నాకు చెప్పరె వలపు నలుపో తెలుపో

arun1

  అరుణ ప‌ప్పు శ్రీకాకుళం జిల్లా పాలకొండ‌లో 1979లో పుట్టింది. గణితంలో ఎం. ఎస్‌సీ. చేసినా తెలుగు చదవాలనీ రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. మొదట ఈనాడులో ఐదేళ్ళు చేసి, గత ఏడేళ్లుగా ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌లో పని చేస్తున్నారు. రచనా వ్యాసంగం శైశవదశలోనే ఉన్నా ఇప్పటికే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆమె క‌థ‌ల సంపుటి చంద‌న‌పుబొమ్మను క‌డ‌ప జిల్లా నంద‌లూరులోని రాష్ట్ర క‌థానిల‌యం వారు కింద‌టేడు ప్ర‌చురించారు. చక్కటి ఆలోచనా, ఆ ఆలోచనలకు తగిన వచనం, ఆ రెండింటికి అమిరేటట్లు హాయిగా చదివింప చేసే శైలి ఆమె కథల ప్రత్యేకత.
వీరి బ్లాగ్‌సైట్ అరుణిమ‌ .arunapappu.wordpress.com
కినిగెలో ఈ పుస్త‌కం దొరుకుతుంది.  

 

