ఘోష!

Kadha-Saranga-2-300x268
కూతురు చేసొచ్చిన నిర్వాకం తెలుసుకుని, అంజని నిర్ఘాంత పోయింది.
“నీకు మతి కాని పోయిందా ఏమిటే, సింధూ?” ఎంత మెత్త గా మందలిద్దామనుకున్నా, పట్టలేని ఆవేశం ఆమె మాటల్లో పొంగుకు రానే పొంగుకొచ్చింది.
ఆగ్రహపు రొప్పు వల్ల, ఆమె యెద ఎగసెగసి పడటాన్ని, గమనిస్తూనే వుంది సింధు.
ఆవిడే కాదు, తన తల్లి స్థానం లో ఏ స్త్రీ వున్నా, అంతే  ఉద్రేక ప డుతుందన్న  సంగతి ఆమెకు తెలుసు.
ఎందుకంటే, కూతురి కాపురం పట్ల ఒక తల్లి పడే ఆవేదన అది. తన వైవాహిక జీవితం చిద్రమై పోతుందన్న

ఆందోళన. ఈ నిజం బయట పొక్కాక, సమాజం తననొక  సిగ్గు లేని దానిగా చూస్తుందన్న  భయం. అన్నీ కలసి  ఆవిణ్ణి వొణికించేస్తున్నాయనీ అమెకి తెలుసు. .
అయినా,  సింధు చలించ లేదు.
“అసలీ బుధ్ధి నీకు పుట్టిందేనా?, లేక ఎవరైన నూరి పోసారా? ఆ?.  హవ్వ! కాపురం  ఏవౌతుందన్న జ్ఞానమైనా లేకుండా, కట్టుకున్న మొగుడి మీద  కాసింత గౌ రవ మైనా వుంచకుండా.. ఇంత అఘాయిత్యపు పని చేసొస్తావ్?
కన్న వాళ్ళం, మేమింకా ‘ బ్రతికి చచ్ఛే’  వున్నామన్న సంగతయినా నీకు గుర్తుకు రాలేదుటే సింధూ, ఇంత పరువు తక్కువ పని చేసేటప్పుడు?”
మొహం వాచేలా తల్లి పెడుతున్న  చివాట్లన్నీ తలొంచుకుని మౌనంగా వింటూండిపోయింది   సింధు- నిర్లిప్తంగా!
తను చెప్పింది వినగానే, తల్లి – తనని  యెదకి హత్తుకుని, ‘ నా తల్లే, నీకెంత కష్ట మొచ్చిందే సింధూ?” అంటూ కన్నీరు మున్నీరు అవుతుందని ఆమె ఆశించ లేదు.
ఎందుకంటే, తల్లి గురించి సింధూ కి బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే, ఆవిడ గురించి ఆవిడ కి కంటే, తనకే బాగా తెలుసు. ఆమె జస్ట్ ఒక సగటు మనిషి. మావూలు  స్త్రీ. సాధారణ గృహిణి. అందరి లాటి సామాన్య ఇల్లాలు. సమాజానికి భయపడి,  రోజుకో సారైనా ఆ నాలుగు గోడల మధ్య సమాధి అయిపోతూ,  నోరు విప్పకుండా లోలోన  కుమిలిపోవడం వల్లే కుటుంబ పరువుప్రతిష్టలన్నీ మిగులుతాయని  ఆవిడ ప్రగాఢ విశ్వాసం. గట్టి నమ్మకం.
తన ఊహ తెలిసినప్పట్నుంచి, తల్లిని   చదువుతూనే వుంది. ఏ ఆడపిల్లకైనా,  తల్లి మొదటి గురువు అని అంటారు. కానీ తనకి మాత్రం తల్లి – మొట్టమొదటి జీవిత పాఠం. ఎంత చదివినా అర్ధం కాని పుస్తకం.  నిజం.  ఆవిడ తనకెప్పుడూ అర్ధం కాలేదు. ఇంకా చెప్పాలీ అంటే, రాను రాను ఆమె తనకొక పరిశీలనా గ్రంధమై పోయింది. అన్వేషణాంశంగా మారిపోయింది.
తరచి తరచి పరిశోధిస్తున్న కొద్దీ – ఎన్నో ప్రశ్నలు..మరెన్నెన్నో సందేహాలు..కలిగేవి. తనెంత ప్రయత్నించినా, ఒక్క దానికీ  సరైన జవాబు దొరకలేదు.
ఎప్పుడడిగినా, ” నీ మొహం. నువ్వు అలాంటి ప్రశ్నలేయ కూడదు.’ అనో, ” ఏమిటే, ఇంతున్నావో లేదో..అప్పుడే  నీ విపరీతపు ఆలోచనలూ, నువ్వునూ? ఊ?” అంటూ మందలిస్తూనో..తన నెక్కువ గా మాట్లాడకుండా నోరు మూయించేసేది అమ్మ.
ఆవిడ లోకం ఆవిడది.  ఇల్లు, మొగుడు, పిల్లలు.
పిల్లల్ని  ఒకింటి వాళ్ళ ని చేసేస్తే..స్త్రీ గా పుట్టినందుకు తన జన్మ కి అర్ధం పరమార్ధం   చేకూరినట్టే ననేది  ఆవిడ జీవన సూత్రం.
నిజానికి, అమ్మ మంచిది. నాన్నకి మంచి  భార్య. తమకు  మంచి తల్లి. కాదనే ప్రశ్నే లేదు.
కాని, నాన్న? చెడ్డ భర్త. చాలా చెడ్డ భర్త.
అమ్మంత  నిజాయితీ పరుడు కాడు. తన సంపాదన గురించి కానీ, చేస్తున్న ఖర్చులు గురించి కానీ, ఇంట్లో పెళ్ళాం తో చెప్పడు. ఆడదాని చేతికి నీ జుట్టు అయినా ఇవ్వు కానీ, జీతం డబ్బు మాత్రం ఇవ్వకు.నీ బ్రతుకు పులుసులో ముక్కయి పోతుంది.  అనేది ఆయన  పాలసీ.
