ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ…

 13 - 1 (5)
రేపటిరోజున ప్రేమికులంతా కలసికట్టుగా జాతిమత ఖండాంతర బేధాలను మర్చిపోయి వేలంటైన్స్ డే జరుపుకుంటారు. నిరసనలూ, వ్యతిరేకోద్యమాల సంగతి ఎలా ఉన్నా; రేపే కాక ఈ నెలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేమ పండగ జరుపుకుంటారు ప్రేమికులు. ఈ పండుగని వారంతా అత్యంత వైభవంగా జరుపుకోవడానికి టివీలు, ఎఫ్.ఎం లూ, గ్రీటింగ్ కార్డ్ షాపులూ, ఇంటర్నెట్ అన్నీ కూడా వాటి వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తాయి. అందుకని ఇవాళ మనం కూడా కొన్ని ‘ప్రేమభరితమైన యుగళగీతాలను’ వినేసి ప్రేమా జిందాబాద్ అనేద్దాం! ఈ సిరీస్ ముఖ్యంగా పాత పాటల మీద కాబట్టి, ప్రేమ గురించి ఆనాటి సినీకవుల భావాలెలా ఉన్నాయో వినేద్దామా.. 
 
 
ఒకప్పుడు పాటల్లో ప్రేయసీప్రియులు ”నువ్వూ నేనూ ఒకటి’,”నీ కోసం నేను’,”నాలోకమే నీవు’ అనేవారు. ప్రేయసి నవ్వులను మెరుపులతో, ప్రేయసిని పువ్వులతో పోల్చేవారు ఆనాటి కవులు.  కాలమేదైనా ప్రేమభావన ఒక్కటే కాబట్టి అది అలానే ఉన్నా, మనుషుల మనసుల భావాల్లోనే తేడా కనబడుతోంది. ఆ భావానుగుణంగా పాటల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్తతరం ప్రేమపాటల్లోని ఉపమానాలు చెప్పే సాహసం చెయ్యను కానీ పాత పాటల్లోని మధురిమల్ని గుర్తు చేసే ప్రయత్నం మాత్రం చేస్తాను. 
 
 
“ఓదార్పు కన్న చల్లనిది… నిట్టూర్పు కన్న వెచ్చనిది… గగనాల కన్న మౌనమిది..” అని ప్రేమ గుణాలను వర్ణిస్తూ “పూలెన్ని రాలిపోతున్నా పులకించు ఆత్మగంధమిది..” అని ముక్తాయించారొక పాటలో వేటూరి. అంతటి ఉదాత్తమైన ప్రేమ భావన తమ హృదయాలలో జనించగానే కలిగే పులకింతలూ, గిలిగింతలు, గుండెల్లో గుబులు గురించి తెలియజేసే యుగళగీతాన్నొకదాన్ని విందాం ముందుగా…
 
ఏమో ఏమో ఇది.. నాకేమో ఏమో అయినది..
(చిత్రం: అగ్గిపిడుగు, రాజన్ నాగేంద్ర, నారాయణరెడ్డి)
 
 
అలా పులకరింతల్లో తేలిపోయాకా ప్రేయసి ప్రియులిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరి నిలిచిపోవాలని తహతహలాడతారు.. కలలుకంటారు. “వాగ్దానం” చిత్రంలోని “నా కంటిపాపలో నిలిచిపోరా.. నీ వెంట లోకాలు గెలువనీరా..” అనే కథానాయిక కల పాట ఆ కోరికలేమిటో తెలుపుతుంది..
 
 
 
ప్రేమకి పునాది చెలిమి ఐతే, ఆ చెలిమి బలిమిగా మారి ఇద్దరు యువతీయువకుల మనసుల్లో మధురమైన రాగాలను పలికిస్తుంది.  ఆ రాగాలు పలికించే ఆలాపనేమిటో,  అది ఆ రెండు జీవితాలనూ శృతి చేసే ఆరాధనగా మారితే గుండెల్లో వినబడే మధురగీతమేమిటో తెలుసుకోవాలంటే “మౌనగీతం” చిత్రంలోని ఈ పాట వినాల్సిందే! డబ్బింగ్ సినిమాల్లో కూడా తెలుగుతనం పోని విధంగా సాహిత్యాన్నందుకున్న పాటల కాలమది.
 
