మనం చూడని మరో ఆదివాసీ కోణం!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

బ్రాహ్మణుల మధ్య ఉంటూ, బ్రాహ్మణ వేషంలో కూడా ఉన్న అర్జునుడనే ఒక మైదాన ప్రాంత వాసికి-

క్షత్రియులు బ్రాహ్మణునీ, అగ్నిహోత్రాన్నీ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని…ఒక ఆదివాసీ గంధర్వుడు బోధించడం!!!

తమాషాగా లేదూ?!

ఇందులోని మర్మం ఏమిటా అని ఆలోచించిన కొద్దీ నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఒక కీలకమైన ప్రశ్ననూ ముందుకు తెస్తోంది. అంతే కుతూహలం కలిగిస్తున్నది ఏమిటంటే, ఈ తమాషాకు సంప్రదాయపండితులు ఎలాంటి భాష్యం చెబుతారని. బహుశా ఒక సమర్థన ఇలా ఉండచ్చు: పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. అందులోనూ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. తమ ఉదరపోషణకే భిక్షాటన మీద ఆధారపడుతున్నారు. కనుక ఇంకొక బ్రాహ్మణుని పోషణను వాళ్ళు తలకెత్తుకోవడం కష్టం. అదీగాక, వాళ్ళే బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కనుక పురోహితుని రూపంలో ఇంకో బ్రాహ్మణుని వెంట బెట్టుకోవలసిన అవసరమూ లేదు…

గంధర్వుడి సమస్య గంధర్వుడిది. బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ వెంట లేరు కనుక వారు క్షత్రియులన్న సంగతి అతనికి తెలిసే అవకాశం లేదు. పైగా వాళ్ళు బ్రాహ్మణ వేషంలో కూడా ఉన్నారు. కాకపోతే తెలిసిన బ్రాహ్మణులు కారు, కొత్తగా కనిపిస్తున్నారు. ఏమైనా బ్రాహ్మణులే కనుక, భయపెట్టి దూరంగా తరిమేయడానికి ప్రయత్నించాడు. అర్జునుడు ధిక్కరించి యుద్ధానికి దిగిన తర్వాతా, అతని చేతిలో తను ఓడిపోయిన తర్వాతే వాళ్ళు పాండవులన్న సంగతి అతనికి తెలిసింది.

ఆ తర్వాత అర్జునుడి ప్రశ్న చూడండి…’మేము పరమ ధార్మికులము, పరమ బ్రహ్మణ్యులము కదా, మొదట్లో మమ్మల్ని అదిలించి ఎందుకు మాట్లాడావూ’ అని! ‘ఎందుకంటే, మీ వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేరు కనుక’ అని గంధర్వుని జవాబు!

అర్జునుడి ప్రశ్న దగ్గరనుంచీ సాగిన సంభాషణ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించండి…తమ వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేరు కనుక గంధర్వుడు తమను పాండవులుగా గుర్తించలేకపోయాడనే సంగతి అర్జునుడికి ఆపాటికే తెలిసి ఉండాలి. కానీ అతని ప్రశ్నను గమనిస్తే, అతనికి ఆ విషయం…అంటే, క్షత్రియుడి వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ ఎప్పుడూ ఉండాలన్న విషయం … తెలియదని అర్థమైపోతోంది. ఆపైన గంధర్వుడు క్షత్రియుని వెంట పురోహితుడు ఎప్పుడూ ఎందుకు ఉండాలో వివరించిన తీరులో కూడా అర్జునుని తెలియని తనమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఒక క్షత్రియుడికి తప్పనిసరిగా తెలియవలసిన ఒక సంప్రదాయం, లేదా ఆనవాయితీ అర్జునుడికే కాక పాండవులందరికీ అప్పటికి తెలియకపోవడం అనేది దేనిని సూచిస్తుంది?! కొంపదీసి వారిది అనుమానాస్పద నేపథ్యం అన్న సంగతినా? అటువంటి వాదనలూ ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే,  అది ప్రస్తుతాంశం కాదు కనుకా, నేనింకా దానిపై సాధికార పరిశీలన చేయలేదు కనుకా ఒక సందేహార్థకంగానే దానిని ఇంతటితో వదిలేస్తాను.

