అవసరం

bhuvanachandra (5)

“అదేమిటే? తల్లోంచి పువ్వులు తీయమనడం ఏమిటి?”

“పెళ్ళాంగా కనిపించటానికట!”

“ఏం పెళ్ళాలు పువ్వులు పెట్టుకోరా … లేక పెట్టుకుంటే పెళ్ళాంలాగా కనిపించరా?”

“ఆ విషయం వాడ్నే అడుగుదామనుకున్నా – అయినా పెళ్ళాల విషయం మనకెలా తెలుస్తుందీ?”

“ఏం? మనం పెళ్ళాలం కామా? మనమూ ఆడవాళ్ళమేగా?”

“ఆడవాళ్ళమైనంత మాత్రాన పెళ్ళాలుగా మారడానికి మనకి ఆస్తులున్నయ్యా అంతస్తులున్నాయా? పెళ్ళి చేయడానికి తల్లీ తండ్రీ అన్నా వదినా ఉన్నారా?”

“సరేలే వీడికిదేం పిచ్చీ! పూలు తీయమనడం ఎందుకూ?”

“రోడ్డు మీద నన్ను చూశాడు…. మెల్లగా పక్కన చేరాడు వస్తావా అన్నాడు… తల ఊపాను. పమిట చెంగు భుజాల మీదుగా కప్పుకుని ‘పక్కా’ పెళ్ళాం లాగా వాడి పక్కన నడిచాను. సినిమాకి వెళ్దామన్నాడు. సరసానికి ఇబ్బంది ఉండని చోటు అదేగా! సరే అన్నాను. టిక్కెట్ల క్యూలో నిలబడ్డప్పుడు అన్నాడా మాట ‘పూలు తీసెయ్’ అని. ఎందుకన్నట్లుగా చూశా.

“భార్యగా సహజంగా కనపడాలంటే పూలు పెట్టుకోకూడదంట అంతేనా సినిమా జరుగుతున్నంత సేపూ ఆబగా వాడి చేష్టలు పైగా ఇలాంటి సోది ….. ఒళ్ళు నెప్పి, తలనొప్పి వచ్చాయనుకో”

“పెళ్ళాలతో సినిమా హాళ్ళల్లో అలా సరసాలాడతారా? దానికి లేని సిగ్గు పూలు పెట్టకుంటే వచ్చిందా?”

“సిగ్గా పాడా – నేనలాంటి దాన్నని జనం అనుకుంటే వాడి హోదాకి భంగం కాదూ”

“ఇంతకీ తీసేశావా?”

“తియ్యనా మరి?”

“నేను రాను నీ దారి నువ్వు చూసుకో అని చెప్పొచ్చుగా?”

“చెప్పొచ్చు కాని అవసరం ఎవరిదీ?”

“వాడు కాకపోతే వాడి అబ్బ …. వాడి తాత…”

“సరే – నేను కాకపోతే వాడికి మరోతి”

“ఊఁ ఆ తరవాత?”

“ఎందుకులే!”

“చెబుదూ..”

“వాడేనాడూ ఇలా ఎవర్నీ పిలిచి ఎరగడట. నన్ను చూడగానే నేను బాగా తెలిసిన దానిలా కనిపించానట. తను మొదటి సారి ప్రేమించిన అమ్మాయి నాలాగే ఉండేదట”

“ఆహా! ఎవతో పుణ్యం చేసుకున్నది?”

“వాళ్ళ ఆఫీసులో అమ్మాయిలు వీడంటే పడి ఛస్తారట. ఈ నాటి వరకూ ఏ ఆడదానికీ లొంగలేదట”

“ఓరి వీడి ప్రవరాఖ్యతనం తగలెయ్యా”

“అంతేనా ఇంకా చాలా చెప్పాడు. పెళ్ళి కూడా అయిందట పెళ్ళాం లక్షాధికారట వీడి మాట జవదాటదట”

“మరి ఆ ఏడిచేదేదో పెళ్ళాం దగ్గరే ఏడవొచ్చుగా?”

“అదీ అడిగాను – ఆవిడ సంసారానికి పనికి వచ్చేదేకాని సరసారనికి పనికి రాదట. ఎప్పుడూ పూజలు, వ్రతాలు అట”

“పిల్లలు….”

“ఉన్నారట”

“వీడు సరసం చెయ్యకుండానే పిల్లలెలా పుట్టారూ!!?”

 

 

 

 

“అది నేను అడగ్గూడదుగా!”

