వీరుడు మరణించడు!

‘Re-invention of the wheel’ అని ఇంగ్లీషులో ఒక నుడికారం ఉంది. చక్రాన్ని మళ్ళీ మళ్ళీ కనిపెట్టడం అని కాబోలు దీని అర్థం. ఈ విశాల భూప్రపంచంలో అటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఒకానొక దాన్ని ఇంతకు ముందు ఎప్పుడో ఎవరో కనిపెట్టారని తెలియని వారు, తమే కనిపెట్టామని అనుకునే ప్రమాదం ఉంటుంది. ఒక దాన్ని అనేక మంది ఏకకాలంలో కనిపెట్టినా, ఆ సంగతి తెలియనప్పుడు ఎవరికివారు మేమే కనిపెట్టామని అనుకోవడమూ జరుగుతూ ఉంటుంది. అలా అనుకోడంలో అజ్ఞానం ఉన్న మాట నిజమే. ఇంకోవైపు నుంచి చూడండి…అందులో జ్ఞానం కూడా ఉంది.

ఎందుకంటే, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతివ్యక్తీ ఈ ప్రపంచాన్ని తన కళ్ళతో చూస్తూ, తన బుద్ధితో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వివిధ వయోదశల మీదుగా అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అప్పటికే ఆ వయోదశను దాటినవారికీ, అతనికీ పోలిక ఉండదు. అతను ప్రతి పరిణామాన్నీ, ప్రతి అనుభవాన్నీ కొత్తగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఉదాహరణకు, తొలి యవ్వనంలో, అందులోనూ వసంత కాలంలో ప్రతి ఒకరి మనసులోనూ కలిగే మధురమైన అలజడినే తీసుకోండి. అది అతనికే(లేదా ఆమెకే) సొంతం. అది మొదట్లో అర్థం కాని ఓ ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాగే, నడివేసవిలో మలయమారుతం తాకినప్పుడూ, ఆ అనుభవం అలాంటి అర్థం కాని ఆహ్లాదంగానే ఉంటుంది. ఇలా ప్రపంచమూ, ప్రకృతీ కూడా ప్రతి తరంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూ, మళ్ళీ మళ్ళీ కొత్తగా ఆవిష్కృతమవుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అన్నిసార్లూ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. దానినే మనం ‘జీవించడం’ అంటాం.
దీనినే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే… ‘ఎవరి అనుభవమూ, ఎవరి అనుభూతీ వారిది కాన!’

అయితే, ఇదే సమయంలో చూడండి, సార్వత్రిక జ్ఞానమూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది, లేదా పరిణామం చెందుతూ ఉంటుంది. దానినే నేను ‘అదనపు విలువ’ను జోడించడం అంటాను. ప్రతి తరమూ, ప్రతి కాలంలోనూ జ్ఞానానికి అదనపు విలువను జోడించుకుంటూ వెడుతుంది. లేదా వెళ్ళాలి.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, ఈ వ్యాస పరంపరలో అక్కడక్కడ ‘re-invention of the wheel’ తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే, ‘అదనపు విలువ’ను జోడించడమూ బహుశా మీకు కనిపిస్తుంది. దేనికైనా సరే, అదనపు విలువను జోడించే అవకాశం లేనప్పుడు దేని గురించీ నేను రాయలేను. రాయవలసిన అవసరం కనిపించదు. అటువంటప్పుడు నా కలం(లేదా కీ బోర్డ్) గట్టిగా మొరాయిస్తుంది. అయితే, ఇంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి అదనపు విలువ అనుకున్నది కూడా అదనపు విలువ కాకపోవచ్చు. అజ్ఞానం నా కలం కన్నా మొండిది.
అప్పుడిక, ‘ఎవరి అనుభవమూ, ఎవరి అనుభూతీ వారిది కాన…!’

***

ఈ వివరణ నేపథ్యంతో కోసల-మగధ ‘సినిమా కథ’ చూద్దాం.

