మంచి కథల కోసం ఒక అన్వేషణ!

2 (1)

ఇది ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాటా మంతీ. ఒక నెలలో వచ్చిన కథలన్నీ పరిశీలించి, అందులో కొన్ని ఉత్తమమైన కథలని ఎన్నుకోవడం, ఆ కథలను, కథకులను అభినందించుకోవడం ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పనిని మేము నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనదీ, మొట్టమొదటిదీ – ఇలాంటి ప్రయత్నం ఈ మధ్య ఏ పత్రికలోనూ జరగకపోవడం! ఏడాది తరువాత కొన్ని పత్రికలు ఒక సింహావలోకనాన్ని వెయ్యడం, కొన్ని సంవత్సర సంకలనాలలో సమీక్షా వ్యాసాలు రాయడం జరిగినప్పటికీ వాటికి ఎక్కువ కథలను స్పృశించే అవకాశం తక్కువ.

ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. అసలు పత్రికలు దొరకబుచ్చుకోవటమే ఓ శ్రమగా మారిన తరుణంలో మంచి కథ వచ్చిందని తెలియడం, ఆ పత్రిక కోసం ప్రయత్నం చేసి చదవడం పాఠకుడు చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అదీగాక, ఇన్ని వందల కథలని దాటుకునిగానీ ఒక మంచి కథని అందుకునే దాకా పాఠకుడికి ఓపిక ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఓ మంచి కథ పాఠకుడికి తెలియకుండానే మరుగున పడిపోవడం ఆ కథకీ, రచయితకే కాదు సాహిత్యానికీ సమాజానికి కూడా చెడు చేసినట్లే కదా? అలాంటి ఒక వెలితిని పూరించడం మా ప్రయత్నం తాలూకు మరో లక్ష్యం.

అంతే కాదు – కథల గురించిన మంచీ చెడ్డా మాట్లాడటం ఎవరో ఒకరు మొదలెడితే, అలాంటి సంప్రదాయాన్ని మిగతా పత్రికలు కూడా అనుసరిస్తే – ‘మంచి కథ’ గురించి ఆలోచనా, అవగాహనా, స్పృహా, అభిరుచీ అటు రచయితల్లోనూ, ఇటు పాఠకులలోనూ పెరిగి – మంచి కథలు మరిన్ని రావడానికి దోహదపడగలదన్న ఒక చిరు ఆశ కూడా మా ఈ ప్రయత్నానికి ఒక కారణం.

మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాసిన కథకి డబ్బు రూపంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ పత్రికలకి రాస్తున్న రచయిత/త్రులకి కనీసం గుర్తింపు రూపంలోనైనా సరైన న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో, వాటిని కూడా మేము పరిశీలించాలీ అన్న సదుద్దేశంతో కూడా ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.

***

 

ఇలాంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరో చేస్తే, వ్యక్తిగతమైన మమకారావేశాల వల్ల నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం వుంటుంది. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం ముగ్గురం కలిసి కథలని విడివిడిగా చదివి; వస్తువు, కథానిర్మాణం, శైలి వగైరా అంశాల మీద మార్కులు వేసుకొని; తుది దశలో కథల బాగోగులు చర్చించుకొని మరీ మంచి కథలని నిర్ణయించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో – సబ్జెక్టివిటీ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టేనని మేము భావిస్తున్నాం!

ఇంత చేసినా ఇది ముగ్గురి సమిష్టి అభిప్రాయమే తప్ప ఏ విధంగానూ యావత్ పాఠకలోకానికో, సాహితీ ప్రపంచానికో ప్రాతినిధ్యం వహించే నిర్ణయం కాకపోవచ్చు. అలాగే కొన్ని పరిమితుల కారణంగా ఏదైనా మంచి కథ/పత్రిక మా పరిశీలనలోకి రాకపోయే అవకాశం లేకపోలేదు. అంచేత మీ దృష్టిలోకి వచ్చిన మంచి కథ/పత్రికలను మాకు ప్రతిపాదించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.

