ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 15 వ భాగం

( గత వారం తరువాయి)

15

విపరీతమైన ప్రతిస్పందన ప్రవహిస్తోంది ‘జనపథం’లోకి. రాష్ట్రం నలుమూలలనుండి అనేక మంది ఆలోచనాపరులు ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లు,

విద్యాసంస్థలలోనుండి ఉత్తమ విద్యార్థులుగా నేపథ్యం గలవాళ్లు  ఎక్కువగా మహిళలు, సాహిత్యకారులు, కళాకారులు, కొద్దిమంది చిన్నస్థాయి పోలీసులు.. బీదలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అట్టడుగుస్థాయి వర్గం.. వీళ్ళు చురుగ్గా స్పందిస్తున్నారు.

దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టి.వి. వార్తా చానల్‌లో రామం.. లేదా డాక్టర్‌ గోపీనాథ్‌.. కొద్దిసార్లు క్యాథీలతో ముఖాముఖి ప్రసారాలు కొనసాగుతున్నాయి..’జనసేన’ ఆవిర్భావం, ఆలోచనలు, లక్ష్యాలు.. ప్రజాపాలనా రంగంలో విస్తరించిన అవినీతిని అంతమొందించేందుకు పథకాలు.. సంస్థ నిర్మాణం.. పారదర్శకత.. వీటిపై ఎక్కడ చూచినా చర్చ జరుగుతోంది. మంత్రి వీరాంజనేయులును విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సిఫారసుపై గవర్నర్‌ మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్‌ చేశాడు. మిగిలిన నలుగురు ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసి వివరణాత్మకమైన దర్యాప్తుకై ఒక కమిటీని నియమించింది.

పదిరోజుల్లో దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ‘జనసేన’ శాఖలు ఏర్పడ్డాయి.

ఒక కొత్త గాలి, కొత్త ఆలోచన వీచడం మొదలైంది.
విపరీతమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది మరోవైపు.

ఆపద సమయంలో ఆకలిగొన్న మందపైకి ఆహారపొట్లాలను విసిరితే మనుషులు పశువులకన్నా హీనంగా కొట్లాడుకోవడం కనబడ్తుంది. సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడగానే చుట్టూ ఉన్న నీరు మహోధృతితో సుడిగుండంగా రూపదాల్చడం మనం చూస్తూంటాం. ఒక ఖాళీ ఏర్పడగానే అక్కడికి చుట్టూ ఉన్న ద్రవ్యం చొచ్చుకురావడం ‘ఫిజిక్స్‌’లో చదవుకుంటాం. సరిగ్గా అదే జరుగుతున్నట్టుగా క్యాథీ గమనిస్తోంది.

”ప్రజలు ఈ విపరీతమైన అవినీతికర వాతావరణంతో విసిగి విసిగి.. ఈ దుస్థితిలోనుండి బయటపడ్డానికి ఎవరైనా పూనుకుని ఏదైనా చేస్తే బాగుండు.. మనం కూడా మంటకు గాలిలా తోడవుదాం అన్న ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు ఈ విపరీతమైన జనస్పందన తెలియజేస్తాంది.” అని డాక్టర్‌ గోపీనాథ్‌ వంక చూస్తూ అంది క్యాథీ.
అప్పుడు సరిగ్గా రాత్రి పదిగంటల యాభై నిముషాలైంది.

‘జనపథం’ బయట వాతావరణమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.

”ఈరోజు మన రాష్ట్రవ్యాప్త కార్యాలయాలన్నింటిలోకూడా మనం ముందే అనుకున్నట్టు ‘అవగాహన’ కార్యక్రమం నిర్వహించబడింది సార్‌. ఒక్కో కార్యాలయం నుండి దాదాపు లక్ష ప్రశ్నాపత్రాలను ప్రజల్లోని వివిధ స్థాయిలకు చెందిన జనానికి అందజేసి జవాబులురాయించి వెంటనే వాపస్‌ తీసుకుని క్రోడీకరణ చేశాం. వాటిని అన్ని జనసేన శాఖల్లోనుండి మన హైద్రాబాద్‌ సెంట్రల్‌ డాటా వెబ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే మనవాళ్ళు ఎనాలిసిస్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. రిపోర్ట్‌ సమ్మరీ చూస్తే చాలా ఆశ్చర్యం కల్గుతోంది రామంగారూ..” అంటున్నాడు శివ.

”చెప్పు శివా.. ఒక్కోసారి ఇటువంటి అభిప్రాయ సేకరణలనుండి మనం ఊహించని వింత ఫలితాలు ఫీడ్‌బ్యాక్‌ క్రింద మనకు చేరుతాయి. అవి మన భవిష్యత్‌ రూపకల్పనకు ఎంతో తోడ్పడ్తాయి..”

”సర్‌ మనం అందజేసిన ప్రశ్నాపత్రంలో రెండే రెండు ప్రశ్నలున్నాయి.. అవి., ఒకటి

అవగాహన (అతిగోపనీయం)

1) మీ చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం ఎంతమేరకు కలుషితమై ఉంది.
ఎ) కొద్దిగా     బి) చాలావరకు    సి) భరించలేని స్థాయికి
2) మీ పరిసరాల్లో అవినీతి ఏరూపంలో ఉంది..
……………………………………..
…………………………………….
మీపేరు :…………….. వృత్తి :………….. వయస్సు:………
అడ్రస్‌ :…………………….మొబైల్‌ నం.:……………….
గమనిక : మీరు రాస్తున్నది ఎవరికీ చెప్పబడదు. అతి రహస్యంగా ఉంచబడ్తుంది.

