పిడిబాకులుగా మారే పూలు ఇనాక్ వాక్యాలు!

సృజన, పరిశోధన, విమర్శన రంగాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌. ఆయన చిన్న చిన్న వాక్యాల్ని రాస్తారు. దీనితో పాటు సరళ సుందరంగా రాస్తారు. దీర్ఘసమాసాల్ని ప్రయోగించడానికి ఇష్టపడరు. సృజన సాహిత్యంలోనే కాదు, విమర్శ, పరిశోధన రచనల్లోనూ అలాగే రాస్తారు. ఇనాక్‌ గారి ‘‘భవాని’’ కథల్ని సమీక్షిస్తూ, మొట్టమొదటిసారిగా ఆయన తెలుగు వాక్య రచనాశైలిని ఆచంట జానకిరాం ప్రశంసించగా, ఆర్‌.ఎస్‌. సుదర్శనం తదితరులు ఆ విషయాన్ని బాగా ఫోకస్‌ చేసేవారు. గంగిశెట్టి లక్ష్మీనారాయణగారి అభిప్రాయంలో చెప్పాలంటే ‘ఇనాక్ గారు రాసిన వాక్యాలు  పూలలా ఉంటూనే, పిడిబాకులుగా మారతాయి’’[1] ఇనాక్ గారి కథలు చదివిన వారికి ఈ సత్యం  తెలుస్తుంది.

ఇనాక్‌ గారు‘‘ తెలుగు వ్యాసపరిణామం’’ పై డాక్టరేట్‌ కోసం పరిశోధన చేస్తూ, తెలుగు వచనతత్త్వాన్ని బాగా గుర్తించారు. ప్రాచీన వాఙ్మయంలో పద్యం అనుభూతిని ఆవిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించగా, గద్యం ఆలోచనకి ప్రాధాన్యాన్నిచ్చింది. ఆధునిక కాలంలో మానవుడు ప్రధానంగా బుద్ధిజీవికావడంతో గద్యం ప్రాచుర్యంలోకి వచ్చిందని సమన్వయించారు. 1970 నుండి1972 మధ్యలో ఈ పరిశోధన పూర్తి చేశారు. అప్పటికే కవిగా, కథకుడుగా, నాటకరచయితగా అనేక రచనలు చేశారు. వీరి పరిశోధనలో తెలుగు వ్యాసపరిణామాన్ని సృజన, విమర్శన వ్యాసాలుగా విభజించారు. దీనిలో ‘‘హృదయం ప్రధానమైన, కాల్పనికత కలిగి, రచయిత వ్యక్తివ్వం వల్ల, అసంపూర్ణంగా ` చాలా వరకు ఆంగ్ల వ్యాస లక్షణ సంబంధిగా గోచరించిన వచన రచనలు సృజన వ్యాసాలు’’ అన్నారు[2].  అయితే, సృజన వ్యాసం ఉపన్యాసంగా ప్రసిద్ధమయినా, ప్రమేయమనో, సంగ్రహమనో, వచనకావ్యమనో ప్రారంభమయినా, కథలు గాథలుగా రూపొందినా, మరే పేరుతో పిలవబడినా, విస్తృతంగానే ఆవిర్భవించిందన్నారు. ఇక్కడ వచనకావ్యం, కథలు సృజన వ్యాసంలోకే చేరతాయా? అనే సందేహాలు రావొచ్చు.వీటికి చాలా రచనలను సమన్వయించి చూపారు.