 

***

జనవరి కథలు

జనవరి నెలకు గాను దాదాపు 140 కథలని పరిశీలించడం జరిగింది. ఈ క్రింది పత్రికల్లోని కథలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది:

ఆదివారం అనుబంధాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సాక్షి, వార్త

 

వారపత్రికలు: జాగృతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య

 

మాసపత్రికలు: రచన, నది, ఆంధ్రభూమి, చినుకు, తెలుగు వెలుగు, పాలపిట్ట, మిసిమి, స్వాతి, చిత్ర, విపుల, ప్రస్థానం, స్వప్న, ఆంధ్రప్రదేశ్

 

అంతర్జాల పత్రికలు: కౌముది, సారంగ, ఈమాట, వాకిలి, విహంగ, కినిగె, గోతెలుగు

 

కథలన్నీ చదివితే ముందు మన దృష్టిని ఆకర్షించేది – విభిన్నమైన వస్తువులని ఎంచుకోవడంలో రచయితలు చూపిస్తున్న ఆసక్తి. ఈ పరిణామం ముదావహం. సామాజిక నేపథ్యాలు నిరంతరం మారుతూ ఉండే పరిణామక్రమంలో తరచి చూస్తే, కొత్త కొత్త సామాజికాంశాలూ, వైరుధ్యాలూ, మానసిక కోణాలూ కనిపించక మానవు. అలాంటి వస్తువులని ఎన్నుకొని కథల చట్రంలో ప్రతిభావంతంగా బిగించగలిగిననాడు ‘కథ’ అనేది వర్తమానాన్ని అర్థవంతంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడగల మాధ్యమం అవుతుంది. అలాగే వస్తువు పాతదైనా అందులో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా గుర్తించతగినదే.

చిత్రం: కృష్ణ అశోక్

చిత్రం: కృష్ణ అశోక్

ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది.

 

ఈ నెల వచ్చిన కథలలో చెప్పుకోదగ్గ కథలను విశ్లేషిస్తే –

 

“ప్లాసెంటా” – పెద్దింటి అశోక్ కుమార్ (అమెరికా ఉద్యోగం కోసం చంటి బిడ్డను వదిలించుకోవాలని ప్రయత్నం చేసే తల్లి), “సహజాతాలు” – విహారి (చదువులు, దొరకని ఉద్యోగాలు వల్ల డిప్రెషన్ లు, కొన్ని తప్పని నిర్ణయాలు)  “డేగలు తిరిగే ఆకాశం” – అరిపిరాల సత్యప్రసాద్ (పీడోఫైల్ ప్రపంచంలో ఓ తండ్రి ఆవేదన), “ఇద్దరు బిడ్డల తల్లి” – వేంపల్లె షరీఫ్ (ప్రాంత, మత జనిత ఉచ్ఛారణా దోషాలు కూడా వివక్షకి కారణమే) ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు.

 

కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి. “సాంత్వనములేక” – తాడికొండ కె శివకుమార్ శర్మ (ముక్తపదగ్రస్త అలంకారంలా దుమికే కథనం), “నిద్రకు మెలకువకూ మధ్య” – పలమనేరు బాలాజీ (మిస్టిక్), “అసమయాల అమావాస్య” – సాయిపద్మ (మాంత్రిక వాస్తవికత), “మంచు” – మూలా సుబ్రమణ్యం (మిస్టిక్ మనిషి ప్రధానపాత్రగా). ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.

 

కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి. “ఆకలి” – పెద్దింటి అశోక్ కుమార్, “వారసులు” – జి. ఉమామహేశ్వర్, “ఇదేన్రీ హింగాయ్తూ” – ఓలేటి శ్రీనివాసభాను మెదలైనవి ఈ కోవకు చెందినవే. పాత కథా వస్తువు, సాధారణమైన కథనం ఉన్నప్పటికీ “సొంత సౌఖ్యము కొంత చూసుకు” – సింగరాజు రమాదేవి, (నవ్య, జనవరి 8), “పర్ణశాల” – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (స్వప్న మాసపత్రిక)  వంటి కథలలో పరిష్కారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

 

జనవరి కథలని అనేక అంశాల ప్రాతిపదికన బేరీజు వేసుకుంటూ పోతే, ఈ కథ మా సమిష్టి అధ్యయనంలో జనవరి-2014 కథలలో ఉత్తమమైన కథగా నిలిచింది!

 

ప్లాసెంటా

తెలుగు వెలుగు

రచయిత: పెద్దింటి అశోక్ కుమార్

ఈ కథ గురించి మా విశ్లేషణ, రచయితతో ముఖాముఖి వచ్చే వారం…

 

మంచి ప్రయత్నం చేసిన ఇతర కథలు, పాఠకులు చదివి విశ్లేషించుకోగల వీలుగల మరికొన్ని కథలు:

