అడవుల్లోకి వెళ్లడానికి బ్రాహ్మణుడే ‘పర్మిట్’

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

దారపు ఉండను వేలాడుతున్న అనేక కొసల్లో దేనిని పట్టుకోవాలన్న సమస్య మళ్ళీ వచ్చింది!

ఇంతకుముందు వ్యాసాలలో,  ముఖ్యంగా గత నాలుగు వ్యాసాలలో కొన్ని ప్రస్తావనలు చేశాను. కొన్ని పేర్లు ఉటంకించాను. కొన్ని పరిణామాల గురించి, ఘటనల గురించి చెప్పాను. వీటిలో దేనినైనా  పట్టుకోవచ్చు. అయితే, సమస్యే అది… దేనిని పట్టుకోవాలి?!

ఉదాహరణకు, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడం గురించి చెప్పాను. ఆ కొసను పట్టుకుని నిరభ్యంతరంగా  ముందుకు వెళ్లచ్చు. అదే సమయంలో, పురాచరిత్ర, చరిత్ర అనేవి వర్తమానంలోకి ఎలా ప్రవహిస్తాయో చెప్పాను. దానిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం కనిపిస్తోంది.

అలాగే, దీర్ఘచరాయణుడు, వస్సకారుల గురించి చెప్పాను.  ఇలాంటివారే మనకు తెలిసిన వ్యక్తులు కొందరు ఉన్నారు… చాణక్యుడు, రాక్షసమంత్రి; చరిత్ర కాలంలో యుగంధరుడు, తిమ్మరసు తదితరులు. దీర్ఘచరాయణుడు, వస్సకారుడు వీళ్ళకు మాతృక(proto-type)లుగా మీకు కనిపించి ఉండాలి. కానీ మనకు చాణక్యుడు తదితరుల గురించి మాత్రమే తెలుసు. వాళ్ళకు మాతృకలు ఉన్న సంగతి తెలియదు.  కనుక పట్టుకోదగిన కొస ఇక్కడ కూడా ఏదో ఉంది.

చాణక్యుడు, ముఖ్యంగా అతని అర్థశాస్త్రం, చాణక్యుని శిష్యునిగా చెప్పుకునే మౌర్య చంద్రగుప్తుడి మనవడు అశోకుని గురించి మాట్లాడుకునేటప్పుడు మన చరిత్ర విస్మృతికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు ఉన్నాయి. ఆ కొసను కూడా పట్టుకోవచ్చు. అసలు అర్థశాస్త్రం గురించే చెప్పుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అదీ ఒక మంచి కోసే.

క్రీ.పూ. 6వ శతాబ్దం; మనదేశంలోనే కాక, దాదాపు ప్రపంచవ్యాప్తంగా మత,సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎన్నో పోలికలు గల  మార్పులు సంభవించిన కాలంగా చెబుతారు. అది కూడా పట్టుకోదగిన కోసే.

ఇక, చాణక్యుడు తదితరులకు దీర్ఘచరాయణుడు, వస్సకారులు మాతృకలు అయినప్పుడు, దీర్ఘచరాయణుని అలా ఉంచినా, వస్సకారునికి మాతృక లెవరన్న మరో ఆసక్తికరమైన ప్రశ్నను మీ ముందుకు తేవాలని ఉంది. అది కూడా ముఖ్యమైన కొసే. పురాచరిత్ర, చరిత్ర వర్తమానంలోకి ప్రవహించడం అనే కొసతో దగ్గరి సంబంధం ఉన్న కొస కూడా అది.

ఇక ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి రాక తప్పదు… ఈ చివరి కొసను పట్టుకుంటే ఎలా ఉంటుంది?!

***

విచిత్రం ఏమంటే, చాణక్యుడు మొదలైనవారి మాతృక ఎవరో మనకు అంతగా తెలియకపోవచ్చు కానీ, వస్సకారుడి మాతృక ఎవరో గుర్తించడం చాలా తేలిక. కాకపోతే, మనం పౌరాణిక కాలానికి వెళ్ళాలి. మన పురాణ, ఇతిహాసాల నిండా వారు కనిపిస్తారు. మనకు చరిత్ర కన్నా పురాణాలే బాగా తెలుసుననీ, మన దృష్టిలో పురాణాలే చరిత్ర అనీ అనడానికి ఇది కూడా బహుశా ఒక నిదర్శనం.

