గంధర్వుడి బడాయి- అర్జునుడి డైలమా!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

నువ్వు తాపత్య వంశీకుడివి’ అని అర్జునుడితో అనడంలో గంధర్వుని బడాయి చూసారా…?

‘ఆ సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు’ అన్న అతిశయం అందులో ఉండచ్చు, ఆశ్చర్యంలేదు. ఆ సందర్భంలో గంధర్వుడు తనకు తెలిసిన విషయాల గురించి బడాయికి పోవడం సహజమే కాదు, అవసరం కూడాను. ఎందుకంటే, తను అర్జునుని చేతిలో ఓడిపోయాడు. కనుక తను ఏదైనా విషయంలో అతని మీద పై చేయిని చాటుకోవాలి. అప్పటికే అతనా ప్రయత్నం మొదలుపెట్టాడు కూడా. నా దగ్గర మహిమలున్నాయనడం, మీకు గుర్రాలు ఇస్తాననడం, క్షత్రియుని వెంట పురోహితుడూ, అగ్నిహోత్రమూ ఎప్పుడూ ఉండాలని చెప్పడంలో, ఆ సంగతి మీకు తెలియదన్న ఆక్షేపణను ధ్వనించడం అందులో భాగాలే.

ఒకవిధంగా దానికి కొనసాగింపే, ‘నువ్వు తాపత్యవంశీకుడివి, తెలుసా?’ అనడం.

మొత్తానికి ఈ గంధర్వుడు అనుకున్నంత అమాయకుడేమీకాదు, గడుసువాడే! అర్జునుడి జిజ్ఞాసను గురి చూసి కొట్టాడు. తను తాపత్య వంశీకుడు ఎలా అవుతాడో తెలుసుకునేవరకూ గంధర్వుడి వలలోంచి అర్జునుడు బయట పడలేడు. అంటే, తనను బంధించి కొప్పు పట్టుకుని ఈడ్చుకు వెళ్ళి ధర్మరాజు ముందు పడేసిన అర్జునుని, తన మాట లనే ‘సమ్మోహనాస్త్రం’తో గంధర్వుడు కట్టిపడేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడన్నమాట. మొత్తానికి ఇప్పుడు గంధర్వుడు గురువు, అర్జునుడు శిష్యుడూ అయ్యారు.

గంధర్వుడు ఊరికే గురువు కాలేదు. పాండవులకు కొన్ని విషయాలు తెలియవని అతను ముందే కనిపెట్టేశాడు.  క్షత్రియుని వెంట పురోహితుడూ, అగ్నిహోత్రమూ ఎప్పుడూ ఉండాలన్న తొలిపాఠం చెప్పిన తర్వాత మరికొన్ని పాఠాలు చెప్పవలసిన అవసరమూ అతనికి కనిపించింది. ముఖ్యంగా ఆదివాసులకు, బ్రాహ్మణులకు ఉన్న దగ్గరి సంబంధాల గురించి చెప్పాలనుకున్నాడు. నువ్వు తాపత్యవంశీకుడివి అనడం దానికి శృతి.

గంధర్వుడు ‘నువ్వు తాపత్య వంశీకుడివి’ అనడంలో ఇంకోటి కూడా ఉంది. దాని గురించి చెప్పుకునే ముందు అతను చెప్పిన కథలోకి వెడదాం.

***

పాండవుల తరానికి అనేక తరాల వెనకటి కథ ఇది…

తపతి సూర్యుని కూతురు. సావిత్రికి తోడబుట్టినది. మంచి గుణవంతురాలు. ఆమె యవ్వనవతి అయింది. ఈమెకు తగిన వరుడు ఎవరా అని సూర్యుడు ఆలోచనలో పడ్డాడు.

అలా ఉండగా భరతకులానికి చెందినవాడు, అజామీఢుని కొడుకు అయిన సంవరణుడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. అతను సూర్యుడికి నచ్చాడు. నేను ఆకాశంలో అధిక తేజస్సుతో ఎలా వెలుగుతున్నానో, అలాగే ఇతను కూడా ఈ జగతిలో ప్రసిద్ధుడిగా వెలిగిపోతున్నాడు, తపతిని ఇతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని సూర్యుడు నిశ్చయించుకున్నాడు.

ఒకరోజున సంవరణుడు వేటకు వెళ్ళాడు. అడవిలో చాలాసేపు తిరిగిన తర్వాత అతని గుర్రానికి విపరీతమైన దాహం వేసింది. ముందుకు వెళ్లడానికి మొరాయించింది. అప్పుడు సంవరణుడు  ఒక్కడే కాలినడకన ఆ పర్వతవనంలో నడుచుకుంటూ వెళ్ళాడు.