‘పెళ్లి తర్వాత సమస్యలేవీ రావని నమ్మకం ఏమిటి?’ సూటిగా అడిగింది నీల.
‘సమస్యలు బయటి నుంచి రావు. అవి మనలోనే ఉంటాయి…’ అన్నాడు శరత్ అంతే స్పష్టంగా.
అతనన్నది ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు.
అర్థం కాకపోవడాన్నుంచి ఒక కోపపు ఛాయ పుట్టింది.
‘అంటే… అన్నీ నేనే ఊహించుకుంటానని.. దాన్నుంచే సమస్యలని… అంతేగా నువ్వంటున్నది…?’ అందామె మాటలు ముక్కలుముక్కలుగా మనిషి విసురుగా.
‘వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడే జబ్బులు చుట్టుముడతాయి. మనం గట్టిగా లేకపోతేనే సమస్యలు భయపెడతాయి…. అదీ నేనంటున్నది. నెమ్మదిగా ఆలోచిస్తే నీకే విషయం స్పష్టంగా తెలుస్తుంది… రెండు రోజులు ఓపిక పట్టు. నీ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి…’ అని బల్ల దగ్గర్నుంచి లేచి వెళ్లిపోయి టీవీ దగ్గర సెటిలయ్యాడు శరత్.
నీలకేమీ తోచలేదు.
అకస్మాత్తుగా పెళ్లి ప్రస్తావన ఎందుకు తెచ్చాడు శరత్? ఇప్పటిదాకా మంచి స్నేహితుల్లాగా కలిసి ఉన్నారు కదా? ప్రేమ… ప్రేమకేమీ తక్కువ లేదు. మూడేళ్లుగా చూస్తోంది తను.. ఎప్పుడూ అతనిలో ఎంచడానికేమీ కనిపించదు. అలాంటప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన తననెందుకు భయపెడుతోంది?
స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో… తనను చూస్తూనే ప్రశ్నార్థకాలయ్యే మొహాలను ప్రతిభతో ఎదుర్కొని నెగ్గుకొచ్చింది తను. మరి పెళ్లి దగ్గరకొచ్చేసరికి భయపడుతోంది ఎందుకు?
అంటే పెళ్లికి మనిషిలోని ప్రతిభ, ఇద్దరి మధ్య అనురాగం – ఇవి చాలవనుకుంటోందా? పెళ్లి దగ్గరకొచ్చేసరికి మనుషుల గుణగణాలు కాకుండా, అందచందాలే ముఖ్యమని అందరిలాగానే తనూ అనుకుంటోందా? తన వయసు అమ్మాయిలు పెళ్లంటే ఎంత సంబరపడతారు? మనసైనవాడు, మంచివాడు శరత్ అడుగుతున్నా సరే, తనలో ఎందుకీ సంకోచం?
నీలకేమీ దిక్కుతోచలేదు. తన ఆలోచనల్లో స్పష్టత లేదని తెలిసిపోయింది. హోటల్ గదికున్న కిటికీ లోంచి చూస్తే రాత్రి పూట సముద్రం నల్లగా ఎగసిపడుతూ కనిపించింది. అలలు మాత్రం తెల్లగా….
రాత్రి నలుపు… వెన్నెల తెలుపు…
చూస్తున్న కళ్లు తెలుపు, కనుపాపలు నలుపు…
ప్రపంచమంతా నలుపుతెలుపుల కలయికే…
కదిలే కారుమబ్బులా, కాటుక పిట్టలా ఉంటుంది నీలోత్పల.
ఎక్కడికెళ్లినా ఒకసారి చూసినవారు మరోసారి ఆశ్చర్యంగా చూడకమానరు. అంత నలుపు.
‘కలకత్తా కాళి..’ అంటూ కామెంట్ చేసేవారు కాలేజీలో. అంత భయంకరంగానూ నిప్పులు కక్కుతూ చూసేదామె వాళ్లవైపు. ఆ చూపులకే కాదు, తీక్షణమైన ఆమె ప్రతిభకు కూడా భయపడేవాళ్లందరూ.
ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడూ అంతే. నీలను చూసి ఆశ్చర్యపోయిన బోర్డు సభ్యులు, ఆమె సాధించిన బంగారు పతకాలను చూసి నోళ్లు వెళ్లబెట్టారు.
‘మీ పని మీరు కాన్ఫిడెంట్‌గా చెయ్యండి. చేస్తారని నాకు నమ్మకం కలిగింది… ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి..’ అన్నారు ఎమ్‌డీ.
‘థేంక్యూ సర్…’ అని చెప్పి వచ్చేసింది.
సహోద్యోగిగా పరిచయమయ్యాడు శరత్‌చంద్ర. అబ్బాయిల్లో అరుదైన బంగారు రంగు అతనిది.
తనను చూసి అతనాశ్చర్యపోలేదు. పని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పాడు. తమ విభాగంలోని ఉద్యోగులను పేరుపేరునా పరిచయం చేశాడు.
పరిచయాల తర్వాత తన సీటు చూపించి కూర్చున్నాక, ‘మీ పేరెంత బాగుందో… పేరుకు తగిన మనిషి మీరు..’ అన్నాడు.
అతని మాటల్లో, చూపులో ఏదైనా వెక్కిరింత ఉందేమోనని చూసింది తను. అటువంటిదేమీ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం తన వంతయింది. అది మొదలు, అతని స్నేహంలో నీలకు అన్నీ ఆశ్చర్యాలే. ఎప్పుడూ తన రంగురూపుల ప్రస్తావనే తీసుకురాకుండా అన్నేసి గంటలు ఎలా మాట్లాడగలడో ఆమెకు అర్థం కాలేదు.
శరత్ తన ప్రేమను ప్రతిపాదించినప్పుడు అయితే ఆశ్చర్య సముద్రంలో ఆమె పూర్తిగా తడిసిపోయింది.
‘నన్నా, ప్రేమిస్తున్నావా? ఏం జోక్ చేస్తున్నావా?’ అని తెరలుతెరలుగా నవ్వింది.
‘ఇందులో అంత నవ్వడానికేం లేదు. నీకు నేను నచ్చితే.. మనిద్దరం కలిసి సంతోషంగా జీవితాన్ని గడపగలమన్న భరోసా నీకుంటే చెప్పు చాలు..’ అన్నాడు శరత్.
‘నీకసలు కళ్లు కనపడుతున్నట్టు లేవు. ఎందుకైనా మంచిది ఓసారి పరీక్ష చేయించుకో. నన్ను చూసే అడుగుతున్నావా.. రేప్పొద్దున ఈ నల్లమేకను ఎక్కణ్నుంచి తెచ్చావని అందరూ అడిగితే పూర్వం కథలోని బ్రాహ్మడిలా వదిలేసిపోతావేమో… ‘ అని నవ్వుతూ భుజాలెగరేసింది నీల.
‘నా కళ్లు బానే ఉన్నాయి. నీ ఆలోచనే బాలేదు. స్కూల్లో, కాలేజీలో ఎవరైనా నలుపంటే కొట్టబోయేదాన్ని అన్నావుగా… మరిప్పుడు నిన్ను నువ్వే వెక్కిరించుకుంటున్నావేం? చిన్నప్పుడు కాకరకాయ అని పెద్దయ్యాక కీకరకాయ అన్నాట్ట నీలాంటివాడెవడో. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా అమ్మగారికి?’ అన్నాడు.
‘వానాకాలం మొత్తం నలుపే… కాకి రెక్కల్లో కారు నలుపే… కన్నె కాటుక కళ్లు నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే..’ అంటూ శ్రావ్యంగా పాటెత్తుకున్నాడు శరత్.
అప్పటిదాకా నవ్విన నీల కంట్లో నీళ్లు తిరిగాయి. మనసులో అన్నేళ్లుగా నానుతున్న విత్తనం నుంచి ప్రేమ మొక్క పుట్టింది. రెండేళ్లలో అది మారాకులు వేస్తూ పెరిగింది.

