మహాభారతం నుంచి మగధకు…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)నా ఎదురుగా ఇప్పుడు ఓ పెద్ద దారపు ఉండ ఉంది. దానికి విచిత్రంగా ఒకటి కాదు; నాలుగైదు కొసలు వేలాడుతున్నాయి. ఏ కొసను పట్టుకుని లాగినా మొత్తం ఉండ కదులుతుంది. ఏ కొసను పట్టుకోవాలనేది ఈ క్షణాన నా ముందున్న ప్రశ్న. దీనినే కృత్యాద్యవస్థ అంటారు కాబోలు. ఈ వ్యాసపరంపర సందర్భంలో ఈ అవస్థ నాకు తరచు ఎదురవుతోంది. అయినా చేయగలిగింది లేదు.

మొదటి కొస, మనకు పురాణ కథగా, myth గా కనిపించే కథకూ, చరిత్రకూ మధ్య విభజనరేఖను చెరిపేసి; ఆశ్చర్యకరంగా ఆ కథను చరిత్రలోకి ప్రవహింపజేసేది.  రెండో కొస, ఆ ప్రవాహంలో భాగంగా జరుగుతున్న గణవిచ్ఛిత్తి గురించీ, గణాలు జనాలుగా మారడం గురించీ చెప్పేది. మూడో కొస, గణరాజ్యాల స్థానంలో మనం ఇప్పుడు చెప్పుకునే రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడడం గురించి చెప్పేది. నాలుగో కొస, అధికారం- పై వర్ణాల చేతుల్లోంచి కింది వర్ణాల చేతుల్లోకి మారడం గురించి చెప్పేది. అయిదో కొస, వ్యవసాయ విస్తరణ గురించి చెప్పేది…

kosambiకొశాంబీ రచించిన AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY లో, THE RISE OF MAGADHA అనే ఆరవ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది:

ఆర్యులు పట్టణ సంబంధమైన పురాతన సింధునాగరికతను తుడిచిపెట్టడానికి ఏ వ్యవస్థ అయితే సాయపడిందో, అదే వ్యవస్థ వారు తూర్పువైపు అరణ్యాలలోకి చొచ్చుకు వెళ్లడానికీ సాయపడింది. రెండు ప్రధాన వర్ణాలతో తిరిగి కూర్చిన నూతన సమాజం వారికి శూద్రుడనే శ్రామికశక్తిని ఇచ్చింది. అదే కనుక లేకపోతే, పచ్చిక భూముల కోసమైనా, వ్యవసాయం కోసమైనా అరణ్యాలను ఛేదించడం లాభసాటి అయుండేది కాదు. అగ్రవర్ణాలలో వర్ణ-వర్గ రూపంలో జరిగిన ఆ తదుపరి విభజన; గ్రీకు, రోమన్ బానిస సమాజాలలో మాదిరిగా బలప్రయోగమూ, నిఘా అవసరం లేకుండానే మిగులు ఉత్పత్తిని పెంచింది. క్రీ. పూ. 7వ శతాబ్ది నాటికి భారతదేశంలో జనావాసాలు భిన్న భిన్న తెగలకు, భిన్న భిన్న అభివృద్ధి దశలకు చెందిన జనాభాతో,  పంజాబ్ నుంచి బీహార్ వరకు మిట్ట పల్లాల భూఖండం మీదుగా విస్తరించాయి. అంత వైవిధ్యంలోనూ, తగినంత వర్తకానికీ, సాంస్కృతిక సంబంధాలకూ సరిపోయినంత ఉమ్మడి భాషా, ఉమ్మడి సంప్రదాయమూ ఏర్పడ్డాయి. కాకపోతే, తొలి జనావాసాల ఏర్పాటుకు సాయపడిన గణ సమాజ సంబంధాలు ఈ దశకు వచ్చేసరికి సంకెళ్లుగా మారిపోయాయి. సమాజం మరింత అభివృద్ధి దశకు చేరాలంటే ఈ సంకెళ్ళను తెగ్గొట్టడం అవసరం. ఈ నూతన నమూనా సమాజం దిశగా అవసరమైన అడుగులు ఉజ్జాయింపుగా క్రీ. పూ. 520(బింబిసారుడు అంగను జయించడం)-360(మహాపద్మనందుడు ఆర్యగణాలను తుడిచిపెట్టడం)ల మధ్య పడ్డాయి. ఈ గమనంలో మరింత కీలకమైన అడుగు మగధ(బీహార్)లో పడింది…

