గుర్తింపు గోల పెట్టుకుంటే చేయవలసినవి చాలా చేయలేము : జలంధర

jalandhara2

Jalandhara Garu

 

   ఉదాత్తత అన్నదానికి నిర్వచనం చెప్పే రచనలు ఆమెవి.   70 ల నుంచీ  రాస్తూ   కూడా ఎంతో కాలం’ లో  ప్రొఫైల్   ‘ లో  ఉన్న రచయిత్రి జలంధర గారు.కథలలో, వ్యాసాలలో,  నవలలలో ,-అన్యాపదేశంగా ఆమె అన్న మాటలు జీవన సూత్రాలుగా నిలుపుకొని ఎదుగుతూ వచ్చిన అభిమానులూ ఆప్తులూ ఎక్కువ  మందే ఉన్నా, మొదటి కథల సంపుటి 2003 లో గాని వెలువడలేదు.  చాలా రచనలు ఇప్పటికీ పుస్తక రూపం లో రానేలేదు. తన రచనల గురించి శ్రద్ధే లేని ఈ రచయిత్రి గొప్ప చదువరి.  సాహితీ లోకం లో సజీవ స్త్రీ మూర్తులు అని ఒకప్పుడు ‘ వనిత ‘ పత్రిక లో మొదలైన వ్యాసాల పరంపర వెబ్ మాగజైన్ లు వచ్చిన కాలం లో తిరిగి కొనసాగింది. ఆ ప్రసిద్ధ రచయితల, రచయిత్రుల పాత్రలని విశ్లేషించేటప్పుడువిశ్వనాథ వారి చెలియలికట్ట లో రత్నావళి దగ్గరనుంచి చండీదాస్ గారి హిమజ్వాలలో గీతా దేవి వరకు  ఆమె చూపిన ఆప్తత,  విశాలత్వం ఎన్నదగినవి, అరుదైనవి .

2(1) 2013 లో వచ్చిన ‘ పున్నాగ పూలు ‘ నవల ద్వారా అధిక సంఖ్యాకులకి తెలిశారు, అతి అవసరమైన సమయం లో వెలువడిన రచన అది. ఆలోచించటమూ దిద్దుకోవటమూ ఇలా ఉంటాయని, ఉండాలని పాఠాలు చెప్పినట్లు నేర్పించిన నవల. ఆ నేపథ్యం లో ఒక్కసారిగా ఆమె కౌన్సిలర్ గా మారవలసీ వచ్చింది. ఆమె రచయిత్రిగా  ఒకప్పుడు అన్వేషి, ఆ పైన తాత్వికురాలు, దార్శనికురాలు. తెలుసుకున్నదాన్ని ఇప్పుడు తను మాత్రమే చెప్పగలిగిన తీరులో చెప్పి చేయగలిగినంతా చేస్తూ ఉన్నారు.  రెట్టించి అడిగితే మాత్రం  ‘ నా మొహం ‘ అని నవ్వేస్తారు .   

      ఇంట్లో అల్మైరా లకి తాళాలు వేసుకుంటే సాటి మనుషులని అవమానించినట్లే అనే సత్యకాలపు తండ్రి డాక్టర్ గాలి బాల సుందర రావు గారు. మద్రాస్ లో పేరు మోసిన వైద్యులు, అప్పటి సాహిత్య కారులందరికీ దగ్గరి వారు.  మేనత్త ‘ లత ‘ గారు కొన్ని దశాబ్దాల సేపు  తెలుగు సాహిత్యాన్ని ఊపిన ప్రభంజనం. చాలా తక్కువ మందికి దొరికే  అద్భుతమైన ‘ ఎక్స్ పోజర్ ‘  జలంధర గారికి  అందింది. బహుశా దాన్ని పూర్తిగా, సక్రమంగా ఉపయోగించుకోవటం వల్లనే ఆవిడ మొదటి రచనలు కూడా  ప్రత్యేకమైన పరిమళంతో ఉంటాయి.

ఆ  పుష్య మాసపు  మధ్యాహ్నం లో  మద్రాస్ కూడా చల్లగానే ఉంది . కోడంబాకం లో వారి ఇల్లు వెతుక్కుంటున్నప్పుడు అడుగడుక్కీ ఫోన్ చేసి సూచనలు ఇస్తూనే ఉన్నారు. తీరా వెళ్లేసరికి అక్షరాలా వీధి లో నిలుచుని ఉన్నారు మా కోసం. అడవి బాదం, మామిడి చెట్లు గుబురుగా పెరిగిన ఆవరణ హాయిగా ఉంది. ఎగువ మధ్య తరగతి లో కొంత సంపన్నులయినవారిది  లాగా ఉంటుంది ఆ ఇల్లు, ఒక ఫిలిం స్టార్ నివాసమని అనిపించదు. [ఆమె భర్త ప్రసిద్ధ సినీ నటులు చంద్రమోహన్ గారు ]

 అతిథి మర్యాదలూ యోగక్షేమాలు తెలుసుకోవటమూ అయిపోయాక ఆవిడ అనర్గళంగా మాట్లాడారు. సాహిత్యం,  అందులోంచి నేర్చుకుని జీవితానికి అన్వయించుకోవటం, పక్క మనిషి కి చూపవలసిన అక్కర, ఆ కాస్తా  లేక మూసుకుపోతున్న ద్వారాలు…ఇంకా చాలా చాలా.

         సోమర్సెట్ మాం  రాసిన ఒక కథ పూర్తిగా చెప్పారు ఆవిడ మా అందరికీ. ప్రేమ లోంచి వచ్చే హద్దుమీరిన  పొసెసివ్ నెస్   మనిషికి  ఎంత ప్రమాదకరమో  కత్తి వేటు లాగా చెప్పిన కథ అది. ఆయనదే ‘ థియేటర్ ‘ నవలిక గురించీ వివరంగా చెప్పుకొచ్చారు. అందులోని విషాదపు చమత్కారం విప్పుతూ నవ్విన నవ్వు మాకు చదువు నేర్పింది.. శరత్ గురించి చెబుతూ సుతి మెత్తన అయిపోయారు. పార్వతి పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక దేవదాస్ కి తాగుడు బాగా అలవాటయిపోతుంది కదా. ఆ సమయం లో పుట్టింటికి వచ్చిన పార్వతి అడుగుతుంది ‘ తాగటం మానేయకూడదా ‘ అని. అతను అంటాడు ‘ ఈ రాత్రి నాతో లేచి వచ్చేస్తావా ‘ అని. ఆమె అన్నారు ‘ ఎన్నిసార్లో ప్రయత్నించాను, ఆ పేజీ దాటి ముందుకి చదవలేకపోయాను. ఎంత బాధ, కడుపు దహించుకుపోయేలా …నా వల్ల కాదు ”  దుఃఖంఆమె గొంతు నిండా. ఆ చలించిపోయే లక్షణం ఎవరికీ సుఖాన్నిఅయితే ఇవ్వదు, ఇంకేమి ఇవ్వగలదో ఆమెని చూస్తే తెలుస్తుంది.

సాంత్వన చీమలమఱ్ఱి ,   నేను  కలిసి సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితా అలా లోపలే ఉంది. ఆఖర్న చూసుకుంటే ఒకటి రెండు తప్ప అన్నిటికీ జవాబులు వచ్చేశాయి… అదనంగా వచ్చినదెంతో కొలత లేదు.

ఆమె మాటలని రికార్డ్ చేయనూ లేదు. ” పర్వాలేదు, అమ్మకి గుర్తుంటుంది ” అన్నారు ఆమె సాంత్వన తో.

jalandhara2

Q మీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పండి.