“ఇంకా…’

“మాటలు తగ్గించి చేతలకి దిగాడు”

“ఏం చేశాడేమిటి?”

“అక్కడా ఇక్కడా తడిమాడు – ఆహా! ఓహో అన్నాడు. మాట్లాడుతూనే సడెన్ గా లేచి ‘ఇక బయటకి పోదాం’ అన్నాడు”

“ఓరినీ! అదేమిటే!”

“నన్ను చూడగానే దగ్గరగా ఉండాలనిపించిదటగానీ దగ్గరకొచ్చాక మనసులో ఏదో పాపం చేస్తున్నట్లు అనిపించిందట. అందుకే ఏ తప్పూ జరగకముందే వెళ్ళిపోదామన్నాడు”

“ఓహో! జ్ఞానచక్షువులు తెరుచుకున్నాయి కాబోలు…”

“జ్ఞానచక్షువులా వాడి బొందా! నాకు అర్థం కావలసింది నాకు అర్థం అయింది”

“హ! హ! నువ్వు భలే చెప్తావే…. ఇంతకీ ఒట్టి బేరమేనా?”

“లేదులే… కొన్ని పచ్చనోట్లు నా చేతిలో కుక్కి ‘నేను ముందు వెళ్ళిపోతా నువ్వు కాసేపయ్యాక వెళ్లు’ అన్నాడు”

“వచ్చేటపుడు కలిసే వచ్చారుగా సినిమానించి వెళ్ళేప్ఫుడు విడిగా ఎందుకూ వెళ్ళడం?”

“అప్పుడు కోరికతో కూడిన వేడి! ఇప్పుడు చల్లబడిన నాడి”

“ఊఁ ఆ తరవాత?”

“ఇంకేముంటుంది …. కాసేపు ఆ చెత్త సినిమా చూసి నా దారిన నేనొచ్చా”

“ఇంతకీ ఏం చేస్తుంటాడో తెలుసా?”

“ ఆ వివరాలు మనకెందుకూ? అతని అవసరం అతనిది….. మన అవసరం మనదీ!”

“అబ్బ ఎన్నాళ్ళే ఇలా?”

“ఏం చేస్తాం? మనకి అందం ఆరోగ్యంతో పాటు చదువూ ఉంది. లేనిదొకటే…. మగతోడు. ఆ తోడు కావాలంటే లక్షల కట్నం పోయాలి. మనకొచ్చే జీతం బెత్తెడే ….. దాన్ని మూరడు చేస్తే గాని మంగళసూత్రం మెడలో పడదు. అది పడిందాకా మనకీ తిప్పలు తప్పవు”

“అదేనే బాధ. మగవాడికి ఆడది అవసరం…. ఆడదానికి మగవాడు అవసరం. సృష్టిలో జంతువులూ పక్షులూ సహజంగా బ్రతుకుతాయి – మనకే – ఈ మనుషులకే….. సహజమైన అవసరం కూడా డబ్బులు చల్లితే గానీ తీరదు. మగవాడికి మగువతో పాటు అది తెచ్చే డబ్బు కూడా కావాలి”

“చూశావా! ఒక్క అవసరం ఎన్ని పనులు చేయిస్తుందో”

“అవును. రేపు మనకొచ్చేవాడు ఎలాంటి వాడో!?”

“ఇప్పుడు నీకు తగిలిన వాడి లాంటోడైతే పువ్వులు తీయమంటాడు… మంచివాడైతే పువ్వులు కొని తీసుకొస్తాడు….. ఇంతవరకు గ్యారంటీగా చెప్పగలను”

“హ్హ! హ్హ! హ్హ! హ్హ!!!

 

 

*********

 

  • ఇది నేను బెంగుళూరులో ఉండగా నా చెవులతో విన్న ఇద్దరు యువతుల సంభాషణ. నేను హిందీ పేపర్ చదువుకోవడం చూసి నాకు తెలుగు రాదని వాళ్ళు యదేచ్ఛగా మాట్లాడుకున్నారు. సంభాషణ విన్నాక నా మనసంతా ఒక వేదనతో మూగబోయింది…. ఆ రాత్రి కూర్చుని వాళ్ళ సంభాషణని యధాతధంగా రాసుకున్నాను.

మళ్ళీ నా డైరీలు తిరగేస్తుంటే ఈ నాలుగు పేజీలు బయటపడ్డాయి. చదివి ఇదీ ఓ చరిత్రకెక్కని కథ కనుక ‘సారంగ’ కి పంపుతున్నాను.