ఇందులో కథనమే నాది కానీ, కథ కోశాంబీదే. మల్లబంధులకు పెట్టిన పరీక్షా, పుష్కరిణిలో స్నానం చేయాలన్న మల్లిక కోరికను అతను తీర్చడం రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘ఓల్గా సే గంగ’ నుంచి తీసుకున్నవి.

olga se ganga

ఇంతకీ సినిమా కథ అన్నాక ఒక హీరో ఉండాలి కదా?! ఈ కథలో హీరో ఎవరు? ఇది నాకు ముందుగా ఎదురైన ప్రశ్న. నాకు వదలిపెడితే; పసనేది, మల్లబంధుల, అజాతశత్రు, విదూదభుడు, దీర్ఘచరాయణుడు…వీరిలో ఎవరైనా హీరో కావచ్చునంటాను. వీళ్లలో ఏ ఒక్కరి కోణం నుంచైనా ఈ కథ చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే, నా ఉద్దేశంలో ఈ కథలో వీళ్ళెవరూ హీరోలు కారు, కోసల అదృశ్యమై మగధ ఏకైక సామ్రాజ్యంగా అవతరించడం అనే చారిత్రక పరిణామం; అంటే చరిత్ర, హీరో! లేదా విలన్! విలన్ ప్రధానంగా సినిమా ఎందుకు ఉండకూడదు? అయితే, చరిత్ర హీరోగా (లేదా విలన్ గా) తీసిన సినిమా చూడడానికి మన ప్రేక్షకులు అలవాటు పడకపోవడం ఒక సమస్య. పోనీ నేనే చరిత్రను హీరోను చేసి సినిమా తీద్దామంటే ఓ వందకోట్లు(హాలీవుడ్ స్థాయిలో అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కాబోలు) నష్టపోవడానికి నా దగ్గర ఓ వెయ్యికోట్లు లేవు.

కనుక అర్జెంటుగా, ప్రేక్షకులు తేలిగ్గా కనెక్ట్ అయ్యే హీరోను సృష్టించాలి. అతనిలో హీరోయిజంతోపాటు అతను ఒక ఉన్నత లక్ష్యంకోసం పోరాడేవాడు అయుండాలి. నాకు మల్లబంధుల కనిపించాడు. అలాగని కోశాంబీ చెప్పిన చారిత్రక వివరాన్ని పక్కన పెట్టడం నాకు ఇష్టంలేదు. అది, మల్లబంధులను పసనేది చంపించడం. హీరో మధ్యలోనే చనిపోతే ఇక సినిమా ఎలా?! దాంతో మల్లబంధులను పసనేది చంపించిన సంగతిని దాచిపెట్టాను. అతను అదృశ్యమయ్యాడని మాత్రమే చెప్పాను. అతనికి అచ్చంగా తనలానే ఉన్న ఒక కొడుకు ఉన్నాడని చెప్పాను కనుక, కథ ప్రకారం మల్లబంధుల అదృశ్యమైనా ప్రేక్షకులకు అతను కనిపిస్తూనే ఉంటాడు. ఆవిధంగా హీరో ‘బతికే’ ఉంటాడు, అది చాలు.

కథలో నేను చేసిన ప్రధానమైన మార్పు ఇదొక్కటే. కాకపోతే, పసనేది, వాసభ ఖత్తియ, దీర్ఘచరాయణుల పాత్రలకు రూపురేఖలు ఇవ్వడంలో అక్కడక్కడ స్వతంత్రించి ఉంటాను. అయితే, అందులో కూడా చారిత్రక వివరాల హద్దుల్లోనే ఉండడానికి ప్రయత్నించాను. ఉదాహరణకు వాసభ ఖత్తియనే తీసుకోండి, ఆమెను ఉత్తమురాలిగా చెబుతున్నప్పుడు నాగజాతీయుల ఆడబడుచు అని గుర్తుచేశాను. బుద్ధుడికి నాగజాతీయులపై విశేష గౌరవాభిమానాలు ఉండేవని కూడా అన్నాను. అది చారిత్రక వాస్తవమే. బుద్ధుడికి నాగజాతీయుల మీద ఎంత అభిమానమంటే, తను శాక్యుడైనా ముందు జన్మలో తనో ఉత్తమ నాగుడినని ఆయన చెప్పుకుంటాడు.