—. -ఊహ తెలిసినప్పటినుంచీ ఇంట్లో కవులూ రచయితలూ కనిపిస్తూ ఉండేవారు. కృష్ణశాస్త్రి గారు, కొడవటిగంటి కుంటుంబరావు గారుబలిజేపల్లి లక్ష్మీకాంతం గారు  , వంటివారు తెలిసేవారు కాని అందరూ కాదు. వెనక్కి చూసుకుంటే చాలా ప్రసిద్ధులైన సాహిత్య వేత్తలని  దగ్గరగా చూశానని అర్థమవుతుంది.

మా అత్తయ్య లత గారు, నాన్నగారు డా.గాలి బాలసుందర రావు గారు పుస్తకాలలో పాత్రల గురించి గంటల తరబడి వాదించుకుంటూ పోట్లాడుకుంటూ రాత్రులకి రాత్రులు గడిపేస్తూ ఉండేవారు. ఛార్లెస్ లాంబ్, మేరీ లాంబ్ ల లాగా అన్నమాట. [నవ్వు] వాళ్లకి కాఫీలు పెట్టి ఇస్తూ బజ్జీలు వేసి పెడుతూ భయం భయంగా తిరుగుతూ ఉండేదాన్ని. రాయగలనని, రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అంత నిర్దాక్షిణ్యం గా నిగ్గు తేల్చేమా వాళ్ల   విమర్శలు వింటే ధైర్యం చాలేదికాదు.  ఒకసారయితే ఏదో రాయబోతున్న నన్ను నాన్నగారు చాలా అర్థవంతం గా హెచ్చరించారు, ముందు చెప్పదగిన విషయాలేవయినా నేను తెలుసుకుని ఉండాలని. ఎవరైనా రాయమంటేనే గాని రాయకూడదని నిర్ణయించుకున్నాను.  ఆ పద్ధతి ఇప్పటికీ ఉంది, ఎవరైనా అడిగితేనే గాని రాయను. కాలేజ్ లో లెక్చరర్ విద్యుల్లతా రెడ్డి గారి ప్రోత్సాహం తో రాసిన కథ చివరికి నీలం రాజు వెంకట శేషయ్య గారు ఎడిట్ చెస్తూ ఉన్న ఆంధ్రప్రభ లో పడింది. బల్ల మీద ఉన్న కథని చదివి పట్టుకెళ్లి వేశారు ఆయన.ఎడిటర్స్ అంటే చాలా చాలా గౌరవం నాకు. వాళ్లు లేకపోతే రచయితలు లేరు. విశాలాంధ్ర వాళ్లు వేసిన కథా సంపుటిని నా ఎడిటర్స్ అందరికీ అంకితం ఇచ్చాను.

తెలుగు లో నవలా సాహిత్యం పుష్కలంగా వస్తూండే కాలం లో కొడవటిగంటి కుటుంబరావు గారు ” నవల రాస్తే మనం చెప్పదలచుకున్నది వందల పేజీలలో ఎక్కడైనా చెప్పవచ్చు. కథ రాయటమే చాలెంజ్. కథ జీవితానికి క్రాస్ సెక్షన్. దాన్ని మైక్రోస్కోప్ కింద పెడితే సర్వం అర్థమవాలి  ” అనేవారు. ఆ మాటలు నాకు కథ పట్ల ఆకర్షణని ఇచ్చాయి. నేను రాయటం ప్రారంభించాకా ఆయన అన్నారు , ”వంద కథలు దాటితేగాని నవల రాయకూ’  అని.

కృష్ణశాస్త్రి గారు ప్రతి పదానికీ రంగు, రుచి, వాసన ఉంటాయని అనటం జ్ఞాపకం. ” నిండు వెన్నెల, పండు వెన్నెల…ఈ రెండు మాటలూ ఎంత వేరో చూడు ” అని ఒకసారి.

Q ఏ రచనలు ఇష్టం ? ఎవరివి ఎక్కువ చదివారు?

letters from a stoic చదవటమయితే ఇవీ అవీ అని లేకుండా ఎక్కువే చదివాను.  సోమర్ సెట్ మాం, ఆస్కార్ వైల్డ్, బెర్నార్డ్ షా, అయాన్ రాండ్  … బాగా ఇష్టం . శరత్ సవిత , టాగూర్ చారులత, వినోదిని . లత, చలం, విశ్వనాథ , అడివి బాపిరాజు , ఇంకా కొందరు. ఒక రచయిత నచ్చటం అంటే వారు చెప్పిన అన్నీ ఒప్పుకుంటామని కాదు. కొన్ని విషయాలు కొందరు బాగా చెప్పగలరు.

ఇటీవలి కాలం లో లూయీస్ హే రాసినవి చాలా నచ్చుతున్నాయి. ఆమె చెప్పినవి సాధన చేస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుందనిపిస్తోంది. ఇప్పుడు ‘ Letters from a stoic ‘అని Seneca   గురించిన పుస్తకం చదువుతున్నాను. చాలా బావుంది.

Q  కవిత్వం చదువుతారా?

చిన్నప్పుడు చదివేదాన్ని. వర్డ్స్ వర్త్ ‘ డాఫోడిల్స్ ‘ చాలా ఇష్టం. బైరన్ ‘ ద ఒషేన్ ‘ కూడా. ఆదూరి సత్యవతీ దేవి గారి కవిత్వం, ఎన్.గోపి గారిది, కొన్ని స్త్రీవాద కవితలు నచ్చుతాయి.

Q మీ శైలి , ఇమేజరీ చాలా అందమైనవి- ఎప్పుడూ కవిత్వం  రాసే ప్రయత్నం చేయలేదా?

లేదు. చేతకాని పనికి ఎందుకు పూనుకోవటం [ నవ్వు ] ? గొప్పగా రాసేవారు అంతమంది ఉండగా. పోయిట్రీ ని  కూడా దానినుంచి నేను ఏమి నేర్చుకోగలిగానో అందుకే ఇష్టపడతాను.

 

Q రచన ప్రయోజనం ఏమిటి? మీ రచనలు దాదాపు అన్నిటిలోనూ ముగింపు పరిష్కారం వైపు ఉంటుంది. అలాగ అవసరం అంటారా? డాటా ఇచ్చి వదిలేయచ్చా?

పరిష్కారాన్ని కనుచూపుమేరలోనయినా చూపించని రచనల పైన నమ్మకం లేదు. ఇక్కడ పరిష్కారం అంటే ఒక పాజిటివ్ ఆలోచన కూడా కావచ్చు. భావుకతలో ముంచెత్తే వాటికన్న జీవితం లో ఒక సమస్యేదో ఎదురైనప్పుడు స్ఫూర్తి అడిగి తెచ్చుకోగల సాహిత్యమంటే గౌరవం. సాహిత్యం టానిక్ లాగా పని చేయాలి, మత్తు మందులాగా కాదు. మంచి పుస్తకంఆలోచించటాన్ని నేర్పాలి.

Q సాహిత్యానికి సద్యః ప్రయోజనం ఉండాలా? కాలాంతరాలలో అక్కరకి రావాలా?

రెండు రకాలు గానూ సత్సాహిత్యం పనిచేయగలదు. ఒక్కొక్క రచన ఒక్కొక్కలాగా.

Q కొన్ని సాహిత్య ధోరణులని ఉద్దేశించి ఈ ప్రశ్న .ఆలోచనలకి  నియంత్రణ అవసరమా? నాకిలా అనిపిస్తోంది, కనుక చేయచ్చు అనటం సరయినదేనా?