hyf05Rangarajan_HY_1507985g

గురజాడ ‘మాటా మంతీ’, మునిమాణిక్యం నరసింహారావు ‘‘ఇంటావిడతో పోట్లాట’ వంటివి చదువుతుంటే కథల్లాగే అనిపిస్తుంది.అలాగని ఆధునిక కథానిక లక్షణాల్ని సమన్వయించడానికి కుదరదు. అప్పుడు వీటిని ఏమని పిలవాలి?  చలం ‘‘మ్యూజింగ్స్‌’’, ప్రేమలేఖలు’’, సంజీవ్‌దేవ్‌ వ్యాసాల్ని చదువుతుంటే,వాళ్ళ జీవితానుభవాల్ని వివరిస్తున్నట్లే ఉంటుంది. వీటిని ఆత్మకథలనవచ్చా? అదీ కుదరదు. మరేమని పిలవాలి? కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు వచనరచనలు కూడా ఇలాగే ఉంటాయి. వీటిలో కొన్ని వ్యాసాల్ని చదువుతుంటే చక్కని వచనకవిత్వం చదివిన అనుభూతికి లోనవుతుంటాం. అలాగని వీటి వచనకవిత్వంగా భావించలేం. అలాగే జి.వి.సుబ్రహ్మణ్యం గారి  కొన్ని వ్యాసాలు ఆలంకారిక వర్ణనలతో ఉంటుంటాయి. ఆరుద్ర ‘‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’’ ప్రారంభించడమే కథలా ఉంటుంది.[3] పరిశోధనలో ఇదొక నూతన సమన్వయం. వ్యాసం కేవలం మేథోగతమనుకునేవాళ్ళకిది కొత్త ఆలోచనను రేకెత్తించినట్లే.

అమెరికాలో Paul Dawson, “Creative Writing and the New Humanities’’ పేరుతో డాక్టరేట్‌ అందుకున్నాడు. దీనిలో మేథోగతమైన అంశాలెలా సృజనగా బహిర్గతమవుతుంటాయో విశ్లేషించాడు. ఈ గ్రంథం 2005లో వచ్చింది. దీన్ని చదువుతుంటే, ఇటువంటి సృజన విషయంలో కొత్తసిద్ధాంతం ఇనాక్‌ గారి సిద్ధాంత గ్రంథంలో 1970 నాటికే చెప్పారనిపించింది. రచనల్లో పోలికలున్నట్లే, ఆలోచనలు కూడా కలిసే అవకాశం ఉంది. అందుకే పండితులు ‘‘సంవాదిన్యో మేధావినామ్‌ బుద్ధయ:’’ అని అన్నారు[4]. ప్రతిభావంతుల ఆలోచనలు ఒకదానితో ఒకటి పోలి ఉండొచ్చన్నమాట!

వ్యాసంలో ‘సృజన’ హృదయాన్ని దగ్గరకు చేరుస్తుంటే, సృజనలో ‘ఆలోచన’ వైయక్తికానందాన్ని వ్యవస్థీకృతం చేయడానికి పనిచేస్తుంది. ఒక కథో, ఒక కావ్యమో, ఒక నాటకమో చదివినప్పుడు పాఠకుడు మొదటి వైయక్తికానందాన్ని అనుభవించాలంటే, పాత్రతోనో, వర్ణనతోనో, వస్తువుతోనో తాదాత్మ్యం చెందగలగాలి. దానితోనే ఆగిపోతే, దాని ప్రయోజనం తాత్కాలికమే. అది పాఠకుణ్ణి వెంటాడాలి. శ్రోత చెవుల్లో పదేపదే వినిపించాలి. అప్పుడే అది నిజంగా హృదయగతమైందనుకోవచ్చు.నిజంగా హృదయగతం కావడమంటే, ఆలోచనామృతం కావడమే.ఆచార్య ఇనాక్‌ గారి సృజనాత్మక రచనల్లో ఈ లక్షణం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. వీటిని ఇనాక్‌గారు రాసిన ఏ రచనలోనైనా గమనించవచ్చు.