దాదాపు ఇరవై లక్షల ప్రశ్నాపత్రాలు ప్రజలకు అందజేయబడ్తే, అందులో బాధ్యతతో గరిష్టంగా పందొమ్మిది  లక్షల ముప్పయి రెండు వేల నలభై ఆరు మంది రెస్పాండయ్యారు. ఐతే చాలా ఆశ్చర్యంగా అందులో పందొమ్మిది లక్షల ఇరవై రెండు వేల నలభైమంది సామాజిక వాతావరణం ‘భరించలేని స్థాయిలో’ కలుషితమైందని జవాబు చెప్పారు. ‘కొద్దిగా’ అని చెప్పినవాళ్ళు అసలు లేనేలేరు. మిగిలిన అందరూ ‘చాలావరకు’ కలుషితమైందని బాధపడ్తున్నారు.

ఇక రెండవ ప్రశ్న.. ‘ మీ పరిసరాల్లో అవినీతి ఏ రూపంలో ఉంది’ అన్నదానికి.. అట్టడుగు వర్గాలు, చాలా విపరీతమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను, వ్యవస్థను తిట్టి తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు హాపీగా, డబ్బు సంపాదన విషయంలో నిశ్చింతగా ఉన్నారు కాబట్టి ప్రస్తుత సామాజిక స్థితిగతులపై మిగతా వాళ్ళున్నంత ఆగ్రహంగా లేరు. కాని ఆత్మానుగతమైన ఓ అపరాధ భావనతో ఈ పరిస్థితులు మారాలనిమాత్రం ఆకాంక్షిస్తున్నారు.

”మచ్చుకు విభిన్న వర్గాలకు చెందిన, భిన్న ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రతిస్పందనలను వినిపిస్తావా శివం” అన్నాడు డాక్టర్‌ గోపీనాథ్‌.

”ఓకే సర్‌.. వినండి..”అని శివం తన ముందున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ను సెట్‌ చేసుకుంటూ,

”ఊఁ.. ఇది .. ఒక హాకర్‌.. బి. అప్పారావు.. బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ, సెంటర్లో బండిపై అరటిపండ్లు అమ్ముతూ జీవిస్తాడు.. చదువురాదు.. ప్రక్కనున్న ఇంటర్‌ విద్యార్థితో ఫాం నింపించి మనకు జవాబిచ్చాడు.. మొదటి ప్రశ్న జవాబు.. సమాజం భరించలేనిస్థితిలో కలుషితమైందని.. రెండవ ప్రశ్నకు జవాబు.. థూ నీయమ్మ.. అవినీతి ఏ రూపంలో ఉంది.. అని అడుగుతున్నారా.. అన్ని రూపాల్లోనూ ఉంది. పోలీసుల రూపంలో, గుండాల రూపంలో, మున్సిపాలిటీ ముండా కొడ్కుల రూపంలో, రాత్రి కాకముందే లంజలరూపంలో, ఎమ్మెల్యేల రూపంలో, మంత్రుల రూపంలో, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని రాజకీయ పార్టీల రూపంలో.. ఇక బతకడమే కష్టంగా ఉంది సారూ. రోడ్లమీద అరటిపండ్లమ్మి రెండొందలు సంపాదిస్తే వందరూపాయలు అందరికి పంపకం.. మిగిలేది. వంద.. బొక్కలు తెల్లబడ్తానయ్‌గాని ఈ బతుకు బాగుపడ్తలేదు…”

శివ తలెత్తి ముగ్గురి ముఖాల్లోకీ చూశాడు.

”వీటి ప్రింటవుట్సన్నీ భద్రపర్చాలి శివా.. మనం రెండు మూడు రోజుల్లో వీటిని సమ్మరైజ్‌ చేసి.. ఒట్టి కీలుబొమ్మే ఐనా రాష్ట్ర గవర్నర్‌ను, తర్వాత ముఖ్యమంత్రిని కలిసి ప్రజల మనోగతాన్ని సాధికారికంగా వినిపించబోతున్నాం. తర్వాత మీడియా ద్వారా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది..” అన్నాడు రామం.

17

”యస్సార్‌.. ఇంకొక రెస్పాన్స్‌.. మరొక వర్గంనుండి.. ఇతని పేరు బి. రామచంద్రారెడ్డి. వయస్సు ముప్పయి రెండు. వృత్తి పోలీస్‌ కానిస్టేబుల్‌.. ఊరు వరంగల్‌.. మొదటి ప్రశ్న జవాబు.. సామాజిక వాతావరణం భరించలేని స్థాయిలో కలుషితమైందనే. రెండవ ప్రశ్న.. అంటాడు.. పోలీస్‌గా పుట్టడంకంటే ఏ క్లాస్‌ లంజెదగ్గరైనా కుక్కయిపుడ్తే ఎంతో సంతోషంగా ఉంటది. ఉన్న ఒక్క బిడ్డకు ఊరంతా మొగలే అని ఒక సామెత ఉంది.. పోలీస్‌ కానిస్టేబుల్‌కు అందరూ మొగలే. ఎస్సై, సి.ఐ, డిఎస్పీ.. క్యాంప్‌క్లర్స్‌, ఎస్పీ స్టెనో, ఎస్సై పెడ్లాం, సి.ఐ. ఉంచుకున్నది, డిఎస్పీ బిడ్డ, కొడుకు, బామ్మర్ది.. ఎందరయ్యో బాబు. ఒక వేళ పాళలేని కుక్కబతుకులు మావి.. యిక లంచాలా.. ఆదాయమా.. అధికారమా.. ఎవనికి ఎంత చేతనైతే గంత.. అందినకాడికి రిల్లుకుని ఉడాయించుడే. పోలీసుల సంస్కృతిలో ఏ పోలీసోడైనా తన క్రింది ఉద్యోగులకు పులి, పై ఉద్యోగులకు పిల్లి. మాకు రాజకీయ నాయకులందరూ మొగుళ్ళే. డబ్బు సంపాదన ప్రక్కనపెడ్తై.. ఈ సిగ్గూశరాలు లేని జీవితాలు జీవించడంకంటే బండకట్టుకుని బాయిలపడ్తే బాగుండనిపిస్తోంది. ఇగ ఈ దేశం ఎవడూ బాగుచేయలేనంత ఛండాలంగా చెడిపోయింది. గంతే..”