“చెలిమిలో వలపు రాగం.. వలపులో మధురభావం
రాగం భావం కలిసే ప్రణయగీతం పాడుకో…”
 
 
“మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది?
తోటలో ఏముంది నా మాటలో ఏముంది?
ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది?”
అంటూ ప్రశ్నలు వేస్తూ వేస్తూ.. కథానాయకుడితో “నేనులో నీవుంది నీవులో నేనుంది..” అనిపించగలిగిన గడసరి ‘లక్షాధికారి’ చిత్రంలో కథానాయకురాలు. ఇటువంటి పాటే మనకు ‘ఆకలిరాజ్యం’ చిత్రంలో కనబడుతుంది.  ఆ పాటలో కూడా ప్రియుడితో చివరకు “నేను నీవనీ..అన్నా.. మనమే కాదా..” అనిపిస్తుందా కథానాయిక. రెండూ పాటల్నీ కూడా మోస్ట్ రొమాంటిక్ డ్యూయెట్స్ అనవచ్చు!
 
ఇప్పటి సినీనాయికలు చనువు గా ‘నచ్చావురా…’, ‘ఒరేయ్..’, ‘ఏరా..;, ‘వాడు’…అని సంబోధిస్తూ పాడేస్తున్నారు కానీ పాపం పాత పాటల్లో నాయికలు ప్రియుడిని ‘స్వామీ’ అంటూ ఎంతో గౌరవాన్ని కూడా ఇచ్చేవారు. “గులేబకావళి కథ” చిత్రంలో “నన్ను దోచుకొందువటే ..” పాటలో నాయకుడు “ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు… కలకాలం వీడని సంకెలలు వేసినావు” అని చనువిచ్చినా, నాయిక మాత్రం “కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ.. నిన్నే నా స్వామీ” అంటూ అతనిపై తనకున్న ప్రేమతో పాటూ తన గౌరవాన్ని కూడా తెలుపుతుంది .
ప్రేమికులకు ఒకరిపై ఒకరికి అనురాగం తో పాటూ నమ్మకం కూడా పుష్కలంగానే ఉంటుంది. అలాంటి గట్టి నమ్మకంతోనే ఓ చెలి “నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే… పూవులేక తావి నిలువలేదులే.. ” అని పాడుతుంది. ఆ అబ్బాయి మాత్రం తక్కువ తిన్నాడా.. ఏ మాత్రం తొణక్కుండా “తావి లేని పూవు విలువ లేనిదే… ఇది నిజములే..  నేను లేని నీవు లేనెలేవులే…” అంటాడు! పరస్పరాభిమానాలూ, ఇరు వైపులా ఒకరిపై ఒకరికి ఇలాంటి ఎనలేని నమ్మకముంటేనే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది.
రెండు మనసులు ఒకటైయ్యాకా ఇక ఒకరికొకరు ఇచ్చుకునేందుకు ప్రత్యేకమైన బహుమతులేముంటాయి? 
“ఏమివ్వను నీకేమివ్వను 
నా మనసే నీదైతే ఏమివ్వను..” 
అని అమ్మాయి అంటే,
“ఏమడుగను ఇంకే మడుగను 
నీ మనసే నాదైతే ఏమడుగనూ?” అంటాడు అబ్బాయి.
ఇలా ఒకరైపోయాకా ఒకరిలో ఒకరు కలిసి కరిగిపోవడం తప్ప ఇచ్చిపుచ్చుకునేందుకేం మిగులుతాయి..?!
ఈ పాటలో “నిన్నే వలచి నీ మేలు తలచి 
బ్రతుకే నీవై పరవశించు చెలినీ..నీ జాబిలినీ..” అనే వాక్యాలు నాకు భలే నచ్చుతాయి.
ప్రేమగీతాలనగానే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పాట పూజ చిత్రంలోని ఈ గీతం…! వాణిజయరాం స్వరం ఈ పాటలోని మరో ప్రత్యేకత.

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ…
ప్రేమకథా చిత్రాలు తీయడంలో ప్రత్యేక ఒరవడిని సృష్టించిన జంధ్యాల తన సినిమాలన్నింటిలో సంగీతానికి పెద్ద పీట వేసారనే చెప్పాలి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆయన చిత్రాల్లోని పాటలు ఉదహరించాలంటే పెద్ద వ్యాసం రాయాలి.  శ్రీవారికి ప్రేమలేఖ లో “లిపి లేని కంటి బాస.. తెలిపింది చిలిపి ఆశ/ నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవితల లేఖలలో”
బాబాయ్ అబ్బాయ్ లో “తెలుసా…నీకు తెలుసా”.., మల్లె పందిరిలో “కదిలే కోరికవో”, చిన్నికృష్ణుడు లో “మౌనమే ప్రియా ధ్యానమై” ఇలా చెప్పుకుపోతే జాబితాకు అంతులేదు. 
 