ఒకచోట అతనికి ఒక సుందరి కనిపించింది. ఆమె బంగారు వన్నెలో ఉంది. ఆమె వల్ల, ఆమెకు దగ్గరగా ఉన్న చెట్లు, లతలూ కూడా బంగారువన్నెలోకి మారిపోతున్నాయి. ఆమెను చూడగానే సంవరణుడు రెప్ప వేయడం మరచిపోయాడు. త్రిభువన లక్ష్మి ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా ఎందుకుందో అనుకున్నాడు. ఇంతకీ ఈమె దేవకన్యో, యక్షకన్యో, సిద్ధకన్యో తెలియడం లేదనుకున్నాడు. ప్రశస్తమైన అన్ని లక్షణాలూ కలిగిన ఆకృతీ, అంతులేని కాంతీ కలిగిన ఈమె కచ్చితంగా దివ్యకన్యే అయుంటుందని కూడా అనుకున్నాడు. అంతలోనే, ఇంద్రకన్యలకు కూడా ఇంతటి రూప విలాస సంపద ఉంటుందా అన్న సందేహం అతనికి కలిగింది. మొత్తానికి ఇంతటి అందగత్తెను మాత్రం తనెప్పుడూ చూడలేదన్న నిశ్చయానికి వచ్చాడు.

Back-To-Godhead-Mahabharat

ఆవిధంగా ఆమె సౌందర్యం అనే అమృతాన్ని చూపులతోనే తాగేస్తూ రెప్ప వేయడం మరచిపోయిన తర్వాత, కొంతసేపటికి తెలివి తెచ్చుకుని, ‘నువ్వెవరివి, క్రూరమృగాలు తిరిగే ఈ అడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?’ అని అడిగాడు. ఆమె అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మేఘాల మధ్య మెరుపుతీగలా మాయమైపోయింది.

ఆమె మాయమవడాన్ని సంవరణుడు తట్టుకోలేకపోయాడు. సిగ్గు వదిలేసి నేలమీద పడి ఏడవడం ప్రారంభించాడు. ఆమె మనసు కరిగింది. అదీగాక, మంచి యవ్వనంలో మన్మథుణ్ణి తలదన్నేలా ఉన్న అతన్ని చూడగానే ఆమె మనసులోనూ అలజడి మొదలైంది. మళ్ళీ అతని ముందుకు వచ్చి, ఎందుకిలా వివశుడివవుతున్నావని తీయని గొంతుతో అడిగింది.

‘ఈ భూమండలంలో ప్రతాపంలోనూ, బలదర్పాలలోనూ నన్ను మించినవాడు ఉన్నట్టు నేను వినలేదు. ఇంతవరకు నేను ఎవరికీ భయపడి ఎరగను. అలాంటిది ఇప్పుడు నేను భయంతో కంపిస్తున్నాను. నిన్ను అడ్డు పెట్టుకుని మన్మథుడు తన బాణాలతో నన్ను కొట్టి చంపకుండా నువ్వే నన్ను కాపాడాలి’ అని సంవరణుడు అన్నాడు. ఆ తర్వాత, ‘గాంధర్వవిధానంలో నన్ను పెళ్లి చేసుకో’ అని ప్రతిపాదించాడు.

అప్పుడామె, తను సూర్యుని కూతురుననీ, సావిత్రికి సోదరిననీ, తన పేరు తపతి అనీ చెప్పింది. నన్ను నువ్వు ఇష్టపడితే మా తండ్రిని అడుగు, ఆయనను ప్రార్థించు, అప్పుడు నన్ను నీకు ఇస్తాడు, ఆడపిల్లలకు స్వాతంత్ర్యం ఉండదని నీకు మాత్రం తెలియదా-అంది. అని, తను సూర్యమండలానికి వెళ్లిపోయింది.

ఆమె కనుమరుగయ్యేసరికి సంవరణుడు మూర్చితుడై పడిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన మంత్రి అతన్ని చూసి శీతలోపచారాలు చేసిన తర్వాత తెలివిలోకి వచ్చాడు. మంత్రినీ, పరివారాన్నీ పంపేసి తను అక్కడే ఉండిపోయి సూర్యుని ఆరాధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత తన పురోహితుడైన వశిష్టుని తలచుకున్నాడు.