మునివాహనుడు (1976) ఒక సంగీతరూపకం. కానీ, వ్యవహారంలో నాటకమంటున్నారు. పౌరాణికం, చారిత్రకేతివృత్తాల సంగమం.తిరుప్పాణ్‌ ఒక భక్తుడు. అంతకంటే ముందు అతణ్ణి సమాజం పుట్టక వల్ల అంటరానివాడనిపిలిచింది. అస్పృశ్యుడు కావ్యనాయకుడుగా లక్షణగ్రంథాలు అంగీకరిస్తున్నాయా? అదీ ఒక పౌరాణిక, చారిత్రక నాటకంలో కుదురుతుందా? పోనీ, అస్పృశ్యుడైన తిరుప్పాణ్‌ భక్తికి పారవశ్యం చెందిన శ్రీరంగనాథుడ్ని నాయకుడు అనుకోవాలా? భక్తిని రసంగా అంగీకరిస్తున్నారా? ధనంజయుడు,హేమచంద్రుడు మొదలైన వాళ్ళు భక్తిని భావంగానే పరిగణించాలి తప్ప, రసం కాదన్నారు. రూపగోస్వామి, మధుసూధనసరస్వతి మాత్రం భక్తిని రసంగా భావించాలని వాదించారు. చిత్రద్రవము స్థాయీభావంగా మొదటివారు, భగవత్ రతిని రెండవారు భక్తికి స్థాయీభావంగాను వివరించారు. భక్తి రసానికి అలంబన విభావం భగవంతుడు, ఆయన చరిత్ర ఉద్దీపన విభావం, భగవంతుని ఆకారాన్ని చూడడం, అతణ్ని గురించే మననం చేసుకోవడం వల్ల కలిగిన భావమే రతిగా పరిణమిస్తుందనీ, ఆ సమయంలో నేత్రాది వికారాలు అనుభావములనీ, నిర్వేద,శంక,హర్షాదులు వ్యభిచారీభావాలవుతాయనీ వివరించారు. భగవంతునిలో లీనమైపోవడమే నిజమైన భగవద్రతికి సంపూర్ణమైన స్థాయి కలగడమౌతుంది. అదే నిజమైన రసస్థితిగాను చెప్పారు. దీన్ని అనుసరించి చూస్తే, తిరుప్ఫాణ్‌ శ్రీరంగనాథునిలో లీనమైపోతాడు. తిరుప్ఫాణ్‌ తన భక్తితో లోకసారంగమునిని జయిస్తాడు. కాబట్టి దీనిలోని రసం వీర రసంలోని ఒకటైన ధర్మవీరాన్ని, భక్తినీ కలిపి ధర్మవీరంగా గానీ, భక్తిధర్మవీరంగా గాని చెప్పవలసి ఉంటుంది!

‘‘మునివాహునుడు’’ నాటకంలో రచయిత సృజనీకరించిన కొన్ని పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలి. వేదదత్తడు, దేవదత్తుడు, లోకసారంగముని సమాజస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతీకాత్మకంగా పెట్టినవి. నాటకరంగంలో విశేషంగా పరిశోధన చేసిన పరిశోధకులు ఈ నాటకాన్ని ప్రాచ్చ, పాశ్చాత్య లక్షణాల్ని సమన్వయించదగినవని ప్రశంసించినా, వాటిని సమన్వయించాల్సిన అవసరం ఇంకా కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడుదశాబ్దాల తర్వాత కూడా అస్పృశ్యులుగానే నిరాదరణకు గురౌతున్న దళితుల పరిస్థితిని ప్రతిఫలించిన నాటకంగా దీన్ని చెప్పుకోవాలి.నాటకమంతా విన్న తర్వాత లేదా చూసిన తర్వాత లేదా చదివిన తర్వాత లోకం దళితుల్ని ఎలా చూస్తున్న వాస్తవాన్ని అర్థంచేసుకుని, ఆలోచనలో పడతారు. ఈ నాటకంలో పాటలు, పద్యాలు, సంభాషణలు రచయిత ప్రతిభాపాటవాల్ని అనేకపార్శ్వాల్లో చూపిస్తుంది. అన్నింటికీ మించి వస్తువులో, దాన్ని నడిపిన తీరులో పాఠకుణ్ని ఆలోచింపజేస్తుంది. నాటకాంతం అయ్యేసరికి ఆ వాదనతో అందరూ హృదయపూర్వకంగా  అంగీకరించకతప్పనిపరిస్థితి! చదువుకుని, అధికారంలోకివచ్చినా మళ్ళీ అటువంటి సమస్యనే ఎదుర్కొంటున్న దళితుడు ఎలాంటి ఆవేదనతో బతుకుతున్నాడో ‘‘కులవృత్తి’’ కథ (2006) తెలుపుతుంది. స్వాతంత్య్రం వచ్చిన మరో మూడు దశాబ్దాల తర్వాత జరిగిన సమీక్షలా ఈ కథ మనకి అనిపిస్తుంది.