  • సాంత్వనము లేక తాడికొండ కె. శివకుమార్ శర్మ (వాకిలి, జనవరి)
  • ఆకలి పెద్దింటి అశోక్ కుమార్ (నవ్య 22, జనవరి)
  • నిద్రకు మెలకువకూ మధ్య పలమనేరు బాలాజీ (నవ్య, 22 జనవరి)
  • డేగలు తిరిగే ఆకాశం అరిపిరాల సత్యప్రసాద్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 26 జనవరి)
  • అసమయాల అమావాస్య సాయిపద్మ (ఈమాట, జనవరి ఫిబ్రవరి సంచిక)
  • వారసులు జి. ఉమామహేశ్వర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 జనవరి)
  • ఇద్దరు బిడ్డల తల్లి వేంపల్లె షరీఫ్ (నవ్య, 8 జనవరి)
  • ఇదేన్రీ హింగాయ్తూ ఓలేటి శ్రీనివాసభాను (నవ్య, 15 జనవరి)
  • సహజాతాలు విహారి (నవ్య, 1 జనవరి)
  • మంచు మూలా సుబ్రమణ్యం (ఈమాట, జనవరి-ఫిబ్రవరి)

– అరిపిరాల సత్య ప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్ర శేఖర రెడ్డి.

   (లోగో :మహీ బెజవాడ)

02. T Chandra Sekhara Reddy03. Aripirala01. Ramana Murthy

Download PDF

31 Comments

  • “మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు.”
    ^ పొరబాటు

    • “నడుస్తున్న కథ” వారికి,
      పై వాఖ్యకు కొనసాగింపు ఇది. దాదాపు రెండు దశాబ్దాలుగా కథ వార్షిక సంపుటిని వెలువరిస్తున్న సంపాదకులు పాపినేని, నవీన్ జాలంలో ప్రచురించబడుతున్న కథలను వారి దృష్టికి వచ్చినవాటిని పరిగణలోకి తీసుకుంటునే ఉన్నారు.

      అలానే గత సంవత్సరం (2013) వాకిలి జాల పత్రిక వారి మార్చి సంచికలో వెలువడిన “జాజిమల్లి” కథ బెనామి రానున్న “కథ” 2013 సంపుటికి ఎంపిక చేసారని తెలిసింది.

      జాజిమల్లి గారి “బెనామి” కథ కి లంకె ఇదిగో http://bit.ly/1nvo6xt

      • రమణ మూర్తి says:

        అనిల్ గారూ:

        నా దగ్గర ఉన్న వివరాల ప్రకారం కథాసాహితి వార్షిక సంకనాలలో ఇప్పటివరకు 311 కథలు వచ్చాయి. ఇందులో తెలుగుకథ డాట్ కామ్ (అది అంతర్జాల పత్రికో, అప్పట్లో ముద్రింపబడుతూ ఉన్న పత్రికో తెలీదు…) నుంచి కథ-2000 లో రెండు కథలు; ‘సుజనరంజని’ నుంచి కథ-2001లో రెండు కథలూ, కథ-2005లో ఒక కథా వచ్చాయి.

        మొత్తం 311 కథలలో కేవలం 5 కథలు ఇ-పత్రికలనుంచి. ఇవి కాక ఇంకా ఏమైనా ఉంటే తెలియజేయగలరు..

        ‘బినామి’ కథ గురించి మీరు అందించిన సమాచారం సంతోషకరం. 2013నుంచి అయినా అంతర్జాలపత్రికలని కూడా వారు రెగ్యులర్‌గా పరిగణనలోకి తీసుకుంటే, మేమూ సంతోషిస్తాం!

  • వ్యాసంలో పేర్కొన్న కథలకు లింకులు ఇవి:

    ప్లాసెంటా: http://ramojifoundation.org/flipbook/201401/magazine.html#/0
    సాంత్వనము లేక: http://vaakili.com/patrika/?p=4696
    ఆకలి: http://www.navyaweekly.com/2014/jan/22/page22.asp
    నిద్రకూ మెలకువకూ మధ్య: http://www.navyaweekly.com/2014/jan/22/page62.asp
    వారసులు: http://www.andhrajyothy.com/node/55575
    డేగలు తిరిగే ఆకాశం: http://www.andhrajyothy.com/node/58253
    అసమయాల అమావాస్య: http://eemaata.com/em/issues/201401/2962.html
    ఇద్దరు బిడ్డల తల్లి: http://www.navyaweekly.com/2014/jan/8/page22.asp
    ఇదేంన్రీ హింగాయ్తు: http://www.navyaweekly.com/2014/jan/15/page10.asp
    సహజాతాలు: http://www.navyaweekly.com/2014/jan/1/page22.asp

  • KriShNavENi says:

    మంచి ప్రయత్నం.