తలచుకున్న పన్నెండు రోజులకు వశిష్టుడు సంవరణుడి దగ్గరకు వచ్చాడు. వ్రతాలతోనూ, ఉపవాసాలతోనూ కృశించిన సంవరణుని చూశాడు. అతను తపతిపై మనసు పడ్డాడని యోగదృష్టితో తెలుసుకున్నాడు. వెంటనే అనేక యోజనాలు ప్రయాణం చేసి సూర్యుని దగ్గరకు వెళ్ళి వేదమంత్రాలతో ఆయనను స్తుతించాడు. సూర్యుడు వశిష్టుని సముచితంగా గౌరవించి, ‘ఏం పనిమీద వచ్చా’రని అడిగాడు. ‘నీ కూతురైన తపతికి పౌరవకుల శ్రేష్ఠుడైన సంవరణుడు అన్ని విధాలా తగిన వరుడు. కూతురుని కన్న ఫలం దక్కేది తగిన వరుడికి ఇచ్చినప్పుడే కదా. కనుక నీ కూతురుని సంవరణుడికి ఇయ్యి’ అన్నాడు. సూర్యుడు అంగీకరించి తపతిని వశిష్టునితో సంవరణుడి దగ్గరకు పంపించాడు.

ఒక నిమిషంలో మూడువందల అరవై నాలుగు యోజనాలు ప్రయాణించే సూర్యరథంలో తపతిని వెంటబెట్టుకుని వశిష్టుడు సంవరణుడి దగ్గరకి వచ్చి విధివిధానంగా ఇద్దరికీ వివాహం చేయించాడు.

కనుక, మంచి పురోహితులను పొందిన రాజులు తాము కోరుకున్న అన్ని శుభాలనూ పొందగలుగుతారు. అలా తపతిని మహోత్సవంతో పెళ్లాడిన సంవరణుడు రాచకార్యాలనన్నింటినీ విడిచిపెట్టేసి తపతితో ఇష్టసుఖాలు అనుభవిస్తూ పన్నెండేళ్ళపాటు ఆ పర్వత, అరణ్యాలలోనే ఉండిపోయాడు. దాంతో భూమండలమంతటా అనావృష్టి ఏర్పడింది. వశిష్టుడు వర్షాలు పడడానికి అవసరమైన వైదిక విధులు అన్నీ నిర్వర్తించి సంవరణుడి దగ్గరకు వచ్చి, ఆ దంపతులిద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. అప్పుడు అనావృష్టి తొలగిపోయింది. కొంత కాలానికి ఆ దంపతులకు ‘తాపత్యుడు’(తండ్రివైపు నుంచి కాకుండా తల్లి తపతి వైపునుంచి చెప్పినప్పుడు ఆ సంతానం తాపత్యుడు అవుతాడు) గా కురువంశకర్త అయిన కురుడు పుట్టాడు. అప్పటినుంచి మీరు తాపత్యులయ్యారు….

***

అర్జునుడు విన్నాడు.

‘మా వంశానికి చెందిన పూర్వరాజులకు పురోహితుడైన వశిష్టుని మహత్యం గురించి ఇంకా వినాలని ఉంది’ అన్నాడు.

ఆదివాసులైన తమ మనసుకు ఎంతో దగ్గరగా ఉండే ఋషుల గురించి అడిగితే గంధర్వుడు చెప్పకుండా ఎలా ఉంటాడు? అర్జునుడు అడగడమే తరవాయి, ఎంతో ఉత్సాహంగా, ఇష్టంగా వశిష్టుని చరిత్ర చెప్పడం ప్రారంభించాడు. మనం మాత్రం తపతీ-సంవరణుల కథ దగ్గరే ఆగిపోదాం.

***

ఈ కథను మలచడంలో కథకుడు కొన్ని ప్రశ్నలకు, సందేహాలకు అవకాశమిచ్చే ఖాళీలు విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది.  ఒక్కొక్కటే చూద్దాం.

ప్రారంభంలోనే చూడండి…సంవరణుడు సూర్యుని ఉద్దేశించి తపస్సు చేశాడు. సూర్యుడు కూడా అతన్ని మెచ్చాడు. తన కూతురు తపతికి ఇతనే తగిన వరుడనీ, ఇతనికే ఇచ్చి పెళ్లి చేస్తాననీ నిర్ణయానికి కూడా వచ్చాడు. అలాంటప్పుడు, సంవరణుడు వేటకు వెళ్ళడం, ఆ పర్వత అరణ్య ప్రాంతంలో తపతిని చూడడం, ఆమెను మోహించడం, గాంధర్వ విధానంలో తనను పెళ్లాడమని అడగడం, నా తండ్రిని అడగమని ఆమె చెప్పడం…అన్నింటికంటే ముఖ్యంగా, సూర్యుడే తన కూతురిని సంవరణునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నతర్వాత కూడా వశిష్టుడు మధ్యవర్తిత్వం వహించడం…ఇవన్నీఅవసరమా?