ఇక్కడ ఇంకో విశేషాన్ని కూడా చెప్పాలి. పురాణ, ఇతిహాసకాలం పురాచరిత్రలోకీ, చరిత్రలోకీ అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న సందర్భాలలో ఇదొకటి అన్నప్పుడు; నేటి 21 వ శతాబ్దాన్ని కూడా అందులో చేర్చి మరీ చెబుతున్న సంగతిని మీరు ప్రత్యేకించి గమనించాలి. ఈ కోణం మొత్తం నా వ్యాస పరంపరకు జోడించే అతి ముఖ్యమైన ‘అదనపు విలువ’ల్లో ఒకటి!

స్థూలంగా చెబితే, పురాణ, ఇతిహాసాలలో కనిపించే మునులే వస్సకారునికి మాతృకలు. వాళ్లందరికీ ప్రతినిధిగానూ, వాళ్ళలో ప్రముఖునిగానూ వశిష్టుని చెప్పుకున్నా; అగస్త్యుడు, జరత్కారువు మొదలైన మునులు చాలామంది ఉన్నారు. మునులు అరణ్యాలలో ఆశ్రమాలు కట్టుకుని ఉంటారన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆ అడవుల్లో ఆదివాసీ తెగలు ఉంటాయని తెలుసు. అంటే, మునులు ఆదివాసీ తెగల మధ్య జీవించగలరన్నమాట. అంటే, వాళ్ళు ఆదివాసీ తెగల మధ్యకు సునాయాసంగా వెళ్లగలరన్న మాట… అదీ సంగతి!

వస్సకారుడు చేసింది అదే. అయితే, వస్సకారుడు ఒక రాజకీయ కుట్రను అమలు చేయడానికి తెగల మధ్యకు వెళ్ళాడు. కనుక అడవుల్లో ఉండే మునులందరూ వస్సకారునికి మాతృకలని నేను అనడం లేదు. కొందరు మునులు వేరే ప్రయోజనాలకోసం కూడా అడవుల్లో ఉంటూ ఉండచ్చు. కానీ, మునులు ఆదివాసీ తెగల మధ్యకు సునాయాసంగా వెళ్లగలగడమే చూడండి…అది రెండంచుల కత్తి. ఒక అంచును రాజకీయ అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు.

ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే, అడవుల్లోకీ, ఆదివాసీ తెగల మధ్యకీ వెళ్లడానికి ‘పర్మిట్’, లేదా ‘లైసెన్స్’ ఒక్క మునులకే ఉంది. ఈ రోజుల్లో మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ, ఆరోజుల్లో ఆ పర్మిట్ లేదా లైసెన్స్ చాలా విలువైనది. మునులు, లేదా బ్రాహ్మణుల విలువను, ప్రతిపత్తిని పెంచిన వాటిలో ఇది కూడా ఒకటి కావచ్చు. బ్రాహ్మణులకే ఈ పర్మిట్ ఎందుకు ఉందో ఊహించడం కష్టం కాదు. వాళ్ళు నిరాయుధులు! వాళ్ళ నోట మంత్రమే కాదు, ఎదుటివారిని మంత్రించే మాట కూడా ఉంది. వ్యవసాయ విస్తరణ దాహంతో అడవుల్లోకి చొచ్చుకువస్తున్న సాయుధ క్షత్రియులతో ఆదివాసులది సహజవైరం. కనుక క్షత్రియులు నేరుగా అడవిలోకి ప్రవేశించే అవకాశం లేదు. క్షేమం  కాదు. ఆవిధంగా అడవుల్లోకి క్షత్రియుల ప్రవేశానికి బ్రాహ్మణుడు టార్చ్ లైట్ లేదా లైసెన్స్ అయ్యాడన్న మాట. బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత మరింత గట్టిపడదానికి  బహుశా అదే ప్రారంభమూ కావచ్చు.

