కాసేపలా …

PrasunaRavindran

 

కొన్ని దారులంతే, వద్దన్నా పూల వాసనలు వెంటపడతాయ్. భావాల్ని పోల్చుకోమని సవాళ్ళు విసురుతూ, పిట్టలు అవే పాటలు తిరిగి తిరిగి పాడుతూంటాయ్. ప్రయత్నించినా నిమ్మదించలేని నడకలో అక్కడక్కడా పరిచయమయ్యే మంచు బిందువులు, లేత ఎండలో కరిగిపోతాయనుకుంటాం. కరిగిన బిందువులన్నీ మట్టిలో నిద్దురోతూనే కొన్ని రహస్యాల్ని పలవరిస్తాయ్.

 

నడుస్తూనే ఈ దారంట, నాలుగు నవ్వుల్ని నాటి పోవాలి. ఆ నవ్వులెదిగి పూలు పూసి, గాలికి ఊగేప్రతిసారీ , తన నీడలో నడిచిపోయే వారి పైన మధువు చిలకాలి. ముల్లు దిగిన నొప్పి కన్నా, పూల స్పర్శని పంచుకోవడమే నాకిష్టం.

images

 

గుండెలో ఏ మూలో ఓ చిన్న గుడిసేసుకుని కూచుంటావని తెలుసు నాకు. సెలయేటి పాటలైతే బావుంటాయి కానీ , సముద్రపు హోరెందుకు నీకు? అందుకే , ఆ సముద్రానికీ, ఆకాశానికీ ఓ పందెం పెట్టి వదిలేశాను. ఇక నీ దాకా రాదు హోరు.

 

అవును మరి. నా మాటల్ని వింటూనే కోసిన మల్లెమొగ్గల్ని హటాత్తుగా నా ముఖం మీదకి విసిరినప్పుడు, అవి విచ్చుకుని కిందకి జారుతుంటే, నీ కళ్ళలో కనపడే విస్మయాన్ని చూసి ఎన్నేళ్ళయిందని? కాసేపిలా నా పక్కన కూచుని చందమామని చూసేంత సమయముందా? నీ కళ్ళలో ప్రతిఫలించే వెలుగులో దీపించే క్షణాల ద్వారానే నా దారి నేను తెలుసుకోవాలి.

– ప్రసూన రవీంద్రన్

Download PDF

14 Comments

  • Thirupalu says:

    కొన్ని కవితలంతే వద్దన్న పూల వాసన తో వెంటబడుంటాయి!

  • జాన్ హైడ్ కనుమూరి says:

    వావ్వ్వ్ వ్

    ఈ రోజు లేవగానే
    నేలపైన నవ్వులెలా వికసిస్తాయి అని స్పురించాయి రాద్దాములె అనుకున్నా
    ఇక్కడ వికసించదము చూసాక ఆశ్చర్యపొక తప్పలేదు
    అభినందనలు

  • జాన్ హైడ్ కనుమూరి says:

    వావ్వ్వ్ వ్

    ఈ రోజు లేవగానే
    నేలపైన నవ్వులెలా వికసిస్తాయి అని స్పురించాయి రాద్దాములె అనుకున్నా
    ఇక్కడ వికసించదము చూసాక ఆశ్చర్యపొక తప్పలేదు
    అనుభూతి చాలా బాగుంది
    అభినందనలు

  • ప్రసూనా….నువ్వా..అందుకేనా ఇంత సువాసన ! ఇంత భావుకత !

    అభినందనలు

  • Saikiran says:

    (((((((SUPER)))))))

  • shanthi says:

    మీ కవిత చాలా చాలా బావుంది ప్రసూన గారూ.
    “కొన్ని దారులంతే, వద్దన్నా పూల వాసనలు వెంటపడతాయ్.
    నడుస్తూనే ఈ దారంట నాలుగు నవ్వుల్ని నాటి పోవాలి”
    ఇలాంటి పంక్తులు చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపిస్తాయి. కానీ లోలోపల వేనవేల అనుభూతుల్ని దాచుకుంటాయి.

  • బాగుందండి..

  • E sambukudu says:

    ముల్లు దిగిన నొప్పి కన్నా, పూల స్పర్శని పంచుకోవడమే నాకిష్టం.బావుందండి. అభినందనలు.

  • Elanaaga says:

    భావలాలిత్యంతో భాసిల్లింది కనుక బాగుంది మీ కవిత. అభినందనలు

  • “…ప్రయత్నించినా నిమ్మదించలేని నడకలో అక్కడక్కడా పరిచయమయ్యే మంచు బిందువులు, లేత ఎండలో కరిగిపోతాయనుకుంటాం. కరిగిన బిందువులన్నీ మట్టిలో నిద్దురోతూనే కొన్ని రహస్యాల్ని పలవరిస్తాయ్…..”

    Beautiful, Prasuna!!

  • Prasuna says:

    స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. :-)

  • Manasa says:

    ఎంత బాగా వ్రాశారండీ, అక్షరమక్షరానికీ పరిమళాలద్దుతారా మీరు?

Leave a Reply to జాన్ హైడ్ కనుమూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)