రెండుపాటల్ని మాత్రం ఈ వ్యాసంలో తప్పక చెప్పాల్సినవి ఉన్నాయి. ఒకటి ముద్దమందారం చిత్రంలో “అలివేణీ ఆణిముత్యమా..” ! బాలు, జానకీ కూడా అద్భుతంగా పాడాలని పోటీలు పడి పాడారేమో అనిపించేలా ఉంటుందీ పాట. గుసగుసలాడుతున్నట్లుగా ఉండే జానకి స్వరం సన్నివేశానికీ, నాయికకూ అతికినట్లుగా ఎంత బాగా నప్పేసిందో వర్ణించలేము. రమేష్ నాయుడు సంగీతం కూడా మిన్నే!
ఇంకా..ఈ పాటలో “ఆవిరి చిగురో..ఇది ఊపిరి కబురో…” అని వేటూరి మాత్రమే రాయగలిగిన సాహిత్యం ఈ గీతాన్నొక పొగడపూల మాలగానే తయారు చేసేసాయి..
 
 
జంధ్యాల చిత్ర గీతాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ప్రేమ గీతం నాలుగు స్థంభాలాటలోని “చినుకులా రాలి…”! ఈ ట్యూన్ ఒక కన్నడ బాణీకి రీమేక్ అంటారు. హిందీలో “ఐసీ దీవాన్గీ..దేఖీ నహీ కహీ..” అనే షారుఖ్ ఖాన్ పాటకు ఈ పాట పల్లవి ట్యూన్ వాడుకున్నారు. 
 
“చినుకులా రాలి.. నదులుగా సాగి/ వరదలైపోయి, కడలిగా పొంగు.. 
నీ ప్రేమ, నా ప్రేమ / నీపేరే నా ప్రేమ..”

“హిమములా రాలి.. సుమములై పూసి
ఋతువులై నవ్వి.. మధువులై పొంగు.. నీప్రేమ నా ప్రేమ..”
 
“మౌనమై మెరిసి /గానమై పిలిచి /కలలతో అలసి /గగనమై ఎగసి../ నీ ప్రేమ, నా ప్రేమ..”
 
అసలు ఈ పాటలో  ఏ వాక్యాలు కోట్ చెయాలో తెలీదు. అంత అందమైన సాహిత్యాన్నందించారు వేటూరి. ప్రేమగీతాల గురించి చెప్పుకునేప్పుడు తప్పనిసరిగా గుర్తుచేసుకోవల్సిన గీతమిది! 
 
 
 
“నీ కళ్ళలో తొంగి చూడనిదే నిదురేది ఆరేయి నా కళ్లకు
నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ..
ఊపిరిలో ఊపిరిలా.. ఒదిగేదే మన ప్రేమా..
కలనైనా.. క్షణమైనా.. మాయనిదే మన ప్రేమ… మన ప్రేమ”
 
ఇది కదూ ప్రేమభరితమైన తీయని యుగళగీతం…
 
“రాధా కల్యాణం” చిత్రంలోని ఈ మధురమైన గీతాన్ని వినపించకుండా ఈ వ్యాసం పూర్తవ్వగలదా…! కె.వి.మహాదేవన్ సంగీతం.. పాట మధ్యలో వచ్చే వయోలిన్ బిట్స్ పాటకు ప్రాణం పోస్తాయి. వినేయండి మరి..
 
 
 
(మరో నేపథ్యంతో మళ్ళీ కలుద్దాం మరి…)
raji– తృష్ణ
Download PDF

6 Comments

  • kv ramana says:

    చాలా థాంక్స్ తృష్ణ గారూ…మీ వ్యాసం బావుంది. మీ పుణ్యమా అని మీరు చెప్పిన పాటల్తోపాటు పొద్దుటే మరి కొన్ని పాత పాటలు విని ఆనందించాను. అప్పుడప్పుడు పాటపాటలను గుర్తుచేస్తున్నందుకు మీకు అభినందనలు.

  • venkatrao.n says:

    “నీ కళ్ళలో తొంగి చూడనిదే నిదురేది ఆరేయి నా కళ్లకు…. మీకు అభినందనలు.

  • దుగ్గిరాల శ్రీశాంతి says:

    కాలంతో పాటు ముందుకు వెళ్ళే మనం ఈవిధంగా అప్పుడప్పుడూ వెనకటి కాలానికి వెళ్ళి ఆనాటి ఆణిముత్యాలను తలచుకోవడం మనసుకు తృప్తిగా ఉంది. ధన్యవాదాలు తృష్ణగారు.

Leave a Reply to తృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)