ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 11 వ భాగం

(గత వారం తరువాయి)

11

”మనం చిన్నప్పుడు..మూడో తరగతిలో ఉన్నపుడు చదువుకున్న ఓ కథ జ్ఞాపకముందా లీల.. ఒక రాజుంటాడు.. అతను దేవునిగురించి తపస్సు చేసి ప్రసన్నుణ్ని చేసుకుని వరంకోరుకోమంటే..తను ఏది ముట్టుకుంటే అది బంగారంగా మారాలని కోరుకుంటాడు..దేవుడు సరే అని అనుగ్రహించి అదృశ్యమైన తర్వాత అసలు కథ ఆరంభమౌతుంది. మంచాన్ని ముట్టుకుంటే మంచం బంగారం, కుర్చీని ముట్టుకుంటే కుర్చీ బంగారం..పెన్ను బంగారం..మన్ను బంగారం..అన్నం ముట్టుకుంటే అన్నం బంగారం, నీళ్ళు బంగారం..యిక తను ఏం తిని ఏం తాగి..ఎలా జీవించాలి..బంగారం తిని బంగారం తాగి..బంగారం..అదీ మీమాంస..ఈ ఒక్క చిన్న కథ చాలు మనిషి ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో తెలియచెప్పడానికి.. ఈ కథ వెనుక కోటి సిద్ధాంతాలున్నాయి..ఔనా..”రామం ఒక్కక్షణం ఆగి లీలవైపు చూశాడు భావరహితంగా.
ఆమె అతని ఎదుట.. ఏ అక్షరాలూ రాయకముందు ఖాళీ బ్లాక్‌బోర్డులా ఉంది.. ప్రశాంతంగా, భావగర్భితంగా.,
వాషింగ్టన్‌ డి.సి డల్లెస్‌ ఎయిర్‌పోర్ట్‌.. ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణీకుల ప్రత్యేక నిరీక్షణ హాల్‌.. ఎవరూ లేరు.. రిపోర్ట్‌ చేయగానే కతార్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగి ఒకామె అతివినమ్రంగా రిసీవ్‌ చేసుకుని.. వెయిటింగు హాల్‌లో కూర్చోబెట్టి.. యింకో యిరవై నిముషాల తర్వాత బోర్డింగు.. డల్లెస్‌నుండి హైద్రాబాద్‌ 3000 డాలర్లు.
తను ఏర్‌పోర్ట్‌కు వచ్చేటప్పటికే రామం తనకోసం నిరీక్షిస్తున్నాడు.
రామం అంటే క్రమశిక్షణ.. రామం అంటే ఒక ఆత్మనియంత్రణ .. రామం అంటే ఒక మనిషి రూపంలో ఉన్న ఆపాదమస్తక ప్రేమ.. రామం అంటే.. ఒక పవిత్రమైన దేవతా విగ్రహాన్ని నిర్మల హృదయంతో వీక్షిస్తున్నప్పటి అమర దివ్యానుభూతి.. రామం అంటే తృప్తి.
రామం చెప్పిన కథ లీలకు పచ్చని పచ్చి చెట్టు కాండానికి పదునైన బాణంలా దిగింది.
రాత్రి రామం తనతో ఫోన్లో మాట్లాడిన తర్వాత.. హోటల్‌కు వెళ్ళి.. స్నానించి.. పాలనురగలాంటి పడకపై చేరి, స్వర్గాన్ని తలదన్నే మహాద్భుత వాతావరణంలో అటు యిటూ దొర్లుతూ.,
ఉహుఁ… నిద్ర రాలేదు.. రాత్రంతా నిద్ర రానేలేదు.
తను యుఎస్‌లో ఉన్నప్పుడు.. మూడు సంవత్సరాలు.. టిసిఎస్‌లో ఉన్నప్పుడు.. తర్వాత సంస్థలు మారిన తర్వాత కూడా.. రామంతో గడిపిన ఎన్నో సందర్భాలు గుర్తొచ్చాయి లీలకు.. రాత్రంతా.