సంవరణునికి తన కూతురుని ఇవ్వాలని సూర్యుడు ముందే నిర్ణయించుకున్నాడని చెప్పడం వల్ల తలెత్తిన ప్రశ్నఇది. ఆ మాట అనకపోతే సమస్యే లేదు. ఎందుకు అన్నట్టు? బహుశా కొన్ని సమర్థనలు ఇలా ఉండచ్చు:

1. సూర్యుడు కూతురిని సంవరణుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా, ప్రతిపాదన సంవరణుని వైపునుంచే రావడం విధాయకం కావచ్చు. 2. రాజులు గాంధర్వ విధానంలో పెళ్లాడడం తప్పు కాదు. అంతకు ముందు గాంధర్వ విధానంలో రాజులు పెళ్లి చేసుకున్న ఉదంతాలను మహాభారత కథకుడే చెప్పాడు కూడా. ఉదాహరణకు, శకుంతలా-దుష్యంతుల వివాహం. కానీ ఆ తర్వాత గాంధర్వ వివాహం మీద వ్యతిరేకత ఏర్పడినట్టు ఈ కథ సూచిస్తోందా? సంవరణుడు గాంధర్వ విధానాన్ని ప్రతిపాదించడం, దాంతో తపతి స్త్రీలకు స్వాతంత్ర్యం లేదంటూ, తన తండ్రిని అడగమని చెప్పడం, అప్పుడు సంవరణుడు వశిష్టునికి కబురు చేయడం, వశిష్టుడు సూర్యుని వద్దకు మధ్యవర్తిగా వెళ్ళడం…పెద్దల అనుమతితోనే పెళ్లి జరగాలని నొక్కి చెబుతూ ఉండచ్చు. 3. గాంధర్వం తప్పా, ఒప్పా అనేది కాకుండా; వివాహం అనేది పురోహితుని ద్వారా విధివిధానంగా జరగాలని చెప్పడం కథకుని ఉద్దేశం కావచ్చు. 4. లేదా, సాక్షాత్తూ దేవుడైన సూర్యుడే సంవరణుని వరునిగా ఎన్నుకున్నాడనీ, ఆ తర్వాత వశిష్టుని జోక్యం నిమిత్తమాత్రమేననీ చెప్పడం కథకుని ఉద్దేశం కావచ్చు. ఎందుకలా అంటే, కథకుడు పాండవుల వైపునుంచి కథ చెబుతున్నాడు. వారి వంశకర్తలలో ఒకడైన కురుని పుట్టుక గురించి చెప్పేటప్పుడు, అది ఒక బ్రాహ్మణుని జోక్యం వల్ల జరిగిన వివాహఫలితమని చెప్పడం అతనికి ఇష్టం లేకపోవచ్చు. ప్రత్యేకించి బ్రాహ్మణునికి ఘనతను ఆపాదించడంపై అతనికి వ్యతిరేకత ఉండకపోయినా, ఇక్కడ బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధం కూడా ఉంది. బ్రాహ్మణునికి ఘనత కట్టబెడితే, అందులోకి ఆదివాసీ కూడా వస్తాడు. అది కథకుడికి ఇష్టం లేదు. కనుక వశిష్టుని జోక్యాన్ని నిమిత్తమాత్రం చేయడం అతని ఉద్దేశం కావచ్చు.

అసలు తపతిని దేవుడైన సూర్యపుత్రిక అనడంలోనే ఆమె ఆదివాసీ సంబంధాన్ని కథకుడు దాచిపెడుతున్నాడా? అదీ సంభవమే. ఆమె పర్వత, అరణ్యమధ్యంలో ఒంటరిగా కనిపించిందంటే, ఆమె పర్వతపుత్రిక లేదా అరణ్యపుత్రిక అన్నమాట. ఆ విధంగా చూసినప్పుడు జరిగింది ఇదీ: సంవరణుడు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ తపతి కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. అయితే, సంవరణుడు క్షత్రియుడు. క్షత్రియులకూ, ఆదివాసులకూ సహజవైరం. కనుక, తపతి తండ్రి ఆ సంబంధానికి ఇష్టపడే అవకాశం లేదు. తండ్రి వరకూ ఎందుకు, తపతి కూడా ఆ సంబంధానికి సందేహించి ఉండచ్చు. వారిద్దరికీ అంగీకారమైనా, వారి తెగకు చెందిన పెద్దలు దానిని ఆమోదించే అవకాశం లేదు. తెగలలో వివాహం అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు, సమష్టి నిర్ణయం.  ఇక్కడ ఇది ‘రాజకీయ’ నిర్ణయం కూడా. మరి వీరిద్దరికీ వివాహం జరగడం ఎలా?