‘నాకేం కావాలో, ఇంటికి ఏమేం తేవాలో అన్నీ ఆయనకి తెలిసినప్పుడు ఇక నా కెందుకే ఆయన జీతం వివరాలు. తప్పు. ఆయన్ని అడగ కూడదు.’ ఇదీ, అమ్మ జవాబు. కాదు కప్పిపుచ్చే ధోరణి.
ఆ విషయాన్ని పక్కన పెడ్దాం.
ఆఫీస్ అయిపోగానే,  నేరుగా  ఇంటి కొస్తాడా అంటే,  రాడు.
క్లబ్ కెళ్తాడు. పేకాటాడ్తాడు. ఫుల్ల్ గా మందు కొట్టి అర్ధ రాత్రి  ఇల్లు చేరతాడు. తనొక సారి –  వూరి చివరుంటున్న  స్నేహితురాలింటికెళ్ళి వస్తుంటే..నాన్న కారు కనిపించింది.  ఆయన పక్కన,  సరసా లాడుతున్న  స్త్రీని చూసింది. ఆయన చనువుగా ఆమె మీదకి వొరగడం, ఇద్దరూ పకపకా నవ్వుకోవడం..చూడంగానే తనకి నచ్చలేదు. దుఖం తన్నుకొచ్చింది.
ఇంటికి రాగానే అమ్మకి చెప్పింది రోష పడుతూ.
అమ్మ ఏమంది? కంగారు పడింది. తొట్రుపడుతూ..”ఈ సంగతి ఇంకెవరికీ చెప్పకే?,  నా బంగారు తల్లి వి కదూ?” అంటూ తన గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది.
కథ అంతటితో కాలేదు.
ఆ అర్ధ  రాత్రి – అమ్మ గది లోంచి మాటలు వినిపించాయి.ఆయన అరుపులు   బిగ్గరగానే వినొచ్చాయి.  తిడుతున్నాడు. అమ్మని బండ బూతులు తిడుతున్నాడు. చెవులకు ఘోరంగా వినొస్తున్నాయి.
ఎప్పుడూ లేనిది, అమ్మ ఆయన్ని నిలదీస్తోంది. ఆయన అహం దెబ్బ తింది. చేయి లేచింది. అమ్మ మీద పిడి గుద్దులు పడుతున్నాయి..అవి తన వీపుకి తాకాయి. బలంగా. కెవ్వుమంది బాధగా.
ఆమ్మ  ఏడుస్తోంది..-  వింటుంటె ..తన కళ్ళు వరదలయ్యాయి.
వున్నపళాన వెళ్ళి, ఆ కిరాతకుని చేతుల్లోంచి అమ్మని విడిపించుకొచ్చేయాలనిపించేది. తెచ్చుకుని తన వొడిలో బజ్జో పెట్టుకుని లాలి పాడాలనిపించేది.
అమ్మా, నా దగ్గరకి రా!  నీ గాయాలకు చంద నాలు పూసి, నా కన్న తల్లి వైన నీకు అమ్మనై జోల పాడి నిద్ర బుచ్చుతాను. రా, అమ్మా’ అని అమ్మని పిలవాలనిపించేది. చెప్పాలనిపించేది. వోదార్చాలనిపించేది.
కానీ అమ్మకి అర్ధమౌతుందా తన భాష? తను పడుతున్న బాధ?
చాలా సేపు రాధ్ధాంతం జరిగి, ఆగి  పోయాక, ఆయన గురక వినిపించేది. అమ్మ వెక్కిళ్ళు మాత్రం ఆగేవి కావు.
తెల్ల వార్లూ..ఆ గదిలో  లైట్ అలా వెలుగుతూ వుం డేది.
వెంటిలైటర్ వైపు  చూస్తూ..గుబులు గుబులు గుబులుగా ఎప్పుడో నిద్ర పో యేది తను.
మర్నాడు పొద్దున అమ్మ నిద్ర లేస్తునే, చీపురు పట్టుకుని వాకిలి చిమ్మి,  పెరట్లో – కట్టెల పొ య్యి  వెలిగించి నీళ్ళ కాగు పడేసేది.  వంటింటి వసారాలో రెండు కుంపట్లు రాజేసి, ఫిల్టర్ లో కాఫీ డికాషన్ వేసి,  కత్తి పీట ముందు కూర్చుని చక చకా అల్లం,  పచ్చి మిరపకాలు,  ఉల్లి పాయలు తరిగి పెట్టుకునేది ఉప్మా చేయడం కోసం.
అరటి చెట్ల గుంత  దగ్గర పళ్ళు తోముకుంటూ   గమనిస్తూనే వుండేది అమ్మని.
ప్రతిరోజులా నవ్వుతూ, ఆనందం గా కనిపించేది కాదు. చెప్పలేనంత బాధ తో  ముఖం mlaaనమై వుండేది.  కళ్ళు వాచి, ముఖం ఉబ్బి,  చెంపల మీద తేలిన వాతలతో కమిలిపోయిన పద్మం లా, అవమానం తో, ‘ గాయడిన  హృదయం అంటే ఈమెనా’ అన్నట్టు గుండెని కదిలించేసేది – ఆ రూపం.
అమ్మని ఒక్క సారి దగ్గరికి తీసుకుని, ” అమ్మా! అంత జరిగాక కూడా నువు  రాత్రం తా  ఆ గదిలో ఎలా పడుకున్నావమ్మా?”  అని అడగాలనిపించేది. చాలా నిజాయితీ గా అడగాలనిపించేది .
కానీ అడగకూడదు. తప్పు. అమ్మ కోప్పడుతుంది.
ఇంతలో నాన్న లేచి, మొహం కడుక్కుని, పెళ్ళాం   ఇచ్చిన కాఫీ తాగి, పెళ్ళాం – చేతికం దించిన ఉప్మా తిని, ఆఫీస్ కెళ్ళి పోయే వాడు.
ఇదంతా చాలా నిశ్శబ్దం గా జరిగిపో యేది. ఇల్లంతా, మనసంతా తనకి  భరించలేనంత కటిక నిశ్శబ్దంగా తోచేది. పెరట్లో బాదం చెట్టు కదలకుండా అట్టానే నిలబడి చూస్తున్నటుండేది. ఒక్క పత్రమూ నోరు విప్పక, జాలి పడుతున్నట్టు తోచేది.