ఐనా. ఆ గతంలోకూడా తను రామంతో చేసింది ఏమీలేదు.. తను అతన్ని ప్రేమిస్తోందా.. అతణ్ణి యిష్టపడ్తోందా.. అతని తత్వాన్ని మెచ్చుకుంటూ అతనిలో తనుకోరుకుంటున్న పురుషుణ్ణి దర్శిస్తోందా.. అసలేమిటి.. అతను తనకు కావాలా.. లేక తనను తానతనికి అర్పించుకోవాలనుకుంటోందా. లేక అతని అపురూపమైన అందాన్ని తనకు తెలియకుండానే తాను మోహిస్తోందా. అతనిపట్ల తనకు ఏదైనా శారీరక లౌల్యం ఉందా.. అసలేమిటి? దీన్నేమంటారు.
ఏది ఏమైనా రామంపట్ల తనకున్నది ఆరాధన. ప్రేమ. వివశతకాదు.. ఉన్మాదం.. ఉన్మాదిలా తను అతనంటే పడిచస్తోంది.
రాత్రంతా నిద్రలేకుండా అతని ఆలోచనల్లోనే గడిపినపుడు.. ‘యింత సౌకర్యవంతమైన వాతావరణంలో రామం తనవెంట ఉంటే బాగుండును’ అని ఆశపడ్డదిగదా.. ఉంటే..ప్రక్కన..అతని కౌగిలిలో. ఉక్కిరిబిక్కిరౌతూ..దగ్గరగా… ఇంకా దగ్గరగా.. ఒకర్నొకరు హత్తుకుని.. ఇంకా ఇంకా కూడా.. అనుకుంది కదా.. ఆ అదేమిటి.
వ్చ్‌..,
క్యాథీ జ్ఞాపకమొచ్చింది లీలకు.
ఎక్కడో ఒక మొల దిగింది.. సుత్తితో ఓ కర్రచెక్కపై ఇనుపమొలను దిగ్గొడ్తున్నట్లు.. టక్‌ టక్‌ టక్‌.. దెబ్బలు.. సుత్తిదెబ్బలు.
మొల దిగుతోంది.. గుండెలోకి,
రాత్రంతా నిద్రలేక కళ్ళనిండా మంట,
కన్నీళ్లు.. జలజలా.,
‘గోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసినవారూ
జోడుగ నీతో ఆడీపాడీ కూరుములాడినవారూ
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎవడే తెలసినవాడూ..
పయనించే ఓ చిలుకా.. ఎగిరిపో.. పాడైపోయెను గూడూ’
పాట.. ప్రవహించే పాట.. మనిషిని ద్రవింపజేసి ప్రవహింపజేసే పాట.. రామం, తను ఎన్నోసార్లు ఒంటరిగా పార్క్‌లో కూర్చున్నపుడు.. ఎక్కడో తనను తాను కోల్పోయిన అత్మిక ఏకాంతంలో రామం అప్పుడప్పుడు ఈ పాటను మహాద్భుతంగా పాడేవాడు. ఆ గానం గుండెలను పిండి.. నలిపి.. భాషకందని ఓ నిశ్శబ్ద కల్లోలం,
ఎన్నడో తిరిగి యిటు నీ రాక..ఎవడే తెలిసినవాడూ.,
ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తారు.. అసలు తిరిగి వస్తారా.. ఎప్పుడు ఎవరు తిరిగివస్తారో.. అసలు రారో ఎవరికిమాత్రం ఎలా తెలుస్తుంది.
అసలీ రావడమేమిటి.. ఈ పోవడమేమిటి.. రాకపోవడమేమిటి.
వెళ్ళడం. రాకపోవడం రెండూ ఒకటేనా
”లీలా..”
”ఊఁ.. ” ఉలిక్కిపడింది లీల.
”ఎందుకు కళ్ళనిండా నీళ్లు”
”తెలియదు రామం” ఆమె అటువైపు.. గాజుపలకల కిటికీదిక్కు తిరిగి ఎయిర్‌ ఫీల్డ్‌లోకి చూస్తోంది. పెద్ద సిమెంట్‌ పలకలతో విశాలమైన ప్రాంగణం.. అక్కడక్కడ రెక్కలుచాచి నిలబడ్డ ఇనుప పకక్షుల్లా విమానాలు.