కాలం మారిందని అంటున్నాం గదా……. మారిందా?

 -భువనచంద్ర

 

Download PDF

16 Comments

  • buchireddy gangula says:

    అప్పుడు కోరికతో కూడిన వేడి –యిప్పుడు చల్ల బడిన నా డి —-???
    చాల బాగుంది సర్
    —————————
    బుచ్చి రెడ్డి గంగుల

  • డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌ says:

    భువనచంద్ర గారికి అభినందనలు.
    జరిగిన సంఘటనే అయినా…దాన్ని మీరు వ్యక్తీకరించిన తీరు అసామాన్యం.
    ఆడపిల్ల ఏ మగాడితో కనిపించినా, ఆఖరికి సొంత సొదరునితో కనిపించినా నోటికొచ్చినంతా కూసేకాలం.
    కానీ, ఆ ఆడపిల్ల వ్యథను అర్థం చేసుకోరు. అందుకు కారణం ఈ ఆధిపత్య పితృస్వామిక వ్యవస్థ! దానికితోడు ప్రభుత్వ పాలసీలు!
    మీలాగా అందరూ ఆలోచించేరోజొకటి రావాలని కోరుకుంటున్నాను.
    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

  • tahiro says:

    భువచంద్రగారూ … చాలా రోజుల తర్వాత కనిపించారు . చెప్పేది ఏముంది … ఆ అభాగినిల మనో సౌందర్యం తో పాటు సమాజం దౌర్బల్యాన్నీ ఎత్తి చూపారు. ఒక రకంగా చెప్పాలంటే వారిలోకి పరకాయ ప్రవేశం చేసారు. ధన్యవాదాలు – గొరుసు

    • bhuvanachandra says:

      థాంక్స్ భయ్యా …..మీరిచ్చే ఉత్సాహానికి ధన్యవాదాలు …

  • Venky says:

    రోడ్డు మీద వినబడే ప్రతి కబురూ కథైపోదు. కట్నం వంకతో కాలు జారే అమ్మాయిల గాధల్ని ఐడియలైజ్ చెయ్యటం అవసరమా? ఇంతకన్నా పెద్ద కష్టాల్ని సవ్యమైన రీతిలో ఎదుర్కొనే ఆడాళ్లున్నారు. వాళ్ళ జీవితాల్లోంచి నేర్చుకోటానికి నాలుగు మంచి విషయాలు దొరుకుతాయి. అలాంటి కథలు తెలిస్తే రాయండి. ఇటువంటివి కాదు.

    • bhuvanachandra says:

      వెంకీ గారూ ..నిజంగా మీ మెయిల్ కి ఏమి సమాధానం ఇవ్వాలో నాకు తెలియడం లేదు ….”..మంచి ”విషయాలే కావాలంటే లక్షలకొద్దీ గ్రంధా లున్నాయి ….కధ ఏ విషయం మీద రాయాలో నిర్ణయించుకునే హక్కు రచయితదే ..అలాగే ఏది చదవాలో నిర్ణయించుకునే హక్కు సంపూర్ణంగా పాఠకుడిదే……స్పందించే హక్కు ఇద్దరికీ వుంది ….మీ హక్కుని మీరు ఉపయోగించుకున్నారు ..సరే …ఈ కధలో ”””కాలుజారే అమ్మాయిల్ని నేను ఐ డియ లైజ్”””
      చేశానన్నారు …..ఎక్కడ? ఏ విధంగా?? నిజంగా నాకు అర్ధం కాలేదు …మరో విషయం ఏమంటే .,.30ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన లోని విషయం…ఇప్పటికీ ”కట్నం”’రూపంలో సజీవంగా వుంది …ఆనాడులేని ””అత్తగారి కట్నాలు ”ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చాయి …అంతే కాదు డబ్బులో వస్తువులో గుంజటానికి సరికొత్త సాంప్రదాయాలు కూడా పుట్టుకొచ్చాయి …..మీరు గమనించరో—గమనించడానికి ఇష్ట పడరో–నాకు తెలీదు గానీ ….నేను గమనించింది నాకు తెలిసిన పద్ధతిలో ప్రజలముందు పెట్టడం తప్పుకాదనేఅనుకుంటున్నాను అదీ ఎవరి ప్రయివసీ కీ భంగం కలగకుండా …ఇప్పటికీ నేను రాసింది మీకు ఇబ్బందికరంగా వుంటే , …నేనేమీ చెయ్యలేనని మనవి చేస్తున్నాను నమస్సులతో భువనచంద్ర ..