Sa12
ఆయన వెళ్ళాక, అమ్మ వంట చేస్తూ, అలా ధారగా ఏడుస్తూ..మధ్య మధ్య లో  చీర చెంగుతో  కళ్ళు తుడుచుకుంటూ కనిపించేది.
మొగుడికి అక్రమ సంబంధం వుందన్న సంగతి  తెలిసిన ఏ ఇల్లాలికైనా ఆ బాధ ఎలా వుంటుందంటే – నిప్పుల మీద కాల్చిన కత్తిని గుండెల మీద ఆnchiనంత బాధ గా వుంటుంది. స్త్రీలు అనుభవించే  ఎన్ని మానసిక  గాయాలకూ  మందుంది కానీ, ఈ నరక బాధ కు  మాత్రం మందులుండవు. కన్నీళ్ళే వుంటాయి. ఈ కన్నీళ్ళు ఎద మంటలను ఆర్పగలవా?
ఆవిడ దుఖానికి గల మూల కారణం ఏవిటో తనకి మాత్రమే  బాగ తెలుసు. అందుకే,  ఆయన చేసిన తప్పుకి ఎలాటి శిక్ష వేయొచ్చో తను చెప్పగలదు. కానీ, అమ్మ వినదు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది  కోపంగా.   ‘చిన్న పిల్లవి. నువ్వు చూడకు. నీకేం తెలీదు. అవతలకు ఫో.’ అని అంటుంది.

