కోసల, మగధ…ఓ సినిమా కథ!

ఓ రోజున టీవీలో అలెగ్జాండర్ సినిమా వస్తోంది. ఆ సినిమా చూస్తుంటే,  అలెగ్జాండర్-పురురాజుల యుద్ధం గురించి    ప్లూటార్క్ ను ఉటంకిస్తూ కొశాంబీ రాసిన వివరాలు గుర్తొచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుని ఉంటారనిపించి ఆసక్తిగా చూశాను. అయితే, నిరాశే మిగిలింది. ఆ యుద్ధాన్ని ఒకటి రెండు దృశ్యాలతోనే  తేల్చేశారు. గడ్డంతో ఉన్న పురురాజు ఏనుగు మీద యుద్ధానికి వస్తున్నట్టు మాత్రం చూపించారు.

అలెగ్జాండర్-పురురాజుల యుద్ధాన్ని అలా తేల్చివేయడం కూడా ఒక కోణంలో అర్థం చేసుకోదగినదే. అలెగ్జాండర్ ప్రధానంగా కథ చెబుతున్న ఒక పాశ్చాత్యుడికి భారతీయచారిత్రక వివరాలపై మరీ అంత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. భారతదేశానికి సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూచించే అనేక పాశ్చాత్యరచనల్లో కూడా భారతీయకోణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం నేను గమనించాను. భారతీయులు రాసినప్పుడే భారతీయకోణం ఎక్కువ ప్రస్ఫుటం అవుతుందన్నమాట.

సరే, ఈ తేడాను అలా ఉంచుదాం. నేను అలెగ్జాండర్ సినిమాను ఎత్తుకోడానికి వేరే కారణముంది. మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా మనకు మాత్రం చరిత్ర కిటికీ తెరచుకున్నది అలెగ్జాండర్ తోనే. అలెగ్జాండర్ ప్రధానంగా కాకపోయినా ఆ పాత్రతో కొన్ని చారిత్రక సినిమాలు మనవాళ్లు తీశారు. అవి చరిత్రకు ఎంత దగ్గరగా ఉన్నాయనేది వేరే విషయం. అలాగే, బుద్ధుడి కథతో తీసిన కొన్నింటిని వదిలేస్తే, నేను గమనించినంతవరకు మన చారిత్రక సినిమా మగధను, చాణక్యుని, చంద్రగుప్తుని, అశోకుని దాటి ఎప్పుడూ వెనక్కి వెళ్లలేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పని విజ్ఞులెవరైనా సోదాహరణంగా చెబితే సవరించుకోడానికి సిద్ధమే. కనీసం, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి పూర్వరంగంలో ఏం జరిగిందో చెప్పే సినిమాలు మాత్రం రాలేదు. మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి ముందు కోసల అనే రాజ్యంతో పోటీ పడిన సంగతిని చెప్పే సినిమా రాలేదు.

నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ. అయినాసరే, మగధ ఒక మహాసామ్రాజ్యం కావడానికి పూర్వరంగంలో సినిమాకు పనికొచ్చే కథ ఒకటి ఉందని నాకు అనిపించింది. పైగా నా సొమ్మేం పోయింది, అది హాలీవుడ్ స్థాయిలో భారీవ్యయంతో తీయదగిన సినిమా అని కూడా అనిపించింది. ఒక సినిమా విజయవంతం కావాలంటే కథకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో, అందులో ఎలాంటి దినుసులు ఉండాలో నాకు తెలియవన్న సంగతిని ఒప్పుకుంటూనే ఆ కథను ఒక సినిమా కథగా మలచే ప్రయత్నం చేశాను.  మరేం లేదు, నేను కూడా సినిమా కథ రాశానోచ్ అని నాకు నేను చెప్పుకోడానికే తప్ప ఎవరో సినిమా తీస్తారని కాదు. ఆ కథంతా విన్న తర్వాత మీకూ అది సినిమాకు తగిన కథే ననిపించితీరాలని నేను అనను. ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తే, అది నిజంగా అద్భుతమే.