  • ఇక్కడ ఈ పిట్తలాంటి చిన్న పరిచయవ్యాసం వెనకాల గండభేరుండమంత ప్రయాస ఉన్నదని పాఠకులెవరన్నా గుర్తించారో లేదో? ప్రస్తుతం పత్రికల్లో కంటబడుతున్న కథల క్వాలిటీ (లేమి)ని గురించి క్షోభ పడుతుంటే .. ఇన్ని డజన్ల కథల్లో అసలు మంచివే లేవా .. ఉండండి, వెతుకుదాం అని నడుంకట్టిన ముగ్గురు మస్కెటీర్లకీ సలాం!

  • మంచి ప్రయత్నం.
    వ్యాసమూ బావుంది.
    కాకపోతే, ఒకే సందేహం. అనువాద కథలు ‘కథలు’ కావా? తెలుగులో మంచి కథల ప్రస్తావన వచ్చినప్పడల్లా ఆసక్తిగా చదువుతూంటాను… కానీ అనువాద కథల ప్రస్తావనే ఉండడం లేదు.. అనువాద కథల విశ్లేషణ జరిగితే బావుంటుందని నా అభిప్రాయం. పైన చెప్పిన పత్రికలలో చాలా వాటిల్లో జనవరి నెలలో అనువాద కథలు ప్రచురితమై ఉంటాయి. అవేవీ బాలేవా? ప్రస్తావనకి సైతం నోచుకోని కథలా అవి? కాదనే నా నమ్మకం. మంచి కథలు కాకపోతే ఆయా పత్రికలు ప్రచురించనే ప్రచురించవు. ఇలాంటి వ్యాసాలలో అనువాద కథలని విశ్లేషించక పోయినా, కనీసం ప్రస్తావించినా నాలాంటి అనువాదకులకు కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశీలించవలసిందిగా పెద్దలను కోరుతున్నాను.
    కొల్లూరి సోమ శంకర్

    • అనువాద కథలు కథలే కావు అని ఎన్నడూ అనలేము. నిజానికి అనువాద కథలు ఎప్పటికప్పుడు మనల్ని మనం బేరీజు వేసుకోడానికి సహాయపడతాయి. అయితే వీటిని ప్రత్యేకంగా పరిశీలించాలి తప్ప మిగతా కథలతో కలిపి విశ్లేషించడం తగదు. అందుకు అనేక కారణాలు. అనువాదాలలో కూడా కొందరు సమకాలీన కథలు ఎంచుకుంటే కొంత మంది మపాస, చెహోవ్, హెన్రీ లాంటి వారిని ఎంచుకుంటారు. ఈ కథలను సమకాలీన తెలుగు కథలతో పోల్చి చూడడం సబబు కాదు. రెండు సమయ పరిమితులు. అనువాదాలు విశ్లేషించడానికి Parameters వేరుగా వుంటాయి. మూల భావం ఎంతవరకు అనువాదంలోకి వచ్చింది లాంటివి. ఇది మరో కారణం. అందువల్ల మేము తెలుగు కథనే పరిమితిగా పెట్టుకున్నాము. ఇదే స్ఫూర్తితో ఇంకెవరైనా అనువాద కథలను కూడా విశ్లేషిస్తారని ఆశిస్తున్నాము.

      మరో విషయం. చాలా పత్రికలు పాత రచనలను పునర్ముద్రిస్తున్నారు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడంలేదు. రచయితల పొరపాటు వల్లో, పత్రిక పొరపాటు వల్లో కూడా ఒకోసారి పునర్ముద్రణ జరుగుతోంది. ఇలాంటివి మా దృష్టిలోకి వచ్చిన మేరకు పరిగణించడం లేదు (జనవరిలో అలాంటివి మూడు కథలు వచ్చాయి. అందులో పై జాబితాలో చేరదగ్గ కథ ఒకటి వుంది).

      మరో కోణం: హాస్యం, భయానకం, అపరాధపరిశోధన లాంటి కథలు సాధారణంగా ఇలాంటి విశ్లేషణలోకి రావు. అలాగే చిన్న కథలు కూడా. ఒకవేళ వచ్చినా మిగిలిన కథలను విశ్లేషించే Parameters వీటికి సరిపోవు. అంచేత వాటిని తప్పకుండా పరిశీలించి, పై జాబితాలో రాకపోయినా ప్రయోగశీలత దృష్ట్యా వాటిని ప్రత్యేకంగానైనా ప్రకటించే ప్రయత్నం చేస్తాం.

  • vimala says:

    చాలా మంచి ప్రయత్నమ్. ఎంతో ప్రయాస కుడా. కధలు చదువుకోటానికి వీలుగా లింకులు ఇవ్వటము బాగాఉంది. మీకు నా అభినందనలు.