”ఊఁ.. జనం స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పమని ఎంకరేజ్‌ చేసి విషయాన్ని గోప్యంగా ఉంచితే చూడండి మనుషులు తమ మనసులోని మంటను ఎలా మనముందు ఆవిష్కరిస్తున్నారో.. ఇదీ ప్రజల అసలు అంతరంగం..” అంది క్యాథీ.

”ఒక మున్సిపల్‌ కార్పొరేటర్‌.. పేరు శ్రీనివాసరావు బర్రెల.. వార్డ్‌ యిరవై నాల్గు. వయస్సు ముప్పయి ఐదు. మొదటి ప్రశ్న జవాబు. సామాజిక వాతావారణం భరించలేని స్థాయిలో కలుషితమై చెడిపోయిందనే. ఇక రెండవ ప్రశ్న.. ఈ రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేటరన్నా, కౌన్సిలర్‌ అన్నా బ్రాకెట్లో కాంట్రాక్టరనే. పది లక్షలు ఖర్చుపెట్టి గెలిచిన. ఐదేండ్ల టర్మ్‌. యాడాదిగాకముందే ఇరవై రెండు లక్షలు సంపాదించిన. పొద్దున లేవగానే పైన ఎమ్మెల్సీ కింద మేయర్‌, అటు దిక్కు జిల్లా మంత్రి. పైరవీలు, పార్టీలు, దందాలు, ధర్నాలు, రాస్తారోకోలు. షానిటేషన్‌ కాంట్రాక్ట్‌, రోడ్ల కాంట్రాక్ట్‌, సిల్ట్‌ రిమూవల్‌ కాంట్రాక్ట్‌, మలేరియా ప్రెవెక్షన్‌, ఇందిరమ్మ ఇళ్ళ కథ.. వరల్డ్‌ బ్యాంక్‌ ఫండ్స్‌ కింద స్లమ్స్‌ డెవలప్‌మెంట్‌ కాంట్రాక్ట్‌.. ఏమాటకామాటేగని .. కేన్సర్‌ రోగంకన్న కడుహీనంగా ఈ అవినీతి రోగం ముదిరిన ఈ సిస్టంను ఎవడు బాగుచేస్తడు.. ఎట్టా బాగుచేస్తడు. మారె.. ఎవని చేతగాదు.. కాని..మేము విసిగిపోయినం. అందరం బురదల నిలబడ్డం.. బాగ తాగినప్పుడనిపిస్తది.. నీయమ్మ ఈ అన్యాయం బతుకు, పాపపు బతుకు వద్దని.. గుండెలల్ల ఎక్కడ్నో తప్పుచేత్తాన అన్న ఫీలింగు తినేస్తాంది. మంచిగా, సాఫ్‌గా నీతిగా బతుకుతే బాగుండు. కాని ఏ లంజకొడ్కు బత్కనిత్తడు.”

”ఒక సాధారణ పౌరుడు.. ఉదాహరణకు ఓ పెద్ద బట్టల దుకాణ్లో పనిచేసే గుమాస్తా, .. అలాంటివాళ్ళ ఫీలింగ్సు చెప్పు శివా..” రామం అడిగాడు
శివ వెంటనే తన చేతిలో ఉన్న కొన్ని కాగితాలనూ, లాప్‌టాప్‌ స్క్రీన్‌ను వెదికి ఒక్క నిముషంలో.. నంబర్‌ను వెదుక్కుని ఓ కాగితాన్ని బయటికి తీసి చదవడం ప్రారంభించాడు.