తప్పనిసరి అనిపించిన ఈ కాస్త ఉపోద్ఘాతంతో కథలోకి వెడతాను…

***

BattleofIssus333BC-mosaic-detail1

అంతకంటే ముందు, కథకు ఒక నేపథ్యం ఉండాలి కనుక, కొశాంబీ వెలుగులో అప్పటి ప్రాంతాలు-జనాల అమరిక గురించి చెప్పుకుందాం.

అది క్రీ.పూ. 6వ శతాబ్ది. శాక్య తెగకు చెందిన బుద్ధుడు అప్పటికి జన్మించాడు. శాక్యులు హిమాలయ పాదాలవద్ద, భారత్-నేపాల్ సరిహద్దులలో, నేటి ఉత్తరప్రదేశ్ లోని బస్తీ, గోరఖ్ పూర్ జిల్లాలలో భాగంగా ఉన్న ప్రాంతంలో జీవించారు. అప్పట్లో నేపాల్ నుంచి గంగానది దిగువున చంపారన్ (నేటి బీహార్) జిల్లావరకు; అక్కడినుంచి నదిని దాటి ఇనుము, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతం వరకు ఉత్తరాపథ వర్తకమార్గం విస్తరించి ఉండేది. ఏకచ్ఛత్రాధికారం కోసం చివరి పెనుగులాట జరగబోతున్న ఈ కాలానికి పదహారు జనపదాలలోనూ ఎంతోకొంత ప్రాముఖ్యం నిలుపుకున్నవి నాలుగు మాత్రమే. వాటిలో ఒకటి లిచ్ఛవీ లేదా వజ్జీ తెగ. రెండోది, మల్లుల తెగ. ఈ రెండూ అప్పటికి అత్యంత శక్తిమంతమైన తెగల సమాఖ్యలు. ఈ తెగలవారు సర్వస్వతంత్రులు. ఏకవ్యక్తి పాలనకు తల ఒగ్గేవారు కాదు. ఒక సమితి (అసెంబ్లీ) ద్వారా తమ వ్యవహారాలను నడుపుకునేవారు. నిరంతరం సైనిక శిక్షణలో ఉండేవారు. ఇవి సైనిక గణరాజ్యాలు. న్యాయ, సమానత్వాలకు ప్రాధాన్యమిచ్చే తెగల రాజ్యాంగాన్ని వీరు అనుసరించేవారు. అయితే, వీరిలోనూ తెగల స్వభావం అప్పటికే శిథిలమవడం ప్రారంభించింది. వీరు వ్యవసాయజనాలను(వీరిలో అందరూ తెగ సభ్యులు కారు) సేవకులుగా చేసుకుని వారిపై ఆధిపత్యం చెలాయించేవారు. వ్యక్తిగత ఆస్తి అడుగుపెట్టడంతో సమాఖ్యలు చీలిపోవడమూ అప్పటికే మొదలైంది.

లిచ్ఛవుల ప్రధాన పట్టణం, వారి సమావేశస్థలం వైశాలి (నేటి బస్రా). మల్లుల ముఖ్య కేంద్రాలు పావ, కుశినార అనే చిన్న పట్టణాలు. ఈ రెండు తెగల సమాఖ్యలూ ఎప్పుడనుకుంటే అప్పుడు భారీ సైన్యాన్ని మోహరించగలిగిన స్థితిలో ఉండేవి. యుద్ధోత్సాహం వీరిలో ఉరకలెత్తుతూ ఉండేది. ఇతర భూభాగాలను ఆక్రమించుకోవడం లేదా స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం ఈ రెండు హద్దుల మధ్యే వీరి జీవనం. ఈ రెండు తెగల వాళ్ళు పైన చెప్పిన ఉత్తరాపథ వర్తకమార్గంలో కొంతభాగాన్ని దిగ్బంధం చేశారు.

