పెద్దక్క మళ్ళీ పుట్టింది ఈ అక్షరాల్లో!

 

modified-coverpage3

ఈ ప్రపంచం లోకి మనం వచ్చేటప్పుడే మన ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పెట్టి ఉంటుంది. ఐనా మనిషికి అన్నిటి కన్నా భయం మృత్యువంటే . నేను అన్నదే లేకుండా పోతే అన్న భయమే కొందరిని మంచిగా చేస్తుంది , మరి కొందరిని కలచి వేస్తుంది. ఎంత గొప్పగా వేదాంతం చెప్పే వారు కూడా మరణం పట్ల భయాన్ని కలిగి ఉంటారనడం లో సందేహం లేదు. జరా మరణాలు దైవాధీనాలు . దైవం అనే దాని పై మనకి నమ్మకం లేకున్నా మరణం మాత్రం ఎప్పుడూ ఎవరికి చెప్పి రాదు . ఎవరికి చెప్పి తీసుకుపోదు. అందుకేనేమో ఆ మృత్యువంటే  మనిషిలో అంత భయాందోళనలు.

మరణం ఒక కామా అంటాడో కవి , మరణం ఒక కామా  వాకాటి పాండురంగారావు గారి ప్రసిద్ధ పుస్తకం . నిజంగా మరణం ఒక కామా యేనా , మళ్ళీ మనం ఈ మానవ జన్మ ఎత్తుతామా ? ఏమో ఎవరికీ తెలియని ఈ వింత పట్లనే కదా మనిషికి ఇంత ఆకర్షణ వికర్షణలు. పాంచ భౌతిక  దేహం లో ప్రాణ స్పందన ఆగిపోయాక ఇక ఈ దేహం నశించవలసిందే. ఎవరూ తమ మరణాన్ని అనుభూతించి అక్షరీకరించలేరు. శంకరుడు అన్నట్టు మృత్యువు అది వచ్చే వేళకి నేను ఉండను , నేను ఉన్నన్నాళ్లూ అది రాదు, అని ఈ మరణాన్ని ఎదుర్కోవడానికి , మానసిక సంసిద్ధత పొందటానికి ఎన్నో నియమాలు , ప్రయోగాలు , అయినా నిరంతరం ఒక భయం తోనే బతికే మామూలు మనుషులం మనం అనుకుంటే . ఒక మామూలు మనిషి, కవి కాదు , తాత్వికురాలు కాదు , అయినా మరణాన్ని ఎంత ధీశాలి లాగా ఎదుర్కుంది.

ఎవరి గురించి చెప్తున్నానో అనుకుంటున్నారా ఇప్పుడే “పెద్దక్క ప్రయాణం” అని విజ్జి , చిన్నమ్మ , జాజి అనే ముగ్గురు చెల్లెళ్ళు  రాసిన ఒక హృదయ పూర్వకమైన నివాళి చదివాను. నలుగురు అక్క చెల్లెళ్లలో పెద్దది అయిన నాగవల్లి గారి స్మృతిలో వారు అక్షరీకరించిన ఈ నివాళి హృదయాన్ని ఆర్ద్రం చేసింది. జాజి డాక్టర్. కె.ఎన్ మల్లీశ్వరి , ప్రముఖ రచయిత్రి వాళ్ల మిగిలిన అక్కలతో కలిసి రాసిన “పెద్దక్క ప్రయాణం” గురించి ఓ రెండు మాటలు.

ఒక మనిషి చనిపోతే మనం చేసే ఎన్నో రకాల పనులతో వారికి నివాళి ఇవ్వాలనుకుంటాము. ఈ కర్మలన్నిటికీ మించినదే చేసేరు ఈ సోదరీమణులు. తమ పెద్దక్క స్మృతిలో అక్కను గూర్చిన జ్ఞాపకాలను అక్షరీకృతమ్ చేసి అక్కను అక్షరం లో బతికించి పెద్ద కూతురిని కోల్పోయిన  ఆ తల్లి తండ్రులకు అందించే ప్రయత్నం  చేసేరు. ఈ మధ్యన  ఇహ లోకాన్ని వదిలిన తమ సోదరి గురించి ఐదు రోజుల్లోగా ఒక పుస్తకాన్ని రాసి తీసుకొచ్చారు.