13
”లీలా.. నీకన్నీ తెలుసు.. నువ్వు నిజానికి పరిపూర్ణురాలివి. పరిపూర్ణత అనేది మనిషి పరిపక్వతకు పరాకాష్ట.. మాస్లో హైరార్కీ ఆఫ్‌ నీడ్స్‌ సిద్ధాంతం నీకు తెలుసు. మనిషి జీవితంలో అనివార్యంగా ఐదు స్థాయిల్లోనుండి ప్రయాణిస్తాడని ఆ మహానుభవుడు 1943లో చెప్పాడు. భౌతికావసరాలైన కూడు, గుడ్డ, నీడ.. తర్వాత రక్షణ, ప్రేమ.. ప్రేమకోసం పరితపన.. తర్వాత ఆత్మగౌరవం.. అంతిమంగా సెల్ఫ్‌ ఆక్చువలైజేషన్‌. మనిషి చివరికి ‘అసలు నేనెవరిని?’ అని ఎవరికివారు ప్రశ్నించుకునే అలౌకిక పరాకాష్ట.. యిక అక్కడ్నుండి మనిషి ఒక ఆదర్శమానవునిగా మారేందుకు ప్రయత్నిస్తాడు”
లీల వెనుదిరిగి రామం ముఖంలోకి చూచింది.. వ్యాకులంగా.
”ఐతే ఆ స్థితికి కొందరు వివేకవంతులు చాలా చిన్నవయసులోనే చేరుకుంటారు. కొందరు.. అంటే చాలా ఎక్కువమంది అసలా స్థాయికి రాకముందే చచ్చిపోతారు.. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌.. ప్రపంచ నంబర్‌ వన్‌ ధనవంతుడు యాభై మూడేళ్ళ వయసులోనే ఈ ఆదర్శమానవునిగా మారి తన ఆస్తులతో ‘మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌” వంటి దాతృత్వ సంస్థలను నెలకొల్పి విముక్తుడయ్యాడు వారెన్‌ బఫెట్‌ కూడా అంతే. మనిషికి గరిష్టమైన ఆత్మానందాన్నిచ్చే ఈ ఆదర్శస్థితినే భారత పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, బౌద్ధ వాజ్ఞ్మయంలో ‘నిర్వాణ’స్థితి అన్నారు. ఈ స్థితిని చేరేముందు మనిషి పొందే అనంత అంతః కల్లోలాన్ని.. యిప్పుడు నువ్వు పొందుతున్నావు.”
లీల ప్రశాంతంగా అతన్ని చూస్తోంది.
ఎదుట.. అతని వెనుకనున్న ప్రశాంతమైన నీలి ఆకాశంలోనుండి సూర్యోదయమౌతోంది.
స్పష్టంగా నీకేమి కావాలో నీకు తెలియడంలేదు లీలా”
”…….” ఆమెకు మాటలు పెగలడంలేదు.ఎందుకో గొంతులో ఏదో అడ్డుపడ్తున్నట్టు.. ఏదో దుఃఖం పొంగి శరీరమంతా వ్యాపిస్తున్నట్టు.,
”రా..మం..” చాలా అనూహ్యంగా లీల ఒక గాలితెప్పలా వచ్చి రామం గుండెలపై వాలిపోయింది. అతన్ని పూలతీగలా చుట్టుకుపోయి..వర్షించింది..ఎక్కెక్కిపడి ఏడుస్తోంది.. చిన్నపిల్లలా.
అక్కడ ఇద్దరే ఉన్నారు.. ఒక్కరేవలె.
ఒట్టి నిశ్శబ్దమే.. కాని కోటి సంభాషణలు. శతకోటి నివేదనలు.
రామం ఆమె తలను నిమిరాడు మృదువుగా.. ఒకటి.. రెండు.. పది క్షణాల తర్వాత.. లీల ఒక మైకంలోనుండి మేల్కొన్న మనిషిలా అతన్నుండి వెనక్కి జరిగి.. తలవంచుకుని నిలబడి.,
”అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశంమాత్రమే తెలుసు. నిష్క్రమణ తెలియదు..” అన్నాడు రామం.. ఒత్తి పలుకుతూ.. ఒక ప్రవచనంలా.
ఆమె తలెత్తి చూస్తూండగా.,
కతార్‌ ఏర్‌వేస్‌ ఆఫీసరొకామె వచ్చి.. ”షల్‌ వి మూవ్‌ ఫర్‌ బోర్డింగు మేం” అంది.. ఆమె ప్రక్కనున్న బ్రీఫ్‌ను యిమ్మన్నట్టున్న దేహభాషతో
ఇక తాము విడిపోవాలి. తప్పదు..
‘కలుస్తున్నాం అంటే..ఎప్పటికైనా తప్పకుండా విడిపోతామనికదా అర్థం’ అని ఎవరో కవి రాసిన వాక్యం స్ఫురించి,
మధ్య ఘనీభవించిన మౌనమే,
”ఓకే లీలా..సి యు..”
”…..”
లీల బ్రీఫ్‌ను ఆ వచ్చిన స్త్రీ చేతిలోకి తీసుకుంది.
కదిలారు అందరూ.. ఇద్దరు అటు.. రామం ఒక్కడు యిటు..
‘చివరికి ఎవరిదారి వారిదే..’
పోర్ట్‌లోపలికి నడుస్తూ లీల ఒకసారి రామం దిక్కు వెనుదిరిగి చూచింది.. ఆశగా.. శూన్యంగా కూడా.
రామం చేయూపాడు మంద్రంగా నవ్వుతూ.
ఐదు నిముషాల తర్వాత.. ఫస్ట్‌క్లాస్‌ రీజియన్‌లో.. కిటికీ ప్రక్కసీట్లో మెత్తని బెడ్‌వంటి సోఫాపై వెనక్కి ఒరిగి.. గట్టిగా నిట్టూర్చపోతూండగా మొబైల్‌ మ్రోగింది.
