మట్టి మీది గట్టి నమ్మకం: మంటిదివ్వ

 

    ఏకాలానికి ఆ కాలం సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. కవిత్వమవ్వొచ్చు. కథవ్వొచ్చు. మనిషి జీవితాన్ని  ఉన్నతీకరించడానికి దోహదపడేవి – ముఖ్యంగా తక్షణమే వొక సంఘటనకు లేదా వొక దృశ్యానికి గొప్ప స్పందనగా వెలువడేది కవిత్వం మాత్రమే. కాలాన్ని పట్టి యిచ్చే మేలిమి మెరుపులాంటి అద్దం కవిత్వమని నిరూపించుకుంది. చరిత్రను కళగా ప్రకటించే అత్యద్భుతమైన కర్తవ్యాన్ని కవిత్వం నెరవేరుస్తుంది. ఈనాటి సంక్లిష్ట వర్తమాన ప్రపంచ నేపథ్యంలో నుంచి – కవిత్వం – మనిషి వ్యక్తిత్వాన్ని -తద్వారా – సామాజిక పరిణామశీలతను గొప్ప సాంస్కృతిక దృష్టితో ప్రభావితం చేయడం జరుగుతుంది.

యిప్పుడు కవిత్వాన్ని నిర్వచించడానికి కూడా అద్భుతమైన దశ వచ్చింది. వర్తమాన సామాజిక సాంస్కృతిక స్థితిగతులు – మంచి కవిత్వం రావడానికి ప్రేరణోపకరణాలుగా వున్నాయి. కవిత్వమిపుడు – దుఃఖమవుతుంది. దుఃఖంలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమవుతుంది. యుద్ధమవుతుంది. సామూహిక ఆగ్రహంలోంచి జనించే కరుణవుతుంది.

సకలం ధ్వంసమవుతున్న వర్తమానం – చీకటి ఊడలు భయంకరంగా అల్లుకున్న భవిష్యత్తు – కళ్ల ముందు యివే తప్ప యింకోటి కనిపించని – ఈ స్థితిలో – కవిత్వం మరింత శక్తిని కూడగట్టుకోవాల్సిన అవసరం వుంది. కవిత్వం అత్యంత అవసరమైన – ప్రాణభూతమైన – వొక సృజనకారుని చూపు.

కవులు ఆ చూపుని పోగొట్టుకోకూడదు.

కవిత్వం – సమస్యను మూలాల నుంచి చర్చించి వదిలేయడమే కాదు. సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాల్సిన పరమోత్కృష్టమైన బాధ్యత దానిది.

కవికి – సామాజిక చలనాన్ని సరైన దృష్టితో పరీక్షించి… సమీకృతం చేసి – వొక దగ్గరకు చేర్చాల్సిన ఉత్కృష్టమైన ధర్మం వుంది. అలా సామాజిక చలనాన్ని రికార్డ్ చేసిన కవితా సంపుటి – ‘మంటిదివ్వ’. కవి – సిరికి స్వామినాయుడు. నేపథ్యం – ఉత్తరాంధ్రా.

siriki1

స్వామినాయుడుని గానీ, మిగతా ఉత్తరాంధ్రా కవులను గానీ చదివిన వాళ్లకిది అర్థమవుతుందనుకుంటాను – నాలుగైదేళ్లుగా ఉత్తరాంధ్రాలో జరుగుతున్న కల్లోలం సంగతి – దాని రాక్షస రూపం సంగతి – ప్రజల జీవన కాంక్షపై అది మోపిన ఉక్కుపాదాల సంగతి – సరిగ్గా అక్కడే సిరికి స్వామినాయుడు కవిత్వఖడ్గాన్ని చేతబూని యుద్ధవీరుడిలా కనిపిస్తాడు..

‘మంటిదివ్వ’ చదివాక – వొకసారి కాదు – మళ్లీ మళ్లీ చదివాక – ఉత్తరాంధ్రా దుఃఖపు స్థితి కళ్ల ముందు నెత్తుటి చారికలా మిగిలిపోతుంది. దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా యించుమించు యిదే స్థితి. యివే గాయాలు. ఆ గాయాల నెత్తురును తుడిచే మృదుహస్తమే కవిత్వం . గాయపడిన వాళ్ల వెన్నంటి వుండి ధైర్యాన్ని యిచ్చే ఖడ్గమే కవిత్వం. ‘మంటిదివ్వ’ – అలాంటి బరోసాను యిస్తుంది.