    విమల

  • manibhushan says:

    చాలా మంచి ప్రయత్నం.
    తెలుగు కథా క్షేత్రంలో ఓ విజయ స్తంభం స్థాపించాలనే మీ కుట్రను అభినందిస్తున్నాను.

    నా సూచన…
    – సామాజికాంశాలను శ్రద్ధగా గమనించే కథకులు లేదా అలాగే కథలు
    – వ్యంగ్య, చమత్కార ధోరణుల్లో వచ్చిన కథలు
    – మాండలీక కథలు
    – వృత్తిగత అంశాలపై వెలువడిన కథలు
    – నేటికీ మహిళా సంబంధిత అంశాలపై సెల్ఫ్ పిటీతోనే కథలు వస్తున్నాయి. ఆ ధోరణి లేనివి

    ఇటువంటివి మరికొన్ని విభజించినా బాగుంటుందేమో చూడండి. అలాగని ప్రత్యేక ముద్రలు వేయనక్కర్లేదు. ఆ యా అంశాలపై ఆసక్తిగలవారికి వెసులుబాటు ఉంటుందనేది నా భావన.

  • allaka says:

    మంచి ప్రయత్నం,అభినందనలు.

  • Brahmanandam Gorti says:

    ఫేసుబుక్కులో లైకుల క్లిక్కులూ, కామెంట్లూ చూసి ఆత్రంగా చదివా!

    దాని పర్యవసానమే ఇలా రాయించింది.

    కొన్ని వెబ్సైట్లలో సినిమా రివ్యూలొస్తాయి. సరిగా ఈ వ్యాసం చదవగానే అవి గుర్తుకొచ్చాయి.

    ఉదాహరణకి –

    First half is just ok and interval bang has some romance on screen. The second half goes serious and finally ends up abruptly in a lighter note. The beginning, the bonding, the conflict, the solution and the reunion happens in a flow and there are no screenplay wonders. All in all, it’s a film that can be watched leisurely with family.

    The film takes off with a colorful backdrop and the fun factor is there for a while but after twenty minutes the energy and pace slows down.

    The interval bang was alright so second half was crucial. However, due to lack of emotional peaks and wrong placement of songs, the momentum got affected.

    Overall, the film had positives to catch in bits and pieces, and it can be a time pass treat.

    ఈ వ్యాక్యాలని తలపింప చేసే కొన్ని ఈ ప్రయత్నంలో చూసి ఖంగు తిన్నాను.

    “…ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు. కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి.
    ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.”

    కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి…మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

    కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి…ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది”

    వీటికీ పైన ఉదహరించిన సినిమా రివ్యూలకీ ఏమీ తేడా లేదు.

    నెలలో వచ్చిన కథలన్నీ చదివి మంచి కథ గురించి రాస్తామని అంటున్నారు. ఇక్కడ రెండు విషయాల్లో స్పష్టత కావాలి. ఒకటి మంచి కథ అన్న దాంట్లో మంచి అన్నదాన్ని విశదీకరించాలి. మంచి అంటే ఏవిటి? రెండోది. ఆ నెల్లో అన్నీ నాసిరకం కథలే వచ్చాయనుకుందాం. అప్పుడేం చేస్తారు?

    కథలు బావుంటే బావున్నాయి అనీ, ఎందుకు బావున్నాయో వివరంగా చెప్పాలి. అలాగే బాగోలేని కథలు ( మీ దృష్టిలో ) అవెందుకు బాగో లేదో స్పష్టంగా చెప్పగలిగుండాలి. నచ్చిన కథని ఆకాశానికి ఎత్తేయడం, నచ్చని వాటిని లౌక్యంగా – ఈ కథ వస్తువు దెబ్బతిందీ, కథనం పల్చబడిందీ, శైలి గజిబిజిగా వుందీ, ముగింపు నీరుకార్చిందీ వంటి రాజకీయ పడికట్టు పదాలు గుప్పించీ కర్రా విరక్కొడదూ, పామూ చావకూడదన్న చందంగా రాయడం వల్ల ప్రయోజనం లేదు.

    అసలు పేచీ అంతా శీర్షికతోనే మొదలయ్యింది. “మంచికథలకోసం ఒక అన్వేషణ” అంటున్నారు. ముందు మంచి అన్నది ఏవిటో నిర్వచిస్తే బావుంటుంది. మనుషుల్లో మంచి ఎంత సాపేక్షమో, కథల్లో మంచి కూడా అంతేనని నా ఆభిప్రాయం.