bimbisara bimbisara
ప్రధానమైన మార్పు దగ్గరికి మరోసారి వెడితే, అది సినిమా కోసం చేసిన మార్పే కానీ, కేవలం ‘సినిమా కోసమే’ చేసిన మార్పు కాదు. అందులో కూడా చరిత్ర, బహుశా పురాచరిత్ర ఉన్నాయి. అవి ప్రపంచవ్యాప్తం కూడా. నిజానికి చరిత్రకానీ, పురాచరిత్రకానీ ఉన్నచోటే ఉండిపోవు, అవి వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని మనం తేలిగ్గా గుర్తించం. లేదా గుర్తించడానికి నిరాకరిస్తాం. వర్తమానంలోకి ప్రవహించే చరిత్రను, పురాచరిత్రను పక్కకు తోసేస్తూ వర్తమానం చుట్టూ ఎత్తైన ఆనకట్ట కట్టుకుని మనం బతికేసే తీరు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అసలు చరిత్రే లేనివాళ్ళంగా, ఉన్నా దానితో మనకెలాంటి సంబంధం లేనివాళ్లంగా, ఇరవయ్యొకటో శతాబ్దంలోనే పుట్టిన ఓ ‘స్వయంభూ’ జాతిగా నటిస్తూ మనం ఎలా బతికేయగలమో నాకు ఎప్పుడూ అర్థం కాదు. ఇదే మాట నేను ఇదివరకూ అన్నట్టున్నాను. ఆశ్చర్యం ఎన్నిసార్లైనా అనిపిస్తుంది.

వెనకటి సమాజాలు తమ పరిధుల్లో, తమకున్న పరిమిత వనరులలో తమదైన ఒక జీవన నుడికారం(idiom)తో జీవించాయని నాకు అనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరంగా, ప్రపంచమంతటా అన్ని సమాజాలూ దాదాపు ఒకే జీవన నుడికారాన్ని పంచుకున్నాయని కూడా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛతో సహా వేటినైతే మనం ఆధునిక విలువలని అనుకుంటున్నామో, లేదా భ్రమపడుతున్నామో అవన్నీ వెనకటి సమాజాలు కూడా అనుభవించాయి. అనుభవించడం కాదు, ఒక హక్కుగా డిమాండ్ చేసి సాధించుకున్నాయి. పీడితులు స్వేచ్ఛగా తమ భావవ్యక్తీకరణ చేసుకోడానికి పీడకులు సైతం ఒక రోజునూ, కొంత జాగానూ అనుమతించడం కనిపిస్తుంది. అసలాలోచిస్తే, స్వేచ్ఛే మానవ ప్రకృతి అనడానికి చరిత్ర పొడవునా సాక్ష్యాలు కనిపిస్తూనే ఉంటాయి.
ఈ సందర్భంలో రాంభట్ల కృష్ణమూర్తిగారు ‘జనకథ’లో రాసిన మాటలు గుర్తొస్తున్నాయి…