మా రోజులలో కొన్ని విషయాలు ఊహకే అందేవి కావు. మమ్మల్ని మేము అలా అనుకోకుండానే నియంత్రించుకున్నాము. అన్నీ అందుబాటులో ఉన్న, ఏదయినా చేసేయగలిగిన ఈ రోజులలో వివేచన ఇంకా ఎక్కువ అవసరమేమో. ఒక పని చేస్తున్నప్పుడు దీని వలన నాకు శాంతి వస్తుందా, నాతో   భౌతికంగానో ఎమోషనల్ గానో జీవితం పెనవేసుకున్నవారిపట్ల సరిగ్గా ఉందా అని తర్కించుకోవటం అవసరం. సీత వేషం వేసి ద్రౌపది డైలాగ్ లు చెబితే నాటకం రసాభాస అవుతుంది. జీవితం కూడా అంతే.. సుఖం కోసం శాంతిని తాకట్టు పెట్టకూడదు.1(1)

Qఆ హద్దు ఎవరు నిర్ణయిస్తారు?

ఎవరికి వారే. దేశ, కాల,పాత్ర,  దేహ ధర్మాలని అనుసరించాలి. ఒక కాలంలో, ఒక దేశం లో, ఒక వ్యక్తికి తప్పు కానిది మరొకప్పుడు, మరొక చోట, మరొకరికి హాని చేయచ్చు    డివైన్ లా, నాచురల్ లా, హ్యూమన్ లా ఇలా మూడు విధాలు. ఒకరు మరొకరిని చంపేస్తే అది హత్య. నలుగురైదుగురు కలిసి చేస్తే దొమ్మీ. చాలా మంది కలిసి చేసే అదే పని ఒక ‘ కాజ్ ‘ కోసం అంటారు. ఒక జాతి మొత్తమూ అటువంటి పని చేస్తుంటే దాన్ని ‘ సివిల్ వార్ ‘ అంటున్నాం. చట్టం , న్యాయం ఇలా వేర్వేరు పరిధులలో పని చేస్తాయి. హ్యూమన్ లా ఎప్పుడూ సంఖ్యాబలం మీదే ఆధారపడుతుంది. అది మంచా చెడా అని చెప్పటం కష్టం.

Q  ధర్మం, నీతి  అనేవి సాపేక్షాలేనా ?

అవును. ఎవరి పట్లా తీర్పు ఇవ్వగలమని అనుకోవటం పొరబాటు. మన పక్కింట్లో ఎవరు ఏ బాధలు పడుతున్నారో ఒక్కొక్కసారి ఆ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత కానీ అర్థం అవటం లేదు మనకి. అంత పరాయితనం జీవితాలలో.

Q ఏమిటి మార్గం?

కమ్యూనికేషన్, సానుభూతి.  కొంచెం మనసు పెడితే వీలయే  విషయాలు అవి.

4

Q మీ ఫిలాసఫీ ఏమిటి? మీరు ఎటువైపు?

మానవత్వం తప్ప ఏ అస్తిత్వవాదం లోనూ విశ్వాసం లేదు. ఎవరు బాధలో, కష్టం లో, ఉంటే నా వాదన వారివైపు. ఒక వాదానికి కట్టుబడిపోవటం స్వేచ్ఛని పోగొట్టుకోవటమే. ఇంకొక రకంగా అవి జాతి విద్వేషం వంటివి. మనకు తెలిసిన, చాలా గొప్పగా ఉన్న మనుషులు ఒక పరిధిలో ఇరుక్కుపోయి వాళ్లు నమ్మిన సిద్ధాంతం కోసరం తప్పులు, ఒక్కొక్కప్పుడు పాపాలు చేయటం చూడగలం.  ఒక పరిస్థితి బాగా లేనప్పుడు దానికి కారణాలు వెతికే ఓపిక అవసరం. ఉదాహరణకి కొందరు మగవాళ్ల పైన  కొన్ని తరాల తరబడి  సమాజం వారికి ఇచ్చిన సజెషన్స్, ఒత్తిడులు పనిచేస్తూ వారిని కాంప్లెక్స్ లకి గురిచేస్తాయి. చెల్లుబడి కావటానికి ధాష్టీకం ప్రదర్శిస్తారు. ఒక్కొక్కప్పుడు మగవాడికి చాలా సానుభూతి చూపించవలసిన పరిస్థితి వస్తుంది. మగ, ఆడ అని ఆలోచించటం కన్న మనిషిగా ఆలోచిస్తే సమస్యలు మళ్లీ మరిన్ని సమస్యలను సృష్టించవు

Qఈ లెక్కన చూస్తే ఎవరిని నిందించగలం అసలు?

-అదే నేనూ చెబుతున్నది.ఇక్కడే కాదు,  ‘ వారి వైపునుంచి ఆలోచించటం ‘ , ఏ సందర్భం లో అయినా  చాలా కష్టం. కచ్చ లు లేకుండా చూస్తే చాలా వరకు అర్థమవుతాయి.”స్త్రీ విమోచన  కోసమే నా తపన అంతా. అయితే ఆ స్వేచ్ఛని ఏం చేసుకోవాలో తెలియని స్త్రీని,  లాలించటం మరచిపోయిన స్త్రీని పాలివ్వటం మరచిపోయే తల్లిని ,నేను గౌరవించలేను ”  అని ఎన్నో దశాబ్దాల క్రితమే ద్రష్ట అయిన చలం గారు అన్నారు. మాటలు అవే కాకపోవచ్చు, భావం అదే. స్త్రీత్వాన్ని పోగొట్టుకుంటే ఎలా?

Q స్త్రీత్వం అంటే?

ఎంతో గొప్ప సాహిత్యం చదివి, జ్ఞానం సంపాదించి పురుషుడు తెచ్చుకోగలిగిన సున్నితత్వపు గొప్పదనం స్త్రీకి పుట్టుకతో వస్తుంది. దాన్ని కోల్పోకూడదు. రాధ, యశోదల కలబోతే నిజమైన స్త్రీమూర్తి.

Qమీ రచనల లో మీకు నచ్చినవి?

నిర్మోహ దర్పణం నా కథలలో నాకు నచ్చిన కథ ఇద్దరు ఎదిగిన వ్యక్తుల విలక్షణమైన కలయిక అది..ఒక్కొక్కసారి మనం బాగా చెప్పామనే అనిపిస్తుంది, అది పాఠకులకి అందకపోవచ్చు .

. ‘ మలుపు ‘ అని ఒక కథ -సర్వసంగ పరిత్యాగంతో ఔన్నత్యం వచ్చిందనుకొని  అందరికీ బోధించే ఒకరిని మామూలుగా సంసారంలో ఉన్న స్త్రీ నిలదీస్తుంది.

Q నాకు  గుర్తుంది, ” పాల రాతి బండల మీంచి వీచే అమానుషమైన చల్లదనం ” అని ఉంటుంది అందులో.

[నవ్వు ] అవును. దాని గురించి ఎవరైనా చెబుతారేమోనని ఎంత ఎదురు చూశానో. అలా పూర్తిగా రీచ్ కాలేదేమో అనుకున్న కథలలో ‘ మహా గాయని ‘ ఒకటి.

Qలేదండీ. ఫేస్ బుక్ లో మొన్న కూడా తలచుకున్నారు ఆ కథని.

అవునా. ..