    బాగోలేని కథని ఎంత పెద్ద రచయిత రాసినా ధైర్యంగా, నిష్కర్షగా చెప్పే సత్తుందా ఈ శీర్షికకి? మొహమాటాలకీ, స్నేహాలకీ విలువనిస్తూ అన్ని పత్రికల్లో సమీక్షలాగే ఇదీ మరొకటా అన్నది కాలమే చెప్పాలి.

    విమర్శకులకి రచన తప్ప, రచయితతో నిమ్మిత్తం కాకూడదు. అలాంటి కథా విమర్శ తెలుగులో ఉందన్న నమ్మకం అయితే నాకు లేదు.

    తెలంగాణా వచ్చిందని ఆనందించాలో, ఆంధ్రా ముక్కలయినందుకు బాధ పడాలో అన్న చందంగా అనిపించింది, ఈ ప్రయత్నం చూసి. నెలలో వచ్చిన కథలన్నీ గుత్తికట్టి ఇస్తున్నందుకు ఆనందమూ, పడికట్టు పదాలతో సమీక్ష చేసే శీర్షిక బాబోయన్న బాధా కలిగింది ఇది చదవగానే!

    గతంలో కౌముదిలో కస్తూరి మురళీ కృష్ణ ఏడాది పాటి ఇటువంటి శీర్షికే నడిపినట్లుగుర్తు.

    ఇలా రాస్తే నన్ను తిట్టుకుంటారని ( ముఖ్యంగా రచయితలు ) అని తెలుసు. అయిన్న ఎక్కణ్ణుండో పిసరంత ధైర్యం ముందుకు తోసింది.

  • సాయి పద్మ says:

    కథ అంటేనే , ఒక ప్రయాస, ప్రయత్నంతో కూడిన ఒక మంచి అనుభవం.. కథ అంటే ఎంత ఇష్టం లేకపోతే ముగ్గురు కథకులు, మంచి చదువరులు కలిసి ఈ నెలలో మంచి కథ, దాని కథా కమామీషు, ఏంటీ అని రాస్తే భలే సూపర్.. ఇందులో నా కథ కూడా ఒకటి ఉన్నందుకు , అది మంచి కథ అయ్యే అవకాశం ఉన్నందుకు , అలా అన్నందుకు భలే ఉంది .. రమణ మూర్తి గారికి, సత్య ప్రసాద్ గారికి , చంద్రశేఖర్ రెడ్డి గారికి అనేక వందనాలతో…

  • రాజశేఖర్ గుదిబండి says:

    చాల మంచి ప్రయత్నం . మనః పూర్వక అభినందనలు.
    పూర్వం బినాకా గీతమాల కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు “సారంగ కధాసాగరం” కోసం ఎదురుచూస్తాం నెలనెలా…. =)
    పడిలేచే కధా కెరటాలకోసం …

  • దాట్ల దేవదానం రాజు says:

    ముగ్గురకూ నా అభినందనలు,చాల సమయం ఖర్చుపెడుతున్నందుకు,కొత్తగా ఆలోచిస్తున్నందుకు,లింకులు కూడ ఇచ్చి కధలు చదివే భాగ్యం కలిగిస్తున్నందుకు.

  • rm. umamaheswararao says:

    మంచి ప్రయత్నం . రమణ మూర్తి గారికి, సత్య ప్రసాద్ గారికి , చంద్రశేఖర్ రెడ్డి గారికి అభినందనలు. పెద్ద భారమే ఇది. లింకులివ్వడం మరీ హాయిగా ఉంది. మిగిలిన కథలు స్కాన్ చేసి వీలైతే పెట్టేస్తే ఇంకా బావుణ్ణనే ఆశ కలుగుతోంది. ఇదింకో కథానిలయం అయిపోతుంది, నెల నెలా పోగయ్యే కథలతో. కల్పన, అఫ్సర్ లకి కూడా థాంక్స్, ఇంత స్పేస్ ఇస్తున్నందుకు.

  • “ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. ”

    నిజంగా నిజం. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజూ వెబ్ సర్ఫ్ చేసి కొత్త కథలేమైనా ఉన్నాయేమో వెతుక్కుని చదువుతాను. అల్లాంటిది ఈ లిస్ట్లో నేను చదవని ఒకే ఒక్క కథ “ప్లాసెంటా” ఉత్తమ కథ గా ఎంపికవ్వడం దానికి పెద్ద నిదర్శనం. అఫ్కోర్స్, కథ చదివిన తర్వాత ఆ కథే ఈ నెలలో వచ్చిన ఉత్తమ కథ అనే అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదనుకోండి. కానీ సమయాభావం ఉన్నవాళ్ళకు ఈ కథల లిస్టు, చదవడానికి వీలుగా లింక్స్, చాలా ఉపయోగపడతాయి.