kosambi book

కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, క్రీ. పూ. 3000కు చెంది, వెయ్యేళ్ళపాటు కొనసాగిన సింధునాగరికతను అలా ఉంచితే;  పై పేరా దాదాపు పదమూడు వందల సంవత్సరాల చరిత్రను చుట్టబెడుతోంది. ఎలాగంటే, క్రీ. పూ. 1750లో భారతదేశంపై ఆర్యుల తొలి ఆక్రమణ జరిగింది. (అది, మెసపొటేమియా(ప్రాచీన ఇరాక్)లో హమ్మురాబి పాలన సాగుతున్న కాలం కూడా. హమ్మురాబి మన మనుస్మృతి లాంటి స్మృతిని అప్పుడే తయారుచేసి శిలపై చెక్కించాడు)  క్రీ.పూ. 1500 ప్రధాన ఋగ్వేదకాలం. మరో విడత ఆర్యుల రాక క్రీ. పూ. 1100లో జరిగింది. క్రీ. పూ. 800 నాటికి యజుర్వేదం పూర్తి కాగా, క్రీ.పూ. 600లో శతపథబ్రాహ్మణం అవతరించింది. క్రీ.పూ. 7వ శతాబ్దంలో కోసల, మగధలలో వెండి నాణేలు వాడుతున్నారు. బుద్ధుడు, కోసలరాజు ప్రసేనజిత్తు(పసనేది) క్రీ. పూ. 468లో, తమ 80వ ఏట మరణించారు. మగధలో క్రీ.పూ. 540లో బింబిసారుని పాలన, క్రీ.పూ. 492లో అతని కుమారుడు అజాతశత్రు పాలన, క్రీ.పూ. 350కి కొంత ముందు మహాపద్మనందుడి పాలన మొదలయ్యాయి. ఆ తర్వాత క్రీ.పూ. 327లో అలెగ్జాండర్ దాడి…

మరి మహాభారత, రామాయణాల కాలం ఎప్పుడనే ప్రశ్న వస్తుంది. వీటి గురించి వేర్వేరు లెక్కల మీదే కాక, విశ్వాసం మీద కూడా ఆధారపడిన కాలనిర్ణయాలు చాలా కనిపిస్తాయి. శ్రీ రామ్ సాఠె అనే పండితుడు రామాయణ కాలం గురించి రాస్తూ, ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కాగా, ఇంతకుముందు అనేక మన్వంతరాలు గడిచాయనీ; ప్రతిమన్వంతరంలోనూ నాలుగు యుగాలు వస్తుంటాయనీ, రామాయణం జరిగింది వేరొక మన్వంతరంలోని త్రేతాయుగంలోననీ అంటూ రామాయణ కథను లక్షల సంవత్సరాల వెనక్కి జరిపిన సంగతి ఎప్పుడో చదివిన గుర్తు.

మహాభారతకాలం మీద కూడా రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మరీ మన్వంతరాలలోకి వెళ్లకుండా మన సాధారణ బుద్ధికి అందేమేరకు చూస్తే, కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, మహాభారతం జరిగి ఉంటే అది క్రీ.పూ. 1000లో జరిగింది. అలాగే, భాతం ముందా, రామాయణం ముందా అనే ప్రశ్న కూడా వస్తుంది.  రాముడు కోసలకు చెందిన కౌసల్య కొడుకు కనుక; వాయవ్య, పశ్చిమాలనుంచి తూర్పు దిశగా, హస్తినాపురం మీదుగా వలసలు జరిగాయనుకుంటే, కోసల తూర్పున చాలా చివర ఉంది కనుక మహాభారతం తర్వాతే రామాయణం అనిపిస్తుంది.

ఇంకో కోణం నుంచి చూసినా మహాభారతం తర్వాతే రామాయణం అనే అభిప్రాయం కలుగుతుంది. అది; చంద్ర, సూర్యవంశ రాజులకు సంబంధించిన కోణం. మహాభారత రాజులు చాలావరకూ చంద్రవంశీయులు. రాముడు సూర్యవంశీకుడైన ఇక్ష్వాకు రాజు.  జోసెఫ్ క్యాంప్ బెల్  రాసిన Occidental Mythology లో ఈ చంద్ర, సూర్యవంశాలకు సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఉంది. అది ప్రత్యేకంగా, చాలా వివరంగా చెప్పుకోవలసిన అంశం కనుక వాయిదా వేయక తప్పదు.