వీరికి వాయవ్యంగా కోసల ఉంది. దక్షిణ, ఆగ్నేయాలుగా మగధ ఉంది. అంతవరకూ ఇవి కూడా మిగిలిన పదహారు జనపదాల మాదిరిగా తెగల జీవితంలో ఉన్నవే. కోసలులు, మాగధులు అనే తెగల పేర్లే ఆ తర్వాత వీరి ప్రాంతాల పేర్లు అయ్యాయి. ‘మాగధ’ అనే మాటకు మొదట్లో స్తోత్రపాఠకుడు లేదా కవి (వందిమాగధస్తోత్రాలు అనే మాట నేటికీ ప్రయోగంలో ఉంది); వర్తకుడు అనే అర్థాలు ఉండేవి. అంటే ఇవి ఒకే తెగలో జరిగిన వృత్తి విభజనను సూచిస్తాయి. కోసల, మగధలు రెండూ మన కథాకాలానికి తెగలస్వభావాన్ని కోల్పోయి ఏకవ్యక్తి పాలన కిందికి వచ్చాయి.

కోసల, మగధలు రెండింటిలోనూ కోసల పాతది. అంతేకాదు, క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రారంభం నాటికి అదే శక్తిమంతం కూడా. మన కథాకాలానికి కోసల రాజధాని శావత్తి(శ్రావస్తి) అయినా, అంతకుముందు ముఖ్యనగరం, శ్రావస్తికి దక్షిణంగా ఉన్న సాకేత. అదే అయోధ్య, రాముడి జన్మస్థానం. ‘అయోధ్య’ అనే మాటకు భేదించలేనిది అని అర్థం. అక్కడికి వెళ్లాలంటే ఓ దుర్గమారణ్యాన్ని దాటాలి. అందుకే అయోధ్యకు ఆ పేరు వచ్చిందేమో తెలియదు. ఆ దుర్గమారణ్యంలోంచి రాముడు వనవాసానికి బయలుదేరాడు. బహుశా ఈ వనవాస మార్గమే దక్షిణాపథ వర్తకమార్గాన్ని అభివృద్ధి చేసింది, లేదా ఆ వైపు విస్తరించింది. ఆధునిక కాలంలో దక్కన్ అనే పేరు దానినుంచే వచ్చింది. క్రీ.పూ. 6వ శతాబ్దిలోని ఉత్తరాపథ, దక్షిణాపథ వర్తకమార్గాలు రెండూ కలిసే కూడలిలో శ్రావస్తి ఉంది. దాంతోపాటు, కోసల అనేక యుద్ధాల తర్వాత కాశీని చేజిక్కించుకోవడంతో గంగపై కూడా దానికి ఆధిపత్యం లభించింది. అప్పటినుంచీ ఆ రాజ్యాన్ని కాశీ-కోసల అని చెప్పుకోవడం మొదలైంది. కాశీ నదీ రేవు పట్టణం. అప్పటికే సాహసవంతులైన నావికులు కాశీనుంచి సముద్రానికీ చేరుకుంటున్నారు. ఒక్కోసారి డెల్టా దాటి వర్తకం సాగిస్తున్నారు. మొదట్లో ఉప్పు నిలకడగా లాభాలు తెచ్చిపెట్టిన వ్యాపారవస్తువు. కాశీలో నూలు, పట్టువస్త్రాలు, ఇతర వస్తుతయారీదారులు అప్పటికే ప్రసిద్ధి చెందారు. కాషాయవస్త్రం కాశీనుంచే వచ్చింది. బౌద్ధుల వస్త్రాలకు రంగు నిచ్చింది కాషాయమే. ఇప్పటికీ ఈ రంగు వస్త్రాలకు కాశీ ప్రసిద్ధమే.