అమ్మ నిప్పు లాంటిది.  కాబట్టి, ఆయన చేస్తున్న అన్యాయానికి ఆవిడ కాలిపోవడం కాకుండా, ఆయన  పాపాన్ని నిలువునా కాల్చొచ్చు.
నిజానికి మనం నిజాయితీ గా వుండేది ఎదుటివాని అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోడానికే కదా! ఆయన చేసిన ఆ తప్పుడు పనిని, అదే కనక వాళ్ళావిడ చేస్తే అమ్మలా ఊరుకునేవాడా?   ఊహు. చస్తే ఊరుకునే వాడు కాదు. ఈ  ఉత్త నరసిం హం  కాస్తా ఉగ్ర  అయిపోయేవాడు. అమ్మని వాయిట్లోకి ఈడ్చి, పదిమందిలో తూర్పారబెట్టే వాడు. రామాయణం లో పాపం సీత, ఏ తప్పు చేయకుండానే అంతగా  అవమానింపబడినప్పుడు, తప్పు చేసిన పెళ్ళాన్ని ఈ నరసిం హం  క్షమిస్తాడని ఎలా ఊహించగలం? ఈ నిజం చెబితే, అమ్మ ముక్క చివాట్లేస్తుంది.  అలాటి పాపపు మాటలు మాట్లాడ కూడదంటూ కేకలేస్తుంది.
నిజానికి, అమ్మ నీతిమంతు రాలు.  కాబట్టి, నీతి తప్పిన మొగుణ్ణి పది మంది లో నిలబెట్టి కడిగేయొచ్చు. సిగ్గొచ్చేలా బుధ్ది చెప్పొచ్చు.
అమ్మ – దేవత.  కాబట్టి దుర్మార్గుణ్ని శిక్షించొచ్చు.
ఇన్ని అర్హతలు వుండి..ఏమి లేని దానిలా..అసలేమీ చేత కాని దానిలా..ప్ర తి ఘటించకుండా..ఎదురాడకుండా.. అమ్మ ఎలా వూరుకుండి పోతుంది? నిస్సహాయు రాలిలా ఎందుకని  విలపిస్తుంది?
సమాధా నం దొరికేది కాదు.
మరో చిత్రం ఏమిటంటే –  నాన్న వింత ప్రవర్తన! ఆయన హఠాత్తుగా మంచి బాలుడైపోవడం.
తలమునకలైపోయేంత ఆశ్చర్యకరమైన విషయం.
అసలాయన ఎలాటి వాడంటె..
తన సంతోషాల కోసం, విలాసం కోసం ఎన్ని హద్దులైనా దాటేస్తాడు. ఎలాటి తప్పు చేయడానికీ  వెరవడు. ఐతే, ఆయన  ‘తప్పు’ చేసినప్పటి కంటే, అది పెళ్ళానికి తెలిసి నప్పుడు మాత్రం భలే రంగులు మార్చేసే వాడు. అసలు రూపానికి ముసుగు తొడిగేసేవాడు కొన్నాళ్ళు. ఆయన ప్రవర్తనలో ఆ తేడా – ఎంత గా కొట్టొచ్చినట్టు కనిపించేదంటే –   అలాటి  సంఘటనలు జరిగిన – ఆ తర్వాతి  నాలుగు రోజులూ… ఆయన ఆఫీస్ నించి నేరుగా తలొంచుకుని ఇంటికొచ్చేసే వాడు.
సాయం కాలాలు వస్తూ వస్తూ మల్లెపూల దండలు,  జిలేబీ పొట్లాలు, మొక్కజొన్న కండెలు.. చేతుల్లో మోసుకొస్తూ..పెందళానే ఇంటికొచ్చేసేవాడు.
అదేమిటో! ఆయన్నలా చూసే సరికి అమ్మ ముఖం ట్యూబ్ లైట్ లా వెలిగి పోయేది.  ఎంత ఆనంద పడి పోయేదనీ!
ఆయన “ఏమేవ్” అని పిలిచేవాడు. ఈవిడ ఇంతై పోయేది..
“కాస్త తల పడ్తావ్?” గోముగా అడిగే వాడు.  అమ్మ పొంగి పొర్లి పోయేది.
ఆ తర్వాత మాటలు కలిపే వాడు. సరసాలాడే వాడు. అమ్మ  గల గలామనేది.
ఆ మర్నాడు, మందు సీసాలు తెచ్చుకునే వాడు. అందులో కి నంజుకోను పకోడీలు చేయమనే వాడు. చేసేది. కోడి కూర వండమనే వాడు. వండేది. అదే తన భాగ్యమన్నట్టు సేవ చేసేది.
తనకి అమ్మ ఏ మాత్రం అర్ధమయ్యేది కా కున్నా, ఆవిడ ముఖం లో ఆనందం చూసి ఆయన్ని క్షమించేసేది. అంతా మరచి పోయినట్టు నటించేది.
కాని, నాన్న లోని మగాడు మాత్రం స్పష్టం గా.. ఎక్కడా సందేహమనేది లేకుండా, మిగల కుండా,  పరిపూర్తిగా అర్ధమై పోయే వాడు. ఆయన లోని పురుషహంకారానికి   నిలువెత్తు అద్దం పట్టి చూపించేది –  తన మనసు.
అలా..ఆయన  మంచి భర్త గా ఎంతో కాలం నటించలేడన్న సంగతి అమ్మ కంటే తనకే  తెల్సి రావడం బహుశా తన  దురదృష్తమేమో!
రెండు రోజులు కాగానే, ఆయన ధోరణి మళ్ళీ మొదటి కొచ్చేది. నూటికి నూరు పాళ్ళు ఆయనొక అవ కాశ వాది. జల్సా పురుషుడు.
ఆయన దృష్టి లో – క్లబ్బు, పేకాట, రేసులు, సిగరెట్టు, మందు.. ఇవన్నీ మగాడికి వుండే  సహజ లక్షణాలు, వాటిని చెడిపోవడంగా ఎవరన్నాఅంటే వూరుకోడు. ఆ దేవుడు అడ్డొ చ్చినా  సరే సహించడు. పర స్త్రీ వ్యామోహం  కూడా తప్పు కాదు కాబట్టే, స్వేచ్చగా తిరిగొస్తాడు.
ఆడ స్నేహాలు ఎన్నుంటే ఏం?, ఆలి మాత్రం ఒకత్తే కాబట్టీ, తనూ శ్రీ రాముడ్నేనని, ఆ జమ లోకే చేరతానని  వాదిస్తాడు. అవకాశాలు లేక, రాక, లేక చేతకాక కొంతమంది మగాళ్ళు మంచి వాళ్లు గ చలామణి ఔతారని చెబుతాడాయన.
అలా, ఆయన తన సిధ్ధాంతానుసరణా విధాన ప్రకారం ఆ  తప్పు చేయ డానికి ఏ మత్రం వెరచే వాడు కాడు.
కాకుంటే, ఆ విషయం  ఈ నోటా , ఆ నోటా  తల్లికి తెలిసినప్పుడు ఇంట్లో తుఫాను రేగేది.  అందులో అమ్మతో బాటు తనూ  చిక్కుకుపో తూ వుండేది. దారి  తెలియ క ఆవిడా, తెలిసినా చెప్పలేక తనూ..