పైన చెప్పుకున్న తేదీల ప్రకారం, అంతవరకు అజ్ఞాతగా ఉన్న పౌరాణిక భారతదేశంపై క్రీ.పూ. 7వ శతాబ్ది నుంఛీ చరిత్ర వెలుగులు ప్రసరించడం ప్రారంభమైనదనుకుంటే; చరిత్రకూ, పురాణానికీ మధ్య మూడు వందల సంవత్సరాల అంతరం ఉందన్న మాట. అలాగే, బుద్ధుడికీ, మహాభారతానికీ మధ్య అయిదువందల సంవత్సరాల పై చిలుకు తేడా ఉంది. ఒకింత చారిత్రక రాజులుగా పరిచయమవుతున్న బింబిసారునికీ, అతని కొడుకు అజాతశత్రునికీ, మహాభారతానికీ మధ్య ఆరు వందల సంవత్సరాలకు పైగా ఎడముంది.

పురాణకాలాన్నీ, చరిత్రకాలాన్నీ మనం ఎంత  వేర్వేరు విషయాలుగా చూస్తామంటే; వాటి మధ్య ఎటువంటి అతుకునూ ఊహించలేనంత! అసలు అలాంటి ఆలోచనే రానంత! ఒక వేళ  వచ్చినా వాటి మధ్య అంతరం మానవకాలమానానికి అందనంతగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పురాణానికీ, చరిత్రకీ మధ్య కాలపు సరిహద్దు ఇలా కొన్ని వందల ఏళ్ళకు కుదించుకుపోవడం ఎంత అద్భుతం!  పురాణకథ చరిత్రలోకి నేరుగా ప్రవహించడమంటే, పౌరాణిక సమాజ అవశేషాలు, అసంపూర్ణ అజెండాలు, అపరిష్కృత సమస్యలూ కూడా చరిత్రలోకి నేరుగా ప్రవహించడమే. కాలాల మధ్య హద్దులు ఎలా ఊహారేఖలు అవుతాయో, అలాగే సమాజాల మధ్య హద్దులు కూడా.

magadha

పౌరాణిక సమాజం చరిత్రలోకి ఎలా ప్రవహించిందో ఇప్పటికే అనేక వ్యాసాలలో చెప్పాను. ఇకముందు కూడా చెప్పబోతున్నాను. పైన ఉదహరించిన కోశాంబీ వాక్యాలలో అందుకు సంబంధించిన సూచనలు అనేకం ఉన్నాయి. అవి ఒక పెద్ద దారపు ఉండకు వేలాడుతున్న అనేక కొసలు లాంటి వాక్యాలు. అవి తూర్పు దిశగా సాగిన వలసల గురించి చెబుతున్నాయి.  వ్యవసాయవిస్తరణకు అందివచ్చిన శ్రామికశక్తి గురించి చెబుతున్నాయి. వర్ణవిభజన గురించి చెబుతున్నాయి. వ్యవసాయవిస్తరణకు అడ్డుపడుతున్న గణసమాజం గురించీ, గణ సమాజపు సంకెళ్ళను తెగ్గొట్టవలసిన అవసరం ఏర్పడడం గురించీ చెబుతున్నాయి. అందులో భాగంగా రాజ్యాల పుట్టుక గురించి చెబుతున్నాయి. పురాణ కాలాన్ని మనకు తెలియకుండానే చరిత్రకాలానికి తీసుకొస్తున్నాయి. చెప్పొచ్చేదేమిటంటే, వీటి అన్నిటి మూలాలు మహాభారతంలో ఉన్నాయి. అందుకే నేను మహాభారతాన్ని చరిత్రగా చదువుకుంటాను.

దారపు ఉండను వేలాడుతున్న అయిదు కొసలలో దేనిని పట్టుకోవాలన్న విచికిత్సనుంచి ఇక నేను బయటపడక తప్పదు. వ్యవసాయ విస్తరణ అనే కొసను పట్టుకుంటే ఎలా ఉంటుంది?!