నదికి అవతల ఉన్న మగధ, వర్తకుల రాకపోకలకు ఏమాత్రం పనికిరాని చోట ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడితో బాట ఆగిపోయి ఓ కీకారణ్యంలోకి అదృశ్యమైపోతుంది. అయితే, వర్తకమార్గం కంటే ముఖ్యమైన విలువైన లోహసంపద మగధ అధీనంలో ఉంది. అప్పటి మగధ రాజధాని రాజగృహం(రాజ్ గిర్). అది, గంగకు దక్షిణంగా విసిరేసినట్టు ఒంటరిగా ఉన్న ఓ పురాతన ఆర్య జనావాసం. అక్కడ రాజధానిని ఏర్పరచుకోడానికి ఒక కారణం ఉంది. రాజ్ గిర్ కు ఉత్తరంగా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ధార్వార్ గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల్లో ఎక్కడ చేయిపెట్టినా ఇనుము దొరుకుతుంది. తవ్వి తీయాల్సిన అవసరమే లేదు. పలకలు పలకలుగా రాతికి అతుక్కుని ఉన్న ముడి ఇనుమును వేరుచేసి, నిప్పుల్లో కాల్చి, శుద్ధి చేసి అప్పటికప్పుడు పాత్రలను, పరికరాలను తయారుచేసుకోవచ్చు. రాజ్ గిర్ కు అదనపు సౌలభ్యం, చుట్టూ ఉన్న కొండలు. అవి పెట్టని కోటల్లా రాజధానికి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఆవికాక, వాటిలోపల పాతిక మైళ్ళకు విస్తరించిన వెలుపలి ప్రాకారం ఉంది. దానికి కూడా లోపల మరో ప్రాకారం ఉంది. ఇలా రాజ్ గిర్ మూడంచెల రక్షణలో ఉండేది. లోపల పశువుల్ని మేపుకోడానికి కావలసినంత పచ్చిక. దానికితోడు పరిసరాలలో వేడి నీటి బుగ్గలూ, చల్ల నీటి బుగ్గలూ రెండూ ఉండేవి. దాంతో నీటి సరఫరా పుష్కలం. ఇలాంటి అనుకూల పరిస్థితులు అన్నీ శత్రువును ఎంతకాలమైనా నిలవరించగలిగిన వెసులుబాటును మగధ రాజులకు కల్పించాయి. విశేషమేమిటంటే, మగధ అజేయస్థితిని చాటే ఉదంతాలు మహాభారతంలోనే ఉండడం! దాని గురించి మరెప్పుడైనా…

మగధకు ఆగ్నేయంగా గయ ఉంది. అది, మగధుల  తొలి వలస. గయ దాటితే అంతా మహారణ్యం. అయితే, గయకు ఆగ్నేయంగా ఉన్న కొండల్లోనూ ఇనుము, రాగి నిక్షేపాలు ఉన్నాయి. భారతదేశంలోనే భారీ నిక్షేపాలు అవి. గుండె దిటవు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ అరణ్యంలోకి వెళ్ళి వాటిని వెలికితీసేవారు. వర్తకులు వాటిని మధ్య గంగా ప్రాంతానికి తెచ్చి అమ్మేవారు. ఆ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటి కాదు కనుక ఈ లోహాల వెలికితీత, విక్రయాలే ప్రధానవ్యాపకం అయ్యాయి.  అయితే, మగధరాజులు ఒక పద్ధతిగా అరణ్యాలను నరకి, నాగలి వ్యవసాయం కిందికి తేవడానికి క్రమంగా ఈ లోహసంపద ఉపయోగపడింది.

పదహారు జనపదాలలో అన్నీ జనాభా రీత్యా చెప్పుకోదగినవి కావు. ఎక్కువ భాగం అరణ్యమయం. ఆ అరణ్యాలలో పలచ పలచగా ఆటవిక తెగలు ఉన్నాయి. వాళ్ళు అప్పటికింకా రాతి గొడ్డళ్లే వాడుతున్నారు. కాకపోతే బళ్ళ మీద సరకుతో వెళ్ళే వర్తకులకు (బిడారు)లకు ప్రమాదకరంగా మారుతున్నారు. రెండు ప్రధాన వర్తక మార్గాలకు దగ్గరలో ఉన్న జనపదాల మధ్య కూడా అంతులేనంత అరణ్యం వ్యాపించి వాటి మధ్య దూరాన్ని పెంచింది. కనుక అడవిగుండా వెళ్లాలంటే వర్తకులకు ఎంతో జాగ్రత్త, బందోబస్తు అవసరం.

