ఈ పొద్దుని నిలబెట్టుకుందాం !

Hyderabad_CITY_Page_758745e

57 ఏండ్ల కల భౌగోళికంగా నెరవేరుతున్న సందర్భంలో తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు మొదటి నుండి ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. అది తెలంగాణ వచ్చే వరకు ఎంత పని ఉంటుందో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కవులకు, రచయితలకు అంతకు మూడిరతల సృజనాత్మక పని ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కవులు మొదటి నుంచి ప్రజల పక్షం వహించి తమ తమ నిర్మాణాత్మక ప్రక్రియలను కొనసాగించడం వలననే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో దోపిడీదారులు, దోపిడీకి లోనైనవారు, వివిధ విభిన్న భావాలు ఉన్నవారు కలిసి పని చేశారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెవరి భావజాలాలకనుకూలంగా వారి వారి శిభిరాల్లోకి  వెళ్లిపోతారు. అంతిమంగా ప్రజలపక్షం వహించి రచనలు చేసేవారే మిగిలిపోతారు. అంటే రాజ్యానికి వ్యతిరేకమైన పక్షంగా తిరిగి కవులు తమ పాత్రను మరింత బాద్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
నిజంగా 57ఏండ్లలో ఆధిపత్యవాదులు తెలంగాణలో భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలను విపరీతమైన విధ్వంసానికి లోనుచేశారు. ఇవాళ్ల అది ఎంతదూరమచ్చిందంటే తెలంగాణ మైలురాjైున 1948 సెప్టెంబర్‌ 17ను మరిచిపోయి 1956 నవంబర్‌ 1వ తేదీని యాదికుంచుకునే దుస్థితి ఏర్పడిరది. కారణం పాఠ్యప్రణాళికలన్నీ, వాచకాలన్నీ ఆధిపత్యవాదుల, బ్రాహ్మణ్యవాదుల భావజాలాలతో నిండి ఉండడం.
అంతేకాక ప్రపంచీకరణ విధానాలకు తెలంగాణ ప్రాంతాన్ని ప్రయోగశాలగా మార్చారు. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అందువలన రైతుల, నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర అంతూదరీ లేకుండా జరుగుతూనే ఉన్నాయి. గత 13సంవత్సరాలుగా  బౌగోళిక తెలంగాణను కోరుకుంటున్న రాజకీయపక్షాలు వాస్తవంగా ఆధిపత్యవాదులు ప్రధాన కాంట్రాక్టర్లయితే వారికి ఉపగుత్తేదారులుగా ఈ వర్గాలే మొదటి నుంచి పనిచేస్తూ వచ్చాయి. అందువలన, తిరిగి ఈ వర్గాలే ఆవిర్భవించనున్న తెలంగాణ రాష్ట్రానికి అధిపతులైతే తెలంగాణ సామాన్య ప్రజలకు అణచివేత వర్గాలకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఇది సుస్పష్టం. మళ్లీ తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువైన కవులు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల సంఘాలు అధికార రాజకీయ పక్షాల మోసాలను, కుట్రలను, ముసుగులను బహిరంగపరిచే ప్రతిపక్షపాత్రను నిర్వహించి, ప్రజలను మరో పోరాటానికి సంసిద్ధుల్ని చేయాల్సివుంది.

09-jukanti-300జూకంటి జగన్నాథం

 

 

*******

 

తెలుగు వారికి రెండు రాష్ట్రాలున్నాయని సంతోషించాలో, ఒక్కటిగా ఉన్న కుటుంబం ముక్కలయ్యిందని బాధ పడాలో తెలియని అయోమయ స్థితి. ఈ విభజన వల్ల ఎవరు లాభపడతారో, నష్టపోతారో చెప్పలేం కానీ కోల్పోయింది మాత్రం తెలుగుజాతి గౌరవం.