inak1

లేనిదాన్ని ఉనికిలోకి తీసుకురావడాన్ని సృజనాత్మక శక్తి అంటారు. కేవల కల్పన అనేదానికంటే భిన్నంగా సామాజిక వాస్తవిక అంశాల్ని కళాత్మకం చేయడంలోనే కవికి ఉన్న నిజమైన ప్రతిభ ప్రస్పుటమౌతుంది. ఆదిఆంధ్రుడు కావ్యం మౌలికంగా సృజనవ్యాపారానికి సంబంధించిందే. అయినా, దానిలో ఒక చారిత్రక పురుషుని కథని నిక్షిప్తం చేశారు. ఈ కావ్యం రాయడానికి ఆధారాల్ని సంపాదించిన తర్వాత కవి ఇలా వ్యాఖ్యానించారు[5]. ‘‘కాల్పనికుడుగా, జానపదగాథా నాయకుడుగా, అనాదరణకు గురైన రాయుడి జీవితం చారిత్రకంగా కనిపించసాగింది’’ ఈ కావ్యాన్నీ, అంతకుముందు మునివాహనుడు నాటకాన్నీ శ్రీకారంతోనే ప్రారంభించారు. కానీ, ప్రయోగాలతో మలుపులు తిప్పారు. క్రీ.శ. 1767 ప్రాంతానికి చెందిన భుజంగరాయుడి కథ ‘‘ఆది ఆంధ్రుడు’’ కావ్యం(2008). గుంటూరు దగ్గర్లోని చింతపల్లి, అమరావతి గ్రామాల్ని రాజధానులుగా చేసుకొని పరిపాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి ఆస్థానంలో సేనానిగా సేవలందించినవాడు భుజంగరాయుడు. అతడు మాదిగల వారసుడు. వెంకటాద్రినాయుడు చెంచుల్ని ఊచకోత కోసినప్పుడు, ఆయనతో వద్దని వాదించిన వీరుడు. దళితుల ప్రతిభాపాటవాలకు ఆదర్శప్రాయడు.వీరుడుగానే కాకుండా, కవిత్వం చెప్పడంలోను ప్రతిభావంతుడు.

ఈభుజంగరాయుని వంశానికి చెందిన వాళ్ళే రూపొందించిన పూర్ణకలశమే నేటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వలాంఛనంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. దీన్ని తయారు చేసిందొక చర్మకారుడు. అతడి పేరు విధిక. విధిక తర్రడిపేరు నాగన. అతనికొడుకు పేరు నాగన. నాగన కొడుకు భుజంగరాయుడు. ఆచార్య నాగార్జునుడి కాలం నాటి పూర్ణకలశం కొద్ది మార్పులు చేర్పులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లాంఛనంగా కొనసాగుతుందంటే, నాటికే మాదిగల కళానైపుణ్యమెలాంటిదో తెలుస్తుందని గొప్ప ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే కావ్యమిది. దీన్ని విశేషమైన పరిశోధన చేసిన తర్వాతనే కావ్యంగా మలిచారు. ఇదే పరిశోధన సృజనగా మారడమంటే. ఆధునిక తెలుగు సాహిత్యంలో,  ప్రత్యేకించి దళితసాహిత్యానికి నవ్యచైతన్యాన్ని అందించేదిశగా వెలువడిరదీ పద్యకావ్యం. 505 పద్యాల్లో, 27 శీర్షికలుగా ఈ కావ్యాన్ని వర్ణించారు ఇనాక్ గారు.