ఇంతవరకూ పరిమితమై చూసినప్పుడు ఇంకో సమర్థనకూ అవకాశం ఉందని అనిపించవచ్చు. అదేమిటంటే, క్షత్రియుని వెంట బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ ఉండాలన్న సంగతి పాండవులకు తెలియకేం, తెలుసు. కానీ తాము ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అవసరం లేదని వాళ్ళు అనుకుని ఉండచ్చు. గంధర్వుడికి ఆ సంగతి అంత వివరంగా తెలియదు కనుక, ఆ లోపాన్ని ఎత్తి చూపి ఉండచ్చు. లేదు, మేము ఫలానా కారణం వల్ల బ్రాహ్మణుని, అగ్నిహోత్రాన్ని వెంట ఉంచుకోలేదని ముక్కూ మొహం తెలియని ఓ ఆదివాసీ గంధర్వుడికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?

అయితే, ఇంకొంచెం ముందుకు వెడితే, ఈ సమర్థన కూడా పేలపిండిలా ఇట్టే ఎగిరిపోతుంది. ఎందుకంటే, తమకు ఒక మంచి పురోహితుని సూచించమని అర్జునుడే గంధర్వుని అడుగుతాడు. గంధర్వుడు సూచిస్తాడు కూడా. కనుక క్షత్రియుని వెంట బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ ఉండాలన్న సంగతి పాండవులకు తెలియదనే అనంతర కథాక్రమం కూడా వెల్లడిస్తోంది.

గమనించండి, పాండవులకు ఇదొక్కటే కాదు, మరో విషయం కూడా తెలియదు. అది, తాము ‘తాపత్య వంశీకుల’మన్న సంగతి! ‘మేము కౌంతేయులం కదా, తాపత్య వంశీకుల మెలా అయ్యా’ మని అర్జునుడు గంధర్వుని అడగనే అడిగాడు.

ఎలా అయ్యారో చెప్పుకునే ముందు గంధర్వుడి తీరు గురించి, అతని మాటల్లో దొర్లిన ఇతర విశేషాల గురించి చెప్పుకుందాం.

***

Back-To-Godhead-Mahabharat

అర్జునుడు గంధర్వుని కొప్పు పట్టుకుని ఈడ్చుకు వచ్చి  ధర్మరాజు ముందు పడేసిన దృశ్యాన్ని ఓ సారి ఊహించుకోండి: బహుశా అతనికో పెద్ద కొప్పు ఉండి ఉంటుంది. ఆడవాళ్ళతో కలసి అర్థరాత్రి అతను జలక్రీడలాడడానికి వచ్చాడు కనుక అతను మంచి విలాసపురుషుడన్న మాట. పైగా ఆ అడవంతా తనదన్న ధీమా అతనిది. ఇక్కడ ఎప్పుడెలా విహరిస్తేనేం? అందుకే, ఊహించని విధంగా పాండవుల రూపంలో పరపురుషుల ఉనికి కనిపించేసరికి అతనికి వల్లమాలిన కోపం వచ్చింది.