అయినా అమెరికాలో స్థిరపడ్డ నాలాంటి వారికి రాష్ట్రాలతో పని లేదు, కేవలం భాషా, సాహిత్యాలతో తప్ప. జననీ, జన్మభూమి లాంటి పెద్ద మాటలు వల్లించే హిపోక్రసీ లేకపోవడం వలన కలిసున్నా, విడిపోయినా మనుషులు ద్వేషించుకోకుండా ఉంటే చాలని ఆశిస్తాను. సరిహద్దులు నేలకే కానీ, మనుషులకుండకూడదన్న విజ్ఞత తెలుగు వారికుంటే చాలు.  ఆకలి పుట్టని మనిషి, అన్యాయం జరగని నేలా ఈ భూమ్మీద  లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రచయితలు వ్యక్తుల మీదా, ప్రాంతాల మీద దృష్టి మళ్ళించకుండా తెలుగు సాహిత్య కృషికి శ్రమిస్తే దాన్ని మించిన ఐక్యత లేదు.

–సాయి బ్రహ్మానందం గొర్తి

స్కైబాబా

స్కైబాబా

గంగా జమున తెహజీబ్ కొనసాగాలి: స్కైబాబా

ఎట్టకేలకు తెలంగాణ కల సాకారమైంది.ముస్లింలకు సంబంధించి ఇప్పుడే అసలైన పోరాటం మొదలుకావాల్సిన అవసరముంది..

తెలంగాణా సాధన ఉద్యమంలో ముస్లింలు తమ వంతు పాత్ర పోషించారు.  పెద్ద సంస్థ అయిన జమాతే ఇస్లామీతో పాటు ఎన్నో సంస్థలు, వ్యక్తులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కవులు తమ గొంతు కలిపారు. ‘రజ్మియా’ తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం (67 మంది తెలుగు+ఉర్దూ కవులు), జఖ్మీ ఆవాజ్ (స్కైబాబ), సవాల్ (అన్వర్) తదితర వ్యక్తిగత సంపుటులు తెలంగాణ పై వొచ్చాయి. మొదటి నుంచి కిరికిరీలు చేసిన ఎం ఐ ఎం కూడా చివరికి TRS సభ్యుల కన్నా బాగా అసెంబ్లీలో మాట్లాడడం తెలిసిందే.
తెలంగాణ వల్ల ముస్లింలకు ఏమిటి లాభం అని చాల మంది మనసులో ఒక ప్రశ్న తొలుస్తూ ఉండవచ్చు-
ఎక్కువ కాలం ముస్లిం రాజుల పాలనలో ఉండటం వలన తెలంగాణ వారి సంస్కృతి ప్రాచ్య (ఓరియంటల్ ఇరాన్, ఇరాక్, టర్కీ వగైరా) దేశాల సంస్కృతితో ప్రభావితమైంది. కాబట్టి ఇక్కడి భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, నిద్ర, కళలు, సాహిత్యం అన్నీ కూడా ప్రాచ్య దేశాలను పోలి ఉంటాయి. అలాగే హైదరాబాద్ స్టేట్ తెలంగాణలో మత కలహాలు అనేవి జరగలేదు. ముస్లింలు-ముస్లిమేతరులు కలిసి మెలిసి జీవించే గంగా జమున తెహజీబ్ కొనసాగుతూ వొచ్చింది. ఆ పరిస్తితి మళ్ళీ పెంపొందించుకునే- ఇరు మతాల వారిలో సోదర భావం పెంపొందించుకునే అవకాశం వొచ్చింది.
అలాగే సుమారు 15 శాతం ఉన్న ముస్లింల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. అందుకు సరైన డిమాండ్స్ పెట్టాలి. 12% రిజర్వేషన్ కలిపిస్తామని, ముస్లిం ని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని KCR వాగ్దానాలు చేసి ఉన్నారు.. వాటిని నెరవేర్చేలా వొత్తిడి తేవాలి. ఉర్దూ ను రెండవ అధికార భాషగా అమలుచేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి ముస్లింలకు ఇప్పిస్తూ వాటిని ముస్లిం ల పురోభివృద్ధికి ఉపకరించే ప్రణాళికలు రూపొందించాలి.
-స్కైబాబ

***

ఎన్ని దశాబ్దాల ఆకాంక్ష ఇది! ఈ చారిత్రక విజయం ఉత్తేజకరం, గర్వకారణం. అంతిమంగా విజయం ప్రజలదే అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.  ఎన్ని వెన్నుపోట్లు, ఎంత అణచివేత, ఎందరి పోరాటం, ఎందరి త్యాగాలు! అంతులేని ఆశ నిరాశాల మధ్య, ఉత్సాహ నిరుత్సాహలతో ఎన్ని వేసవుల, ఎన్ని వసంతాల నడక ఇది!