      • Venky says:

        కట్నం లాంటి దురాచారాలని నిరసించాల్సిందే. దానికి విరుగుడుగా ఈ అమ్మాయిలు కనిపెట్టిన తంత్రాన్ని మీరు రాసిన పద్ధతిపైనే నా అభ్యంతరం.

        “సంభాషణ విన్నాక నా మనసంతా ఒక వేదనతో మూగబోయింది”

        ఇలా సానుభూతి ప్రకటించటమంటే వాళ్లు చేసిన పని సమర్ధించటం కాదా? దాన్నే నేను ఐడియలైజ్ చెయ్యటం అన్నది.

        ఒక అనాకారి అబ్బాయి. జానాబెత్తెడు ఉద్యోగం ఉంది. ఆస్తిపాస్తుల్లేవు. ఆరోగ్యం, శక్తి ఉన్నాయి. ఓ అందాల సుందరిని పెళ్లి చేసుకోవాలనే కోరికుంది. అతని రూపాన్ని వలచి ఏ సుందరీ ముందుకు రానంది. డబ్బుంటే దెయ్యమైనా దిగొస్తుందనే నమ్మకం ఉంది. కష్టపడే గుణమ్మాత్రం లేదు. ఈజీ మనీ కోసం నేరాల్లోకి దిగాడు.

        ఇతని గురించి విన్నాకా మీ మనసు వేదనతో నిండిపోతుందా? ఇలాంటి కథే రాస్తారా లేక మేల్ చౌవనిస్టిక్ పిగ్స్ గురించి రాస్తే స్పందన దీనికొచ్చే అవకాశం లేదు కాబట్టి వదిలేస్తారా?

        ఒక వేళ రాస్తే, అప్పుడూ నేను ఇలాంటి వ్యాఖ్యే చేస్తాను. సమస్య ఎంత కఠినమైనదైనా, దాన్ని అడ్డదారిలో ఛేదించాలనుకునేవారిపై నాకు గౌరవం ఉండదు.

  • Saikiran K says:

    భువనచంద్ర గారు చాలా హృద్యంగా వ్రాసారు.

  • Manjari Lakshmi says:

    వెంకిగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. పరిస్థితులను వివరించవచ్చు. కానీ తప్పు దోవన పోయే వాళ్ళ మీద సానుభూతి చూపించటం అనేది పరోక్షంగా దాన్నిసమర్ధించినట్లవుతుంది. దాని మీద విమర్శ ఉండాలి. దాన్ని ఏదో ఒక పాత్ర ద్వారా సరైన మార్గం చూపించినట్లుగా రాయాలి. పాఠకునికి సరైనది అందేట్లు రాయటం కూడా కధకుని బాధ్యతే.

  • kv ramana says:

    వెంకీ, మంజరి లక్ష్మి గార్లు అన్నదానితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. భువనచంద్రగారికి రచనాబలం ఉంది. స్పందించే లక్షణం ఉంది. కానీ ఏ విషయాన్ని రాయాలో, ఎందుకు రాయాలో అన్న విచక్షణను విస్మరించారనిపించింది. దీనిని చదువుతుంటే, ఇందులోని అమ్మాయి prostitute అనుకున్నాను కానీ, పెళ్లి కానీ అమ్మాయి అనుకోలేదు. ఇది థర్డ్ రేట్ సినిమా తరహా షాక్. వెంకీ గారు అన్నట్టు రోడ్డు మీద వినబడే ప్రతి కబురూ కథైపోదు. భువనచంద్రగారు నేటి వాస్తవికతకు దూరమయ్యారని, ఇంకా 30 యేళ్ళ వెనకే ఉన్నారని ఆయన ఇచ్చిన సమాధానం వల్ల అనిపించింది. కట్నాల సమస్య ఇప్పుడూ ఉందని, ఇంకా ఎక్కువైందనీ ఆయన ఎలా అంటున్నారో తెలియదు. ఇప్పుడు పెళ్లికాని అమ్మాయిల సమస్య కాదు, అబ్బాయిల సమస్య వచ్చింది. కన్యాశుల్కం చెల్లించి పెళ్లిచేసుకునే రోజులు వచ్చాయి.