”ఇతను వందన బ్రదర్స్‌లో పనిచేసే ఒక గుమాస్తా.. గత ఐదేండ్లుగా చేస్తున్నాడు. పేరు – వల్లభనేని రామారావు. వయస్సు నలభై ఎనిమిది.. మొదటి ప్రశ్నకు జవాబు.. సామాజిక వాతావరణం ..మనమిచ్చిన మూడు ఆప్షన్స్‌ కాకుండా ఒక కొత్త ఆప్షన్‌ తనే రాశాడు.. ”భరించలేని, కాదు ఎవడూ బాగుచేయలేని స్థాయికి ఈ సమాజం చెడిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీ చెప్పాడుకదా యిక ఈ దేశాన్ని భగవంతుడుకూడా బాగుచేయడలేడని.. కాలుష్యం ఆ లెవెల్‌లో ఉంది. యిక రెండవ ప్రశ్న : మీరెవరోగాని ఈ ప్రశ్న కనీసం అడిగినందుకే నాకు పరమానందంగా ఉంది. దీనికి జవాబు తెల్సుకుని మీరేంజేస్తారో తెలియదుగాని కనీసం జనం గురించి కొందరు ఆలోచిస్తున్నందుకే రవ్వంత గర్వంగా ఉంది. యిక అవినీతి సంగతికదా.. చెబుతా.. వేయి రూపాయల కిరాయి కొంపలో కుక్కిన పేనువలె భార్యాపిల్లలతో గుట్టుచప్పుడు కాకుండా బ్రతుకేనేను మా ఓనర్స్‌ గొణుక్కుంటూ అప్పుడైదు వందలు అప్పుడైదు వందలుగా ఇచ్చే మూడువేల ఐదువందల రూపాయల జీతంతో ఎలా జీవిస్తానో ఆ భగవంతునికే ఎరుక.. యింట్లోనుండి బయటికి రాగానే మా వీధి మూలమీదో యాభైఫీట్ల వాకిలున్న విశాలమైన బిల్డింగు ఉంది. అది మా నగర ఎమ్మెల్యే ఉంపుడుగత్తె లలితాదేవిది. పొద్దున ఏడు గంటలనుండే ఆమె వాకిట్లో కార్లు, మోటార్‌ సైకిళ్ళు, ఆటోలు..ఫుల్‌ రష్‌. ఏంటయా అంటే.. ఎమ్మెల్యే గారితో చేయించుకోవాల్సిన అన్నిరకాల దిక్కుమాలిన పైరవీలకు బుకింగు పాయింట్‌ యిది. బుక్‌ ద కేస్‌, ఫిక్స్‌ ద రేట్‌.. టేక్‌ అడ్వాన్స్‌. పూర్తిగా బహిరంగ వ్యవహారం ఇది. పత్రికలవాళ్ళకు. పోలీసులకు, ప్రజాసంఘాలకు, నక్సలైట్లకు, సంఘ సంస్కర్తలకు.. అందరికీ తెలసిందే. ఏంజేస్తున్నారు ఎవరైనా. ఏమీ లేదు.. ఇంకాస్త ముందుకు రాగానే కుడిదిక్కు ఒక డిఎస్పీ ఉంచుకున్న రామలక్ష్మి ఇల్లు ఉంటది. యింటిముందు రెండు మనుషులకంటె పెద్దసైజు కుక్కలు. నిరంతరం ఇంట్లో బట్టలుతుకుడు దగ్గర్నుండి పిల్లల్ను బైటికి తీసుకుపోయి ఆడించేదాకా పోలీసుల చాకిరీ. ఉదయం, సాయంత్రం బుక్‌ ది కేస్‌.. టేక్‌ మనీ. అటుప్రక్క ఆడిటర్‌ రామనాథం. అన్ని రకాల ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ లావాదేవీలకు నగరంలో పెద్ద బ్రోకర్‌. ఆఫీసర్లకు అమ్మాయిలకు సప్లయ్‌ చేయడం దగ్గర్నుండి దొంగలెక్కలను స్కిప్‌ చేయడానికి, పన్ను ఎగవేయడానికి కోటి మార్గాలు వెదికి చూసి మందికొంపలు ముంచే పని. ఒక్క మా దుకాణం దొంగలెక్కలను కవర్‌ చేసినందుకు నేనే మొన్న రెండు లక్షల లంచమిచ్చిన. వాడు ఇరవై లక్షల పన్ను ఎగ్గొట్టించిండు. ఇంకో ఇవరై మీటర్లు నడువగానే ఒక ఇంద్రభవనం వంటి ఇర్రిగేషన్‌ సూపరింటెండ్‌ ఇంజినీర్‌ రామ్మూర్తి బిల్డింగు. (గారు అని సంబోధించడానికి సిగ్గనిపిస్తోంది) ఇరవై ఏండ్ల క్రితం ఆ స్థలంలోనే ఒక డొక్కు సైకిల్‌పై పోతున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా రామ్మూర్తి నాకు తెలుసు. అతను చిన్నప్పుడు మూడవక్లాసునుండి ఆరవక్లాస్‌దాకా నాకు క్లాస్‌మేట్‌. యిప్పుడు అతనికి ఒక పెళ్ళాం, ముగ్గురు ఉంపుడుగత్తెలు. కోట్ల ఆస్తులు. కిలోల బంగారం. దేవాదుల ప్రాజెక్ట్‌..ఎల్లంపల్లి.. ఓపెన్‌ కరప్షన్‌. అంతా బహిరంగమే.. ఏం జరుగుతోంది.. ఎవరేం పీకుతున్నారు వాళ్ళను (సారీ.. ఆవేశం, బాధ..దుఃఖం.. పేదవాడు ఒట్టిగా తిట్టుకోవడంకంటే ఏమీ చేయలేని నిస్సహాయ దుస్థితి) ఈ అవినీతిని చూడవలసినవాళ్లందరి కండ్లు చితికిపోయినయా.
వీటన్నింటిని మించి.. ఒక నగర రౌడీ.. రాజేందర్‌.. పిట్టల రాజేందర్‌.. వాని తండ్రి రౌడీ, వాని అన్న రౌడీ,  వాని పెండ్లాం ఆడ రౌడీ. వాడు విచ్చలవిడిగా నగరంమీద ఆంబోతులా పడి యింత అత్యాధునిక సమాజంలో అటవికంగా గుడిసెవాసులను, గవర్నమెంట్‌లో దొంగ అధికారులైన ఎఫ్‌సిఐ, గ్రేన్‌మార్కెట్‌, ఆప్కారీ, ప్రైవేట్‌ ఇంజినీరింగు కాలేజీలు, పాఠశాలలు, వేశ్యాగృహాలు, దొంగ సారాయి దుకాన్లు, రోడ్లకిరువైపుల ఉండే హాకర్ల హఫ్తాలు.. వానికి స్వయంగా మూడు  బినామీ బార్లు. వాని పెళ్ళానికి, ఉంపుడుగత్తెలకు ఆరు బ్రాండీ షాప్‌లు, లిక్కర్‌ షాపుల్లో ఎంఆర్‌పిని మించి ఇరవై శాతం ఎక్కువగా అమ్మే సిండికేట్‌లకు నాయకత్వం.. వీడు బహిరంగంగా బలిసి వెంట గుండా అనుచరులతో నెత్తిపై గొడుగు పట్టించుకుని ఊరేగుతూంటే.. ఒక్క..ఒక్క పోలీస్‌ అధికారిగానీ, కలెక్టర్లు, సబ్‌ కలెక్టరు, సిగ్గులేని పౌర సమాజం ఏం చేస్తోంది. గాజులు తొడుక్కుని కూర్చుంది.. అంతే..