మనిషి చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలనుంచి నేటివరకూ, ఏకైకం కాకపోయినా ఏకైక ప్రాధాన్యంగల నిర్విరామచర్య ఏదైనా ఉందంటే, అది వ్యవసాయం. వ్యవసాయం మనిషి విశ్వాసాలకు విస్తృతినిచ్చింది. మనిషికి మతాలనిచ్చింది,  జనాభాను ఇచ్చింది, రాజ్యాలనిచ్చింది. కలలూ, కన్నీళ్లూ కూడా ఇచ్చింది. ప్రపంచమంతటికీ ఒకే విధమైన వ్యవసాయసంస్కృతిని ఇచ్చింది. మనిషిని హింసావాదిని చేసిందీ, అహింసావాదిని చేసిందీ కూడా వ్యవసాయమే. బతుకు తెరువు సాధనంగా పచ్చని తరువుపై వేటు వేసే గొడ్డలినీ చేతికిచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ అస్తిత్వంలో ఎన్ని లక్షలు, కోట్ల ఎకరాల అరణ్యాలు దగ్ధమయ్యాయో, ఏమేరకు ఊచకోతకు గురయ్యాయో, ఎన్ని జీవితాలు శిథిలమయ్యాయో. ఎంతటి రక్తం ప్రవహించిందో, ఎందరు స్థానభ్రంశం చెందారో, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కల్లోలాలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని విప్లవాలు కాలగర్భంలో నిశ్శబ్దంగా కరిగిపోయాయో ఊహకు అందదు. ప్రపంచ వ్యవసాయచరిత్ర మొత్తాన్నే రాసుకుంటూ వెడితే ,దానికదే, వెలుగు, చీకట్లు నిండిన మానవమహేతిహాసంగా మారిపోతుంది.

మానవజీవన ప్రస్థానంలో అప్పటికీ, ఇప్పటికీ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యవసాయం గురించి పై అయిదారు వాక్యాలలో సమర్థంగా, సమగ్రంగా చెప్పలేకపోయానని నాకు తెలుసు. అదలా ఉంచి, ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్పుకుంటే,  తూర్పు దిశగా వలసలు సాగుతూ వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి, అంతవరకూ గోపతిగా ఉన్న రాజు కాస్తా భూపతిగా మారుతున్న వైనం మనకు మహాభారతంలోనే అక్కడక్కడ స్పష్టంగానూ, బీజప్రాయంగానూ కూడా కనిపిస్తుంది. అలాగే, వ్యవసాయ విస్తరణ దాహంతో అడవుల్లోకి చొచ్చుకువస్తున్న క్షత్రియుల కత్తికి తలవంచి ఆదివాసీ తెగలు నలుదిక్కులకూ చెదిరిపోతున్న వైనాన్నీ అది చెబుతుంది.  వ్యవసాయ సంస్కృతులు అంతటా జరిగినట్టే, వ్యవసాయబలిమి అందించిన నూతనోత్సాహంతో భారతదేశంలోనూ గణనిర్బంధాలనుంచి బయటపడి సరికొత్త ‘నరుడు’ ఆవిర్భవించిన సంగతినీ చెబుతుంది. ఇంకా విశేషంగా రాజ్యాధికారం పైనుంచి కిందికి చేతులు మారుతున్న విషయాన్నీ చెబుతుంది. మహాభారతంలోని ఈ అంశాలే చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ మరింత నిర్ణయాత్మక రూపం ధరిస్తూ వచ్చాయి. విచిత్రం ఏమిటంటే, నేటి కాలానికి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం. అందుకే, ఇప్పటికీ మనం మహాభారత సమాజంలోనే ఉన్నామని నేను అంటాను.

చరిత్ర కాలంలో, లేదా చరిత్రకు కొద్ది సమీపకాలంలో మొట్ట మొదటగా రెండు రాజ్యాలు  మహాభారతం తాలూకు అసంపూర్ణ అజెండాను ముందుకు తీసుకువెళ్ళాయి. అవి: కోసల, మగధరాజ్యాలు!