    చాలా మంచి, అభినందనీయ ప్రయత్నం.

    • జ్యోతిగారు…
      “కథ చదివిన తర్వాత ఆ కథే ఈ నెలలో వచ్చిన ఉత్తమ కథ అనే అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదనుకోండి.” – అలా ఎందుకు అనుపించింది చెప్పగలరా? అలాగే మీరు కథలు చదువుతున్నారు కాబట్టి మీ దృష్టిలో జనవరిలో నచ్చిన కథ ఏదైనా వుంటే సూచించండి. అందువల్ల ఆరోగ్యకరమైన చర్చకి ఆస్కారం వుంటుంది ! ఈ ప్రయత్నానికి అదే ప్రయోజనం కాగలదు.

      • సత్యప్రసాద్ గారు,
        కామెంట్స్ చదివి ఓపిగ్గా రిప్లై పెడుతున్నందుకు ధన్యవాదాలు.

        నాకు ఏదైనా కథ చదివితే, అది ఒక కొత్త ప్రపంచాన్నో, విషయాన్నో, నా చుట్టు జరుగుతున్నా నా మనసు స్పందించడం మరచిపోయిన సంగతినో, లేదా జీవితంలో మనలో చాలామంది రోజూ ఎదుర్కునే సంఘటననో, మొత్తమ్మీద కథా వస్తువు ఏదైనా మనసుకు హత్తుకునేలా, చదివించే శైలిలో చెప్పగలగాలి.

        నా దృష్టిలో “ఇదేన్రీ… హింగాయ్తూ” ఆ నెలలో వచ్చిన ఉత్తమ కథ.

        “ప్లాసెంటా” కథలో నాకు కథ ప్రారంభం కానీ, చెప్పిన విధానము కానీ అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఒక జెనరలైజెడ్ ఔట్లుక్ తో ఈ తరం వాళ్ళు బంధాల కన్నా, కెరీర్ కే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారని చాలా మందికి ఉండే ఒక అపోహతో రాసిన కథ ఇది. దానికి పరిష్కారం చెప్పకపోడం గురించి నాకెలాంటి ఫిర్యాదు లేదు. ప్రశ్నను లేవనెత్తిన కథకు, సమాధానం చెప్పే అవసరం లేదని, లేదా అవకాశం ఉండకపోవచ్చని నాకు తెలుసు. కానీ ఏ కథకైనా ఉండాల్సిన ముఖ్య గుణం హృదయాన్ని స్పందింపచేసే లక్షణం.అది ఈ కథలో లేదని నాకనిపించింది. ఇదే రచయిత గారి “ఆకలి”, ప్లాసేంటా కన్నా బెటర్ కథ నా దృష్టిలో.

  • ari sitaramayya says:

    ఇది ఏ ఒక్కరి గురించో కాదు. ఇప్పటి వ్యాస కర్తల గురించీ కాదు. తెలుగు కథ గురించి. తెలుగు కథకు మంచి రోజులు రావాలంటే, తెలుగులో మంచి కథలు రావాలంటే, మనం అందరం కథ దేని గురించీ అని అడగటం మానెయ్యాలి. కథ నాకేమీ అర్థం కాలేదే, ఎం చెప్పదల్చుకున్నాడు కథకుడు అని అడగటం మానెయ్యాలి. కథలను నీతులు చెప్పటానికీ, సమశ్యలకు పరిష్కారాలు చూపించటానికీ వాడుకోకూడదు. కథలు నిజ జీవితాలను ప్రతిఫలించాలి. భావోద్వేగం కలిగించాలి, జ్ఞానోదయం కాదు. ఆ రోజొచ్చేదాకా కథల ముసుగులో వస్తున్న వ్యాసాలు చదువుకుంటూ మురిసిపోతూ ఉండటమే మనం చెయ్యగలిగేది.

    • సీతారామయ్య గారి వ్యాఖ్య తో నూటికి నూరుశాతం ఏకీభవిస్తున్నాను. వెల్ సెడ్ సర్!!

      “కథలను నీతులు చెప్పటానికీ, సమస్యలకు పరిష్కారాలు చూపించటానికీ వాడుకోకూడదు.”