పరిసరాలలో ఇమిడీ ఇమడని ఒక మధ్యతరగతి ఇల్లాలు  కట్టుబాట్ల మధ్యనుంచి కూడా కూడా ఎన్నెన్ని చేయగలదో చెప్పాలనుకున్న ‘ పూర్ణిమ ‘ , ‘  కూడా ఇష్టం.   జీవితాన్ని ఒక ఆట లాగా తీసుకునే ఉద్యోగస్తురాలు అనుకోకుండా తారసపడినవారి వలన మలచబడిన తీరు గురించిన ‘ వియద్గంగ ‘ , తానేమిటి అనుకుంటోందో తెలియని స్థితిని దాటి తనని తను ఒప్పుకుని ఆనందం పొందిన అమ్మాయి కథ ‘ మహోత్సవం ‘ ఇవన్నీ నాకు ఇష్టమైనవి. ‘ మజిలీ ‘ కథ చాలా మందికి నచ్చింది. ఒకవారంలో 250 ఉత్తరాలు దాని గురించి. పక్క మీదనుంచి లేవలేని ఒకరు తానే రాసి తీరాలని వంకర  టింకర అక్షరాలతో రాసిన ఉత్తరం మర్చిపోలేనిది. స్మృతిచిహ్నం నవల అయాన్ రాండ్ ఆలోచనలని అనుసరించి నా పద్ధతిలో చెప్పాలని రాసినది.

 

Qమీరు రాసినవి చదివి జీవితాలను మలచుకున్నవారు నిజంగా  ఉన్నారా? నేను అడిగేది ‘ పున్నాగ పూలు ‘ కి ముందు కాలంలో?

ఉన్నారు. నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఇది స్వాతిశయం తో చెప్పటం లేదు, నేను చెప్పినది మరొకరికి ఉపయోగపడిందనే తృప్తి.

Q లూయీస్ హే గురించి ‘ పున్నాగ పూలు ‘ లో చెప్పారు కదా. ఆ నవలకి ప్రేరణ ఆవిడేనా?

కాదు. మా నాన్నగారు డా.గాలి బాలసుందర రావు గారు,  నా గురువు గారు డా. గోపాలకృష్ణ గారు.

Q‘ పున్నాగ పూలు ‘ మీ ఇదివరకటి రచనల కంటె భిన్నమైనది. చాలా విశదంగా చెప్పారు మీరు.

అవును. అటువంటి  హాస్పిటల్ , అంతమంది మనుషులు, ఇంత అవకాశం ఉంది గనుక. ఇంకొక పెద్ద నవలకి సరిపడా సబ్జెక్ట్ ఉంది నా దగ్గర. రెండో భాగం కూడా రాస్తానేమో. ఎవరో అన్నారు, ” ఈ నవల రాయటానికి మీరు కనీసం రెండు వేల పేజీలు చదివి ఉంటారు ” అని. నిజమే.

Qనేను ఇంకొకటీ అడగాలి. ఎప్పుడూ లేనంత వాచ్యంగా చెప్పారు కూడా, అవునా?

చాలా మందిని చేరింది   మైథిలీ ఇలా చెప్పటం వల్ల. ఉపయోగపడాలంటే ముందు అర్థం అవాలి కదా. నా శైలి బావుందనో, చెప్పిన పద్ధతి బావుందనో అనేసి పేజీలు తిప్పేస్తే ఏమి సాధించినట్లు? రచయిత్రి గా నాకు ఎప్పుడూ రానంత తృప్తి ఇలా వచ్చింది. టాగూర్ కన్న శరత్ బాగా అర్థమవుతారు. టాగూర్ ఏం చెప్పాలనుకుంటున్నారో చప్పున తెలియదు. దానికి  ‘in between the lines ‘చదవటం తెలియాలి. పాఠకులకి నేరుగా చెప్పటం వారి శ్రమని తగ్గిస్తుంది.

 

Qశరత్ పాఠకుల కో సం రాస్తే టాగూర్ రచయితల కోసం రాశారని శరత్ స్వయంగా  ఒకసారి అన్నారు.

అవును, అన్నారు. ఇక్కడ నేను aim  చేసినదీ అదే. ‘ పున్నాగ పూలు ‘ ఎంతో మందికి చేరటం నాకు గొప్ప విజయం . హైదరాబాద్ లో కొందరు వైద్యులు, ఇతరులు కలిసి ‘ పున్నాగ పూలు ‘ ఫాన్స్ అసోసియేషన్ పెట్టారు. నిజంగా వారికేదో కనిపించి, చేయాలని అనిపించటం కదా ఇదంతా.

 

Q రచయిత్రి అనే పరిధి దాటి ఆత్మీయురాలైన కౌన్సిలర్ గా ‘ మైత్రి ‘ కాలం ద్వారా మారారు. శ్రమగా లేదా?

లేదు.  కాని  ఆ ప్రశ్నలు ఒక్కొక్కసారి చాలా పెద్ద ఉత్తరాల రూపం లో ఉంటున్నాయి. మొత్తం చదివి, వారి మర్యాదకు భంగం రాని పద్ధతిలో ఆ ప్రశ్నను పత్రిక లో ఉంచటమూ నేను చేయవలసిన పనే, అప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు ఆ సమస్యలు తక్షణ పరిష్కారం అవసరమయేవిగా ఉంటాయి, ఆ గడువు  లోపు  నా జవాబు వారికి అందకపోవచ్చు. ఇ మెయిల్ లో అయితే వెంటనే జవాబు ఇస్తాను. ఉత్తరం అయితే రెండు వారాలు పడుతుంది.  అందుకు బాధగా ఉన్నా చేయగలిగినదేమీ లేదు.

Q ఇంత మందికి సాయపడటం ద్వారా ఏమి పొందుతున్నారు?

నేనేదో వారి జీవితాలను మలుపులు తిప్పేస్తున్నాననీ అనుకోను. ఆ మనసులలో ఒక తలుపు తెరుచుకోవటానికి సాయం చేస్తున్నాను అంతే.  ఆ తర్వాత వెలుగులోకి నడవటం వారి చేతులలోనే ఉంటుంది.ఈ ప్రాసెస్ లో  నేనూ చాలా చాలా నేర్చుకుంటున్నాను.

Qనేటితరం మనుషులు  ముఖ్యంగా పెళ్లి విషయంలో   డిస్ హార్మొనీ ని అనుభవించటానికి కారణం ఏమిటి ?

సముద్రంలో ఉప్పు, అడవిలో ఉసిరికాయ తెచ్చి ఊరగాయ పెట్టటం వంటిది వివాహం. ఆ రెండిటికీ లేని కొత్త రుచి వస్తుంది అప్పుడు. మనం స్వేచ్ఛగా ఉండటం అవతలి వారి స్వేచ్ఛ కి ఆటంకం అవకూడదు. ఇందుకోసం ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలేమో.

Qఅంటే సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండకూడదంటారా?

-[నవ్వు ] ఉండాలి. మనల్ని  మనం ముందు గౌరవించుకోవాలి కదా ముందర. ‘ నేను ‘ అన్నది ఉంటేనే కద, ‘ నిన్ను ప్రేమిస్తున్నాననటం ‘ . Be selfish to be selfless అంటారు.

Qఓ. అయాన్ రాండ్! మీరు చెప్పేది చాలా కష్టం.

అసాధ్యం కాదు.సాహిత్యం ఇక్కడ సహాయం చేస్తుంది. ఒక పాత్రని విశ్లేషించి చూసే అలవాటు అవతలి మనిషి దృక్కోణాన్ని అర్థం చేసుకునే నేర్పుని ఇస్తుంది.

Qఇప్పటి యువత ఎలా ఉన్నారు?

చక్కగా ఉన్నారు. చాలా స్పష్టత ఉంది వారికి.