క్రీ.శ.1761లో జన్మించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, గుంటూరు దగ్గర్లోని అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఆతని ఆస్థానంలో ఉండే సైన్యాధిపతుల్లో భుజంగరాయుడు కూడా ఒకడని చరిత్రచెప్తున్న వాస్తవం. ఈ వాస్తవిక సంఘటనలకు జానపదేతివృత్తాన్ని మిళితం చేసి కావ్యం నిండా దళితసౌందర్యం గుభాళించేలా వర్ణించారు కవి. దళితుల్ని ఈ కావ్యం ఆత్మగౌరవంతో నిలబెడుతుంది. దళితులెలా తమ సాహిత్యాన్ని నిర్మించుకోవాలో ఈ కావ్యం ఒక మార్గాన్ని చూపుతుంది. ఇది దళితుల వారసత్వసంపదను, చరిత్రను, సంస్కృతిని వేనోళ్ళా కీర్తించేలా చేస్తుంది.

‘‘ఆది ఆంధ్ర ప్రాచీనాంధ్రుల్ని చెప్పటానికి వాడుతున్నారు. ఆదిద్రావిడ, ఆది కన్నడిగ వంటి పదాలతో ఆదిమవాసుల్ని గూర్చి చెప్పటానికి భారతీయులు సిద్ధమయ్యారు. ఈ పదాలు ప్రాచీనాలు కావు, ఆర్వాచీనాలు’’ (పుట: 35) అని కావ్యనామౌచిత్యాన్ని ప్రస్తావించారు కవి. ఇది వాస్తవమని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఆది ఆంధ్ర అనేది ఒక ఉద్యమస్ఫూర్తితో పెట్టుకున్న ఆలోచనాత్మకమైన పేరు. దళితులు ఈ దేశమూలవాసులని నినదించేపేరు. గాంధీజీలాంటి వాళ్ళు హరిజనులని పేరుపెడితే ఒప్పుకునేది లేదని దాన్ని వ్యతిరేకించిన ఉద్యమం నుండి వచ్చిన ఆత్మగౌరవ నినాదమది.

దేశవ్యాప్తంగా వచ్చిన బ్రాహ్మణేతర ఉద్యమాలు, ముఖ్యంగా మద్రాసు ప్రెసిడెన్సీలో 1916నుండీ చేసిన ద్రావిడ             ఉద్యమం దళితుల ఆత్మగౌరవాన్ని పెంచింది.‘‘ ద్రవిడ ఉద్యమం ఆది ద్రావిడులు (తమిళం మాట్లాడే అంటరానివాళ్ళ కొత్తపేరు) అనే నూతన గుర్తింపునకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆది ద్రావిడులు తమంతట తాము జాతి, ప్రాంతపరమైన గుర్తింపులను సృష్టించుకునేందుకు  దారిచూపింది. ఉదాహరణకు ఆది ఆంధ్రులు (తెలుగు మాట్లాడే అంటరానివాళ్ళు), ఆది కర్ణాటక వంటివి ఈ గుర్తింపునకు ప్రాతిపదికలు. దళితులలో తామే ఈ దేశంలోని అసలు మూలవాసులం, భూమిపుత్రులం అన్న నమ్మకం. ఆది ఆన్న మాట వెనుకవున్న అర్థం యిదే. భాషాపర/ప్రాంతరమైన ఈ పేరును ప్రభుత్వం ఆ తదనంతరం గుర్తిందింది.  1931 మద్రాసు జనాభా లెక్కల ప్రకారం మాల మాదిగలు సుమారు ఆరు లక్షల మంది ఆది ఆంధ్రులుగా తమను తాము పరిగణించుకున్నారు’’ అని ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర’ ( 2007: 74)లో యాగాటి చిన్నారావు వివరించారు[6]. ఈ పరిణామం 1917లో చేసిన ఒక తీర్మానం ద్వారా జరిగిందని దళిత ఉద్యమకారుడు గౌతమ్‌ వెల్లడిరచారు (అదే: 74)