కొన్ని జనపదాల పేర్లు మిగిలాయి కానీ వాటి తెగలు అంతరిస్తున్నాయి. ఉదాహరణకు మిథిల ఒక నగరం పేరూ, జనపదం పేరూ నని కోశాంబీ అంటారు. మిథిల రామాయణప్రసిద్ధంకూడా. సీత మిథిలను పాలించిన జనకుని కూతురు, అందుకే మైథిలి అయింది. మిథిల తెగ క్రీ.పూ. 6వ శతాబ్ది నాటికి అంతరించింది. నేరుగా ఇక్ష్వాకు వంశానికి చెందిన మిథిల ఆఖరి రాజు పేరు సుమిత్రుడు. బుద్ధుడు పుట్టినప్పుడే అతడు చనిపోయాడు. మిథిలతోపాటు చెప్పుకునే పేరు విదేహ. సీతకు వైదేహి అనే పేరు కూడా ఉంది. విదేహ మిథిలలో కలసిపోయింది. మిథిల, విదేహలు రెండూ ఆ తర్వాత కోసలలో కలిశాయి. క్రమంగా వర్తకులకు వైదేహికులనే పేరు కూడా వచ్చింది. బహుశా విదేహ తెగకు చెందినవాళ్లు కూడా వర్తకం చేపట్టడంతో వర్తకులకు ఆ పేరు వచ్చి ఉండచ్చని కోశాంబీ అంటారు. బిడారులు ఆ రోజుల్లో అటు తక్షశిలనుంచి ఇటు మగధ చివరి వరకు ప్రయాణించేవారు. వాళ్ళలో మరింత సాహసవంతులు దక్షిణాపథ మార్గంలోనూ వెళ్ళేవారు. మిథిల, విదేహలు కోసలలో కలసిపోయినట్టే; చంపానగరం(నేటి బీహార్ లోని భాగల్ పూర్)రాజధానిగా ఉన్న అంగ, మగధలో కలసిపోయింది. అప్పటికది ఓ సాధారణ గ్రామంగా మారిపోయింది. మగధరాజు బింబిసారుడు దానిని ఒక ఋత్విక్కుకు దానమిచ్చాడు.

ఈ కాలానికి వచ్చేసరికి ఒక తెగమనిషి కన్నా వర్తకుడు ప్రధానుడిగా మారాడు. ప్రత్యేకంగా ఒక తెగకో, జనపదానికొ చెందని ఈ వర్తకులే ఒక తెగగా అవతరించారు.  నాణేల ముద్రణ, వాడకం మొదలయ్యాయి. వస్తూత్పత్తి బాగా పెరిగిందనడానికి ఇది సూచన.  నాణేల బరువులో సింధు సంస్కృతి నాటి ప్రమాణాలనే పాటించడం విశేషం. అనేక గ్రామాలలో, ముఖ్యంగా కాశీ చుట్టుపక్కల బుట్టలు అల్లేవారు, కుండలు చేసేవారు, కమ్మరులు, నేతపనిచేసేవారు వగైరాలు స్థిరపడ్డారు. ఈ చేతివృత్తుల వాళ్ళు సాధారణంగా ఒకే తెగకు చెందిన రక్తసబంధీకులు. శ్రేణుల పేరుతో వీరు తెగ స్వభావం కలిగిన వ్యవస్థను ఏర్పరచుకునేవారు. ఇది వారి వెనకటి తెగ లేదా గణజీవిత వారసత్వం. శ్రేణుల దగ్గర చెప్పుకోదగిన సంపద ఉంటుంది. అయితే, అది ఉమ్మడి సంపదే తప్ప వ్యక్తిగత సంపద కాదు.  వీరి ఉత్పత్తుల నన్నింటినీ దగ్గరలోని ఒక్క పట్నంలోనే అమ్ముకునే అవకాశం లేదు. ఎందుకంటే, క్రీ.పూ. 7,6 శతాబ్దాలనాటికి కూడా నగరాలు పెద్దసైజు గ్రామాలుగానే ఉన్నాయి. కనుక ఉత్పత్తులు దూర దూర ప్రాంతాలకు రవాణా చేసేవారు. గంధపు చెక్కకు మంచి డిమాండ్ ఉండేది. సబ్బులు లేవు కనుక స్నానం చేసేటప్పుడు గంధంతో నలుగు పెట్టుకునేవారు. ఉష్ణ వాతావరణంలో గంధం నిత్యావసరమే కానీ, విలాస వస్తువు కాదు. ఉత్పత్తులను తీసుకుని ఒకేసారి అయిదువందలకు పైగా ఎడ్ల వేగన్లు బారులు కట్టి ప్రయాణించేవి.  బళ్ళకు, మధ్యలో కడ్డీలు ఉన్న చక్రాలు, ముడిచర్మపు టైర్లు ఉండేవి.