పెద్దక్క ను గురించి మిగిలిన ముగ్గురు చిన్నమ్మ , విజ్జి , జాజి కలిపి రాసిన స్మృతి మాత్రమే కాదు ఈ పుస్తకం. ఒక వ్యక్తి మరణం ఏమన్నా గొప్పదా ఎందరు పుట్టడం లేదు ఎందరు పోవడం లేదు , నిజమే కానీ మన అనుకున్న ఓ మనిషి ఈ మరణాన్ని ఎంత యధాతధంగా స్వీకరించిందో ఈ చిన్ని పుస్తకం చదివితే అర్ధం అవుతుంది.

తనకి  కేన్సర్ అని తెలిసినా ఏనాడూ ఊరికే  ఏడ్చి అందరినీ ఏడిపించి బాధించ లేదు నాగవల్లి. జీవితాన్ని ఎలా స్వీకరించిందో  అలాగే మరణాన్ని కూడా స్వీకరించింది. తాను బ్రతికుండగానే ఏయే పనులు చక్కపెట్టుకోవాలో ఆలోచించి చేసింది. కూతురిని మనుమరాలిని చిన్నమ్మ కి అప్ప చెప్పింది. చెల్లెళ్లకు ధైర్యం చెప్పింది . తాను లేని లోకం లో ఎలా బ్రతకాలో అని నిస్తేజులై  మిగిలిపోయిన అందరికీ ఒక ఆత్మీయ ఆదర్శంగా నిలిచింది.

కేవలం ఒక వ్యక్తి స్మృతిలో రాయబడినదే అయినా ఈ పుస్తకం లో జాజి తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాలను చెప్పింది. ఒక కుటుంబం లో స్త్రీకి కనుక ఏదన్నా వ్యాధి వస్తే అది ఎలా మరి కొందరి కుటుంబాలను కూడా కదిలించేస్తుందో చెప్పింది. మరణం అన్నది తప్పదనీ తెలిసిన క్షణం నుండీ జీవితాన్ని ఎంత పరిపక్వతతో అక్క స్వీకరించి అలాంటి ఒక స్తిత ప్రజ్ఞతని తమకి ఒక పాఠంగా చెప్పి వెళ్ళిన వైనం జాజి మాటల్లో మనకు తెలుస్తుంది.

ఇక మీకు మేము ఏకలవ్య శిష్యులమ్ అన్న మాట చదవగానే నా గుండె చెమరించింది. ఎక్కడో దూర లోకాల్లో  ఉన్న అక్క కి ఇక్కడ చెల్లెళ్ళు ఏకలవ్య శిష్యులేగా మరి.

image

అమ్మను, ఆత్మీయతను , అక్షరాన్ని , అక్కను అజరామరం చేయగల ఒక  ప్రయత్నం  ఒక చిన్ని హృదయ నివాళి లో తెలియజేసేరు ఈ చెల్లెళ్ళు.

కరిగిపోతున్న క్షణాలలో తాను చదవగలనో లేనో అనుకుని ఎన్నో పుస్తకాలు చూసి విచారించిన అక్క ఆవేదన గూర్చి , తాను ఉండగానే ఇంటికి చెద మందు కొట్టించేయ్యలి లేకుంటే మీ బావ బాధ పడతారు ఆపైనా అని ఆలోచించే ఒక ఇల్లాలు , తల్లి , అమ్మమ్మ , కూతురు , అక్క ఇక ఒక స్మృతి మాత్రమే కదా. నిజానికి ఇంత ధు:ఖం లో కూడా ఈ చిన్ని పుస్తకాన్ని తీసుకొచ్చిన ఈ చెల్లెళ్ల ను తల్చుకుంటే నిజమే వీరు ఆ పెద్దక్క దగ్గర చాలా నెమ్మది ని నేర్చుకున్నారు అనిపిస్తుంది.