1917 నవంబరు 4నుండి 6వతేదీవరకు బెజవాడ(విజయవాడ)లో మొట్టమొదటి ప్రాదేశిక పంచమ సదస్సు జరిగింది. భాగ్యరెడ్డివర్మ, సుండ్రు వెంకయ్య మొదలైన దళితనాయకులు ఆ సదస్సులో పాల్గొన్నారు.మొదటిరోజు అధ్యక్షోపన్యాసంలో భాగ్యరెడ్డివర్మ అంటరానివాళ్ళే ఈ దేశమూలవాసులని ప్రకటిస్తూ, ఇకపై పంచమలుగా కాకుండా ‘ఆది ఆంధ్రులు’గా పరిగణించాలని తీర్మానించారు. ఆనాటి నుండే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో దళితులు ఆది ఆంధ్రుగా మారిపోయి, తమది ఆది ఆంధ్రోద్యమంగా భావించారని చరిత్ర చెప్తోంది[7].                ఇవన్నీ చూసినప్పుడు అందుకనే  కావ్య రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్‌  ‘ఆది ఆంధ్రుడు’ అనే పేరు అర్వాచీనమని పేర్కొన్నారని స్పష్టమౌతుంది. ఆదిఆంధ్రుడు అనిపేరు పెట్టడంలో ఈదేశమూలవాసులను స్పురింపజేస్తూనే, దళితుల ఆత్మగౌరవాన్ని నినదించే ప్రయత్నంగా కనిపిస్తుంది.

‘‘వసుచరిత్ర’’ ప్రబంధకారుడు శుభమూర్తిపై ఆచార్య ఇనాక్ గారు చేసిన మరో మౌలికమైన పరిశోధన. ఇది పరిశోధన గ్రంథమైనా, విమర్శక దృక్పథం ఉండటం వల్ల దీన్ని పరిశోధనాత్మక విమర్శ గ్రంథంగా పిలవడం సమంజసం. పరిశోధనలో సాధారణంగా అన్వేషణ, ఏదైనా ఒక కొత్తవిషయాన్ని బయటపెట్టడం, సిద్ధాంతాన్ని స్థాపించడం లేదా ఒక విషయాన్ని సూత్రీకరించడం ముఖ్యం. వీటిలో అంతర్భాగంగానే కనిపిస్తున్నా, గుణ,దోష విశ్లేషణ, నిర్ణయ ప్రకటన విమర్శలో ప్రధానంగా చూడాలి.

పరిశోధనలో కనిపించే  అన్వేషణ, సమాచార సేకరణ విమర్శలో అంతగా కనిపించవు. లభించిన సమాచారాన్ని విశ్లేషించి, తులనాత్మకంగా పరిశీలించి, తనదైన దృష్టితో వ్యాఖ్యానించి, అది గుణమో, దోషమో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం విమర్శస్వభావం. ఈ రెండు స్వభావాలు సంతరించుకుంటే దాన్ని పరిశోధనాత్మక విమర్శ అనొచ్చు. అలా రెండు లక్షణాల్ని సంతరించుకున్న గ్రంథం ‘‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’’(1996). తన పేరు శుభమూర్తి, మూర్తికవి అని ‘వసుచరిత్ర’ కారుడు చెప్పుకున్నా, అతణ్ణి ‘‘భట్టుమూర్తి’’, ‘‘రామరాజభూషణుడు’’ అని నాటి నుండి నేటి వరకూ పండితలోకం పిలవడంలో ఒక శూద్రుణ్ని కవిగా గాని, అతని పేరుతో గాని పిలవడానికిష్టపడని వర్ణాధిక్యాన్ని సోదాహరణంగా నిరూపించారు. శుభమూర్తిలో కవిలోకం పట్ల దళిత, బహుజనులు అలవరుచుకోవలసిన ప్రతిఘటన చైతన్యాన్ని గుర్తించేలా గ్రంథాన్ని సాధికారికంగా రాశారు.