‘మా స్వగ్రామం విశాఖజిల్లాలో చోడవరానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న కుగ్రామం. పేరు పెదపూడి అగ్రహారం….డానికి సర్వాధికారి మా తాత…ఆ గ్రామంలో మాది కాక, మరో ఐదు బ్రాహ్మణ ఇళ్ళున్నాయి…గ్రామంలో ఎక్కువమంది గొల్లలు. కాపుల కుటుంబాలు అయిదారు ఉండవచ్చు. గ్రామం నడుమను రెండు బాగా పెరిగిన రావి చెట్లు, రామస్వామి కోవెల…గవిరమ్మ సంబరాలలో రామస్వామి కోవెల ముందు వాలకాలు కడతారు. వాలకం అంటే జీవితం అని అర్థం. అమ్మవారి సంబరాల్లో కట్టే వాలకాలు గ్రామీణుల హాస్యానుకరణలు. ఈ శతాబ్దారంభంలో అమెరికాలో ప్రచారం అయిన వాడెవిల్లె నాటకాలలాంటివి ఈ వాలకాలు. బర్బర మహాదశ(ఫ్రాక్ చరిత్రకు మోర్గన్ కట్టిన రెండు మహాదశలలో రెండోది బర్బర దశ. మొదటిది శావేజి దశ) నాటినుంచీ అంకురారోపణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేవి వాలకాలు…’

ఇందులో చెప్పకపోయినా ముఖాముఖీ మాట్లాడుకున్నప్పుడు వాలకాలగురించి మరికొన్ని ముచ్చట్లు ఆయన చెబుతుండేవారు. ఓ సారి ఆయన తాత గారి దగ్గర పనిచేసే పాలేరే వాలకం కట్టి హాస్యమూ, వ్యంగ్యమూ జోడిస్తూ తన యజమానిని కడిగిపారేశాడట. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పారు కానీ నాకు గుర్తులేదు. మొత్తానికి, ‘వాలకం’ అనేది ఒక అభినయరూపంగా మరుగున పడి ఒక అస్తవ్యస్త ఆకారాన్ని సూచించే మాటగా నేడు మిగిలింది.
ఇప్పుడీ వెలుగులో, వాడెవిల్లె(vaudeville) గురించి Webster Dictionary ఏమంటుందో చూడండి:

(Vaudeville) ‘A kind of song of a lively character, frequently embodying a satire on some person or event, sung to a familiar air in couplets with a refrain; a street song; a topical song. American entertainment, popular from 1870.

మొత్తానికి మన వాలకానికైనా, వాళ్ళ వాడెవిల్లె కైనా వేళ్ళు పురా చరిత్రలో, రాంభట్లగారు చెప్పినట్టు బర్బర దశలోనే ఉండి ఉండచ్చు.

చెప్పొచ్చేదేమిటంటే, బహుశా పురాచరిత్ర కాలంలో ఉండి, చరిత్ర కాలంలోనూ, ఇటీవలివరకూ కొనసాగిన ఇలాంటి ఒక జీవన నుడికారాన్ని ఆధారం చేసుకునే కోసల-మగధ కథలో పైన చెప్పిన ప్రధానమైన మార్పు చేశాను. అది: ‘వీరుడు మరణించడు’ అనే విశ్వాసం, లేదా భావన.

అవును, వీరుడు మరణించడు! వీరుడే కాదు, సమాజానికి ఏదో ఒక హితం చేసిన వ్యక్తి, లేదా ఏదో ఒక విధంగా సమాజం నుంచి ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వ్యక్తి-మరణించినట్టు కచ్చితమైన ఆధారం ఉంటే తప్ప ఎప్పటికీ మరణించడు. ముఖ్యంగా ఆ వ్యక్తి సజీవంగా ఉండి అదృశ్యమైపోయినప్పుడు జనస్మృతిలో అసలు మరణించే అవకాశమే లేదు. ఈ భావన కేవలం అభిమాన సూచకమైన సెంటిమెంట్ మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇంకో అడుగు ముందుకు వేసి, ఇలాంటి వారిని సజీవులుగా ప్రచారంలో ఉంచడం వెనుక సామాన్యప్రజానీకం అనుసరించే ఒక కచ్చితమైన వ్యూహం కూడా ఉందని నేను అంటాను. ఆయా చారిత్రక ఘట్టాలలో దుర్భరమైన హింసను, పీడనను, జీవన సంక్షోభాన్ని ఎదుర్కొనే సమాజాలు ఒక ‘మెసయ్యా’ కోసం పరితపిస్తాయి. లేనప్పుడు ఒక మెసయ్యాను సృష్టించుకుంటాయి. అవి ఆ విధంగా తమ చుట్టూ ఒక ఊహాత్మక రక్షణ కవచాన్ని నిర్మించుకుంటాయి. ఒక్కోసారి అత్యంత బలవత్తర శక్తులకు వ్యతిరేకంగా సామాన్యప్రజానీకం ఎంతో తెలివిగా ప్రయోగించే ఒక వ్యూహాత్మక ఆయుధమే ‘వీరుడు మరణించడు’ అనే భావన.