తను పెరిగి పెద్దౌతున్న కొద్దీ..అమ్మ తన కి ఇంకా బాగా అర్ధ మౌతూ వచ్చేది. అర్ధ మౌతున్న కొద్దీ..అమ్మ- త న  జీవితం లో ఏం కోల్పోతోందో అవగతమౌతున్న కొద్దీ.. ..గుండెంతా ఆమె మీద జాలి తో నిండిపోయేది.
సరిగ్గా ఈ భావన్ని ఆమెకి చెప్పాలనిపించినా..అమ్మ చెప్పనిచ్చేదా?
” నీ మొహం. నీకేం తెలుసు? నాన్న గారి గురించీ? ఏదో అప్పుడప్పుడు అలా చేసినా..నాకు ఏ లోటూ రానీయరు.  కోపమొచ్చినప్పుడు నాలుగు తిట్టినా, కొట్టినా…బయట వాళ్ళెవరైనా నన్నొక్క  మాటంటే వూరుకుంటారనుకుంటు న్నావా? ఎన్ననుకున్నా మొగుడూ పెళ్ళాలం  తప్పదు. తప్పు లేదు. కలసి వుండాల్సిందే. లేకపోతే, ఈ ఇల్లు, సంసారం, పిల్లలు ఆగమై పోరూ..ఇంకెప్పుడూ  నాన్న కి ఎదురు తిరగమని నాకు చెప్పకు.
తెలిసిందా?” అంటూ తనకి చివరి హెచ్చరిక జారీ చేసేది.
అలాంటి అమ్మ తను చేసిన ఈ  పని ని సమర్ధిస్తుందని కానీ, తనని అర్ధం చేసుకుని  అక్కున చేర్చుకుంటుందని కానీ తను అనుకో గలదా? ఆశించ గలదా?
అందుకే, మౌనంగా వుండిపోయింది సింధు, గతాన్నంతా  గుర్తు చేసుకుంటూ!
కూతురు తప్పు చేసొచ్చినందుకే,  తలొంచుకుని, కూర్చుందని భావించిన అంజని  తన వాక్ర్పవాహాన్ని తిరిగి కొన సాగించింది.
“లోకం లో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.   టీవీలలో, పేపర్లలో..ఎంతమంది ఆడ పిల్లల జీవితాలు –  ఎలా నాశనమౌతున్నాయో  చూస్తున్నాను. చదువుతున్నాను.
వాళ్ళ కష్టాలకీ, కన్నీళ్ళకి  బలమైన కారణం వుంది.
కట్న పిశాచమో, అనుమాన భూతమో, బ్రతికుండం గానే మొగుడు మరో పెళ్ళి చేసుకున్నాడనో, పిల్లలు పుట్టడం లేదనో, ఆడపిల్లని కన్నదనో..మగాడు పెట్టే హింసలని వాళ్ళు కళ్ళకి కట్టినట్టు చెబుతున్నారు. సా క్ష్యాధారాలు చూపిస్తున్నారు. జనం –‘పాపం’ అంటున్నారు.
ఎవరొచ్చి ఏ న్యాయం  చేసినా చేయకపోయినా,  ఆ అబలల మీద లోకులకు  జాలి కలుగుతుంది. సానుభూతి మిగులుతుంది.
కానీ, నువ్వు చెబుతున్న కారణాన్ని నేనెక్కడా విన్నే  లేదు. పైగా, పెద్ద ఆరిందాలా,  పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పడేసి  వస్తావూ? రేపు ఈ సంగతి నలుగురికీ తెలిస్తే,?
“తెలియాలనే ఇచ్చానమ్మా కంప్లైంట్” – చివ్వున తలెత్తి,  జవాబిచ్చింది సింధు.
“ఆ?” ఆవిడ కళ్ళు మరింత పెద్దవి చేసుకుని చూసింది. “అంటే నలుగురూ ఏమైనా అనుకుంటారని సిగ్గైనా లేక పోయిం దా నీకు?”
“నాకెందుకమ్మా సిగ్గు? వుంటే అతనికి వుండాలి” స్థిరం గా అంది.
“ఈ విషయం నీ మొగుడికి తెలిస్తే?”
“తెలియనీ, మనిషైతే సరిదిద్దుకుంటాడు. కాని వాడితో నేనెలానూ కలసి వుండలేను  కదమ్మా!”
“అంటే, ఒక భార్య గా నువ్వు చేయాల్సిన పనే అనుకుంటున్నావా?”
“భర్త గా ఆయన చేయకూడని పని ఇది అని  మాత్రం ఖచ్చితం గా అనుకుంటున్నాను.”
“ఏమిటే చేయ కూడని పని? ఆ? అయినా, మాన మర్యాదలు  లేకుండా పడకింటి సంగతుల్ని ఇలా బట్ట బయలు చేసుకుని, బ్రతుకు ని బజారు కీడ్చుకుంటామా ఎవరమైనా? విని  లోకం నవ్వి పోతుందని కానీ, ఆ తర్వాత నలుగురిలో తలెత్తుకుని తిరగలేమని కానీ, నీకేమైనా తెలుస్తోందా?
“తెలుస్తోందమ్మా. ఇప్పుడిప్పుడే అంతా తెలుస్తోంది.
మనమిలా నలుగురి  కోసం భయపడతామని, మనకు జరిగే అన్యాయాలని చెప్పుకుంటే, లోకం లో మరింత చులకనైపోతామని,  ఆ పైన అపహాస్య పాలై పోతామన్న నిజం మనకంటే మనల్ని మోసం చేసే మగాళ్ళకే బాగా  తెలుసని తెలుస్తోందమ్మా!
అందుకే,  ఈ ఒక్క మన బలహీనతని ఆయుధం గా చేసుకుని మొగుడి స్థానం లో మగాడు సయితం యముడుగా మారుతున్నాడమ్మా!  నువ్వంటున్నావ్ చూడు..పడకింటి గుట్టు అనీ..
నిజమే నమ్మా, నేనూ గుట్టు గానే కాపురం చేసుకోవాలనుకున్నా.
తాళి కట్టిన వాడికి మాత్రమే నా వొంటి మీద చేయి వేసే హక్కునిచ్చాను. జీవితమతా ఈ శరీరం మీద అతనికి సర్వాధికారాలు రాసిచ్చాను.  అందుకు ప్రేమ పేరుతో ఎక్కడ మోసపోతానో అని,  నువ్ చూసిన సంబంధమే చేసుకున్నా. అగ్నిసాక్షి గా వివాహమాడిన వాడు  భద్రత ని నమ్మమన్నావు. నమ్మాను.