ఈ విజయంలో విద్యార్ధుల, బుధ్ధీజీవుల, రచయితల, కవుల, లాయర్ల, జర్నలిస్టుల పాత్ర గొప్పది. వాళ్ళే లేకపోతే ఉద్యమం ఏనాడో ఆగిపోయి వుండేది. మందగించి వుండేది.

ఉత్తరాంధ్రకి చెందినవాడిగా, తెలంగాణ నాకెలా కనిపిస్తుంది? ఇక్కడ సగం జీవితం గడిపిన వాడిగా ఇది నాకు కొత్త ఎలా అవుతుంది? ఒక్క రోజూ నన్ను పరాయివాడిగా చూడలేదు ఈ నేల. ఎన్నో ప్రజా పోరాటాలను కన్న ఈ నేల ఇంకోలా ఎలా వుండగలదు?
దశాబ్దాల బంధనాల నుంచి కలిగిన ఈ విముక్తి నిజానికి పాక్షికమే, ప్రధానంగా భౌగోళికమే. ఇక నిజమైన విముక్తి విశ్వవ్యాప్తమై వున్న, ఆగని దోపిడీ నుంచే. ఈ పోరాటం ఆగిపోకూడదు. ఈ స్పూర్తి కొనసాగాలి.
—కూర్మనాథ్
***

చిన్న తెలంగాణా పల్లెలో పుట్టిన నేను పైచదువులకు వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు, తెలంగాణా భాష/యాస లో మాట్లాడాలంటే కాస్త బెరుకుగా అనిపించేది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భాష అంత మర్యాదపూర్వకమైన భాష కాదన్న అపప్రద అప్పట్లో ఉన్న కారణంగానేమో, అమ్మ నేర్పిన నా భాషలో నేను మాట్లాడటానికే భయపడాల్సిన దుస్థితి ఏర్పడేది. నా భాషను యాసను ఆంధ్రా మిత్రులు ఎద్దేవా చేసిన సందర్భాలూ లేకపోలేదు. మనిషి సాటి మనిషితో మాట్లాడటానికి ఆ మనిషి పుట్టి పెరిగిన ప్రాంతం ఎందుకు అడ్డం వస్తుందోనని అనుకునేవాణ్ణి. పోయిన పదేళ్ళలో భాషా పరంగా సాహిత్య ధోరణుల్లో, రచయితల్లో వచ్చిన మార్పును చూసినపుడు, తెలంగాణా అస్తిత్వ సాహిత్యం బోనం ఎత్తుకుని నింగిని తాకేట్టు నిలబడ్డ సందర్భాన్ని చూసినపుడు గర్వంగా అనిపించింది. భాషను, యాసను ఒకరు తొక్కేస్తే పోయేది కాదనిపించింది.

 మట్టివాసన ఎక్కడైనా ఒకేలా పలకరిస్తుంది. కవిత్వపు మొలకై మొలిచే కవికి, కవిత్వం పుట్టుక, కవిత్వం నేపథ్యం అంతా మట్టితోనే ముడివడి ఉన్నప్పుడు, ఆ మట్టి ఏ నేలదైతే నేఁ?  ప్రాంతాలకు అతీతంగా కవిత్వాన్ని ప్రేమించే వాళ్లకి కొత్తగా మొలిచిన ఈ కంచే అడ్డంకి కాదు కదా? తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే నేను రాసే తెలుగు అక్షరాలు ఉన్నఫళంగా మారిపోవు కదా? కవి అన్న పదంలోనే ఒక స్వేచ్ఛ ఉంటుంది. కవి నిర్భయంగా ఎక్కడికైనా పోవచ్చు. అన్ని ప్రాంతాల, జాతుల, ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలనూ ప్రతిభింబించే కవిత్వం స్వేచ్ఛగా రాయవచ్చు. తమ భావాలని, బాధలని, అనుభవాలని, అనుభూతులని ఎవరి భాషలో, యాసలో వాళ్ళు రాసినప్పుడే అది పండుతుంది.