Q ఒక పడికట్టు ప్రశ్న…కేరీర్ ముఖ్యమా లేక కుటుంబమా?

ఆర్థికస్వాతంత్ర్యం అందరికీ అవసరం.  ఎవరి మీద వారికి గౌరవం అలా వస్తుంది. ఉద్యోగం చేయటం వల్ల పరిధులు విశాలమవుతాయి కూడా. ఒక మనిషి సంపాదించి అయిదారుగురు తినే వ్యవస్థ వల్ల, పనిలేనివాళ్ల  unproductive attitude వల్ల , negative vibrations  వల్ల ఎన్నో సంపదలు  హరించుకుపోయాయి.

Qమరి పిల్లల విషయం?

సపోర్ట్ ఉంటుంది కదా పెద్దవారినుంచి. తెచ్చుకోవాలి. లేదా మంచి ఇన్ స్టి ట్యూషన్స్ ని డెవలప్ చేయాలి. అంతేకాని పిల్లల కోసరం అని ఉద్యోగాలు మాని తమ స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెట్టామనుకోవటం, ఆ పిల్లలని burden  గా ఫీల్ అవటం, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసివచ్చినప్పుడు  పిల్లలని తిట్టుకోవటం…ఇవన్నీ ఆరోగ్యకరమైనవి కావు. ఇవాళ అతి సామాన్య సంసారం లో కూడా ఒక అమ్మాయి కడుపుతో ఉన్నదగ్గరనుంచి బిడ్డ కు ఏడాది వయసు వచ్చేదాకా రెండు లక్షలు ఖర్చు అవుతున్నాయని ఎక్కడో చదివాను- మందులు, టెస్ట్ లు , పురుటి ఖర్చులు, వేడుకలు అన్నీ కలిపి.ఎంతమంది ఈ లెక్కలన్నీ తెలిసి కంటున్నారు? అప్పుల పాలవకుండా ఉండగలుగుతున్నారు? ఇటువంటి జ్ఞానాన్ని పెంచటం చాలా అవసరం. కొడవటిగంటి కుటుంబ రావు గారు అనేవారు ” రచయిత సమాజానికి కుక్క కాపలా కాయాలని ” .

Q వ్యాపారవేత్తల వంటివారు ఎక్కువ డబ్బు సంపాదించటం వల్ల సమాజానికి తోడ్పడే అవకాశం ఎక్కువవుతుందని  అనుకుంటున్నారా?

తప్పకుండా. ఉదాహరణలు చూస్తూనే ఉన్నాము కదా.

Qడబ్బు మానవ సంబంధాలని పాడు చేయదంటారా?

లేదు. సరిగా ఉపయోగించుకుంటే వాటిని మెరుగు పరస్తుంది. తెలియాలి అంతే.

Q అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయని అనుకుంటున్నారు? పరిష్కారం?

అత్యాచారాలు  ఎప్పుడూ ఉన్నాయి. చాలా కుటుంబ హింసలు, చైల్డ్ అబ్యూజ్ లు బయటికి వచ్చేవి కావు. ఇప్పుడు అవేర్ నెస్ పెరిగింది. పిల్లలని, ముఖ్యంగా మగపిల్లలని సరయిన విలువలతో పెంచటం అవసరం. ఆడపిల్ల భోగ వస్తువు అనుకోవటం,  నానా రకాలైన  చిత్రహింసలకి లోబడటమే  స్త్రీత్వం అనే భావన కలిగించటం , హీరోయిజం పేరిట  అమ్మాయిలని భయపెట్టి డామినేట్ చేయటం…ఇలాంటివన్నీ ఇవాళ  సినిమా మీడియా లో  ఎక్కువ కనబడుతున్నాయి.  దయగా , బాధ్యతగా ప్రవర్తించటాన్ని  సన్మానించినట్లు చూపించటం  చాలా తక్కువ. అటువంటి పాపులర్ హీరోలని అనుకరించేవారు మన చుట్టూ  పెరుగుతున్నారు.మగపిల్లలకి విలువలు అర్థమవటానికి మనం ఏమి చేయగలుగుతున్నాము? తను మిగతా ఆడపిల్లలని చూసే పద్ధతిలో తన చెల్లెలిని వేరేవారు చూస్తారని ‘ నువ్వు బయటకి రాకు ‘ అనే అన్నలు ఉన్నారు.

Qఈ విషయం లో కాపిటల్ పనిష్ మెంట్ ని సమర్థిస్తారా?

లేదు. అసలు సమర్థించను. దానివల్ల ఉపయోగం లేదు. నలుగురు చచ్చిపోవటం వల్ల నలభై మంది బాగుపడే వ్యవస్థ కాదు మనది.

ఏవో నెగటివ్ వైబ్రేషన్ లు ఎక్కువవుతున్నాయనిపిస్తోంది. మన దేశం లోనే కాదు, అన్ని చోట్లా.   ఒక సమూహం గా మంచి థాట్స్  ని వ్యాపించేలా చేయటం ఒకటే ఈ స్థితిని మార్చగలదని అనుకుంటున్నాను . ఒక పాజిటివ్ ఆలోచనకు చాలా బలం ఉంటుంది. చాలా మందివి కలిస్తే, ఆ విషయం జరిగేందుకు అవకాశం ఎక్కువవవుతుంది

Q మీ రచనలు సరిగ్గా  అందుబాటులో ఉండవు. ఈ ఫిర్యాదు నాదే కాదు, చాలా మందిది. ఎడిటర్ ఒకరు మీ కథల పుస్తకాన్ని వ్యక్తిత్వ వికాసపు పుస్తకంగానైనా అందరి  చేతా చదివించాలన్నారు కదా. మీ రచనలు మీరే ఎందుకు ప్రచురించరు?

ఎందుకో ఆ పని చేయబుద్ధి కాదు. పాఠకులకి అవసరం అనిపిస్తే వెతుక్కుని చదువుకోగలరు అనిపిస్తుంది.

Q కాని కనీసం ఒకసారయినా ముద్రణ అంటూ జరగాలి కదా. అప్పుడు కదా తెలిసేది, మీ రచనల కోసం అడుగుతారని.

2003 ప్రాంతాలలో  విశాలాంధ్ర వాళ్లు కథల పుస్తకం వేశారు, ‘ తమసోమా జ్యోతిర్గమయ ‘ నవల అప్పుడే ఎమెస్కో వాళ్లు వేశారు

Q ఇప్పుడు కాపీలు లేవు.

పున్నాగపూలు  కాపీలు కూడా చాలా తొందరగా అయిపోయాయట. నవోదయ వాళ్లు కథలు కొన్ని మళ్లీ వేస్తామన్నారు.

Q .మరి ‘ స్మృతిచిహ్నం ‘ నవల సంగతి ?

చూద్దాం [నవ్వు ] Qఆ మధ్య ఇ బుక్ గా తెస్తామని ఒక ఆన్ లైన్ ప్రచురణ కర్త చెప్పారు, మరి?

ఆయన చిన్నప్పటినుంచీ పరిచయం ఉన్నవారే. అవును, అన్నారు. ఆ తర్వాత  ఆ ప్రసక్తి అటువైపునుంచి కొనసాగలేదు.

 

 jalandhara photo (1)

 

Qకొత్తగా తెలుగులో వస్తున్న సాహిత్యం చదువుతున్నారా? ఎలా అనిపిస్తోంది?

చూస్తాను. కొందరు బాగా రాస్తున్నారు కూడా.

Qరాయాలనుకునే వారికి ఏమయినా చెబుతారా?