గంధర్వుని మాటల్ని చూడండి: వాటిలో లోతుకన్నా డాంబికమే ఎక్కువ. కింద పడ్డా పై చేయి నాదే నన్నట్టుంటాయి. అర్థరాత్రి వేళ, సంధ్యాసమయాల్లో మేము ఎంతటి వాళ్లనైనా ఒడించేస్తామని అతను చాలా దర్పంగా చెప్పినా, బహుశా అందులో కొంత వాస్తవం ఉండచ్చు. తీరా అర్జునుడు తనను ధిక్కరించి యుద్ధానికి సిద్ధమవడం, చిటికెలో తన రథాన్ని దగ్ధం చేయడం, తన కొప్పు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ధర్మరాజు ముందు పడేయడం, భార్య పతిభిక్ష పెట్టమని ప్రార్థించడం అతనికి  ఊహించని ఉత్పాతాలు.  అయితే, ఈ ‘షాక్’ అతని మనసులో పూర్తిగా ఇంకినట్టు కనిపించదు. కారణం, అతని మనసుకు దానిని ఇంకించుకునే శక్తి లేదు కనుక. అతని బుద్ధి కన్నా మాటే చురుగ్గా ఉంది. వెంటనే అట్టు తిరగేశాడు. నీ చేతుల్లో ఓడి పోయిన తర్వాత, ఈ అంగారపర్ణత్వం ఇంకా నాకెందుకు, మరీ అంత సిగ్గులేని వాణ్ణా, నేను పేరు మార్చుకుంటా నన్నాడు. ఆ అనడంలో కూడా చూడండి, నా రథం దగ్ధమైనా, నా దగ్గర చాలా మాయలున్నాయి, అనేక రత్న విచిత్రితమైన రథాన్ని పొంది ఇకనుంచి చిత్రరథుడి నవుతానని గర్వంగా ప్రకటించుకున్నాడు.

ఆ వెంటనే గమనించండి, నీ పరాక్రమాన్ని ‘మెచ్చాను’, నీతో స్నేహం చేయాలని ఉందన్నాడు. అంతేకాదు, నా దగ్గర చాక్షుషి అనే విద్య ఉంది, ఆ విద్యతో మూడులోకాల్లో ఏం జరుగుతోందో చూడచ్చు, అయితే, అది అందరికీ పని చేయదు, నువ్వు తాపత్య వంశీకుడివి కనుక నీకు పనిచేస్తుంది అన్నాడు. మూడు లోకాలనూ చూడగలిగిన విద్య తన దగ్గర ఉన్నా, అర్జునుణ్ణి గుర్తించలేక ఓటమిని ఎందుకు కొని తెచ్చుకున్నాడో తెలియదు. పైగా, ఈ విద్యను తీసుకునేటప్పుడు ఆరుమాసాలపాటు ఒక వ్రతం పాటించాలని షరతు పెట్టాడు. మందుల వాళ్ళు, స్వాములు, పూజారుల బాణీని ఈ మాటల్లో మీరు పోల్చుకోవచ్చు. అంటే, వారి మూలాలు కాలగర్భంలో ఇంత లోతున ఉన్నాయన్నమాట.

మొత్తంమీద ఈ ఘటనలో అతణ్ణి ఆకర్షించింది బహుశా ఒకే ఒకటి, అది ఆగ్నేయాస్త్రం! తన దగ్గర ఎన్నో మాయలున్నాయంటున్న అతనికి అదే ఓ పెద్ద మాయగా కనిపించినట్టుంది, నీ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తే మీకు గుర్రాలు ఇస్తానని బేరం పెట్టాడు.

మొత్తానికి అతని వ్యవహారం అంతా చిన్నపిల్లల తంతులా ఉంది…

అసలు సంగతేమిటంటే; ఎంతో లోతు, గాంభీర్యం, భిన్నమైన జీవన శైలి ఉన్న మైదానవాసి ముందు ఈ అడవిమనిషి తేలిపోతున్నాడు. అతనికి ఈ అనుభవం ఓ సాంస్కృతిక అఘాతం(cultural shock) అయిందేమో తెలియదు. ఒక ధోరణిలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అతను ఆ అడవిలో చెట్టులో పుట్టలో పిట్టలో ఒక సహజ భాగంగా అమరిపోయి తనదైన ప్రపంచంలో గడిపేవాడు. అతనిప్పుడు ఈ మైదానవాసుల ముందు ఒకవిధమైన న్యూనతతో బయటపడిపోతున్నాడు. తన వ్యక్తిత్వం జారిపోతున్నా లేని బింకం తెచ్చుకుని కూడదీసుకునే ప్రయత్నం-లేదా విఫలయత్నం- అతని మాటల్లో బొమ్మ కడుతూ ఉండచ్చు. ఈ ఘట్టంలో అతనెంత కళవళ పడ్డాడో, తనకు తెలియకుండానే ఎంత మథన పడ్డాడో అనిపిస్తుంది.