అందుకే బ్రాహ్మణుని జోక్యం. గాంధర్వానికి తపతి నిరాకరించి వెళ్లిపోవడంతోనే సంవరణుడు సూర్యుని ఆరాధించడం ప్రారంభించి, వశిష్టుని తలచుకున్నాడని కథకుడు చెప్పనే చెప్పాడు. సూర్యుని ఆరాధించాడని కథకుడు చెప్పడం, తపతిని దేవుడైన సూర్యుని కుమార్తెగా చెప్పడానికి యాంత్రికమైన కొనసాగింపు మాత్రమే. అయితే, సూర్యుని ఆరాధించడం వల్ల సంవరణుని పని జరగదు. వశిష్టునివల్లనే జరుగుతుంది. ఎందుకంటే, ఒక బ్రాహ్మణునిగా వశిష్టుడు క్షత్రియులకు ఎంత కావలసినవాడో, ఆదివాసులకూ అంతే కావలసినవాడు. వశిష్టుడు మధ్యవర్తిగా లేదా హామీగా ఉంటే సంవరణునికి తపతిని ఇవ్వడానికి ఆదివాసులకు అభ్యంతరం లేదు. ఆయన మీద వారికి అంతటి గురి. అలాగే, వశిష్టుడు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. నేరుగా తపతి తండ్రిని కలిశాడు. సంవరణుడు యోగ్యుడు, అతనికి నీ కూతుర్ని ఇయ్యి అని చెప్పాడు. తండ్రి మారు మాట్లాడకుండా అప్పటికప్పుడు కూతురిని అతనితో పంపేశాడు. వశిష్టుడు తపతికి, సంవరణుడికీ పెళ్లి జరిపించాడు.

గమనించారో లేదో…కూతుర్ని ఇవ్వడమే తండ్రి వంతు. తనే పెళ్లి జరిపించే బాధ్యత ఆనాడు తండ్రికి ఉన్నట్టు లేదు. పెళ్లి జరిపించుకోవలసిన బాధ్యత వరుడివైపు వారిదే. గాంధారీ-ధృతరాష్ట్రుల విషయంలో కూడా ఇదే జరిగింది. గాంధారి తండ్రి సుబలుడు తన కూతురిని ధృతరాష్ట్రునికి ఇచ్చానని మాత్రమే అన్నాడు. సోదరుడు శకుని వెంట ఆమెను హస్తినాపురం పంపించాడు. అక్కడ భీష్ముడు మొదలైన వరుడి వైపువారే పెళ్లి జరిపించారు.

రాను రాను గాంధర్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందనడానికి మరికొన్ని ఉదాహరణలూ ఆ తర్వాత కనిపిస్తాయి. బహుశా శకుంతలా-దుష్యంతుల అనుభవం అందుకు కారణం కావచ్చు. పాండవులకు మూడు తరాల వెనకటివాడైన శంతనునే తీసుకోండి. అతనోసారి గంగాతీరంలో విహరిస్తుండగా గంగ స్త్రీ రూపంలో కనిపించింది. ఆమెను శంతనుడు మోహించాడు. ఆమె షరతులు పెట్టింది. వాళ్ళ మధ్య వివాహబంధం ఏర్పడింది. సరే, ఆ కథను మరింత వివరంగా పరిశీలించే అవకాశం ముందు ముందు రావచ్చు. ప్రస్తుతానికి అవసరమైన ఒక వివరం ఏమిటంటే, నీకు గంగ కనిపిస్తుందనీ, ఆమెను కులగోత్రాలు అడగకుండా పెళ్లి చేసుకోమనీ శంతనుడికి అతని తండ్రి ప్రతీపుడు ముందే చెప్పాడు. కనుక, ఆ సంబంధం పెద్దలు ఆమోదించినదే నని చెప్పడం కథకుడి ఉద్దేశం కావచ్చు.

వివాహ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి కనుక వాటిని వాయిదా వేసి ప్రస్తుత కథకు వస్తే…