అతనితో గడప బొయే కొన్ని అపురూప క్షణాల గురించి కలలు కన్నాను. దాంపత్య జీవితం. గురించి కొన్ని అందమైన కలలు కన్నాను కానీ, నా భర్త కి నా ఆశలతో సంబంధం లేదు.
పుష్ప సౌగంధాన్ని ఆస్వాదించడం కంటేనూ, పూల రేకులని తుంచేయడమంటేనే అతనికిష్టం.
కేవలం తాళి కట్టిన పాపానికి, మొగుడేం చెబితే అది చేయాలా అమ్మా, పడక గదిలో?
కానీ చేసాను.
ఎందుకంటే, ఎదురు తిరిగి తే, నీ మాటల్లో చెప్పాలంటే..’కాపురం చెడి పోతుందని.’
అయినా తృప్తి లేదా మనిషికి.
రాత్రిళ్ళు తాగి, నా పక్కనే,  బుసలు కొడుతూ పడుకున్నప్పుడు..
ఆ మందు వాసన కడుపులో తిప్పుతూ వుంటే..ఏ ఝాము నాడో మత్తు పోయి, కామపు మైకం  కమ్ముకుంటే,  వొళ్ళు తెలీని పశుత్వంతో నా శరీరం గాయమౌతూంటే..
నువ్వన్నట్టు..కేవలం భర్త అనే,  ఆ సలపరింతల జ్వరాలు భరించాను.
సొగసుగా ముడుచుకోవాల్సిన శరీరాన్ని..మసక చీకటిలో ముచ్చట్లు పోవాల్సిన శృంగార చేష్టల్ని..సొమ్మసిల్లి సేద తీర్చుకోవాల్సిన కౌగిళ్లనీ.. అన్నిట్నీ వదిలేసుకున్నాను.
భార్యా భర్తల మధ్య సెక్స్ – అనురాగానికి గుర్తు గా కాకుండా…పశువాంఛకి ఒక సాధనమనే పచ్చి నిజాన్ని తెలుసుకున్నాను.
సెక్స్ అంటే ఇంత హింసాత్మకం గా వుంటుందని, ఈ హింసని రోజూ తట్టుకోవాల్సి వుంటందని నాకు తెలీదమ్మా. తెలిసాక, ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలీక నాలో నేనే కుమిలిపోయాను.
కానీ.
ఆ రోజు నీలి చిత్రాలు చూడమని నన్ను బలవంతం చేశాడు.
నేర్చుకోవాలన్నాడు. అలా ప్రవర్తిస్తేనే పెళ్ళాన్నౌతా నన్నాడు.
అసహ్యం..చీదర..జుగుప్స..అన్నీ కలిసి,  ఆవేశం ఆపుకోలేక..ఎదిరించాను. ఛీ కొట్టాను. గదిలోంచి బయటకు పారిపోయే ప్రయత్నం చేసాను.
అప్పుడేం జరిగిందో తెలుసా అమ్మా, ఆ తాగుబోతు నన్ను బలంగా మంచం మీదకు తోసి..నా ఇష్టానికి వ్యతిరేకంగా..” ఆమె పూర్తి చేయలేక పోయింది.
రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది సింధు.
అంజని నిర్ఘాంత పోయింది. నోట మాట రాని దానిలా బిగుసుకుపోయింది. అచేతునురాలైపోయింది.
తన అనుభవం గుప్పున గుర్తుకొచ్చింది.  మొగుడి అక్రమ సంబంధాలు తెలిసినప్పుడు ..ఆ మనిషి ని చూస్తేనే అశుద్దం చూసినంత రోత పుట్టేది.
ఆ శ్వాసలోంచి కుమ్ముకొచ్చే విస్కీ, బ్రాంది కంపులు భరించలేక అటు తిరిగి పడుకునేది.
అతనితో సంపర్కం, అంతరంగానికి నచ్చేది కాదు. మంచం మీంచి తోసి పడేయాలనిపించేది. ఈ నర పిశాచం నించి ఎటైనా పారిపోవాలనిపించేది.
ఏదీ చేయలేక ఆత్మ వంచన చేసుకుంటు..మానసిక నరకాన్ని అనుభవిస్తూ…ఆ కాసేపు శవమౌతూ..జీవచ్చమౌతూ..గడిపేది.
కారణం.. పైకి చెప్పుకోకూడదని. తను బయట పడితే, రేపు పిల్ల జీవితాల మీద అది చెడు  ప్రభావం చూపుతుందని, భయపడేది. తన కారణంగా తన కూతురి భవిష్యత్తు పాడవకూడదని తలచేది. ఓర్పు వహించేది.
కానేం జరిగింది?  సింధూ కూడా తనలానే..అదే నరకాన్నికాదుకాదు అంతకుమించిన నరకాన్ని అనుభవించిందన్న సంగతి ఇప్పుడే..ఇప్పుడే..తెలుస్తోంది.
కూతురి వైపు కరుణ గా చూసింది. మొట్ట  మొదటి సారిగా ఆ  తల్లి – ఒక సాటి  స్త్రీలా కరిగింది. తల్లడిల్లింది.
మెల్లగా సింధు దగ్గరకెళ్ళి, ప్రేమగా దగ్గరికి తీసుకుని,  తల మీద చేయి వేసింది, ఓదార్పుగా.
ఆ స్పర్శ కి ఉలిక్కి పడిన సింధు –  తల్లి మొహం లోకి చూసి,  చటుక్కున తల్లి  గుండెల్లో  ముఖం దాచుకుని వెక్కెక్కి ఏడ్వసాగింది సింధు.
“ఊరుకో నానా, ఊరుకో. నువ్వు మంచి పనే చేశావ్. నా లాంటి పిరికి  ఇల్లాళ్ళు  చేయలేని పని నువ్ ధైర్యంగా చేశావు. నువ్వనుభవించిన ఈ హింస ఈ లోకం లో ఒకరికి కాదు, నలుగురికి కాదు..ఈ ప్రపంచానికి మొత్తం తెలియాల్సిన అవసరం వుంది. నిన్ను అర్ధం చేసుకోవాల్సింది పోయి,  మాటలతో నిన్ను బాధ పెట్టానా తల్లీ? ఇంకెప్పుడూ, ఈ బంగారు తల్లిని ఏమీ అనను సరేనా..” అంటూ, మరింత గా హత్తుకుంది, పసి బిడ్డను హత్తుకున్నట్టు.
తల్లి లాలనలో సింధు ధుఖం  తుఫాను లా మారి పోయింది.
తను ఎప్పుడు ఎరగని  అమ్మ..ఆ క్షణం లో ఒక దేవతా స్వరూపిణిలా అగుపించింది.
ఎప్పటికైనా, ఎన్నటికైనా ఒక స్త్రీ రోదనని, గాయపడిన హృదయాన్నీ కేవలం మరో స్త్రీ మాత్రమే సంపూర్ణం గా అర్ధం చేసుకో గలదేమో!