      “కథకులందరూ” ఈ మాటని పేద్ద పేద్ద అక్షరాలలో చదువుకోవాలి . కథల రూపంలో వస్తున్న వ్యాసాలు, పద గుంఫనకి మాత్రమే పనికొస్తున్న ‘కథల్లాంటివి’.. ఇలా చెప్పుకుపోతే ‘ఎలా రాయకూడదు?’ కి గైడ్ సులువుగా తయారుచేసేయొచ్చు. :)

      ప్రయాసకోర్చి మంచి ప్రయత్నం చేస్తున్న విశ్లేషక బృందానికి అభినందనలు!! పొల్లులోంచి మొలకొలుకులు ఏరడం ఎంత కష్టమంటారు!! :)

  • krishnam raju.dalapati says:

    మంచి ప్రయత్నం,అభినందనలు.

  • మంజరి.లక్ష్మి says:

    జ్యోతిగారు మీరు `ఈ తరం’ అంటున్నారు కానీ కధలో తల్లి గురించే రాశారు. తండ్రికి పిల్లల పట్ల బాధ్యత లేక పోయినా ఫరవాలేదు. అతను తన కెరీర్ కోసం భార్యను పిల్లలను వదిలి ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు. ప్రకృతి పరంగా బిడ్డకు పాలివ్వటం తల్లికి తప్పని సరి. మరి మిగతా పనుల్లో తండ్రి కూడా పాల్గొనే బాధ్యత లేదా. పిల్లవాడికి తండ్రివడి, తండ్రి ఆదరణ అఖర్లేదా? అయినా ఇద్దరులేని బిడ్డలను వేరే వాళ్ళు పెంచితే, వాళ్ళ వడిలో ఉండాల్సొస్తే వాళ్ళకు బ్రైన్ సరిగా పెరగదా?

  • CHITRA says:

    సర్ నమస్కారం సాంత్వనము లేక చదివాను మీ మెయిల్ ఐ డీ ఇవ్వరూ ? నాది chitramarao@gmail.com

    • Thirupalu says:

      CHITRA గారు,
      మీరు ఈమీ అనుకోక పోతే ఒక విన్నపం. మీరు మెయిల్ ఐడి లు అడుగుతుంటారు. మీ వ్యక్తిగతమగా ఐతే నేను జోక్యం చేసుకోవడం తప్పు. మీరు రాసే కదా విశ్లేశణల గురించి ఇతర రాకానలగురిమ్చి ఐతే ఇక్కడే చర్చ చేస్తే పాతకులకు సౌకర్యమ్గా ఉంటుంది కదా? వ్యక్తిగతంగా చర్చ చేస్తే పాటకులకు తెలియదు కనుక ఆ రచన గురించి బేరీజు వేయటానికి తోడ్పడదు గదా?

  • మంజరి లక్ష్మి says:

    ఆరి సీతారమైయ్య గారు “కథలను నీతులు చెప్పటానికీ, సమశ్యలకు పరిష్కారాలు చూపించటానికీ వాడుకోకూడదు” అన్నారు పోనీ చెడు విషయాలను వ్యతిరేకించటానికీ, మంచి విషయాలు చెప్పటానికి ఉపయోగించ వచ్చా?.మీరీ మధ్య ఒక కధ గురించి రాస్తూ అందులో హింస మంచిది అని రాశాడు రచయిత అనీ, దీన్ని చూసి ఎవరైనా భార్యలను హింశిస్తే ఈ పుస్తక ప్రచురణ కర్తలు బాధ్యత వహిస్తారా అని అడిగారు. ఆ ప్రకారం ఒక కధ అటువంటి తప్పుడు విషయాలు చెప్ప కూడదనే కదా అర్ధం. అది చూపించి అది తప్పని ఒక కధ చెపితే అది నీతులు చెప్పినట్లవుతుందా అవదా మీ ప్రకారం.

    • ari sitaramayya says:

      ఎవరికి తోచిన మంచి చెడ్డల ప్రచారానికి వారు కథని వాడుకుంటే కథకీ వ్యాసానికీ తేడా ఏముంటుంది చెప్పండి. కథల్లో అభిప్రాయాలు వ్యక్తం చెయ్యకూడదని నేను అనుకోవడం లేదు. కాని అది కళాత్మకంగా జరగాలి. బాహాటంగా కాదు. అభిప్రాయాలు కథకుడి నుంచి రాకూడదు. కథలోనుంచి రావాలి. ఉదాహరణకు చాలా పేరు పొందిన మొపాసా కథ boule de suif తీసుకోండి. రచయిత ఒక్క అభిప్రాయం కూడా వ్యక్తం చెయ్యడు. కానీ కథ చదివినప్పుడు సభ్య సమాజంలోని కపటత్వం మీద చదువరికి అసహ్యం కలగక మానదు. అలా రాయాలంటే సమర్థతతోబాటు ఓపిక కూడా ఉండాలి.

Leave a Reply to మంజరి.లక్ష్మి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)