గణసమాజపు శృంఖలాలనుంచి బయటపడి నూతన సమాజం దిశగా కీలకమైన అడుగుపడింది మగధలో నని పైనచెప్పుకున్నాం. మగధతో కోసలను కూడా కలిపి చెప్పుకోవాలి.   క్రీ.పూ. 7వ శతాబ్ది నాటికి గంగా నదీ లోయ చరిత్రకు కేంద్రబిందువుగా మారిపోయిందని కొశాంబీ అంటారు.  అప్పటికి పశ్చిమ పంజాబ్; నాడు కాంభోజ, గాంధారలుగా పిలవబడిన ప్రాంతాలు కలిగిన నేటి అఫ్ఘానిస్తాన్ పర్షియన్ చక్రవర్తి డరియస్ ఏలుబడిలోకి వెళ్ళాయి.  మిగిలిన పంజాబ్ వేదకాలపు స్థితిలోనే ఉంది. కాకపోతే, పురులు వంటి కొన్ని తెగలు ఆ ప్రాంతంలో విస్తరించి అలెగ్జాండర్ వచ్చేనాటికి రాజ్యాలు ఏర్పరచుకున్నాయి.  పశ్చిమ పంజాబ్ లోని యోధులు మాత్రం డరియస్ , గ్జెరెక్సెస్ ల సైన్యంలో భాగమై గ్రీకులతో జరిగిన యుద్ధాలలో పాల్గొన్నారు. పర్షియన్ సామ్రాజ్యం, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న మగధ రాజ్యం అనే రెండు ఆర్థిక శక్తుల మధ్య అప్పటికి పెద్ద భూమార్గ వర్తక కేంద్రంగా తక్షశిల ఉంది. మిగిలిన నగరాలు పెద్ద గ్రామాలుగా చెప్పదగిన తెగల ముఖ్యకేంద్రాలు మాత్రమే. వీటికి పరిమాణంలోనూ, ప్రణాళికలోనూ మొహెంజదారో-హరప్పాలతో ఎలాంటి పోలికా లేదు. ఈ కాలానికి వచ్చేసరికి సింధులోయ జనం మెరుగైన ఆయుధబలాన్ని సంపాదించుకున్నారు. నాగలి వ్యవసాయం, పశుపోషణ; వాటికి అనుబంధంగా వర్తకంతో బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరచుకుంటున్నారు. అప్పటికి దక్షిణభారతం గురించి పెద్దగా తెలియదు. అలాగే, పంజాబ్ ప్రాంతం గురించి కూడా. ఎక్కువగా తెలిసింది గంగా లోయలోని పరిణామాల గురించే. ఈ ప్రాంతంలోనే త్వరలో మౌర్యులు తొలి మహాసామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారు!