PAPPUARUNA
ఎప్పుడు నిద్రపోయిందో తెలీలేదుగాని మర్నాడుదయమే లేచి జగన్నాథుడి దర్శనానికి వెళ్లారు ఇద్దరూ.
భక్తుల రద్దీ మరీ అంత ఎక్కువగా లేదు.
ఎత్తయిన గోపురం మీద ఎగురుతున్న కాషాయవర్ణపు పతాకాన్ని తదేకంగా చూసింది నీల.
‘దీన్ని ప్రతిరోజూ మారుస్తారు తెలుసా? ఏ యంత్రాల సాయమూ లేకుండా ఒక మనిషి అంత పైకెక్కి పతాకాన్ని మార్చే దృశ్యం చూడటానికి సాయంత్రం భక్తులు పోగవుతారు ఇక్కడ…’ అన్నాడు శరత్.
‘మనిషి తల్చుకుంటే ఏమైనా చెయ్యగలడు… అంటావు. అంతేగా…’ అంది నీల.
‘తన మీద తనకు నమ్మకం ఒక్కటే కాదు నీలోత్పలా. చేస్తున్న పని మీద కూడా అంతే నమ్మకం ఉండాలంటాను… పద లోపలికి’ అని నవ్వుతూ అడుగులేశాడు..
భారీ వేదిక మీద భారీ విగ్రహాలు… సుభద్ర బలభద్రులతో కలిసి నల్లటి జగన్నాథుడు… నల్లటి ముఖంలో తీర్చిదిద్దిన విశాల నేత్రాలు… ముక్కు, చెవులు, కాళ్లు చేతులు.. ఏవీ పూర్తి కాని సగం సగం ప్రతిమలు.. అయినా ఎంత ఆకర్షణ… కౌగిలి కోసం ముందుకు చాపినట్టున్న మొండిచేతులు… నవ్వుతున్నట్టు నోరు…
అసంపూర్ణత్వంలో ఇంత సౌందర్యమా? ఏం సందేశమిస్తున్నాయి ఈ విగ్రహాలు?
ఒక్క క్షణం నీల ఒళ్లు పులకరించింది. భక్తిని మించిన భావమేదో అల్లుకుంటే… తన్మయత్వంతో కళ్లు మూతలుపడ్డాయి. అప్రయత్నంగా చేతులు జోడించింది వినమ్రంగా.
పండాల గోలను దాటుకుని బయటకొచ్చేసరికి స్వర్గంలోంచి బజార్లోకి పడ్డట్టయిపోయింది.
సందుగొందుల్లోంచి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు శరత్. ఆషాఢమాసపు బురద.. ఈగలు..
ఒక ఇరుకింటి ముందు ఆగి ‘అవ్వా.. అవ్వా…’ అని పిలిచాడు.
‘శరత్ బాబూ, నువ్వేగా… లోపలికి రా నాయనా’ అంటూ పలకరింపు వినిపించింది.
లోపలికి అడుగుపెడుతూనే నీలకు ఆమెను పరిచయం చేశాడు. ‘ఈవిడ పేరు శశిమణీదేవి. గర్భాలయంలో నువ్వు చూసిన జగన్నాథుడి భార్య…’ అని.
నీల ఆశ్చర్యపోయింది.
దాన్ని గుర్తించినట్టు ఆమె నవ్వింది. ‘ఎందుకలా బెదరగొడతావా పిల్లను. ఇలా కూర్చో తల్లీ…’ అంటూ అరుగు చూపెట్టి మంచినీళ్లిచ్చింది శశిమణీదేవి. ఆమెకు డెబ్బయ్యేళ్ల వయసుండొచ్చు.
‘నీలోత్పలా, నీకు దేవదాసి సంప్రదాయం కొంచెమైనా తెలుసా…’ అని శరత్ ఎత్తుకున్నాడు.
‘ఈ గుడిలో ఎనిమిది వందల సంవత్సరాల నుంచీ ఉన్న ఆచారమిది. దేశంలో మిగిలినచోట్లలా కాదు, ఇక్కడ దేవదాసీలకు చాలా గౌరవం ఇస్తారు. ఊహ తెలియని వయసులో దేవదేవుడికి అంకితమైన దేవదాసి అంటే ఆయనకు అచ్చంగా భార్యే… ఒకప్పుడున్న సంగీతనాట్య సేవలు ఇప్పుడు చెయ్యడం లేదనుకో. కాని ఈవిడ ఆయన కోసం ఉపవాసాలు కూడా చేస్తుంది…’ అంటూ శరత్ చెబుతుంటే నీలకు సంభ్రమం కలిగింది. గుళ్లో దేవుడేమిటి, ఈ మనిషి ఆయన భార్య ఏమిటి… ఆమె ఊహలు రకరకాలుగా తొణికాయి.