ఈ గంధర్వుడి రూపంలో మహాభారత కథకుడు మన ముందు అచ్చమైన ఒక ఆదివాసీని ప్రదర్శిస్తున్నాడు. ఈ కోణం నుంచి ఈ ఘట్టాన్ని ఎవరైనా ఇంతవరకు వ్యాఖ్యానించారో లేదో నాకు తెలియదు. గంధర్వులే కాక, సిద్ధులు, సాధ్యులు, యక్షులు వగైరా పేర్లతో మరి కొందరు కూడా కనిపిస్తూ ఉంటారు. ఏవో మహిమలూ, మాయలూ ఆపాదించి చెప్పే వీళ్ళందరూ కూడా అడవుల్ని ఆశ్రయించుకుని జీవించే ఆదివాసీ గణాలే కావచ్చు. వీరిలో కనిపించే మహిమ, మంత్రం, మాయ అనేవి ఇంకొకరిని మోసగించడానికే ఉద్దేశించినవి కాకపోవచ్చు. అవి వీరి జీవన తాత్వికతలో విడదీయలేని భాగాలు. వీరి జీవితాలను మాంత్రిక వాస్తవికత(magical realism) నిరంతరం అంటిపెట్టుకుని ఉంటుంది. (అడవిలో) ఒక చెట్టు చిగురించడం, ఒక పూవు వికసించడం ఎలా స్వాభావికాలో వీరిలో మాయలూ, మంత్రాలూ, మహిమలూ అంతే స్వాభావికాలు. మాంత్రిక వాస్తవికతను అత్యద్భుతంగా చర్చించిన జార్జ్ థాంప్సన్ ను ఇక్కడికి తీసుకురావాలనిపిస్తోంది కానీ ప్రస్తుతానికి వాయిదా వేస్తాను.

ధర్మరాజు విడిచిపెట్టమని చెప్పిన తర్వాత గంధర్వుని తీసుకెళ్లి అర్జునుడు ‘మంద’లో విడిచిపెట్టాడని కథకుడు చెబుతున్నాడు. ఇక్కడ ‘మంద’ అనడంలో ఆదివాసుల పట్ల మైదానవాసులలో ఉండే న్యూనతాభావం వ్యక్తమవుతోందేమో తెలియదు. ఇక్కడ మంద అనే మాటను సొంత జనం, లేదా గుంపు అనే సామాన్యార్థంలోనే కథకుడు వాడినా వాడి ఉండచ్చు. పదప్రయోగ సరళిని మరింత వివరంగా పరిశీలిస్తే తప్ప ఏ అర్థంలో వాడారన్నది నిర్ధారణగా చెప్పలేం.

ఇంకో తమాషా చూశారోలేదో….గంధర్వుడు తన దగ్గర ఉన్న గుర్రాలు ఎలాంటివో చెబుతూ, ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం వృత్రాసురుని శిరస్సు మీద పడి పది ముక్కలైందనీ, ఆ ముక్కల్లోనే కొన్ని వరసగా బ్రాహ్మణునికి వేదమూ, క్షత్రియునికి ఆయుధమూ, వైశ్యుడికి నాగలి(వ్యవసాయం మొదట్లో వైశ్యుల వృత్తి), శూద్రుడికి సేవ అయ్యాయంటూ అర్జునుడికి నాలుగు వర్ణాల వ్యవస్థ గురించి కూడా బోధిస్తున్నాడు! ఇందులో తమాషా ఏమిటంటారా…ఈ జాబితాలో తను…అంటే ఆదివాసీ లేడు! ఎందుకు లేడంటే, ఆదివాసీలు ఆదివాసులుగా ఉన్నంత కాలం వర్ణ, లేదా కుల, మతవ్యవస్థల కిందికి రారు. బ్రాహ్మణులు, క్షత్రియులూ కూడా ఆదివాసులతో సంబంధాలు కలుపుకోవడానికి అదీ ఒక వెసులుబాటు అయింది. కథకుని గదసుదనం ఏమిటంటే, నాలుగువర్ణాల వ్యవస్థ కిందికి రాని ఒక ఆదివాసీతో ఆ వ్యవస్థ గురించిన చిలుక పలుకులు పలికిస్తున్నాడు. వర్ణవ్యవస్థకు సాధికారత కల్పించడంలో అది భాగమని తెలిసిపోతూనే ఉంది.  కుల, మతాల పరిధిలోకి రాని ఆదివాసీలను నాలుగువర్ణాల వ్యవస్థలోకి (కాకపోతే వాటికి మరో వర్ణం అదనంగా చేర్చి) తీసుకొచ్చే ప్రయత్నం చరిత్ర పొడవునా జరుగుతూనే రాగా; వారిని మతాల పరిధిలోకి పోటీ పడి మరీ తీసుకొచ్చే నేటి ప్రయత్నాలకు మనం ప్రత్యక్షసాక్షులమే. సరే, అది వేరే కథ.