అలా అనుకోను. ఆ అవసరం కూడా లేదు. హృదయం లోంచి కదా సాహిత్యం వస్తుంది,అది ఒక ఊట లాగా వెలికివస్తుంది.  ఎవరినుంచి ఏ అద్భుతాలు వస్తాయో ! ‘ ఇలా ఆలోచించు ‘ అని చెప్పటం ఎలా?

Qబాగా రాసేందుకు బాగా చదవాలని అంటారా?

నా వరకు అది నిజం.లోపల ఒక బల్బ్ ఉన్నా అది వెలిగేందుకు విద్యుత్ కావాలి .చదవటం వల్ల ఆలోచించగలం,విస్తృతి వస్తుంది. చాలా తెలు సు కుంటేగాని రాయకపోవటం ఒక పద్ధతి.  ఆర్థికంగానూ సామాజికం గానూ అన్ని రకాలైన మనుషులతో ఇంటరాక్షన్ పోకుండా చూసుకోవాలి. లేకపోతే సహానుభూతి రాదు.  చంద్రమోహన్  గారి సింప్లిసిటీ వల్ల అది నా విషయం లో సాధ్యపడింది.

నాకిలా అనిపిస్తోంది కనుక చెబుతున్నానననటం ఇంకొకటి. ఆ విధం గా ఉండవచ్చేమో, నాకయితే తెలియదు.

Qఒక సినిమా నటుడి భార్యగా మీరు సమాజాన్ని  ఓపెన్ గా చూసి అవకాశం ఎలా నిలుపుకోగలిగారు?

ఇక్కడొక సంగతి చెప్పాలి. మా పెళ్లయిన కొత్తలో భానుమతి గారు మమ్మల్ని భోజనానికి పిలిచి బట్టలు పెట్టారు.వచ్చేటప్పుడు నాతో చెప్పారు ” మీ ఆయన ఎంత సంపాదించినా సరే, ఇంట్లో మాత్రం అప్పర్ మిడిల్ క్లాస్ వాతావరణాన్ని పోగొట్టుకోవద్దు ” అని.  మా జీవితం అలాగే గడిచింది.

Q సాహిత్యకారులకి బయటి ప్రపంచం తో లయ కుదరటం సాధ్యమేనా?

తప్పకుండా. మనం చదివినదాన్నీ, సృష్టించేదాన్నీ వాస్తవ పరిస్థితులతో అన్వయించుకోగలగటం వారు చేయగలిగి ఉండాలి. బయటివారు కొట్టే చప్పట్లు కొన్నాళ్లే, అంతిమంగా ఎవరి జీవితాన్ని వారు అర్థవంతంగా, శాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మామూలు మనుషుల కన్న ఎక్కువ తెలుసుకుని లాభం ఏమిటి?

Q ఎందుకని నెగటివిటీ లో కొందరు సాహిత్యకారులు కడతేరిపోతూ ఉంటారు?

నాకు ఇక్కడ వర్జీనియా వుల్ఫ్ జీవితం గుర్తొస్తుంది. చాలా గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన ఆవిడ  ఆఖరికి తెల్లటి దుస్తులలో, తెల్లటి గొడుగుతో నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకుంది అని చెబుతారు. తన బాల్యం లోని కొన్ని బాధాకరమైన పరిస్థితులు ఆమెని వెంటాడాయి. అటువంటి వారు కొన్ని విషయాలని కావాలని మరచిపోదామనుకుంటారేమో. కాని అవి అంతశ్చేతన లో ఉంటాయి. విస్తృతమైన, రాపిడి, అలజడి వల్ల ఇంకొక వైపున చాలా దూరం ప్రయాణించి అపురూపమైన సృజన చేస్తారు. తనతో తనకి శృతి కుదరకపోతే అది ఎక్కడికి దారి తీస్తుంది? ఇందుకు చాలా ఆత్మ పరిశీలన, విశ్లేషణ, శుభ్ర పరచుకోవటం అవసరం

Q ఏవో మంచివనిపించే ఆలోచనలు ఉన్నా  ఆచరణ లో పెట్టే వీలు లేని పరిస్థితులలో ఉన్నాం.  ఇన్ని సంక్లిష్టతల  మధ్య ఏమయినా చేయగలమని అంటారా?

తెలిసిందనుకున్నదాన్ని- పక్కవారు గుర్తించినా లేకపోయినా, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు అందులోని విషయం మెల్ల మెల్లగా అగరు వత్తి ధూపం లాగా  చుట్టూ ప్రసరిస్తుంది. మనతో కలిసి జీవించేవారికి అనుభూతి లోకి .ఆలస్యంగా రావచ్చు. గుర్తింపు గోల పెట్టుకుంటే చేయవలసినవి చాలా చేయలేము. .ఒక్కొక్కసారి మనం రాస్తున్న, చెబు తున్న విషయాల వల్ల దూరాన ఉన్నవారెవరో ప్రభావితులవుతారు. ఆ మేరకి మనం ప్రకంపనలని మార్చగలిగినట్లే. సహాయం చేసినట్లే.

    –   మైథిలి అబ్బరాజు

Download PDF

46 Comments

 • ఆర్.దమయంతి. says:

  “రాయాలనుకునే వారికి ఏమయినా చెబుతారా?”

  * అలా అనుకోను. ఆ అవసరం కూడా లేదు. హృదయం లోంచి కదా సాహిత్యం వస్తుంది,అది ఒక ఊట లాగా వెలికివస్తుంది. ఎవరినుంచి ఏ అద్భుతాలు వస్తాయో ! ‘ ఇలా ఆలోచించు ‘ అని చెప్పటం ఎలా?
  ఎంత నిజమైన మాటలివి.రచయిత్రికి ఇవే నా అభినందనలు. మైథిలి గారు, సాంత్వన గారు, మీ ఇంటర్వ్యు చేసిన పధ్ధతి నాకు నచ్చింది. చక్కని జవాబులతో హాయిగా సాగింది. ధన్యవాదాలు.

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు దమయంతి గారూ.

  • మైథిలి అబ్బరాజు says:

   అవును దమయంతి గారూ ఏ సలహా ఇవ్వకుండా ఉండగలగటం ఎంతమంది చేయగలరు ! ఆమె అంత వినయశీలి

 • ఒక సరళమైన స్పష్టత,. జీవితం లోను,.. సమాధానలలోను.
  మంచి పరిచయం.

  • మైథిలి అబ్బరాజు says:

   ‘సరళమైన స్పష్టత’…మంచి మాటలు bhaskar kondreddy గారూ.ధన్యవాదాలు

 • Radha says:

  మైథిలి గారూ, నాకు చాలా ఇష్టమైన రచయిత్రి జలంధర గారు. ఆవిడ కథల్లో నాకు బాగా నచ్చిన కథ వియద్గంగ.

  “తెలిసిందనుకున్నదాన్ని- పక్కవారు గుర్తించినా లేకపోయినా, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు అందులోని విషయం మెల్ల మెల్లగా అగరు వత్తి ధూపం లాగా చుట్టూ ప్రసరిస్తుంది. మనతో కలిసి జీవించేవారికి అనుభూతి లోకి .ఆలస్యంగా రావచ్చు. గుర్తింపు గోల పెట్టుకుంటే చేయవలసినవి చాలా చేయలేము. .ఒక్కొక్కసారి మనం రాస్తున్న, చెబు తున్న విషయాల వల్ల దూరాన ఉన్నవారెవరో ప్రభావితులవుతారు. ఆ మేరకి మనం ప్రకంపనలని మార్చగలిగినట్లే. సహాయం చేసినట్లే” – ఎంత బాగా చెప్పారు కదా!