‘నాకు ఐదేళ్ల వయసులో నా తల్లిదండ్రులు ఇక్కడ దిగవిడిచి వెళ్లారని గుర్తు. మాదే ఊరో, అంతకుముందు నాదే పేరో కూడా గుర్తు లేదు. అప్పట్నుంచీ ఇక్కడ సూర్యప్రభ అనే మనిషి నాకు సంగీతనాట్యాలు నేర్పించింది. ఆమె నాకు తల్లి కన్నా ఎక్కువ. నేను పెద్దయ్యాక మంచి ముహూర్తంలో నాకు జగన్నాథుడితో పెళ్లయ్యింది. ఇప్పుడ ంటే అన్నీ రద్దయిపోయాయిగాని అప్పట్లో నేను పాడితేనే స్వామికి సుప్రభాతం. నా పాటతోనే పవళింపు సేవ…’ చెబుతూ శశిమణీదేవి సుదూర స్వప్నాల్లోకి జారుకున్నట్టయిపోయింది.
నీల ఆమెనే చూస్తూ ఉండిపోయింది.
పసుపు రాసుకున్న కాళ్లకు పారాణి, వెండి కడియాలు, చేతుల నిండా గాజులు, ముఖాన కుంకుమ బొట్టు, నుదుట సింధూరంతో ఆమెలో వింత వెలుగేదో కనిపిస్తోంది. వంకాయ రంగు చీర చుట్టబెట్టిన ఆమె వృద్ధ శరీరం ముడతలు పడినా, మానసిక దృఢత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది నీలకు.
‘ఇవాళ సావిత్రి వ్రతం కదా, భర్త దీర్ఘాయుష్షును కోరుతూ మహిళలు ఉపవాసముంటారు. నేను కూడా ఉపవాసమే. మీరు తినండి…’ అంటూ ఫలహారాలేవో పెట్టింది ఆవిడ. తినేసి శరత్ పెరట్లోకి నడిచాడు.
‘ఇదంతా సాధ్యమా…’ అప్పటికి నోరు పెగల్చుకుని అడిగింది నీల.
చిన్నగా నవ్వింది శశిమణీదేవి.
‘నీకివన్నీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. కాని ఒకటి చెప్తాను విను. దేవుడున్నాడనుకుంటే ఉన్నాడు. లేడంటే లేడు. ఉన్నాడనుకుంటే మా బంధమూ ఉన్నట్టే కదా.. పోనీ ఇదంతా కేవలం పిచ్చి ఊహే అనుకుందాం. అయినా ఆ ఊహలోని అనురాగం ఏ లోటూ లేకుండా నాకు జీవితాన్నంతా నడిపే బలాన్నిచ్చింది కదా… ఉలకనిపలకని దేవుడంటావు నువ్వు, అన్నిటిలోనూ అండగా ఉంటాడనుకుంటాను నేను. ఏదైనా అనుకోవడంలోనే కదా ఉన్నది?’ అందావిడ నింపాదిగా.
‘నీ లోపల భయాలన్నిటినీ తీసెయ్యి నీలా. శరత్ అన్నీ ఆలోచించే పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. మా జగన్నాథుడు నల్లగా లేడా తల్లీ? ఆ మాటకొస్తే ఏ దేవాలయంలోనైనా దేవతామూర్తులు నల్లని శిల్పాలే కదా… మరి వాటిని చూసి మనుషులు భక్తితో దండాలు పెడతారు కదా… అప్పుడెందుకు వాళ్లకు రంగు గుర్తు రాదు? ఎందుకంటే దైవమంటే కరుణ, అభయం, ప్రేమ… ఆ లక్షణాలు మీ బంధంలో ఉన్నప్పుడు నువ్వు దేనికి వెనకాడాలి చెప్పు?’ అన్నది శశిమణీదేవి అనునయంగా.
‘లేనిపోని అనుమానాలతో నీ దగ్గరకు వస్తున్న వసంతాన్ని కాదనకు… నీ సంతోషంలో అతని జీవితానందం ఉంది. ఏవేవో ఊహించుకుని నువ్వు దూరం జరిగిపోకు…’ అన్నది బొట్టుపెట్టి కొత్త చీరనందిస్తూ…
ఆకాశంలోకి చంద్రుడొచ్చినట్టు నీల ముఖంలోకి ఒక సంతోష తరంగం వచ్చింది. లోపలికి వచ్చిన శరత్ ముఖంలో వెన్నెల విరిసింది.