పెద్దక్క ప్రయాణం ఒక స్మృత్యంజలి కాదు ఒక మంచి మనసున్న అక్క చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక . మనసున్న వారు చదువుతారు , ప్రతిస్పందిస్తారు , అన్నిటికి మించి ఆ పెద్దక్క దగ్గర  మనం కూడా కొంత నేర్చుకుంటాము. జీవితాన్ని కాస్త దిద్ది తీర్చుకుంటాము . స్మృతి లో రాసిన పుస్తకాలు కవితలు మనలని మరింత బాధ కి గురి చేస్తాయి , లేదా నైరాశ్యం పాలు చేస్తాయి కానీ ఈ పుస్తకం ఒక ఆత్మీయ స్నేహితునిలా రాబోయే జీవితాన్ని గూర్చి , మరణం గూర్చి ఎంతో సంయమనం  పాటించే విధంగా మనకి మంచి పాఠాన్ని గరుపుతుంది. ఈ ముగ్గురికే కాదు ఈ పెద్దక్కను మనందరికీ ఒక ఆత్మీయురాలిని చేసేరు ఈ చెల్లెళ్ళు. మిత్రులారా చదవండి ఈ చెల్లెళ్ల ప్రేమను వారి ఆత్మీయ అక్షరాల్లో బంధించుకుని మనకి ఆవిష్కరించిన వారి పెద్దక్కను .

చిన్నమ్మ కు , విజ్జి కి ,జాజికి ప్రేమ పూర్వక అభినందనలు మీరు వేసినది పుస్తకం కాదు ఒక మంచి మనసును వ్యక్తిత్వాన్ని మాకు పరిచయం చేసేరు అందుకు మీకు కృతజ్ఞతలు . పెద్దక్కను చిరంజీవిని చేసిన మీ ప్రయత్నం సఫలమైంది .

జగద్ధాత్రి

381778_218808094872758_1009111763_n

Download PDF

2 Comments

  • హృది చెమరించి వొలికిన ఈ అక్షరాలని సారంగలో చోటిచ్చినందుకు ధన్యవాదాలు అఫ్సర్ , కల్పనా …ప్రేమతో జగతి

  • sasikala says:

    చిన్నమ్మ విజ్జీ జాజీ ….మన అసలు పేర్లు వాడేటపుడు ఎందుకో లోకం కోసం ఒక ముసుగు వేసుకున్నట్లు అనిపిస్తుంది . ఇదిగో ఇలా చిన్ని పేర్లు పిలిస్తే మన వాళ్ళు అనే తలంపు తో ముసుగు కరిగి పోతుంది ,
    వాళ్ళు ఏ పేరు పిలిస్తున్నారా అనేది మనకు అనవసరం ….. ఆ పలుకులలోని ఆత్మీయత మనం ఎవరికీ
    వివరణ ఇవ్వక్కర్లేదు . వాళ్ళు మన అంటే మన అంతే .
    అందులో అక్కా చెల్లెళ్ళ బంధం ఎంత మధురమో ముగ్గురు అక్క చెల్లెళ్ళు గా పుట్టిన నాకు తెలుసు .
    ఐదే రోజుల్లో బుక్ తెచ్చారు అంటే అక్క వారిపై ఎంత మంచి ముద్ర వేసిందో ఊహించగలను ,
    ఇంత మంచి అక్క ఉన్నందుకు వాళ్లకి ,ఇలాంటి చెల్లెళ్ళు ఉన్నందుకు ఆ అక్కకి అభినందనలు .
    ఇది ఒక మంచి పుస్తకం అనటం లో నాకు సందేహమే లేదు . ఎందుకంటె వారి ఆత్మీయత అంత గొప్పగా ఉంది .చక్కగా వ్రాసారు . మల్లీశ్వరి గారు అభినందనలు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)