…అబ్బా.. యిలా రాసుకుంటూపోతే యిదంతా ఒక గ్రంథమౌతుంది.

నిర్మూలన.. కుళ్ళిపోయిన దుష్టాంగ నిర్మూలన జరగాలి. అర్జంటుగా.
కాని ఎవరు చేస్తారు..? అదీ ప్రశ్న.. అదీ దుఃఖం.. అదీ నిస్సహాయత..”

శివ ఆగిపోయాడు.. చదవడం ముందకు సాగడంలేదు. గొంతు గద్గదమైంది.

వాతావరణమంతా..ఎవరో చనిపోతే దుఃఖం చుట్టూ వ్యాపించినట్టు.. విషాద గంభీరంగాఉంది. స్తబ్దత అంతా.

”ఈ ప్రజలకు ఓదార్పు కావాలి సార్‌.. రవ్వంత ప్రేమను, బ్రతుకు పట్ల పిడికెడు భరోసాను, ఒక తలనిమిరే అనునయింపును, కొద్దిగా వాత్సల్యాన్ని అందించే ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాల్సార్‌. నిజానికి అవినీతి మురుగు బురదలో కూరుకుపోయి ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎప్పుడో మృతిచెందాయి. ఈ సిస్టంను ఒక అంకుశం పోటుతో పునర్జీవింపజేయాలి..” అంటున్నాడు శివ..ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.

”మొత్తం పందొమ్మిది లక్షల ఇరవై రెండువేల నలభై మంది దుఃఖచరిత్రలు అవి శివా.. ఏ ఒక్కరూ నేను సంతోషంగా, ఆత్మసాక్షిగా, నీతిబద్ధంగా జీవిస్తున్నాడని చెప్పే పరిస్థితి లేదు. యిప్పుడు మనం వివిధ రకాల సామాజిక వర్గాల రోదనలను రికార్డ్‌ చేస్తున్నాం అంతే..ప్లీజ్‌ గొ ఎహెడ్‌..ఇంకో రెండు టిపికల్‌ కేస్‌లు విన్పించండి.” అన్నారు గోపీనాథ్‌.

శివ.. మరో కాగితాన్ని తీశాడు బయటికి.

”మూడు కేసులు విన్పిస్తున్నాను సార్‌. ఒకటి ఒక వేశ్యది. ఒకటి ఒక రచయితది. మరొకటి ఒక వైస్‌ ఛాన్స్‌లర్‌ది.. మొదటి కేస్‌.. పేరు బి. శ్యామల (నిజమైన పేరే) వయస్సు. ఇరవై ఏడు. వృత్తి శరీరాన్నమ్ముకోవడం. శరీరాన్నీ నమ్ముకోవడం. మొదటి ప్రశ్న : మూడవ ఆప్షన్‌కు టిక్‌ చేయబోయి.. మధ్యలో ఆగి.. రాసింది స్వయంగా.. అస్సలే భరించలేని కంపువలె ఈ సమాజం కలుషితమైపోయింది. రెండవ ప్రశ్న : నేను వేశ్యను. నాది అతినీతివంతమైన వృత్తి. సుఖాన్నందిస్తా, డబ్బు తీసుకుంటా. వృత్తి విషయంగా ఎటువంటి ఆత్మవంచన లేకుండా చాలా శుద్ధంగా, తృప్తిగా జీవిస్తున్నా. ఇప్పుడే పేపర్‌ చూచిన.. ఆంధ్రప్రదేశ్‌లో 6596 మద్యం షాపులను 7000 కోట్ల రూపాయలకోసం ప్రభుత్వం వేలం వేసి సంపాదించడంకంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వేశ్యాగృహాలను నడుపవచ్చనిపిస్తోంది. వేలంలో వందమంది మహిళలుకూడా పాల్గొని మద్యం షాపులను దక్కించుకున్నారట.. వాహ్‌ా.. భారతీయ పవిత్ర మహిళా నీకు జోహార్లు.. మహిళలందరం వీళ్ళందరికి హారతలు పట్టాలి. పోతే.. పత్రికలు చాలా స్పష్టంగా ఈ మద్యం షాపులు ఏఏ ప్రాంఆల్లో ఏఏ పార్టీవాళ్లు ఎన్ని దక్కించుకుని ఎవరెవరు సిండికేట్లుగా ఏర్పడ్డారో, ఏఏ మంత్రుల కొడుకులు, అల్లుళ్ళు, ఎక్కడెక్కడ ఎన్ని పదుల బార్లను నెలకొల్పబోతున్నారో రాశారు. సిగ్గులేని ఈ పార్టీల అధినాయకత్వం ఏంజేస్తోంది. వీళ్లపైన ఏ చర్యలూ తీసుకోకుండా ఎందుకిలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.. దేశాన్ని నడిబజార్లోపెట్టి మద్యం, మగువ, కమీషన్లు.. పర్సంటేజ్‌లు, ప్రమాణాలు లేని కాంట్రాక్ట్‌లు.. వీటిపేర దోచుకుంటూంటే.. వీళ్ళందరికంటే వేశ్యనైన నేను ఎంతో నీతిగా జీవిస్తున్నందుకు గర్విస్తున్నాను. ఈ రాజకీయ పార్టీల అధినేతలు నా కాలిగోటిక్కూడా సమానంకారు..”