”హలో” అంది లీల యధాలాపంగా.
”మేం..” నిర్మల.. ఇండియా.. హైద్రాబాద్‌నుండి.
”ఎక్కడున్నారు మేడం” ఫ్లైట్‌లో ఉన్నా.
”వాషింగ్టన్‌ డి.సి.. రేపు హైద్రాబాద్‌లో ఉంటా నిర్మలా””ఒక అర్జంట్‌ మెసేజ్‌ మేడం..”
”చెప్పు..”
”మన హైద్రాబాద్‌లో ఎస్పీయం అని ఒక బిపిఓ ఉంది మేడం మియాపూర్‌ దగ్గర.. నూట అరవైమంది ఐటీ స్టాఫ్‌ పనిచేస్తున్న కంపెనీ. డెల్లాయిట్‌ అమెరికాతో పనిచేస్తోంది. ఎస్‌ఎపీ ఆపరేషన్స్‌లో దిట్ట. మంచి స్టాఫ్‌ ఉన్నారు. నెట్‌వర్త్‌ ఫిప్టీమిలియన్‌ డాలర్స్‌.. ఐతే నిన్న సౌతాఫ్రికానుండి యోల వెబ్‌హాస్ట్‌ కంపెనీవాళ్ళు మీకోసం ఫోన్‌ చేశారు. వాళ్లు ఇండియాలో ఒక వర్క్‌స్టేషన్‌కోసం వార్‌ ఫుటింగు బేసిస్‌పై సెర్చ్‌ చేస్తున్నారు. బెంగళూర్‌, హైద్రాబాద్‌, చెన్నై.. ఎక్కడైనా ఫర్వాలేదని. మీరు అందుబాటులో లేరుకదా.. అందుకని ఫ్రిలిమనరీస్‌ మాట్లాడాను.ఎస్పీయంను దృష్టిలో పెట్టుకుని ఆఫర్‌ మాట్లాడాను. రాజు అని దీని యండీ. వీడు దీన్ని ఫిప్టీ ఫైవ్‌ కిస్తానంటున్నాడు. అటు యోలా వాడు ఇదే కన్ఫిగరేషన్‌కు సిక్ట్సీ ఎయిట్‌ ఆఫర్‌ చేస్తున్నారు. సెటిల్‌ చేస్తే మనకు ఎంతో బాగుంటుంది. మేడం. థర్టీన్‌ మిలియన్‌ ఫ్రాపిట్‌.. ఖర్చులు పోను టెన్‌మిగుల్తాయి. ఇమ్మీడియేట్‌ డెసిషన్‌ తీసుకోకుంటే సియస్‌సివాడు తన్నుకుపోతాడేమో..”
అంతా అర్థమైంది లీలకు.
నిర్మల కత్తిలాంటి పిల్ల.. కోయడమే.
”మీరు అలాగే దోహానుండి సౌతాఫ్రికా వెళ్లి..”
ఒక్కక్షణం కూడా తేరుకోకముందే.. మళ్ళీ వ్యాపారం.. మళ్ళీ దందా.. మళ్లీ లాభం. మళ్ళీ సంపాదన.
‘యోలా.. అంటే.. అమెరికా సాన్‌ఫ్రాన్సిస్‌కో బేస్ట్‌ ఎంఎన్‌సి.. సౌతాఫ్రికాలో మొన్న మార్స్‌ 2007 నుండే ఆపరేషన్స్‌ ప్రారంభించారు. మంచి ట్రాక్‌ రికార్డున్నవాడు. ఎస్‌ఎపీలో విపరీతమైన ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌లో చొచ్చుకుపోతున్నాడు.. ఆలోచిస్తూనే లాప్‌టాప్‌ను తెరిచి లాగినై, మొబైల్‌లో మాట్లాడ్డం ప్రారంభించింది. ‘నిర్మలా..యోలా సిఇవో పేరు ట్రెరర్‌ హారిస్‌.. సీన్‌ క్రొట్టీ వైస్‌ ప్రెసిడెంట్‌.. తెలుసు .. మన డేటా బేస్‌లో వీళ్ళ హాట్‌లైన్‌ నంబర్సుంటాయి.. నా మూడ్‌ బాగాలేదు నిర్మలా. మొట్టమొదటిసారి నావంతుకు నువ్వు రేపుదయం జోహన్స్‌బర్గ్‌లో ఉంటాడు సియిఓ.. వెళ్ళి కలిసి నువ్వు డీల్‌చెయ్‌.. ఆన్‌ మై బిహాఫ్‌.. సెటిలయ్యేముందు వాడిని నాతో మాట్లాడించు. శాస్త్రిగారినుండి కావల్సినంత డబ్బు తీసుకో. పోయిరా.. ఫస్ట్‌ వెంచర్‌.. బెస్టాఫ్‌లక్‌..” అంది గడగడా.
ఊహించిన ఈ మహదావేశానికి నిర్మల సంతోషంతో ఎగిరెగిరిపడుంటుందని లీలకు తెలుసు.. పోనీ..డిజర్వింగు గర్ల్‌.. అనుకుని.,
”థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్‌ మేడం.. ఐ ఓ టు యు మేడం.. ఫరెవర్‌..” ఇంకా ఏదో అంటోంది నిర్మల..
నవ్వుకుంటూ లీల వెనక్కివాలి.. కళ్ళు మూసుకుంటూండగా ఫ్లైట్‌ టేకాఫ్‌ ఔతున్న కుదుపు.. ఏదో భీకరమైన పరుగు..
పరుగు.. పరుగు.. పరుగు.,
ఎక్కడికీ పరుగు.. ఎందుకీ పరుగు.
‘ఎన్నడో తిరిగి యిటు నీ రాక.. ఎవడే తెలిసినవాడు..’ ఎక్కడో కొండల్లోనుండి.. లోయల్లోనుండి సన్నగా వినిపిస్తున్నట్టు ఆత్మాంతరాల్లో.. పాట.
‘అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశరహస్యం తెలిసింది.. కాని నిష్క్రమణ తెలియదు..’
నిష్క్రమణ.. నిష్క్రమణ..,
ప్రవేశంకంటే.. అనేకసార్లు నిష్క్రమణే ప్రధానం.
ఐతే.. చాలామంది మనుషులకు ఈ నిష్క్రమణ రహస్యం తెలియదు.