క్రీ.పూ. 600 నాటి గంగా లోయలో భిన్న భిన్న సామాజిక వర్గాల వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. వీరు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నారు. బెంగాల్ అప్పటికి కీకారణ్యమయం. నేటి బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో ఇప్పటికీ అక్కడక్కడ, ఆర్యులతో ఎలాంటి సంపర్కమూ లేని, ఆర్యభాష మాట్లాడని తెగలజనం ఉంటున్నారు. వీరికి పైన అభివృద్ధి చెందిన తెగల జనం ఉన్నారు. వీరు ఆర్యులతో ఘర్షణ పడుతున్నారు. ఒకింత ఉన్నతస్థాయికి చెందిన ఈ అనార్య తెగలను నాగజాతీయులుగా గుర్తిస్తున్నారు. ఈ రెండు రకాల తెగల జనమూ వ్యవసాయ జనావాసాలు ఏర్పడని ప్రాంతాలలో చెల్లా చెదురుగా జీవిస్తున్నారు. నాగుల కంటే ఉన్నత స్థాయికి చెందిన ఆర్య తెగలవారు నదీ తీరాల వెంబడి, వర్తక మార్గాలలోనూ స్థిరపడ్డారు. వీరంతా ఏదో ఒక ఆర్యభాష మాట్లాడుతున్నారు. చాలామంది కులాల కింద, తరగతుల కింద చీలిపోయి ఉన్నారు. వీళ్లలోనూ మళ్ళీ రెండు రకాల వాళ్ళు ఉన్నారు: ఉన్నతస్థాయికి చెందినవారు, నిమ్నస్థాయికి చెందినవారు. నిమ్నస్థాయికి చెందినవారు బ్రాహ్మణఆచారాలు, కర్మకాండకు దూరంగా ఉన్నారు. ఆర్య తెగల వాళ్ళు గణరాజ్యాలుగా ఏర్పడి, శూద్రుని నుంచి సేవలు పొందుతున్నారు. తెగలు, వ్యక్తుల పేర్లను బట్టి, వీరు అంతవరకు అనార్యులుగా ఉండి ఇటీవలే ఆర్యత్వం పొందారా అన్నది స్పష్టంగా తెలియదు. వీరి ప్రస్తావన వేదాలలోగానీ, బ్రాహ్మణాలలో గానీ లేకపోవడం ఈ ఊహకు కారణం. కొంతమంది మాత్రం కొత్తగా ఆర్యభాషకు, వ్యవసాయానికి మళ్లినట్టు కనిపిస్తుంది. వీరు వైదిక క్రతువులను పాటించేవారు కూడా కాదు. మిగిలిన బ్రాహ్మణీయ తెగలవారు నాలుగువర్ణాలుగా, ఉన్నత, నిమ్న తరగతులుగా చీలిపోయిన కారణంగా తెగలస్వభావాన్ని కోల్పోతున్నారు. ఈ తెగల ముఖ్యులు సంపూర్ణ అధికారాన్ని చెలాయిస్తూ బలప్రయోగానికి పూనుకుంటున్నారు. వర్తకం తమను ముడివేస్తున్నా, వివిధ సమూహాలు పరస్పర ఘర్షణలలో మునిగితేలుతున్నాయి. ఆర్య రాజ్యాలమధ్య కూడా ఎడతెగని యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే, బలప్రయోగంతో ఒక సమూహం ఇంకో సమూహాన్ని లొంగదీసుకోవడం ఈ వైరుధ్యాలను పరిష్కరించే అవకాశం లేదు.  ఎందుకంటే, దాస్యాన్ని ఒక లాభసాటి వ్యవస్థగా మార్చడానికి తగినంత మిగులు కానీ, వస్తూత్పత్తి కానీ అప్పటికి లేదు. భౌగోళిక పరిస్థితి కూడా అందుకు అవకాశం ఇవ్వదు. అసలే దుర్గమ దేశం. దూర దూరంగా విసిరేసినట్టు ఉన్న జనావాసాలు. ఆయా తెగలవాళ్లు ఆధిపత్యశక్తుల కత్తి వేటును తప్పించుకుని వెనక్కు వెళ్లడానికి, నాగలి వ్యవసాయాన్ని విస్తరించడానికి  కావలసినంత జాగా. గ్రీస్, ఇటలీలలో పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ వినియోగపడే భూమి పరిమితం.

క్రీ.పూ. 7వ శతాబ్ది నాటికే పదహారు జనపదాల(షోడశ జనపదాలు) ప్రస్తావనలు కనిపిస్తాయి. వాటిలో రెండు అప్పటికి ఇంకా స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉన్న సైనిక గణరాజ్యాలు. అవి, మల్లులు, లిచ్ఛవులు లేదా వజ్జీలకు చెందినవి. ఇప్పుడు మనం క్రమంగా కోసల, మగధల దగ్గరికి వస్తున్నాం…

ఈ చారిత్రక వివరాల ప్రస్తావన చరిత్రపాఠం లా కనిపించి విసుగు పుట్టించవచ్చు. అయితే, ఇందులో మహాభారత సమాజానికీ, చారిత్రక సమాజానికీ మధ్యనున్న లింకును పోల్చుకుంటూ వెళ్లారనుకోండి…అప్పుడు బహుశా ఈ వివరాలు మీకు విసుగు పుట్టించకపోవచ్చు…

 –కల్లూరి భాస్కరం

 

 

 

 

Download PDF

9 Comments

  • mohan says:

    ాస్కరం గారు
    ేను మీ రచనలు అన్నీ చదివి చాలా నేర్చుకొంటున్నాను.
    ్లీజ్ కంటిన్యూ ది ఇంతెరెస్తింగ్ ఆర్టికల్స్.
    mohan

    • కల్లూరి భాస్కరం says:

      చాలా థాంక్స్ మోహన్ గారూ…చదివి చాలా నేర్చుకుంటున్నాను అన్నారు. నేను చాలా నేర్చుకుంటూ రాస్తున్నాను. వ్యాసాలు తప్పకుండా కొనసాగిస్తాను.

  • ఎన్ వేణుగోపాల్ says:

    భాస్కరం గారూ,

    మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు. చాల అవసరమైన పని చేస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్తారని ఆశ.

    ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు పంచుకోవాలనిపించింది. తెలుగు మేధో ప్రపంచం సాధారణంగా బైటి కొత్త గాలులకు ఎప్పటిటికప్పుడు కిటికీలు తెరుస్తూ, ఆహ్వానిస్తూ, తెలుగు పాఠక ప్రపంచానికి తెలియజేస్తూ వచ్చింది. కాని ఆశ్చర్యకరంగా అత్యంత ప్రభావశీలమైన, ఆలోచనాస్ఫోరకమైన దామోదర్ ధర్మానంద్ కోశాంబి ఆలోచనలు, ముఖ్యంగా చరిత్ర గురించి ఆలోచనలు తెలుగు సమాజానికి అందవలసినంతగా అందినట్టు కనిపించడం లేదు. ఉదాహరణకు మీరు ఈ వ్యాసాలకు ఆధారంగా ప్రస్తావిస్తున్న యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ 1956లో అచ్చయితే, ఇవాళ్టికీ, తెలుగులోకి రాలేదు. (కేంద్ర ప్రభుత్వ నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ల సంయుక్త ప్రచురణ కోసం ప్రస్తుతం నేను అనువాదం చేస్తున్నాను. బహుశా ఇంకొక రెండు మూడు నెలల్లో బైటికి వస్తుందేమో…) ఆ పుస్తకానికి పరిచయంగా కె బాలగోపాల్ రాసిన పుస్తకమే సంక్షిప్తంగానైనా తెలుగులోకి కొశాంబీ ప్రవేశం. అలాగే కోశాంబీ గతితర్కం మీద రాసిన వ్యాసాలను గొర్రెపాటి మాధవరావు అనువదించి పుస్తకం వేశారు. చరిత్ర మీద కొన్ని వ్యాసాలను హెచ్చార్కె తదితరులు అనువదించగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. కల్చర్ అండ్ సివిలిజేషన్ ఇన్ ఏన్షియెంట్ ఇండియా అనువాదాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది గాని అకాడమీ అనువాదాల పద్ధతి అందరికీ తెలిసిందే. మొత్తం మీద కోశాంబీ ప్రధానమైన పుస్తకం గాని, ప్రధానమైన ఆలోచనలు గాని తెలుగు సమాజానికి అందవలసిన పద్ధతిలో, విస్తృతంగా అందలేదని నాకనిపిస్తుంది. (నేను కూడ మొదటిసారి 1982లో చదివినప్పటికీ, ఎన్నోసార్లు ఉటంకించినప్పటికీ అనువాదానికి ఇన్నాళ్లూ ఎందుకు ప్రయత్నించలేదా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను!)

    ఇక కోశాంబీని చదివి జీర్ణం చేసుకుని తన రచనల్లో అనుసృజించిన కొడవటిగంటి కుటుంబరావు గారున్నారు. ఆయన చనిపోవడానికి కొద్ది ముందు రాసిన చరిత్ర – పురాణం, చరిత్రా – పురాణాలూ వ్యాసాలూ ఇప్పుడు మీరు రాసిన వ్యాసాల ఒరవడిలోనే ఉంటాయి. “కోశాంబీని చదువుతూ నోట్స్ రాసుకుంటున్నాను” అని ఆయన ఆ రోజుల్లో రాసిన ఉత్తరంలో ప్రస్తావించారు గాని ఇప్పటికీ ఆ నోట్స్ అచ్చు కాలేదు.

    ఈ విషయాలు తెలుగు సమాజపు ఆలోచనాపరుల ఆసక్తులనో, అలక్ష్యాన్నో ప్రతిఫలిస్తున్నాయా?

    • కల్లూరి భాస్కరం says:

      చాలా థాంక్స్ వేణుగారూ…

      మీరన్నది నిజమే. కొశాంబీ పుస్తకాలు, ఆలోచనలు తెలుగు పాఠకులకు అందవలసినంతగా అందలేదు. ఆ సంగతి తలచుకుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకు కారణం మీరన్నట్టు అలక్ష్యం, అనాసక్తి రెండూ కావచ్చు. మీరు అనువదిస్తున్న పుస్తకం ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇంతకాలానికి మీ చేతుల మీదుగా తెలుగులోకి రావడం అభినందనీయం. కొశాంబీ అభిమానులు ఆయన రచనలను అనువాదం చేస్తేనే ఆయనకు న్యాయం జరుగుతుంది. మీరు పేర్కొన్న రెండో పుస్తకం కూడా అలాంటిదే. అలాగే, Myth and Reality కి కూడా అనువాదం వచ్చినట్టు లేదు. రోమీలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ లాంటి చరిత్రకారులెందరినో ఉత్తేజపరచిన కొశాంబీపై తెలుగు చరిత్రకారులు తగినంత శ్రద్ధ పెట్టకపోవడం విచిత్రమే. మన రాంభట్ల గారిని కూడా పట్టించుకోలేదనే నాకు అనిపిస్తుంది. మీరు చెప్పిన కుటుంబరావు గారి వ్యాసాలు నా దగ్గర ఉన్నాయి. మరోసారి చదువుతాను.