చదువడం ఆగగానే.. గోపీనాథ్‌, రామం, క్యాథీ.. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు ఆ అమ్మాయి ఆత్మచైతన్యానికి పొంగిపోయారు.

శివ మరొక కాగితాన్ని ఎంపిక చేసి తీశాడు బయటికి.

”పేరు : కె. నరసింహారావు. వృత్తి : యిదివరకు ఉపాధ్యాయుణ్ణి. కాని రచయితను, కవిని. వయస్సు : అరవై ఏడు సంవత్సరలు. ఊరు : పరకాల.

మొదటి ప్రశ్న: నిస్సందేహంగా ఈ దేశం నైతికంగా కుళ్ళిపోయి కంపుకొడ్తోంది.

రెండవ ప్రశ్న : అసలు ఈ దిగజారిన రాజకీయాల వల్ల ధ్వంసమైపోయిన మానవ సమాజం, తద్వారా విజృంభిస్తున్న రాక్షస అరాచకత్వం.. వీటికి అసలు మూలాలెక్కడున్నాయో వెదకాలి. ఒక చిన్న కూలీపనికోసమైనా వ్యక్తిని ఎంచుకునేటప్పుడు వాడు ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించగలడా లేడా.. వానికా పనితనముందా లేదా అని పరీక్షించుకుని ఎంచుకుంటాం. కూలీల అడ్డాపైన. అలాగే చిన్న అటెండర్‌ పోస్ట్‌క్కూడా కనీసం ఎస్సెస్సీ క్వాలిఫికేషన్‌ ఉండాలని ఒక అర్హతను నిర్ధారిస్తాం. ఈ ఉద్యోగానికి యిది వయోపరిమితి.. అని ఓ రూల్‌ పెడ్తాం. ఫలాన పనికి ఈ నిపుణత కావాలని ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తాం. కాని భారతదేశంలో ఒక్క రాజకీయాలకు మాత్రం ఏ నిబంధనా లేదు.. ఎటువంటి అర్హతా లేదు..ఎవడైనా రాజకీయాల్లో ఎమ్మెల్యే కావచ్చు. ఎంపి కావచ్చు. మంత్రి కావచ్చు, ప్రజల నుదుటిరాతను రాసే శాసనకర్త కావచ్చు.. వాని ప్రతిభతో నిమిత్తం లేకుండా ఏ శాఖనైనా పరమఛండాలంగా, అసమర్థంగా నిర్వహిస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేయవచ్చు.. కాళ్ళు, చేతులు, శరీరం పనిచేయని ఎనభై ఏళ్ళ వయసుకు వచ్చినా యింకా యింకా ప్రజలనెత్తిపై కూర్చుని స్వారీ చేయవచ్చు.. పందికొక్కుల్లా దేశాన్ని తోడుకుని భోంచేయవచ్చు.. ఏమిటిది..ఎందుకిలా.. వీళ్ళకు మాత్రం ఒక మార్గదర్శకాల కోడ్‌, కనీస విద్యార్హత, ప్రభుత్వ ఉద్యోగులపై పోలీస్‌ ఎంక్వయిరీ చేయించినట్టు ప్రవర్తనపై నిఘా, పదవీ విరమణ వయస్సు ఎందుకుండకూడదు. వీళ్ళక్కూడా ఇలా కనీస అర్హతలను రాజ్యాంగబద్ధంగా నిర్ధారించి అమలుచేస్తే సగంకన్నా ఎక్కువ రాజకీయ దరిద్రం దానంతటదే పోతుంది. ఈ కోణంలో మేధావులు లోతుగా విచారణ చేయాలి. ప్రభుత్వాలపై కావలిస్తే కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలి.
”అసలు.. మనుషుల్లో నేను ఈ పనిచేయడం తప్పు. ఇది నైతికంగా కూడనిపని. నా చర్యవల్ల తోటి మానవ సమూహానికి ద్రోహం చేస్తున్నాననే స్పృహ ఎందుకుండడంలేదు. నాకనిపిస్తోంది. మనం ఇంకా అడ్వాన్స్‌డ్‌ స్టేజెస్‌లో ‘డబ్బు సంపాదించాలి.. ఎంత ఛండాలమైన పని చేసైనా సరే డబ్బు సంపాదించాలి.. ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత డబ్బును ఏదోవిధంగా సంపాదించాలి’ అని ఇన్ని దురాగతాలకు పాల్పుడ్తునవారికి స్పెషల్‌ కౌన్సిలింగు క్లాసులు నిర్వహించాలనుకుంటా మన జనసేన సభల్లో.. అందరి సమక్షంలో..”

‘ఎలా మార్తారు వీళ్ళు..’ అని రామం తనలోతాను గొణుక్కుంటున్నట్టుగా అనుకోవడం ప్రక్కనున్న క్యాథీకి వినిపించింది. ఆమె మౌనంగానే అతనివంక చూచి.. మళ్ళీ

శివ చదువబోతున్న మరో ప్రతిస్పందన దిక్కు దృష్టి మరల్చింది.

”ఒక చిన్న అంతరాయం సర్‌.. మనుషుల్లో పశ్చాత్తాపం ఉంటుందా.. యిది వినండి..”