బ్రాహ్మణులు అడవుల్లోకీ, ఆదివాసుల మధ్యకూ  వెళ్లడం మాత్రమేనా…? కాదు, వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు. కొందరైనా వాళ్ళలో కలసిపోయారు, లేదా వాళ్ళను తమలో కలుపుకున్నారు.  బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యతనే కాక, బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధాలను వెల్లడించే ఉదంతాలు పురాణ, ఇతిహాసాలలో అసంఖ్యాకంగా ఉన్నాయి. రాజు-పురోహితుల సంబంధం ఎలాంటిదో జనమేజయుడు-సోమశ్రవసుల(సోమశ్రవసుడి తల్లి నాగజాతీయురాలు, తండ్రి బ్రాహ్మణుడు. ఆవిధంగా అది  కూడా బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధమే) ఉదంతంతోనూ, బ్రాహ్మణ-ఆదివాసీ వివాహ సంబంధాలను జరత్కారుడు-జరత్కారువుల ఉదంతంతోనూ నా సర్పయాగ వ్యాసాలలో చర్చించాను. కనుక ఇప్పుడు వాటిలోకి వెళ్లకుండా ఒక ఉదంతానికి పరిమితమవుతాను. అది, క్షత్రియుల అటవీ ప్రవేశానికి బ్రాహ్మణుడు ‘పర్మిట్’ అన్న సంగతిని చాలా స్పష్టంగా, ఆశ్చర్యకరంగా వెల్లడించే అపురూపమైన ఉదంతం.

***

VanaParva

మహాభారతం, ఆదిపర్వం, సప్తమాశ్వాసంలో ఉన్న ఆ ఉదంతంలో చెప్పుకోదగిన విశేషాలు చాలా ఉన్నాయి కనుక దానిని కొంత వివరంగా ఇవ్వదలచుకున్నాను:

పాండవులు తొలి విడత అరణ్యవాసం చేస్తున్నారు. అప్పటికి వారికింకా వివాహం కాలేదు. ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉండి వేదాధ్యయనం చేస్తూ, యాయవారం చేసుకుంటూ తల్లి కుంతితోపాటు ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉంటున్నారు. ఓ రోజున ఓ బ్రాహ్మణ బాటసారి అటుగా వెడుతూ పాండవులు ఉన్న ఇంట్లో విశ్రాంతి తీసుకోడానికి ఆగాడు. అతడు పాంచాలరాజు ద్రుపదుని రాజధాని కాంపిల్య నుంచి వస్తున్నాడు. అతనికి పాండవులున్న ఇంటి యజమాని ఆతిథ్యమిచ్చాడు. పాండవులు కూడా మర్యాదలు చేశారు. ఆపైన-

‘మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏయే దేశాలు బాగుంటాయి, ఏయే రాజులు ఉత్తములు?’  అని పాండవులు అతన్ని అడిగారు.

‘ద్రుపదుని దేశంతో సాటి వచ్చే దేశమే లేదు. ద్రుపదుని కంటే ఉత్తముడైన రాజే లేడు’ అంటూ అతను ద్రుపదుని చరిత్ర చెప్పాడు. ఆ తర్వాత ద్రౌపదికి స్వయంవరం ప్రకటించిన సంగతిని చెప్పాడు.

పాండవులకు ఆ స్వయంవరానికి వెళ్లాలని అనిపించింది. కొడుకుల మనసు తెలుసుకున్న కుంతి, ‘ఇక్కడే ఎక్కువ కాలం ఉండిపోయాం. ఇలా ఎంతకాలం ఉన్నా ఏమిటి ఉపయోగం? అదీగాక పరుల ఇంట్లో ఎంతకాలమని ఉంటాం? దక్షిణ పాంచాలం మంచి వాసయోగ్యమనీ, పాంచాల రాజు ధార్మికుడనీ విన్నాం కనుక అక్కడికే వెడదాం. అక్కడి గృహస్థులు బ్రాహ్మణులకు అడగకుండానే భోజనం పెడతారట కూడా’ అంది.