  • డాక్టర్ మూర్తి జొన్నలగెడ్డ says:

    ప్రతీ రచయితా రోడ్డు మీద వినబడే కబుర్లను కధగా రాయలేరు. స్పందించి, ఆ సమస్య మన మనసులను తాకే నిజాయతీతో రాయడం అన్నది ఒక కధా శైలి. ఇటువంటి సంభాషణలు విన్నాక మనసున్న ఎవరికైనా ఒక వేదన కలుగుతుంది. దానికి కారణం వారు ఎన్నుకున్న అడ్డదారిని సమర్ధించడం మాత్రమే అనుకోవడం కొంచెం తొందరగా ఒక అభిప్రాయానికి వచ్చెయ్యడం అని అనిపించింది. ఎవరి ఇష్టం వారిది అనుకోండి. నేను ఎవరినీ తప్పు పట్టటం లేదు, నా అభిప్రాయం చెబుతున్నాను అంతే! ఒక సాంఘిక దురాచారం ఎన్ని రకాల దౌర్భాగ్య పరిస్థితులకు దారి తీస్తోందో కదా, ఈ దురాచారాన్ని తొందరగా నిర్మూలించలేమా! అన్న వేదన కలిగి ఉండచ్చు కదా! సామాజిక స్పృహ కలవారు సమస్య గురించి వేదన చెందుతారు. సమస్యకి బలి అయిన వారు ఆ వేదన పుట్టడానికి కారణంగా వుంటారు. సమస్యని వారి ఒక్క కోణం లోంచి మాత్రమే చూస్తే సానుభూతి వల్ల సరైన పరిష్కారం కనుగొనడానికి ఆటంకంగా వుంటుంది. అందువల్ల వారు చేసిన పని మంచిదా చెడ్డదా అన్న తర్కం వల్ల అసలు సమస్యని మనం విస్మరిస్తున్నామా అని ఒక్క క్షణం అనుమానం కలిగింది. రచయిత ఏవిధంగానూ వారి మార్గాన్ని సమర్దించినట్లు నాకు అనిపించలేదు. వారి వేదనను పాఠకులు కొంచెం అపార్ధం చేసుకున్నారేమో అని అనిపిస్తోంది. ఒక వేళ ముప్ఫై ఏళ్ల నాటి పరిస్థితి ఈరోజు లేక పోతే చాలా సంతోషించదగ్గ విషయమే! ఒకప్పుడు మనం ఎంత నీచంగా వుండే వాళ్ళమో అన్న విషయానికి చరిత్ర అన్న పేరు పెట్టుకుని చదివి తరించటం లేదూ! కన్యాశుల్కం నాటిక ఇప్పటికీ జనరంజకం గా ఉండడానికి కారణం ఏమిటి? ఇటువంటి రచనలు “అమ్మయ్య అటువంటి దౌర్భాగ్యపు రోజులు పోయాయి” అన్న భావం కలిగించాలి (ఒక వేళ రోజులు మారి వుంటే!) ఎవరిని వారు నిజాయతీగా ప్రశ్నించుకుంటే మారాయా లేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎవరి అనుభవాలను బట్టి వారు ఒక అభిప్రాయానికి వస్తారు. ఈ రోజుల్లో కట్నాలు లేవు అన్న అభిప్రాయం ఎక్కువమందికి కలిగిందనుకోండి, మనందరికీ, ఈ రచయితకూ అంతకంటే కావలసింది ఏముంటుంది!

    • bhuvanachandra says:

