. ధైర్యంగా,ప్రతిఘటిస్తూ, సచైతన్యంగా.

వరలక్ష్మి కథల్లోని ప్రత్యేకతలను ఉల్లేఖిస్తే.. అవి.,

1. ఉత్తమశ్రేణి కథకు ప్రధాన లక్షణమైన ఉత్కంఠభరిత ఆరంభం.

2.గోదావరి జిల్లాలల్లోని ప్రజల జీవిత విధానం,నుడికారం,ముఖ్యంగా బడుగు వర్గాల్లోని అలవాట్లు ..బతుకు..వీటిపట్ల  సమగ్రమైన అవగాహన.

3.ఒట్టి ఊహ కాకుండా.. వాస్తవ జీవితాల్లోకి రచయిత్రి ప్రవేశించి ,అధ్యయించి చేసిన జీవవంతమైన సృజన.

4.నిపుణుడైన శ్యాం బెనిగల్,గోవింద్ నిహలాని,సంతోష్ శివన్ వంటి చేయి తిరిగిన చిత్ర దర్శకులవలె..కథా సన్నివేశాలను పఠితముందు రూపుకట్టించడంలో అద్భుతమైన ప్రతిభ.

5.కథలకు నిరలంకార రూప సౌందర్యాన్ని కూరుస్తూనే కథలు బహిర్ అంతర్ వర్చస్సుతో వర్ధిల్లేట్లు నిర్మించి పాఠకుడికి వివేచనార్థం కొంత ఖాళీ ( space )ను వదిలి ‘ open ended ‘ గా ముగించి తన కథలకు ‘ఉత్తమ’ స్థాయిని సాధించి పెట్టడం.

.        6. అన్నింటినీ మించి..నిర్మలాకాశం  మహా సౌందర్యవంతమైనట్టు ..నిరాడంబరతతో కథను నడిపించి ..క్లుప్తతతో , సరళతతో ఉన్నతిని చేకూర్చడం.,

ఇవీ వరలక్ష్మి విశిష్టతలు.

అరవై ఎనిమిది కవితలతో 2003 లో వరలక్ష్మిది ఒక కవితా సంపుటి వెలువడింది. అది ‘ ఆమె’.ఇందులోని కవితలన్నీకూడా ఈమెను మంచి భావుకురాలిగా మనకు పరిచయం చేస్తాయి.

‘ కొబ్బరి   చెట్ల ఆకులు / నీడల  కళ్ళతో ఎదురుచూపులు చూస్తూ /చిరుగాలి అలికిడైనా/ఉలికులికిపడ్తున్నాయి. ‘…యిలా ఉంటుంది నడక. ప్రకృతిని  అక్షరాల్లో ప్రతిక్షేపించడం ఇది.

ప్రస్తుతం ‘ విహంగ’ వెబ్ పత్రికలో ‘ జ్ఞాపకాలు’ రాస్తున్న వరలక్ష్మిని చదువుతున్నవారికి భిన్న బాల్య స్మృతుల్లో కరిగిపొతూండడం అనుభవమే.

ఇప్పటికే ‘ చాసో’ పురస్కారం,’ రంగవల్లి’ పురస్కారం,అజో-విభో అవార్డ్, తానా, ఆటా బహుమతులు, తెలుగు విశ్వవిద్యాలయ కథా పురస్కారం వంటి ఎన్నో అవార్డ్ లను పొంది ప్రసిద్దురాలైన కె.వరలక్ష్మికి ఇప్పుడీ ప్రతిష్టాత్మకమైన ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ ( జీవిత సాఫల్య ) పురస్కారం ‘ విలక్షణమైన కథకురాలికి విశిష్ట  గౌరవమే. అభినందనలు.

కారణాలు తెలియదుగాని.. ఈ మధ్య వరలక్ష్మి కథలు ఎక్కువగా రాస్తున్నట్టు లేదు. మంచి కథకులు రాయకపోవడం కథాప్రియులైన పాఠకులను నిరాశపర్చడమౌతుందేమో . అలసట కల్గినపుడు విరామం కొద్దిగా అవసరమే..  కాని విరమణ తగదు. ఆమె ఆలోచించాలి..     మళ్లీ   మంచి కథలు రావాలి వరలక్ష్మినుండి.

 

( 17 జనవరి,2014 న రవీంద్రభారతి, హైదరాబాద్ లో  ప్రతిష్టాత్మక ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం ‘ స్వీకరించబోతున్న సందర్భంగా..,)

 

                                                                                                                                                                                         – రామా చంద్రమౌళి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

1 Comment

  • Dr.shyaamala.k says:

    వరలక్ష్మి గారి ఒక్క ‘ ఖాళీ సంచులు’ కథ చాలు ఆమెకు ఎన్నో పురస్కారాలు అందివ్వడానికి.తెలుగు జాతి గర్వించదగ్గ కథా రచయిత్రి ఆమె.వరలక్ష్మి గారికి శుభాకాంక్షలు.
    ్యామల.కె,న్యూ జర్సీ.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)