ఆరుగురూ బయలుదేరారు. పెద్ద పెద్ద సరస్సులు, మహోగ్రమైన పర్వతాలు, కీకారణ్యాల గుండా వారు నిరంతరం నడక సాగించారు. మధ్యలో ఒకచోట వారికి వేదవ్యాసుడు కనిపించి, ‘ద్రుపదపురం వెళ్ళండి, మీకు మేలు జరుగుతుం’దని చెప్పి ఆశీర్వదించాడు.

రాత్రనక, పగలనక అలా నడుస్తూ వెళ్ళి ఆ ఆరుగురూ ఒకనాటి అర్థరాత్రి సమయానికి గంగానదిలోని సోమశ్రవతీర్థానికి చేరుకున్నారు. వారికి అందులో స్నానం చేయాలనిపించింది. దారిచూపడానికీ, రక్షణ కోసమూ ఒక కొరివి చేతిలో పట్టుకుని అర్జునుడు ముందు నడుస్తుండగా అతని వెనకే మిగిలిన వారు నదిని సమీపించారు. సరిగ్గా అప్పుడే ఒక గంధర్వుడు తన ఆడవాళ్ళతో కలసి జలక్రీడలాడడానికి అక్కడికి వచ్చి ఉన్నాడు. పాండవుల అడుగుల చప్పుడు విని వారి వైపు చూశాడు. అతనికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే విల్లు తీసుకుని పెద్దగా నారీధ్వని చేశాడు.

‘అర్థరాత్రీ, సంధ్యలూ- భూత, యక్ష, దానవ, గంధర్వులు సంచరించే సమయాలు. ఈ సమయాలలో మనుషులిక్కడ  తిరగడానికి భయపడతారు. ఇలాంటి వేళల్లో ఎంతటి బలవంతులైనా, రాజులైనా సరే మేము ఓడించేస్తాం. దగ్గరికి రావద్దు, దూరం తొలగండి. నేను అంగారపర్ణుడనే గంధర్వుణ్ణి. కుబేరుడికి మిత్రుణ్ణి. ఈ ప్రదేశంలో నేను ఎప్పుడూ విహరిస్తూ ఉంటాను. నన్నే ఎరగరా మీరు? ఈ అడవీ, గంగాతీరమూ అంగారపర్ణాలుగా జగత్ ప్రసిద్ధాలు. మనుషులు ఇక్కడికి రావడానికి భయపడతారు’ అన్నాడు.

అప్పుడు అర్జునుడు, ‘చేతకాని మనుషులైతే అర్థరాత్రి, సంధ్యాకాలాల్లో తిరగడానికి భయపడచ్చు. కానీ మేము ఎప్పుడైనా, ఎక్కడైనా తిరుగుతూనే ఉంటాం. ఎందుకంటే, మేము చాలా శక్తిమంతులం. ఈ అడవులు, ఏరులు నీ సొంతమా? ఈ భూమి మీద ఉన్న జనులందరూ సేవించుకోదగిన ఈ పుణ్య భాగీరథి నీదేమిటి? మేము ఈ నదిలో స్నానం చేయడానికి వచ్చాం. నువ్వు వద్దంటే మానే వాళ్ళం కాదు. నీ మాటలకు మేమెందుకు భయపడతాం?’ అంటూ ముందుకు నడిచాడు.