–అరుణా పప్పు

కథనానికి బొమ్మ : పినిశెట్టి

Download PDF

19 Comments

  • “కరుణ, అభయం, ప్రేమ… ఆ లక్షణాలు మీ బంధంలో ఉన్నప్పుడు నువ్వు దేనికి వెనకాడాలి?”- బాగా చెప్పారు. కథ బావుంది.

  • మైథిలి అబ్బరాజు says:

    బావుంది అరుణ గారూ.. గుడిలో దేవుడికన్న నమ్మదగిన వాడే కదా ఆ మనిషి, ప్రేమికుడు?

  • Radha says:

    అదేమిటీ అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇంకా కాస్త రాస్తే బావుండేదనిపించింది.

  • సాయి పద్మ says:

    నాక్కూడా అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. .. అరుణ గారి నేరేషన్ బాగుంది ..

  • Lalitha P. says:

    నలుపు నిగారింపూ, నాణ్యతా దక్షిణ దేశపు శిల్పాలలో ఎంత కళకళలాడుతూ తెలుస్తుందో ! అదే ఉత్తర భారత పాలరాతి శిల్పాలలో ఈ కళ ఉండదు. నలుపు వలపు నిక్కచ్చిగా నాణ్యమైనదే!

  • కథ బాగుంది. కొరతా తెలుస్తోంది. సమగ్రంగా లేకనా లేక రచయిత్ర శైలి ఇంకా చదవాలనిపించడం వల్లనా? తెలియదు.
    ఎంత యాదృశ్చికం అంటే.. నిన్న కాక మొన్న ఓ మిత్రుడు వినిపించిన ఈ జానపద గీతం చదవండి – (రచయిత ఎవరో..)

    నలుపు నలుపని నలుగూరు నవ్వేరు – నలుపు నారాయణ మూర్తే కదా..

    వరిచేలు పచ్చైనా, వరికంకి తెలుపైన కోసేటి కొడవళ్ళు నలుపే కదా..

    సూరీడు ఎరుపైనా, సుక్కల్లు తెలుపైన సూసేటి నయనాలు నలుపే కదా..

    మనిషెంత ఎరుపైనా, మనిషెంత ఎత్తైనా నడిచేటి నీడల్లు నలుపే గదా,…

  • Bhavana says:

    చుట్టూ ఉన్న సమాజాలను చూడండి!

