Fusion షాయరీ on a Lady in Lavender Saree!

మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ

1.వర్ణాలను పులుముకున్నందుకు ప్రకృతి అందంగా ఉంటుందా ? ప్రకృతి వల్ల వర్ణాలకు ఆ అందం వస్తుందా ? లోకం నిండా వర్ణాందాలా ? అందమైన వర్ణాలా ? ఆది ఏది ? ఏది తుది ? ప్రకృతి ఆకృతికి ప్రతి కృతి చేసిన వర్ణానికి ఆరాధకుడను, అనురక్తుడను  నేను..
నువ్వొక lavender వర్ణ సౌందర్యం ! సమ మేళిత సుమ స్ఖలిత సమ్మేళిత వర్ణం, ఏడు రంగులలో ఒదగని కొత్త వర్ణ సంచయమది.. పంచ భూత సమన్విత ఆశ్చర్యమిది… ఎనిమిదో అద్భుతమది…
ప్రియా, నువ్వు రచించిన వర్ణమిది.. సువర్ణమది !
2. నీలాకాశం ఓ అనంత వస్త్రం .  దాని ముక్కను కత్తిరించేసి ఒడుపుగానూ ఒద్దికగానూ చీరెలా చుట్టేసి కట్టేసుకున్న కనికట్టుల ఇంద్రజాలం నీది. చందమామ ముఖం నిండా నవ్వుల వెన్నెలలను ఆగి ఆగి తెరలుగా కురిపించి మురిపెంగా మరిపించే  ఆహ్లాదపు అధరాల మబ్బుల లోంచి దాగి దాగి ధ్వనిస్తున్న సిరి  మువ్వల మధుర నాదం నీది . ఎప్పుడూ చేతులు కట్టుకుని ఉండే నాలో, నీతో  కరచాలనం చేయాలనిపించే temptation కలిగించిన అలవి కాని ఆత్మీయత నీది.
విహ్వల వినోద విషాద బంధుర తటిల్లతల తాకిడికి తల్లడిల్లుతూ తన్హాయీ అనబడే ఒంటరితనపు solitudeని నా  attitudeగా మలుచుకున్న వాణ్ని. అనంత ఏకాంత హిమవత్ పర్వతమై ఘనీభవించి శిలా సద్రుశ్యున్నై, వికల సముద్రున్నై, హాలాహల విలయ నిలయున్నై, అంతర్ బహిర్ మధ్య ప్రపంచాల్లోని voyageని voyeuristic గా దర్శిస్తూ, కంటిలోకి చొరబడిన దృశ్య హర్మ్యాలని నిర్మోహంగానూ, నిర్లిప్తంగానూ స్పర్శిస్తూ, విస్మృత విరాగంలోని వియోగ విలాపానికి క్షణం క్రితం దాకా నేనే personified నిదర్శనం..
ప్రియా, నీ దర్శనం అయింది …  నిదర్శనం చెదిరింది…!
image(1)
3. Never never అనిపించే Netherlands Lavender తోటలలో విరగ్గాసిన పూలని లతలు లతలుగా అచ్చోసుకుని  నిశ్చల నిశ్చయంతో నిబ్బరంగా కూచొని నన్నుఅబ్బురపరిచిన కాలాతీత కల్లోలిత అనురాగం నీది. కంటి కొలుకుల వింటి చూపుల నారికి  కొంటె తనాల చిర్నవ్వు బాణాలను సంధించిన  అల్లరి తనం నీది. Space and Time ల విచక్షణను విస్మరింప చేసిన witchcraft నీది.
పైట సర్దుకుంటున్న  యెదల కన్నా, నీ కళ్ళలో  దోబూచులాడుతున్న ప్రేమని తడిమి, మాటల ప్రవాహాన్ని పెంచేసి సంభాషణల చేతులతో నిన్ను ఆసాంతం  మెత్తగా హత్తుకుంటూ French Impressionistic భావ దృశ్యాలను నీ ముందు bouquetగా సమర్పిస్తూ reasoning ని  మొత్తంగా zero చేసి కేవలం మనసు చెప్పే మాటలనే వింటూ వింటూ గుండెల నిండా నిన్నే నింపుకుంటూ, బిభూతి భూషణుడి వనవాసి కి సహవాసిని జత చేయాలనే స్వాప్నిక సంకల్పం లో గమ్మత్తుగా కూరుకు పోతూ నేను ..
ప్రియా , ఇది నీవిచ్చిన మత్తు.. నువ్వు మాత్రమే  చేసిన మహత్తు..!
4.  అక్షరాల  బగీచా లో కథా వృక్షాలనీ, కవితా పుష్పకాలనీ ఆఘ్రానిస్తూ ఆరోహిస్తూ, తడుముకుంటూ తెంపుకుంటూ వాటి సుగందాలని నీ సౌకుమార్యం తో mix చేసి, నా లోలోలోలోపలి నా లోకి అపురూపంగా వంపుకుంటూ ‘గాల్లో తేలినట్టుందే- గుండె పేలినట్టుందే’ పాటల్ని లోపలి స్వరం తో ఆలాపిస్తూ నేనో సరికొత్త కడక్ మనోచిత్రం అవుతాను..
ప్రియతమా, ఇపుడు నేను– నువ్వు వేసిన చిత్రం… ఇది నువ్వు మాత్రమే  చేసిన విచిత్రం… !
5.  నువ్వు – నేను ఇరు లోకాల సంచారులం. నిరంతర ప్రేమమూర్తులం. నిత్య ప్రేమ దాహార్తులం. దిగంతాల అంచుల వెంట ఎడారులలో సాగరాలలొ వన భూముల్లో మంచు లోయల్లో ఆరామమెరుగని విరామమివ్వని అన్వేషణ చేస్తున్నాం.  ఏ సంపూర్ణత లోని తటస్థత ఇచ్చే తాదాత్మ్యత వల్ల కలిగిన తన్మయత నుండి పుట్టిన తదేక ధ్యానం సానువుల్లో దొరికిన అద్వైత శాంతి కోసమో..  అవిశ్రాంత పాంధులమై అనాది కాలం నుంచి యానాదులమై అనాధులమై మనో ప్రపంచంలో అంతర్ యాగం చేస్తూనే ఉన్నాం…
ప్రియా, ఇది నీ అంతర్ గానం…  నా అంతర్యానం….!
ఈ అనవరత యాగం ఓ  గానయానం! నువ్వు-నేనులను పెళ్ళగించి కూకటి వేళ్ళతో పెరికి వేసి “నేనువ్వు “ను సృష్టించి, అనేకంలోంచి ద్వంద్వాన్ని వేరు చేసి ఏకత్వాన్ని-ఏకతత్వాన్ని ప్రత్యక్షం చేసి అనశ్వర అద్వైతమై, ఎనిమిదో రంగును సృజించి lavender అంటే love ender అనీ, నా love ends here at your feet అనీ background music లో 6 track stereo-phonic soundsతో వినిపిస్తుంది..
No doubt, ప్రేమ ఒక సత్కార్యం
 ప్రియా, ఇది నువ్వు చేసిన సత్కారం….!
-మామిడి హరికృష్ణ 
Download PDF