 ఆంధ్రాకి, తెలంగాణాకి కిరీటం ఒక్కటే. అది తెలుగు. ఆ కిరీటంలో గౌరవంగా తలెత్తుకుని నిలబడ్డ రెండు సాహిత్య అస్తిత్వాలు ఆంధ్రా, తెలంగాణా. రెండింటినీ గౌరవిద్దాం.

–రవి వీరెల్లి

***

తెలంగాణా ఉద్యమానికి నేను సజీవ సాక్షిని. 1969 లో హైదరాబాద్ లో మా తాతగారి ఇంటి అద్దాలు భళ్ళుమని పగిలాయి. వాటిలోంచి కనబడిన మంటలు , రెండేళ్ల వయసున్న నన్ను వెనక వైపునుంచి గోడ దాటించటం..మొత్తం గుర్తుంది. అప్పుడు వదిలేసిన ఇంటికి,ఊరికి , ప్రాంతానికి తాతగారు తిరిగి ఉండటానికి వెళ్లనేలేదు. ఆ ఊరు మనది కాదు అనుకున్నారు, కోపం తో కాక ఒకానొక వైరాగ్యపు జ్ఞానం తో.వారి సంస్కృతి కొంత వేరు, ఉద్వేగాలు చాలా వేరు, భాష మరింత వేరు. సీమాంధ్ర లో జిల్లా జిల్లా కీ మాండలికం మారినా అక్కడ ఉర్దూ లాగా మరొక భాష ఇక్కడ మిళితమై పోలేదు.
అన్ని ఏళ్లుగా అణిగిఉన్న ఉద్యమం తిరిగి అతి బలోపేతంగా తలెత్తటం వారి గుండెచప్పుడుల నిజాయితీ కి చిహ్నం అని నేను , నావంటి చాలా మంది సీమాంధ్రులూ అనుకున్నారు. సుదీర్ఘమైన సమైక్య ఉద్యమం అటువంటి వారందరినీ ఇంచుమించి ‘ కన్వర్ట్ ‘ చేసేసింది. బిల్ ఆమోదించిన తర్వాత తెలంగాణా నాయకులు అందరి ముఖాలలో, విపరీతమైన ఆనందం, తృప్తి. ఆమోదించకపోయి ఉంటే సీమాంధ్ర నాయకుల ముఖాలు అలా వెలిగిపోయి మాత్రం ఉండేవి కాదు.
సమైక్య ఉద్యమం లో చాకచక్యంగా ఇక్కడ మరపింపజేసిన అంశం ఏమిటంటే పొట్టి శ్రీరాములు గారి దీక్ష ఆంధ్ర రాష్ట్రం కోసం. అది సీమాంధ్ర జిల్లాలు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోవటానికి చేసిన ఉద్యమం. ఇంకొక ముఖ్యమైన సంగతి- ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసేందుకు కేంద్రం ఒప్పుకున్నా కూడా మద్రాస్ నగరం కోసం శ్రీరాములు గారి దీక్ష కొనసాగించబడింది. [కావాలనే ఇక్కడ పాసివ్ వాయిస్ ఉపయోగిస్తున్నాను ] ప్రతిసారీ సీమాంధ్ర ప్రజకి ఇదే దౌర్భాగ్యం ఏర్పడుతోంది. తమది కాని ఒక నగరాన్ని తమది అనుకుని దానికి అంకితమయిపోవటం…ఎవరి సొమ్ము వారు తీసుకోబోతే ఏడ్చి గగ్గోలు పెట్టటం.
ఆంధ్ర రాష్ట్రపు రాజధాని కావలసిన నడిబొడ్డు నగరం విజయవాడ , అప్పటి  కులాల సమీకరణాలలో అది వీలుపడలేదు.  ఇవాళ సీమాంధ్ర వారికి సొంతమని  చెప్పుకోగలిగిన  మహానగరం లేకుండా పోయింది. . అయినా మించిపోయినదేమీ లేదు,ఒక వైపునుంచి కష్టపడి పనిచేసి పైకి ఎదగటంగానూ మరొక వైపునుంచి వాణిజ్య దృక్పథం గానూ  కనబడే ఆ  లక్షణం ఈ  ప్రజలకి పుష్కలంగా ఉంది. ఇవాళ మొదలెడితే మరొక మూడు నాలుగేళ్లలో ఒకటి కాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి…మూడు మహా నగరాలు ఆవిర్భవిస్తాయి. హిందీ తర్వాత ఏ భారతీయ భాషకీ లేని గౌరవం ఇవాళ తెలుగుకి దక్కిందని ఎందుకు అనుకోకూడదు? మనవి తెలుగు అధికారికంగా మాట్లాడే రెండు రాష్ట్రాలు, కాదా?