అటవీ ప్రాంతాలలో తెగ ముఖ్యుని ద్వారా వ్యాపారం జరిగేది. అతడే వర్తకుడికి కావలసిన మిగులును సేకరించేవాడు. ఆ క్రమంలో తెగ ముఖ్యుని దగ్గర వ్యక్తిగత ఆస్తి పోగుబడుతూ వచ్చింది. ఈ నూతన ఆస్తి ద్వారా మిగిలిన తెగసభ్యులనుంచి స్వతంత్రించే సౌలభ్యం కూడా అతనికి దక్కింది. ఆవిధంగా కూడా గణసమాజం పట్టు సడలిపోవడం ప్రారంభించింది. గుర్రం విలువైన వ్యాపార వస్తువులలో ఒకటయింది. అంతవరకూ రథానికి పూన్చుతూ వచ్చిన గుర్రాన్ని ఇప్పుడు అధిరోహిస్తున్నారు. ఏనుగు అంతకంటే విలువైనది. అయితే, అది రాచరిక, సైనిక వినియోగానికే తప్ప వ్యాపార వస్తువు కాదు. ఆనాటికి సమాజం, కులవిభజన కరడుగట్టిన, నిస్సహాయ, నిర్లిప్త గ్రామీణ వ్యవస్థకు ఇంకా చాలా దూరంగానే ఉంది. అలాంటి వ్యవస్థ ఏర్పడడానికి ఇంకో పన్నెండు వందల సంవత్సరాలు గడవాలి.

వ్యాపార వస్తువుల తరలింపు నిర్నిరోధంగా సాగడానికి, తగిన అధికార కేంద్రమూ, దానికింద ఒక శక్తిమంతమైన, సుశిక్షితమైన వృత్తి సైన్యమూ అవసరమయ్యాయి. అది శాశ్వతప్రాతిపదికపై పనిచేసేది అయుండాలి. అందులోకి జరిపే నియామకాలకు, దాని సైనిక చర్యలకు తెగల విశేషాధికారాలు, చట్టాలు, విధేయతలూ అడ్డురాకూడదు. అది తెగలను దాటి విస్తృత సమాజాన్ని లక్ష్యం చేసుకోవాలి. ఆ సమాజం తెగల ప్రత్యేక  జీవనవిధానాన్ని, హక్కులను గుర్తించదు.  గణముఖ్యుడు యుద్ధాలకు అవసరమైనప్పుడు మాత్రమే సమీకరించే వెనకటి తెగల సైన్యం లాంటిది కాదు ఇది. ఎంతో జాగ్రత్తగా శిక్షణ ఇస్తూ, నిరంతరం యుద్ధసన్నద్ధతలో ఉంచుతూ, జీతం చెల్లిస్తూ, వ్యూహాత్మక ప్రాంతాలలో ఉంచుతూ ప్రభుత్వం ఖర్చుతో పోషించవలసిన సైన్యం. ఇవన్నీ సాధ్యం కావాలంటే పన్నులు వసూలు చేయకతప్పదు. అయితే, గణసమాఖ్యలు ఇందుకు సాధారణంగా ఒప్పుకోవు. జీతాలు ఇస్తూ శాశ్వతప్రాతిపదికపై పోషించే ఇలాంటి సైన్యాన్ని లిచ్ఛవీలు, మల్లులు ఎన్నడూ ఎరగరు. విస్తృత సమాజంలో భాగం కాకుండా దేనికవిగా ఉన్న వివిధ తెగల రూపంలోని అడ్డుగోడలను కూలగొట్టడం పైన చెప్పిన సైనిక బలం కలిగి, ప్రజలపై సంపూర్ణ అధికారాలను చేజిక్కించుకున్న నిరంకుశరాచరికానికే సాధ్యమవుతుంది.