పరిశోధనాత్మక స్పర్శతోనే  రాసిన మరో విమర్శ గ్రంథం ‘‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం’’ (1996) తెలుగు వ్యాసం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే, ఈ రంగంలో చేసిన ఇనాక్‌ గారి వ్యాసపరిణామాన్ని ఎలా పేర్కొంటారో, అలాగే ఆధునిక సాహిత్యాన్ని విమర్శించేందుకున్న నూతన సూత్రాల్ని ప్రతిపాదించిన ఈ గ్రంథాన్నీ పేర్కొనదగిన పుస్తకం. మార్క్సిజం గాని, కేవల మానవతావాదంతో గాని విమర్శించడానికి వీల్లేని పూర్తి దేశీయ విమర్శ పద్ధతిలో మాత్రమే విమర్శించదగినది దళితసాహిత్యం. తాను దళితసాహిత్యంపై పరిశోధన చేస్తూ, విద్యార్థుల చేత కూడా చేయిస్తూ వస్తున్న క్రమంలో వెలువడిన ఆణిముత్యాల్లాంటి విమర్శపద్ధతుల్ని ప్రతిపాదించారు. సాహిత్యవిమర్శకు తెలుగు సాహిత్యం అందించిన మహోన్నత వారసత్వసంపదగా దీన్ని చెప్పుకోవచ్చు.

సాహిత్య విమర్శలో ఆంగ్లేయుల ఇమేజినేషన్‌ నే తనదైన పద్ధతిలో చెప్పి, దానికి సామాజిక కోణాన్ని అందించి కట్టమంచి రామలింగారెడ్డి విమర్శకు ఆధునికతను ఇచ్చాడు. మళ్ళీ విమర్శకు అంతటి గౌరవాన్నిచ్చిన పరిస్థితి ఆచార్య ఇనాక్‌ గారికే చెందుతుంది. మార్క్సిజంలోని ఆర్థికాంశాల్ని, దేశీయతాభూమికతో రూపొందిన అంబేద్కర్‌ కులనిర్మూలనా చైతన్యాన్నీ మేళవించి సాహిత్యాన్ని సమన్వయించినప్పుడే స్త్రీవాద, దళిత సాహిత్య విలువల్ని శాస్త్రీయంగా అంచెనా వేయగలమని నిరూపించారు. అంతవరకూ చర్చలో కొచ్చిన వస్తు, రూపాలు, నిబద్ధతలతో పాటు నిమగ్నత, నిబిడితలను ప్రతిపాదించారు. తాను రాసే రచనల్లోని జీవితానికి వ్యతిరేకమైన జీవితం ఉంటే రచయితకు నిబద్దత ఉన్నట్లు కాదు. రాసే వస్తువుతో తాదాత్మం చెందడమనే నిమగ్నత సాహిత్యానికి విలువల్ని అందిస్తుంది. తాను రాసే వస్తువుకీ, తన జీవితానికీ అవినాభావ సంబంధమున్నట్లైతేనే నిబిడితతో కూడినట్లవుతుంది. ఈ మూడు లక్షణాలు సమ్మేళనంతో సాహిత్య విమర్శ చేయడమనేది ఇనాక్‌ గారితోనే ప్రారంభమైంది. ఆ సూత్రమే ప్రధానకేంద్రంగా స్త్రీవాద, దళిత సాహిత్య విమర్శ చేయగలిగితేనే అది శాస్త్రీయమైన విమర్శపద్ధతి అవుతుంది. లేకపోతే స్త్రీవాద, దళిత సాహిత్యాల్ని సంస్కరణ, మానవతావాద, మార్క్సిస్టు పద్ధతుల్లో విమర్శించించినట్లే అవుతుంది.