    మన చుట్టూ ఉన్న సమాజంలోని పరిస్థితుల నుంచే కళారూపాలు పుడతాయి. కథ, నాటకం, సినిమా- వీటన్నింటికీ ప్రాణవాయువు సమాజమే. అయితే ఈ సమాజపు పరిస్థితులతో పాటుగా- తాము ఊహించుకుంటున్న ప్రపంచాన్ని కళారూపాలలో ప్రదర్శించి తద్వారా ఇతరులకు స్ఫూర్తిని కలిగించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా కథల విషయంలో దీనిని మనం గమనించవచ్చు. చలం ‘ప్రేమ’ స్వేచ్ఛ, లత ‘భావ స్వేచ్ఛ’, యద్ధనపూడి ‘కలల’ స్వేచ్ఛల దగ్గర నుంచి ప్రస్తుత కథకుల ‘సమాజ’ స్వేచ్ఛ దాకా రకరకాల భావనల ప్రాతిపదికన కథలు వచ్చాయి. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటి పాఠకులు అప్పుడు వాటిని అన్వయించుకుంటూ ఉన్నారు. కాని 2000 సంవత్సరం తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో పరిస్థితులలో విపరీతమైన మార్పు వచ్చింది. దీని ప్రభావం కళారూపాలపై కూడా పడింది. సమాజపు విలువలలో, వాటిని వ్యక్తులు చూసే దృష్టి కోణంలో, ఆ విలువలను ఇతరులకు చెప్పే విధానంలో, కథావస్తువుల సేకరణలో, వాటి వ్యక్తీకరణలో,రాసే తీరులో అనేక మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో- బయట వేగంగా మారిపోతున్న పరిస్థితులను అర్థం చేసుకోవటంలో ఉక్కిరిబిక్కిరి అయ్యే రచయితలు అనేక మంది. ఈ సంధి యుగపు లక్షణాలు ఈ రచయితల రచనలలో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ- ‘నాకు చెప్పరె వలుపు నలుపు తెలుపో..’.

    ఒక హీరో, ఒక హీరోయిన్, వారి మధ్య సంఘర్షణకు ఒక వ్యక్తి లేదా సంఘటన లేదా పరిస్థితులు. సినిమా భాషలో చెప్పాలంటే- ఒక అక్క, ఒక బావ, ఒక వ్యాంపు. హీరో, హీరోయిన్‌లు సహజంగా మంచి మనసున్న వారే. పాడు పరిస్థితుల ప్రభావం వల్ల- వారు తమ సహజ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల ప్రభావం నుంచి బయట పడేందుకు ఏదో ఒక ప్లాష్ పాయింట్ ఉంటుంది. దానితో సమస్య సర్థుకుపోతుంది. కథ సుఖాంతమయిపోతుంది. ఆ నాటి దిద్దుబాటు నుంచి తాజా ఈ కథ దాకా ఇదే ఒరవడి. ఈ కథల్లో రచయితలు తమ ఊహలను లేదా అనుభవాలను ఏదో ఒక రూపంలో బయట పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా వాటంతట అవే బయటపడుతూ ఉంటాయి. ప్రస్తుత కథలో- కథాంశం నలుపు. ఇది ఒక వ్యక్తి నివసించే సమాజానికి సంబంధించిన సాంస్కృతిక అంశం. మరింత స్పష్టంగా చెప్పాలంటే జాతికి సంబంధించిన విషయం కూడా. ఉదాహరణకు తమిళనాడుకు వెళ్తే అక్కడ ఎక్కువ శాతం మంది నల్లగానే ఉంటారు. అగ్రవర్ణాలలోనే తెల్ల రంగు కనిపిస్తుంది. జనాభాలో 70 శాతం ఆ రంగే ఉన్నప్పుడు అది సమస్య కాదు. ఏ గుజరాత్‌కో వెళ్లినప్పుడే అది ఒక సమస్యగా మారుతుంది. ఒక సమాజంలో నల్లగా ఉన్న వారి పట్ల వివక్ష చూపించే కొన్ని సందర్భాలు ఉండచ్చు. కాని అవి వ్యక్తిగతమైనవి. వాటిని మనం ప్రపంచబాధలుగా చిత్రీకరించటం అపరిపక్వత అవుతుంది. ఈ విషయాన్ని పక్కనపెడదాం. ఈ కథలో హీరో,హీరోయిన్‌లు అమలిన స్నేహితులు. పూరీకి వెళ్లి ఒకే రూమ్‌లో ఉండగలిగిన స్వేచ్ఛా జీవులు. ఆమెలో తన రంగు పట్ల కొంత అసంతృప్తి, దాని ద్వారా వచ్చే పర్యవసానాల పట్ల కొన్ని అనుమానాలు ఉంటాయి. అది సహజమే. ఇక్కడ రచయిత మళ్లీ ‘సాక్షి’ కాలం నాటి టెక్నిక్‌నే ఉపయోగించారు. హీరో మెరిసిపోయే తెలుపు. హీరోయిన్ బొగ్గు నలుపు. హీరో అపరిమితమైన «ధనం ఉన్నవాడు. హీరోయిన్ ఏమి లేని నిరుపేద. నాటకాలలోను, సినిమాలలోను ప్రేక్షకులకు తారతమ్యాలు స్పష్టంగా తెలియటానికి ఈ టెక్నిక్‌ను వాడతారు. ఇప్పటికీ కూడా రచయిత ఇదే టెక్నిక్‌ను వాడటానికి ప్రయత్నించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. (చిత్రమేమిటంటే- ఇంత తారతమ్యం లేకపోతే అసలు కథాంశమే లేకపోవటం).
    ఇక హీరో పూరీ జగన్నాథుడిపై ఒక దేవదాసికి ఉన్న ప్రేమను ఉదాహరణగా చూపించి- హీరోయిన్ కళ్లు తెరిపిస్తాడు. ఆమె భవిష్యత్తుకు బంగారు బాట పరుస్తాడు. మధ్యలో జగన్నాథుడిని పెళ్లి చేసుకున్న దేవదాసి కూడా మనకు ప్రత్యక్షమవుతుంది. ఈమె ద్వారా కథలో ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా తెలియదు. (దేవదాసి వృత్తిని మరో సారి పరిచయం చేయటం తప్ప..) మొత్తం మీద కథాంశంలో హీరోయిన్ పట్ల ఒక్కింత జాలి, హీరో పట్ల ఆరాధానా భావం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక కథన గమనంలో- పూర్తి డైలాగ్‌ల ద్వారా పాత్రల వ్యక్తీత్వ చిత్రీకరణను చేయగలగటం అత్యుత్తతమైన మార్గం. దీనికి పాత్రల మానసిక పరిపక్వతపై పరిపూర్ణమైన పట్టు ఉండాలి (పాశ్చాత్య సాహిత్యంలోను, అమెరికన్ సిట్‌కాంలలోను ఇవి మనకు కనబడతాయి). సాధారణంగా మన తెలుగు కథలలో ఈ తరహా కథన గమనం సాగదు. కథ చదవిన తర్వాత హీరో, హీరోయిన్లు ఏం చేస్తూ ఉంటారో? వారి సామాజిక హోదా ఎలాంటిదో? వారి పెరిగిన పరిస్థితులు ఎలాంటివో? వారి మధ్య ఉన్న ‘బంధం’ ఎలాంటిదో (వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఉంటే హీరోయిన్‌లో మరింత అభద్రత ఉండే అవకాశం ఉంది)- ఇవేమి తెలియవు.