****

“సింధు వున్నారాండి?”
లోపలకొస్తున్న ఆ అపరిచిత స్త్రీలని  ని పరికించి చూస్తూ..”మీరెవరు” అడిగింది అంజని. కూతురి కోసం వచ్చిన వీళ్లెవరా  అని!
వాళ్ళ చేతుల్లో ఆ రోజు వార్తా పత్రికలు వున్నాయి.
“మేమందరం, ఆమెని అభినందించడం కోసం వచ్చిన అభిమానులమండి.
ఒక భార్య ధైర్యం గా ముందుకొచ్చి, తన భర్త తనని రేప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఎంతో సాహసం తో కూడిన విషయం.
ఎంత మంది ఇల్లాళ్ళో  పైకి చెప్పుకోలేని లోని బాధని ఆమె నిర్భయంగా  బహిర్గతం చేసి, చాలా మంది బాధితుల కన్నీళ్ళకి గొంతునిచ్చారు.  మన సమాజంలో ఇలాటి మగ పిశాచులు  మొగుడి రూపంలో నూ వుంటారు. తస్మాత్ జాగ్రత్త అంటూ  లోకం కళ్ళు తెరిపించారు.
లైంగిక సుఖం కోసం భార్య నైనా  సరే,బలవంతం చేసి కోర్కే తీర్చుకోవడం కూడా  రేప్ లాంటిదే. – అని తెలియ చెప్పిన ధైర్య వంతు రాలు సింధు.
‘నాలుగు గోడల మధ్య , చట్ట రీత్య వివాహమైన భార్య భర్తల మధ్యజరిగే  ఈ బలవంతపు కార్యాన్ని ‘రేప్’ అని అనలేం..’ అని ఎంత మంది మేధావులు ఘోషించినా..
ఈ సంఘటన ఎందరి సామాన్యులనో  ఆలోచింప చేస్తుంది. పరిష్కారం వెదకమంటుంది. భద్రతనిచ్చే కొత్త చట్టాన్ని తెచ్చిస్తుంది. సింధు ఇచ్చిన ఈ కంప్లైంట్ వల్ల  బాధితులకు ఉపశమనం కలుగుతుంది.  ఆత్మస్థైర్యాన్నిస్తుంది. భార్య లపై సెక్స్యువల్ దాడులు, హింసలు తాగ్గుతాయి.
ఒక మంచి మార్పు కి  అవకాశాన్ని కల్పిస్తూ..స్త్రీ చైతన్యానికి శ్రీకారం చుట్టిన సింధు ని..మేము చూడాలి. అభినందించాలి. ఎక్కడ సింధు?” – అంటూ ఆశ గా, ఆత్రం గా చూస్తున్న  వాళ్ళ మాటలకు పొంగిపోతూ ఉద్వేగ భరితురాలైంది అంజని
–  అక్కడి సందడి అర్ధం కాక ” ఎవరమ్మా ?” అంటూ అప్పుడే అక్కడికొచ్చిన కూతురి  వైపు – పట్టలేని ఆనంద నయనాలతో చూస్తు.. “మీరు చూడాలనుకుంటున్న సింధు..ఇదిగో ఈమే. నా కూతురు.” అంటూ చెప్పింది అంజని వాళ్ళతో.
అలా, చెబుతూ  తన వైపు గర్వంగా చూస్తున్న తల్లి చూపులకి సింధు కళ్ళు ఆనందంతో మెరిసాయి.
స్త్రీలపై జరుగుతున్న అనేక  రకాల అఘాయిత్యాలకు,  అత్యాచారాలకు –   సంపూర్ణ న్యాయం జరగక పోవచ్చు. లేదా  కఠిన చర్యలు తీసుకునే చట్టాలుగా రూపొందడానికి కొంత సమయమూ  పట్టొచ్చు.
కాని, పైకి తేలకుండా నిశ్శబ్దంగా కొరికేసే ఎన్నో  అన్యాయాలను నోరు విప్పి చెప్పడం వల్ల స్త్రీ లు తమ అస్తిత్వాన్ని కాపాడుకున్న వా రౌతారు.
తమ గౌరవాన్ని తాము నిలబెట్టుకున్న వారౌతారు.
అందుకు ప్రతీకగా, ప్రత్యక్ష సాక్షి గా నిలుస్తుంది – సింధు.

   *****

        – ఆర్.దమయంతి

(నా గురించి:
పుట్టిందీ, పెరిగిందీ – మచిలీపట్నం.
స్థిరపడింది –హైద్రాబాద్ లో.

కొన్నాళ్ళు వివిధ దిన, వార, మాస పత్రికలలో పనిచేసాను.
అప్పుడప్పుడు కొన్ని కథలు అచ్చు అయినా, సీరియస్ గా రాస్తోంది మాత్రం ఈమధ్యే. అంటే 2011 నించి. మొదట్లో పోటీలకు మాత్రమే రాసేదాన్ని. ఇప్పుడు ఎక్కువగా ఈ మాగజైన్స్ కి రాస్తున్నాను. ఇప్పటి దాకా సుమారు 150 కవితలు 75 కథలు రాసాను.

అభిరుచులు:
ఇప్పటికి, రాయడం కంటెనూ, చదవడమంటేనే  ఇష్టం. ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం.చిన్న పిల్లలతో మాట్లాడటం.,
నాకెప్పటికీ గుర్తుండిపోయే కవి, ఆరాధ్య రచయిత ఇద్దరూ ఒక్కరే.- తిలక్.

కృతజ్ఞతలు:
నన్నెంతగానో ప్రోత్స్చహిస్తూ, ఆదరిస్తూ, గౌరవిస్తున్న ఈ మాగజైన్స్ సంపాదకులందరకీ ఈ సందర్భంగా అనేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా.
సారంగ లో ఇంతకు ముందు వచ్చిన hypothesis  అనే కథకు అందుకున్న పాఠకుల స్పందన కానీ, లభించిన ఆదరణ కానీ  నే మరువ లేనిది.
ఎందరో మహాను భావులు..అందరకీ వందనాలిడుతూ..
వినమ్రతతో..}