***

క్రీ. పూ. 6వ శతాబ్దిలో కోసల, మగధరాజులకు ఇందుకు అవసరమైన సాధనాలు అన్నీ సమకూడాయి!

ఇక్కడినుంచి అసలు కథలోకి వెడతాం. అది వచ్చే వారం…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)-కల్లూరి భాస్కరం

 

 

 

 

 

Download PDF

4 Comments

  • Saikiran says:

    అన్యాయం సార్! అసలు కథలోకి వెళ్ళడానికి మరో ఆరు రోజులా! j/k.
    Kalluri Bhaskaram gaaru – I can understand the pains that you are taking to do research, to put your thoughts in order, preparing the write-up with appropriate interpretation, typing and posting it here! This is one feature, which I would never miss in Saranga. You are doing a great service sir and so is the Saranga Team! I wish all these write-ups will be published very soon as a book.
    W/Regards – Kondamudi Saikiran Kumar

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్యూ సాయి కిరణ్ గారూ… అనుకోకుండా ఈ వ్యాసాలు సస్పెన్స్ సీరియల్ లా వెళ్లిపోతున్నట్టున్నాయి. ముందు అనుకున్నప్పుడు నేరుగా విషయం లోకి వెళ్లిపోవచ్చనుకుంటాను. తీరా మొదలుపెడితే అది కుదరదనిపిస్తుంది. చాలాసార్లు ఇలాగే జరిగింది. మీరన్నట్టు ఇవి రాయడంలో కొంత శ్రమ, పరిశ్రమ ఉన్నమాట నిజమే కానీ నేను ఎంజాయ్ చేస్తూ రాస్తున్నాను కనుక ఇబ్బంది లేదు. నాలా మీ లాంటి పాఠకులు కూడా ఎంజాయ్ చేయడం నాకు అదనపు సంతోషం. సారంగ సారథులు కల్పన, అఫ్సర్ ల ప్రోత్సాహం, అభిరుచి తోడ్పడకపోతే ఈ వ్యాసాలు ఇలా వచ్చేవి కావు. ఇవి తప్పకుండా పుస్తక రూపంలో వస్తాయి.

  • venkata Garimella says:

    చాలా బాగుందండి!! కోశాంబి రాసిన పుస్తకాలు వివరాలు చెప్పగలరు. అవి దొరికే మార్గం కూడా!!!

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్యూ వెంకట గారూ…కోశాంబీ పుస్తకాలు చరిత్రకు సంబంధించి ప్రధానంగా ఇవీ. ఇవన్నీ చాలావరకు పునర్ముద్రణలు: 1. An Introduction to the Study of Indian History (2004) 2. The Culture and Civilisation of Ancient India in Historical Outline (2007) 3. Myth and Reality (1962) 4. Unsettling the Past (2012) 5. Combined Methods in Indology and other Writings (2009) 6. The Autobiography of Dharmanand Kosambi. ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఇవి లీడింగ్ బుక్ షాప్స్ లో దొరకాచు. లేదా అమెజాన్ వారి దగ్గర దొరకచ్చు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)