(సశేషం)

Download PDF

3 Comments

  • Dr.Shyamala.k says:

    ‘గోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసినవారూ
    జోడుగ నీతో ఆడీపాడీ కూరుములాడినవారూ
    ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
    ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎవడే తెలసినవాడూ..
    పయనించే ఓ చిలుకా.. ఎగిరిపో.. పాడైపోయెను గూడూ’
    పాట.. ప్రవహించే పాట.. మనిషిని ద్రవింపజేసి ప్రవహింపజేసే పాట.
    నవలలో సందర్భోచితంగా పాతలనూ,ప్రస్తావనలనూ తేవడం..మౌళి గారికి అలవాటు.ఏదో పులకింత.
    డా.శ్యామల.హైదరాబాద్

  • karuna says:

    మనిషి చివరికి ” అసలు నేనెవరు “? అని ఎవరికి వారు ప్రశ్నించుకునే అలౌకిక పరాకాష్ట . ఇక అక్కడి నుండి మనిషి ఒక ఆదర్శ మానవునిగా మారేందుకు ప్రయత్నిస్తాడు . ఈ వాక్యాలు చాల బాగున్నై. ఈ ఆలోచన , విచారణ ,అన్వేషణ ప్రతి మనిషి లో కలగాలన్న ఒక ఆకాంక్ష తో ….మౌళీ గారికి ధన్యవాదములు. .

  • ramulu.D says:

    ఒక నినూత్న కథా వస్తువుతో నవల నడుస్తోంది.మనిషి అంతరంగ ఆవిష్కారం అద్భుతంగా జరుగుతోంది.
    మౌళి గారికి ధన్యవాదాలు.
    డా.రాములు,నిర్మల్.

Leave a Reply to Dr.Shyamala.k Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)