  అసలు ఆవిడ కథలన్నీ ఇంత గాఢంగా ఉంటాయి.
  ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం తమసోమా జ్యోతిర్గమయ (నా దగ్గర ఉంది). ఆ నవలలో కూడా ఆవిడ ఇలానే అంటారు భ్రాంతుల నీడల్లోనే ఉంటే విలువైన పనులు చేయలేము అనో …. విలువైనవి పోగొట్టుకోవద్దనో….

  ఇంత మంచి ఇంటర్వూ్య ని అందించిన మీకు కృతజ్ఞతలు, అభినందనలు

  • మైథిలి అబ్బరాజు says:

   అవును, Radha గారూ అంత గాఢంగా చెబుతారు ఆవిడ ..ధన్యవాదాలు ..

 • bhuvanachandra says:

  మైధిలి గారూ నమస్తే …….జలంధర గారి చాలా చక్కని ”ఇన్నర్ వ్యూ ” మీరు మా ముందు ఉంచారు … … చాలా మంచి ప్రశ్నలు వేసారు .చాలా చక్కటి జవాబులు రాబట్టారు ….జలంధర గార్ని గత 27సం ”గా ఎరుగుదును …..వారి మాటలు ఎప్పుడూ ”హృదయం ”లోంచి వస్తాయి ……ఏనాడూ ఎవరినీ పల్లెత్తు మాట అనని అద్భుత వ్య క్తిత్వం వారిది ……అ దే వారి మాటల్లో ప్రతిఫలించింది …..”పున్నాగపూలు” ఓ అద్భుత మానవీయ కావ్యం …..అదో ”మనో ప్రపంచాన్ని ” ఆవిష్కరించింది ……ఎందరి జీవితాల’నో మనముందు ఉంచింది ….అదీ వాస్తవికతకి అతి దగ్గరగా …అందరికీ అర్ధమయేలా.ఒక మహా వ్యక్తిని పరిచయం చేసిన
  మీకూ .. అందరిలో ఆ సర్వేశ్వరుడిని చూసే ప్రేమమయి .జలంధర గారికీ మరోసారి నమస్క్రుతులతో …భువనచంద్ర

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు bhuvanachandra గారూ. అవునండీ, నిజంగా అనవలసిన, అనదగిన చోట కూడా ఆమె ఎవరినీ నిందించరు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరీ కష్టపెట్టుకుంటే తప్ప ఒక్క సూచన కూడా ఇవ్వరు. ఆమె మంచి రచయిత్రి, అంతకన్న గొప్ప హ్యూమన్ బీయింగ్

 • bhuvanachandra says:

  స్వాంతన గారూ …మీపేరు రాయడం మరచినందుకు మన్నించండి …..నిజంగా మీకు నా శుభాకాంక్షలు ..దీవెనలూ …మీ నుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటూ ……..భువనచంద్ర

  • మైథిలి అబ్బరాజు says:

   సాంత్వన తరపునుంచి నేను నమస్కారాలు చెబుతున్నాను bhuvanachandra గారూ. తను చెన్నై లో ఉంది

 • చాలా బావుంది. Thank you!!

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలండీ .S. Narayanaswamy గారు! కల్పనా రెంటాల గారి వల్ల సాధ్యమైంది ఇది

 • చాలా మంచి ప్రశ్నలు వేసి ఇంకా మంచి సమాధానాలు రాబట్టారు మైథిలి గారూ! జలంధర గారు సాహితీ వేత్తల కుటుంబం లో పుట్టడం వలన అబ్బిన సాహితీ వాసనకి తన కృషి, ప్రతిభలను జోడించి రాణించారు. ఆవిడ అన్నట్టు మీరు నోట్ చేసుకోకపోయినా చక్కగా గుర్తు పెట్టుకొని అన్ని ప్రశ్నోత్తరాలనూ చక్కగా మాకు అందించారు. మీకు అభినందనలు. ముందు ముందు ఇలాంటి మరికొన్ని ఇంటర్వ్యూ లను మీ నుంచి ఆశిస్తున్నాను.

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు Sivaramakrishna Vankayala గారూ.ఆమె ఏ పద్ధతిలో ఆలోచిస్తూ వెళతారో కొంచెం అనుభవం ఉందన్న నమ్మకం వలనా, ఆమె మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయలేకా రికార్డ్ చేయలేదు. ఇద్దరం ఉన్నాము కనుక మొత్తం రాసేయగలిగాము :)

 • సాయి పద్మ says:

  పరిష్కారాన్ని కనుచూపుమేరలోనయినా చూపించని రచనల పైన నమ్మకం లేదు. ఇక్కడ పరిష్కారం అంటే ఒక పాజిటివ్ ఆలోచన కూడా కావచ్చు. భావుకతలో ముంచెత్తే వాటికన్న జీవితం లో ఒక సమస్యేదో ఎదురైనప్పుడు స్ఫూర్తి అడిగి తెచ్చుకోగల సాహిత్యమంటే గౌరవం. సాహిత్యం టానిక్ లాగా పని చేయాలి, మత్తు మందులాగా కాదు. మంచి పుస్తకంఆలోచించటాన్ని నేర్పాలి.

  చాలా చాలా మంచి ఇంటర్వ్యూ .. మైధిలి గారూ , స్వాంతన .. హాయిగా ఉంది ఆమె రచనల్లానె

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు సాయి పద్మ గారూ.ఆమె హాయి వెనుక చాలా శ్రమ ఆమెకి, హాయిగా ఉండదలచుకున్న ఎవరికైనా, కదా?

 • suresh says:

  అబ్బా!! ఇన్నాళ్ళకి నిజమైన ఇంటర్వ్యూ చదివానండి. ఒక్క ప్రశ్నకూడా అనవసరంగా అనిపించలేదు, చాలా చాలా ఆసక్తికరంగా సాగిందండి ఇంటర్వ్యూ. సాంత్వనగారికి, మీకు…అభినందనలు

  • మైథిలి అబ్బరాజు says:

   మీ అభిమానానికి కృతజ్ఞతలు సురేష్ గారూ, సాంత్వన నుంచి కూడా :)

 • kollurusiva says:

  ముందుగా మీకు థాంక్స్. చాల విషయాలు చెప్పారు. కనీసం నాకు వారు చంద్ర మోహన్ గారి భార్య అని తెలియదు

  • మైథిలి అబ్బరాజు says:

   సంతోషమండీ kollurusiva గారూ. ఆమె ఆయన భార్యగా తనను గుర్తించటాన్ని ప్రత్యేకించి ప్రోత్సహించరు, అలాగని తిరస్కరించరు కూడా

 • గుండెబోయిన శ్రీనివాస్ says:

  ఈ ఇంటర్వ్యూ లో నాకు నచ్చిన జలంధర గారి మాటలు;
  `సాహిత్యం టానిక్ లాగా పని చేయాలి, మత్తు మందులాగా కాదు. మంచి పుస్తకంఆలోచించటాన్ని నేర్పాలి.’
  అంటే సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండకూడదంటారా?
  `-[నవ్వు ] ఉండాలి. మనల్ని మనం ముందు గౌరవించుకోవాలి కదా ముందర. ‘ నేను ‘ అన్నది ఉంటేనే కద, ‘ నిన్ను ప్రేమిస్తున్నాననటం ‘ . Be selfish to be selfless అంటారు’

  రాయాలనుకునే వారికి ఏమయినా చెబుతారా?
  `అలా అనుకోను. ఆ అవసరం కూడా లేదు. హృదయం లోంచి కదా సాహిత్యం వస్తుంది,అది ఒక ఊట లాగా వెలికివస్తుంది. ఎవరినుంచి ఏ అద్భుతాలు వస్తాయో ! ‘ ఇలా ఆలోచించు ‘ అని చెప్పటం ఎలా?’