తపతిని సూర్యపుత్రిక అనడం, నా ఉద్దేశంలో గణస్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చు. తపతి తెగకు సూర్యుడు చిహ్నం కావచ్చు. తెగ సభ్యులను తెగ చిహ్నంతోనే సూచించడం ఆనాడు పరిపాటి. ఉదాహరణకు, ఒక గోత్రానికి చెందినవారినందరినీ ఆ గోత్రంతోనే చెప్పడం మన పురాణ, ఇతిహాసాలు అన్నిటా ఉంది. కశ్యప గోత్రీకులందరినీ కశ్యపులనే అంటారు. అందుకే పురాణకథల్లో అనేకమంది కశ్యపులు కనిపిస్తూ ఉంటారు. వారు వేర్వేరు వ్యక్తులు అని తెలియనివారు, వారికి సంబంధించిన ఉదంతాలను అన్నింటినీ ఒకే కశ్యపుడికి ఆపాదిస్తూ ఉంటారు. ఈవిధంగా చూసినప్పుడు తపతి తండ్రి సూర్య చిహ్నం కలిగిన తెగకు చెందినవాడుగా సూర్యుడే అవుతాడు. సూర్యుడు అనడం వెనుక ఉన్న తెగ లక్షణం, కథ కూర్చే నాటికి మరుగుపడి ఉండచ్చు. లేదా, కథకుడికి ఆ సంగతి తెలిసినా, పాండవుల వంశకర్తలలో ఒకడైన కురుని పుట్టుక గురించి చెప్పేటప్పుడు, అతడికి ఆదివాసీ సంబంధం ఉందని చెప్పడం అతనికి ఇష్టం లేకపోవచ్చు. దేవుడైన సూర్యుని కూతురికి పుట్టినవాడుగా అతనికి ఘనతను ఆపాదించాలని అనుకొని ఉండచ్చు. మరొకటి జరగడానికీ అవకాశముంది. అది, ఆనాటి కథనరీతిలో అనివార్యంగా ప్రతిఫలించే మాంత్రిక వాస్తవికత. ప్రతిపరిణామంలోనూ మాంత్రికతను, మహిమను చూడడం ఆనాటి జీవనశైలిలో భాగం. కథ కూర్చే నాటికి అది మరుగుపడి, దాని తీరుతెన్నులపై కథకునికి తగినంత అవగాహన లేకపోయినా,  ఆ మాంత్రిక శైలే కథనంలో యాంత్రికంగా చోటుచేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను ఇదే వ్యాసంలో ఇటాలిక్స్ లోనూ, బొల్డ్ లోనూ సూచించాను. వాటితోపాటు మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

Download PDF

16 Comments

  • kv ramana says:

    “కూతుర్ని ఇవ్వడమే తండ్రి వంతు. పెళ్లి జరిపించే బాధ్యత ఆనాడు తండ్రికి ఉన్నట్టు లేదు”. ఒక మంచి పాయింటును మీరు చెప్పారండీ. పెళ్లి జరిపించుకోవడం మగపెళ్లి వారి బాధ్యతే అయితే, పెళ్లి ఖర్చు కూడా వాళ్ళదే కదా? మరి ఆడపెళ్లి వారిమీదే ఖర్చంతా నెట్టేయడం ఎలా వచ్చింది? ఏ శాస్త్రం అలా చెప్పింది? వేదాలు, శాస్త్రాలు అని చెప్పే పురోహితులు ఈ మోశాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పుడు కట్నం వద్దంటూనే పెళ్లి ఘనంగా జరపాలని షరతులు పెడుతూ, కట్నానికి రెట్టింపు డబ్బు ఆడపెళ్ళి వారి చేత ఖర్చు పెట్టించే ప్రబుద్ధుల్ని చూస్తున్నాం. మీరు ఆలోచించవలసిన విషయం చెప్పారు.

  • Z says:

    అయ్యా! పురోహుతులు వాళ్ల కాళ్ళకిందకి నీళ్ళొచ్చే పద్ధతుల్ని విమర్శించడానికి మాత్రమే శాస్త్రాలు తిరగేసి ప్రమాణ్ణాలుచూపించి విమర్శిస్తారు. వాళ్ళకు గడిచిపోతూంటే అదెంత శాస్త్రవిరుధ్ధమైనదైనా వాళ్ళకు పట్టదు.

    • కల్లూరి భాస్కరం says:

      ఏ వృత్తిలోనైనా అంతేనేమో z గారూ…సొంత ప్రయోజనాలముందు ఏ ప్రమాణాలూ పనిచేయవనుకుంటాను. మామూలుగా తమ మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి ఉన్న రాజకీయ పార్టీలు కూడా, ఆర్టీఐ పరిధిలోకి రాకుండా తప్పించుకోడానికీ, లెజిస్లేచర్ల జీతభత్యాలు పెంచుకోడానికీ, తమకు ప్రతికూలంగా ఉండే కోర్టు తీర్పుల్ని తప్పించుకోడానికీ gaangup అవుతూ ఉంటాయి చూడండి…

  • మంజరి లక్ష్మి says:

    ఇపుడు కూడా నాకు తెలిసి కొన్ని కులాలలో పెళ్లికొడుకింట్లోనే పెళ్లి జరుగుతుంది. కానీ పిల్లకు కట్నం ఇచ్చే పంపుతారు(పెళ్లి ఖర్చులను కలుపుకొనే అది అడుగుతారు ఏమైందీ). కన్యా శుల్కం పోయి, వరకట్నం వచ్చింది. ఇది ఆడపిల్లలకు రావలసిన ఆస్థిని ముందరగానే తీసుకోవటానికి ఏర్పడినట్లుంది. అయితే బీద వాళ్ళకు కూడా ఇది చుట్టుకుంది. అసలు కట్నాలే వద్దనుకొని, పెళ్లి ఖర్చు ఇద్ధరూ చరిసగం పెట్టుకోవాలి అని నిర్ణయించుకుంటే ఈ విషయంలో న్యాయంగా ఉంటుంది.

    • కల్లూరి భాస్కరం says:

      ఈ పెళ్లి సంబంధాలకు, తంతులకు చాలా చరిత్ర ఉంది మంజరి లక్ష్మిగారూ……అదే ఒక పెద్ద అంశం. పూర్తిస్థాయిలో అందులోకి ఇప్పుడు వెళ్లలేకపోతున్నాను. ఒక్క విషయం ఏమిటంటే, పెళ్లి ఖర్చు మగపెళ్ళి వారిదే ననడానికి ఇప్పటికీ ఒకటి రెండు ఆధారాలు కనిపిస్తాయనుకుంటాను. ఉదాహరణకు, మిగతా కులాల్లో ఏమో కానీ, బ్రాహ్మణుల్లో మగపెళ్ళి వారు కూడా పురోహితుణ్ణి తెచ్చుకుంటారు. పెళ్లి తంతులో మగపెళ్లి వారి పురోహితుడిదే ఎక్కువ పెత్తనం, పాత్ర కూడా ఉంటుందనుకుంటాను. అలాగే, బాజాభజంత్రీల ఖర్చు కూడా మగపెళ్ళివారే భరించాలనుకుంటాను. ఆనవాయితీ ప్రకారం చిన్న చిన్న ఖర్చులు తాము భరిస్తూ(దానిని కూడా మళ్ళీ కట్నంలోంచే గుంజుతారు కాబోలు) పెద్ద పెద్ద ఖర్చులు ఆడపెళ్ళి వారిమీద వేసేస్తారు.

  • మంజరి లక్ష్మి says:

    రామాయణంలో సీత, వాళ్ళ చెల్లిళ్ళకు తండ్రి ఇంట్లోనే పెళ్లి జరిగింది కదా?

    • కల్లూరి భాస్కరం says:

      నిజమే, రామాయణంలో సీత, ఆమె చెల్లెళ్ల పెళ్లి తండ్రి ఇంట్లోనే జరిగింది. భారతంలో కూడా పాండవులతో ద్రౌపది వివాహం, గుర్తున్నంతవరకు నలదమయంతుల వివాహం తండ్రి ఇంటిలోనే జరిగాయి. అయితే వీటన్నింటికీ ఒక పోలిక ఉంది. ఇవి స్వయంవర వివాహాలు. అలాంటివాటికి తండ్రి ఇంట్లోనే జరగడం ఆనవాయితీ కాబోలు. నా ఉద్దేశంలో రామాయణం కన్నా భారతం ప్రాచీనం. భారతంలో స్త్రీపురుష సంబంధాలు, వివాహసంబంధాలలో ఆదిమ లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా అవి refine అవుతున్నట్టు కనిపిస్తాయి. రామాయణంలో పూర్తిగా refine అయినట్టు కనిపిస్తాయి. ఇది ఇంకా లోతుగా పరిశీలించాల్సిన విషయం.

  • Mohan says:

    bhaskaram గారూ

    మీ రచన ithihasika samaajica paristhitulanu lothu gaa smeekshitomdi. Very interesting sir.
    Meeru quote chesina danni batti “ఒక నిమిషంలో మూడువందల అరవై నాలుగు యోజనాలు ప్రయాణించే సూర్యరథంలో తపతిని వెంటబెట్టుకుని వశిష్టుడు సంవరణుడి దగ్గరకి వచ్చి ” , “speed of light” concept mana ithihasmlo cheppi vundavachhani bhavimcha vachha?
    Namakaramulatho,
    M

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు మోహన్ గారూ…మీరన్నది నిజమే. కాంతి ప్రయాణించే వేగం గురించి మన పూర్వులకు తెలుసని మీరు కోట్ చేసిన వాక్యం సూచిస్తోంది. వారికి ఇలాంటి విషయాలు ఇంకా ఏమేరకు తెలుసనేది మంచి ఆసక్తికరమైన పరిశీలనే. బహుశా దానిని అధ్యయనం చేసినవారు ఉంటారు.