గంధర్వుడు ఇంకోటి అన్నాడు చూడండి…గర్వం అణగిపోయేలా యుద్ధంలో ఓడిపోయినవాడు కూడా వెనకటి పేరే ఉంచుకుంటే ‘సత్సభ’ల్లో అతన్ని మెచ్చుకుంటారా అన్నాడు. ఇక్కడ అతను రెండు సూచనలు చేస్తున్నాడు: మొదటిది, సత్సభలు;  రెండోది, యుద్ధంలో ఓడిపోయినవాడు పేరు మార్చుకోవడం. సత్సభలంటే పండితసభలో, మరో సభలో కావు. గణం అంతా సమావేశమై ప్రజాస్వామిక విధానంలో నిర్ణయాలు తీసుకునే సభలు.

యుద్ధంలో ఓడిపోయాను కనుక పేరు మార్చుకుంటాననడం మరింత ఆసక్తికర వివరం. గణవ్యవస్థకు చెందిన ఒక ఆనవాయితీనే గంధర్వుడు ఇక్కడ సూచిస్తున్నాడు. ఇప్పటికీ చూడండి…‘నేను ఫలానా పని చేయకపోతే, లేదా ఫలానా వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోలేకపోతే పేరు మార్చుకుంటాను, లేదా ఫలానా పేరువాణ్ణే కాదు’ అనే తరహాలో  శపథాలు చేసేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే, ఈ మాటల మూలాలు ఒకనాటి గణవ్యవస్థలో ఉన్నాయన్నమాట. ఇంతకంటే విశేషం ఏమిటంటే, గణదశలో ఉన్నప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆనవాయితీ ఉండడం.  గణవ్యవస్థలో పేర్లకు గల ప్రాధాన్యం గురించీ, ప్రత్యేకించి ‘యుద్ధంలో ఓడిపోయినప్పుడే’ నని అనకపోయినా   కొన్ని సందర్భాలలో పేరు మార్చుకోవడం గురించీ లూయీ హెన్రీ మోర్గాన్ తన ‘పురాతన సమాజం’ (Ancient Society) అనే రచనలో చర్చించారు. అమెరికన్ ఇండియన్ తెగల గురించిన సందర్భంలో ఆయన ఈ చర్చ చేయడం మరింత ఆసక్తికరం.

మనం పేరులో ఏముందనుకుంటాం కానీ, గణసమాజం అస్తిత్వం అంతా పేరులోనే ఉంది. ఎందుకంటే, ఆటవికులలోనూ, అనాగరికులలోనూ కుటుంబాలకు పేర్లు లేవు. వ్యక్తుల పేర్లను బట్టే వారి గణం ఏదో తెలుస్తుంది. కనుక గణం తను ఉపయోగించే పేర్లను ముందే ప్రకటించుకుంటుంది. అంటే, ఆ పేర్లను ఇంకో గణం ఉపయోగించకూడదన్న మాట.  ఆవిధంగా, భూమి హక్కు, నీటి హక్కు వగైరాలు ఎలాగో ఆ పేర్లు కూడా గణానికి ఒక హక్కుగా, ఆస్తిగా సంక్రమిస్తాయి.