 

మన పురాణాలు ఏడుగురిని చిరంజీవులుగా చెబుతాయి. ఒక పట్టిక ప్రకారం ఆ ఏడుగురు వీరు: అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు. ఇంకో పట్టికలో మార్కండేయుడు కూడా చేరతాడు. ఇంకా ఏవైనా పట్టికలు ఉన్నాయేమో తెలియదు. చిరంజీవులుగా చెప్పడంలో వీరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండచ్చు. అశ్వత్థామ గురించి ఇవే వ్యాసాలలో ఒకచోట చెప్పాను. భారతయుద్ధంలో పాల్గొన్న కౌరవవీరులలో ప్రాణాలతో మిగిలిన ప్రముఖులు ముగ్గురే: అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ. మొదటి ఇద్దరూ చిరంజీవుల పట్టికలో చేరారు. మూడో వ్యక్తి ఎందుకు చేరలేదో తెలియదు. అశ్వత్థామ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వీరుడు కూడా. అలాగే, తన అన్నలతో సహా రాక్షసవీరులందరూ మరణించినా ప్రాణాలతో మిగిలింది విభీషణుడే. ఇక బలి కూడా అదృశ్యుడైపోయినట్టు చెప్పే ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. ఆ వివరాలలోకి మరెప్పుడైనా వెడదాం. ఆయా కాలాలలో పురాణ, ఇతిహాసాలను బోధించే ప్రతి ఒకరూ వ్యాసులే అనుకుంటే(ఇంద్రుడిలా వ్యాసుడు ఒక వ్యక్తి కాదు, పదవి అని గుర్తిస్తే) వ్యాసుడు చిరంజీవే. అలాగే, హనుమంతుడికీ, పరశురాముడికీ కూడా చిరంజీవుల జాబితాలో చేరడానికి ప్రత్యేక కారణాలు ఉండే ఉంటాయి.

jai-somnath

కె. ఎం. మున్షీ రాసిన ప్రసిద్ధ చారిత్రక నవల ‘జై సోమ్ నాథ్’. అందులో గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకోడానికి భారీ సైన్యంతో బయలుదేరతాడు. అతి క్లిష్టమైన రాజస్తాన్ ఎడారి మీదుగా అతని ప్రయాణం సాగుతూ ఉంటుంది. మార్గ మధ్యంలో ఒక దుర్గానికి అధిపతి అయిన మోఘా రాణా అనే వీరునికి ఈ విషయం తెలుస్తుంది. అతడు గజనీ మహమ్మద్ ను అడ్డుకోడానికి ప్రయత్నించి అమరుడవుతాడు. అప్పుడు గజనీ మహమ్మద్ ను అడ్డుకునే బాధ్యతను అతని కొడుకు తీసుకుంటాడు. తండ్రి మోఘా రాణా ‘భూతం’గా తను మారి, తండ్రి ఉనికిని చాటుతూ జనంలో ధైర్యాన్ని నింపుతాడు. మరోపక్క, గజనీ మహమ్మద్ ను ముప్పుతిప్పలు పెడతాడు.