–మైథిలి అబ్బరాజు

————————————————————————————

రెండు పిడికిళ్లు చూసిన ఆనందం

 

నాకు నచ్చింది.

అవును నాకు నచ్చింది.

ముక్కలైన రాష్ట్రం కనిపిస్తోందేమో మీకు

మొక్కవోని చైతన్యం కనిపించింది నాకు

మీరెప్పుడైనా బిగించిన పిడికిలిని చూశారా?

నేను చూశాను.

ఒకేసారి బిగిసిన పిడికిళ్లు రెండింటిని చూశాను

సమస్యల అగాధంలో నుంచి ఎగసిపడ్డ రెండు అలలను చూసాను

 

సరిహద్దు రేఖలు మారిపోయే సందర్భం

చాలామందికి కొత్తేమీ కాదు

పోయిన దఫా మ్యాప్ మారిన జ్ఞాపకానికి ఇంకా షష్టిపూర్తైనా కాలేదు..

ఇప్పుడు ఇంకోసారి

ఇంకో మార్పు కాలం గుప్పిట్లో దాగుందేమో? ఎవడు చూసొచ్చాడు?

ఇసుకలో గీతలు గీసినంత సులభంగా హద్దులు గీయడం తెలిశాక

ఆకారంలో మార్పు అనివార్యమే

 

నేనెక్కడ పుట్టానన్నది ఇప్పుడు ప్రశ్నే కాదు

ఎవరు గెలిచారన్నది అసలు సమస్యే కాదు.

ఎలుగెత్తిన ప్రతి గొంతులో

రాజకీయ రాగాలను కలిపేవాళ్ళు మనిద్దరికీ పరిచయమేగా

అన్నదమ్ములు పంపకాలకొస్తే

పాడి ఆవు నువ్వే తీసుకోమని ఇద్దరినీ ఉసిగొలిపే స్వార్థం వాళ్ళది

వాళ్ళ కుటిలత్వాన్ని ఏ సరిహద్దురేఖలు ఆపలేవని మనిద్దరికీ తెలుసు

ఇప్పటిదాకా ఇద్దరం కలిసి ఒక్కణ్ణి తిట్టాము

ఇప్పుడు తిట్టిపోసుకోడనికి నీకో నాయకుడు, నాకో నాయకుడు.

 

అందుకే నాకో మాటివ్వు తమ్ముడూ

బిగించిన పిడికిలి పట్టు సడలనివ్వనని చెప్పు..

ఎగసిన అలలను పల్చబడనీనని నమ్మబలుకు

ఎందుకంటే పోరాడిసాధించుకోవాల్సినవి ఇంకా చాలా వున్నాయి

అక్కడైనా ఇక్కడైనా..!! నీకైనా నాకైనా !!