8 Comments

 • Thirupalu says:

  చాలా మంచి కవిత. అద్బుతమైన ెయిలి !

 • vijayabhanukote says:

  ఫ్యూషన్ ఆఫ్ లవ్ అండ్ ఫ్యూషన్ ఆఫ్ మాజికల్ వర్డ్స్ :)
  ఇన్నోవేటివ్ అప్రోచ్…
  కూడోస్ “వియ్” (వాకింగ్ ఎన్సైక్లోపెడియా)

 • Elanaaga says:

  హరికృష్ణ గారూ!

  Alluring గా ఉన్న ఆంగ్ల పదాలను alliteration ఉన్న తెలుగు పదాలతో పోహళించి, అనుకున్న effect ను తేవటం కోసం మీరు చేసిన ప్రయత్నం బాగుంది. అభినందనలు.

  • Harikrishna mamidi says:

   ఎలనాగ సర్, చాలా ధన్యవాదాలు. ఈ ప్రయోగం మీకు నచ్చినందుకు… థాంక్స్ సర్

 • ఈ అనవరత యాగం ఓ గానయానం! ఈ కవితా గానం.. చాలా నచ్చింది సార్..

  • Harikrishna mamidi says:

   కృతఙ్ఞతలు వర్మ గారు, ఇదో ప్రయోగం గా రాసాను సర్.. కవి మిత్రులెందరో ఈ ప్రయోగాన్ని ఆహ్వానించడం నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.. మీ మాటలు కూడా. అందుకే మరొక్క సారి థాంక్స్ వర్మ గారు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)