  • ikkurthi narasimharao says:

    భాస్కర్ గారూ ! మీ వ్యాసాలూ చదివాను ,బాగున్నాయ్ .ఒకదానికి మరొక దానికి మధ్య continuity లేదేమో అనిపించింది .ప్రచినకాలంలోని పేర్లు కూదా అర్ధవంతంగా ఉంటయి .పసవేది ,విదూదభుదు ,తరుక ,అంతస్త్య మొ .వివరణ ఇస్తే వాళ్ళ వ్యఖిత్వనికి సంబంధముందేమో అలోచించన్ది .

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ నరసింహారావు గారూ…మీరన్న కంటిన్యుటీ లేకపోవడానికి ఈ format కూడా కారణం కావచ్చు. అనేక లింకులు ఉన్న విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు, వాటిని అన్నింటినీ సూచించడం అవసరమనిపించింది. కొన్నింటిని ప్రస్తావనతో విడిచిపెట్టి, కొన్నింటిని విపులంగా రాయడం చేస్తున్నాను. అందువల్ల కంటిన్యుటీ లోపించిందన్న అభిప్రాయం కలిగి ఉండచ్చు. ఈ సబ్జెక్టు ఒకవిధంగా సముద్రంలో ఈదడం లాంటిది. ఎక్కడినుంచి ఎటు ఈదాలనే సమస్య తరచు ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడీ వివరణ కూడా సమగ్రం అనిపించడం లేదు. ప్రస్తుతానికి ఇంతకన్నా చెప్పలేను. ఇక పేర్లకు సంబంధించి మీ సూచనను గమనించాను.

  • చాలా ఆసక్తికరంగా ఉన్నదండీ. సుమారు పదిహేనేళ్ళ కిందట వైదిక వివాహ విధిని చాలా రిసెర్చి చేశాను. ఇప్పుడూ స్పష్టంగా గుర్తులేదు గానీ, కన్యాదానం చేసేవరకే వధువు తండ్రి పాత్ర. అంతకు ముందూ, ఆ తరవాతా వివాహ విధి అంటూ జరిగేది అంతా మగపెళ్ళివారి తంతే అన్నట్టు గుర్తు.

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ నారాయణస్వామి గారూ…వైదిక వివాహవిధిని నేనింకా అంత లోతుగా పరిశీలించలేదు. మీ పరిశీలన నా ఈ వ్యాసంలోని అభిప్రాయాన్ని ధ్రువీకరిస్తున్నట్టే ఉంది. పెళ్లి జరిపించుకోవలసిన మగపెళ్ళి వారి బాధ్యత కాస్తా, ఆడపెళ్ళి వారి బాధ్యతగా తలకిందులై వారిమీద పెనుభారంగా మారిందనుకోవాలి. వైదిక సంప్రదాయవాదులు ఈ అన్యాయాన్ని ఎందుకు జరగనిచ్చారో, ఎందుకు వేలెత్తి చూపించలేదో? ఇప్పుడు ఆడపిల్లలు కూడా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు కనుక కొంతవరకు level playing కు అవకాశం ఏర్పడిందేమో కానీ( అదీ గట్టిగా చెప్పడానికి లేదు. మగవాడి ఆధిపత్యాన్ని చాటే ఇతర సమస్యలు అలాగే ఉన్నాయి) కిందటి తరం వరకు పెళ్లి పేరుతో ఆడపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు వరదలు కట్టిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ప్రకృతి సమవర్తి అని నేను నమ్ముతాను. అతిని సహించదు. ఆడపెళ్లివారిని ఏడిపించిన ఫలితాన్ని ఇప్పుడు మగవాడు అనుభవిస్తున్నాడు. మగపిల్లవాడికి పెళ్లి కావడం ఇప్పుడు కష్టంగా మారుతోంది. విశేషం ఏమిటంటే, ఇప్పుడు మగపిల్లవాడిచేత పెళ్లి జరగాలని వ్రతాలు, పూజలు చేయిస్తున్నారు.

  • మంజరి.లక్ష్మి says:

    కన్యాశుల్కం ఇవ్వటం నుంచి, వరకట్నం తీసుకోవటంగా మారిన క్రమంలో వచ్చిన మార్పేమో? కన్యాశుల్కం నాటకంలో కూడా లుబ్దావధాని ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది.

  • MSK Kishore says:

    చాల బాగా చెప్పారండి.. చాల ఇంటరెస్టింగ్ గా వుంది…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)