-అరిపిరాల సత్య ప్రసాద్

————————————————————————————————————————————————————

కొమరంబీం ఎగరేసిన నెలవంక జెండా

ఒక ప్రాంతం ఒక ప్రజా సమూహం తమ అస్తిత్వం ప్రశ్నార్థకమౌతున్న సందర్భంలో తన మూలాలు హరించబడుతున్న కాలంలో తన వనరులు దోపిడీకి గురవుతున్న వేళ తన గొంతు పరాయిదవుతున్న రోజున తన సంకెళ్ళను తెంచుకునేందుకు సర్వస్వమూ ఒడ్డి పోరాడే యుద్ధ సమయం ప్రపంచమంతా వ్యాప్తమవుతున్న సందర్భంలో అది తెలంగాణా కావచ్చు కళింగాంధ్ర కావచ్చు రాయల సీమ కావచ్చు ప్రత్యేకించి తెలుగు ప్రజలలోనే అనేక ఏళ్ళుగా ఒక ప్రాంతం వారి అధీనంలో కొన్ని వర్గాల ఆధిపత్యంలో మగ్గుతున్న ప్రజలు దశాబ్దాలుగా తమ అస్తిత్వ పోరాటాన్ని జరుపుతున్నారు.

నేడు తెలంగాణా ప్రజలు తమ ఆరు దశాబ్ధాల అస్తిత్వ పోరాటంలో పాక్షికంగా విజయం సాధించారు. రాబోతున్న భౌగోళిక తెలంగాణాను ఆహ్వానిస్తూనే తెలంగాణా ప్రజలు తమ ఈ విజయాన్ని సంపూర్ణం చేసుకొని పూర్తి స్వేచ్చా స్వాతంత్య్రాలతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూనే వర్గరహిత ఏ ఆధిపత్యమూలేని పీడనలేని సమసమాజం కోసం  జన తెలంగాణా ఏర్పాటు దిశగా ముందడుగు వేయాలని వేలాదిమంది యువతీ యువకుల బలిదానాలు వృధాకారాదని తమ ఆటా పాటా మాటా నిలుపుకుంటూ  కొమరంబీం ఎగరేసిన నెలవంక జెండా స్వేచ్చా రెపరెపలు దశ దిశలా వ్యాప్తి కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ విజయాభివందనాలు అర్పిస్తు…

ఓ సుదీర్ఘ స్వప్నం
రెప్పలపైనున్న కంచెలను తెంచుకుంటూ
సాకారమవుతున్న వేళ
శరభ శరభ దశ్శరభ శరభ
అంటూ ప్రభంజనంలా స్వేచ్చా పతాకాన్ని చేబూని
అమరుల నెత్తురింకిన నేలతల్లి విముక్తి గీతాన్నాలపిస్తూ
జయహో తెలంగాణమా జయ జయహో జన తెలంగాణమా

-కెక్యూబ్ వర్మ

_____________________________________

స్త్రీ సాహిత్యకారులు పుట్టుకొస్తారు!

తెలంగాణ సాహిత్యకారులకు ఇది శుభపరిణామం.
ప్రస్తుతం వేళ్ళ మీద లెక్కపెట్టే అంతమందే స్త్రీ రచయితలు ఉండడం తెలంగాణ ఎంత వెనుకబడి ఉందో తెలియజెబుతోంది.

స్వతంత్ర తెలంగాణలో స్త్రీల సాహిత్యం వెల్లివిరుస్తుంది.ఇపుడు కొద్దిమందే ఉన్నా మరింతమంది స్త్రీ సాహిత్యకారులు పుట్టుకొస్తారు.

మంచి సాహిత్య సృజన జరిగే అవకాశముంది.స్త్రీ విద్య వృద్ది చెంది స్త్రీలు సమానావకాశాలు అందిపుచ్చుకుంటారు. తెలుగు, ఉర్దూ భాషల సాంగత్యం పెరుగుతుంది.
తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉండడం ఆరోగ్యకరమైన పోటీకి వీలు కలుగజేస్తుంది.

— షాజహానా

————————————————————————-

A tale of one city

తెలంగాణ విభజన కోసం 1969, 1972 లలో  ఉద్యమాలు జరిగినా 2009 నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం ప్రజలు, మేధావుల దృష్టిని ఆకర్షించింది.