స్వామినాయుడు అంటాడు –

ఈ మట్టిపొరల్ని కొల్లగొట్టే
ఒకానొక ఉత్పాతాన్నెవడు కోరుకుంటాడు ?
భూమిని చాపలా చుట్టుకుపోయే
హిరణ్యాక్షుడు తప్ప !
మళ్లీ నేల మీద వాలే చోటు లేక మరణం వేపు సాగే
కష్టజీవుల కన్నీటి విషాదాన్నెవడు కలగంటాడు ?
తునాతునకలైన బతుకు శకలాన్ని
కాసుల కాటాలో తూనిక పట్టేవాడు తప్ప !
( కంచే చేను మేస్తే.. ! )

రహస్యాన్ని శోధించేవాడే కవి. సమస్త అంశాలను మార్కెటైజ్ చేస్తున్న అభివృద్ధి విధానాల ముసుగు వ్యవహారాన్ని బట్టబయలు చేసి ప్రజల ముందు నిలబెట్టేవాడే నిజమైన ప్రజావాది. ఈ కవి – ఆ పనే చేసాడు.

‘మంట’, ‘తూరుపు ఒక నెత్తుటి పొద్దు’ – ఈ రెండూ.. కళింగాంధ్రాలో థర్మల్ పవర్ ప్లాంట్స్ నేపథ్యంలో రాసినవి. ప్రజల అభీష్టమేదైతే వుందో దానినే వ్యక్తం చేసాయి ఈ కవితలు. కాలమే కవిని, కవిత్వాన్ని తయారీచేస్తుంది. అవును. ఈ కవి గానీ, ఈయన రాసిన కవిత్వం గానీ కాలం గర్భకుహరం నుంచి – వేదన నుంచి – తన ప్రజల మీద తనకు గల వొకానొక గొప్ప ప్రేమ నుంచి జనించిన భౌతిక పదార్థాంశాలే. ప్రజల సామూహిక ఆస్తిని వొక్కరే వొచ్చి నొల్లుకుపోతుంటే ఆగ్రహించాడు ( ‘కళ్లం’ కవిత ). ‘పొద్దు’ లాంటి కవితల ద్వారా తిరుగుబాటును ప్రవచించాడు. ఫ్యాక్టరీలు సృష్టిస్తున్న కాలుష్యానికి మత్స్యకారులు నానా అవస్థలు పడుతుంటే వాళ్లతో పాటూ దుఃఖించాడు.
అందుకే..

పల్లెవాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి
కురిసే కన్నీళ్లు – సముద్రం !
చందమామ – వాళ్ల సామూహిక సమాధి మీద దీపం !!
( సముద్రం మీద చందమామ )
అన్నాడు.

siriki
అడవిని గురించి – అడవి ఆసరాగా నూతన సామాజిక ప్రజాతంత్ర వ్యవస్థ కోసం పని చేస్తున్న ‘ఎర్రమందారాల’ త్యాగాల గురించి – సానుభూతితో రాసాడు. భూమి అంగడి సరుకవ్వడాన్ని చింతించాడు. పల్లెల్లో అశ్లీల నృత్యాలనుఒప్పుకోలేదు.

కవి సమాజానికి కన్నులాంటివాడు. కాపలాదారుడు. వెలుగుబావుటా. ‘మంటిదివ్వ’తో ప్రజలకు గొప్ప ప్రామిస్ చేసిన కవి – స్వామినాయుడు మరింత గొప్ప కవిత్వం సృజించాలని కోరతున్నాను.

    ( 09.02.2014 తేదీన – సిరిసిల్లలో ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ స్వీకరించబోతున్న సందర్భంగా…..  )

-బాలసుధాకర్ మౌళి

బాల సుధాకర్

Download PDF

2 Comments

  • rajaram thumucharla says:

    మౌలి సిరికి స్వామీ నాయుడు గారి మంటి దివ్వె పరిచయం బాగుంది.అనంతపురం లో ఆయనకు ఉమ్మడిశెట్టి అవార్డ్ బహుకరించారు. మంచి కవిత్వం నాయుడి గారిది.

  • జనగళం వినిపిస్తున్న ఉత్తరాంధ్ర కవులలో ఉత్తమ శ్రేణికి చెందిన కవిత్వం రాస్తున్న కవి సిరికి స్వామినాయుడు. తన జనాల బాధల్ని, భయాల్నీ, ఉద్వేగాలని, ఉద్యమాలని “మంటిదివ్వ”లో సరళంగా వ్యక్తం చేసారు. మంచి కవిత్వానికి చక్కని పరిచయం. అభినందనలు.
    – కొల్లూరి సోమ శంకర్
    P.S.
    ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
    http://kinige.com/kbook.php?id=1325&name=Manti+Divva

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)