      డాక్టర్ మూర్తి గారూ …కధ చదివి స్పందించినందుకు ధన్యవాదాలు …వెంకీగారూ ,మంజరిగా,,రూ kvrగారూ, వారి మనసులోని భావాలని చక్కగా వెల్లడించారు …నేను గమనించిన సమాజాన్ని గురించి నేను రాశాను… మొన్నీమధ్య ఓ పెళ్ళికి వెళ్లాను …వారు అద్భుతమైన విందుని ఏర్పాటు చేశారు ….”వోదిలివేయబడ్డ ”’పదార్దాలకోసం కుక్కలతోబాటు మనుషులూ ఎగబడ్డారు …నేనో సైనికుడ్ని ….ఇప్పటికీ (మానసికంగా)…ఆ దృశ్యాన్ని చూసి కళ్ళవెంట ధారగా కన్నీరు కారింది . నిజంగా మనసు మూగబోయింది …..ఈ సంఘటననే ఒక కధగా రాస్తే ? ”ముగింపు ”ఎలా వుంటుందో ,,,…సరైన మార్గం ఎలా చూపిస్తే బాగుంటుందో ….ఎలా పాఠకుల్ని ఇంప్రెస్స్ చెయ్యాలో అని ఆలోచించను..అనేక విధాలుగా ముగింపు నివ్వొచ్చు …అది వేరే విషయం …”అవసరం”లోని అమ్మాయిలు వారి మార్గాన్ని వారు వెతుక్కున్నారు …అది తప్పే ..కానీ వారిని అడిగితె ఏమంటారూ ? అందుకే నేను రెస్పాన్స్ కి రెస్పాన్స్ ఇవ్వలేదు …..ఇంకో విషయం ..నాకు తెలిసి ”ఆడబడుచుకట్నాలు”అని ఉండేవి …మరి ఇప్పుడు ”అత్తగారి కట్నం”ట…అదీ ఈ మధ్య నేను ఆంధ్ర లో అటెండ్ అయిన పెళ్లి లోనే చూసాను …అలకపాన్పు పేరుతొ మగపెళ్ళివారు అడిగిన వి వింటే అసహ్యంకలిగింది …”యాచకులు ”కూడా అంత నీచంగా ప్రవర్తించరు ..”..ఏమో …నేను కలగాన్నానేమో” అనుకోడానికీ లేదు ఎందుకంటే వధువు -వరుడూ కూడా సాఫ్ట్ వేర్ వాళ్ళే ….నేను చూసిన పెళ్లి గురించి నేను రాయగలనుగానీ ..తెలియనిదాన్ని గురించి కాదుగా …..ఒక్కటి మాత్రం నిజం …..”’ఎవరి ద్రుష్టి వారిది ”” అన్నట్టు, సమస్యను ముందున్చానేగానీ.. దాన్ని” చేదించే”పని చేసే ప్రయత్నం మాత్రం నేను చెయ్యలేదు . ఎనీ వే …ఎంతో ఆదరంతో మీరు రాసిన స్పందనకు మాత్రం నా ధన్యవాదాలు . నా రాతలతో ఎవరికైనా బాధ కలిగించి వుంటే మాత్రం క్షమించ మని మనవి చేస్తూ ……మీ భువనచంద్ర

  • డాక్టర్ మూర్తి జొన్నలగెడ్డ says:

    కట్నాల గురించి చదివి, ఆ విషయం గురించి మాట్లాడవలసిన పరిస్థితి వొచ్చేసరికి సిగ్గుతో చచ్చిపోయి, నాకున్న బాధ్యతల వల్ల మళ్ళీ పుట్టాను. అన్నంకోసం మనిషి జంతువులతో కాట్లాడ్డం గురించి చదివి విని మళ్ళీ చచ్చిపోయాను. వాళ్ళు జంతువుల్లా ప్రవర్తించడం తప్పని చెప్పి, ఆకలి సమస్య నుంచి లోకుల దృష్టిని మళ్ళించకండి బాబూ! కట్నాలూ, ఆకలి చావులూ, చిన్న పిల్లల చేత అడుక్కు తినిపించడాలు లేని త్రిశంకు స్వర్గానికి దారి ఎటో చెప్పండి బాబూ, ఒకసారి అటు వెళ్లి వచ్చి మీ కడుపున పుడతాను!

    • bhuvanachandra says:

      నిజమే మూర్తి గారూ ……ప్రతిరోజూ కనీసం ఒక మహిళ సామూహిక అత్త్యాచారానికి గురిఅవుతోంది …కొన్ని వేల మంది పిల్లలు ”యాచకులుగా” మార్చబడుతున్నారు ….ఇక ఆకలి చావులు లెక్కే లేదు ..రోజు రోజుకీ రైతుల బతుకు పురుగుమందుల పాలౌతోంది ….చిత్రం ఏమంటే ”ఎయి డ్స్”గురించి తెలిసీ, అమితాభ్ ..షబానా …అమీర్ ఖాన్ లాంటివారు ”స్వలింగ సంపర్కం” హక్కు అనీ, దాన్ని చట్టబద్ధం చెయ్యాలనీ statements ఇస్తున్నారు ….ఇప్పుడు చెప్పండి …….మనం ఎక్కడున్నామో …దీన్ని చూస్తూ కూడా చూడనట్టు ఉండాలా ……..ఒకప్పుడు ప్రజలకోసం పాటుపడే నాయకులు వుండేవారు …..ఇప్పుడు పదవికోసం మాత్రమె పాటుపడుతున్నారు anyway ఇవన్నీచెప్పేది ఎందుకంటే మనం వున్న ప్రపంచం ఇదీ ……ఆలోచిద్దాం …చెయ్యగలిగేది మనవొంతుగా చేద్దాం ………..నమస్తే …..

      ..

Leave a Reply to kv ramana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)