అన్ని జీవనదులు ప్రవహిస్తున్నా తెలంగాణ భౌగోళికంగా ఎత్తులో వుండడం వల్ల నీరు దిగువలో వున్న  సీమాంధ్రకు వెళ్ళి పోతోందని, కృష్ణ  గోదావరి నదుల కాచ్మెంట్ ఏరియా ఎక్కువ  ప్రాంతం  తెలంగాణకు కేవలం  18.20% నీటి వాటానే  లభిస్తోందని  తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. బ్రిటీష్ వారి హయాములో ఆంగ్ల విద్యను అభ్యసించిన సీమాంధ్రులు రాష్ట్ర సెక్రెటేరియేట్లో అన్ని ముఖ్య ఉద్యోగాలను  చేజిక్కించుకున్నారని  చేస్తున్న ఆరోపణలలో  నిజం లేకపోలేకపోలేదు.

తెలంగాణ వాదం న్యాయమైనది కాదని చెప్పలేము. ఎన్నోసార్లు ఇదే కాంగ్రెస్  చేతుల్లో, ఈ కాంగ్రెస్ నాయకుల చేతుల్లో  తెలంగాణ ప్రజా మోసపోయింది. ‘ పెద్దమనుషుల ఒప్పందం’మొదలుకుని  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు అంతా ఇంతా కాదు.

అయితే ప్రభుత్వం ఈ వ్యవహారం పట్ల సరిగ్గా వ్యవహరించలేదనేది వాస్తవం. తెలంగాణకు న్యాయం చేస్తామంటూనే శ్రీ కృష్ణ  కమిటీ వేసి నివేదికను పట్టించుకోకపోవడం, మీ పోరాటం మీరు చేసుకోండంటూ సీమాంధ్రులను రెచ్చగొట్టడం, మీ హక్కులకోసం వుద్యమించండంటూ తెలంగాణ వారిని పురిగొల్పడం, హస్తిన నుంచి  కాంగ్రెస్ ప్రతినిధులను దించి ఉద్రిక్తతలు  పెంచి పోషించడం  కొన్ని చెడ్డ ఉదాహరణలు మాత్రమే.

విభజన  తెలంగాణకు ఎంతవరకు లాభిస్తుందో తెలియదుగానీ  సీమాంధ్రులకు ఏ రకంగా ఉపయోగ పడదనే చెప్పాలి. వున్న రాజధాని  పోతుంది, కొత్త రాజధాని ఎక్కడో చెప్పరు, అసెంబ్లీ భవనం, సౌకర్యాలు పోతాయి, హైకోర్ట్ భవనం పోతుంది, సెక్రటేరియేట్ వదిలిపోవాలి, హైదరాబాద్లో  ప్రభుత్వ ఆస్తులు వదిలిపోవాలి. పైపెచ్చు  నీళ్ళ సమస్యలు, భౌగోళిక  సరిహద్దుల సమస్యలు, నిప్పులా రాజుకోనున్న పోలవరం ముంపు గ్రామాలు, మొదట మొదటగా 7 వేల కోట్లతో రెవెన్యూ లోటు.ఏ ఒక్క సమస్య పట్ల నైనా  సీమాంధ్రుల  పట్ల  కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంభించింది  లేదు.

రెడ్డి వెలమ భూస్వాములకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు హైదరాబాదు ప్రాంతంలో  కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా  తెలంగాణ రైతాంగ పోరాటం చేసింది. ఇప్పుడు ఆ పార్టీ రెమ్మలము కొమ్మలమని  చెప్పుకుంటున్న కమ్యూనిస్టులు రెడ్డీ వెలమల ఆధిపత్యంలో  జరుగుతున్నా తెలంగాణ ఉద్యమానికి  మద్దతు నివ్వడం, తెలంగాణ రైతాంగ పోరాటాన్ని  సైన్యాన్ని దింపి అణిచి వేసిన  కేంద్ర ప్రభుత్వం అవే కుల నాయకత్వానికి  వంత పాడడం  ఆశ్చర్యం.