నా పేరు.. (రాయను) వృత్తి : ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడిపాను. వయస్సు : యాభై సంవత్సరాలు. యిప్పుడు చర్లపల్లి జైలులో ఉన్నాను. జైలునుండే ఈ జవాబు.

మొదటిప్రశ్న:  సమాజం మహారోతగా కుళ్లిపోయింది.. ఇది పచ్చినిజం

రెండవప్రశ్న : నేను పద్నాల్గువందల కోట్ల స్కాం చేశాను. మనిషి ఎందుకు నావలె యింత ఘోరమైన తప్పు చేస్తాడు. దానికి జవాబు.. తప్పు చేసే అవకాశం ఉండడం, పట్టుబడే అవకాశాలు లేవని భరోసా లభించడం, అసలు అంత డబ్బు ఎందుకో తెలియని ఒకపిచ్చి వ్యామోమం.. అంతరాంతరాల్లో నిర్లజ్జతో కూడాన నేరతత్వం..అందువల్ల.

మొన్న జైల్లో ఉన్న నన్ను పరామర్శించడానికి వచ్చిన నా తండ్రి అడిగాడు.. ‘ఓరే.. నేనెప్పుడూ మాకోసం యిటువంటి దేశద్రోహచర్య, దొంగతనం చేయమని చెప్పలేదు కదరా..అసలెందుకు చేశావ్‌ తప్పు.. ” అని మర్నాడు నా యిద్దరు పిల్లలు. నా భార్య వచ్చి.. ‘మా కోసం యిన్ని వేల కోట్ల స్కాం చేయమని, తద్వారా మమ్మల్ని  సుఖపెట్టమని ఎప్పుడూ  మేం చెప్పలేదుగదా.. మేం సమాజంలో తలెత్తుకొని తిరక్కుండా ఈ నేరం ఎందుకు చేశారు” అని నిలదీశారు. ఎవరో కవి అన్నట్టు.. ‘సగం జీవితం నన్ను కన్నవాళ్ళ కోసం, సగం జీవితం నేను కన్నవాళ్ళకోసమే గడిచిపోయింది.. అసలు నా జీవితమేది.. అన్నట్టు అటు నన్ను కన్నవాళ్ళు ఇటు నేను కన్నవాళ్ళూ నేను చేసిన నేరాన్ని ప్రశ్నిస్తున్నపుడు…నిజంగానే అసలీ ఘోరమైన కోట్లాదిరూపాయల స్కాంను ఎందుకు చేసినట్టు ఎవరికోసం చేసినట్టు..సిగ్గనిపిస్తోంది. దుఃఖం ముంచుకొస్తోంది. నాపై నాకే అసహ్యం కల్గుతోది.. పశ్చాత్తాపంతో చెంపలేసుకోవాలనిపిస్తోంది.. ప్రద్నాల్గువందలకోట్ల ప్రజాధనాన్ని తిన్న నన్ను యింకా సజీవంగా, క్షేమంగా రాచమర్యాదలతో జైల్లో అతిధివలె చూచుకుంటూ, దేశద్రోహ నేరంక్రింద షూట్‌ చేయకుండా బ్రతకనివ్వడం ఈ దేశంలో ఉన్న ఉదాసీన అలసత్వానికి నిదర్శనం. ద్రోహికి సత్వరమే శిక్ష పడాలి..”

”ఊఁ.. ఔను.. ” అనుకున్నాడు రామం.. డాక్టర్‌ గోపీనాథ్‌ ఒక్కసారే.. ఎవరికి వారే.

”చివరి ప్రతిస్పందన సార్‌..”

నాపేరు రాంనరసింహారెడ్డి. వృత్తి  : వైస్‌ చాన్స్‌లర్‌ (యూనివర్సిటీ పేరు చెప్పను) వయస్సు అరవై ఏండ్లు.

మొదటి ప్రశ్న : నిస్సందేహంగా దేశం పూర్తిగా కుళ్ళిపోయింది.