      • ఎన్ వేణుగోపాల్ says:

        ఔను, రాంభట్ల గారు చరిత్ర, సంస్కృతుల గురించి మౌలికమైన ఆలోచనలెన్నో చేశారు. రెచ్చగొట్టే ప్రతిపాదనలు చేశారు. అంగీకరించలేనివి, తర్వాతి పరిశోధనల్లో కూడ తేలనివి కొన్ని ఉండవచ్చు గాని (ముఖ్యంగా ఫిలాలజీ తో, భాషా పదాల ఆధారంతో ఆయన చేసిన ఊహలు), మొత్తానికి ఆయన రచనలను, ఆలోచనలను పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదు. తెలుగు వారికీ ఆర్మీనియన్లకూ సంబంధం ఉందని ఆయన చేసిన సూత్రీకరణలు నాకు చాల ఆసక్తికరమైనవి. న్యూయార్క్ లో బ్రెహ్ట్ ఫోరం చూడడానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆర్మీనియన్ పెద్దావిడ కనిపించారు. ఆమెతో రాంభట్ల చెప్పిన బంధుత్వం గురించి చెప్పాను. ఓహ్ దెన్ యు ఆర్ మై బ్లడ్ రిలేటివ్, మై బ్రదర్ అని ఆవిడ కౌగలించుకున్నారు….

  • కల్లూరి భాస్కరం says:

    రాంభట్ల గారి ప్రతిపాదనల విషయంలో మీరన్న సమస్య కొంత ఉన్న మాట నిజమే. ఎందుకోగానీ చాలాచోట్ల ఆయన స్పష్టమైన ఆధారాలు ఇచ్చేవారు కాదు. నేను అకడమిక్ పండితుణ్ణి కాదు, నాది గోర్కీ విశ్వవిద్యాలయం అంటుండేవారు. దానికితోడు ఆయనది ఒకవిధమైన హ్రస్వలిపి. అయితే ఆయన చాలా విషయాలు తగిన ఆధారాలతోనే రాశారని క్రమంగా నాకు అనిపించింది. కొన్ని ఆధారాలు పట్టుకోడానికి నాకు కొన్నేళ్లు పట్టింది. ఈ వ్యాసపరంపరలో దాని గురించి రాసే అవకాశం రావచ్చు. ఇక ఆర్మేనియన్ మహిళ గురించి మీరు చెప్పిన అనుభవం లాంటిదే మాస్కోలో ఉన్నప్పుడు రాంభట్ల గారికీ ఎదురైంది. అక్కడ ఒక మావోరీ మహిళ ఆయనకు పరిచయమైంది. న్యూజీలాండ్ దగ్గర ఉన్న దీవుల్లో నివసించే మావోరీల భాషలో కూడా తప్పు అనే తెలుగు మాటను సరిగ్గా అలాగే అదే అర్థంలో వాడతారని ఆయన చెప్పి మనది అన్నా-చెళ్లెల్ల వరస అన్నారట.

  • attada appalnaidu says:

    భాస్కరం గారు ,నమస్తే.మీ పురాగమనం చదువుతున్నాను.చరిత్రను,పురాణాలను వివరించే మీ వ్యాసాలూ కోశాంబి వ్యాసాలను మరింత విస్పష్ట పరిచినట్టు ఉన్నాయి.అభినందనలు.

    • కల్లూరి భాస్కరం says:

      అప్పల్నాయుడుగారూ, నమస్తే. మీ ఉత్సాహకర స్పందనకు చాలా థాంక్స్.

  • బత్తుల వి‌ఈ‌ఈ వి‌ఈ‌ఈ అప్పారావు says:

    అందరికీ ధన్యవాదాలు

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)