స్వాతంత్ర్యం రాక  ముందే  చివరి గవర్నర్ జనరల్ గా  వచ్చిన  లార్డ్ మౌంట్ బాటన్  రెండు మూడు సంవత్సరాలపాటు  నదీజలాలు, ఆశ్విక దళాలు, సంపద, వనరులు, నగదు, ఆభరణాలు, కట్టడాలు, వారసత్వ సంపదలు, భౌగోళిక సరిహద్దులు మొదలైన వాటిమీద అవిశ్రాంతంగా కృషి చేసి, చక్కటి హొమ్ వర్క్ చేసి  దేశ విభజనకు  సహకారాన్ని అందించారు.
ఎటువంటి హొమ్ వర్క్ చెయ్యకుండా  మార్కెట్లో  కూరగాయల్ని వేరు చేసినట్లు  చేపట్టిన అతి పెద్ద విభజనకు  ఆంద్ర ప్రదేశ్ ఒక చెడ్డ ఉదాహరణ.

ధాన్యాగారంగా, అన్నపూర్ణగా  భాసిల్లుతున్న కోస్తా జిల్లాలు  బీడు భూములుగా మారతాయని  ఆందోళన  పడుతున్న ప్రజల  మనోభావాలను పట్టించుకోకపోవడం,  ఉద్యోగాలకు  కల్పవృక్షంగా మారిన హైదరాబాద్ ను సీమాంధ్రులనుంచి వేరుచేయ్యాలనుకోడం, బుల్దోజ్ చేసైనా సరే ఒక్క  పూటలో విభజన చెయ్యాలనడం  చరిత్ర క్షమించలేని  నేరం.

శాతవాహనుల పాలన తర్వాత  అధికారంలోకి వచ్చిన కాకతీయుల పాలనలో ఒకే గొడుగు కిందకు వచ్చిన తెలుగు ప్రజకు ఎంత కష్టం!

-తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

Download PDF

1 Comment

  • swatee Sripada says:

    కన్నతల్లి కూడా ఇద్దరుపిల్లలను సమానంగా చూడటం చాలా అరుదు. అయితే అర్భకంగా ఉన్న పాపాయిని అక్కున చేర్చుకు రవంత జాలిపడటం ,కాస్త దృడంగా ఉన్న బిడ్డడిని నెట్టుకు రాగాదని గర్వపడటం మామూలేగా. పుట్టిపెరిగినది పూర్తిగా జీవితం చదువుకున్నది తెలంగాణమే. పదేళ్ళపాటు పల్లెటూరిలో ఆపైన నిజామాబాద్ లో …ఉద్యోగ రీత్యా , ఉదారపోషణార్ధం పక్క రాష్ట్రాలు చివరకు పక్కదేశాలు చూసినా ఇంత వరకు ఆంధ్రా అన్నదే చూడలేదు. ట్రైన్ లోనుండి తప్ప.
    అయినా నన్నేమ్డుకో అక్కడి వారం కాదని ఇక్కడి వారూ ఇక్కడి వారం కాదని అక్కడి వారు వేలివేస్తూనే ఉన్నారు. ఎక్కడిదాననని అనుకున్నా గమనించినది ఒకటే భాష వేరు కావచ్చు కాని భావాలు మాత్రం అవే. నెల వేరు కావచ్చు కాని అనుభూతులూ అవే. లోలోపలి కుహూ రావాలూ మూగ కావ్యాలు ఎక్కడయినా అవే. ఎవరివైనా అవే.
    దుర్మార్గానికీ అవినీతికీ భాష, పరిసరాలు లేనట్టే మానవత్వానికీ లేదు. మంచితనానికీ లేదు.
    నా భాష మనసుల భాష. నా దారి మానవత్వం. నా ఊపిరి కవిత్వం నా ఉనికి అక్షరాలూ. నా లేమీ అక్షరాలే. అందుకే అక్షరం ఉన్న ప్రతి మట్టి అణువూ నాదే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)