అప్పుడు అంగారపర్ణుడు అతని మీద వాడి బాణాలు ప్రయోగించాడు. కోపించిన అర్జునుడు అవి తనకు తగలకుండా కాచుకుంటూ తన చేతి కొరివితోనే వాటిని చెదరగొట్టాడు. ‘ఈపాటి భయపెట్టడాలూ, మాయాలూ అస్త్రవిదులమైన మమ్మల్ని ఏంచేస్తా’యంటూ అతనిమీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం అప్పటికప్పుడు అంగారపర్ణుని రథాన్ని దగ్ధం చేసేసింది. తను కూడా దగ్ధమైపోతానన్న భయంతో అంగారపర్ణుడు కిందికి దూకేసాడు. అప్పుడు అర్జునుడు అతని కొప్పు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ధర్మరాజు ముందు పడేసాడు. దాంతో అతని భార్య కుంభీనస అనే ఆమె పెడబొబ్బలు పెడుతూ తనకు పతిదానం చేయమని వారిని ప్రార్ధించింది. ధర్మరాజు జాలిపడి, ఓటమి చెందిన ఈ హీనుణ్ణి  విడిచిపెట్టమని అర్జునుడికి చెప్పాడు. ‘కురుకులేశ్వరుడైన ధర్మరాజు నిన్ను విడిచిపెట్టమన్నాడు. ఇక భయపడకు’ అంటూ అర్జునుడు అతనితో అని, తీసుకెళ్లి అతని ‘మంద’లో విడిచిపెట్టాడు.

ఆ తర్వాత అంగారపర్ణుడికీ, అర్జునుడికీ మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అంగారపర్ణుడు: నీ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ అంగారపర్ణత్వం నాకెందుకు? ఇంకా దీనిని ధరించడానికి నేను మరీ అంతా సిగ్గుమాలిన వాణ్ణా? గర్వం అణిగిపోయేలా యుద్ధంలో ఓడిన తర్వాత కూడా వెనకటి పేరు చెప్పుకుని గర్వించేవాణ్ణి హాస్యాస్పదుడిగా చూస్తారు తప్ప సత్సభల్లో ఎవరైనా మెచ్చుకుంటారా? నీ ఆగ్నేయాస్త్రం వల్ల నా రథం దగ్ధమైనా, నా గంధర్వమాయతో అనేక రత్నాలతో అలంకృతమైన విచిత్ర రథాన్ని పొంది ఇక నుంచి చిత్రరథుడనే పేరుతెచ్చుకుంటాను.

అదలా ఉంచి, నీ పరాక్రమాన్ని మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నేను తపస్సు చేసి చాక్షుసి అనే విద్యను పొందాను. ఈ విద్యతో మూడు లోకాల్లోనూ ఏం జరుగుతోందో చూడచ్చు. ఈ విద్య వల్లే మేము మనుషులకంటే గొప్పవాళ్ళమై, దేవతల శాసనం కిందికి కూడా రాకుండా ఉండగలుగుతున్నాం. అయితే, ఈ విద్య దుర్మార్గుల పరమైతే ఫలించదు. నువ్వు తాపత్య వంశ వర్ధనుడివి, మహాపురుషుడివి కనుక నీకు ఫలిస్తుంది. ఈ దివ్యవిద్యను నీకు ఇస్తాను, తీసుకో. అయితే దీనిని స్వీకరించేటప్పుడు షణ్మాసవ్రతం చేయాలి. ఆపైన, నీ ఆగ్నేయాస్త్రాన్ని నాకు ఇస్తే, మీ అయిదుగురికీ నూరేసి చొప్పున మహాజవసత్త్వాలు కలిగిన గంధర్వ హయాలు ఇస్తాను.

ఈ గుర్రాలు ఇంకా ఎలాంటివో చెబుతాను, విను. పూర్వం వృత్రాసురునిపై ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు. అది వజ్రంలా కఠినమైన వృత్రుని శిరస్సు మీద పడి, పతన వేగం వల్ల పది ముక్కలైంది. ఆ ముక్కలే వరసగా బ్రాహ్మణునికి వేదమూ, క్షత్రియుడికి ఆయుధమూ, విట్(విశ్-వైశ్యుడు)కు నాగలి, శూద్రులకు సేవ, వాహనాలలో వేగమూ అయ్యాయి. అటువంటి వేగం కలిగిన వాటిలోనూ సాటి లేని గుర్రాలు అయ్యాయి.