బిడ్డ పుట్టాక తల్లి మొదట గణంలో వాడుక లేని పేరును దగ్గరి బంధువుల ఆమోదంతో ఎన్నుకుంటుంది. అయితే, వివిధ గణాలు సభ్యులుగా ఉన్న తెగ సమితి సమావేశమై ఆ పేరును ధ్రువీకరించిన తర్వాతే వాస్తవంగా బిడ్డకు నామకరణం జరిగినట్టు లెక్క. ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతని పేరును అతని పెద్ద కొడుకు అనుమతిస్తే తప్ప అతను జీవించి ఉండగా ఇంకొకరు ఉపయోగించకూడదు. పెద్ద కొడుకు తండ్రి పేరును వేరే గణంలోని మిత్రుడికి ఎరువు ఇవ్వవచ్చు. అయితే ఆ వ్యక్తి చనిపోతే ఆ పేరు మళ్ళీ ఈ గణానికి వచ్చేస్తుంది. తనకు నచ్చిన వేరే గణంలోని పేరును తల్లి బిడ్డకు పెట్టే ఆనవాయితీ కూడా కొన్ని గణాలలో ఉంది. అప్పుడు ఆ బిడ్డ, ఆ పేరుమీద హక్కు ఉన్న గణానికి చెందుతుంది.

పేర్లలో కూడా రెండు తరగతులు ఉంటాయి: చిన్నప్పుడు పెట్టేవి, పెద్దయ్యాక పెట్టేవి. ఈ పేరు మార్పుకు కూడా పెద్ద తతంగం ఉంటుంది. పదహారు, లేక పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చాక గణ నాయకుడే కొత్త పేరు పెడతాడు. ఆ తర్వాత తెగ సమితి సమావేశంలో ఆ పేరు ప్రకటిస్తారు. పేరు మార్పుతోనే ఆ కుర్రవాడికి పెద్దరికం వస్తుంది. అతనికి పెద్దవాళ్ళ బాధ్యతలను నిర్వర్తించే అర్హత లభిస్తుంది. మన ప్రస్తుతాంశానికి సంబంధించి ముఖ్య వివరం ఏమిటంటే, ఒక వ్యక్తి యుద్ధంలో గొప్ప ప్రతాపం చూపించినప్పుడు కూడా పేరు మార్చుకోవచ్చు. దీనినిబట్టి యుద్ధంలో ఓడిపోయినప్పుడు కూడా పేరు మార్చుకోవడం అనే ఆనవాయితీ ఉండడంలో ఆశ్చర్యంలేదు. గంధర్వుడు చేసింది అదే. అలాగే, కొత్త హోదాను అందుకున్నప్పుడూ,  పెద్ద జబ్బు చేసినప్పుడూ, వృద్ధాప్యంలోనూ కూడా పేరు మార్చుకునే ఆనవాయితీ గణవ్యవస్థలో ఉంది. అయితే, ఎప్పుడు పేరు మార్చుకోవాలన్నా అది గణంలోని స్త్రీలు, నాయకుల ఇష్టంతోనే జరగాలి తప్ప వ్యక్తిగత ఇష్టంతో కాదు.

ఇప్పటికీ మనదేశంలో కొన్ని కులాలలో ఉన్న ఉపనయన సంస్కారంలోనూ, దత్తత స్వీకారం వంటి ఇతర తంతులలోనూ ఒకనాటి ప్రపంచవ్యాప్త గణసమాజ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. ఉపనయనం అనేది ఇప్పుడు మనదేశంలో కొన్ని కులాలలోనే కనిపిస్తున్నా, గణదశలో అది అందరికీ ఉండేదన్న సంగతిని ప్రత్యేకించి గమనించాలి.

***

ప్రస్తుతానికి వస్తే…

కౌంతేయులమైన తాము తాపత్యవంశీకులము ఎలా అయ్యామన్న అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా గంధర్వుడు తపతీ-సంవరణోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు. దాని గురించి తర్వాత….

 

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)