ఇలా పరిశోధనలోను, విమర్శలోను ఒక మైలురాయిగా నిలవదగిన స్థాయిలో కృషిచేసిన ఇనాక్‌ గారు సృజనాత్మక సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగులో చక్కని, చిక్కని, చిన్న చిన్న వాక్యాల్లో అందంగా రాయడమెలాగో తెలుసుకోవాలంటే ఇనాక్‌గారి వచన రచన చూడాల్సిందే. సృజనాత్మక రచనల్లో మునివాహనుడు, ఊరబావి, తలలేనోడు, కులవృత్తి వంటి రచనలు ఆయన మాత్రమే రాయగలరనిపిస్తుంది.. ఇలా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారి సాహిత్యాన్ని లోతుగా విశ్లేషించుకుంటేనే ఆయన సాహిత్య తత్త్వం వెల్లడవుతుంది. ప్రధానజీవన స్రవంతికి దూరంగా జీవిస్తున్న దళితుల్లో ఆత్మగౌరవాన్ని రగుల్గొల్పడం ఆయన సాహిత్యంలో గుర్తించాల్సిన అత్యంత ముఖ్యమైంది. అది కథలు, నాటకాలు, కావ్యాలు, కవితలు, వ్యాసాల ద్వారానే కాకుండా చక్కని ఉపన్యాసం ద్వారా కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగారు.

ఆధారాలు:

1. ఆచార్య కొలకలూరి ఇనాక్‌  షష్టిపూర్తి సన్మాన సంచిక, 1999

2. ఇనాక్‌, కొలకలూరి. తెలుగు వ్యాసపరిణామం. 1980

3. ఇనాక్‌, కొలకలూరి.ఆదిఆంద్రుడు . హైదరాబాద్‌: జ్యోతి గ్రంథమాల. 2008

4.యాగాటి చిన్నారావు, ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర’ ,  హైదరాబాదు బుక్ ట్రస్టు, 2007[1] ఆచార్య కొలకలూరి ఇనాక్‌  షష్టిపూర్తి సన్మాన సంచిక, 1999:25

[2] తెలుగు వ్యాసపరిణామం 1980: 172

[3] ఆరుద్ర, సమగ్ర ఆంధ్రసాహిత్యం రచనను ఇలా మొదలు పెట్టారు. ‘‘ అనగనగా ఒక ఈగ ఇల్లలుక్కొంటూ తన పేరు మరిచిపోయిందట.‘ పేదరాశి పెద్దమ్మ! పేదరాశి పెద్దమ్మ కొడుకా! కొడుకు చేతి గొడ్డలీ!.. నాపేరేమిటి? అని ఎందరెందరినో పేరు పేరునా వరసపెట్టి అడిగిందట.. ‘‘ సమగ్ర ఆంధ్రసాహిత్యం (తొలిముద్రణ,) సికింద్రాబాదు: యం.శేషాచలం అండ్‌ కంపెనీ, 1965:1

[4]సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం. ( వివరణ కర్త). కావ్యాలంకార సంగ్రహం, సికింద్రాబాదు:యం.శేషాచలం అండ్‌ కంపెనీ, 1976:123

 

[5] ఆదిఆంద్రుడు 2008 : 14

[6] ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర’  2007: 74

[7] ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర, 2007: 114

 – డాక్టర్  దార్ల వెంకటేశ్వర రావు

149210_460277764346_7996594_n

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)