the journeyer

ఇటలీ వ్యాపారి, యాత్రికుడు మార్కోపోలో(క్రీ.శ. 1254-1324) ఆత్మకథ ఇతివృత్తంగా ‘The Journeyer’ పేరుతో Gary Jennings పెద్ద నవల రాశారు. మార్కోపోలోను తీసుకుని అతని తండ్రి, పినతండ్రి ఇటలీ నుంచి చైనాకు వెడుతుంటారు. అది క్రూసేడ్ల(మతయుద్ధాలు) కాలం. మధ్యప్రాచ్య దేశాల మీదుగా వెడుతూ ఓ చోట వాళ్ళు ఓ సత్రంలో బస చేస్తారు. సత్రం యజమానికీ, వారికీ ఇలా సంభాషణ జరుగుతుంది:

సత్రం యజమాని: రాత్రిపూట తగిన రక్షణ లేకుండా బయట తిరగద్దు. ఇది దారి తప్పిన దుండగులు తిరిగే ప్రాంతం.
మార్కోపోలో: ఎవరా దుండగులు?
సత్రం యజమాని: కొండ మీద ఉండే ఓ పెద్దాయన తరపున పని చేసే హంతకులు.
మాఫియో పోలో(మార్కోపోలో పినతండ్రి): ఏం కొండ? ఈ ప్రాంతమంతా బల్లపరుపుగా ఉంటేను…
సత్రం యజమాని: ఏమో… ఆయనను ‘కొండ మీద ఉండే పెద్దాయన’ అనే అంటారు. ఆయన పేరు షేక్ ఉల్-జిబల్. నిజంగా ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు.ఆయన నివసించే దుర్గం కొండ మీద నిజంగా ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు.
నికోలో పోలో(మార్కోపోలో తండ్రి): అతనా? అతనిప్పుడు జీవించి లేడు. పదిహేనేళ్ళ క్రితం మంగోలులు అతన్ని చంపేసి పీడ వదిలించుకున్నారు.
సత్రం యజమాని: నిజమే…అలాగని నిజమూ కాదు. మీరు చెప్పిన పెద్దాయన వేరు. ఆ స్థానంలో ఇంకో ‘పెద్దాయన’ ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు…మీకు తెలుసో, తెలియదో?
నికోలో పోలో: ఓహో! ఆ సంగతి నాకు తెలియదు.
సత్రం యజమాని: అదే మరి… ఆ ‘పెద్దాయన’ ఆదేశాలను దారి తప్పిన దుండగులు ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు. ఆ దుండగుల్లో కూడా కొంతమంది ఇప్పటికే వృద్ధులైపోయి ఉంటారు. అయినా సరే…
కొండ మీద ఉండే పెద్దాయన పేరు చెప్పి దుండగులు చేసేది ఏమిటంటే, వర్తకుల మీద పడి వారిని చంపి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం. దీనికో కొసమెరుపు ఉంది. పోలోలు ముగ్గురూ నిద్రపోతుండగా ఈ సత్రం యజమానే దుండగుడుగా మారి వారిని దోచుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో వీరి చేతిలో అతనే మరణిస్తాడు.

 

ఈ ఉదంతం, పైన చెప్పిన వీరులు, ఇతరుల ఉదంతానికి భిన్నంగా ఉన్న మాట నిజమే. కానీ గమనించండి, ఫార్ములా మాత్రం ఒకటే…ఒక అదృశ్యవ్యక్తిని, లేదా అసలు లేనే లేని వ్యక్తిని నిరంతరం ప్రచారంలో ఉంచడం! నేడు మనకు తెలిసిన ప్రచారసాధనాలు లేనికాలంలో జనం ఇలాంటి ఒక మౌఖిక ప్రచార సాధనాన్ని సృష్టించుకున్న ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయని నేను నమ్ముతున్నాను. దానిని నేను ఆ కాలపు జీవన నుడికారం అంటాను. పురాచరిత్ర, చరిత్ర మీదుగా వర్తమానంలోకి ప్రవహించే ఇలాంటి జీవన నుడికారాన్ని మేళవించడమే ఈ కథకు నేను జోడించే ఒకానొక అదనపు విలువ.