Download PDF

6 Comments

  • దమయంతి గారూ ,
    ఇంకా ఎన్నాళ్ళు ? ఎన్నేళ్ళు ? మగవాడి దౌశ్టమ్ సహించడం ? అని ప్రశ్నించే ఆడవారు ,భార్యలు రావాలని ఒక నూతన ఒరవడి చుట్టి ,మంచి ప్రయత్నం చేసారు అండీ ,తల్లి తానూ అనుభవించిన క్షోభ తెలిసి ,కూతురుకి సంసారం ,అందులో రక్షణ చూసుకోవడమ్ లాంటి మాటలు ,ఇంకా తల్లులు చెప్పా నవసరం లేదు ,అని ఒక పిలుపు ఇచ్చారు అండీ ..భర్త ఎంత జులుం ,హింస పెడుతున్నా ,ఇంటి గుట్టు పేరు తో నోరు మూసుకుని పడి ఉండడం ..ఇంకానా ? ఇంకా చెల్లదు అని చెప్పేరు అండీ ,ఈ మధ్య సర్వోన్నత్త న్యాయ స్థానం కూడా ఇదే మాట చెప్పింది , పెళ్లి చేసుకున్నంత మాత్రాన ,భార్య శరీరమ్ పై సర్వ హక్కులు భర్త కి రావు, ఆమె అనుమతి లేకుండా ,లేదా హింసాత్మకం గా ,అసహజం గా అనుభవించడం చేయడం , ఒక నేరం అని ,అతనిని శిక్షించాలి అని చెప్పింది ..నిజం గా ఇది ఎంత ఊరట, ఇంటి గుట్టు అంటూ ఇంకా దాచి పెట్టకండి ,అమ్మాయిలూ ,బయటకి వచ్చి ,మీ హింస ను గురించి మాట్లాడండి , గుట్టు గా ఉన్ననత కాలం ,వారి జులుం చెల్లు బాటు అవుతుంది అని భర్త ల నమ్మకం ..అదే నలుగురికీ ఈ విష్యం తెలిస్తే ,సిగ్గు పడినా బుద్ధి తెచ్చుకుంటారు ..ముందుకు రండి ..మహిళలూ అలాంటి స్త్రీల ని నాలుగు రకాల మాట లతో కుళ్ళబడచడం కాదు ,సానుభూతి ,సహకారం అందించండి ..ఇదే మన మహిళా దినమ నాడు మనం చేయ గలిగిన కార్యం ..తోటి ఆడదాని కి సాయం గా నిలబడండి …
    వసంత లక్ష్మి ,

    • ఆర్.దమయంతి says:

      వసంత : ఈ మధ్య సర్వోన్నత్త న్యాయ స్థానం కూడా ఇదే మాట చెప్పింది , పెళ్లి చేసుకున్నంత మాత్రాన ,భార్య శరీరమ్ పై సర్వ హక్కులు భర్త కి రావు, ఆమె అనుమతి లేకుండా ,లేదా హింసాత్మకం గా ,అసహజం గా అనుభవించడం చేయడం , ఒక నేరం అని ,అతనిని శిక్షించాలి అని చెప్పింది ..నిజం గా ఇది ఎంత ఊరట,

      * నిజం వసంత. పైకి చెప్పుకోడానికి ఇదెంతో సిగ్గుగా వుంటుంది. చెప్పకుంటే ప్రాణ సంకటంగానూ వుంటుంది. కదూ?
      చాలా సున్నితమైన అంశం. కానీ, సంసారానికి ముఖ్య సూత్రమైనది కూడా ఇదే.
      కథాంశాన్ని అర్ధం చేసుకుని చక్కటి విశ్లేషణ నిచ్చారు వసంత. మీలా మహిళా పాఠకులం దరూ కూడా ఆలోచించ లిగితే ఈ సమస్య కి కొంత వరకైనా పరిష్కారం దొరకవచ్చు అని నా ఆశ!
      మీ స్పందనని ఎంతో ధైర్యంగా నిర్భయంగా వ్యక్త పరచినందుకు నా ధన్యవాదాలు.
      అందరకీ-
      మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ..

  • విరుపాక్షయ్య says:

    సింధు ఘోష నన్ను కదిలించింది మేడమ్.
    మహిళా దినోత్సవ శుభాకాంక్షలు :)

    • *కొంత మంది స్త్రీలు ఎదుర్కుంటున్న అతి సున్నితమైన సమస్యాంశం మీద రాసిన కథ ఈ – ఘోష.
      మా ఆడవాళ్ళకే నచ్చలేదు విరూపాక్షయ్య గారు.
      పైగా, అంటున్నారు. నువ్వేవిటీ ఇలాటి కథ రాసావూ అంటూ కోప్పడుతున్నారు కూడా.
      నేనంటానూ,
      వింటానికి, చదవడానికే మీకింత చికాగ్గా వుంటే..మరి బాధలనుభవిస్తున్న వారి వ్యధా వేదనల సంగతి ఏమిటీ అని.
      ఇంతకూ …ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే,
      కథ కదిలించిందనే మీ అభిప్రాయాన్ని నిజాయితీగా నిర్భయం గా ఇక్కడ తెలియచేసినందు ఆనందమైంది.
      మరిన్ని కఠిన నిజాలను వెలుగులోకి తీసుకు రావడానికి నాకు మరింత స్ఫూర్తిని కలగచేసింది.
      నాకు మాత్రమే కాదు, నా సాటి రైటర్స్ కెందరికో.
      మీకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
      హోలీ పండగ శుభాకాంక్షలతో..

  • Aparna says:

    చాలా బాగా రాసారండి. ఒక మద్య తరగతి కుటుంబంలో అమ్మ ఎలా చెబుతుందో సరిగ్గా చెప్పారు. వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉండి ఉంటుంది బహుశా. భర్తే దేవుడు అనుకోమని బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు వాళ్ళకి చిన్నప్పుడు.

    మీ కథ చాలా బావుంది కను విప్పుగా. ఏదైనా ఆదివారం పుస్తకం లో ప్రచురిస్తే మాములు గృహిణులు చదివితే చాలా బావుంటుంది.

    • చాలా బాగా రాసారండి.మీ కథ చాలా బావుంది కను విప్పుగా!

      * మీ ప్రశంస నా అలసటను తీర్చింది అపర్ణ గారు. :-) ముందుగా మీఎకు నా ధన్యవాదాలు. .

      ఏదైనా ఆదివారం పుస్తకం లో ప్రచురిస్తే మాములు గృహిణులు చదివితే చాలా బావుంటుంది

      * మీరు చెప్పేదీ నిజమే కాదనను.
      కానీ ఈ మగజైన్స్ వారితోనేను చాలా కంఫర్టబుల్ గా వున్నాను అపర్ణ గారు.
      పైగా, మీవంటి విజ్ఞులైన పాఠకులు నాకు దొరకడం, వారి ప్రశంసలనందుకోవడం ఒక వరం గా కూడా భావిస్తున్నాను.
      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
      హోలీ పండగ శుభాకాంక్షల తో…

Leave a Reply to ఆర్.దమయంతి. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)