అర్జునుడు: ఎంత మిత్రుడైనా సరే, ఇంకొకరినుంచి విద్యను, వేదాన్ని, విత్తాన్ని తీసుకోను. అంతగా నీకు ఇష్టమైతే, నా ఆగ్నేయాస్త్రాన్ని తీసుకుని, నీ గుర్రాలు ఇయ్యి. ఇకనుంచి నీతో గాఢస్నేహం చేస్తాను. అది సరే కానీ, పరమ ధార్మికులం, పరమ బ్రహ్మణ్యులమైన మమ్మల్ని మొదట్లో అదిలించి ఎందుకు మాట్లాడావు?

అంగారపర్ణుడు: త్రిలోకాలలోనూ చెప్పుకునే మీ నిర్మలగుణాల గురించి నారదుడు మొదలైన మునీశ్వరులు, సిద్ధసాధ్య గణాల ద్వారా ఎప్పుడూ వింటూనే ఉంటాను. భూభార దురంధరులు, గుణోదారులు, ధీరులు, భరతవంశోత్తములు అయిన పాండవుల గురించి తెలియనివారు ఎవరు? అయినా సరే, పరుషవాక్యాలు ఎందుకు పలికానంటావా? మీరు అగ్నిహోత్రంతోనూ, బ్రాహ్మణునితోనూ లేరు కనుక-

ఎంత వివేకం ఉన్నవాడికైనా ఆడవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మదమెక్కుతుంది. ధర్మం తప్పుతాడు. మంచీ చెడూ విచక్షణ కోల్పోతాడు. నేను కూడా ఎంత వివేకినైనా సరే, ఆడవాళ్ళ మధ్యలో అలా మాట్లాడాను. అందులో ఆశ్చర్యం ఏముంది? మన్మథుణ్ణి గెలవడం ఎవరి తరం?

బ్రాహ్మణులను ముందు పెట్టుకునే పుణ్యాత్ములైన రాజులను ధిక్కరించడానికి దేవతలు, గరుడులు, నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, భూతాలు, గంధర్వులు కూడా చాలరు. వేదవేదాంగవేత్త, జపహోమ యజ్ఞ తత్పరుడు, సత్యవచనుడు, సదాచారుడు అయిన బ్రాహ్మణుని పురోహితుని చేసుకున్న రాజు ఈ భూమండలం మొత్తాన్ని ఏలగలగడమే కాదు, పుణ్యలోకాలు కూడా పొందుతాడు. బ్రాహ్మణుడు వెంట లేకుండా స్వశక్తితో రాజ్యం సంపాదించడం ఏ రాజుకు సాధ్యం? మీరు యమ, వాయు, ఇంద్ర, అశ్వినుల వరప్రభావంతో పాండురాజుకు, కుంతికి పుట్టినవాళ్లు; ధర్మం తెలిసినవారు, భారద్వాజ శిష్యులు, సమస్త లోకాల మేలు కోరేవారు. కనుక మీరు పురోహితుడు లేకుండా ఉండకూడదు.

నువ్వు బ్రహ్మచర్యవ్రతంలో ఉన్నావు కనుక మన్మధావేశంతో ఉన్న నన్ను ఓడించగలిగావు. అదే బ్రాహ్మణునితో ఉన్న రాజైతే, భోగలాలసుడైనప్పటికీ అన్ని యుద్ధాలూ గెలుస్తాడు. కనుక మీ గుణోన్నతికి తగిన ధర్మతత్వజ్ఞుని, పవిత్రుని పురోహితునిగా చేసుకోండి.

అప్పుడు అంగారపర్ణుని అర్జునుడు అడిగాడు… ‘మేము కౌంతేయులం కదా, మమ్మల్ని తాపత్యులని ఎందుకు అన్నా’వని.

అప్పుడు అంగారపర్ణుడు తపతీ-సంవరణోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు…

***

అంతకంటే ముందు, అర్జున-అంగారపర్ణ సంభాషణలో దొర్లిన అనేక విశేషాలను స్పృశిస్తూ ఆ ఉపాఖ్యానంలోకి  వెడదాం.  అది వచ్చే వారం…

 

 

 

Download PDF

1 Comment

  • rajaram thumucharla says:

    చాలా ఆసక్తి కరంగా వుంది భాస్కరం గారు వచ్చే వారం ఎదు చూడక తప్పదు నేను

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)