***

ఇటీవలి కాలానికి చెంది మనకు బాగా తెలిసిన రెండు ఉదాహరణలే చూడండి. ఒకరు, అల్లూరి సీతారామరాజు, రెండోవారు, సుభాస్ చంద్ర బోస్. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైనికుల చేతిలో మరణించిన సంగతిని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారని మనకు తెలుసు. తూర్పు గోదావరి జిల్లా బెండపూడికి చెందిన ఒక సాధువు, లేదా పాపికొండల్లోని పేరంటపల్లిలో జీవించిన బాలానంద స్వామి(ఈయన గురించి ఇవే వ్యాసాలలో ఒక చోట రాశాను) అల్లూరి సీతారామరాజే కావచ్చునన్న ప్రచారమూ జరిగేది. అలాగే సుభాస్ చంద్ర బోస్ విమానప్రమాదంలో మరణించలేదని గట్టిగా నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు.
ఎందుకంటే, వీరుడు ఎప్పటికీ మరణించడు!

Download PDF

5 Comments

  • mohan says:

    ఎంతో ఆసక్తికంరంగా నడుపుతున్నారు కధను.
    మీరు రెఫెర్ చేస్తున్న పుస్తకాలూ ఇంటర్నెట్ నుంచి కొనుక్కోవచ్చ?
    ధన్యవాదాలతో
    మోహన్

    • kalluri bhaskaram says:

      థాంక్స్ మోహన్ గారూ…1. జనకథ విశాలాంధ్రవారు వేశారు. ఇప్పుడు దొరుకుతున్నట్టు లేదు. 2. ఓల్గా సే గంగ- రెండు తెలుగు అనువాదాలు ఉన్నాయి. బహుశా ఒకటి మార్కెట్ లో దొరకచ్చు-లేదా రెండూ 3. జై సోమ్ నాథ్ ను భండారు సదాశివరావు గారు తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు దొరుకుతోందో లేదో వాకబు చేయాలి. 4. గ్యారీ జెన్నింగ్స్ రచన 1985 ప్రచురణ. బహుశా ఇంటర్నెట్ కు వెడితే అమెజాన్ లాంటి వాళ్ళ దగ్గర దొరకచ్చు.

      • kalluri bhaskaram says:

        అన్నట్టు…తీసే వాళ్ళే ఉండాలి కానీ జై సోమ్ నాథ్ కూడా మంచి పట్టు మీద సాగిన రచన. సినిమాకు కావలసిన అన్ని మసాలాలు అందులో ఉన్నాయి. మన సినిమా వాళ్ళ దృష్టి(ముఖ్యంగా హిందీ సినిమా వాళ్ళ దృష్టి) దాని మీద ఎందుకు పడలేదో తెలియదు. మన వాళ్ళకు చరిత్ర మీద బొత్తిగా ఖాతరు లేదు.

  • D.Nageswara Rao says:

    చాలా బాగా రాసారు.. వాస్తవానికి చరిత్ర చాలా ఘాటుగానూ – మనం నిర్మించుకున్న వాస్తవాల మేడలను కూల్చేదిగానూ ఉంటుంది గనుకనే చరిత్ర జోలికి చాలామంది పోరని నా ఉద్దేశ్యం. ముఖ్యంగా మీరు ప్రస్తావించిన ఘజని కాలం నాటి చరిత్ర గురించి పట్టించుకోక పోవడమనేది ఈ నాటి మేధావుల లౌక్యం పోకడల్లో ఒకటి !!

  • pentaiah says:

    చరిత్ర లో మరుగున పది పోయిన ఘజినీ కాలం నాటి కథను మాలాంటి వారికి తెలియ జేసి నందుకు ధన్యవాదాలు.కాని వీరుడు మర నిన్చడు అంటే అతడు ఎ ఆశయం కోసం అయితే పోరాడినాడో ఆ ఆశయం మరనించదు అని కాదా ? భౌతికంగా మరణించడం అనా అర్థం.

Leave a Reply to kalluri bhaskaram Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)