రెండవ ప్రశ్న : విపరీతమైన పైరవీలు చేసి, రాజకీయ నాయకుల, మంత్రుల ప్రమేయంతోని, డబ్బుతోనే నేను కూడా వైస్‌ ఛాన్స్‌లర్‌ అయ్యాను. ఆ మాట కొస్తే. ఈ దేశంలోని వైస్‌ చాన్స్‌లర్లలో తొంభైశాతంకంటే ఎక్కువమంది నాలాగే అనేక అవినీతికర మార్గాలద్వారానే పదవుల్లోకొచ్చారు. కొండపైకి ఎక్కినతర్వాత కిందికి చూస్తే అంతా వివరంగా కనబడ్డట్టు.. ఇటువంటి ఉన్నతమైన స్థానంలోకి వచ్చాక పెద్దవాళ్ళ పనుల లోలోతుల్లోకి తొంగి చూస్తే మహాఛండాలంగా ఉంది. మొన్నకు మొన్న చూశాంగదా ప్రొఫెసర్‌గా సరస్వతీ దేవికీ, వైద్యునిగా ధన్వంతరికీ ప్రతిబింబంగా ఉండవలసిన ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఒక మెడికల్‌ కాలేజికి అడ్డదారిలో సహాయం చేయడానికి రెండుకోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడి దానికి కొనసాగింపుగా ఎసిబీ దాడిలో పద్దెనిమిది వందలకోట్ల రూపాయల నగదు, పదిహేను వందల కిలోల బంగారంతో దొరికిపోయాడు. అంతకుముందు జాతీయస్థాయి అత్యున్నత సంస్థ అఖిల భారత సాంకేతిక విద్యామండలి చైర్మన్‌పై, ఒక డైరెక్టర్‌పై ఎసిబి దాడిచేస్తే వందలకోట్లు దొరికాయి. విశ్వవిద్యాలయాలను నియంత్రించే యుజిసి అవినీతిపై వందల కథలున్నాయి. వీళ్ళపై ఏదో ఒక కఠిన చర్య తీసుకుని యిక మున్ముందు ఇటువంటి తప్పులు ఎవరూ చేయకుండా ప్రభుత్వం ఏదైనా చేయగలిగిందా. ఉహుఁ.. ఏం జరుగుతోంది. ఈ దేశం ఏమైపోతోంది. పవిత్రమైన విద్యావ్యవస్థలోకి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయాలు ఎంతస్థాయికి ప్రవేశించి వ్యాపించాయంటే.. వీటిని తొలగించి దీన్ని ఎవడూ శుభ్రం చేయలేరు. ఇందుకు తగ్గట్లు సర్వబలహీనతలకూ బానిసలైన యువకులు విశ్వవిద్యాలయ స్థాయిలో ఏ ప్రామాణికమైన స్థాయికీ చేరలేక, నాణ్యతను సాధించలేక పి.హెచ్‌డీ చేసిన వానికి ఒక్క దరఖాస్తును తప్పులేకుండా రాయడం చేతగాక, తప్పు లేకుండా నాల్గు ఇంగ్లీష్‌ వాక్యాలు మాట్లాడలేక.. అంతా ట్రాష్‌.. ఇక స్టాఫ్‌.. అన్నీ రాజకీయాలే. కుల రాజకీయాలు పార్టీ రాజకీయాలు, ఉగ్రవాద, మత రాజకీయాలు, బ్లాక్‌మెయిలింగు తంతులు.. చెదలు.. చెదలుపట్టిపోయిది విద్యావ్యవస్థ. పైకి ఒక మేడిపండు. లోపలంతా పురుగులు.. చెత్త.. చెదారం.. ప్రతి విశ్వవిద్యాలయం ఒక చెత్తకుండీ.. కష్టం. దీన్ని బాగుచేయడం కష్టం.. ఈ వారం నేను పదవీ విరమణ చేస్తున్నా.. ఏదో బాగు చేయాలని.. ప్రయత్నం చేసీ చేసీ అలసిపోయిన.. నా వశం కావడం లేదు.. సారీ..భారతదేశమా సారీ.. నన్ను క్షమించు తల్లీ.”

శివ చదవడం ఆపాడు.

ఏ లేఖ చదివినా.. కదిపినా కన్నీళ్లే.. ఏమిటిది..ఎలా.. ఈ స్థితికి పరిష్కారం ఏమిటి. ఎవనికివాడు వాని పనిచేసుకుని ప్రశాంతంగా బతుకనీయకుండా ప్రజాజీవితాల్లోకి రాజకీయాలు యింతలోతుగా చొచ్చుకురావడం అవసరమా. అన్ని టి.వి. వార్తాచానళ్లు ఇరవై నాల్గుగంటలు ఈ కుళ్ళు రాజకీయాలనే వార్తలుగా, చర్చలుగా, ఎపిసోడ్సుగా, వ్యాఖ్యలుగా.. ఇంకేదేదో పేర్లతో నిరంతరం ప్రసారం చేసీ చేసీ ప్రజలను హింసించడం., ఊదరగొట్టడం అవసరమా.
వ్చ్‌.. ఏదో చేయాలి.. ఏదో ఒకటి తప్పకుండా చేయాలి.
అందుకే ఈ ‘అవగాహన’

అల్లూరి సీతారామరాజు మన్యవిప్లవం ప్రకటించే ముందు పరిస్థితిని ఆకళింపు చేసుకునేందుకు దేశమంతా అవగాహన పర్యటన చేశాడు. గాంధీ బ్రిటిష్‌ ప్రభుత్వంపై సహాయ నిరాకరణ  ప్రతిఘటనను ప్రకటించేముందు విస్తృతంగా భారతదేశమంతా గ్రామగ్రామం పర్యటించి ప్రజల హృదయాన్ని అధ్యయనం చేశాడు.
అధ్యయనం ఎంతో అవసరమని భావించి.. దాదాపు వేయిమంది జనసేన కార్యకర్తలు రెండు ప్రశ్నలతో జనాన్ని కదిలిస్తే.. ఒక నిప్పుల సముద్రం గాండ్రించినట్టు.. గర్జించే ఆకాశం కన్నీళ్ళ తుఫానును వర్షించినట్టు.. అంతా దుఃఖం.. వేదన.. క్షోభ.. దిక్కులేని అనాధల్లా రోదన..
‘అవగాహన’ ఒక పిడికెడు గుండెలోని ఉప్పెనను విప్పి చూపించింది.

నలుగురూ విధిలేక ఒకరి మొగాన్నొకరు చూచుకుంటూండగా,

బయట ఆకాశం భీకరంగా గర్జించింది ఒక్కసారిగా.. టపటపా పెద్దపెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది.
శివ వాచీవైపు చూశాడు.

టైం పదకొండు గంటల యాభై నిముషాలైంది.
రామం మౌనంగా లేచి.. తన గదివైపు కదుల్తూ.. ”గుడ్‌నైట్‌..” అన్నాడు.

అంతా విషాద గంభీరం.

( సశేషం)

Download PDF

1 Comment

  • Pavana says:

    This week’s story also very close to real life scenarios.
    Let’s hope one day, somebody will change these politics & politicians.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)