  బాగా రాసేందుకు బాగా చదవాలని అంటారా?
  `నా వరకు అది నిజం.లోపల ఒక బల్బ్ ఉన్నా అది వెలిగేందుకు విద్యుత్ కావాలి .చదవటం వల్ల ఆలోచించగలం,విస్తృతి వస్తుంది. ‘

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు గుండెబోయిన శ్రీనివాస్ గారూ.

 • Elanaaga says:

  గుర్తింపు గురించి, సుఖం – శాంతి గురించి జలంధర గారు చేసిన వ్యాఖ్యలూ, అట్లాగే జీవితంలో కోల్పోకూడని అప్పర్ మిడిల్ క్లాస్ వాతావరణం గురించి భానుమతి గారు చేసిన వ్యాఖ్యా రత్నాల వంటివి. ఇంటర్వ్యూ చాలా బాగా సాగింది. జలంధర గారికీ, మైథిలి అబ్బరాజు గారికీ, సాంత్వన చీమలమర్రి గారికీ అభినందనలు. ధన్యవాదాలు.

 • మంచి ఇంటర్వ్యూ అందించినందుకు మైథిలి గారికి అభినందనలు. జలంధర గారిని నేను శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం లో ఒక సేమినార్లో కలిశా. ఆడంబరాలు లేకుండా చాల సింపుల్ గా ఉంటూ తను చెప్పాలనుకున్నదాన్ని స్పష్టంగా చప్పిన ఆవిడ చంద్రమోహన్ గారి భార్య అని తెలిసి ఆశ్చర్యపోయా. కారణం ఇప్పుడు అర్ధమయింది.

 • మైథిలి అబ్బరాజు says:

  అవునా,శాంతి ప్రబోధ గారూ. ధన్యవాదాలండీ

 • రేఖా జ్యోతి says:

  సాహిత్యానికుండే … సామర్ధ్యాన్ని, బాధ్యతని అత్యంత సున్నితంగా గుర్తు చేసే ప్రశ్నలకు , బాధ్యతాయుతమైన నిజవ్యక్తిత్వమిచ్చిన ఈ సమాధానాలు తప్పకుండా ధైర్యాన్నిస్తాయి … కనీసం తమ కోసం … తమ దారిలో దీపం వెలిగించుకొనే ధైర్యాన్నిస్తాయి. __/\__ జలంధర గారిని ఇంత దగ్గరగా తెలుసుకొనే అవకాశమిచ్చిన మైథిలి గారికి నమస్సులు , సాంత్వన గారికి అభినందనలు .

 • buchireddy gangula says:

  మైథిలి గారు
  ఇంటర్వ్యూ చాల బాగుంది —ఇంటర్వ్యూ అంటే
  యిలా ఉండాలనిపించేలా చేసారు
  ————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 • జలంధర గారితో మంచిపరిచయాన్ని కలుగ చేసినందుకు ధన్యవాదాలండీ. మీ ప్రశ్నలకు ఆవిడ జవాబులన్నీ చాలా చాలా బావున్నాయి. ఆవిడకున్న అవగాహనా, స్పష్టత కు ఇవి ఒక చిన్న ఉదాహరణ.

  నాకు చాలా ఇష్టమయిన రచయిత/ రచయిత్రులలో జలంధర గారు ఒకరు (పాసింగ్ క్లౌడ్స్ లాంటి వారిని వదిలేస్తే.) మొదటిసారి ఆవిడ కధలు చదివినపుడే ఎంతో అభిమానిని అయిపోయాను. ఒక్కసారి చదివినా సరే ఎన్నేళ్లకయినా గుర్తుండే కథలూ, ఎన్ని సార్లు చదివినా మొదటిసారిలానే చదివించే కథలు నావరకూ. క్రిస్ప్ మరియు వైవిధ్యమైన కథనం. ఒక్క వాక్యం కూడా అనవసరమని అనిపించదు నాకు ఆవిడ రచనల్లో.

  నాకు బాగా ఇష్టమయినవి ముంగిట్లో ముత్యాలు, వియద్గంగ, మహోత్సవం. క్రిష్ణన్ నాయర్ ఎక్కడైనా తారసపడతాడేమో అని వెదుకుతూనే ఉంటాను ఇంకా.

 • మైథిలి అబ్బరాజు says:

  ధన్యవాదాలు పద్మ వల్లి గారూ. మిమ్మల్ని గుర్తు చేసుకున్నా అప్పుడు. క్రిష్ణన్ నాయర్ ని మనమే వెళ్లి తెచ్చుకోవాలి, మరొక కథ లోకి [ మీరో నేనో రాసుకుందాము :) ఆవిడ చెప్పటం అయిపోయినట్లే ఉంది ]

 • సుజాత says:

  మైథిలి గారూ, ఇద్దరు విదుషీమణుల సంభాషణ ఇంత లోతుగా మధురంగా ఉంటుందా అనిపించేంత బాగుంది . జలంధర గారి ప్రతి మాటా దాచుకుని మళ్ళీ మళ్ళి నెమరేసుకోదగ్గదిగానే ఉంది.

  చాలా రోజుల తర్వాత ఒక మంచి “కంప్లీట్ ఇంటర్వ్యూ” చదివిన ఫీలింగ్

  ప్రశ్నలకు మీరు, సాంత్వన ఎంత బాగా ప్రిపేర్ అయ్యారో, అంత మంచి లోతైన విశ్లేషణాత్మక జవాబులు దొరికాయి.

  “గుర్తింపు గోల పెట్టుకుంటే చేయవలసినవి చాలా చేయలేము” _________అసలు ఈ ఒక్క మాటలో తీసుకున్న వారికి తీసుకున్నంత ఉంది. అందుకే ఆమె, చేయవలసినవి చేస్తూ, గుర్తింపు గోల పెట్టుకోలేదు. జలంధర గారి వంటి రచయిత్రికి రావలసినంత పేరు రాలేదని వగచే అభిమానులకు చెప్పిన జవాబేమో ఆ వాక్యం అనిపిస్తోంది.

  మీకు, సాంత్వనకు అభినందనలు!

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు సుజాత గారూ . మీ మాటలు చాలా సంతోషం కలిగించాయి.

 • swathi says:

  చాల చక్కటి ఇంటర్వ్యూ మైథిలి గారు… ధన్యవాదాలు…

 • sarada says:

  chaalaa chakkati interview manasantaa nindi poyi emi cheppalo teleetam ledu, dhanya vaadaalu

 • చాలా చక్కని ఇంటర్వ్యూ!! కృతజ్ఞతలు…

 • mamidala.maddhu says:

  good

 • mercy margaret says:

  jalandhara gaari interview naaku chaalaa baaga nacchindi… chaalaa vishayaala prasthaavana naaku swacchangaa , nijaatheegaa anipinchindi … dhanyavaadaalu

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు మెర్సీ మార్గరెట్ గారూ

 • Raja Sekhara Rao Narayanam says:

  జలన్దర గారు, మీ ఇంటర్వ్యూ చాల బాగుంది, పున్నగాపులు చదివాము చాల బాగుంది, మీ పొసితివెనెస్స్ బాగా నచ్చుతుంది మాకు, మీరు కలకాలం ఇలానే రచనలు అందిచాలని మా కోరిక ……….. రాజశేఖర్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)