    సరైన కథలు రావటం లేదు అనే స్టేట్‌మెంట్ అనేక సందర్భాలలో మనం వింటూనే ఉంటాం. సరైన కథలు రావాలంటే- సమాజంలో పరిస్థితులను అర్థం చేసుకోలగాలి. దీనిని అర్థం చేసుకోవాలంటే- మన చుట్టూ ఉన్న అనేక సమాంతర సమాజాల ఘోషలు మనకు వినిపించాలి. కంఫర్ట్ జోన్‌లో కూర్చుని ఊహల ఆధారంగా కథలు రాయటం ఈ సంధి యుగంలో చాలా ప్రమాదకరం. చెప్పుల కుట్టే వ్యక్తి కథను విశ్వనాధ్ సినిమాగా తీసినట్లు ఉంటుంది. ఒక విధంగా ఈ కథ- వర్తమాన రచయితలకు-గత కాలపు టెక్నిక్‌లను ఎందుకు ఉపయోగించకూడదో చెప్పే ఒక గుణపాఠం.

  • Aruna Pappu says:

    సోమ‌శంక‌ర్‌, మైథిలి, రాధ‌, సాయిప‌ద్మ‌, ల‌లిత‌, స‌త్య‌ప్ర‌సాద్ గార్ల‌కు,
    చ‌దివి అభిమానంగా స్పందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు.
    దేన్న‌యినా క్లుప్తంగా రాసే పాత్రికేయ దుర‌ల‌వాటు వ‌ల్ల క‌థ కూడా అప్పుడే అయిపోయిందా అన్న‌ట్టు ఉందేమో మ‌రి. :)
    విమ‌ర్శ‌లేమీ ఇంకా రాలేదేంటి? దార్లో ఉన్నాయేమో! ;)

    • అమ్మలూ కధ చాల నచ్చింది రా .నలుపు మీద వుండే చిన్న చూపు తో బాధించే వాళ్లకి కను విప్పు నీ ఈ కధ. నీకు అభినందనలు.ఈ కధ అందరిలో ఉండే మనసు నలుపుని పోగొడుతుంది అని ఆశిస్తున్నాను.

  • ramnarayan says:

    అది పెద్ద సలుపు

  • CHITRA says:

    మీకు శరత్ బాబు బాగా పనికొస్తాడు . పెద్దిభొట్ల వారు కూడా తప్పక చదవండి . మీ కథల పుస్తకం కావాలి .

  • Kanakamkasi says:

    కథ bag undi .ఇంకా manchichedusong కథలు రాసి పాఠకులను అందపరుస్తావని assist unnanu.

  • -మార్కొండ సోమశేఖరరావు says:

    అరుణ గారు,
    “నాకు చెప్పరె వలపు నలుపొ తెలుపొ” – కధ బాగుంది, కధకి పెట్టిన పేరు బావుంది, సరిగ్గా సరిపొయింది కూడా. శరీరరపు రంగు తెలుపు అయినా, మనసు నలుపైటే చాలా కష్టం.
    వర్ణం, వర్ణ వివక్షత, వర్గం లాంటి విషయాల జోలికి పోకుండా, వలపు గురించి బాగా వ్రాసారు.

  • kadambari says:

    నలుపు నారాయణ మూర్తి- అని నానుడి.
    “నాదీ ఆడ జన్మే”(సావిత్రి), ఊర్వశి (శారద), కథానాయికలు నలుపు;
    అలాగే “చెల్లెలి కాపురం” హీరో శోభన్ బాబు కారు నలుపు- ఇతివృత్తమ్తో తెలుగులో వచ్చిన సినిమాలు, విజయవంతమైనవి.
    మంచి కథ అరుణ గారూ! (konamanini)

  • Aruna Pappu says:

    చిత్రగారు, కనకం గారు, సోమశేఖరరావుగారు, కాదంబరిగారు,
    కథ చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు. మీ సూచనలను తప్పకుండా పాటిస్తాను.

  • david says:

    అరుణ గారు కథ రాసిన విధానం బాగుంది. వలపుకు నలుపు అడ్డుకాదని వివరించిన విధానం ఇంకా బాగుంది. కాకపోతే నలుపు గొప్పతనాన్ని వివరించడానికి సాంఘిక దురాచారమైన ‘దేవదాసి’ విధానంలో చిక్కుకున్న మహిళ ద్వారా నలుపు గొప్పతనాన్ని చెప్పించడమే ఎందుకో అర్ధం కాలేదు. పైగా ఈ దురాచారంలో చిక్కుకున్న మహిళకు దేవుడు అండగా ఉన్నాడని చెప్పించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ దురాచారంలో చిక్కుకున్న మహిళలు ఎంతటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారో దగ్గరినుంచి గమనించిన నాకు ఏ దేవదాసి మహిళ కూడా ఆనందంగా ఉన్నట్లుగా కనిపించలేదు. వారిని చాలా సార్లు ఇంటర్వూ చేసినప్పుడు కూడా దేవుడు భర్తగా ఉండటం మూలంగా ఆనందంగా ఉన్నామని ఏ దేవదాసి మహిళ చెప్పగా వినలేదు. భూస్వామ్యపు భావజాలంలో భాగంగా తామూ కన్నేసిన మహిళను దేవునిపేరుతో కామం తీర్చుకోవడానికి ఆ దేవుని పేరుచెప్పి బలవంతగా ‘దేవదాసి’గా మార్చి ఊరు మగాళ్ళంత కామాన్ని తీర్చుకుంటున్న ఏ మహిళ కూడా సంతోషంగా ఉంటుందని నేను అనుకోను.

  • G.JAWAHARLAL says:

    మీరు చాలా బాగా రాశారు. ఆంధ్రజ్యొతిలో మీ వ్యాసాలు బాగుంటాయి.

Leave a Reply to akondi tripura sundari Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)